[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]
మీరేమిటోళ్లు…?
***
ఉద్యోగులకు బదిలీ అన్నది సహజం. 3-4 సంవత్సరాలకు బదిలీ తప్పని సరి! పైగా నా ఉద్యోగం రాష్ట్ర స్థాయిది కాబట్టి, రాష్ట్రంలో ఎక్కడికైనా పంపించవచ్చు. కానీ నేను పనిచేసిన మహబూబాబాద్ అప్పట్లో పెద్ద డిమాండ్ గల ప్రదేశం కాదు కాబట్టి, నాపై నా సోదర ఉద్యోగుల వత్తిడి ఉండేది కాదు. పైగా అప్పట్లో అది రాడికల్స్‌కు పెట్టింది పేరు. ఎవ్వరు అక్కడ పని చేయడానికి పెద్దగా ఉత్సాహం చూపించేవారు కాదు. అందుచేత నిరాటంకంగా మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పన్నెండు సంవత్సరాలు పని చేయగలిగాను. అక్కడి వాతావరణం ఆనందంగా ఆస్వాదించగలిగాను. అక్కడ నాకు కుల వివక్షత పెద్దగా ఉండేది కాదు. నా వెనుక ఏమైనా చర్చలు జరిగేవేమో గానీ, ప్రత్యక్షంగా అలాంటి పరిస్థితులు నాకు ఎదురు కాలేదు. బహుశః రచనా వ్యాసంగం, ఉపన్యాస ప్రతిభ, వాటిని నా దరిచేరకుండా చేశాయేమోనని ఇప్పుడు అనిపిస్తుంటుంది. ఇప్పటికీ ఆ ప్రాంతంతో సత్సంబంధాలు కలిగి ఉండడమే దీనికి ముఖ్య ఉదాహరణ! ఇక అసలు విషయానికి వస్తే, 1994లో, మహబూబాబాద్ నుండి నాకు జనగాం ప్రభుత్వ ఆసుపత్రికి బదిలీ అయింది. అప్పటి పేదల (సామాన్యుల) ప్రజాప్రతినిధి నర్సంపేట నాటి శాసనసభ్యులు స్వర్గీయ ఎం. ఓంకార్ గారి వల్ల ఇది నాకు సుసాధ్యమయింది. లేకుంటే నేను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి విసిరివేయబడి ఉండేవాడిని.
కాగితాలు అటూ ఇటూ కాస్సేపు తిప్పి, నన్ను కాసేపు ఎగాదిగా చూసి, సీరియస్‌గా – “మీరు ఏమిటోళ్లు?” అన్నాడు. నా స్థాయిలో ఉన్న వాడికి అలాంటి ప్రశ్న వస్తుందని అసలు నేను ఊహించలేదు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సమస్య ఎదురు కాలేదు. అందుకే ఆశ్చర్యానికి గురిఅయి, నిలకడగా మారి – నా కులం ఏమిటో చెప్పాను. నా వంక కాస్త ఆశ్చర్యం గాను, కించిత్ అనుమానం గాను చూస్తూ – “అవునా! మరి, అలా కనిపిస్తలేరు కదా!” అన్నాడు. ఇది ఇంకా మింగుడు పడని ప్రశ్న అనిపించి, కాస్సేపు ఆలోచించి “ఆ కులం వాళ్ళ వేషం యెట్లా ఉండాలంటారు” అన్నాను. ”ఉహు… అట్లా కాదుగానీ… అలా… కనిపిస్తలేరు…” అన్నాడు. “మరి… ఎలా ఉండాలంటారు? పోనీ మీకు అలా అనిపించడానికి గుడ్డల మీద బురద చల్లుకుని, అక్కడక్కడా చింపుకొని రానా?”అన్నా కాస్త సీరియస్‌గా. అప్పటికి ఆయనకు ఇంచుమించు సమాన స్థాయిలో ఉన్న వాడిని, పన్నెండు సంవత్సరాలు గజిటెడ్ హోదాలో పని చేసిన వాడిని, ఆ మాత్రం మంచి బట్టలు వేసుకోకూడదా? అనుకున్నాను మనస్సులో. నేను ఇచ్చిన సమాధానం ఆయనకు ఎక్కడో గుచ్చుకున్నట్లయింది. “అదికాదు… డాక్టర్ సాబ్, మీరు తప్పుగా అనుకోకండి. నేను మామూలు గానే అడిగాను, ఎలాంటి దురుద్దేశంతోను, మిమ్ములను అలా అడగలేదు… మిమ్ములను కించపరచాలని అసలు అనలేదు” అన్నాడు కాస్త గిల్టీగా ఫీల్ అవుతూ… “అది సరే సార్, మనం చదువుకున్న వాళ్ళం, ఉన్నత ఉద్యోగాల్లో వున్నవాళ్ళం, మన స్థాయికి ఆ విధంగా మాట్లాడుకోవడం సభ్య సమాజం హర్షించదు. మనం ఒకళ్ళకి చెప్పవలసిన వాళ్ళమే కానీ, చెప్పించుకునే పరిస్థితి మనకు రాకూడదు కదా!” అన్నాను నవ్వుతూ. “మీరు చెప్పింది అక్షరాలా నిజం, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, అసలు విషయం చెప్పనా, మనిషి పరిచయం కాగానే ‘మీరు ఏమిటోళ్లు’ అని అడగడం సర్వ సాధారణం. ఈ విషయంలో మీ పరిచయం నాకు కళ్ళు తెరిపించింది, మనిద్దరం ఇక ముందు మంచి స్నేహితులం” అని లేచి నిలబడి గట్టిగా కౌగలించుకున్నాడు. నిజంగానే అప్పటి నుండి ఇప్పటి వరకూ మేము మంచి స్నేహితులుగానే మిగిలిపోయాం. ఆయన జీవితానికి సంబంధించి నా చిరు సలహాలు కూడ హృదయ పూర్వకంగా స్వీకరించేవాడు.
ప్రతి అనుభవం ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోక, జీవితాలను సరిదిద్దుకునే అవకాశాలు మెండుగా కల్పిస్తుందన్నది మాత్రం అక్షరాలా నిజం!!
(ఇంకా ఉంది)