Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-65

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

ఆయనే.. ఈయన..!!

[dropcap]ప్ర[/dropcap]పంచంలో, మనదేశంలో, మనరాష్ట్రంలో, మన తాలూకా (మండలం)లో, మన వూళ్ళో ఎందరో మహానుభావులుంటారు. వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, పార్లమెంటు సభ్యులు కావచ్చు, శాసనసభ సభ్యులు కావచ్చు, ఐ.ఏ.ఎస్/ఐ.పీ.ఎస్ కావచ్చు, గొప్ప వైద్యులు కావచ్చు, విద్యారంగంలో ప్రముఖులు కావచ్చు, సాహిత్య రంగంలో ప్రముఖులు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, ఇలా సమాజంలో పేరుప్రఖ్యాతులు గల ఎందరో పెద్దల గురించి సామాజిక మాధ్యమాల ద్వారా వింటుంటాం. వారి గొప్పదనం గురించి ఏదో రూపంలో తెలుసుకుంటూనే ఉంటాం. కానీ అలాంటి పెద్దలను చూడగలవారు, వారితో పరిచయం చేసుకునే అవకాశాలు అందరికీ వుండవు. పేరుప్రతిష్ఠలు పెరిగే కొద్దీ,అలాంటి పెద్దలకు ప్రజలలో స్వేచ్ఛగా తిరిగే అవకాశాలు కూడా తగ్గిపోతాయి.

సెక్యూరిటీ అనే పదం ఇప్పుడు అందరి దృష్టిలోనూ పడింది. కొందరి జీవితాలు అమూల్యం కాబట్టి, ప్రభుత్వ పక్షాన వారికి రక్షక వలయం ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు చోటామోటా నాయకులు కూడా, సెక్యూరిటీ అంటే సమాజంలో అదొక గౌరవ గుర్తింపుగా భావించి, వారి వారి స్థాయిల్లో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుని మురిసిపోతున్నారు. అసలు స్వేచ్ఛగా ప్రజలలో తిరగలేనివాడు నాయకుడు ఎలా అవుతాడు? ఈనాడు మన దేశంలో ఈ నాయకుల సెక్యూరిటీ కోసం ప్రజాధనం ఎంత వృథా అయిపోతుందో లెక్కలు కడితే ప్రాణం ఉసూరుమంటుంది. ఇది మన దేశంలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, ప్రపంచమంతటా ఇదే జాడ్యం అమలులో వుంది. అలా అని కనీస రక్షణ లేకుండా ప్రజలలో స్వేచ్ఛగా తిరిగే ప్రపంచ నాయకులు అక్కడక్కడా లేకపోలేదు. కానీ ఇలాంటి వారి శాతం బహు తక్కువ. బహుశః ఈ సెక్యూరిటీ విధానాన్ని తొలగిస్తే, సమాజంలో అరాచకాలు సంఘ వ్యతిరేక కార్యక్రమాలు, లంచగొండితనం, వరకట్న జాడ్యం కొంతవరకైనా తగ్గుముఖం పడతాయేమో! అనేక క్రైమ్ కేసులతో సంబంధం వున్నవాళ్లు ఎన్నికల్లో నిలబడే అర్హతను కోల్పోతారేమో! ఇది కలలో కూడా సాధ్యం కాని పనే అని ప్రస్తుత పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ నాయకుల సందర్శన సెక్యూరిటీ సాకుతో పట్టణాలలో కొన్నిగంటలపాటు ప్రజా జీవనం అస్తవ్యస్తమైపోతున్నసన్నివేశాలు మనం చూస్తూనే వున్నాం. నాయకులకు ఇవేమీ అక్కరలేదు అది తమ గొప్పదనంగా తమ హోదాకు చిహ్నంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఒక మహానుభావుడు గురించి చెప్పక తప్పదు. ఆయన ఎంత సాధారణ జీవితాన్ని అనుభవించాడో తెలిస్తే ఇప్పటి జనానికి ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాంటి నాయకులు ప్రజాశ్రేయస్సునే కోరుకున్నారు తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎప్పుడూ తీసుకురాలేదు.

చాలాకాలం క్రితం నేను నాగార్జునసాగర్‌కు వెళ్లే ప్రయత్నంలో, గుంటూరు నుండి మాచర్లకు రైలు ప్రయాణం చేయవలసి వచ్చింది. పెద్దక్క మహానీయమ్మ అక్కడ ఉపాధ్యాయినిగా పనిచేసేది. అక్క దగ్గరకు వెళ్ళవలసిన ప్రయాణం అది. అప్పటికి అది ఇంకా బ్రాడ్ గేజ్ లైన్ కాలేదు. మీటర్ గేజ్ రైళ్లు ఉండేవి. నేను గుంటూరు నుండి రైల్లో మాచర్ల వరకూ వెళ్లి, అక్కడినుండి నాగార్జున సాగర్ (దక్షిణ విజయపురి)కు బస్సులో వెళ్ళాలి. గుంటూరులో రైలు ఎక్కాను. నా పక్కన ఇద్దరు నాలాంటి ప్రయాణికులు వున్నారు. నాకు ఎదురుగా ఇద్దరు ప్రయాణికులు వున్నారు. అందులో కాస్త వయస్సులో పెద్దాయన కిటికీ పక్కన కూర్చున్నారు. సన్నగా, పొట్టిగా ఖద్దరు పంచా, ఖద్దరు లాల్చీ ధరించి భుజం మీద కండువా వేసుకుని వున్నారు. ఎవరితోనూ మాట్లాడడం లేదాయన. రైలు పరిగెడుతున్నది. కానీ అది ముందుకు వెళుతుందో, వెనక్కు పరిగెడుతుందో అర్ధం కావడం లేదు, దూరం తరగడం లేదు.

ఎప్పుడైనా ఏదైనా స్టేషన్‌లో బండి ఆగితే కాస్త ఉపశమనం దొరికేది. కొంత దూరం ప్రయాణించామన్న ఉపశమనం లభించేది. మళ్ళీ రైలు మెల్లగా స్పీడు అందుకునేది. ఎంత స్పీడ్‌గా బండి పోతున్నా దూరం తిరుగుతున్నట్టు అసలు అనిపించేది కాదు. అలా ఒక్కొక్క స్టేషను వెనక్కి వెళ్ళిపోతున్నది. అయితే బండి ఏ స్టేషన్‌లో ఆగినా ఎవరో ఒకరు ఆ కిటికీ పక్కన కూర్చున్న పెద్దాయనతో ఏదో మాట్లాడి వెళ్లిపోతున్నారు. వాళ్లందరికీ ఆయన ఎంతో సౌమ్యంగా సమాధానాలు ఇచ్చి పంపిస్తున్నారు ఆ పెద్దాయన. ఆయన ఎవరో తెలియక పోయినా పక్కా గాంధేయవాది అని మాత్రం మనసులో అనుకున్నాను. ప్రయాణం చాలా విసుగు అనిపిస్తున్నది, మాచర్ల ఎప్పుడు చేరతామా? అన్న ఆదుర్దా తప్ప మరో ఆలోచనపై మనసు లగ్నం కావడం లేదు. రైలు వేగం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ, గమ్య స్థానం ఎప్పటికి చేరుకుంటామన్నది తెలియదు. అప్పటికి రైల్వే టైం టేబుల్ చూసే అలవాటులేదు, మొబైల్స్ ఉనికి అప్పటికి లేనే లేదు. ఇలావుండగా ఒకచోట రైలు ఆగింది, స్టేషన్ పెద్దదనుకుంటా, జనసందోహం బాగానే వుంది. బండి దిగేవాళ్ళతో ఎక్కేవాళ్ళతో అక్కడ కోలాహలంగా వుంది. మా ఎదురుగా కూర్చున్న పెద్దాయన సంచీతీసుకుని మెల్లగా బండి దిగి వెళ్లిపోయారు. మళ్ళీ కొత్త ప్రయాణికులతో మా కంపార్ట్మెంట్ నిండిపోయింది. బండి కదిలింది. ఫ్లాట్‌ఫామ్ దాటిపోతుండగా స్టేషన్ బోర్డు చోశాను. ‘సత్తెనపల్లి’ అని కనిపించింది. నాకు వెంటనే ఒక మహానుభావుడు గుర్తుకు వచ్చారు. అదే స్టేషన్‌లో బండి ఎక్కిన ఒక ప్రయాణికుడిని అడిగాను,

“బాబూ వావిలాల గోపాల కృష్ణయ్య అనే శాసన సభ్యులు వుండే వూరు ఇదేనా?”

“అవును, ఎందుకు సార్?” అన్నాడు.

“ఆయన గురించి బాగా విన్నాను బాబు. ఈ వూరు పేరు చూడగానే ఆయన గుర్తుకు వచ్చారు,ఆ మహాపురుషుడిని చూడాలనిపిస్తుంది” అన్నాను.

“అయ్యో.. వారు ఇదే కంపార్ట్మెంట్ నుండి,ఈ స్టేషన్ లోనే దిగిపోయారు కదా! మా ఏం.ఎల్. ఏ గారు ఆయనే” అన్నాడు.

“అవును సర్, మనకు ఎదురుగా కూర్చుని ఖద్దరు దుస్తుల్లో వున్నది ఆయనే” అన్నాడు, నా పక్కన కూర్చున్న ప్రయాణికుడు. ఒక్కసారి ప్రాణం చివుక్కుమంది. ఆయనను మనసారా చూడలేకపోయానే అన్న బాధ.

శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారు

“మరి ఆయన కూడా మంది – మార్బలం, సెక్యూరిటీ వంటివి లేవు కదా!” అన్నాను.

“ఆయన అలాంటి ఆర్భాటాలకు ఒప్పుకోరండీ, అవసరం అనుకుంటే తప్ప ఆయన కూడా ఎవరూ వుండరు” అన్నాడు.

నేను ఆశ్చర్యపోయాను, ఇవన్నీ గతంలో నేను వున్నా.. ఈ సందర్భంలో ప్రత్యక్షంగా చూసాను. ఆయన సాధారణ జీవన శైలి బాగా అర్థమైంది. ఇలాంటి ప్రజానాయకులు ఇంకొంతమంది ఉంటే బావుణ్ణు అనిపించింది. ఆయన జ్ఞాపకాల్లో నా విసుగు ఎటో పారిపోయింది. క్షేమంగా సాయంత్రానికల్లా అక్క దగ్గరకి వెళ్ళిపోయాను, ఈ తరం యువతీ -యువకులకు ఆయన అంతగా తెలియక పోవచ్చును. అనేకసార్లు సత్తెనపల్లి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆయనకే సాధ్యం అయింది. బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రికి,సంబంధిత మంత్రులకి దడ పుట్టించడం ఆయనకే చెల్లింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారభాషా సంఘం అధ్యక్షుడిగా గొప్పసేవలు అందించడం ఒక ఎత్తైతే, ప్రభుత్వ పరంగా అందే అదనపు సౌకర్యాలు త్యజించిన ఏకైక వ్యక్తి ఆయనే కావచ్చు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ విషయంలోనూ, దాని శంకుస్థాపనకు నాటి ప్రధానమంత్రి నెహ్రు గారిని ఒప్పించడంలోనూ ఆయన ప్రముఖ పాత్ర చాలామందికి తెలియకపోవచ్చును.

తర్వాతి కాలంలో నేను మహబూబాబాద్‌లో పనిచేస్తున్నప్పుడు, అక్కడి స్థానిక స్వాతంత్ర్య సమరయోధులు, శ్రీ బి. ఎన్, గుప్తా గారి పిలుపు మేరకు, మానుకోటకు వచ్చినప్పుడు,ఆయనను దగ్గరగా చూసి ఆయన ఉపన్యాసం వినే నా కోరిక తీరింది. వారిద్దరూ మంచి మిత్రులని అప్పుడే తెలిసింది అప్పటికి గోపాల కృష్ణయ్య గారి ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది, బాగా వంగిపోయారు. అసెంబ్లీ పులిగా పేరు తెచ్చు కున్న వావిలాల గారిని అలా చూడడం కొంచెం బాధ అనిపించింది.

శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారు

పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయినశ్రీ వావిలాల సత్తెనపల్లిలో 1906,సెప్టెంబరు 17న జన్మించి తన 97 వ ఏట హైదరాబాద్‌లో 29, ఏప్రిల్ 2003 నాడు స్వర్గస్తులైనారు. తెలుగు ప్రజలు ఒక స్వచ్ఛమైన, నిజాయితీపరుడైన, గొప్ప నాయకుడిని కోల్పోయారు. నాటి ప్రజానాయకులైన, శ్రీ వావిలాల, శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారు, గౌతు లచ్చన్నగారు, ఎం. ఓంకార్ గార్లను మరచిపోవడం కష్టం. వారి సేవలు అలాంటివి. అందరిలోనూ వావిలాల గోపాలకృష్ణయ్య గారు ప్రత్యేకం. ఆయనతో ప్రయాణం గుర్తుంచుకోదగ్గది.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version