Site icon Sanchika

జ్ఞాపకాలు – వ్యాపకాలు-2

[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

[dropcap]అ[/dropcap]ది 1965వ సంవత్సరం. నాకు 18 ఏళ్లు నిండాయి. బి.ఏ డిగ్రీ సెకండ్ క్లాస్‌లో ప్యాసయ్యాను. తెలుగు స్పెషల్, హిస్టరీ, ఎకనామిక్స్‌లతో వి.ఆర్.కాలేజీ నుండి డిగ్రీ సంపాదించాను. ఎం.ఏ చదవాలని కోరిక. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1965 జూన్ నెలలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ నీలకంఠం ఇంటర్వ్యూ నిర్వహించి సీటు ఇచ్చారు. గెజిటెడ్ ఆఫీసరు సంతకం కోసం యూనివర్శిటీ సంస్కృత విభాగం అధ్యాపకులు కొంపెల్ల దక్షిణామూర్తి వద్దకు కపిలతీర్థం రోడ్డులోని వారి ఇంటికెళ్లాను. ఆయన ఆప్యాయంగా మాట్లాడి సంతకం పెట్టారు. అదే సంవత్సరం మాతో బాటు వారి కుమార్తె భాస్కరశేషారత్నం కూడా  తెలుగు చదివింది.

తెలుగు శాఖలో:

1965 జూన్‌లో నేను ఎం.ఏ తెలుగు క్లాసులో కొత్తగా నిర్మించిన ఆర్ట్స్ బ్లాకులో చేరాను. అప్పటి వరకు తెలుగు శాఖాధ్యక్షులుగా వున్న ఆచార్య పింగళి లక్ష్మీకాంతం అప్పుడప్పుడే రిటైరయ్యారు. వారు కోటకొమ్మల వీధిలో ఉండేవారు. వారు మా గురువు పోలూరి హనుమజ్జానకీరామశర్మకు గురువు. ఆ బాంధవ్యాన్ని గుర్తు చేసి వారిని కలిసి ఆశీర్వచనం తీసుకొన్నాను. మేము ప్రీవియస్ 14 మంది విద్యార్థులం. మా క్లాసులో నలుగురు అమ్మాయిలు. సి.మనోజ, టి.ఉషారాణి, భాస్కరశేషారత్నం, ఉదయిని. ఆ నలుగురులో మొదటి ఇద్దరు మదరాసు కళాశాలలో ఉపన్యాసకులుగా, చివరి ఇద్దరు తిరుపతి పద్మావతీ మహిళాకళాశాలలో ఉపన్యాసకులుగా పని చేశారు.

మగవారిలో వయసులో పెద్ద బండ్లమూడి సత్యనారాయణ. ఆయన ఏలూరు సి.ఆర్. రెడ్డి కళాశాలలో ట్యూటర్‌గా పని చేస్తూ సెలవు మీద వచ్చి ఎం.ఏ చేశారు. మళ్లీ అదే కాలేజీలో లెక్చరర్‌గా పని చేసి రిటైరయ్యారు. అధ్యాపక వర్గంలో సీనియర్ రీడర్‌గా డా. జి.యన్.రెడ్డి ఉన్నారు. కొద్ది నెలల్లో ప్రొఫెసర్ అయ్యారు. రీడర్లుగా కోరాడ మహాదేవశాస్త్రి, జీరెడ్డి చెన్నారెడ్డి, జాస్తి సూర్యనారాయణ ఉన్నారు. తిమ్మావజ్ఝల కోదండరామయ్య, పంగనమల బాలకృష్ణమూర్తి ఉపన్యాసకులు. యస్.అక్కిరెడ్డి ట్యూటరు. దరిమిలా ఉపన్యాసకులుగా జి.నాగయ్య, మద్దూరి సుబ్బారెడ్డి తెలుగు శాఖలో చేరారు.

పరిశోధకులు:

1965-67 మధ్య కాలంలో నేను ఎం.ఏ చదివిన రోజుల్లో తెలుగు శాఖలో పరిశోధక విద్యార్థులుగా పి.వి.ఆర్. ప్రసాదరావు (ప్రసాదరాయ కులపతి,  ప్రస్తుత కుర్తాళం పీఠాధిపతి) యల్.బి.శంకరరావు, తంగిరాల సుబ్బారావు, భాస్కరచౌదరి అధ్యయనం చేస్తున్నారు. అప్పట్లో యు.జి.సి. పరిశోధన విద్యార్థులకు 300 రూపాయల ఫెలోషిప్ ఇచ్చేది. అందువల్ల ఉద్యోగాలు లభించేంత వరకు ఫెలోషిప్ పొందుతూ పరిశోధకులుగా వుండేవారు.

అరుణాచలంలో చలం:

జి.యస్.రెడ్డి విదేశాలలో విస్కాన్సిక్ యూనివర్శిటీలో లింగ్విస్టిక్ శాఖలో రీడరుగా పని చేసి తిరుపతి వచ్చారు. అందువల్ల విద్యాబోధనలో కొత్త ప్రయోగాలు ప్రవేశపెట్టారు. ఎం.ఏ విద్యార్థులను టూర్ తీసుకెళ్లారు. సాతనూరు డ్యామ్ దర్శించి రమణాశ్రమానికి అరుణాచలం వెళ్లాం. అక్కడ గుడిపాటి వెంకటచలం ఆశ్రమవాస జీవితం గడుపుతున్నారు. వారిని మేం అందరం కలిశాం. చలం మ్యూజింగ్స్ పుస్తకాలు చదివి ఉన్నాను గాబట్టి ఆయనతో ముఖాముఖీలో ఏదో ప్రశ్న వేశాను. ఆయన సాహిత్యపరమైన సమాధానమిచ్చారు. తెలుగు శాఖ విద్యార్థులు టూర్ వెళ్లడం విశేషం.

అష్టావధానం:

నేను ఎం.ఏ ఫైనల్ విద్యార్థిగా ఉండగా తిరుపతి యూనివర్శిటీలో సి.వి.సుబ్బన్న శతావధాని అష్టావధాన కార్యక్రమాన్ని తెలుగు శాఖలో ఏర్పాటు చేశారు. అప్పటి రిజిష్ట్రార్ వై.విశ్వనాథం సభాధ్యక్షులు. ప్రముఖ సాహితీవేత్త రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ ముఖ్య అతిథి. అవధానంలో పృచ్ఛకులుగా గౌరిపెద్ది సుబ్బారామశర్మ వంటి పండితులు కూచున్నారు. గంటలు కొట్టడానికి విద్యార్థినైన నన్ను కూచోబెట్టారు. అవధానానంతరం ఏ బ్లాకులో నేను మా రూమ్‌మేట్ ఏ.వి.సుబ్బారావు (శాతవాహన కళాశాల లెక్చరర్) దగ్గర అవధానంలో అవధాని చెప్పిన సమస్యాపూరణ, దత్తపది, వర్ణన, వ్యస్తాక్షరి పద్యాలను యథాతథంగా అప్పగించాను. అలా నాలో అవధాన బీజాలు పడ్డాయి.

నేను అవధానాలు కందుకూరులో మొదలు పెట్టి వివిధ ప్రాంతాలలో దిగ్విజయంగా చేశాను. యూనివెక్స్ ఎగ్జిబిషన్ సందర్భంగా తిరుపతిలో యూనివర్శిటీ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో తెలుగు శాఖ పక్షాన జి.యన్.రెడ్డి నా అష్టావధానం ఏర్పాటు చేశారు. ఆనంద నామ ఉగాది సందర్భంగా 24 మార్చి 1974న ఆచార్య జీరెడ్డి చెన్నారెడ్డి అధ్యక్షతన సభ జరిగింది. దరువూరి వీరయ్య దత్తపది, డా. పి. వి. అరుణాచలం వ్యస్తాక్షరి, యం.భాస్కరనాయుడు సమస్య, కామిశెట్టి శ్రీనివాసులు శెట్టి అప్రస్తుత ప్రసంగం, ముట్నూరి సంగమేశం నిషిద్ధాక్షరి, జవాద్ హుస్సేన్ ఆశువు, శేషాద్రి పురాణపఠనానికి పృచ్ఛకులుగా వ్యవహరించారు. వ్యస్తాక్షరిలో నేను చెప్పిన సంస్కృత శ్లోకం రక్తి కట్టింది.

దయమానా సితాపాంగం
సప్తగిరీంద్ర వాసితం
ఆనందనామ వత్సరే
నమామి వేంకటేశ్వరం

వైస్ ఛాన్సలర్ సతీమణి లక్ష్మీ జగన్నాథ రెడ్డి సభానంతరం నన్ను సన్మానించారు.

వివిధశాఖల అధిపతులు:

తిరుపతి విశ్వవిద్యాలయంలో అప్పుడు మిల్టన్ కవితా పరిశోధకులు ఆచార్య మువ్వ రామశర్మ ఆంగ్ల శాఖాధ్యక్షులు. ఆయనకు మిల్టన్ అంటే విపరీతమైన అభిమానం. ఆయన యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌గా తర్వాత ఎంపికయ్యారు. అదే యూనివర్శిటీ నుండి ఆచార్యుల నుండి వైస్ ఛాన్సలర్‌గా ఎంపికైన తొలి వ్యక్తి ఆయన, చరిత్ర విభాగంలో మారేమండ రామారావు 1965లో రిటైరయ్యారు. వి.యం.రెడ్డి ఆ శాఖ అధ్యక్షులయ్యారు. రామశర్మ తర్వాత తెలుగు శాఖాధిపతి జి.యన్.రెడ్డి 1982లో వైస్ ఛాన్సలర్ అయ్యారు.

సంస్కృత విభాగంలో, హిందీ విభాగంలో దిట్టమైన పండితులుండేవారు. దేవస్థానం ఆర్ట్స్  కళాశాల (డబ్బారేకుల కాలేజి) అధ్యాపకులుగా సింగరాజు సచ్చిదానందం, కామిశెట్టి శ్రీనివాసులు శెట్టి, వీరయ్య, శేషాద్రి ప్రభృతులు, ప్రిన్సిపాల్‌గా సముద్రాల నాగయ్య పని చేసేవారు. ఓరియంటల్ కళాశాల (1966లో) గోవిందరాజస్వామి గుడి పక్క ప్రస్తుత మ్యూజియం ఉన్న చోట వుండేది. గౌరిపెద్ది సుబ్బరామశర్మ, సముద్రాల లక్ష్మణయ్య, డి.నాగసిద్ధారెడ్డి ప్రభృతులు అధ్యాపకులు.

తిరుపతి సంస్కృతీ విలసిత క్షేత్రం. మానవల్లి రామకృష్ణ కవి వంటి వారు సంచరించిన ప్రదేశం. వేటూరి ప్రభాకర శాస్త్రి, సాధు సుబ్రమణ్యశాస్త్రి మొదలగు పరిశోధకుల పుట్టినిల్లు. ప్రాచ్య పరిశోధనా సంస్థ దేవస్థానం అధీనంలో వుండేది. తర్వాత యూనివర్శిటీ పరిధిలోకి మారింది. డా.శంకరనారాయణ ఆ సంస్థ అధిపతి. దేవస్థానం పక్షాన వెలువడే సప్తగిరి పత్రిక మొదటి సత్రంలో (రైల్వేస్టేషన్ వెనక) ఉండేది. కె.సుబ్బారావు దాని ఎడిటర్.

లోక్‌సభ స్పీకర్‌గా పని చేసిన మాడభూషి అనంతశయనం అయ్యంగార్ పదవీ విరమణానంతరం, గంగుండ్ర మండపం సమీపంలో నివసించారు. వారిని నేను కడప కేంద్రానికి రికార్డింగు చేసి ‘సభాపతిగా నా అనుభవాలు’ చెప్పించాను. అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసిన అగరాల ఈశ్వరరెడ్డి రాజకీయ ప్రముఖులు.

1967లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆచార్య యన్.జి.రంగా తిరుపతి నుండి లోక్‌సభకు స్వతంత్ర పార్టీ తరుపున నిలబడ్డారు. స్వతంత్ర పార్టీ ప్రధాన కార్యదర్శి మినూమసానీ బహిరంగ సభ గోవింద రాజస్వామి పుష్కరిణి వద్ద జరిగింది. ఆయన ధారళంగా చేసిన ప్రసంగం ఆసక్తిగా నేను విన్నాను. దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం.ఉమాపతి తిరుపతి రామాలయంలో జరిగే ఉత్సవాలకు స్వయంగా హజరయ్యేవారు. చెలికాని అన్నారావు, వెంగళరావు హయాంలో దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్‌గా నియమితులయ్యారు. దేవస్థాన కార్యాలయం గోవిందరాజస్వామి గుడి వెనుక భాగంలో వుండేది.

ప్రజావాహిని:

తిరుపతి నుండి ప్రజావాహిని అనే వారపత్రిక వచ్చేది. నేను ఎం.ఏలో ఉండగానే ఆంధ్ర పత్రికలో ‘ఉద్గ్రంథం వ్రాయాలంటే’ అనే వచన కవిత ప్రచురించాను. కాకినాడ నుండి వెలువడే త్రైమాసిక పత్రిక ‘ఆంధ్ర సారస్వత పరిషత్’ పత్రికలో నేను వ్రాసిన ‘ఉత్తర రామాయణము-తిక్కన’, ‘కలకంటి పాపరాజు’ వ్యాసం 1967లో ప్రచురితమైంది. ఆ పత్రికలో దిగ్దంతుల వ్యాసాలే వచ్చేవి. జమీన్ రైతు వారపత్రిక నా కవితలు, కథ, వ్యాసాలు ప్రచురించింది. స్రవంతి మాస పత్రికకు వ్యాసాలు పంపాను. ప్రచురించారు.

‘ప్రహ్లాదుని భక్తిభావము’ అనే పెద్ద వ్యాసం వ్రాసి ప్రజావాహిని ఆఫీసు కెళ్లి ఎడిటర్‌ని కలిశాను. నా వయసు 19 సంవత్సరాలు. భక్తి భావంపై సుదీర్ఘ వ్యాసం చూసి ఆయన అభినందించి రెండు వారాలు ఆ వ్యాసం ప్రచురించారు. వి.ఆర్. కాలేజిలోను, యూనివర్సిటీలోను కళాశాల మాగజైన్‌లలో నా వ్యాసాలు ప్రచురించారు.

సెమినార్:

ఎం.ఏ విద్యార్థుల్లో వక్తృత్వ పటిమ పెంపొందించడానికి మా ప్రొఫెసరు జి.యన్.రెడ్డి సెమినార్ విధానాన్ని 1966లో ప్రవేశపెట్టారు. సెప్టెంబరు 5, 1966న తొలి వ్యక్తిగా ఎం.ఏ ఫైనల్ విద్యార్థినైన నేను గంట సేపు సెమినార్ ప్రజెంటేషన్ ఇచ్చాను. బోర్డు మీద వ్రాస్తూ 50 నిముషాలు మాట్లాడాను. అంశం – బాల ప్రౌఢలు సాధింపని వ్యాకరణ విశేషాలు. మొదటి సంవత్సరం వ్యాకరణ పాఠాలు చెబుతూ తిమ్మావజ్ఝల కోదండరామయ్య మేష్టారు మాకు చెప్పిన విశేషాలను వివరించి శభాష్ అనిపించుకొన్నాను. బాల వ్యాకరణంలోని సంజ్ఞ సంధి, తత్యమ పరిచ్ఛేద సూత్రాలు నాకు బి.ఏలోనే కంఠతా వచ్చు. అందువల్ల ప్రసంగం నల్లేరు మీద బండినడకలా సాగింది. ఎం.ఏ రెండు సంవత్సరాల విద్యార్థులు, అధ్యాపకుల ముందు ప్రసంగించడం విశేషం. అది  సెప్టెంబరు 5 అధ్యాపక దినోత్సవం కావడం మరో విశేషం. తరువాత ఎనిమిదేళ్లు నేను కళాశాల అధ్యాపకుడిగా కందుకూరులో పని చేయడానికి అది నాంది.

ఆ ప్రసంగ పాఠాన్ని 1969లో నేను భారతి మాస పత్రికలోను, ఏలూరు నుండి వెలువడే సాహితిలోను ప్రచురించాను. వ్యాకరణ పాఠాలు నేను డిగ్రీ విద్యార్థులకు బోధించాను. తిరుపతిలో నేను రామాలయం పక్కనే మంచాల వీధిలో ఒక ఏడు నా మిత్రుడు జూటూరు వెంకటేశ్వర్లుతో కలిసి వుండేవాడిని. సాయంకాలాలు రామాలయానికి నిత్యం వెళ్లి దర్శనానంతరం ప్రసాదాలు స్వీకరించేవాడిని. అప్పటికింకా గుడికి ఇప్పుడున్న హంగులు పూర్తికాలేదు. ఎదురుగా భారీ ఆంజనేయస్వామి విగ్రహం. కేవలం పరీక్షల సమయంలోనేగాక నిత్యం హనుమను సేవించుకున్నాను. ఎం.ఏ రెండో సంవత్సరం 1966-67 పబ్లిక్ యూనివర్శిటీ హాస్టల్‌లో బస చేశాను. అదొక మధుర స్మృతి.

Exit mobile version