Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-83

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

ఇద్దరు మిత్రులు..!!

ఉద్యోగ రీత్యానో, ప్రయాణాలలోనో, తరచుగా అద్దె ఇళ్ళు మారడం వల్లనో కొన్ని పరిచయాలు ఏర్పడతాయి (అందరికీ పరిచయాలు ఏర్పడతాయని ఆ పరిచయాలకు అందరూ ఇష్టపడతారని కాదు, ఇష్టపడేవారి గురించి మాత్రమే ఇది). అయితే ఆ పరిచయాలన్నీ చిరకాలం నిలబడతాయనే నియమం ఏమీ లేదు. నిలబడ్డ పరిచయాలు మాత్రం మరింత ముందుకు సాగి స్నేహాలుగా స్థిరపడతాయి. మరికొంతమందిలో అయితే అనురాగపూరితమైన బంధువుల మాదిరిగా రూపాంతరం చెంది, చాలా దగ్గర అయిపోతారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లకు మించిన అనుబంధాలు ఏర్పడిపోతాయి. రక్త సంబందాలకు మించిన ఆత్మీయతలు ఏర్పడిపోతాయి. ఇలాంటి స్నేహాలు చూసేవారిని ఆశ్చర్య పరుస్తాయి. అయితే పరిచయాలను ఈ స్థాయి వరకూ కొనసాగించే వారు బహు తక్కువ! అవసరాలు తీర్చుకుని, పని అయిపోయిన తర్వాత గుడ్ బై చెప్పేవారే ఎక్కువ. ఎదురుపడినా చూడనట్టు తప్పించుకుని పోవడం, లేకుంటే దారిమార్చుకుని కనపడకుండా వెళ్లిపోవడం వంటి పనులే ఎక్కువ కనిపిస్తుంటాయి. పరిచయాలకు విలువ ఇచ్చేవాళ్ళు స్నేహాన్ని పెంచుకుంటారు. స్నేహాన్ని నిలబెట్టుకోవాలనుకునేవారు వారు మనలో ఒకరిగా కలిసిపోతారు. ఆపదలో ఆదుకునే మనస్తత్వం వీరికి ఉంటుంది. కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి ఇలాంటి స్నేహితులు ఎంతమాత్రమూ వెనుకాడరు. ఆ దగ్గరితనం అలాంటి బంధాలను ఏర్పరుస్తుంది. వారిది స్వచ్ఛమైన స్నేహం, కల్తీ లేని ప్రేమ. మానవీయ విలువలకు ఇలాంటివారు కట్టుబడి వుంటారు. ఎంతటి త్యాగానికైనా వెనుకాడరు.

అన్యాయాలకు, అక్రమాలకూ, అడ్డురాని ఈ కలియుగంలో కూడా ఇంకా ఇలాంటి వ్యక్తులు వుంటారా అని కొందరికి అనుమానం రావచ్చు. అలాంటి అనుమానం రావడంలో ఏ మాత్రం తప్పులేదు. కానీ, ఆ కొద్దీ శాతం మంది మన మధ్యలో లేదా సమాజంలో లేకుంటే, మనం బ్రతికుండగానే పూర్తిగా నరకం అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. ఈ మాత్రం సుఖంగా ఇలా బ్రతికి బట్టకడుతున్నామంటే ఆ కొద్దిశాతం మహానుభావుల వల్లనే. వర్తమానం గమనిస్తుంటే, భవిష్యత్తు గురించి భయం వేయక తప్పదు. నీతి నిజాయితీలకు మన సమాజం క్రమంగా దూరమై పోతుందా అన్న అనుమానం రాక తప్పదు. అలా అని రాబోయే రోజులగురించి ఇప్పటినుండే ఆలోచిస్తూ మనోవేదనకు గురికావాల్సిన అవసరం కూడా లేదు. మంచి రోజులే వస్తాయనే ఆత్మవిస్వాసంతో, ఆశాభావంతో ఆనందంగా బ్రతకడానికి మొగ్గు చూపాలి.

ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సమస్యలకు బెదిరిపోక, మంచి ఆలోఛనలతో పరిష్కార మార్గాలు ఆలోచించాలి. ముఖ్యంగా ప్రతీది నిరాశాభావంతో ఆలోచించడం మొదటికి మోసాన్ని తెచ్చే అంశం. ఇలాంటి అనుభవంతో కూడిన సన్నివేశాన్ని మీ ముందు ఉంచుతాను. ఆస్వాదించండి మరి!

ఇప్పుడు చెప్పబోయే సన్నివేశం గురించి మళ్ళీ నా మొదటి ఉద్యోగ ప్రస్థానంలో మహబూబాబాద్‌కు వెళ్ళిపోవాలి. 1982 జూన్‌లో నేను మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘డెంటల్ అసిస్టెంట్’గా జాయినైనప్పుడు, నా అవసరం ఉండడం వల్లనో, మామూలుగా నా పరిచయం ఆశించడం వల్లనో, ఊరిలోని పెద్దలు, ఉద్యోగస్థులు, ఇతరులు అప్పుడప్పుడూ వచ్చి పరిచయం చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఒక మిత్ర ద్వయం పరిచయం అయింది. అందులో ఒకాయన మహా చురుకైనవాడు. ఎలాంటి వారితోనైనా యిట్టే కలిసిపోయే మనస్తత్వం కల వాడు. సహాయం తీసుకోవడమే కాకుండా అవసరమైనప్పుడు సహాయం చేస్తూ తన సేవలను అందించ గల సహృదయుడు. పేరు నారాయణ. ఇంటి పేరు సరిగా గుర్తులేదు, ‘తోట’ అన్నట్టు గుర్తు. వృత్తిపరంగా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు. మంచి మాటకారి.

నారాయణ గారితో కలిసి వచ్చిన రెండవ వ్యక్తి పేరు శ్రీ ఫక్రుద్దీన్. ఉద్యోగ రీత్యా ఆంద్ర ప్రాంతం నుండి వలస వచ్చినవాడు. అతి సౌమ్యుడు, పిరికి మనఃస్తత్వం కలవాడు. స్నేహశీలి, నిస్వార్ధంగా సహాయం అందించగల సహృదయమూర్తి. టెలీఫోన్ ఆపరేటర్ ఉద్యోగం. జంట కవులు మాదిరిగా ఈ ఇద్దరూ అప్పుడప్పుడూ వచ్చి నన్ను ఆసుపత్రిలోనో, ఇంటి దగ్గరో కలుస్తుండేవారు. ఆ పరిచయం కాస్తా పాతబడి స్నేహంగా రూపాంతరం చెంది దినదిన ప్రవర్ధమానం కాసాగింది. తరచుగా ఇంటికి రావడం లోకం పోకడ మాట్లాడడం, ఏమైనా అవసరాలు ఉంటే సహాయం చేయడం చేస్తుండేవారు. ముఖ్యంగా నారాయణ మాస్టారు (ప్రాథమిక పాఠశాల)ఎక్కువగా నాకు టచ్‌లో ఉండేవారు. ఆయనకు నా ద్వారా ఏమైనా అవసరం పడితే చెప్పి పనులు చేయించుకునేవారు.

ఫక్రుద్దీన్ టెలీఫోన్ ఆపరేటర్ కనుక,ఆ రోజుల్లో మొబైల్ ఫోన్ల ఉనికి లేదు కనుక, ఆయన అవసరం చాలా ఉండేది. ఇంట్లో స్వంత ఫోనే ఉన్నా ‘ఎస్.టి.డి’ సౌకర్యం ఉన్నా వినియోగదారుడికి అంత త్వరగా కనెక్షన్ కలిసేది కాదు. దూరప్రాంతాలకు తప్పని పరిస్థితిలో ఫోన్ చేయవలసి వచ్చినప్పుడు ఫక్రుద్దీన్ అవసరం/సహాయం తప్పని సరి అయ్యేది. ఆయన కూడా ఎలాంటి భేషజాలు లేకుండా, డబ్బుకు ఆశపడకుండా సహాయం చేసేవాడు. మా ఇంట్లో ఎలాంటి వేడుకలు జరిగినా వీళ్ళిద్దరినీ తప్పక పిలిచేవాడిని. అలాగే వాళ్ళు కూడా తప్పక నా ఆహ్వానాన్ని మన్నించేవారు. అంతమాత్రమే కాదు, ఇంటి పనుల్లో కూడా మేము అడగకుండానే సహాయం చేయడానికి ముందుకు వచ్చేవారు. నా శ్రీమతి ఎప్పుడైనా పనిపడి పుట్టింటికి రెండు -మూడు రోజులకోసం విజయవాడ వెళితే, కూరలు తేవడం, ఒక్కోసారి లంచ్/డిన్నర్ ఏర్పాటు చేయడం కూడా జరిగేది. ఈలోగా నారాయణ మాస్టారు అమ్మాయికి నేను పని చేస్తున్న ఆసుపత్రిలోనే ‘ఏ.ఎన్.ఎం-నర్స్’ గా ఉద్యోగం రావడంతో మా స్నేహ బంధం మరింత పెరిగింది.

మా నాయన (స్వర్గీయ కానేటి తాతయ్య) చివరి రోజుల్లో నా దగ్గరే వున్నారు. దురదృష్టకరమైన ఒకానొక రోజున నిద్రలోనే కన్నుమూశారు. అప్పుడు ఫక్రుద్దీన్ (ఇప్పుడు ఎక్కడ వున్నాడో తెలియదు), నారాయణ మాస్టారు చేసిన సహాయం మరువరానిది. మా నాయన గారి మరణ వార్త టెలిఫోన్ సౌకర్యం వున్ననా రక్తసంబంధీకులకు,ఇతర బంధువులకు, శ్రేయోభిలాషులకు, మా ఇంట్లో నా ఫోన్ ద్వారా దూరప్రాంతాలకు సమాచారం అందించిన మహానుభావుడు శ్రీ ఫక్రుద్దీన్. ఆ కాలంలో అది మామూలు విషయం కాదు. ఇక నారాయణ మాస్టారు విషయానికి వస్తే, ఆయన మా నాయన పార్థివ దేహంతో నన్ను అనుసరించి మా వూరికి (దిండి, మల్కీపురం మండల్, తూ. గో. జి) వచ్చి కార్యక్రమం ముగిసేవరకూ నాకు అండదండగా నిలిచారు. నాకెంతో గుండె ధైర్యాన్ని కలిగించారు.

ఎడమ రచయిత, మధ్యలో పెద్దన్నయ్య కె.కె.మీనన్, కుడి.. నారాయణ మాష్టారు

ఈ కథ, మా స్నేహం ఇక్కడితో ముగిసిపోతే అది పెద్ద గొప్ప విషయం కానే కాదు. ఇక్కడే గొప్ప మలుపు తిరిగింది కథ. ఇది ఎవరూ ఊహించని మలుపు!

నారాయణ మాస్టారు మంది కోసం పైరవీలు చేస్తుండేవారు. దానివల్ల ఆయన ఆర్థికంగా లాభపడింది కూడా లేదు. నా చిన్నక్క భారతి రైల్వేలో మంచి హోదాలో వున్నవిషయం ఆయనకు తెలుసు. ఎవరో బ్రోకర్ ద్వారా రైల్వేలో ఉద్యోగాలు వస్తున్నాయని అందువల్ల మా చిన్నక్కకు పరిచయం చేసి ఈ విషయం చెప్పమని బ్రతిమాలాడు. ఈ విషయం మా అక్క దగ్గర ప్రస్తావించినప్పుడు, ఆవిడ ఆ విషయం ద్రువీకరించి ఫలితాలు ఎలా ఉంటాయో నాకు తెలియవని చెప్పింది. అప్పుడు నేను ఇదే విషయం నారాయణ మాష్టారికి కూడా చెప్పాను. అంతమాత్రమే కాకుండా, నా పని పరిచయం చేయడం వరకేనని, మిగతా లావాదేవీలన్నీ మీరే చూసుకోవాలని నాకు దీనితో సంబంధం ఉండదని తేల్చి చెప్పాను. సరేనని మా బావగారి ద్వారా మధ్యవర్తిని కలసి, ఖర్చు విషయం మాట్లాడుకుని కొంత అడ్వాన్సు ఇచ్చి అతనితో కాంటాక్ట్‌లో వున్నారు.

రచయిత చిన్నక్క శ్రీమతి భారతి మట్టా, హైదరాబాద్

ఉన్నట్టుండి ఒకరోజున మహబూబాబాద్ డి.ఎస్.పి ఆఫీసు నుంచి కబురు వచ్చింది ఒకసారి కలవమని. అప్పటికి నా మిత్రులు, సాహితీ ప్రియులు డి.ఎస్.పి. ఆకుల రామకృష్ణ గారు బదిలీ అయి ఆయన స్థానంలో విలియమ్స్ అనే ఆయన ఉన్నారు. వారి పిలుపు మేరకు నేను ఆఫీసుకు వెళ్లాను. ఆయన మర్యాదగా కుర్చీలో కూర్చోమని, ఒక విషయం బాంబులా నా చెవిలో పేల్చాడు. నేను ఊహించని ఆ విషయానికి ఖంగు తిన్నాను. ఒళ్లు ఝల్లుమంది, చెమటలు పట్టేసాయి. జరిగిన విషయం ఏమిటంటే, నేను ఉద్యోగం ఇప్పిస్తానని నారాయణ మాస్టారు దగ్గర డబ్బు తీసుకుని, పని చేసిపెట్ట లేదని, డబ్బు వాపసు చేయాడం లేదని నాపై అభియోగం. అక్షరాలా ఆ కంప్లైంట్ చేసింది,నారాయణ మాస్టారే!

“ఏమి చేయమంటారు? కేసు బుక్ చేయమంటారా?’’ అన్నాడు కాస్త సీరియస్‌గా ముఖం పెట్టి. “కేసు బుక్ చేయడానికి నాకు అభ్యంతరం లేదు కానీ నేను చెప్పేది కూడా మీరు జాగ్రత్తగా వినండి” అని జరిగినదంతా సావధానం  చెప్పాను. ఆయన అంతా విని “మీరు ఇక వెళ్ళండి డాక్టర్ గారు” అన్నారు. నేను కూల్ గానే వచ్చాను గానీ అది ఎప్పటికప్పుడు సూదిలా నా గుండెలో గుచ్చుతూనే వుంది. మా చిన్నక్కను తర్వాత విజిలెన్స్ వాళ్ళు కూడా ప్రశ్నించినట్టు నాకు చెప్పింది. ఈ నారాయణ మాస్టారూ, ఫక్రుద్దీన్ అప్పటినుండి నన్ను తప్పించుకు తిరిగేవారు. నాకు తర్వాత దాని గురించి ఎవరూ అడిగింది లేదు. వాళ్ళే గిల్టీగా ఫీల్ అయి నాకు దూరంగా తిరిగేవారు. అందుకేనేమో చాలామంది ఎవరినీ పూర్తిగా నమ్మరు!

చాలామందికి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యేవుంటాయి. ఇలాంటి అనుభవాలు చాలామందిని అప్రమత్తం చేస్తాయి. సహజంగా నేను కూడా జాగ్రత్తగానే ఉంటున్నాను ఇప్పుడు, తప్పదుగా మరి!

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version