Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-78

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

ఇల్లాలి ముచ్చట్లు..!!

[dropcap]ఇ[/dropcap]ల్లు చూసి ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు. ఇక్కడ ఇది కేవలం లోకోక్తి మాత్రమే కాదు, ఆలోచించదగ్గ విషయం కూడా. ఇంటి వాతావరణం, శుచీ శుభ్రత, గృహ అలంకరణ, పొందికగా వస్తువులను ఆకర్షణీయంగా సర్దిపెట్టుకోవడం, వంటిల్లు పరిశుభ్రత వంటి విషయాలు చూడగానే, ఆ ఇంటి ఇల్లాలి అలవాట్లు, అభిరుచులు, జీవన శైలి యిట్టే అర్థం అయిపోతాయి. అందుకే ఆ నానుడి అంత ప్రచారంలోకి వచ్చివుంటుంది. ఎంతటి బిజీగా వుండే స్త్రీమూర్తులైనా, చివరకు ఉద్యోగినులైనా, ఇంటి విషయంలో అశ్రద్ధ చేయరు. వారు కోరుకున్నట్టుగా ఇంటిని తీర్చిదిద్దుకుంటారు. అందువల్లనే ఇంటిని చూడగానే ఆ ఇంటి మహిళా అభిరుచిని, మంచి లక్షణాలను యిట్టే లెక్కగట్టవచ్చు. కొన్ని కుటుంబాలలో ఇంటి యజమాని,లేదా పురుషుడు ఇంటి విషయంలో పూర్తి బాధ్యతను తీసుకుని, ఇంటి ఇల్లాలికి పేరు ప్రతిష్ఠలు తెస్తుంటారు. ఇవి చాలా కొద్దిమందికే వర్తిస్తుంది. అందుచేత ఇలాంటి వారు ప్రత్యేకం. పరిశుభ్రత అలంకరణ విషయాలలోనే కాకుండా, ఆర్థిక వనరులను సక్రమంగా సమర్థవంతంగా సద్వినియోగం చేసుకునే స్త్రీమూర్తులు కూడా వుంటారు. అవగాహన గల ఇంటి ఇల్లాలు ప్రతి చిన్న విషయాన్నీ నిశితంగా ఆలోచించి, కుటుంబానికి కేంద్రబిందువు అవుతుంది.

బాల్యంలో అరుణ (ఎడమ)
తల్లి తండ్రులు.. చెల్లెలు తమ్ముళ్లతో అరుణ (నిలబడ్డవారిలో కుడి)

కొన్ని సందర్భాలలో ఇల్లాలిని చూసి ఇంటి పరిస్థితిని చెప్పవచ్చు. ఇటువంటి గృహిణులైనా, ఉద్యోగులైనా, తమ అలంకరణలు, ఆడంబరాలమీద ఉన్న మోజు ఇతర విషయాల మీద ఉండదు. ముఖ్యంగా ఇల్లు శుభ్రంగా ఉంచరు. కనీసం ఇంట్లో పనిమనుష్యుల చేత చేయించుకునే ఓపిక, శ్రద్ధ వీరికి ఉండవు. విప్పిన బట్టలు ఎక్కడివి అక్కడే ఉంచుతారు. వస్తువులు క్రమబద్ధంగా వుంచుకోరు. ఉతికిన బట్టలు ఓ పట్టాన మడత పెట్టుకుని జాగ్రత్త పెట్టుకోరు. చదివేసిన పేపర్లు చిందర వందరగా పడి ఉంటాయి. నిద్రలేచిన తర్వాత దుప్పట్లు మడత పెట్టుకోరు. అన్నింటికీ ఒకరిమీద ఆధారపడవలసిందే! ఇలా రెండు రకాల స్త్రీమూర్తులు మనకు కనిపిస్తారు. ఈ విషయంలో కొందరు మంచి వైపు మారతారు. మరికొందరు తాము చేసిందే కరెక్ట్ అని జీవితాంతమూ వాదిస్తూనే వుంటారు. అటువంటివాళ్ళను ఎవరూ మార్చలేరు. అయితే తమని తమ పిల్లలు అనుకరిస్తారని, పిల్లలు పెద్దయ్యాక వాళ్ళను అసలు మార్చలేమన్న జీవిత సత్యం వారు ఎరుగరు. వాళ్ళ మంచికైనా చెడ్డకైనా తల్లిదండ్రుల పెంపకమే కారణమన్న విషయం తల్లిదండ్రులకు తట్టకపోతే అది అలా కొనసాగుతూనే ఉంటుంది. ఈ అంశం చర్చించాలంటే చాలా విషయాలు మన ముందుకు వస్తాయి. కానీ ఇప్పుడు మనం చర్చించుకునే విషయానికి ఇంతకు మించిన విశ్లేషణ అవసరం లేదనుకుంటాను.

పిల్లలతో రచయిత, శ్రీమతి అరుణ

 

పిల్లలతో రచయిత, శ్రీమతి అరుణ

సందర్భానుసారంగా ఇక్కడ నా స్వంత అనుభవాన్ని మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. ఆడపిల్ల (మన ఆడపిల్ల అయినా సరే) పెళ్ళి కాకముందు తన పుట్టింటి జీవన శైలికి అలవాటు పడివుంటుంది. కట్టు, బొట్టు, వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు, ఇతర గృహసంబంధమైన అలవాట్లు ఒక పద్దతిలో ఉంటాయి. అలాగే పిల్లలకు చిన్న చిన్న పనులు చెప్పి చేయించడం లాంటి అలవాట్లు కూడా! పెళ్ళై అత్తగారింటికి వచ్చిన తర్వాత అన్నీ పుట్టింటి మాదిరిగా ఉండాలనే లేదు. అది అవగాహన లేని పిల్లలు, త్వరగా అక్కడి వాతావరణానికి అనుకూలంగా మారిపోరు (అందరికీ అది సాధ్యం కాదు కూడా). అందువల్ల అత్తారింటి పెద్దలు గబుక్కున మాట్లాడే మాట “ఇలాగేనా మీ తల్లిదండ్రులు నేర్పింది?” అనేస్తారు. అది సున్నిత మనస్కులైన ఆడపిల్లలు తట్టుకోలేరు.

శ్రీమతి అరుణ

కొందరు తమ పిల్లలకు (ఆడైనా, మగైనా) అసలు చిన్న పనులు కూడా చెప్పకుండా అల్లారు ముద్దుగా (అలా వాళ్ళు అనుకుంటారు) పెంచుతారు. ఇది భవిష్యత్తులో ఇబ్బదులు మోసుకొస్తుందని అసలే ఊహించరు. సమస్య ఇక్కడ మొదలవుతుంది. అర్థం చేసుకోకుంటే చిలికి చిలికి గాలివాన అవుతుంది.

బ్యాంక్ ఉద్యోగినిగా

నా జన్మ స్థలం తూర్పు గోదావరి జిల్లా, మల్కీపురం మండలం (ఒకప్పుడు రాజోలు తాలూకా) దిండి అనే గ్రామం. పెరిగింది, చదివింది, హైదరాబాద్ (ఇంటర్మీడియెట్ మాత్రం నాగార్జున సాగర్). నా శ్రీమతి పుట్టి పెరిగింది, విజయవాడ, చదువుసంధ్యలు, విజయవాడ – గుంటూరు. పెళ్ళై కాపురం పెట్టింది మాత్రం ఉద్యోగ రీత్యా ‘మహబూబాబాద్’ (అప్పటి తాలూకా, ఇప్పుడు జిల్లా)లో. పెద్దల ఎవరి సహకారం లేకుండానే వైవాహిక జీవితం ప్రారంభమైంది.

కూతురు నిహారతో
పెళ్ళి కూతురు… కుమార్తె నిహారతో

నా శ్రీమతి మరీ అతి గారాబంతో కాపోయినా కొంచెం గారాబం, క్రమశిక్షణతో పెరిగిన అమ్మాయి. ఇది నిజంగా మా ఆనందమయ జీవితానికి బాగా పనికి వచ్చింది. అయితే మొదట్లో ఇంటికి ఎవరు (బంధువులు కాదు లెండి )వచ్చినా, లోపలికి వెళ్లిపోయేది. అవసరం అయితే తప్ప అనవసరంగా మాట్లాడేది కాదు. నాకు స్నేహితులు – బంధువులు కావాలి. బయటకు వెళ్ళే పని ఉండేది కాదు. అయితే ఆమెలో చిన్న చిన్న మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేసాను. ఆమె నాకు సహకరించింది. దానితో మేము అనుకున్న జీవితానికి శ్రీకారం చుట్టగలిగాం. నెల జీతం రాగానే బ్యాంకుల్లో వాయిదాలు కట్టే పని పూర్తి అయిన తరువాత మిగిలిన డబ్బు ఆమె చేతిలో పెట్టేవాడిని. నెలకు సరిపడా అవసరాలు వాటితో సమర్థవంతంగా సర్దుబాటు చేసేది. అనవసర ఖర్చులు అసలు చేసేది కాదు. చీరలు గానీ, బంగారం గానీ కొనమని వేధించేది కాదు. నేను ఎంతో బలవంతం చేస్తే తప్ప ఏమీ తనకు తాను కొనుక్కునేది కాదు. అన్నింటికీ మించి, తన తరఫు బంధువులను ఎంత ప్రేమగా చూసేదో, నా తరఫు బంధువులను అంతకు మించి అభిమానంగా ఆదరించేది. గృహిణిలో ఈ లక్షణం నాకు చాలా ఇష్టం. ఇక్కడ నా శ్రీమతి గొప్పతనం చెప్పి పాఠకులను విసిగించడం నా ఉద్దేశం కాదు. భార్యకు భర్త, భర్తకు భార్య ఒకరికొకరు సహాయం చేసుకున్నప్పుడు, ఒకరినొకరు అర్ధం చేసుకున్నప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు పంతాలు -పట్టింపులకు పోకుండా ఒకరికొకరు సర్దుకుపోయినప్పుడు ఆ కుటుంబం నిత్య సౌభాగ్యంతో సుఖసంతోషాలతో తులతూగుతుంది. వారి సంతానం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. నా విషయంలో అదే జరిగిందని నేను భావిస్తాను.

రచయిత మొదటి కథల పుస్తకం అంకితం సందర్భంగా

మా పెళ్ళైన కొత్తలో, నా శ్రీమతి బి.ఎస్.సి, బి.ఎడ్, కావడం మూలాన మహబూబాబాద్ స్థానిక ఫాతిమా హైస్కూల్‌లో కొంత కాలం సైన్స్ అసిస్టెంట్‌గా పనిచేయడం, ఆ తర్వాత స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ (ఎస్.బి.ఐ -ఇప్పుడు) లో క్లర్కుగా ఉద్యోగం మహబూబాబాద్ లోనే రావడం మూలాన ఆమెకు కూడా స్నేహితులు పెరిగారు. బయటి ప్రపంచం తెలియవచ్చింది. అది నాకు కలిసి వచ్చింది.

రచయిత పుట్టిన రోజున

పిల్లల చదువు పర్యవేక్షణ నావల్ల కాదని తేలిపోయాక, ఆ బాధ్యత కూడా నా శ్రీమతికి అప్పగించాను. ఆ రకంగా ఆమెకు పని భారం ఎక్కువ అయింది. అయినా ఆమె ఓపిగ్గా నెట్టుకొచ్చింది. అదే విధంగా మా ఇద్దరు పిల్లలు కూడా మమ్ములను ఏ రూపంలోనూ ఇబ్బంది పెట్టలేదు. అందువల్ల నేను, నా శ్రీమతి ఎప్పుడూ గర్వంగానే ఫీల్ అవుతాము. మేము చాలా అదృష్టవంతులు గానే భావిస్తాం. పిల్లలు మంచిగా సెటిల్ అయినారు. నేను రిటైర్ అయినాను, నా శ్రీమతి నాలుగు సంవత్సరాలు ముందస్తుగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేసింది.

మాకు ఆస్తులు కూడబెట్టాలన్న కోరిక పెద్దగా లేకున్నా, మేము కష్టపడి సంపాదించుకున్న దానిలో మిగిలిన దానితో, బాంక్ లోన్ సహకారంతో మేము బాగానే తృప్తిగా బ్రతుకుతున్నాం.

మనవరాలు ఆన్షితో…

అసలు చెప్పొచ్చేదేమంటే, ఇంటి గృహిణి అవగాహనాపరురాలైతే, క్షమా, ఓర్పు, అర్థం చేసుకునే మనసు గలదైతే, ప్రేమగుణం కలదైతే, ప్రతి చిన్న విషయంలోనూ కయ్యానికి కాలుదువ్వనిదైతే,  ఆ సంసారాన్ని స్వర్గ సీమ అనకుండా ఎలా ఉండగలం? ఇంటి యజమాని మగవాడు, మంచివాడైనా, చెడ్డవాడైనా, ఆ గృహం శాంతి సౌభాగ్యాలు, గృహిణి మీదే ఆధారపడి ఉంటాయి. ఈ రోజున నేను – నా పిల్లలూ సుఖశాంతులతో బ్రతుకుతున్నామంటే దానికి ప్రధాన కారణం నా ఇంటి ఇల్లాలే!

సమర్థవంతమైన గృహిణి వున్నప్పుడు, ఆ గృహం స్వర్గసీమ కాకుండా ఎలా ఉంటుంది? భర్త అయినా పిల్లలైనా సుఖశాంతులతో జీవితం గడపడానికి గృహిణి పాత్రే కీలకం! ఆమె సంతోషం మిగతావారి సహకారం మీదే ఆధారపడి ఉంటుంది. అలాంటి కుటుంబాలనే సమాజం కూడా కోరుకుంటుంది. తమకు అసలు కావలసింది ఏమిటో, ఏమి చేస్తే సుఖశాంతులతో బ్రతుకుతామో తెలుసుకున్న కుటుంబం నిత్యం ఆనందంగా, ఆహ్లాదంగా, నవ్వుతూ, త్రుళ్ళుతూ, ఉత్సాహంగా, ఉల్లాసంగా బ్రతక గలుగుతారు.

స్త్రీమూర్తులారా జయహో…!!

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version