జ్ఞాపకాలు – వ్యాపకాలు – 24

1
2

[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

నా జీవిత చరిత్ర వ్రాయాలని ఎందు కనుకొన్నారు?:

1969లో చారిత్రాత్మకంగా రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. కాంగ్రెసు అభర్థిగా నిలిచిన నీలం సంజీవరెడ్డిపై ఉపరాష్ట్రపతి వి.వి.గిరి స్వతంత్ర్య అభ్యర్థిగా నిలబడ్డారు. ఇందిరాగాంధీ మనసు మార్చుకొని ‘అంతరాత్మ ప్రబోధం’ పేరుతో గిరిని గెలిపించింది. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసి గిరి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ఆయనపై జి.యస్. భార్గవ ఆంగ్లంలో జీవిత చరిత్ర గ్రంథం వ్రాశారు. అది చదివి నేను ప్రభావితుడనయ్యాను. సమాచార సేకరణకు రాష్ట్రపతి భవనానికి ఉత్తరం వ్రాశాను. నేను అప్పుడు (1969) కందుకూరు ప్రభుత్వ కళాశాల అధ్యాపకుణ్ణి. అది నా తొలి రచన. రాష్ట్రపతి భవనం నుండి సానుకూలంగా ప్రత్యుత్తరం రాలేదు. అయినా 1970లో నేను ‘రాష్ట్రపతి వి.వి.గిరి’ అనే తొలి రచనను ప్రచురించాను. ఢిల్లీ వెళ్ళినప్పుడు గిరి గారిని కలిస్తే – పుస్తకం చూసి ఆయన ఇలా ప్రశ్నించారు:

“మీ తొలి రచనగా నా జీవిత చరిత్రనే ఎందుకు ఎంచుకొన్నారు?” అని.

“జాతీయ రాజకీయాలలో మూడు దశాబ్దులు క్రియాశీలకంగా మీరు పని చేయడం, ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేయడం – నన్ను ఆకర్షించాయి” అన్నాను.

సంతోషించారు.

రాష్ట్రపతి భవనంలో తొలి అడుగు:

1976లో ఆకాశవాణి కడప కేంద్రం నుండి నేను శిక్షణ కోసం ఢిల్లీ వెళ్ళాను. అప్పుడు రాష్ట్రపతి వద్ద స్పెషల్ అసిస్టెంట్‌గా పి.ఎల్. సంజీవరెడ్డి పని చేస్తున్నారు. నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి. రాష్ట్రపతి నిలయంలో పి.ఎల్. సంజీవరెడ్డిని కలియడానికి వెళ్ళాను. 1975-76 మధ్యలో ఆయన కడప కలెక్టరు. నాకు పరిచయం. రాష్ట్రపతికి ప్రెస్ సెక్రటరీగా తెలుగువారైన కె. సూర్యనారాయణను పరిచయం చేసుకొన్నాను. ఆయన పది సంవత్సరాలు పలువురు రాష్ట్రపతుల వద్ద పని చేశారు. సౌజన్యశీలి.

సంజీవరెడ్డికి ముందు ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ రాష్ట్రపతి. ఆయన 1975 ఏప్రిల్‌లో హైదరాబాదులో ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవానికి విచ్చేశారు. కందుకూరు తాలూకా రచయితల సంఘం అధ్యక్షుడిగా ఆ సభలలో ప్రతినిధిగా పాల్గొని వారం రోజులు హైదరాబాదులో సారస్వత మేళాను చూశాను. విశ్వనాథ సత్యనారాయణ అధ్యక్షతన కవి సమ్మేళనం హైలైట్. శంకరంబాడి సుందరాచారికి ఆ సభలలో గుర్తింపు లభించింది. నేను ఆయన జీవిత చరిత్రను తెలుగులోను, ఇంగ్లీషులోనూ వ్రాశాను.

రాష్ట్రపతి నిలయంలో తేనీటి విందు:

1983లో నేను హైదరాబాదు ఆకాశవాణిలో అసిస్టెంట్ డైరక్టర్‌ని. వేసవి విడిదికి రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్ వారం రోజులు  హైదరాబాదులోని రాష్ట్రపతి నిలయంకు వచ్చారు. ఒక సాయంకాలం ప్రసారమాధ్యమాల వారిని తేనేటి విందుకు ఆహ్వానించారు. ఆంగ్లంలో ఆయనపై వచ్చిన జీవిత చరిత్రను నేను అప్పటికే 60 పేజీలు తెలుగు చేశాను. ఆయనకు ఆ విషయం చెబితే సంతోషించారు. కారణాంతరాల వల్ల ఆ అనువాదం నిలిచిపోయింది.

పుట్టపర్తి సాయిబాబా ప్రసంగం టేపు అడిగిన రాష్ట్రపతి:

1992లో రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ పుట్టపర్తిలో సత్యసాయి బాబా జన్మదినోత్సవాలకు నవంబరు 23న విచ్చేశారు. బాబాగారు శంకర్ దయాళ్ శర్మను 5 నిముషాలు ప్రశంసించారు. వేదిక మీద నుండి దిగి వెళుతూ శంకర్ దయాళ్ శర్మ ముందు వరుసల్లో రికార్డింగు చేస్తున్న నా వద్దకు వచ్చారు. నేను అప్పుడు అనంతపురం ఆకాశవాణి డైరక్టర్‌ని. బాబా ప్రసంగం టేప్ కావాలని శర్మ కోరారు. తన పి.ఎ. చేత నాకు కబురు పంపి ఉండవచ్చు. కాని, ఆయన ఆదరంతో అడిగారు. రాత్రికి రాత్రి అనంతపురం స్టూడియోకి వెళ్ళి కాపీ చేసి ఆయనకు అందించాను.

1999లో నేను ఢిల్లీ ఆకాశవాణి డైరక్టర్‌ని. డిసెంబరు 26న ఆదివారం. నేను క్వార్టర్స్‌లో ఉన్నాను. ఆఫీసు నుండి ఫోన్ వచ్చింది. మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ మరణించారు. ప్రభుత్వ లాంఛనాలతో దహన సంస్కారాలు నిర్వహించారు. ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి జరపాలి. హుటాహుటిన వారి నివాస స్థలానికి మా యూనిట్‌తో వెళ్ళి ఏర్పాట్లు చేశాం. ఆయన ఉపరాష్ట్రపతిగా వుండగా నా కుమారుడు జనార్దన్ తన గురువుతో కలిసి వెళ్ళి తాను వేసిన పెయింటింగ్ బహుకరించాడు. అతని వయస్సు 13 సంవత్సరాలు.

మొట్టమొదటిసారి రాష్ట్రపతి ఇంటర్వ్యూ ప్రసారం:

రాష్ట్రపతిని ఎవరూ ప్రశ్నలు వేయరాదు. ఆగస్టు 14 రాత్రి ఆకాశవాణి, దూరదర్శన్‌ల ద్వారా రాష్ట్రపతి దేశ ప్రజల నుద్దేశించి సందేశం ఇస్తారు. అవి 1998, 1999లలో నేను కె. ఆర్. నారాయణన్ సందేశాలు రాష్ట్రపతి భవనంలో రికార్డు చేశాను. ఒక్క రాష్ట్రపతి తప్ప ప్రధాని మొదలు మిగతా ప్రముఖులు ఆకాశవాణికే వస్తారు. నారాయణన్ కుమార్తె చిత్రానారాయణన్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసరు (1978). ఆమె తండ్రికి వ్యక్తిగత సహాయకురాలుగా ఐదేళ్ళు వ్యవహరించారు.

2009-13 మధ్య వ్యాటికన్‌లో భారత రాయబారి. ఆగస్టు 15, జనవరి 26న రాష్ట్రపతి ఇచ్చే తేనీటి విందుకు నేను, నా సతీమణి హాజరయ్యాం. నారాయణన్ గారిని హిందూ అధిపతి యన్.రాం చేత ఇంటర్వ్యూ చేయించి ప్రసారం చేశాం. అదొక చరిత్ర.

రాత్రి 10.30కు రాష్ట్రపతితో ఇంటర్వ్యూ రికార్డింగు:

1999లో అబ్దుల్ కలాం చేత ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఏటా ఏర్పాటు చేసే సర్దార్ పటేల్ స్మారకోపన్యాసం నేషనల్ మ్యూజియం ఆడిటోరియంలో జరిపాం. సైంటిఫిక్ అడ్వైజర్‌గా వున్న కలాం అద్భుతంగా ప్రసంగించారు. 2002 జూన్ నెలాఖరులో నేను త్రివేండ్రం దూరదర్శన్ కేంద్రం ఇన్‌స్పెక్షన్‌కి డిప్యూటీ డైరక్టర్ జనరల్‌గా వెళ్ళాను. ఆ రాత్రి దూరదర్శన్ వార్తలలో అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా కాంగ్రెసు ఎంపిక చేసిన విషయం ప్రసారం చేస్తూ, ఆ రోజు సర్దార్ పటేల్ స్మారకోపన్యాసంలో ఆయన పక్కన ఒక వైపు నేను, మరొక వైపు సమాచార శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి కూర్చొన్న క్లిప్పింగ్ ఆ రాత్రంతా చూపారు.

2009లో కలాం గారు తిరుపతిలో ఒక యువజనోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వెయ్యి మందికి పైగా యువకులు పాల్గొన్న ఆ సభలో అద్భుతంగా ప్రసంగించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు కె.వి. రమణాచారి ఆంగ్ల ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించి కలాం ప్రశంసలందుకున్నారు. సభకు ముందు కలాం గారిని పద్మావతీ గెస్ట్ హౌస్‌లో కలిసి ఇంటర్వ్యూ కావాలని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ పక్షాన కోరాను. సభానంతరం రాత్రి 7.30కు ఇంటర్వ్యూ నిర్ణయించారు

మా రికార్డింగ్ యూనిట్ పద్మావతీ గెస్ట్ హౌస్‌లో ఎదురుచూస్తున్నాం. ఇంతలో కలాం గారు ముందుగా షెడ్యూల్‌లో లేని విధంగా సభానంతరం నేరుగా తిరుమల దర్శనానికి వెళ్ళారు. రాత్రి 10.30 అయింది. ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేస్తారనుకొన్నాం.

ఎంతో ఆదరంగా అంగీకరించారు. నేను ముందుగానే ఎనిమిది ప్రశ్నలు తయారు చేసి వుంచాను. అవి వారికి చూపించాను. ఓకె చేశారు. ఆ వయస్సులో ఆ రాత్రి వేళ కూడా ఆయన ఉత్సాహంగా సమాధానాలిచ్చారు.

నేను వేసిన చివరి ప్రశ్న – “2007 జూలై లో మీరు రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసి రాష్ట్రపతి నిలయం నుంచి బయటకు వచ్చేడప్పుడు మీ అనుభూతి ఎలాంటిది?” అని అడిగాను.

ఆధ్యాత్మిక ధోరణిలో సాగింది ఆయన సమాధానం:

“2002 జూలైలో రాష్ట్రపతి భవనంలోకి అడుగుపెట్టిన రోజున నాకు అత్యుత్సాహం లేదు. 2007 జూలైలో విరమించిన రోజు నిరుత్సాహం లేదు. ‘కర్మణ్యేవాధికారస్తే’ అనే సిధ్ధాంతం నాది” అన్నారు వేదాంతిలా.

ఉపరాష్ట్రపతి ఇంట విందు:

భారత ఉపరాష్ట్రపతులుగా పలువురు తెలుగు వారు – రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వి.వి.గిరి వ్యవహరించారు. కృష్ణకాంత్ ఉపరాష్ట్రపతిగా ఉన్నపుడు ఆంధ్రా క్యాడర్ ఐఎఎస్ అధికారి ఏ.యన్.తివారి ఆయనకు కార్యదర్శి. తివారి కడప కలెక్టరుగా (1993) నాకు పరిచితులు. ఆయన చీఫ్ ఇన్ఫర్మేషన్ కమీషనర్‌గా రిటైరయ్యారు. లోగడ 1979లో యండి. హిదయతుల్లా ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు మోహన్ కందా వారి కార్యదర్శి. కడప ప్రభుత్వోద్యోగుల క్రీడా సాంస్కృతిక ప్రత్యేక సంచికకు నేను ప్రధాన కార్యదర్శిగా వున్నప్పుడు హిదయతుల్లా స్వదస్తూరీతో సందేశం పంపారు. బి.డి. జెట్టి మదరాసు తెలుగు అకాడమీ సభలకు వచ్చారు.

2017 ఆగస్టు 12 న ఉపరాష్ట్రపతిగా శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పదవీ స్వీకారం చేశారు. ఆయన బుచ్చిరెడ్డిపాళెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివారు. అదే స్కూలులో నేను నాలుగేళ్ళ ముందు యస్.యస్.యల్.సి. 1960లో చదివాను. ఆ తరువాత నేను వారు వి.ఆర్. కళాశాలలో చదివాము. మాకు తెలుగు అధ్యాపకులు పోలూరి హనమజ్జానకీరామశర్మ. వారి సంస్మరణ సంచికను 2019లో విజయవాడ స్వర్ణ భారత ట్రస్టులో జరిగిన సభలో వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.

పూర్వ స్నేహితులంటే నాయుడి గారికి ఆదరం. 2018లో సంక్రాంతి సంబరాలు నెల్లూరు స్వర్ణ భారత ట్రస్టులో జరిపినపుడు మా కుటుంబమంతా వారి ఆదరాన్ని పంచుకొన్నాం.

2020 జనవరిలో ప్రాచీన తెలుగు భాషా పీఠం నెల్లూరులో ప్రారంభించినపుడు వెంకయ్య నాయుడుగారి ప్రత్యేకాహ్వానంపై నేను వెళ్ళి పాల్గొన్నాను. ఉపరాష్ట్రపతి వద్ద ప్రస్తుతం కార్యదర్శిగా ఐ.వి. సుబ్బారావు (ఐఎఎస్) వ్యవహరిస్తున్నారు. ఆయన ఆంతరంగిక కార్యదర్శిగా విక్రాంత్ అనుభవజ్ఞుడు. మూడేళ్ళ పదవీకాలాన్ని 2020 ఆగస్టులో పూర్తి చేసుకొన్న వెంకయ్యనాయుడు గారికి మహోజ్వల భవిష్యత్తు ఎదురుచూద్దాం.

ఈ విధంగా రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులతో ముఖాముఖీ పరిచయాలు ఏర్పడడానికి ప్రధాన కారణం – నేను ఆకాశవాణిలో పని చేయడం. అలానే ప్రధాన మంత్రులతో పరిచయాలను పై వారం మీతో పంచుకొనే అవకాశానికి ఎదురుచూస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here