Site icon Sanchika

జ్ఞాపకాలు – వ్యాపకాలు – 20

[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

అధికారుల ఆదరాభిమానాలు:

[dropcap]నా [/dropcap]జాతకంలో బుధ, గురు గ్రహ వీక్షణం వల్ల పలువురు ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్. అధికారులతో ఆత్మీయంగా మెలిగే అవకాశం నా జీవితంలో కలిగింది. వస్తుతః నా orbit లోకి వచ్చిన ఏ వ్యక్తి పరిచయాన్ని నేను దూరం చేసుకోలేదు. వారు పదవీ విరమణ చేసినా తరచు ఫోన్‌లో సంభాషిస్తూ ఆ బంధాన్ని పోషించాను.  ప్రసారభారతిలో 30 ఏళ్ళ జీవనగమనంలో 1975-2005 మధ్య పది సంవత్సరాలు కడప, అనంతరపురం కేంద్రాలలో పని చేశాను. అందువల్ల అక్కడ కలెక్టర్లుగా పని చేసిన అధికారులతో అనుబంధం ఏర్పడింది. నేను 1975 ఆగస్టు 16న – అంటే సరిగ్గా ఈ రోజుకు 45 సంవత్సరాల క్రితం (16 ఆగస్టు 2020 నాటికి) కడప ఆకాశవాణిలో ప్రొడ్యూసర్‌గా అడుగుపెట్టాను. కొద్ది రోజులలోనే పి.ఎల్. సంజీవరెడ్డి కలెక్టర్‌గా వచ్చారు.

సంజీవరెడ్డి తండ్రి పైడి లక్ష్మయ్య సాహితీవేత్త. తొలి పార్లమెంటు సభ్యులు (1952). శ్రీశైలం దేవస్థానం అధ్యక్షులు. సంజీవరెడ్డి నన్ను అభిమానంగా చూసేవారు. రెండేళ్ళ కాల వ్యవధిలో ఆయన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలిలోని మంత్రులను ఎక్కువమందిని కడపకు ఆహ్వానించారు. మండలి వెంకట కృష్ణారావు, పిడతల రంగారెడ్డి తదితరులను నేను ఇంటర్వ్యూ చేశాను. అర్ధాంతరంగా ఆయనను బదిలీ చేశారు. కడప కలెక్టర్లకు ఆ శాపం వుంది. ఆఫీసు రైలు బాగా వేగం పుంజుకొన్నప్పుడు ప్రభుత్వం సడెన్ బ్రేక్ వేసేది. సంజీవరెడ్డి 1977లో రాష్ట్రపతి భవన్‍లో నీలం సంజీవరెడ్డి ప్రత్యేక సహాయకుడిగా చేరారు. విజయవాడి నుండి కడపకు నన్ను 20 రోజుల్లో బదిలీ చేసినప్పుడు నేను వారికి ఫోన్ చేస్తే 24 గంటల్లో ఆర్డర్లు రద్దు చేయించారు. పదవీ విరమణానంతరం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ డైరక్టర్‌గా ఐదేళ్లు పని చేశారు. నా పట్ల అభిమానం చూపారు.

మరో విశిష్ట వ్యక్తి:

కడప కలెక్టరుగా డా. పి. సుబ్రమణ్యం వచ్చారు. వారిదీ మా నెల్లూరు. చాలా కార్యక్రమాలు చేపట్టారు జిల్లాలో. ఉన్నత విద్య కోసం బ్రిటన్ లోని బర్మింగ్‌హాం వెళ్ళి ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ కడప వచ్చారు. ఆయనకు వీడ్కోలు సభలో నేను మాట్లాడుతూ – “మీరు బర్మింగ్‌హాం వెడుతున్నారు, కడప కలెక్టర్లు ‘బర్నింగ్ హ్యాండ్స్’తో వెళ్ళారు సార్!” అన్నాను ఛలోక్తిగా. లండన్ నుంచి ఓ ఉత్తరం వ్రాస్తూ ఆ విషయం ఆయన ప్రస్తావించారు. రాజశేఖరరెడ్డి వద్ద కార్యదర్శిగా వుంటూ ఇడుపులపాయ విమాన ప్రమాదంలో మరణించారు. 1995-97 మధ్య కడప కలెక్టరుగా పని చేసిన డా. కె.వి. రమణాచారితో మైత్రీబంధం లోగడ వివరించాను.

నా మీద కోప్పడిన కడప కలెక్టరు:

యం.నారాయణ అనే అధికారి కడప కలెక్టరుగా వచ్చారు. మర్యాదపూర్వకంగా వారిని వెళ్ళి కలిశాను. పది నిముషాలు మాట్లాడుకున్నాం. వారికి ఎడమ చేతి వైపు నేను కుర్చీలో కూచొని వున్నాను. ఆయన కుడి చేతి హస్త రేఖలు చాలా విస్పష్టంగా వున్నాయి. అప్రయత్నంగా నేను అన్నాను – “మీరు ఈ జిల్లాలో ఆరు నెలలు మించి పనిచేయరు”. ఆ మాట వినగానే ఆయన ముఖం చిట్లించుకుని లేచి నిలబడి ‘దట్సాల్ రైట్’ అన్నారు. కడపలో ఏదో గొడవలు జరిగి, రాజకీయ నాయకులు కలెక్టరఫీసుకు వెళ్ళి కలెక్టరును కలవాలని ప్రయత్నిస్తే వీలు పడనీలేదు. సాయంత్రానికల్లా ఆయన విజయవాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్-ఛైర్మన్‌గా ఆరు నెలలకే బదిలీ అయ్యారు. నేను ఆ మధ్యలో విజయవాడ వెళ్ళి ఆ సంస్థ ఛైర్మన్ సిరీస్ రాజును కలవడానికి వెళ్ళాను. పక్కనే ‘యం.నారాయణ, ఐఎఎస్’ అనే బోర్డు చూసి లోపలికి వెళ్ళి కలిశాను. “మీ వాక్కు ఫలించింది” అన్నారు చిరునవ్వుతో.

రాయలసీమ కలెక్టర్లు:

రాయలసీమ నాలుగు జిల్లాల్లో నేను విస్తృతంగా పర్యటించాను. అక్కడికి వెళ్ళగానే ఆ రోజుల్లో రేడియో వైభవం కొనసాగుతోంది కాబట్టి (1975) అక్కడి కలెక్టరును ఆఫీసు ఫోన్‍లో సంప్రదించి ఇంటర్వ్యూలు చేశాను. అప్పటికి సెల్‌ఫోన్లు రాలేదు. చిత్తూరు జిల్లా కలెక్టరు యం.యస్. రాజాజీని, డి. రామకృష్ణయ్యను ఇంటర్వ్యూ చేశాను. రామకృష్ణయ్య డైరీలో వ్రాసుకున్న కవితలని చదివి వినిపించేవారు. పోలీసు సూపరింటెండెంట్ పేర్వారం రాములు మంది కథకులు. ఆయన డి.జి.పి.గా రిటైరయ్యారు. చిత్తూరులో 1966లో అసిస్టెంట్ కలెక్టరుగా చేరిన వై. వేణుగోపాల రెడ్డి మా యూనివర్శిటీ (తిరుపతి)లో ఐఎఎస్ పరీక్షలకు ఎలా తయారుకావాలో ప్రసంగించి విద్యార్థిగా వున్న నన్ను ప్రభావితం చేశారు. 2002లో నేను చికాగోలో శారదాపూర్ణ శొంఠి ఆధ్వర్యంలో అన్నమయ్య గురించి ప్రసంగించినప్పుడు ఆయన ముందు వరుసల్లో ఆసీనులై సాంతం విన్నారు. రిజర్వ్ బ్యాంకుకు గవర్నర్ అయ్యారు.

అనంతపురం కలెక్టరు కె. సుబ్రమణ్యశర్మను, జాయింట్ కలెక్టర్ యం.కె. ఆర్. వినాయక్‌ను, కలెక్టరు పి. రమాకాంతరెడ్డిని ఇంటర్వ్యూ చేశాను. రమాకాంతరెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యారు. కె.ఎస్.శర్మ ప్రసారభారతి సి.ఇ.వోగా వుండగా, నేను దూరదర్శన్ డి.డి.జి.గా ఐదేళ్ళు పనిచేశాను.

ఒంగోలు, కర్నూలు కలెక్టర్లు యన్. నారాయణన్, పి.కె. దొరైస్వామి, కోసల్ రాం వచ్చీ రాని తెలుగులో చక్కగా ప్రశ్నలకు జవాబులిచ్చారు.

ఇంకా జి. నిరంజనరావు, జి. నాగేశ్వరరావు, డి. మురళీకృష్ణ, కె.కె. బంగర్, దినేష్ కుమార్, వి.యస్. సంపత్, జానకీ కొండపి, ఫణి కుమార్, చిత్రా రామచంద్రన్, మోహన్ కందా, ఏ.వి.ఎస్. రెడ్డి, కె.వి.రావు, భలేరావు,యస్. భట్టాచార్య లను వివిధ జిల్లాలలో రికార్డు చేశాను. తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారులైన యం.వి.యస్. ప్రసాద్, డి.వి.యల్.యన్. మూర్తి, రాజగోపాలరాజు, ఐ.వి.సుబ్బారావు, పి.వి.ఆర్.కె. ప్రసాద్ తదితరుల రికార్డింగులు మధుర స్మృతులు. బి.ఆర్. మీనా, బి. అరవింద్ రెడ్డి, ఉమామహేశ్వర రావు, డి. శ్రీనివాసులు, పి.కృష్ణయ్య, రజత్ భార్గవ, బి. వెంకటేశ్వరరావు, యం. శ్యామ్యూల్‌లు ప్రముఖులు.

తిరుమలేశుని సన్నిధిలో:

2005 ఫిబ్రవరిలో దూరదర్శన్ నుండి పదవీ విరమణ చేశాను. హైదరాబాదుకు వస్తూ విమానాశ్రయంలో తి.తి.దే.కార్యనిర్వహణాధికారి శ్రీ ఏ.పి.వి.యన్. శర్మగారిని ఢిల్లీలో కలిశాను. ఆయన ఆ నెలలోనే తిరుపతిలో చేరారు. అప్రయత్నంగా నేను వారిని – “స్వామి వద్ద పని చేసే అవకాశం యిప్పించండి సార్!” అన్నాను. వారి ఆదరాభిమానాలతో 2005 మే నుండి 2010 జూన్ వరకు ఐదు సంవత్సరాలు తిరుమలేశుని సేవలో పని చేశాను. 2007 నుంచి 10 వరకు మూడేళ్ళు వేతనం తీసుకోకుండా సేవించాను. ఆ సమయంలో ఏ.పి.వి.యన్. శర్మ నాకు తొలి అధికారి. వారిప్పుడు తెలంగాణ రాష్ట్ర గవర్నరు సలహాదారు.

వారి తర్వాత తిరుపతికి కె.వి.రమణాచారి కార్యనిర్వహణాధికారిగా వచ్చారు. వారి హయాంలో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రారంభదశకు నేను చాలా పర్యాయాలు ఢిల్లీ వెళ్ళి లైసెన్సు మంజూరు చేయించగలిగాను. 2008 జూలైలో రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభాపాటిల్ చేతుల మీదుగా ఛానల్ తిరుమలేశుని సన్నిధిలో ప్రారంభించబడింది. ఆ ఛానల్ లోగో తయరు చేయమని ప్రసిద్ధ చిత్రకారుడు ‘బాపు’ను మదరాసులో కలిసి అభ్యర్థించాను. ఛానల్‌కు అవసరమైన శాటిలైట్ సహాయాన్ని ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్‌ను కోరాను.

రమణాచారి తర్వాత ఐ.వై.ఆర్.కృష్ణారావు తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా 2009లో వచ్చారు. నేను 1967-75 మధ్య కందుకూరు ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసినప్పుడు ఆయన ఇంటర్మీడియట్ చదివారు. ఆ విధంగా ముగ్గురు ఇ.వో.లు, ముగ్గురు ఛైర్మన్‌ల వద్ద కొలువుతీరాను. దేవస్థానంలో పనిచేసిన సమయంలో పలువురు జాయింట్ ఈవోలతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. యన్. ముక్తేశ్వరరావు, శ్రీకాంత్, వి. శేషాద్రి (ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయంలో జాయింట్ సెక్రటరీ), జి. బలరామయ్య, యన్. యువరాజ్, ఏ.వి.ధర్మారెడ్డి ప్రభృతులు నన్ను ఆదరంతో చూశారు.

రాజధాని నగరంలో:

ఢిల్లీలో నేను పది సంవత్సరాలు రెండు దఫాలుగా పని చేశాను. 1987-90 మధ్య, 1997-2005 మధ్యకాలంలో వివిధ హోదాలలో ఆకాశవాణి, దూరదర్శన్‌లలో పనిచేశాను. తొలి దఫా పనిచేసినప్పుడు కేంద్రంలో కార్యదర్శి హోదాలో ఇద్దరే ఇద్దరు ఉన్నారు. గనుల శాఖ కార్యదర్శిగా బి.కుక్కుటేశ్వరరావు (బి.కె.రావు), వ్యవసాయ శాఖ కార్యదర్శిగా సి.యస్.శాస్త్రి. నేను వీరిద్దరితో పరిచయాలు పెంచుకున్నాను. బి.కె.రావు లోగడ ఆకాశవాణిలో డి.డి.జి.గా పనిచేశారు. భారత భాగవతాది పురాణాలను క్షుణ్ణంగా చదివారు. 1990 జూన్ 30న ఆయన రిటైరైన రోజు నేను వారిని శాస్త్రిభవన్‌లో కలిసి శుభాకాంక్షలు తెలిపాను. హైదరాబాదు శ్రీనగర్ కాలనీలో వారి ఇంటికి సమీపంలోనే మా ఇల్లు. వారిని కలిసినప్పుడల్లా భారతంలో రాజనీతిధర్మాలు ప్రస్తావించేవారు.

సి.యస్.శాస్త్రి షాజహాన్‌ రోడ్డులో నివసించేవారు. వారి సతీమణి మణిశాస్త్రి ఢిల్లీలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో రీడర్‍గా పనిచేశారు. వారి కుమార్తె షర్మిలా చావలి రైల్వేలో సీనియర్ అధికారిణి. శాస్త్రిగారి కుటుంబం మా కుటుంబంపై ఎనలేని వాత్సల్యం ప్రదర్శించారు. ఒక సందర్భంలో మేము ఆంధ్రదేశం వెళ్ళవలసి వస్తే మా అమ్మాయి శైలజ, అబ్బాయి రమేష్ – వాళ్ళ ఇంట్లో ఓ వారం వున్నారు. ఇప్పటికీ యోగక్షేమాలు అడుగుతూంటారు. ఎన్నికల సంఘానికి చెందిన ఆర్. వి. పేరిశాస్త్రి, వి.యస్.రమాదేవి, జి.వి.జి.కృష్ణమూర్తి – నాకు పరిచితులు.

నన్ను మెచ్చిన ప్రసారభారతి అధికారులు:

నేను 1997 అక్టోబరులో ఢిల్లీ ఆకాశవాణి డైరక్టరుగా చేరేనాటికి సమాచార ప్రసార శాఖ కార్యదర్శి – సి.ఆర్. కమలనాథన్. అప్పటికింకా ప్రసారభారతి రాలేదు. 1997 నవంబరులో యస్.యస్. గిల్ తొలి సి.ఈ.ఓ.గా ప్రసారభారతి ఏర్పడింది. నిఖిల్ చక్రవర్తి అధ్యక్షులు. మా ఆకాశవాణి డైరక్టర్ జనరల్‌గా ఓ.పి.కేజ్రివాల్ ఉన్నారు. ఆయనే నన్ను ఢిల్లీకి ఎంపిక చేశారు. గిల్‌కు గిల్లుడు అలవాటు. నేరుగా నాకు ఫోన్ చేసి ‘ఇలా చెయ్, అలా చెయ్’ అని గిల్ ఆదేశించేవారు. నేను డైరక్టర్ జనరల్‍కు వివరించి ఆ పని పూర్తి చేసేవాడిని. ఓ అర్ధరాత్రి మా డి.జి. ఫోన్ చేసి “నాకు అర్జెంటుగా కారు కావాలి! పంపగలరా?” అన్నారు. మరో అరగంటలో వారే ఫోన్ చేసి – “గిల్‌ను తొలగించారు. నేను సి.ఇ.వో.గా బాధ్యత స్వీకరించాను” అన్నారు. అర్ధరాత్రి జరిగిన నాటకమది.

గిల్ తర్వాత ఆర్.ఆర్.షా వచ్చారు. ఆ తర్వాత అనిల్ బైజల్ (ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరు) వచ్చారు. వారే నన్ను ప్రమోషన్ మీద దూరదర్శన్ పంపారు. నేను వెళ్ళనని మొరాయించాను. “మీరు మంత్రి గారిని – సుష్మాస్వరాజ్‌ని – కలవండి” అని ఆదేశించారు. భయంగానే ఆమెను కలిశాను.

“మీరు నిజాయితీ గల అధికారి అని విన్నాము. మీరు నిస్సందేహంగా కాశ్మీర్ ఛానల్ డి.డి.జిగా చేరండి!” అని 2001 ఆగస్టులో సలహా ఇచ్చారు. వారి ప్రత్యేక కార్యదర్శి అంశుమాన్ భరోసా ఇచ్చారు. నాలుగేళ్ళు పంచాగ్ని మధ్యలో వున్నట్టు దూరదర్శన్‍లో పని చేశాను.

నాకు డైరక్టరు జనరల్‌గా యస్.వై. ఖురేషీ (తర్వాత ఎన్నికల సంఘం ముఖ్య కమీషనరు), నవీన్ కుమారు‌లు ఎంతో ఆదరంగా బాధ్యతలు అప్పగించారు. ఒక దశంలో ‘సగం బరువు నాపై పడింద’ని మా సి.ఇ.వో. శర్మ ఒక మీటింగ్‌లో చమత్కరించారు.

ఇతర కార్యదర్శులు:

పాదరసంలా ముందుకు సాగే నేను 8 సంవత్సరాల కాలంలో పలు శాఖల కార్యదర్శులకు సన్నిహితమయ్యాను. హోం శాఖ కార్యదర్శి కె. పద్మనాభయ్య ఇప్పటికీ కుటుంబ మైత్రి పాటిస్తారు. సాంస్కృతిక శాఖ కార్యదర్శి ఆర్.వి. వైద్యనాధయ్యర్ సహృదయులు. కంపెనీ వ్యవహారాల కార్యదర్శి టి.యస్. కృష్ణమూర్తి (తర్వాత ఎన్నికల సంఘం) చనువుగా వుండేవారు. వారి సతీమణి వీణా విద్వాంసురాలు. ఆరోగ్య శాఖలో సుజాతా రావు, ఆర్థిక శాఖలో జయభారతరెడ్డి, వి. గోవిందరాజన్, సి.యస్.రావులను సందర్భోచితంగా కలిసేవాడిని.

రాష్ట్రపతి భవన్ కార్యదర్శి రాజ్‍మోహన్ గాంధీని పలుమార్లు కలిసి రాష్ట్రపతి ప్రసంగాలు రికార్డు చేశాము. ఎన్నడూ లేనిది – యన్. రామ్ (ది హిందూ) చేత కె.ఆర్.నారాయణ్ (రాష్ట్రపతి) ఇంటర్వ్యూ చేశాము. సాంస్కృతిక శాఖ కార్యదర్శి వరదరాజన్ ఆధ్యాత్మిక ప్రియుడు. ఆరోగ్యశాఖలో కార్యదర్శులు జె.వి.ఆర్. ప్రసాదరావు, ఆర్. చంద్రమౌళి నాకు సన్నిహితులు. గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసిన మోహన్ కందా, జె.యస్. శర్మలు ఆప్యాయంగా మాట్లాడేవారు. కేరళ క్యాడర్‌కు చెందిన యం. రవికాంత్ పండారా రోడ్‌లో మా పక్కనే వుండేవారు. ప్రస్తుతం వినియోగదారుల ట్రిబ్యునల్ సభ్యులు చిర్రావూరి విశ్వనాథ్ సన్నిహితులు. ఈ లిస్టు చూసి ‘అతిశయం’ అనుకోవద్దని వినమ్ర హస్తాలతో నమస్కరిస్తున్నాను.

Exit mobile version