Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-84

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

రచయితగా.. మార్గదర్శనం చేసిన ఆకాశవాణి

[dropcap]ఒ[/dropcap]కప్పుడు రేడియో అంటే సామాన్య ప్రజానీకానికి అందని ద్రాక్షపండే! ఎవరో ధనవంతుల ఇంట్లో రేడియో ఉంటే చుట్టుపక్కల వున్న ఔత్సాహికులు వారి ఇంటి చుట్టూ చేరి రకరకాలైన కార్యక్రమాలతో పాటు, ప్రాంతీయ, జాతీయ వార్తలను వినడం చూసేవారికి ఒక వింతగా ఉండేది. అది ఒకప్పటి సామాజిక చిత్రం. ఇప్పుడు మనకు అందుబాటులోనికి వచ్చిన ‘మొబైల్’లో లేనిదంటూ లేదు. దానికి రేడియో అతీతం కాదు. అందుచేత ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉపయోగించని వారు బహు అరుదు.

ఆకాశవాణి ఎంబ్లమ్

రేడియో వినగల సౌలభ్యం ఇప్పుడు అందరికీ అందుబాటులోనూ వున్నట్టే. అయితే ఎంతమంది వింటున్నారన్నది వేరే విషయం కానీ ప్రతి కారులో సైతం (కొన్ని బస్సులలో కూడా) ఈ రోజు రేడియో శ్రోతలకు అందుబాటులోనికి రావడం వల్ల, ఎంతోమందికి ఇప్పుడు మళ్ళీ రేడియో అతి చేరువగా వచ్చే అవకాశం కలిగింది. మామూలుగా చెప్పాలంటే సమయం వృథా కాకుండా రేడియో ద్వారా ఇష్టమైన కార్యక్రమాలు వింటూ తమ తమ పనులు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా చేసుకునే అవకాశం నూటికి నూరు శాతం ఆకాశవాణి కల్పిస్తున్నది. అందుచేత టి.వి. ప్రసారాలు అందుబాటులోనికి రావడం వల్ల రేడియో వినేవాళ్ళ సంఖ్య తగ్గి పోయిందనే అపవాదుకు ఇప్పుడు అసలు అర్థం లేదు

ఇక నేను పుట్టిపెరిగిన ‘దిండి’ అనే గ్రామంలో, అంటే నా బాల్యంలో నాకు రేడియో గురించి అసలు తెలీదు. ఎవరి ఇంట్లోనూ నాకు రేడియో చూసే అవకాశం రాలేదు. కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల చదువుకు మధ్యలోనే స్వస్తి పలికి, హైదరాబాద్‌లో ఉంటున్న మా పెద్దన్నయ్య దగ్గర వుండవలసి వచ్చినప్పుడు రేడియో (ఫిలిప్స్) చూసే అవకాశం మొట్టమొదటిసారి నాకు కలిగింది. అది కూడా విద్యుత్తుతో పనిచేసే రేడియో. అప్పటికి ఇంకా బ్యాటరీలతో పనిచేసే ట్రాన్సిస్టర్లు ప్రాచుర్యం పొందలేదు. ఈ నేపథ్యంలో నాకు రేడియోతో గొప్ప అనుబంధం ఏర్పడింది. ఎక్కువగా ‘రేడియో శ్రీలంక’ కేంద్రం ద్వారా హిందీ సినిమా పాత పాటలు, ప్రతి బుదవారం బహుళప్రాచుర్యం పొందిన ‘బినాకా గీత్‌మాల’ కార్యక్రమం గొప్ప ఆసక్తితో వినేవాడిని. ఇక మన ఆకాశవాణికి సంబంధించి తెలుగు కార్యక్రమాలను బాగా వినేవాడిని. అందులో అతి ముఖ్యమైనది ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ‘సంక్షిప్త శబ్ద చిత్రం’. వీటిని చాలాకాలం శ్రీ వాడ్రేవు పురుషోత్తం గారు రేడియో పరిచాలన చేసేవారు. శ్రోతలు ఈ సినిమాలు వినడానికి ఆదివారం కోసం ఎదురుచూసేవారు. ఈ సినిమాలు వింటే, ప్రత్యక్షంగా సినిమా చూస్తున్న భావన కలిగేది

దీని తర్వాత నేను కార్మికుల కార్యక్రమం చాలా ఇష్టపడేవాడిని. చిన్నక్కగా శ్రీమతి రత్న ప్రసాద్, రాంబాబుగా ఉషశ్రీ, శ్రీ డి. వెంకట్రామయ్య, శ్రీ జీడిగుంట రామచంద్రమూర్తి గార్లు; ఏకాంబరంగా శ్రీ సత్యనారాయణ చక్కని సంభాషణలతో సహజ ధోరణిలో కార్యక్రమం ఎంతో రక్తి కట్టించేవారు. వారి సంభాషణల్లో ఏదో సామాజిక సందేశం తప్పకఉండేది. ఈ నేపథ్యంలో చిన్నక్కగా వ్యవహరించిన శ్రీమతి రత్న ప్రసాద్ గారికి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక అభిమాన సంఘాలు ఉండేవంటే ఆశ్చర్య పడనక్కరలేదు.

తర్వాత శనివారాలు రేడియో నాటకం సీరియల్‌గా వచ్చేది. నా అనుభవంలో ఒక మంచి సీరియల్ నాటకం వినే అవకాశం నాకు కలిగింది. అది ‘కాలకన్య’ అనే సీరియల్ నాటకం. అది నండూరి విఠల్ గారు రచించారు. హీరో హీరోయిన్లుగా శ్రీ నండూరి విఠల్, శ్రీమతి శారదా శ్రీనివాసన్ అద్భుతమైన స్వరాలతో నటిస్తుంటే కళ్లెదుట ఆ సన్నివేశం కనిపిస్తున్నట్టుగా ఉండేది. ఆ సీరియల్ నాటకం కోసం శనివారం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం.

అప్పట్లో నేను మెచ్చిన, నాకు నచ్చిన కార్యక్రమం విజయవాడనుండి ప్రతి శుక్రవారం ప్రసారమయ్యే కార్మికుల కార్యక్రమంలో ‘వినోదాల వీరయ్య’ అనే కార్యక్రమాన్ని శ్రీ ప్రయాగ నరసింహ శాస్త్రి నిర్వహించేవారు. అది చాలా ప్రత్యేకమైన కార్యక్రమంగా వుండేది. ఆయన దానిని వార్తలతో కూడిన సంగీత రూపకంగా మలిచేవారు. అందులో బుర్రకథ ఉండేది, హరికథ ఉండేది, లలిత సంగీతమూ ఉండేది. అలా అది జానపద, లలితగీతాల మిశ్రమ కార్యక్రమంగా శ్రోతలను అమితంగా ఆకట్టుకునేది.

డి.వెంకట్రామయ్య గారు, కథారచయిత, న్యూస్ రీడర్ (రిటైర్డ్)

అంతమాత్రమే కాకుండా, మహిళాసమాజం, బాలానందం, ఈ మాసపు పాట, వార్తావాహిని వంటి అమూల్యమైన కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. అవి ఎంతో విజ్ఞాన దాయకంగానూ, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింబించేవి గానూ ఉండేవి. పాత సినిమా పాటల విషయం ప్రత్యేకంగా ఇక్కడ చెప్పవలసిన పనిలేదు. ప్రాంతీయ వార్తలు కూడా వినసొంపుగా ఉండేవి. శ్రీ తిరుమలశెట్టి శ్రీరాములు, డి వెంకట్రామయ్య, శ్రీ ఆంజనేయ శాస్త్రి, వై. రాఘవులు వంటి వారు, వసీం అక్తర్ ఉర్దూ వార్తలు చదువుతుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేది. ప్రముఖులను పరిచయం చేయడంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ ఇంటర్వ్యూలు ఎంతో గొప్ప సమాచారాన్ని అందించడమే కాకుండా శ్రోతలను బహుదా ఆకట్టుకునేవి.

స్వర్గీయ శ్రీ జీడిగుంట రామచంద్ర మూర్తి

ఇక రేడియోతో నా ప్రత్యక్ష సంబంధం 1975లో మిత్రులు డా.సత్యవోలు సుందరశాయి ద్వారా జరిగింది. అప్పుడు మేము బి.ఎస్.సి. మొదటి సంవత్సరంలో సహాధ్యాయులం. శాయికి బావ వరుస పెద్దలు శ్రీ జీడిగుంట రామచంద్ర మూర్తి గారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ (పెక్స్)గా పనిచేసేవారు. ఆయన ద్వారా సుందర శాయి నన్ను ఆకాశవాణికి పరిచయం చేసి యువవాణి కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కల్పించాడు. డిగ్రీ మొదటి సంవత్సరంలోనే నాకు దంతవైద్యంలో ప్రవేశం లభించడంతో నేను సుందరశాయికి చదువు వల్ల దూరం అయినప్పటికీ రేడియో ద్వారా మా స్నేహం ఇప్పటికీ సజావుగానే వుంది.

మిత్రుడు సత్యవోలు సుందర శాయి (హైదరాబాద్)తో.

అలా యువవాణి లో నాటికలు వేయడం, దంతవైద్యం గురించిన ప్రాథమిక సమాచారం గల చిన్న చిన్న వ్యాసాలు రాసి చదువుతుండే వాడిని. అలా వ్యాసాలు రాయడంలో అనుభవం సంపాదించుకోగలిగాను. పరోక్షంగా ఇది కథలు రాయడానికి ఉపయోగపడింది. యువవాణి కార్యక్రమాలలో వ్యాసాలు రాసి చదవడమే ఉండేది. ఇంటర్వ్యూలు ఉండేవి కాదు. అందుచేత వ్యాసాలు పదే పదే రాయడం మూలాన రచనా వ్యాసంగంలో పట్టు దొరికినట్టు అయింది. అదేవిధంగా రేడియోలో మాట్లాడడం వల్ల బయట నిర్భయంగా ఉపన్యాసాలు చేసే అనుకూలత కూడా ఏర్పడింది. అప్పుడు యువవాణి విభాగాన్ని ప్రయాగ వేదవతి, భీమయ్య వంటివారు చూస్తూండేవారు. వ్యాసం ఏమాత్రం బాగోకున్నా తిరిగి రాయించేవారు. ఒక వ్యాసాన్ని అలా మూడుసార్లు నా చేత తిరగ రాయించిన ఘనత స్వర్గీయ శ్రీమతి తురగా జానకిరాణి గారిదే!. అది నాకు తర్వాతి కాలంలో ఎంతగానో ఉపయోగపడింది.

యువవాణి…. నాటికలలో పాల్గొన్న మిత్రుడు మురళి (హైదరాబాద్)తో
యువవాణి నాటికలలో పాల్గొన్న మిత్రబృందం, కూర్చున్న వారిలో ఎడమ చివర డాక్టర్ మధుసూదన్. కానేటి

నేను దంతవైద్యంలో పట్టా పొందిన తర్వాత వ్యాసాల స్థానే ఇంటర్వ్యూలు మొదలయ్యాయి. ఫోన్ -ఇన్ – ప్రోగ్రామ్‌లు అందుబాటులోనికి వచ్చాయి. తర్వాత కథలు రాసి చదివే అవకాశాలు వచ్చాయి. ఆకాశవాణిలో ఇంటర్వ్యూ లు పరోక్షంగా ఎంతో మంది సాహితీ ప్రముఖులను వైద్యులను ఇంటర్వ్యూల ద్వారా పత్రికలలో పాఠకలోకానికి పరిచయం చేసే అనుభవం లభించింది. అలా ఇప్పటివరకూ ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు లభించింది. అలా 1975 నుండి ఆకాశవాణిలో నా అనుబంధం ముడిపడి వున్నప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాలవల్ల గత కొద్ది సంవత్సరాలుగా ఆకాశవాణికి దూరంగా ఉండిపోయాను. అంతేకాని రేడియో వినడం మాత్రం మానలేదు. ముఖ్యంగా ఆకాశవాణి -వరంగల్ ఎఫ్.ఎం. కేంద్రం రాత్రి పది గంటలనుండి పదకొండు గంటలవరకూ ప్రసారం చేసే పాత తెలుగు సినీ గీతాలు తప్పక విని ఆ తర్వాతనే నిద్రకు ఉపక్రమించడం నా జీవన శైలిలో ఒక ముఖ్య భాగం అయిపొయింది. ఎప్పుడైనా కొన్ని ఊహించని ప్రత్యేక కారణాల వల్ల రేడియో కార్యక్రమం వినని రోజున చెప్పలేని వెలితి ఏదో మనసును కలవర పెడుతుంటుంది.

రేడియోకు పరిచయం చేసిన మిత్రుడు డా.సత్యవోలు సుందర శాయి, రిటైర్డ్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్, దూరదర్శన్ హైదరాబాద్.

ఇలా నా జీవితం రేడియో (ఆకాశవాణి)తో ముడిపడి ఆ అనుబంధం ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. అనుకోని కొన్ని ప్రత్యేక కారణాలవల్ల నేను నా కార్యక్రమాల కోసం ఆకాశవాణి – హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కొత్తగూడెం, వరంగల్-రేడియో కేంద్రాలను వినియోగించుకునే గొప్ప అదృష్టం దక్కింది. ఇది ఏ కొద్దిమందికో దక్కే అవకాశమూ, అదృష్టమూనూ. ఈ విధంగా ఆకాశవాణికి నేనెంతగానో రుణపడి ఉంటానని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాబోదు.

ఆకాశవాణి (వరంగల్) రికార్డింగ్ రూమ్‌లో కథ చదువుతూ…

కొసమెరుపు ఏమిటంటే, మా చిన్నన్నయ్య డాక్టర్. మధుసూదన్ కానేటి ఆకాశవాణిలో అనౌన్సర్ (విశాఖపట్నం)గా పదవీ విరమణ చేసారు. నా డార్లింగ్ డాటర్, నిహర కానేటి, ఆకాశవాణి -వరంగల్ కేంద్రంలో ప్రస్తుతం ప్రోగ్రాం ఆఫీసర్‌గా పనిచేస్తోంది.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version