Site icon Sanchika

జ్ఞాపకాలు – వ్యాపకాలు-1

[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

[dropcap]6[/dropcap]0 ఏళ్ల నాటి మాట. 1960 జూన్‌లో నేను నెల్లూరు వెంకటగిరి రాజా కళాశాలలో పి.యు.సి (బై.పి.సి)లో చేరాను. అప్పుడు నా వయస్సు 13 దాటి 14 సంవత్సరాలు. కాలేజి పక్కనే హైస్కూల్ ఉండేది. ఒక రోజు కాలేజి గేట్ వద్ద నన్ను వాచ్‌మెన్ అడ్డుకున్నాడు, హైస్కూలు పిల్లలు ఇలా రాకూడదని. నా పుస్తకాలు చూపిన తర్వాత లోపలికి పంపాడు.

వి. ఆర్. కాలేజి పురాతనం. అప్పట్లో రేచాల సుబ్బారెడ్డి ప్రిన్సిపాల్. కళాశాల అధ్యాపకులు అప్పుడప్పుడే పరిచయమవుతున్నారు. నేను సంతపేటలో మా మేనమామల ఇంట్లో వుంటూ కాలేజికి రెండు మైళ్లు నడచి వెళ్లేవాడిని. 1962–65 మధ్య బి.ఏ స్పెషల్ తెలుగు డిగ్రీ చేశాను. ఏతా వాతా 1960 – 65 మధ్య కాలంలో ఎందరో కవి పండిత ప్రముఖుల పరిచయాలు లభించడం భాగ్యం.

సింహపురిలో:

కళాశాలలో దిగ్దంతులైన పండితులు ఆంగ్లాంధ్ర భాషలలో అధ్యాపకులు. ఈ కళాశాలలో లెక్చరర్‌గా పని చేసిన పి.సి.అలెగ్జాండర్ తర్వాతి కాలంలో మహారాష్ట్ర గవర్నరయ్యారు. తెలుగు శాఖాధిపతిగా దర్భా వెంకట కృష్ణమూర్తి పని చేశారు. ఆయన స్ఫురద్రూపి. ఆయన తర్వాత ఆ శాఖాధ్యాక్ష్యులుగా మా గురువర్యులు పోలూరి హనుమజ్జానకీరామశర్మ వచ్చారు. ఆయన ఆకారంలో లాల్‌బహదూర్ శాస్త్రి వలె వుండేవారు. బహునిష్ఠాపరులు. రామాయణ తరంగిణి, వాసుదేవ సుధ వంటి అనేక గ్రంథాలతో బాటు ఆంగ్లంలో Literary Criticism ప్రచురించారు. ఆంధ్ర భాషా సమతిని పునరుద్ధరించారు. 1964–65 సంవత్సరాలలో నేను ఆ సమితికి అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాలు నిర్వహించాము. ‘జానకీరామశర్మ నాకు తెలుగుపై మక్కువ పెంచార’ని భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సభాముఖంగా ప్రస్తావించారు. శర్మగారి స్మారక సంచికను నా సంపాదకత్వంలో వెంకయ్యనాయుడు గారి సౌజన్యంతో 2019లో ప్రచురించాము.

నెల్లూరు అనగానే కవిత్రయ కవులలో తిక్కన, ఎర్రన గుర్తుకు వస్తారు. అంతేగాక ఆనాటి కవి పండిత దిగ్గజాలు కనుల ముందు మెదులుతారు. ముందుగా  మా కళాశాల అధ్యాపక శ్రేణిని గుర్తు చేస్తాను. సూర్యాంధ్ర నిఘంటుకర్తలలో ఒకరైన పిశుపాటి విశ్వేశ్వర శాస్త్రి మాకు మూడేళ్లు కావ్య పాఠాలు చెప్పారు. ఆయన ప్రోత్సాహాలతో ఆయన, నేను ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమస్యాపూరణ కార్యక్రమానికి వారం వారం పూరణలు పంపాం. ఆయన గొప్ప పండితులు.

మరొక విద్వాంసులు కోట సుబ్రహ్మణ్యశాస్త్రి. మంచి కవి. గైడ్ల పితామహుడిగా పేరొందిన బడి గురవారెడ్డి, మద్దూరి సుబ్బారెడ్డి, వి.నారాయణరెడ్డి తెలుగు శాఖలో అధ్యాపకులు. ఆంగ్లశాఖలో దూర్భా రామమూర్తి ఘనాపాఠీ. అప్పట్లో బోటనీ డిపార్డుమంట్‌లో పని చేసిన పద్మనాభరావు తర్వాత ఆధ్యాత్మిక రంగంలో ‘ప్రోటోప్లాజం’ పేరుతో సన్యసించి రుషికేశంలో గడిపి ప్రస్తుతం అన్నారెడ్డిపాలం రామయోగి ఆశ్రమ అధిపతిగా ఉన్నారు.

నగరంలో లబ్ధప్రతిష్ఠులు:

నెల్లూరు నెరజాణలని పేరు ఎలా వచ్చిందో గాని, ఎందరో  కవి పండిత ప్రముఖులు సింహపురి సాహితీ జగత్తు నేలారు. వేదం వెంకట్రాయశాస్త్రిని నేను ఎరుగను గాని వారి సమీప బంధువు వేదం వెంకట్రామన్ కళాశాల ఆంగ్లోపన్యాసకులు. ఇటీవలే 2020 ఫిబ్రవరిలో కాలం చేశారు. స్టౌన్‌హౌస్‌పేటలో దీపాల పిచ్చయ్యశాస్త్రి వుండేవారు. నేను విజయవాడ ఆకాశవాణి డైరెక్టర్‌గా మా రికార్డింగ్ యూనిట్‌తో వారి యింటికి వెళ్లి వారి ఇంటర్వ్యూ రికార్డు చేశాను. వారి కుమారులు రాధాకృష్ణమూర్తి కావలి జవహర్ భారతి కళాశాల ప్రిన్సిపాల్, రెక్టార్‌గా వ్యవహరించారు. మరుపూరు కోదండరామిరెడ్డి జేమ్స్ గార్డెన్‌లో వుండేవారు. వారిని ఆర్కైవ్స్ కోసం రికార్డు చేశాను. మద్దాళి మల్లికార్జునరావు సాహీతీ ప్రియులు.

పరిశోధకులుగా పేరొందిన నేలనూతల శ్రీకృష్ణమూర్తి వృత్తిరీత్యా లాయరు. వారి సతీమణి రుక్మిణి రచయిత్రి. బి.ఇడి కళాశాలలో తెలుగు శాఖలో రామచంద్రుని వెంకటశేషయ్య ఉపన్యాసకులు. వారి ఇంటి పక్కనే నేను వుంటూ వారి ద్వారా సాహిత్య విషయాలు తెలుసుకున్నాను. చదలవాడ జయరామశాస్త్రి ట్రంక్ రోడ్డులో ఒక పుస్తకాల షాప్  నడిపేవారు. మోచర్ల రామకృష్ణయ్య గొప్ప కవి.

వేద సంస్కృత కళాశాల అతి ప్రాచీనం. అక్కడ ఉడాలి సుబ్బరామశాస్త్రి ప్రిన్సిపాల్. 1970లో వారి కళాశాలలో నా అష్టావధాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆనాటి సభకు మా గురువర్యులు కోట సుబ్రమణ్యశాస్త్రి అధ్యక్షులు. నాటి సభకు విచ్చేసి నా అవధానం ఆసాంతం తిలకించి నన్ను సన్మానించారు ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నరు బెజవాడ గోపాలరెడ్డి. వారితో నాకు రెండు దశాబ్దాల సన్నిహిత పరిచయం. కడప, విజయవాడ, హైదరాబాదు, ఢిల్లీ నగరాలకు వారు విచ్చేసినప్పుడు నన్ను ప్రత్యేకంగా పిలిపించి ఆదరించారు. కవిత్రయ జయంతులలో నన్ను సన్మానించారు. బెజవాడ గోపాలరెడ్డి స్మారక పురస్కారాన్ని 2004లో బి.వి.నరసింహం (కార్యదర్శి) నాకు అందించి స్వర్ణకంకణం తొడిగారు. గోసుకొండ వెంకటసుబ్బయ్య గోపాలరెడ్డికి, తిక్కవరపు రామిరెడ్డికి సన్నిహితులు.

తిక్కవరపు రామిరెడ్డి వదాన్యులు. వారి పేర నెలకొల్పిన స్వర్ణపతకం 1967లో నేను ఎం.ఎ.లో సర్వ ప్రథముడిగా వచ్చి తిరుపతి కాన్వొకేషన్‌లో అందుకున్నాను. వారి ఔదార్యంతో ఏర్పడిన కందుకూరు ప్రభుత్వ కళాశాలలో 1967–75 మధ్య తెలుగు అధ్యాపకుడిగా పని చేశాను. నెల్లూరు వి.ఆర్ కాలేజిలో నా అష్టావధానం తిలకించి వారు నన్ను సన్మానించారు.

రాజకీయ దురంధరులు:

స్వాతంత్రోద్యమ కాలం నుండి నెల్లూరు జిల్లా వాసికెక్కింది. వెన్నెలకంటి రాఘవయ్య గిరిజనోద్ధరణ కార్యక్రమాలలో ఆరితేరిన ఘనుడు. వి.వి.గిరి రాఘవయ్యతో వియ్యమొందారు. గోపాలరెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర సమాచార ప్రసార శాఖలో మంత్రిగా, ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరించిన రాజకీయ భీష్ములు. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కార్మిక శాఖ సహాయమంత్రిగా పని చేసిన కె.వి రఘునాధరెడ్డిని నేను పశ్చిమ బెంగాల్ భవన్‌లో ఆయన గవర్నరుగా వున్నప్పుడు కలిశాను. వారి సెక్రటరీ డి.వి.ఆర్. ప్రసాదరావు ఐఎఎస్ అధికారి.

రాష్ట్రపతి వి.వి.గిరి జీవిత చరిత్ర నా తొలి రచన. ఆ పుస్తకాన్ని గిరిగారికి ఢిల్లీ Western Courtలో స్వయంగా అందించాను. వారి కోడలు మోహినీగిరి కేంద్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు. ఆమెను ఢిల్లీలో తరచు కలిసేవాడిని. పార్లమెంటు సభ్యులుగా ఉభయ సభలలో సభ్యులైన బెజవాడ పాపిరెడ్డి నా శ్రేయోభిలాషి. రాష్ట్ర ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డిని నేను కడపలో 1994లో రికార్డు చేశాను.  ఆనం వెంకటరెడ్డి, రామనారాయణరెడ్డి, వారి కుటుంబ పెద్ద ఏ.సి.సుబ్బారెడ్డి గారులు నెల్లూరు రాజకీయ చతురులు. పార్లమెంటు సభ్యులు డి.కామాక్షయ్య, పి.పెంచలయ్య, చింతా మోహన్, రేబాల దశరథరామి రెడ్డి, పనబాక లక్ష్మి (మంత్రిణి), టి.సుబ్బరామిరెడ్డి, మాగుంట పార్వతమ్మ, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట సుబ్బరామిరెడ్డి ప్రభృతులతో పరిచయాలు ప్రగాఢం.

ప్రతిపక్షనేతగా ఎదిగిన ముప్పవరపు వెంకయ్యనాయుడు చదివిన బుచ్చిరెడ్డిపాలం హైస్కూలులో నేనూ చదివాను. ఆయన, నేను వి.ఆర్. కాలేజి విద్యార్ధులం. నేను ఆకాశవాణి ఢిల్లీలో పని చేస్తున్నప్పుడు ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి (2000). మా నాన్నగారి పేర ఏర్పాటు చేసిన అనంతలక్ష్మీకాంత సాహిత్య తొలి పురస్కారాన్ని వెంకయ్యనాయుడు చేతుల మీదుగా 2001లో డా. ఇలపావులూరి పాండురంగారావు కందించాం. ఉప రాష్ట్రపతి హోదాలో (2017 నుండి) ఆయన ఆదరాభిమానాలు నా పై మెండు.

జిల్లా పరిషత్ అధ్యక్షులుగా పని చేసిన నల్లపురెడ్డి చంద్రశేఖరరెడ్డి హయాంలో నేను అరవపాళం నాయుడుపేట హైస్కూలులోను, మర్రిపాడు (ఆత్మకూరు) హైస్కూలు లోను తెలుగు పండిట్‌గా  1967 జూలై డిసెంబరు మధ్య 55 రోజులు  పని చేశాను. మేనకూరు గోపాలకృష్ణారెడ్డి జిల్లా పరిషత్ రథసారధి, మేలబుచ్చిలో చదివే రోజుల్లో ఆయన పంచాయతీ అధ్యక్షులు.

కేంద్రంలో ఉపమంత్రిగా (కార్మిక శాఖ) పని చేసిన పులి వెంకటరెడ్డి కావలి నుంచి గెలిచారు. వారు మంత్రిగా ఉండగా శ్రమశక్తి భవన్‌లో కలిసినపుడు ఆ శాఖ అధికారులందరికీ నన్ను పరిచయం చేశారు.

శాసనమండలి సభ్యులు మాణిక్యాలరావు, మాధవరావు, డి.రామిరెడ్డి, రామకృష్ణయ్య, నెల్లూరి శ్రీరామమూర్తి, వై.సి. రంగారెడ్డిలను తరచు కలిసి వివిధ అంశాలపై రికార్డింగులు చేశాను.

పాత్రికేయ ప్రముఖులతో నాకు సన్నిహిత పరిచయాలు చిన్నప్పటి నుండి నాకు సహజం. జమీన్ రైతు శ్రీరామమూర్తి, వనమాలి నా రచనలను ఆదరించారు. యూత్ కాంగ్రెసు పత్రిక నడిపిన యల్.వి.కృష్ణారెడ్డి, లాయర్ పత్రికాధిపతి తుంగా రాజగోపాలరెడ్డి, సింహపురి పత్రిక సుబ్రమణ్యం నా సాహితీ వ్యాసంగానికి ఊతమిచ్చారు. సింహపురి పత్రికాధిపతి జనవరి ఆరవ తేది 1974లో నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థలో నా అష్టావధానం ఏర్పాటు చేశారు. అప్పుడు నాగారెడ్డి హరిశ్చంద్రారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు.

కావలి ప్రముఖలు:

కందుకూరు తాలూకా రచయితల సంఘం ఏర్పడినట్లే, కావలి తాలూకా రచయితల సంఘం కూడా ఏర్పడింది. దానికి పౌర సంబంధాల శాఖ వై.వి.వెంకటరత్నం ఆద్యులు. ఉభయ సంఘాలు ఒకసారి కావలిలో కవి సమ్మేళనం ఏర్పాటు చేశాం. అప్పుడు నేను ఆ సంస్థ అధ్యక్షుడిని. కావలి  జవహర్ భారతిలో నేను అవధానం చేశాను (23-2-1974). ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, యస్.వి.భుజంగరాయశర్మ, డి.వి. సుబ్బారాయుడు, రామకృష్ణమూర్తి, ఇంద్రగంటి భానుమూర్తి, కేసరి సుందరరామశర్మ పృచ్ఛకులు.

భుజంగరాయశర్మ విజయవాడ కేంద్రానికి వచ్చేవారు. జె.వి.సుబ్బారాయుడు  భద్రాచలం ప్రత్యక్ష ప్రసారాల వ్యాఖ్యాత. ఒకసారి దొడ్ల రామచంద్రారెడ్డి (DR) కావలి జవహర్ భారతి రెక్టార్ సౌజన్యంతో మా కందుకూరు కళాశాలకు దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి వచ్చి సభ నిర్వహించారు. వేదుల సత్యనారాయణశాస్త్రి ఆ జవహర్ భారతిలో అధ్యాపకులు. వారి కుమారులు వి.కృష్ణశాస్త్రి, నేను ప్రసారభారతిలో హైదరాబాదు దూరదర్శన్, రేడియోలలో పని చేశాం.

గూడురు సాంస్కృతీ సమితి వారు నా ప్రసంగం ఏర్పాటు చేశారు. ముదివర్తి కొండమాచార్యులు అక్కడి సుప్రసిద్ధ కవి. వాకాడలో తెలుగు శాఖలో సుబ్రమణ్యం సాహితీ పరుడు.

ఈ విధంగా సింహపురి సాహితీకేతనం రెపరెపలాడుతూ నా సాహితీ ప్రస్థానంలో పలువురిని పరిచయం చేసింది. అది కొనసాగుతూనే వుంది.

(సజీవులను స్మరించలేదు.)

Exit mobile version