జ్ఞాపకాల పందిరి-87

27
2

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

జీవన రాగం..!! (‘ఆన్షి’ల పుట్టుక)

[dropcap]తె[/dropcap]లుగు సాహిత్యం సామాన్య పాఠకుడికి అందుబాటులో రావడానికి ఎన్నో ప్రయత్నాలు ప్రయోగాలు జరిగాయి. ఎందరో మహానుభావులు, పండితులు భాషాశాస్త్రవేత్తలు, కవుల భాగస్వామ్య కృషితో ఈవాళ తెలుగు సాహిత్యం సామాన్య పాఠకుడికి అందుబాటులోనికి వచ్చింది. చెప్పాలంటే మరింత కృషి ఇందులో జరగవలసి వుంది, మరింత చేరువగా పాఠకుడికి తెలుగు సాహిత్యం రావలసి వుంది.

తెలుగు సాహిత్యం, ప్రాచీన సాహిత్యం నుండి మొదలుపెడితే, అందరికీ అందుబాటులో లేని (అర్థం కాని) పద్యం, తర్వాతి కాలంలో సరళ వచనం అందుబాటు లోనికి వచ్చింది. ఆ తర్వాత వచన కవిత్వం పలు రూపాలలో ఇప్పుడు దర్శనం ఇస్తున్నది.

గ్రాంథిక భాష నుండి వ్యవహారికమూ, సరళ వ్యవహారికమూ అందుబాటులోనికి రావడానికి ఎందరో మహానుభావుల కృషి వుంది. గురజాడ, గిడుగు రామ్మూర్హి పంతులు, గిడుగు సీతాపతి వంటివారు మొదలుకొని, మహాకవి శ్రీశ్రీ, కుందుర్తి ఆంజనేయులు గారు, శీలా వీర్రాజు వంటి వారివరకూ ఈ కృషి కొనసాగింది.

ఆ తర్వాత తెలుగు కవిత్వం రకరకాల రూపాలలో దర్శనం ఇచ్చింది, అంతమాత్రమే కాకుండా, ఉత్సాహవంతులైన కవులను కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో తయారుచేసింది. అలా ఇప్పుడు కవిత్వం రాయడం ఒక ఫ్యాషన్‌గా కూడా మారిపోయింది. దీనికి కారణం, తెలుగు కవిత్వంలో అనేక నూతన పోకడలకు శ్రీకారం చుట్టడం, సరళతరం కావడం అని నా అంచనా.

అలాంటి నూతన పోకడల కవిత్వపరంగా బాగా ప్రాచుర్యం పొందిన ప్రక్రియ ‘నానీలు’ అని నా నమ్మకం. ఈ నానీల సృష్టికర్త ప్రొఫెసర్ (రిటైర్డ్) ఎన్. గోపి అన్న విషయం చాలామందికి తెలిసిందే! ఈ ప్రక్రియకు ఆకర్షింపబడ్డ ఎంతోమంది కవులు, నానీలు రాయడమే కాదు, పుస్తకాలు కూడా వేసారు. ఈ మధ్య కాలంలో ఫేస్‍బుక్ వంటి మాధ్యమాలలో ప్రత్యేకముగా ‘నానీలు’ గ్రూపు ఏర్పడడం, అనేకమంది ఆ గ్రూపులో నానీలు రాయడం గమనించవలసిన విషయం. అలాగే అనేక వాట్సప్ గ్రూపుల్లో వారంలో ఒకరోజు నానీల కోసం కేటాయించడం, సభ్యులు ఉత్సాహంగా నానీలు రాయడం ఆ ప్రక్రియ ప్రాచుర్యానికి మంచి ఉదాహరణలుగా చెప్పవచ్చు. తర్వాత మినీ కవిత్వం అనే ప్రక్రియ కూడా చాలామంది యువకవులను/కవయిత్రులను ఆకర్షించడమే కాకుండా, మినీకవిత్వం పుష్కలంగా రాసే పరిస్థితులు వచ్చాయి. అయితే చిన్నకథ రాయడం ఎంత కష్టమో, చిన్న కవిత (మినీ) రాయడం కూడా అంతకంటే కష్టం అని నా అభిప్రాయం. తక్కువ నిడివిలో ఎక్కువ అర్థాన్ని చెప్పగల అర్థవంతమైన కవిత్వమే మినీ కవిత్వం, ఇది అందరికీ సాధ్యం కాదని నా అభిప్రాయం.

నానీల తర్వాత, ‘నానోలు’ వచ్చాయి. వీటి సృష్టికర్త శ్రీ ఈగ హనుమాన్ గారు (2005 సంవత్సరం నుండి శ్రీ హనుమాన్ ‘నానోలు’ రాస్తున్నారు). నానో.. అంటే ‘సూక్ష్మాతిసూక్ష్మమైన ప్రక్రియ’ అనే భావంలో దీనిని ప్రయోగిస్తున్నారు. నానో టెక్నాలజీ ప్రాచుర్యంలోనికి వచ్చిన తర్వాత ‘నానో’ పేరుతో ఈ కవితా ప్రక్రియ ప్రసిద్ధిలోనికి వచ్చినప్పటికీ ‘నానీలు’ ప్రక్రియకు వచ్చినంత ప్రాచుర్యం వీటికి రాలేదనే చెప్పాలి. తర్వాత ‘రెక్కలు’ – కవితా ప్రక్రియ (2009 నుండి ఎం. కె. సుగంబాబు) వామీలు, మామీల పేర్లతో కొన్ని కవితా ప్రక్రియలు వెలుగులోనికి వచ్చాయి.

తర్వాత ప్రముఖంగా చెప్పుకోదగ్గవి ‘హైకూలు’. ఇది జపాన్ కవిత్వ ప్రభావంతో తెలుగు కవిత్వంలో వెలుగు చూసిన కవితా ప్రక్రియ. 1991 నుండి కవి ఇస్మాయిల్, ఈ కవితా ప్రక్రియను ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు. గాలి నాసర రెడ్డి గారు 1994 నుండి హైకూలు రాయడం ప్రారంభించారు. ఇలా రకరకాల పేర్లతో రకరకాల కవితాప్రక్రియలు తెలుగులో వెలుగు చూడడంతో నాకూ ఒక దురాశ పుట్టింది. అదెలాగో ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వచన కవిత్వంలోనూ, మినీ కవిత్వంలోనూ, నానీల ప్రక్రియలోనూ ఎంతో కొంత అభిరుచి, నా రచనా వ్యాసంగంలో ఒకభాగమూ అయినందువల్ల సులభమైన రీతిలో ఎక్కువమంది రాసే విధంగా ఒక నూతన ప్రక్రియను సృష్టించాలానే ఆలోచన నన్ను ‘ఆన్షి’ కవితా ప్రక్రియ వైపు ఉసిగొల్పింది.

అదెలాగంటే – పద్యం నాకు చాలా ఇష్టం. శ్రావ్యంగా పద్యం పాడేవాళ్ళంటే మరీ మరీ ఇష్టం. కానీ పద్యం నేను రాయలేను. ఎప్పుడో హైస్కూల్ స్థాయిలో నేర్చుకున్న ఛందస్సు, మచ్చుకి కూడా గుర్తు లేదు. దానిని ఈ ప్రత్యేకంగా ఈ వయసులో అధ్యయనం చేసే ఓపిక కూడా లేదు. అయితే పద్యం మీద మొహం సడలక పోవడంతో, ఛందస్సు లేని వచన పద్యాలు రాయాలనే కోరిక మనసులో మెదిలింది. అలా రాయొచ్చునో లేదోనని, సందేహ నివృత్తి కోసం మిత్రులు, గురుతుల్యులు, గొప్ప సాహతీవేత్త శ్రీ గన్నమరాజు గిరిజామనోహర్ బాబును సంప్రదించినప్పుడు వారు సంతోషంగా పచ్చ జండా ఊపారు. ఆ ధైర్యంతో కొన్ని వచన పద్యాలు రాసి తెలిసిన గ్రూపుల్లో పెట్టినప్పుడు, వాటిని చదివిన సాహితీ పెద్దలు డా. సి హెచ్ సుశీల గారు (రచయిత్రి, విమర్శకురాలు, సమీక్షకురాలు, మంచి ఉపన్యాసకురాలు, రిటైర్డ్ ప్రిన్సిపాల్) ఎంత గానో మెచ్చుకుని, ఈ ప్రక్రియకు ఒక పేరు పెట్టమని మంచి సూచన చేశారు.

‘ఆన్షిలు’ రాయమని ప్రోత్సాహం అందించిన సాహితీ పెద్దలు డా. సి.హెచ్. సుశీల (హైదరాబాద్)

వారి సూచన మేరకు నా ఈ కవితా ప్రక్రియకు ‘ఆన్షిలు’ అని పేరుపెట్టాము. ఈ పేరులోని ప్రత్యేకత ఏమిటంటే ‘ఆన్షి’ నా మనవరాలి పేరు. ఈ సందర్భంగా డా. సుశీల గారికి ఎంతగానో రుణపడి వుంటాను.

‘ఆన్షిలు’కు ప్రేరణ రచయిత మనవరాలు బేబి. ఆన్షి నల్లి. (హన్మకొండ)

‘ఆన్షి’లు రాయడం పెద్ద కష్టమైన పని కాదని నా ఉద్దేశం. వీటి ప్రధాన లక్షణాలను ఇక్కడ వివరిస్తాను.

1) మామూలుగా నాలుగు పాదాలు ఉండాలి. ప్రతిపాదంలోనూ ఇన్ని అక్షరాలు ఉండాలన్న నియమం లేదు.

2) చివరి పాదం మంచి ‘మకుటం’తో పూర్తి కావాలి. అది ఎవరి ఇష్టం వారిది, లేదంటే అర్ధవంతంగా, చదివాడానికి వినసొంపుగా ఉండాలి (నాకోసం ఈ ప్రక్రియకు రాసుకున్న మకుటం ‘వినుము కెఎల్వీ మాట నిజము సుమ్ము!’)

3) ప్రతి పాదంతో ప్రాస కలసి వచ్చేలా రాయగల నేర్పు ఉంటే పద్యానికి అందం వస్తుంది.

4) నాలుగు పాదాలూ ఒకదానితో ఒకటి సందర్భోచితంగా అర్ధవంతంగా ఉండాలి.

ఇవీ ఆన్షిల కోసం ఉండవలసిన ప్రధాన లక్షణాలు. ఇవి చదివిన తర్వాత నాకు కూడా బాగా అనిపించింది. ప్రయత్నిస్తే చాలామంది వర్ధమాన కవులు సైతం ఈ ప్రక్రియతో వచన పద్యాలు సులభంగా రాయగలరు. అలా అని శాస్త్రీయమైన ఛందస్సు పద్యాలను చిన్నబుచ్చడం కాదు, అది సాధ్యం కానీ వారికోసమే ఈ వచన పద్యాలు. ఈ ప్రక్రియ కూడా అధిక స్థాయిలో ప్రాచుర్యం లోనికి రావలసిన అవసరం వుంది. మాతృభాష అయిన తెలుగును క్లిష్టమైన భాషగా ఊహించుకుని, భయపడక ఇతరభాషలతో పాటు తెలుగుకు కూడా అధిక ప్రాధాన్యతను ఇచ్చే దిశగా ప్రతి తెలుగు బిడ్డా ముందుకు అడుగులు వేయాలని ఒక తెలుగు భాషా ప్రేమికుడిగా ఎల్లప్పుడూ కోరుకుంటాను. పాలకులకు తెలుగుభాష మింగుడుపడనప్పుడు అది కొంత నిర్లక్ష్యానికి గురికావచ్చునేమో కానీ, అది తాత్కాలికం అని మాత్రమే గుర్తించాలి.

జీవన రాగం శీర్షికతో, నేను రాసిన ‘ఆన్షి’ లను మెచ్చుకొని, వెన్నుతట్టి తమ పత్రికలలో ప్రచురించి ప్రోత్సహించిన ‘మొలక’ అంతర్జాల పత్రిక సంపాదకులు శ్రీ వేదాంత సూరి గారికి, ‘సంచిక’ అంతర్జాల పత్రిక సంపాదకులు శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారికీ, వారి సంపాదక వర్గానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

‘ఆన్షిలు’ కవితా ప్రక్రియను ప్రోత్సహించిన శ్రీ తిరునగరి వేదాంత సూరి (హైదరాబాద్)
సంచిక సంపాదకులు శ్రీ కస్తూరి మురళీకృష్ణ (హైదరాబాద్)

నేను కథలు రాసినా కవిత్వం రాసినా, వ్యాసం రాసినా, అందులోని మంచి చెడ్డలను సమీక్షించి శాస్త్రీయమైన చక్కని సూచనలు అందించే నా చిన్నన్నయ్య డా. మధుసూధన్ కానేటికి, ముఖ్యంగా ఈ ‘ఆన్షి’ల ప్రక్రియను ప్రోత్సహించినందుకు గాను ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. నా జీవితంలో, నా రచనా వ్యాసంగంలో ఇదొక కొత్త అధ్యాయంగా నేను భావిస్తాను.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here