[box type=’note’ fontsize=’16’] “కాలప్రభావానికి ‘నిండుకున్న’ పరిమళం సీసాలోని జ్ఞాపకాల సుగంధం మళ్ళీ ‘నిండిపోయింది’ మిగిలిన జీవితానికి సరిపడేంతగా” అంటున్నారు శ్రీధర్ చౌడారపు “జ్ఞాపకాల పరిమళం” కవితలో. [/box]
[dropcap]కా[/dropcap]లం కరిగిపోతూనే ఉంది
మండుటెండలోని మంచుముద్దలా
గంటలు నిమిషాలై పిదప క్షణాలై
చడీచప్పడు లేకుండా మాయమైపోయాయి
జీవనపోరాటంలో ఎప్పుడో దూరమైన
సహచర్యం ఎదురెదురై సందడిచేస్తే
ఏళ్ళక్రిందట విరజిల్లబడిన
జ్ఞాపకాల పరిమళం చుట్టుముట్టింది
కళ్ళు కళ్ళల్లోకి చూస్తూండిపోయాయి
హై ఫైయ్యంటూ చేతులు స్పర్శించుకున్నాయి
పెదాలు ఓ క్రమశిక్షణతో నృత్యంచేస్తోంటే
మాటలు మధురగీతాలై ప్రవహించాయి
కాలసర్పం విషం కక్కగా
మసకబారిన సంఘటనల చిత్రాల,
చెదిరిపోతున్న సంభాషణల అక్షరాల,
బతుకుపుస్తకం పుటలు మళ్లీ తెరువబడ్డాయి
నెమ్మదిగా నెమరువేయబడ్డాయి
మెల్లగా…మెల్లమెల్లగా….
కొద్దిగా … కొద్దికొద్దిగా…
ఆ మాటల మంత్రజాలంతో
కలిసిగడిపిన క్షణాల ప్రభావంతో
కాలప్రభావానికి “నిండుకున్న”
పరిమళం సీసాలోని జ్ఞాపకాల సుగంధం
మళ్ళీ “నిండిపోయింది”
మిగిలిన జీవితానికి సరిపడేంతగా
మెల్లగా చుట్టుముట్టిన చీకటి
చల్లగా చెప్పింది వీడుకోలుకు వేళయిందని
బ్రతికుంటే,…కాదు… కాదు..
‘బ్రతికుండీ’ మళ్ళీ కలుద్దామనే
బాసచేసుకుంటూ
భారమైన హృదయాలు రెండూ
బతుకుబాటపట్టాయి
అదో దిశలోనూ, ఇదింకోదిశలోనూ
దారిపొడవునా
తమ జ్ఞాపకాలపరిమళాన్ని
వెదజల్లుకుంటూ…