జ్ఞాపకాల పందిరి-80

42
2

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

సహృదయ మూర్తి శ్రీ కృష్ణమూర్తి …!!

[dropcap]జీవి[/dropcap]తంలో కొన్ని పరిచయాలూ, స్నేహాలూ అనుకోని రీతిలో మనకి ఎదురువచ్చి అవి చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి పరిచయాలు ఇరువైపులా ప్రత్యేకతను సంతరించుకుని ఉంటే అవి మరింత సన్నిహితంగా స్వచ్ఛమైన బంధంగా పెనవేసుకుపోతాయి. దీనికి ప్రధాన కారణం ఇరువైపులా ఒకే ఆలోచనా, ఒకే రకమైన మనస్తత్వం కలిగివుండడం కావచ్చు. లేదా ఒకరి అవసరం మరొకరికి తప్పనిసరి కావచ్చు. కాకుంటే ఒకరు మరొకరిమీద తప్పనిసరిగా ఆధారపడవలసి అవసరం కావచ్చు, ఏదైనా ఒకరి భావాలమీద మరొకరికి మంచి నమ్మకం వున్నప్పుడే ఆ పరిచయాలు, తద్వారా ఏర్పడిన స్నేహాలూ సజీవంగా కలకాలం నిలిచిపోతాయి.

అయితే ప్రస్తుత సమాజంలో ఇవి బహు తక్కువ. స్వార్ధం, నేను – నాదీ అన్న అహంభావం, డబ్బుంటే అన్నీ సమకూరుతాయని తప్పుడు ఆలోచనా, ఈర్ష్య ఇలాంటివన్నీ కలిసి మనిషికి మనిషికి మధ్య దూరం పెంచుకుంటున్నారు. దీనిని ఇప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు, కాల మహిమ అంతే!

అలా అని ఇప్పుడు సమాజం అంతా ఇలానే మారిపోయిందా? అంటే చెప్పలేము. ఎక్కడో వేళ్ళమీద లెక్కపెట్టదగ్గవారు బహుకొద్ది మంది కనిపిస్తారు. అందరి జీవితాల్లోనూ ఎక్కడో ఒకచోట మంచి పరిచయాలు తటస్థపడుతూనే ఉంటాయి. నా జీవితం దీనికి అతీతం కాదు. అందుకే నా జీవితం లోని ఒక అనుభవాన్ని మీ ముందు వుంచుతాను. ఈ నా అనుభవం చాలామంది గతాన్ని గుర్తు చేసే అవకాశం కూడా వుంది, అందుకే మరి పదండి ముందుకు.

1994లో నాకు మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి జనగాం ఆసుపత్రికి బదిలీ అయింది. నా శ్రీమతికి హన్మకొండ బదిలీ కావడం వల్ల నివాసం హన్మకొండలో ఖాయం చేసుకోవలసి వచ్చింది. నేను హన్మకొండ నుండి జనగాంకు అప్ అండ్ డౌన్ చేస్తుండేవాడిని. సాయంత్రం తీరిక గానే ఉండేది. మహబూబాబాద్‌లో ఉండగా ప్రైవేట్ ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉండడం వల్ల, దానికోసం సమకూర్చుకున్న పరికరాలు ఉండడం మూలానా, హన్మకొండలో ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. అయితే హన్మకొండలో ప్రాక్టీస్ చేయడం అనుకున్నంత సులభం ఏమీ కాదు! షట్టరుకు అద్దె చాలా అవుతుంది, ప్రాక్టీస్ ఎలావుంటుందో చెప్పలేము. అయినా సాహసం చేద్దామనుకున్నాను. అందుకే షట్టర్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాను. తెలిసిన వాళ్లకి చెప్పాను. అది అంత సులభంగా సాధ్యమయ్యే పరిస్థితి కనపడలేదు. అయినా నా ప్రయత్నలు మానలేదు. ఒకరోజు హన్మకొండ సర్క్యూట్ గెస్ట్ హౌస్ రోడ్డులోని డా. రాజయ్యగారి హాస్పటల్‌కు వెళ్లాను. ఆయన పిల్లల వైద్య నిపుణుడు (తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కాంగ్రెసు పార్టీ నుండి కండువా మార్చి, టి.ఆర్.ఎస్. పార్టీలో చేరి స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గం నుండి శాసన సభ్యుడిగా గెలిచి, ఉప ముఖ్యమంత్రిగా పని చేసి, ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురియై పదవిని కోల్పోయి తిరిగి శాసన సభ్యుడిగా కొనసాగుతున్న మహానుభావుడు). ఆయనకు నా విషయం, అవసరం చెప్పాను.

వెంటనే ఆయన స్పందించి, షట్టర్ దొరికే వరకూ తన నర్సింగ్ హోమ్‌లో ఒక గది ఉచితంగా వాడుకొమ్మని చెప్పారు. నర్సింగ్ హోమ్ నిర్వహణ చూస్తున్న శ్రీనివాస్‌ను పిలిచి గదిని కేటాయించవలసిందిగా ఆదేశించారు. నాకు చాలా సంతోషం అనిపించింది. మరునాడు పరికరాలు అన్నీ రాజయ్య గారి నర్సింగ్ హోమ్‌కు చేర్చి క్లినిక్ ప్రారంభించాను. పెద్దగా ప్రాక్టీస్ ఉండేది కాదు. అయినా అధైర్యపడకుండా నడిపిస్తున్నాను. నెల రోజులు గడిచింది. డా. రాజయ్య గారు ‘అయిదు వందలు అద్దె’ ఇమ్మని కంపౌండర్‌ను నా దగ్గరికి పంపారు.

నేను అది విని ఆశ్చర్యపోయాను. అయినా అలా వసతి ఉచితంగా ఆశించడం కూడా కరెక్ట్ కాదని మనసులో అనుకుని నెల నెల అద్దె ఇవ్వడం మొదలు పెట్టాను. నా పరిస్థితి ఆ నర్సింగ్ హోమ్‌లో పనిచేసే ల్యాబ్ అసిస్టెంట్ గుర్తించి, ఒక రోజు ఒక కొత్త వ్యక్తితో నా క్లినిక్ గదికి వచ్చాడు.

అతను ఒక మెడికల్ షాపు నడుపుకుంటున్నాడు. అక్కడ నేను నా క్లినికి ఉచితంగా నడుపుకోవచ్చని, మిగిలిన అన్ని పనులు తానే చూసుకుంటానని హామీ ఇచ్చాడు. అతని ఆఫర్ నాకు నచ్చింది. అతని పేరే కృష్ణమూర్తి. ఇక ఎలాంటి ఆలోచన లేకుండా తక్షణమే నా క్లినిక్ అతని మెడికల్ షాపు దగ్గరికి మార్చేసాను. ‘సంరక్ష డెంటల్ క్లినిక్’ అని నామకరణం చేసాను. కృష్ణమూర్తి సహకారంతో నేను చాలా సంతోషంగా ప్రాక్టీస్ చేసేవాడిని. అప్పుడప్పుడు చిన్న చిన్న ఇంట్లో పనులు కూడా చేసిపెట్టేవాడు. నా పిల్లలను బాగా ఇష్టపడేవాడు. పేద కుటుంబం నుండి వచ్చిన కృష్ణమూర్తి ఎంతో వినయవిధేయలతో ఉండేవాడు.

శ్రీ చెన్న కృష్ణమూర్తి

నా దగ్గరికి వచ్చిన ప్రతి మెడికల్ రిఫ్రజంటేటివ్, నా కోసం ఇంకా మంచి సెంటర్‌లో క్లినిక్ కోసం షట్టర్ చూస్తామని, ఆమోదం తెలపమనేవారు. నేను వాళ్లకి ‘వద్దు’ అని చెప్పేవాడిని. నా కోసం కృష్ణమూర్తి అంత త్యాగం చేసినప్పుడు, అతనిని వదిలి వెళ్లడం న్యాయం కాదనిపించేది. అలా ఒకరి కోసం ఒకరం వేరు కాకుండా ఒకేచోట వున్నాం. లాభ నష్టాలవైపు అసలు దృష్టి మళ్లించలేదు.

పిల్లల విషయంలో ఎక్కువగా ఆలోచించేవాడు. కూతురి భవిష్యత్తు గురించి కలలు కనేవాడు. మా పిల్లలు మాదిరిగానే తన పిల్లలు కూడా గొప్పగా చదువుకోవాలని ఆశపడేవాడు. తన కుటుంబ సమస్యలు నాతో అప్పుడప్పుడు చెప్పి బాధపడుతుండేవాడు. అతను మెడికల్ షాపు నడపడం ఇంట్లోవాళ్ళకి ఇష్టంలేదని చెబుతుండేవారు. అన్ని రకాలుగా ఆదుకుంటున్న మందుల దుకాణం ఇంట్లో వాళ్ళు ఎందుకు వద్దంటున్నారోనని బాధపడుతుండేవాడు.

అలా కొన్ని నాకు కూడా చెప్పని సమస్యలతో మానసిక వ్యథకు లోనయ్యాడు. దానికి తోడు అతనితోపాటు పయనిస్తున్న మధుమేహ వ్యాధి. తత్ఫలితంగా ఒకసారి గుండెపోటుకు గురి అయ్యాడు. నిమ్స్‌లో నాకు తెలిసినవారితో చెప్పి వైద్యం చేయించాను. తర్వాత చాలా కాలం బాగానే పనిచేశాడు. కానీ అతని ఇంటి సమస్యలు అతనిని మరింత మనోవ్యథకు గురిచేశాయి. మధుమేహం నియంత్రణకు రాలేదు. మానసికంగా కృష్ణమూర్తి కృంగిపోయాడు. సమస్యల సుడిగుండంలో పడి కుమిలిపోయాడు. నాకు తెలియకుండా ఎన్నో రాత్రులు కేవలం అల్పాహారం తీసుకుని క్లినిక్ లోనే పడుకున్నాడని తెలిసింది.

కృష్ణమూర్తి కుటుంబం

2013, డిసెంబర్‌లో మా అమ్మాయి పెళ్లి నిశ్చయించుకున్నాము. కృష్ణమూర్తి తెగ సంతోష పడిపోయాడు. చాలా పనుల్లో తనకు తానై వచ్చి సహాయం చేసాడు. మా బాబు అమెరికా నుండి స్వెట్టర్ పంపిస్తే పదిమందికి చెప్పి తెగ మురిసిపోయేవాడు. అమెరికా వెళుతూ మా అబ్బాయి అతనితో “అంకుల్ డాడీని జాగ్రత్తగా చూసుకోండి” అన్న మాటలు పడే పడే నాకు చెప్పి గర్వపడేవాడు. మాతో, మా కుటుంబంతో అంతగా మమేకమై పోయిన వ్యక్తి, మంచి స్నేహితుడు, శ్రేయోభిలాషి సహృదయుడైన కృష్ణమూర్తి మా అమ్మాయి పెళ్లి చూడకుండానే కానరాని లోకాలకు కదలి వెళ్ళిపోయాడు. అప్పటి నా బాధను చెప్పడానికి ఇక్కడ అక్షరాలు చాలవు. మనసు మూగదై పోతుంది. దుఃఖం పొంగి పొర్లుతుంది.

కృష్ణమూర్తి నిష్క్రమణతో నాలో తెలియని లోటు ప్రత్యక్షంగా కనిపిస్తూ వచ్చింది. ఇక క్లినిక్‌కు, ప్రాక్టీస్‌కూ గుడబై చెప్పాలనుకున్నాను. అదే పని చేసాను. నా దగ్గర వున్న పరికరాలు, ఫర్నిచర్, టివి, వగైరా అన్నీ స్థానిక సెంటినరీ బాప్టిస్ట్ చర్చికు అనుబంధంగా వున్న ఆసుపత్రికి ఉచితంగా ఇచ్చేసాను.

కృష్ణమూర్తి లాంటి సహృదయులు బహు అరుదు. అతని పరిచయం దేవుడు నాకిచ్చిన గొప్ప వరంగా నేను భావిస్తాను. నేను ఒక డాక్టర్‌గా అతను మెడికల్ షాపు యజమానిగా ఎప్పుడూ ఎటువంటి భేషజాలకూ పోలేదు. మా మిత్రత్వం చాలా మందికి ఆశ్చర్యం కలిగించేది. అయినా నాకంటే అతనిలోనే ఎక్కువ సహృదయత కనిపించేది. కృష్ణమూర్తి జ్ఞాపకాలు ఎన్నటికీ మరువలేనివి.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here