Site icon Sanchika

జ్ఞాపకాలు – వ్యాపకాలు – 29

[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

కడప గడపలో మూడోసారి:

1975లో కడప ఆకాశవాణితో అరంగేట్రం ప్రారంభించిన నేను 1978లో విజయవాడ వెళ్ళి 1980లో తిరిగి కడపకు చేరాను. పదోన్నతి పొంది 1982లో హైదరాబాదు వెళ్ళాను. మళ్ళీ పదేళ్ళకు 1993 ఏప్రిల్‌లో అనంతపురం నుండి బదిలీ అయి కడప వచ్చాను. రెండేళ్ళకొక ఊరు లేదా పనిలో మార్పు నేను కోరుకుంటాను. ఉద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతుండగా రాగద్వేషాలు ప్రబలక ముందే స్థానచలనం అడిగి తెచ్చుకుంటాను.

‘ఉద్యోగికి దూరభూమి లేదు!’  అన్నది మా నాన్నగారు నాకు ఉగ్గుబాలతో రంగరించి పోశారు. నేను ఢిల్లీ వెళుతున్నానన్నా, ఆయన మా గ్రామం చెన్నూరులోనే వుండి తాను వ్యవసాయం పనులు అజమాయిషీ చేస్తూ జీవించారు. 2000 సంవత్సరంలో కాలధర్మం చెందేందుకు పది నెలల ముందు 50 ఏళ్ళుగా నమ్ముకుని కష్టపడి పండించిన పొలాలను అమ్ముకుని నా వద్దకు ఢిల్లీ చేరారు. అదే ఆయనకు చివరి మజిలీ.

రెండేళ్ళలో అధిక సభలు (1993-1995):

కడపలో రెండేళ్ళే పని చేశాను. విస్తృత పర్యటనలు ఉద్యోగరీత్యా చేయవలసి వచ్చింది. సాహిత్య రంగంలో అంతో యింతో పేరు వచ్చింది కాబట్టి, స్టేషన్ డైరక్టర్ అనే తోక వుంది గాబట్టి చాలామంది నన్ను సభలకు ముఖ్య అతిథిగానో, అధ్యక్షుడి గానో, ఉపన్యాసకుడిగానో ఆహ్వానించారు. అవి గాక వృత్తిధర్మంగా హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్టణంలలో జరిగిన కో-ఆర్డినేషన్ సమావేశాలకు హాజరయ్యాను. అందరిలో సీనియర్‍ని కావడం మూలాన, ట్రెయినింగ్ సెంటర్ హైదరాబాదు, ఢిల్లీలలో పాల్గొని చాలా మందికి శిక్షణ నిచ్చిన కారణంతోనూ, నన్ను, నా సలహా సూచనలను గౌరవప్రదంగా స్వీకరించేవారు. నా సహోద్యోగులలో కడపలో వై. గంగిరెడ్డి ప్రధానం. ఆత్మీయ మిత్రుడిగా కొనసాగాడు. నా తర్వాత కడప, విశాఖపట్టణం కేంద్రాల డైరక్టర్ అయ్యాడు.

స్వామీజీలతో అనుబంధం:

1993 నాటికి రేడియోకి ఇంకా ప్రాచుర్యం తగ్గలేదు. ఎంతో ఆదరణ పొందిన ప్రసారమాధ్యమం. అందువల్ల పలువురు స్వామీజీల సంపర్కం లభించింది. 1993 డిసెంబరు నెలాఖరులో కడప మునిసిపల్ స్టేడియం మైదానంలో వేలాది జన సముదాయాన్ని ఉద్దేశించి స్వామీ సుందరచైతన్యానంద గీతా జ్ఞాన యజ్ఞ సప్తాహం చేశారు. చివరి రోజు ముగింపు సభలో నేనూ ప్రసంగించాను. వారితో సాన్నిహిత్యం పెరిగింది.

నంద్యాలలో శ్యామచరణబాబా మంచి ఆధ్యాత్మిక గురువు. రావినూతల శ్రీరాములు ద్వారా వారు పరిచయమయ్యారు. అప్పట్లో ప్రధానిగా ఉండి నంద్యాల పార్లమెంటు సభ్యునిగా గెలుపొందారు పి.వి.నరసింహారావు. తన నియోజకవర్గానికి ఆయన అనేక పర్యాయాలు విచ్చేశారు. ఆ రికార్డింగులకు వెళ్ళినప్పుడు శ్యామచరణబాబా ఆతిథ్యము, ఆదరము లభించాయి.

బహిరంగ సభలో:

కర్నూలులో బాలసాయిబాబా దర్శనం అలానే లభించింది. ప్రజాపిత బ్రహ్మకుమారీ సంస్థ అధినేత్రి కడప బహిరంగ సభలో మాట్లాడారు. వజ్రోత్సవ సందర్భంగా వేలాదిమంది హాజరయ్యారు. ముఖ్య అతిథిగా నేను మాట్లాడుతూ – “ఈ సంస్థ స్థాపకులు వజ్రాల వ్యాపారి. అందుకే సంస్థకు వజ్రోత్సవం వేడుకగా జరుపుకొంటున్నాం” అన్నాను. సభాసదులు హర్షద్వానాలు చేశారు.

కాలజ్ఞాని సంస్థానంలో:

కాలజ్ఞానాన్ని బోధించిన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి బ్రహ్మంగారి మఠాన్ని రెండేళ్ళలో రెండు మార్లు సందర్శించాను. 1994 మార్చిలో బ్రహ్మంగారి మఠంలో డా. వి.వి.యల్. నరసింహారావు గ్రంథావిష్కరణ సభ జరిగింది. దానికి కడప కలెక్టర్ కె.వి.రమణాచారి, నేను వెళ్ళి కాలజ్ఞాన మూల ప్రతిని ఆ పీఠాధిపతి చూపగా దర్శించాము.

ఆలయాల సందర్శన:

వృత్తిధర్మంగా రాయలసీమలోని పలు ఆలయాలను దర్శించి రికార్డింగులు చేశాను. శ్రీశైలంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం చేశాను. అలానే, తిరుమల బ్రహ్మోత్సవాలతో గరుడ సేవకు వ్యాఖ్యానం చెప్పాను. కసాపురం, మహానంది, శ్రీకాళహస్తి, పుష్పగిరి, జొన్నవాడ, విజయవాడ, ఒంటిమిట్ట, తాళ్ళపాక, పుట్టపర్తి, వేయి నూతలకోన దర్శించి పూజలు చేశాను. ప్రత్యేకంగా LTC మీద షిర్డీ వెళ్ళి సాయినాథుని దర్శించాము. షిర్డీ సమీపంలోని కోపర్గాంలో ఇంజనీరింగ్ కళాశాలలో మా పెద్దబ్బాయి రమేష్ చంద్ర ఇంజనీరింగ్ చదువుతున్నందున అక్కడికి వెళ్ళడం ఆనందాన్ని కలిగించింది.

అధికారిక సమావేశాలలో:

స్టేషన్ డైరక్టర్ల సమావేశం 1995 జనవరిలో అఖిల భారత స్థాయి అధికారులతో బెంగుళూరులో జరిగింది. ముఖ్య అతిథిగా డా. సి. నారాయణరెడ్డిని పిలిచాము. మా డైరక్టర్ జనరల్ యస్. యస్. కపూర్ సమావేశాలు ప్రారంభించారు. మధ్యాహ్న భోజనం సమయంలో డిప్యూటి డైరక్టర్ జనరల్ యం.డి. గైక్వాడ్ నా వద్దకు వచ్చి “You should come to Delhi on transfer. We need people like you” అన్నారు. “పిల్లలు చదువుల మధ్యలో ఉన్నారు సార్! తర్వాతి కాలంలో తప్పక వస్తాను” అన్నాను. మరో డి.డి.జి. కృష్ణన్ కలిశారు. “సార్! త్వరలో విజయవాడ ఖాళీ కాబోతోంది. నన్ను వెయ్యండి!” అన్నాను. ఆయన ‘సరే’నన్నారు. మాట ప్రకారం 1995 మార్చి నెలలో నన్ను విజయవాడ బదిలీపై పంపారు.

అవసర బ్రాహ్మణార్థం:

తిథులకు ఇద్దరు బ్రాహ్మణులు అవసరం. అలానే సభలకు ఒక ముఖ్య అతిథి, ఒక అధ్యక్షుడు అవసరం! అలా కడపలో వున్న రెండేళ్ళ కాలంలో (1993-95) అనేక జయంతులు, వర్ధంతులలో నేను పాల్గొన్నాను. సాహిత్య పరిచయము, అధికారిక హోదా కలిగి వుండటం వల్ల నన్ను ఆహ్వానించేవారు. డా.  బెజవాడ గోపాలరెడ్ది కడపలో పెద్దన సాహితీ పీఠ ప్రారంభోత్సవానికి 1993 జూన్‌లో వచ్చారు. ఆ సభలో నేను ముఖ్య అతిథిని. ఆ రోజు ఆయన మా క్వార్టర్స్‌కు నా ఆహ్వానం మేరకు వచ్చి ఆతిథ్యం స్వీకరించారు. మరికొన్ని సభలు కేవలం పేర్కొంటాను: సి.పి.బ్రౌన్ గ్రంథాలయం జానమద్ది హనుమచ్ఛాస్త్రి పర్యవేక్షణలో అభివృద్ధి చెందింది. బ్రౌన్ జయంతి సభలోనూ, గ్రంథాలయ వారోత్సవాలలోనూ పాల్గొన్నాను. శంకర జయంతి, గరిమెళ్ళ శత జయంతి, అంతటి నరసింహం అభినందన సభ, బ్రౌన్ వర్ధంతి, విశ్వనాథ శత జయంతి, తాళ్ళపాకలో అన్నమయ్య జయంతి, త్యాగరాజ ఆరాధన, వాల్మీకి జయంతి, రామకృష్ణ జయంతి, ఘంటసాల వర్ధంతులే గాక కందుల ఓబుల్ రెడ్డి సంస్మరణ సభ, పెండేకంటి సంస్మరణ సభ, కంచి పరమాచర్య సంస్మరణ సభ – ఇలా ప్రధాన సాంస్కృతిక స్రవంతిలో నేనూ భాగస్వామినయ్యాను.

వివేకనంద జయంతి, పుట్టపర్తి వర్ధంతి, జాషువా జయంతి ఇతర ప్రముఖ సభలు.

ఇద్దరు కలెక్టరులు:

ఆ రెండేళ్ళలో డా. పి. సుబ్రమణ్యం, డా. కె.వి. రమణాచారి ఇద్దరు కలెక్టర్లు కడపలో పనిచేశారు. ఇద్దరూ నన్ను ఆత్మీయంగా చూశారు. 1993 సెప్టెంబరు నెలలో సుబ్రమణ్యం బర్మింగ్‌హం పై చదువులకు వెళ్ళినప్పుడు వీడ్కోలు సభలో మాట్లాడాను. అదే విధంగా 1994 ఆగస్టులో కె.వి.రమణాచారి ఆకస్మిక బదిలీ వీడ్కోలు సభలో నేను మాట్లాడాను.

ప్రధాని సభావేదిక పైకి చెప్పు:

1994 ఆగస్టులో పి.వి. నరసింహారావు ప్రధానిగా కడప మునిసిపల్ గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రసంగించారు. డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి వేదికపై ఉన్నారు. సాయంకాలం సభ జరుగుతోంది. జన సమూహం లోంచి ఎవరో వేదికపైకి చెప్పు విసిరారు. రాజకీయ చదరంగంలో అదొక భాగం. వేదికకు సమీపంలోకి చెప్పు వచ్చి పడింది. గంభీరంగా పి.వి. మాట్లాడారు. వారం తిరక్కుండా కలెక్టరును బదిలీ చేసి వేటు వేశారు.

పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు:

కడప కేంద్రం 1963 నుండి రిలే కేంద్రంగా పనిచేస్తోంది. 1975 జూన్‌లో మూడు ప్రసారాలు అప్పటి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి యం.లక్ష్మీదేవి ప్రారంభించారు. 1990 ప్రాంతాలలో నూతన భవనాలు ఏర్పడ్డాయి. సంగీత విభాగంలో ఎనిమిది మంది స్టాప్ ఆర్టిస్టులు వున్నారు. వయొలిన్, మృదంగ, తంబూరా, మ్యూజిక్ కంపోజర్ ఖాళీలు వచ్చాయి. డైరక్టరేట్ అనుమతితో వాటిని భర్తీ చేసే ప్రక్రియ మొదలుపెట్టి, విద్వాంసులైన నిపుణుల కమిటీతో సెలెక్షన్లు జరిపించాను. వయొలనిస్ట్‌గా శ్రీమతి భవాని, కంపోజర్‌గా మోదుమూడి సుధాకర్, మృదంగ విద్వాంసుడిగా ధనవాడ ఎంపికయ్యారు. వాళ్ళు తర్వాతి కాలంలో వివిధ కేంద్రాలకు వెళ్ళి లబ్ధప్రతిష్ఠులయ్యారు. అనౌన్సర్ ఇంటర్వ్యూ జరిపి సెలెక్షన్ పూర్తి చేశాను. ఎలాంటి అపవాదు తెచ్చుకోలేదు.

ప్రవృత్తికి సంబంధించిన కార్యకలాపాలు:

వృత్తిరీత్యా ఎలా వివిధ కార్యక్రమాలాలో పాల్గొన్నానో అలానే ఆ రెండేళ్ళలో బయటి కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొన్నాను. హోస్పేట డిగ్రీ కళాశాల వారు వారం రోజుల సైన్స్ వర్క్‌షాప్ నిర్వహించారు. అక్కడి మాథమెటిక్స్  హెడ్ డా. కె. హెచ్. గోపాలకృష్ణమూర్తి ఆహ్వానం మేరకు వెళ్ళి నేను రెండు రోజులు ప్రసంగించాను. 1992లో అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో డా. సూర్యనారాయణ నిర్వహించిన సైన్స్ వర్క్‌షాప్‌కు నేను సంధానకర్తను.

భారత వ్యాఖ్యానం:

తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆంధ్రమహాభారతానికి వ్యాఖ్యానం వ్రాయించే బృహత్ కార్యక్రమాన్ని తలపెట్టారు. సంపాదకులైన డి. నాగసిద్ధారెడ్డి కోరిక మేరకు తిక్కన విరాట పర్వంలో కొంత భాగానికి నేను వ్యాఖ్యానం వ్రాశాను. 22 సంవత్సరాల తర్వాత ఆ గ్రంథం ముద్రణ పూర్తి అయి 2007లో తిరుమలలో ఆస్థాన మండపంలో రాజశేఖరరెడ్డి ఆ గ్రంథాలు ఆవిష్కరించి మమ్ము సత్కరించారు.

నా Magnum Opus:

నా రచనలలో తలమానికం 1994 ఆగస్టులో ప్రారంభించాను. కేంద్ర ప్రభుత్వ ప్రచురణల విభాగం పక్షాన యోజన సంపాదకులు సి.జి.కె.మూర్తి కోరికపై తెలుగు సాహిత్యంలో 20వ శతాబ్దంలో వచ్చిన 15 ప్రసిద్ధ గ్రంథాలను ఎంపిక చేసుకుని వాటిని ఒక్కొక్కటి 25 పుటలకు సంక్షిప్త పరిచి 625 పుటల గ్రంథాన్ని – ‘భారతీయ సుప్రసిద్ధ గ్రంథాలు – తెలుగు’ అనే పేర పూర్తి చేశాను. అది 1997 ఆగస్టు నాటికి ప్రచురణ అయింది. అప్పట్లో డైరక్టర్ జనరల్ (ఆకాశవాణి)గా పనిచేస్తున్న డా. ఓ.పి.కెజ్రివాల్ హైదరాబాద్ ఆకాశవాణిలో ఆ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఆ సభలోనే వారు నన్ను ఢిల్లీ ఆకాశవాణి కేంద్ర డైరక్టర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఆ గ్రంథ ఆంగ్లానువాదం నేనే చేశాను. దానిని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అరుణ్ జైట్లీ 2000 సంవత్సరం ఆంధ్ర రాష్ట్రావతరణ దినోత్సవాలలో ఢిల్లీలో ఆవిష్కరించారు. ఆ గ్రంథం హిందీ అనువాదం డా. లక్ష్మీరెడ్డి, ఒరియా అనువాదం డా. జె.కె.దాస్ చేయగా ప్రచురితమయ్యాయి. ఇతర భాషలలోకి అనువాద ప్రయత్నాలు జరిగాయి. కడపలో వుండగా నేను వ్రాసిన రాయలసీమ రత్నాలు రెండో భాగం ఆవిష్కరణ చేశాం. ఛాయారేఖలు అనువాదం పూర్తి చేశాను.

విశ్వవిద్యాలయ అనుబంధం:

పద్మావతీ విశ్వవిద్యాలయం తిరుపతిలో జర్నలిజం విద్యార్థుల నుద్దేశించి ప్రసంగించాను. తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రభాతవదనం అనువాదానికి ఉత్తమ అనువాద పురస్కారం అందించారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ఎం.ఎ. పబ్లిక్ రిలేషన్స్ టెక్స్ట్ బుక్ కమిటీలో పాఠ్యాంశాలు వ్రాశాను.

రెండేళ్ళ విస్తృత పర్యటనలు, సభలు, సమావేశాలతో రాత్రి 9 గంటలకు ఇల్లు చేరినా, విసుగు లేకుండా వడ్డించి పెట్టిన నా శ్రీమతి శోభాదేవి అభినందనీయురాలు. 1987 నుండి 2010 జూన్ వరకు నేను ఆఫీసు క్వార్టర్స్‌లో వున్నాను. అన్నింటిలోకి కడపలోనే పెద్ద బంగళాలో విడిది చేశాము. అదొక మధురానుభూతి.

Exit mobile version