Site icon Sanchika

జ్ఞాపకాలు – వ్యాపకాలు – 22

[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

కుర్చీలు, బెంచీలు లేని ఆఫీసుకు బదిలీ (1990-93):

[dropcap]1[/dropcap]990 జూలై నెలలో మా పిల్లలు ముగ్గురి చదువుల రీత్యా ఢిల్లీ నుండి ఆంధ్ర దేశానికి నన్ను మార్చమని మా డైరక్టర్ జనరల్‌ను అభ్యర్థించాను. ట్రెయినింగ్ సెంటర్ నుండి నన్ను పంపడం ఆయనకు ఇష్టం లేదు. అప్పట్లో ప్రసారశాఖ మంత్రి పర్వతనేని ఉపేంద్ర. ఒకసారి రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు, మా మామగారి చిరకాల స్నేహితులైన ఏ.వి.కె. చైతన్య ఢిల్లీ వచ్చారు. ఆయనతో కలిసి నేనూ ఉపేంద్రగారిని కలిశాను. మాటల సందర్భంలో నా బదిలీ గూర్చి ప్రస్తావించాను. ఆయన మా డైరక్టర్ జనరల్ అమృతరావు షిండేకు ఫోన్ చేశారు. దానితో షిండేకు కోపం వచ్చింది. ‘మంత్రితో చెప్పిస్తారా?’ అని నిలదీశారు. అయితే మళ్ళీ వెళ్ళీ నేను వాస్తవ పరిస్థితి – పిల్లల చదువుల గూర్చి చెప్పగానే మెత్తబడ్డారు.

1990 జూలై మొదటివారంలో కొత్తగా పెట్టబోయే అనంతపురానికి నన్ను స్టేషన్ డైరక్టర్‌గా బదిలీ చేశారు. అప్పటికి ఢిల్లీలో మూడేళ్ళు గడిపాను (1987-90). 1990 ఆగస్టులో మా పెద్దబ్బాయి రమేష్ చంద్ర‌ను షిర్డీకి సమీపంలో కోపర్గాం ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్‌లో చేర్పించాను. ఉస్మానాబాద్‌లో కాలేజీ సీటు కోసం వెళ్తే ఆ రోజే పూర్తి అయ్యాయి. నిరాశతో ఆ రాత్రి బయలుదేరి షిర్డీ వెళ్ళాను. తెల్లవారి దిగేసరికి షిర్డీ నిండా జనం. గురుపూర్ణిమ ఆ రోజు.

ఆగంతకుని సలహా:

షిర్డీ సాయి దర్శనం చేసుకొని – ‘స్వామీ! మా అబ్బాయికి ఈ సంవత్సరం వృథా కాకుండా చూడమ’ని వేడుకొన్నాను. గుడి నుండి బయటకు రాగానే ఎవరో ఓ పెద్ద మనిషి నా వద్దకు వచ్చి – “ఇక్కడకు 10 మైళ్ళ దూరంలో కోపర్గాంలో ఇంజనీరింగ్ కాలేజి వుంది – తెలుసా?” అన్నారు. నా మనసులో మాట ఆయన కెలా తెలుసు? ఆశ్చర్యపోయాను. హుటాహుటిన కోపర్గాం వెళ్ళాను. ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ రత్నాకర్ వెంటనే సీటు ఇచ్చారు. 20 వేలు డొనేషన్, 12 వేలు సంవత్సరపు ఫీజు. ఉస్మానాబాద్‌లో చేర్చడానికి 30 వేలు క్యాష్ పట్టుకెళ్ళాను. అది కట్టి సీటు ఖరారు చేసుకొన్నాను.

అంతా షిర్డీ సాయి దయ. రమేష్ చంద్ర ఇంజనీరింగ్ పూర్తి చేసి 1996లో బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరి 2018 నాటికి యల్ అండ్ టి లో వైస్-ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగాడు. మిగతా ఇద్దరు పిల్లల్లో అమ్మాయి శైలజ బి.యస్.సి. మూడో సంవత్సరం అనంతపురం డిగ్రీ కాలేజీలో చేరింది. చిన్నవాడు జనార్దన్ సాయిబాబా కాలేజీలో ఇంటర్ చేరాడు. ఆ విధంగా ముగ్గురి చదువులకు అంతరాయం రాలేదు.

కొత్త ఆఫీసు:

అనంతపురంలో ఆకాశవాణి జిల్లా కేంద్రం ఏర్పాటుకుగా మూడేళ్ళ క్రితం కలెక్టరాఫీసు ఎదురుగా రెండెకరాల స్థలంలో బిల్డింగు, పక్కనే క్వార్టర్లు కట్టారు. మున్సిపల్ రహదారి బంగాళాను ఆకాశవాణి పరం చేశారు. యంత్ర పరికరాలు సమకూర్చారు. ప్రోగ్రాం సిబ్బంది ఎవరూ లేరు. కాశీ విశ్వనాథం అనే అకౌంటెంటు బదిలీ మీద వచ్చి అనంతపురంలో 1990 జూలైలో చేరాడు. నేను 1990 ఆగస్టు 8న డైరక్టర్‌గా చేరాను. 8, 16 అంకెలు నాకు అదృష్ట సంఖ్యలు. ఆగస్టు 16న కడపలో చేరాను. డిసెంబరు 16న కందుకూరులో చేరాను. కలిసొచ్చిన అంకెలు.

ఆఫీసులో కెళితే కూర్చొనేందుకు కుర్చీగాని, బల్లగానీ లేవు. ఇంజనీరు ఉదారంగా ఒక కుర్చీ ఇచ్చారు. మరుసటి నెలలో ఆఫీసుకు కావలసిన గాడ్రెజ్ ఫర్నీచరు కొన్నాము. క్రమక్రమంగా ఆఫీసు సిబ్బంది వచ్చారు. ప్రోగ్రాం సిబ్బంది వివిధ కేంద్రాల నుండి బదిలీ మీద వచ్చారు. ముగ్గురు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌లు, ముగ్గురు డ్యూటీ ఆఫీసర్లు 1990 సంవత్సరాంతానికి వచ్చి చేరారు.

ఇరవై మందికి నా చేతుల మీదుగా ఉద్యోగాలు:

కొత్త ఆఫీసుకు కావలసిన ఆఫీసు సిబ్బందిని ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజి ద్వారా ఎంపిక చేశాము. పారదర్శకంగా ముగ్గురు సెక్యూరిటీ గార్డులు, ముగ్గురు ప్యూన్లు, ఇంజనీరింగ్‍లో క్రిందిస్థాయి హెల్పర్లు – ఇలా ఆఫీసు కళకళలాడింది. పక్కనే విశాలమైన డైరక్టర్ క్వార్టర్స్‌లో నాకు వసతి ఏర్పడింది. క్రమక్రమంగా స్థానిక కళాకారులతో రికార్డింగ్ మొదలుపెట్టాము. కేవలం అనంతపురం జిల్లా వారినే ఆహ్వానించాలి. వారికిచ్చే పారితోషికం వంద రూపాయలే (ప్రసంగానికి). అదే కడప కేంద్రానికి వాళ్ళు వెళితే రూ.250/- ఇస్తారు. స్థానికులకు మంచి అవకాశాలు కల్పించాము. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆచార్యులు, స్థానిక ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు, జిల్లాలోని ఇతర జానపద బృందలు, కళాకారులు పాల్గొన్నారు.

మూడు ఖాళీలకు వందకు పైగా అభ్యర్థులు:

అనౌన్సర్లుగా ముగ్గురిని ఎంపిక చేయడానికి ప్రకటించాము. అందులో ఒకటి షెడ్యూల్ కులాల వారికి కేటాయించారు. వందమందికి పైగా అప్లయి చేశారు. ఆంధ్ర దేశం అంతటి నుండి అభ్యర్థులు వ్రాత పరీక్ష వ్రాశారు. మూడో కంటికి తెలియకుండా ప్రశ్నాపత్రం నేనే తయారు చేశాను. నాలుగు పేజీల ప్రశ్నాపత్రం. దానిని సైక్లోస్టయిల్ చేయాలి. తెలుగు రాని ఒక ముస్లిం యువకుని చేత రాత్రి పూట కాపీలు తీయించాను. అంతా పని అయిన తర్వాత ఆ కుర్రవాడు – “పేపర్ చాలా కష్టంగా వుంది సార్!” అన్నాడు. నా తల తిరిగిపోయింది.  రాత్రికి రాత్రి మరో ప్రశ్నాపత్రం తయారు చేశాను.

మెరికల్లాంటి ముగ్గురు అనౌన్సర్లు:

1991 జనవరి 29, 30 తేదీలలో అనౌన్సర్ల పోస్టులకు పదిహేను మందిని వ్రాత పరీక్ష నుండి ఎంపిక చేసి ఇంటర్వ్యూలు నా అధ్యక్షతన నిర్వహించాము. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఆచార్యులు మద్దూరి సుబ్బారెడ్డి, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు కొలకలూరి ఇనాక్ సభ్యులుగా ఇంటర్వ్యూ పారదర్శకంగా జరిపాము. డా. వి. పోతన, కె. పుష్పరాజ్, పి. అమృత సెలెక్టు అయ్యారు. తరువాతి కాలంలో ముగ్గురూ మంచి అనౌన్సర్లుగా పేరు తెచ్చుకున్నారు.

అర్ధరాత్రి కర్ఫ్యూ:

1991 మే 21న రాజీవ్ గాంధీ శ్రీ పెరంబుదూరులో హత్యోదంతానికి గురి అయ్యారు. అనంతపురంలో ఒక లాయర్ ఇంటిని తగలబెట్టారు. కర్ఫ్యూ విధించారు. మే 24న మా అమ్మాయి శైలజ పెళ్ళి జరగాలి. బస్సులు, రైళ్ళు ఆగిపోయాయి. బళ్ళారి నుండి పెళ్ళికొడుకు వాళ్ళు 23 సాయంత్రానికి కార్లలో వచ్చి చేరారు.

మేళం లేని పెళ్ళి:

నాదస్వర విద్వాంసులను బుక్ చేశాము. వాళ్ళు కావలి నుండి రావాలి. బస్సులు లేక రాలేదు. పోలీసు డి.ఐ.జి వెంకయ్య గారి సౌజన్యంతో పోలీసు బ్యాండ్ ఏర్పాటు చేశాను. కడప నుండి రావలసిన మంగళసూత్రం మా తమ్ముడు ఎలానో లారీ పట్టుకొని వచ్చి కథ నడిపించాడు. ఇంత హడావిడిలో డైరక్టరేట్ నుండి టి. ఆర్. మలాకర్ ఫోను చేశారు.

ఆకాశవాణిని నేనే ప్రారంభించాను:

వైభవంగా ఆకాశవాణి ప్రారంభోత్సవం చేద్దామనుకొన్నాము. కాని డైరక్టరేట్ వారు ఎలాంటి ఆర్భాటం లేకుండా మే 29న ప్రారంభించెయ్యమన్నారు. ఏ విధమైన హంగు, ఆర్భాటం లేకుండా లాంఛనంగా అనంతపురం మునిసిపల్ ఛైర్మన్ సమక్షంలో ప్రారంభోత్సవం చేశాము. మునిసిపల్ స్థలాన్ని ఆకాశవాణికి ఇచ్చారనే ఉద్దేశంతో వారిని పిలిచాను. ఖాళీ ప్రదేశం గాబట్టి వీధికి అటువైపు వారు క్వార్టర్ల మధ్యలో స్వేచ్ఛగా వస్తూ పోతూ ఉండేవారు. అది సెక్యూరిటీ సమస్య. మునిసిపల్ ఛైర్మన్ పంచాయతీ చేసి అటువైపు ప్రహారీ గోడను కట్టించాము. కేంద్ర ప్రసారాలు మొదలయ్యాయి. శ్రోతలు సంతోషించారు.

యఫ్.యం.రేడియోల కొరత:

కడప కేంద్రం వలె గాక అనంతపురం, కర్నూలు, తిరుపతి కేంద్రాలు యఫ్.యం. కేంద్రాలు. ప్రత్యేక రేడియోలు కొంటే తప్ప ప్రసారాలు వినిపించవు. క్రమంగా ఫిలిప్స్ రేడియోలు కొన్నారు. స్థానిక పత్రికా విలేకరులు ప్రోత్సహించారు.  ఆంధ్రప్రభ విలేకరి యాదాటి కాశీపతి నా వీడ్కోలు సందర్భంగా 1993లో వ్రాసిన వాక్యం నాకు బాగా గుర్తు: “అనంతపురం కేంద్రాన్ని అనంతపద్మనాభరావు క్షణక్షణాభివృద్ధి చేశారు.” – ఎంతో ఆనందం వేసింది. ముల్క్‌రాజ్ ఆనంద్ నేను అనువదించిన ప్రభాతవదన గ్రంథాన్ని స్వయంగా ఆవిష్కరించడం మరో సంతోషకర సన్నివేశం.

సరిగ్గా ఉదయం 10 గంటలకు రోజూ ఒక శవం:

ఆకాశవాణిలో ప్రతీ కేంద్రంలోను రోజూ ఉదయం 10 గంటలకు ప్రోగ్రాం మీటింగ్ జరుగుతుంది. అందులో నిన్నటి కార్యక్రమాలు, ఈ రోజు కార్యక్రమాలు, రేపటి కార్యక్రమాల సమీక్ష జరుగుతుంది. డైరక్టర్ ఆఫీసు గది పై అంతస్తులో వుంది. మా మీటింగు జరిగే సమయంలో దాదాపు ప్రతీ రోజూ వీధిలో ఒక శవయాత్ర జరిగేది. ఆఫీసు కెదురుగా స్మశానం వుంది. చమత్కారంగా ఒక రోజు నేను అన్నాను, “మన కార్యక్రమాల ప్రభావం రోజు రోజుకూ ప్రతిఫలిస్తోంది” అని. అందరం నవ్వుకున్నాం.

దిగ్గజాల వంటి కార్యక్రమ నిర్వాహకులు:

హైదరాబాద్ కేంద్రం నుంచి వచ్చిన కళాకృష్ణమూర్తి, విద్యాలంకారు, రమణమూర్తి, మురళి తదితర సిబ్బంది జిల్లా వ్యాప్తంగా తిరిగి కార్యక్రమాలు చక్కగా రూపొందించారు. నాగసూరి వేణుగోపాల్ పణజి నుండి బదిలీ మీద వచ్చారు. అనేక రకాల కార్యక్రమాలు – పుణ్యక్షేత్రాలు, యాత్రాస్థలాలు, పర్యాటక కేంద్రాలు అన్నీ తిరిగారు. ప్రతి ఏటా పుట్టపర్తిలో నవంబరులో శ్రీ సాయిబాబా జన్మదినోత్సవాలకు రాష్ట్రపతి శ్రీ శంకర్ దయాళ్ శర్మ, ప్రధానమంత్రి శ్రీ పి.వి.నరసింహారావు తదితర ప్రముఖులు విచ్చేశారు.

టేప్ కావాలని అడిగిన రాష్ట్రపతి:

శ్రీ శంకర్ దయాళ్ శర్మ రాష్ట్రపతిగా పుట్టపర్తి విచ్చేశారు. ఆ సభలో శ్రీ సాయిబాబా గారు రాష్ట్రపతిని ప్రశంసించారు. సభావేదిక దిగివస్తూ – “ఆ టేప్ కాపీ నాకు అందజేయండి” అని రాష్ట్రపతి ఆదేశించారు.  కాపీని రాత్రికి రాత్రి అనంతపురం వెళ్ళి తయారు చేసి వారి కందించాం. అలానే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి సన్నిహితులయ్యారు.

ధర్మవరం వారి సంస్మరణ సభ:

ధర్మవరంలో కళాజ్యోతి ఆధ్వర్యంలో ఆకాశవాణి పక్షాన ధర్మవరం రామకృష్ణమాచార్యుల జయంతి సభ ఏర్పాటు చేశాం. ధర్మవరం వారి మనుమరాలు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ హైదరాబాద్ నుంచి వచ్చి ‘మా తాతగారు’ అనే అంశంపై ప్రసంగించారు. పొన్నాల రామసుబ్బారెడ్డి చిత్రనళినీయంలో నలుని పాత్ర వేసి రక్తి కట్టించారు. పోలీసు డి.ఐ.జి. వెంకయ్య, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్ యం.జె.కేశవమూర్తి ముఖ్య అతిథులు. బళ్ళారి రాఘవ వర్ధంతి సభ కూడా జరిపాం.

కదిరి, కసాపురం, తాడిపత్రి, పెనుగొండ, తిమ్మమ్మ మర్రిమాను, పెన్న అహోబిలం, లేపాక్షి, హిందూపురం తదితర ప్రాంతాల విశేషాలు శ్రోతలకందించాం. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి శ్రీ పెండేకంటి వెంకట సుబ్బయ్య తాడిపత్రి పర్యటనలు శ్రోతలకందించాము. అనంతపురం కవి పండిత కళాకారుల అభినందన చందన స్వీకారంతో 1993 ఏప్రిల్ 23న కడప ఆకాశవాణి డైరక్టర్‌గా చేరాను.

Exit mobile version