[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]
అపూర్వం – ఆనందమయం..!!
[dropcap]పె[/dropcap]ళ్లి అనేది జీవితంలో ఒక ముఖ్యమయిన సన్నివేశం. జీవితం అనేది ఒక మహాగ్రంథం అనుకుంటే అది రెండు ముఖ్యమైన అంకాలను కలిగి ఉంటుంది. మనిషి మనుగడకు రెండూ ముఖ్యమైనవే!
ఇందులో మొదటి అంకం బాల్యము నుండి యవ్వనం వరకు అయితే మిగతాది యవ్వనంలో పెళ్లితో మొదలై జీవితం చరమాంకం వరకూ ఉంటుంది. ఈ రెండవ అంకంలో ‘పెళ్లి’ అనేది చాలా ముఖ్యమైనది. జీవితంలో కష్టమైనా సుఖం అయినా ఇక్కడినుండే ఆరంభం అనుకోవాలి. దీనిని బట్టి పెళ్ళికి జీవితంలో ప్రాధాన్యత ఎంతటిదో మనకు అర్థం అవుతుంది. పెళ్ళికి జీవితంలో అంతటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, ఈ పెళ్లి ద్వారా, అప్పటివరకూ ఒకరికొకరు తెలియని స్త్రీ-పురుషులు భార్యాభర్తలుగా మారి, భిన్నమైన ఆలోచనలతో, వింత వింత కోర్కెలతో, ఆచార వ్యవహారాలతో, సంస్కృతీ సంప్రదాయాలతో ఇద్దరూ కలసి మెలసి ఆనందంగా జీవితాన్ని గడపాలంటే, ఇద్దరిలో యెంత ఓర్పు సహనం ఉండాలి? యెంత సర్దుకుపోయే గుణం ఉండాలి? ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలి? ఇవన్నీ ఇద్దరూ అర్థవంతముగా ఇచ్చి పుచ్చుకున్నప్పుడే ఆ సంసారం, ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది. అలాగే ప్రేమను పొందడం, ప్రేమను పంచడం వంటివి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో లేకుంటే, ఆ సంసారంలో చిక్కులు రాక మానవు. ఆ పెళ్ళికి పెటాకులు తప్పవు. నిజానికి ప్రస్తుతం ఎన్నో కుటుంబాలలో జరుగుతున్న తంతు ఇదే! చిన్న చిన్న విషయాలకే అపార్థాలు చోటు చేసుకొని, అవగాహనా లోపంతో పెళ్ళైన కొద్దీ నెలల్లోనే విడాకుల వరకూ వెళుతున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో కోకొల్లలు. ఇక్కడ అమ్మాయిలనుగాని, అబ్బాయిలను గాని ప్రత్యేకంగా ఉదహరించవలసిన అవసరం లేదు. ఇరుపక్షాలలోను ఈ అవగాన లోపం కనిపిస్తున్నది.
తద్వారా తాము ఇబ్బందులకు లోనుకావడమే కాక కనిపెంచి తమపై ఎన్నో ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులను సైతం ఇబంది పెట్టే పరిస్థితి ఏర్పడుతున్నది. అప్పట్లో బంధువుల ద్వారా అనుకూలమైన సంబంధాలు వచ్చేవి. తర్వాత పెళ్లిళ్ల పేరయ్యల యుగం వచ్చి, అది ‘మ్యారేజ్ బ్యురోలు’ గా రూపాంతరం చెందింది. ఇవి కొంతవరకూ ఉపయోగపడుతున్నా వీటిని కూడా పూర్తిగా నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. అసలు పిల్లల పెంపకంలోనే పెద్ద తేడా వచ్చిందేమో అన్న భావన కలుగుతుంది.
ఇప్పుడైనా, ఎప్పుడైనా ఆడపిల్ల పెళ్లి విషయం వచ్చిందంటే తల్లిదండ్రులకు అదొక పెద్ద యజ్ఞం చేసినంత పని. పూర్తిగా అదృష్టాన్ని నమ్ముకుని పెళ్లి చేయవలసిందే తప్ప, చివరి వరకూ ఎలా వుంటుందో చెప్పలేని అంశం. అల్లుడైనా, కోడలైనా, మంచివాళ్ళు దొరకాలని నిత్య ప్రార్థనలూ, పూజలు చేసే తల్లిదండ్రులే ఎక్కువై పోయారు ఇప్పుడు.
నేనూ ఒక ఆడపిల్ల తండ్రినే! ఎంత జాగ్రత్తగా పెంచానో పెళ్లి విషయం వచ్చేసరికి భయం మొదలైంది. బంధువుల వల్ల ఈ విషయంలో ఎలాంటి సహాయమూ అందలేదు. చివరికి మేరేజ్ బ్యూరోను ఆశ్రయించక తప్పలేదు. ఈ క్రమంలో మాకు నచ్చిన ఒక సంబంధం బ్యూరోలో తగిలింది. అతను బి.ఎస్.ఎన్.ఎల్.లో జూనియర్ ఇంజనీర్. హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా పరిస్థితి బాగానే వుంది. ఆ టెలిఫోన్స్ డిపార్ట్‌మెంట్‌లో నాకు తెలిసిన మిత్రులు ఉండడం వల్ల అతని గురించి వాళ్ళ ద్వారా వాకబు చేసాను. వాళ్ళు కొంత సమాచారం అందించారు. అందులో అతని వయసుకు, బ్యూరో వారు అందించిన సమాచారంలోని వయసు తేడా వుంది. ఏ వయసు కరెక్టో చెప్పమని అతనికే ఫోన్ చేసాను. అతను సారీ చెప్పి, తాను ఈ సంబంధం వదులుకుంటున్నాని చెప్పాడు. బ్రతుకు జీవుడా.. అనుకున్నాను.
మా అబ్బాయి అమెరికా వెళ్లిన తర్వాత నా బాధ చూసి మా అమ్మాయి విదేశాలకు వెళ్లే ఆలోచన మానుకుంది. అందుచేత విదేశ సంబంధాలు కూడా వద్దని చెప్పింది. దీనితో పాటు ‘సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు’ అసలు వద్దనే కండిషన్ కూడా పెట్టింది. మొదటి నుండి పిల్లల నిర్ణయాలకు విలువ ఇస్తూ వచ్చాను. నా ఆలోచనలకు అభిరుచులకూ అనుగుణంగానే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. అందుచేత ఆమెకు ఇష్టమైన వారితోనే పెళ్లి చేయాలనే నిర్ణయానికి వచ్చాను. ఈ నేపథ్యంలో మేరేజ్ బ్యూరో ద్వారానే మరో మంచి సంబంధం వచ్చింది. అతను డాక్టరు. అప్పటికే సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. నాకు సంతోషం అనిపించింది. కానీ అమ్మాయి ముఖంలో ఆ ఆనందం కనిపించలేదు. నాకు ఎదురు చెప్పలేక, ‘నో’ అని మాత్రం చెప్పడం లేదు. అందుచేత హైదరాబాద్‌లో మా మరదలు ఇంట్లో పెళ్లిచూపులు ఏర్పాటు చేసాము. అతను బాగానే వున్నాడు, నెమ్మదస్తుడిలా కనపడ్డాడు. అమ్మాయి మాత్రం కావాలనే సరిగా తయారైనట్టు లేదు. అంత ఉత్సాహంగా నాకు కనిపించలేదు. అమ్మాయి మాత్రం వాళ్లకు బాగా నచ్చింది. రెండు రోజుల్లో ఏవిషయమూ చెబుతామన్నారు. ఈ లోగా అమ్మాయి తన అయిష్టతను చూపించింది. ఆ ప్రపోజల్ కూడా వదులుకున్నాము. ఈ లోగా ఒక ట్విస్ట్ జరిగిపోయింది, అది నన్నూ మా ఆవిడనూ కూడా ఆశ్చర్యపరిచింది.
మా అమ్మాయి దృష్టికి ఇంకో ప్రపోజల్ మ్యారేజ్ బ్యూరో ద్వారా వచ్చింది. అయితే అతను ‘సాఫ్ట్‌వేర్ ఇంజనీర్’. ఎవరైతే వద్దనుకుందో అలాంటి ఉద్యోగస్ధుడుని ఎన్నుకోవడానికి సిద్ధపడింది. అందుకు నేను వద్దన్నాను అమ్మాయి బాధపడింది. నేను చూసిన అబ్బాయినే చేసుకుంటానని ప్రామిస్ చేసింది. నాకోసం రెండోసారి త్యాగం చేయడానికి సిద్ధపడింది. అప్పుడు నేను బాగా ఆలోచించి, తాను కోరుకున్న అబ్బాయి తోనే పెళ్లి జరిపిస్తానని హామీ ఇచ్చాను. ఇద్దరూ సుఖ సంతోషాలతో ఉండడమే మాకు కావాలని, అందువల్ల అమ్మాయి చెప్పిన అబ్బాయినే అల్లుడిగా చేసుకుంటానని చెప్పాను. దానికి అమ్మాయి చాలా సంతోషించింది. అన్నీ పనులూ చక చకా జరిగిపోయాయి. ఆ సమయానికి మా అబ్బాయి రాహుల్ కూడా అమెరికా నుండి వచ్చాడు. బంధువులను,స్నేహితులను,శ్రేయోభిలాషులను,ఎక్కువ సంఖ్యలో పిలిచి 2013, డిశంబర్ నెలలో పెళ్లి ఘనంగా చేసాను. ఎవరూ ఊహించని రీతిలో పెళ్లి జరిగింది.
అందరూ మెచ్చిన విందు హన్మకొండ నందనా గార్డెన్‌లో ఏర్పాటు చేసాను. ఆ విందు గురించి ఇప్పటికీ నా ఆత్మీయ మిత్రులు, శ్రేయోభిలాషులు గుర్తుచేసి ఆనందిస్తారు. నాకు అన్నివిధాలా యోగ్యుడైన అల్లుడు దొరికాడు. 2017, జనవరి 24న, తాతను మురిపించే మనుమరాలు ఆన్షి, మా మధ్యకు వచ్చింది. ఉద్యోగ రీత్యా నా కూతురు చాలాకాలం నా దగ్గరే ఉండడం నా అదృష్టమే! కరోనా పుణ్యమా అని మా అల్లుడు ఎక్కువ కాలం మాతో గడపడం (ఆయన ఉద్యోగం, హైదరాబాద్‌లో, ప్రస్తుతం ‘గృహమే కార్యాలయం’) ఆనందదాయకం. కూతురు నాతో ఉండడం మూలాన, కరోనా భయంకర సమయంలో మేమిద్దరం ఆమె రక్షణలో సురక్షితంగా వున్నాం. ఎలాంటి ఉపద్రవం వున్నా, కూతురు నాతో ఉందన్న భరోసా నాకు తృప్తికర జీవితాన్ని మిగిల్చింది.
కొసమెరుపు:
మా అమ్మాయి ఎంచుకున్న అబ్బాయి, వినోద్ కుమార్ జోషిని నేను చిన్నప్పటినుండీ ఎరుగుదును. అబ్బాయి తల్లి గృహాలక్ష్మి, మా చిన్నక్క భారతి (ఇద్దరూ ఇప్పుడు లేరు) ఆత్మీయ స్నేహితులు, రైల్వే ఉద్యోగులు. సికింద్రాబాద్ (సఫిల్ గూడ)లో పక్క పక్క ఇళ్ళు. మా అక్క ఇంటికి వెళ్ళినప్పుడల్లా వినోద్‍ను చూస్తూండేవాడిని. అతనిని అప్పట్లో అల్లుడిగా చేసుకోవాలనే ఆలోచన రాలేదు. మాకు కూతురు అంటే యెంత ప్రేమో, అల్లుడు అన్నా అంతే ప్రేమ. మా పట్ల అతను కూడా అలాగే ప్రేమగా ఉండడం మా అదృష్టం! అలా మా జీవితాలు ఆనందంగానే గడిచిపోతున్నాయి.
(మళ్ళీ కలుద్దాం)