Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-90

[box type=’note’ fontsize=’16’]”కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

అలా.. నేను ఎప్పుడూ అనుకోలేదు! అది.. నా స్థిరనివాస స్థలం అవుతుందని..!!

[dropcap]ఆ[/dropcap]లోచిస్తే కొన్ని విషయాలు ఆశ్చర్యంగానే అనిపిస్తాయి. ఎందుచేతనంటే అన్నీ అందరూ అనుకున్నట్టు జరిగిపోవు. పుట్టిననాటి నుండి గిట్టేనాటి వరకూ మనిషి ప్రయాణం ఎటు నుండి ఎటు పోతుందో, ఎలా పోతుందో, ఎందుకు పోతుందో ఎవరమూ ఊహించలేము. ఊహించినట్టుగా అన్నివిషయాలూ అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే అంతటి అదృష్టం మరింకేమి ఉంటుంది? అలా అని అనుకున్నవి అనుకున్నట్టు జరిగేది ఎందరికి? బహు కొద్ది మందికే అలా జరుగుతుంది.

మనిషి పుట్టుక ఎక్కడో, పెరిగేది ఎక్కడో, చదువు సంధ్యలు ఎక్కడో, ఉద్యోగం – సద్యోగం ఎక్కడో, బ్రతికి బట్ట కట్టేది ఎక్కడో, చివరికి కట్టెగా మిగిలేది ఎక్కడో ఎవరు మాత్రం చెప్పగలరు? దేవుడిమీద నమ్మకమున్న ఆస్తికులు అందరూ ‘అంతా దైవలీల’ అంటారు, అలా అనుకుని తృప్తి పడతారు. దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఆలోచిస్తారు నాస్తికులు. ఎవరు ఎలా అనుకున్నా జరిగేవి అలా జరిగిపోతూనే ఉంటాయి. మనం కేవలం ప్రేక్షకులు మాదిరిగా, జరిగేవన్నింటినీ చూస్తూ ఉండిపోతాం.

తగినన్ని ఆస్తిపాస్తులు వుండి, ఉన్నచోటనే తమ జీవితాలని తీర్చిదిద్దుకునేవారు కూడా వుంటారు. వారికి ఎక్కడికో పోయి ఉద్యోగం చేయాలనీ, ఉద్యోగంతోనే పొట్ట నింపుకోవలసిన నియమం అవసరం ఉండదు. వాళ్లకు అన్ని విధాలా కలిసొచ్చే జీవితం అది. అలాంటి జీవితం ఏ కొద్దిమందికో ప్రాప్తిస్తుంది. మిగతా వారి పరిస్థితి ఎంతమాత్రమూ అలా ఉండదు. జీవన యానంలో అందరూ ఇవి చవిచూచే అంశాలే, జీవిత సత్యాలే! అందుచేత ఎక్కువ శాతం మంది జీవితాలు ఎలా ప్రారంభం అవుతాయో, ఎలా ముగుస్తాయో ఎవరికీ తెలియదు.

ఊహించని రీతిలో అంచెలంచెలుగా కొనసాగిన నా జీవితం ప్రత్యేకమైనది, అతి తక్కువమందికి అవగాహన కాగలిగిన గూఢమైన జీవితం నాది. ఇలాంటి నా జీవితం శత్రువుకి కూడా ఉండకూడదని, కష్టాలు గుర్తుకు వచ్చినప్పుడల్లా నాకు అనిపిస్తుంది. కానీ, కష్టాలతో కొనసాగి, చక్కని మలుపు తిరిగి నన్నొక ప్రయోజకుడిని చేసిన నా జీవితం గొప్పదనే భావిస్తాను. అయితే కల్లోల భరితమైన జీవితానికి ఎదురుగా నిలిచి సుఖమయ జీవితాన్ని పొందగలగడం సామాన్యమైన విషయం కాదు. అదొక పెద్ద సమరం. దానిలో విజేతను కావడం నా అదృష్టమే! నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యఫలమే! నా సోదర సోదరీమణులు అందించిన సహకార బలమే అని నేను భావిస్తాను. నా అనుభవంలోనుంచి స్థిరపరుచుకున్న నా అభిప్రాయం ఇది.

దిండి (తూ. గో. జి) గ్రామంలో పుట్టి పెరిగి, అక్కడే ప్రాథమిక విద్యాబ్యాసం పూర్తి చేశాకా, తాలూకా కేంద్రమైన ‘రాజోలు’కు హైస్కూల్ విద్యకోసం వెళ్ళక తప్పలేదు. కారణం మా దిండి గ్రామంలో హైస్కూల్ లేకపోవడమే! మా గ్రామానికి కొంచెం దూరం తేడాలో హైస్కూల్ చదువుకునే సౌలభ్యం ఉండేది. రామరాజులంక, శివకోడు, మల్కీపురం, సఖినేటిపల్లి, రాజోలులో హైస్కూళ్లు అందుబాటులో వుండేవి. ఎందుకో మా అందరి చూపు రాజోలు హైస్కూల్ మీదనే ఉండేది. అలా రాజోలులో అప్పట్లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గొల్ల చంద్రయ్య గారు నడుపుతున్న వసతి గృహంలో ఉంటూ హైస్కూల్ చదువు ప్రారంభిచినప్పటికీ అది నాకు కలిసి రాలేదు. అందువల్లనే ఎనిమిదవ తరగతి పూర్తి చేయకుండానే అనారోగ్య కారణంగా హైదరాబాద్ వెళ్లడం, చికిత్స పూర్తికాగానే మెట్రిక్యులేషన్ పూర్తి చేయడం, ఇంటర్మీడియెట్ కోసం నాగార్జున సాగర్‌లో వున్న అక్క దగ్గరికి వెళ్లి చదూకోవడం, అది పూర్తికాగానే తిరిగి హైదరాబాద్‌కు వచ్చి, ఒక సంవత్సరం బి.ఎస్.సి. చదవడం, అలా చదూతుండగా బి.డి.ఎస్.లో సీటు రావడంతో, నా జీవన గమనమే పూర్తిగా మారిపోయింది. అదిగో అలా ఉస్మానియా వైద్య కళాశాలలో ఎం.బి.బి.ఎస్ చదువుతున్న ఎసెందర్ (తర్వాత పి.జి. చేసి ఎనాటమీ ప్రొఫెసర్ అయినాడు) పరిచయం అయినాడు. బహుశః నా సామాజిక వర్గానికి చెందినవాడు కావడం మూలాన నాకు మరింతగా దగ్గరైనాడని ఇప్పుడు అనిపిస్తుంది.

రచయితకు మొదట ‘హన్మకొండ’ చూపించిన మిత్రుడు డాక్టర్ ఎసెందర్
ఎనాటమీ ప్రొఫెసర్ గా డా.ఎసెందర్ (హైదరాబాదు)

మొదట్లో అతను ‘హన్మకొండ’వాసి అని నాకు తెలీదు. తర్వాత ఏవో సెలవులు వచ్చినప్పుడు నన్ను వాళ్ళ ఊరు హన్మకొండకు తీసుకుని వెళ్ళాడు. వాళ్ళ ఇల్లు నయీమ్ నగర్లో ఉన్నట్లు నాకు గుర్తు. అప్పటి వరకూ నాకు హన్మకొండ గురించి అసలు తెలియదు. అంతమాత్రమే కాదు భవిష్యత్తులో నేను హన్మకొండలో స్థిరపడతానని, అప్పుడు నేనసలు ఊహించలేదు. అవకాశం వెంట ఎటు తీసుకుపోతే అటు వెళ్ళిపోయాను.

పదవీవిరమణ అనంతరం రచయిత, డా.ఎసెందర్ (హన్మకొండ లో)

అలా బెల్లంపల్లి (సింగరేణి కాలరీస్) ఏరియా ఆసుపత్రిలో ఆరు నెలలపాటు పని చేయడం, ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం రావడం మూలాన అప్పటి వరంగల్ జిల్లాలోని, మహాహబూబాబాద్ తాలూకా (ఇప్పుడు జిల్లా అయింది) ఆసుపత్రిలో వరుసగా పన్నెండు సంవత్సరాలు పని చేయడం, ఆ తర్వాత జనగాం (ఇప్పుడు జిల్లా అయింది) లో పది సంవత్సరాలు పనిచేయడం – పదోన్నతిమీద కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో ఏడు సంవత్సరాలు పనిచేయడం సివిల్ సర్జన్‌గా పదవీ విరమణ చేయడం, హన్మకొండ (రామకృష్ణా కాలనీ)లో స్థిరనివాసం ఏర్పరుచుకోవడం వరుసగా జరిగిపోయాయి. ఇక్కడ స్థిరపడతానని నేను ఊహించలేదు, అనుకోలేదు. కానీ అది జరిగిపోయింది.

విద్యార్థులుగా హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో ఎసెందర్ మిత్రులతో
వేయి స్తంభాల గుడి (హన్మకొండ) దగ్గర

నాకు హైదరాబాద్ (డాయిన్స్ టౌన్‌షిప్)లో మంచి ఇల్లు ఉన్నప్పటికీ నేను ఇక్కడ హన్మకొండలో స్థిరపడడానికి ముఖ్య కారణం, నేను పనిచేసిన ప్రదేశాలన్నీ హన్మకొండకు దగ్గరగా ఉండడం వల్ల పరిచయస్థులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అంతా ఎక్కువమంది ఉండడం మూలాన ఇక్కడే స్థిరపడిపోవడానికి ప్రాధాన్యం ఇచ్చాను.

హన్మకొండలో రచయిత స్వప్న సౌధం (రామకృష్ణ కాలనీ)

అంతమాత్రమే కాదు, సాహిత్యప్రియుడిని కావడం మూలాన, వరంగల్ సాహిత్యరంగంతో నాకు సన్నిహిత సంబంధాలు అధికంగా ఉండడం మూలాన, హన్మకొండను ఆశ్రయించక తప్పలేదు. ఎప్పుడైనా హైదరాబాద్ వెళితే సాధ్యమయినంత త్వరగా హన్మకొండకు తిరిగి వచ్చేయడానికే ప్రయత్నం చేస్తాను. హన్మకొండతో నా అనుబంధం అలాంటిది మరి!

ఒకప్పుడు వరంగల్ జిల్లాలో భాగమైన ‘హన్మకొండ’ ఇప్పుడు జిల్లా స్థాయికి రావడం విశేషం!!

ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడో చదివి, మరెక్కడో పనిచేసి ఇక్కడ (హన్మకొండ) స్థిరపడడం కూడా విశేషమే కదా!

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version