Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-67

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

ఆమె తోసేసింది – నేను పడిపోబోయాను..!!

[dropcap]జీ[/dropcap]వితంలో కొన్ని సంఘటనలు ఏదో ఒక సందర్భంలో, ఏదో రూపంలో గుర్తుకు వచ్చి మనిషిని పట్టి కుదుపుతాయి. ఇవి స్వంత విషయాలకు సంబంధించినవి కావచ్చు, వృత్తి పరమైన విషయాలవి కావచ్చు. బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా లేదా శ్రేయోభిలాషుల ద్వారా కావచ్చు, అలా కాకుంటే కిట్టనివారి ద్వారా కూడా కావచ్చు. అయితే విషయాన్ని బట్టి, కారకులైన మనుష్యులను బట్టి, ప్రాధాన్యత సంతరించుకుంటుంది. నిత్యజీవితంలో ప్రతి ఒక్కరికీ ఇలాంటి అనుభవాలు కోకొల్లలు. అయితే వాటి ప్రాధాన్యతలు ఆయా మనుష్యుల వ్యక్తిత్వం మీద, మానసిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటాయి.

గతం తాలూకు సమస్యలను, సంఘటనలను తలుచుకోవడం, వాటిలోని మంచి చెడ్డలు తరచుగా సమీక్షించుకోవడం, దానిని బట్టి అవసరమైతే జీవనశైలిని మార్చుకునే అవకాశాలు దీనివల్ల సంక్రమిస్తాయి. తద్వారా మానసిక చైతన్యం ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది, మనిషిలో చురుకుదనం పుట్టుకొస్తుంది.

ఎంతటి ధనవంతుడికైనా ఇలాంటి సమస్యలు తప్పవు. ఎంతటి పేదవాడైన సమస్యలను తప్పించుకోలేడు. జరిగిపోయిన సంఘటనలను అప్పుడప్పుడు గుర్తుకు తెచ్చుకుని మానసికంగా కృంగిపోమ్మని కాదు, ఆయా సంఘటనలను గుర్తుకు తెచ్చుకుని మంచివైతే సంతోషపడడం, ఇబ్బందులు కలిగించేవైతే భవిష్యత్తులో అలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడడానికి గత జ్ఞాపకాలు చాలా అవసరం అవుతాయి.

ఈ హడావిడి యాంత్రిక జీవితంలో ఇలాంటి వాటిని గురించి ఆలోచించడానికి, గుర్తు తెచ్చుకోడానికి మెదడు సహకరిస్తుందా అన్నది వేరే విషయం. నిజంగానే అందరికీ ఇది సాధ్యం కాదు. సున్నిత హృదయులు కొద్దీ మంది మాత్రమే ఇలాంటి విషయాల గురించి సున్నితంగా ఆలోచించి గతాన్ని సింహావలోకనం చేసుకునే ప్రయత్నం చేస్తారు.

పైన చెప్పిన విషయాలకు భిన్నంగా వృత్తిపరంగా నేను ఎదుర్కొన్న అనుభవాన్ని మీతో పంచుకోవాలని ఆశ పడుతున్నాను. వైద్యరంగంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకసారి వివిధ రూపాల్లో అనేక అనుభవాలను ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు. వైద్య రంగం అలాంటిది. దంత వైద్య రంగం కూడా దీనికి ఏమాత్రం భిన్నమైనది కాదు.

1982లో నేను మొదట మహబూబాబాద్ తాలూకా ఆసుపత్రిలో డెంటల్ అసిస్టెంట్ సర్జన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు నా మొదటి జీతం అన్నీ కలుపుకుని వెయ్యి రూపాయలు. ‘ఉద్యోగం వస్తే మనకు వెయ్యి రూపాయలు జీతమట!’ అనుకునే వాళ్ళం మేము విద్యార్థులుగా. అప్పటికి అదే పెద్ద జీతం అనిపించింది.

బ్రహ్మచారిగా ఆ జీతం నాకు తృప్తికరంగానే అనిపించేది. అయితే 1983లో నాకు పెళ్లి అయిన తరువాత ఖర్చులు సహజంగా పెరిగాయి. ఇంటి అద్దెతో పాటు, బ్యాంకులో లోన్ తీసుకుని టివి (సోలీడర్), రిఫ్రిజిరేటర్ వంటివి కొనుక్కోవడం వల్ల నెల జీతంలో ఇన్‌స్టాల్‌మెంట్లు కట్టగా కొద్ది సొమ్ము మాత్రమే మిగిలేది. ఈ నేపథ్యంలో వైద్య మిత్రుల సలహా మేరకు బయట ప్రాక్టీస్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. నా అభ్యర్థన మేరకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు – మహబూబాబాద్ శాఖ వారు నా డెంటల్ చైర్ కొనుక్కోవడానికి లోన్ మంజూరు చేశారు. అయితే ప్రత్యేకమైన షట్టర్ తీసుకుని పెద్ద మొత్తంలో అద్దె చెల్లించే పరిస్థితి అప్పుడు నాకు లేదు. అందుచేత మేము నివసిస్తున్న ఇంట్లోనే ముందుగదిలో క్లినిక్ ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చాను. నా శ్రీమతికి కూడా ఒంటరితనం లేకుండా ఈ నిర్ణయం ప్రయోజనకరంగా ఉంటుందని, అవసరమైతే క్లినిక్‌లో సహాయకారిగా ఉంటుందని అనుకున్నాను.

ఒక శుభ దినాన నేనే క్లినిక్ ప్రారంభించాను, అతిథులు ఎవరూ లేకుండగానే. కొద్దీ కొద్దిగా ప్రాక్టీసు పుంజుకోసాగింది. స్థానికంగానే కాక పక్క ఊళ్ళల్లో నా గురించి ఆ నోటా ఈ నోటా బాగానే ప్రచారం అయిపోయింది. ప్రాక్టీస్ పెరిగింది కానీ ఫ్రీ-సర్వీసులు ఎక్కువ ఉండేవి. అయినా వచ్చిన దానితోనే తృప్తి పడేవాడిని. సంపాదించాలనే యావ అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు. అయినా నా ప్రభుత్వ ఉద్యోగం నన్ను తృప్తికరంగానే పెంచి పెద్దగా చేసింది. పదవీ విరమణ తర్వాత కూడా నన్ను నెలసరి పెన్షన్ హాయిగా పెంచి పోషిస్తున్నది.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, ఆదివారం ఉదయం కూడా పేషంట్లను చూసేవాడిని. ఇంటి యజమాని తిరుమల రావు (ఆంధ్రా బ్యాంకు) బాగా సహకరించేవాడు, క్లినిక్ పెట్టుకున్న విషయంలో. ఒక ఆదివారం దూరపు వూరు నుంచి ఇద్దరు (భార్యాభర్తలు) క్లినిక్‌కు వచ్చి బెల్ కొట్టారు. నేనే తలుపు తెరిచి మధ్య తలుపు మూసి (క్లినిక్‌కు – బెడ్ రూమ్‌కు మధ్య తలుపు) ఇద్దరినీ లోపలికి ఆహ్వానించాను. అందులో భార్య డెంటల్ పేషేంట్. ఆమెను డెంటల్ చైర్‌లో కూర్చోబెట్టి, భర్తను అక్కడే వున్న పొడుగు బల్ల మీద కూర్చోమన్నాను. సాధారణంగా ఎవరైనా పేషేంట్‌ను చూస్తున్నప్పుడు లేదా చికిత్స చేస్తున్నప్పుడు, ఒక సహాయకుడిని లేదా సహాయకురాలిని దగ్గరగా వుండమంటాం. మహిళా పేషేంట్ అయితే తప్పనిసరి. వీటితో కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులు ముడిపడి ఉండడం వల్ల ఇది తప్పనిసరి. ఆమె దంతాలు పరీక్ష చేసిన తర్వాత ఒక పన్ను తప్పని సరిగా తీసేయాలని (Extraction) చెప్పాను. ఆమె ఒప్పుకున్నట్లుగా తల ఊపి “అందుకే వచ్చాము సార్” అంది. భోజనం కూడా చేసి వచ్చినట్టు చెప్పింది. సరేనని నేను ఆ పని ప్రారంభించబోయాను. అప్పుడు ఆమె ఒక క్షణం ఆపి “సర్.. మా ఆయనను బయటికి పంపండి, రక్తం చూస్తే భయపడతాడు” అంది బ్రతిమాలుతున్న ధోరణిలో. “ఫరవాలేదు, నువ్వే చెప్పమ్మా, బయట మెట్లమీద (staircase) కూర్చోమని” అన్నాను. ఆమె అతని వైపు చూసి కనుసైగ చేసింది. తప్పదన్నట్లు అయిష్టంగానే బయటకు వెళ్లి, బయట గేటుదగ్గర ఆమె కనపడేట్లు నిలబడ్డాడు.

నేను మత్తు మందు (లోకల్ ఎనస్థీషియా) సిరంజిలోకి తీసుకుని, తీయవలసిన పన్ను దంతం కాబట్టి బ్లాక్ (సంబంధిత పంటికి సంబంధించిన నరాన్ని తిమ్మిరి చేసే ప్రక్రియ) ఇవ్వడానికి సన్నద్ధమై ఇంజెక్షన్ ఇవ్వవలసిన చోట నోట్లో సూది గుచ్చాను. ఈ పరిస్థితిలో కొంతమంది ఆ చిన్న నొప్పిని భరించి నిశ్శబ్దంగా వుంటారు. కొంతమంది నొప్పి చిన్నదైనా పెద్దగా గోల చేస్తూ ఓ పట్టాన పని కానివ్వరు. మరికొంతమందైతే,ఇంజెక్షన్ సూది గుచ్చకముందే భయపడి పెద్దగా అరుస్తారు. వీటన్నిటినీ అధిగమించి సురక్షితమైన చికిత్స డాక్టరు అందించాలి. ఇక్కడ నేను ఇంజెక్షన్ ఇవ్వగానే ‘అమ్మా..!’ అంది పేషేంట్.

గేటు దగ్గర ధడ్.. మన్న శబ్దం వచ్చింది. ఆ మరుక్షణం ఆ అమ్మాయి నన్ను ఒక్క తోపు తోసి పరిగెత్తుకుని భర్త దగ్గరకు పరిగెత్తింది. కొన్ని క్షణాల వరకు అసలు ఏమి జరిగిందో, ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. కొన్ని నిముషాల తర్వాత గానీ అసలు విషయం తెలిసి రాలేదు. అది విని నాకు నవ్వాలో ఏడవాలో అర్థం అయింది కాదు. జరిగిన విషయం ఏమిటంటే, పేషేంట్ ఇంజెక్షన్ నొప్పికి అమ్మా.. అనగానే, భర్త భయపడి కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇంత ఉపద్రవం నాకు ఎప్పుడూ ఎదురు కాలేదు. భర్త విషయం ఆమెకు బాగా తెలుసు కనుక, ఆమె అతడి గురించే ఆలోచిస్తున్నది కనుక ఒక్క క్షణంలోనే నన్ను గట్టిగా పక్కకు తోసి బయటకు పరిగెత్తింది. నాతో సంభాషించే సమయం ఆమెకు అసలు లేదు. అసంకల్పిత ప్రతీకార చర్య అంటే ఇదేనేమో! ఆమెను వదలి అతడికి సపర్యలు చేయవలసి వచ్చింది, ఆమెకు చికిత్స వాయిదా వేయవలసి వచ్చింది. నేను మాత్రం తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇలాంటి అనేక రకాల సంఘటనలు వైద్యులకు ఎదురవుతాయి. ఒక్కోసారి ఇలాంటి సందర్భాల్లో మనం ఎంత సహాయం చేసినా, దానిని వక్రంగా చిత్రించి ఏదో రూపంలో సొమ్ము చేసుకునే అవకాశాలు ఉంటాయి. పరిస్థితులు అలా మారిపోతున్నాయ్. అలా అని వైద్య మిత్రులని వెనకేసుకురావడం కాదు. ప్రసుత కాలంలో అన్ని రంగాలు భ్రష్టు పట్టిపోయాయి. అందుకే ఎవరికి వారు ప్రతి చిన్న విషయంలోనూ తమకు తాముగా అప్రమత్తంగా వుండాలిసిందే.

ఈ అనుభవం గుర్తుకు వచ్చినప్పుడల్లా ఒళ్లు గగుర్పొడుస్తుంటుంది. ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇప్పటికీ పచ్చిగానే కనిపిస్తుంది నాకు. మహబూబాద్ పట్టణం నాకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పిందని చెప్పక తప్పదు. అయినా అది నాకు చాలా ఇష్టమైన ప్రదేశం.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version