జ్ఞాపకాలు – వ్యాపకాలు – 18

0
2

[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

దేశరాజధానిలో తొలి మెట్టు 1987-1990:

[dropcap]హై[/dropcap]దరాబాదులో ఐదేళ్లు జ్ఞాపకాలతో 1987 ఏప్రిల్‌లో బదిలీ మీద ఢిల్లీ వెళ్లాలి. ఏప్రిల్ 6న త్యాగరాయగాన సభలో డా.సి. నారాయణ రెడ్డి, దాశరథి, ఉండేల మాలకొండారెడ్డిగారల సమక్షంలో ఘనంగా అభినందన సభ ఏర్పాటు చేశారు. మర్నాడు పుష్పగిరి శంకరాచార్య స్వయంగా ఆశీస్సులందించారు. ఏప్రిల్ 9న ఢిల్లీ చేరుకొని ఆకాశవాణి శిక్షణా సంస్థలో చేరాను. మా శిక్షణా సంస్థ యావత్ భారతదేశ ఆకాశవాణి ఉద్యోగులకు నిరంతరం శిక్షణ అందిస్తుంది. 1987లో పార్లమెంటు స్ట్రీట్‌లోని ఆకాశవాణి భవన కార్యాలయం నుండి ఢిల్లీ నగర శివార్లలోని Kings way camp పరిసరాలలో నూతన భవనంలోకి  శిక్షణా సంస్థను మార్చారు. మూడంతస్తుల భవనంలో ఇంజనీరింగు, ప్రోగ్రాం సిబ్బందికి శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు, పక్కనే 200 గదుల హాస్టలు వసతి కల్పించారు. నగరానికి 20 కిలోమీటర్ల దూరం. అధ్యాపకులమైన మాకు పక్కనే క్వార్టర్లు తయారు చేస్తున్నారు.

నేను 9 ఉదయం 10 గంటలకు ఠంచన్‌గా ఆకాశవాణి భవన్‌కెళ్లాను. అక్కడ నాతో బాటు వి.జి.మాథ్యూ, మనోజ్ సిన్హా అధ్యాపకులు. డైరక్టర్‌గా యస్.కృష్ణన్ వ్యవహరిస్తున్నారు. సిబ్బంది వెళ్లడానికి ఒక పాత వ్యాన్ వుంది. ఆ డ్రైవరు 11 గంటలకు వచ్చాడు. మేము 12 గంటలకు ట్రైయినింగు సెంటర్ చేరుకొన్నాం. కృష్ణన్‌గారు తర్వాత కార్లో వచ్చారు. మరు వారమే కొత్తగా ఎంపికైన ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌లకు నెల రోజుల శిక్షణ ప్రారంభమైంది.

కాన్పూరు వలస:

నాకు క్వార్టర్ కేటాయింపుకు ఆలస్యం గావడానికి కారణం కొత్తగా కట్టిన క్వార్టర్సు నిర్మాణ దశలోనే వుండటం. బీహార్ గవర్నరు శ్రీ పెండేకంటి వెంకటసుబ్బయ్య గారికి ఫోన్ చేశాను. కొద్ది రోజులు బీహార్ భవన్‌లో గవర్నరు సూట్‌లో బస చేశాను. ఆ వారంలో మర్యాదపూర్వకంగా మా డైరక్టర్ జనరల్ అమృతరాన్ షిండేని కలిశాను. “మీరు వాణిజ్య ప్రసార విభాగాన్ని హైదరాబాదులో పకడ్బందీగా నిర్వహించారు. కాన్పూరులో వాణిజ్య ప్రసార విభాగం గొడవల్లో పడింది. మీరు రెండు నెలలు అక్కడ ఉండండి. మనకు రావలసిన బాకీలు లక్షలలో పేరుకుపోయాయి, అవి వసూలు అయ్యేంత వరకు అక్కడే వుండండి” అన్నారు. నాకు క్వార్టరు కేటాయింపుకు రెండు నెలలు పడుతుంది గాబట్టి అది ఒక వరంగా భావించాను.

డైరక్టరేట్‌లో వాణిజ్య ప్రసార విభాగం డైరక్టరు యం.యస్.బేడీని కలిసి కాన్పూరు గొడవల వివరాలు సేకరించాను. విలాయత్ జాఫరీ అనే డైరక్టరు రెండేళ్లుగా కాన్పూరులో పని చేసి నలభై లక్షల అప్పు ఏజెంట్ల దగ్గర నుండి రాబట్టలేదు. అక్కడ ఏజెంట్లు ఘనాపాఠీలు. 30 రోజుల అప్పు పెట్టవచ్చు. ఉత్తర ప్రదేశ్‌లోని తొమ్మిది ఆకాశవాణి కేంద్రాలకు కాన్పూరు వాణిజ్యప్రసార ప్రధాన కేంద్రం.

ఏజెంట్లు మిగతా కేంద్రాల అధికారులతో కుమ్మక్కు అయి ప్రసారమైన ప్రకటనల వివరాలు కాన్పూరుకు మూడు నెలలైనా పంపరు. అవి వస్తే తప్ప బిల్లింగ్ చేయలేరు. అలా ఆకాశవాణికి రావలసిన బాకీలు పెరిగిపోయాయి. అవసరమైతే అధికారులను బెదిరించగల సమర్ధులు ఏజెంట్లు. ఐనను పోయిరావలయు హస్తినకు అనట్లు నేను హస్తిన నుండి ఏప్రిల్ నెలాఖరులో బయలుదేరి కాన్పూరు చేరాను.

కాన్పూరు కేంద్రం మామూలు కార్యక్రమాలు ప్రసారం చేయదు. కేవలం ప్రకటనలే. కాంగ్రెస్ ప్రభుత్వంలో సమాచార ప్రసార మంత్రిత్వశాఖ సహాయ మంత్రి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ నియోజకవర్గమది. పట్టుబట్టి అక్కడ కేంద్రం ఏర్పాటు చేయించారు. ఉత్తరప్రదేశ్ అంతటికీ లక్నో రాజధాని కేంద్రం.

కొత్త వూరు కాబట్టి నేను ఆఫీసులోనే తాత్కాలిక బస కల్పించుకొన్నాను. ప్రోగ్రాం సిబ్బందితో సమస్య చర్చించాను. మిగతా తొమ్మింది కేంద్రాల నుండి ఆ నెలలో ప్రసారమైన ప్రకటనల వివరాలు  గత సంవత్సరకాలంగా అందడం లేదనేది వారి వాదన.  అదృష్టవశాత్తు రెండు రోజులలో లక్నోలో ఉత్తర ప్రదేశ్‌లోని అన్ని కేంద్రాల డైరక్టర్లు నెల వారీ మీటింగు జరిగింది. నేను హాజరై డైరక్టర్ జనరల్ కోపంగా ఉన్నరని చెప్పి వారినందరినీ హెచ్చరించి వారం లోపల మీ కేంద్రాల వివరాలతో అధికారులు వచ్చి నన్ను కలవాలనీ లేకపోతే బదిలీకి సిద్ధంగా వుండాలని చెప్పాను. లోపల నవ్వుకొన్నా, పైకి గంభీరంగా నటించాను.

వారం రోజుల్లో బాకీల లెక్కలు కట్టాం. దాదాపు 42 లక్షల అప్పులున్నాయి. ఏజెన్సీలను పిలిపించి పది రోజుల్లో బాకీలు, వడ్డీతో సహా చెల్లించకపోతే ఏజెన్సీ రద్దు చేస్తామని హెచ్చరించాను. ఒక రోజు సాయంకాలం ఒక ఏజెన్సీ పెద్ద మనిషి వచ్చి నన్ను కలిసి ఈవెనింగు సిట్టింగ్ కూచొందాం అని ప్రలోభపెట్టాడు.

“I will not accept sitting or sleeping” అని గంభీరంగా చెప్పి తరిమివేశాను.

దైవవశాత్తు నెల రోజులలోపల మూడు వంతుల బాకీలు చెల్లించారు. అక్కడి లోపాలతో ఒక సమగ్ర నివేదికను షిండేగారికి సమర్పించి నేను ఢిల్లీకి తిరుగు ప్రయాణం కట్టాను. నేను సూచించినట్లుగా అక్కడ ఊడలు దిగిన వటవృక్షాలను, లోగడ పని చేసిన డైరక్టరును, ప్రస్తుత ఇంజనీరును, అకౌంటెంటును మార్చారు. అదొక ప్రత్యేకానుభవం. నా చాకచక్యం వల్ల పని పూర్తి అయింది. మే నెలాఖరుకు ఢిల్లీ చేరి ఒక నెల సెలవు పెట్టాను. క్వార్టర్ పూర్తికావడానికి టైం పట్టేలావుంది.

మా పిల్లలకు అదృష్టవశాత్తు ఆంధ్రా ఎడ్యూకేషన్ సొసైటీవారి I.T.O.లో ఆంధ్రా స్కూలులో సీట్లు దొరికాయి. రెండేళ్ల కొకసారి నా బదిలీల వల్ల వాళ్ల చదువులకు గడ్డు కాలం వచ్చేది. అయినా వారు పండిత పుత్రులనిపించుకోలేదు. ముగ్గురూ పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి జీవనగమనంలో ఉన్నతోద్యోగాలలో లక్షలు ఆర్జిస్తున్నారు. జూన్ నెలాఖరులో మకాం ఢిల్లీ మార్చాము. క్వార్టర్ ఇంకా పది రోజులకుగాని తయారు కాలేదు. వార్తవిభాగంలో రిపోర్టరు మల్లాది రామారావుగారి లోఢి కాలనీలో మాకు బస కల్పించే సహృదయులు వారు. రెండు వారాలు వారి వద్ద వున్నాం. జులై రెండో వారంలో నిరంకారీ కాలనీలోని ప్రభుత్వ క్వార్టర్ లో అన్ని వసతులూ పూర్తికాకపోయినా చేరిపోయాం.

వివిధ శిక్షణలు:

1987-90 మధ్య మూడు సంవత్సరాల కాలంలో ఎన్నో ట్రైయినింగులు ఏర్పాటు చేశాం. మూడు సంవత్సరాలలో ముగ్గురు డైరక్టర్లు మారారు. తొలుత కృష్ణన్ డైరక్టర్. ఆయన ప్రమోషన్ పొంది డిప్యూటి డైరక్టర్ జనరల్ అయ్యారు. తర్వాత సి.ఆర్.రామస్వామి వచ్చారు. నగరానికి దూరంగా వుండటం వల్ల అక్కడి పోస్టింగు ఎవరూ సుఖంగా భావించరు. ఆఫీసు పక్కనే మా నివాసం గాబట్టి నాకు ఇబ్బంది లేదు.

రాజీవ్ గాంధీ ప్రధానిగా ఒక ప్రధాన నిర్ణయం తీసుకొన్నారు. అన్ని దశలలో ఉద్యోగులకు శిక్షణ యివ్వాలి. శిక్షణ యిచ్చేవారు ప్రతిభావంతులుగా వుండాలి. వారికి 30 శాతం జీతం (బేసిక్) అదనంగా ఇవ్వాలి. ఆ అవకాశం నాకు అనుకోకుండా లభించింది. దానికిగా ఎంపిక కమిటీ ఏర్పాటు చేశారు.  నేను మూడేళ్లు  ఆ అధిక జీతం అందుకున్నాను. నా సహోద్యోగులు కొందరు ఈర్ష్య పడ్డారు.

రామస్వామికి డి.డి.జి ప్రమోషన్ వచ్చింది. ఢిల్లీ స్టేషన్ డైరక్టరుగా వున్న యస్.కె.శర్మను మా డైరక్టరుగా వేశారు. ఆయన మృదుస్వభావి. నన్ను బాగా అభిమానించారు. ఫలితంగా పని భారం పెరిగింది.

వివిధ ప్రాంతాలలో శిక్షణ:

మా డైరక్టరు అభిమానం సంపాదించాను గాబట్టి బయట కేంద్రాలకు నన్ను పంపేవారు. 1987 సెప్టెంబరులో రెండు వారాలపాటు రాజస్థాన్‌లోని కోట ఆకాశవాణి కేంద్రంలో కౌలాలంపూరులోని అంతర్జాతీయ సంస్థ A.I.B.D వారు REARSON INTERNATIONAL సంస్థవారు ఒక శిక్షణ ఆకాశవాణి ఉద్యోగులకిచ్చారు. దాని పర్యవేక్షణ బాధ్యత నాకప్పగించారు.

16 మంది సిబ్బంది శిక్షణ ఇచ్చాం. దాని విషయం DEVELOPMENT BROADCAST సెమినారు observer గా నేను సమన్వయం చేశాను. అదొక అనుభూతి.

నిధుల కొరత:

ప్రభుత్వంలో శిక్షణకు అతి తక్కువ ప్రాధాన్యమిస్తారు. అందువల్ల 1987-88 ఆర్ధిక సంవత్సరంలో అక్టోబరు నుండి డిసెంబరు వరకు నిధులకొరత వల్ల ట్రైనింగులు నిలిపివేశారు. అంటే 90 రోజులు హాలీడే. ఖాళీగా కూర్చోవడం నాకలవాటు లేదు. డైరక్టరేట్ కెళ్లి ఇన్‌స్పెక్షన్ డైరక్టర్ జనరల్‌ని కలిసి “నాకు పని ఇవ్వండి” అని అడిగాను. డి.పి.రామచంద్ర ఆ విభాగానికి అధిపతి. ఆయన హైదరాబాదు వచ్చి నా పని తీరు గమనించారు.

వెంటనే అంగీకరించి మూడు ఢిల్లీలోని ఆకాశవాణి విభాగాల ఇన్‌స్పెక్టన్ మూడు నెలల్లో పూర్తి చేయామని ఆర్డరు ఇచ్చారు. 1. ఢిల్లీ వాణిజ్యవిభాగం. 2. వార్తా విభాగం. 3. విదేశీ ప్రసారాల విభాగం. ఈమూడింటికి ఇన్‌స్పెక్షన్ ఐదు సంవత్సరాలుగా జరిగి ఎరగరు. అయినా వారు నాకు సహకరించారు. నేను శక్తివంచన లేకుండా మూడు విభాగాల పాత రికార్డులు సరి చూసి లోపాలు. సలహాలు తయారు చేశాను. చివరలో ఆయా శాఖాధిపతులతో సమావేశం జరిపాను. వారందరూ నా పని తీరు మెచ్చుకొన్నారు. ఆ విదంగా పని కల్పించుకొన్నాను.

కౌలాలంపూరు వారి శిక్షణ:

ప్రసార రంగంలో పని చేసే శిక్షణ అధ్యాపకులకు కౌలాలంపూరులోని Asian Institute for Broadcast Development సంస్థవారు భారత దేశంలో ఆకాశవాణిలో పని చేస్తున్న 12 మందికి శిక్షణ నెల రోజులు ఏర్పాటు చేశాను. అందులో నన్ను ఎంపిక చేశారు. హ్యూ డిసెల్వా అనే డైరక్టరు మాకు శిక్షకుడు. ప్రసార రంగంలో వస్తున్న మార్పులు, వాటిని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమ రూపకల్పన గూర్చి అద్యయనం చేశాము.

డిసెల్వాతో చర్చల  సందర్బంలో నా జ్యోతిష ప్రవేశ ప్రస్తావన వచ్చింది. ఆయన మా యింటికి వచ్చి తాను భవిష్యత్తులో ఆ సంస్థకు కౌలాలంపూరులో అధిపతినవుతానా చెప్పమన్నాడు. జాతక చక్రం తయారు చేసి రెండేళ్లలోపు వస్తుందని చెప్పాను. అదే ప్రకారం లభించింది. ఆయనకు నమ్మకం కుదిరి ఆయన స్నేహితుడు World Health Organization లో పని చేసే సింహళ దేశస్థుడు అరసె కులరత్నను నా వద్దకు తర్వాత పంపి ఆయన భవిష్యత్తు గూర్చి చెప్పమన్నాడు. జోతిష్యం, వైద్యం నిరంతరం అని నానుడి. అ రెండింటితో నిరంతరం అందరికీ అవసరం  వుంటుంది. అదొక అద్భుత విద్య.

నెల రోజుల శిక్షణ మంచి జ్ఞానాన్ని కలిగించి తరువాతి కాలంలో వివిధ విశ్వవిద్యాలయాలలోను, శిక్షణ సంస్థలలోను అనుబంధం పెంచుకొనే అవకాశం కల్పించింది. ఢిల్లీలోని Indian Institute of Public Administration సీనియర్ అధికారులకు ఇచ్చే శిక్షణలో మాట్లాడాను. సివిల్ సర్వీసులలో గెలిచిన  Indian Information service ఆఫీసర్లకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్‌లో ప్రసంగించాను. హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీలోను, మానవవనరుల అభివృద్ది సంస్థలోను, వివిధ విశ్వవిద్యాలయాలలోను, శిక్షణార్ధులతో నా అనుభవాలను పంచుకున్నాను. రెండేళ్ల హైదరాబాదు అనుభవము, మూడేళ్లు ఢిల్లీలో శిక్షణాద్యాపకుడిగా పని చేయడము వల్ల దేశంలోని ఆకాశవాణి అధికారులంతా నన్ను గురుభావంతో ఎప్పుడూ ఎక్కడ కలిసినా గౌరవించారు, ఆదరించారు. అదొక మధురానుభూతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here