Site icon Sanchika

జ్ఞాపకాలు – వ్యాపకాలు – 4

[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

కడప గడపలో:

[dropcap]1[/dropcap]6 సంఖ్య నాకు అచ్చి వచ్చింది. 1967 డిసెంబరు 16న తొలిగా ప్రభుత్వ కళాశాలలో కందుకూరులో చేరాను. 1975 ఆగస్టు 15న కందుకూరులో రచయితల సహకార సంఘం వీడ్కోలు అందుకుని 16న కడప ఆకాశవాణిలో చేరాను. ఆగస్టు 14న కళాశాల ఉద్యోగానికి రాజీనామా చేసి 16న జాయిన్ అవడంతో (ఆగస్టు 15 సెలవు కావడం వల్ల) సర్వీసులో ఒక రోజు గ్యాప్ వచ్చింది. తర్వాత చాలా సంవత్సరాలకు దానిని కండోన్ చేశారు. కళాశాల 8 ఏళ్ళ సర్వీసు కూడా ఆకాశవాణి 30 సంవత్సరాల సర్వీసుతో కలిపి 38 సంవత్సరాలైంది.

కడప ఆకాశవాణి 1975 జూన్‌లో మూడు ప్రసారాలు ప్రారంభించి స్వతంత్ర స్థాయికి చేరుకొంది. మదనపల్లెకి చెందిన సౌజన్యమూర్తి టి.ఆర్.రెడ్డి అప్పట్లో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరు. బి.ఆర్. పంతులు, రాళ్ళపల్లి విశ్వనాథం కార్యక్రమ నిర్వహణాధికారులు. ప్రవచన శాఖ ప్రొడ్యూసర్‌గా నేను చేరాను. కోపరేటివ్ కాలనీలోని రెండు అద్దె ఇళ్ళల్లో కేంద్ర కార్యకలాపాలు జరిగేవి. వంటగది ఖాళీగా ఉంటే నాకు అక్కడ సీటు ఏర్పాటు చేశారు. డ్యూటీ ఆఫీసర్లుగా కె.ఆర్. భూషణరావు, జి.ఎస్. రావు, హనుమంతరావు వుండేవారు. ఆరవీటి శ్రీనివాసులు అనౌన్సరుగా వుండి తర్వాత జానపద ప్రొడ్యూసర్ అయ్యాడు. పుట్టపర్తి నాగపద్మిని, వోలేటి పార్వతీశం, కలగా కృష్ణమోహన్ తర్వాత డ్యూటీ ఆఫీసర్లుగా నియమించబడ్డారు.

నేను కడపలో  మూడు సమయాలలో పనిచేశాను.

– 1975 ఆగస్టు 16 నుండి 1978 నవంబరు వరకు ప్రొడ్యూసర్‌గా తొలిసారి.

– 1980 జూన్ 15 నుండి 1982 అక్టోబరు 4 వరకు రెండోసారి.

– 1993 మార్చి నుండి 1995 ఏప్రిల్ వరకు స్టేషన్ డైరక్టర్‌గా.

ఆకాశవాణిలో నా 30 సంవత్సరాల సర్వీసులో పది సంవత్సరాలు కడప, అనంతపురంలోనే పనిచేశాను. రాయలసీమతో నా అనుబంధం అది. రిటైరయిన తర్వాత 2005 – 2010 మధ్య అయిదేళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేయడం కలుపుకొంటే 15 ఏళ్ళు.

ప్రొడ్యూసర్‌గా:

ప్రొడ్యూసర్‌గా తెలుగు ప్రసంగాలు ఏర్పాటు చేయడం నా విధి. సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం నాడు సర్వేపల్లి రాధాకృష్ణన్ మీద కడప ప్రభుత్వ కళాశల ప్రిన్సిపాల్ ఆర్. దయానిధి చేత మాట్లాడించాను. ఫోన్‍లో ప్రిన్సిపాల్‌లో మాట్లాడడం బెరుకుగా అనిపించింది. అక్టోబరు 2 గాంధీ జయంతి నాడు తొలి సూక్తి సుధ సింగరాజు సచ్చిదానందం చేత పలికించాను. పుట్టపర్తి నారాయణాచార్యులు మొదటి వారంలోనే ప్రసంగించారు.

కడప జిల్లా కవి పండిత సజ్జనుల పుట్టినిల్లు. వారానికి రెండు సార్లయినా పుట్టపర్తి వారి ఇంటికి వెళ్ళి ఆ దంపతుల సాహితీ గోష్ఠిలో పాల్గొనేవాడిని. కనకమ్మ మంచి కవయిత్రి. కడప జిల్లా కలెక్టర్‌గా వచ్చిన పి.యల్. సంజీవరెడ్డి తండ్రి పైడి లక్ష్మయ్య కడప వచ్చినప్పుడల్లా కలెక్టర్ బంగళాలో సాహిత్య గోష్ఠి తరచూ జరిగేది

ఉగాదికి, దీపావళికి ఎన్నో కవి సమ్మేళనాలు ఆహుతుల సమక్షంలో నిర్వహించాను. శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, నారాయణరెడ్డి, గుంటూరు శేషేంద్రశర్మ, జంధ్యాల పాపయ్య శాస్త్రి, పుట్టపర్తి, యస్.వి.జోగారావు, రాజన్న కవి ప్రభృతులు తమ కవితలు వినిపించారు. ఎమర్జెన్సీ సమయంలో ఏర్పాటు చేసిన కడప కవి సమ్మేళనంలో శ్రీశ్రీ ఇలా అన్నారు

“మనకున్నదేమో నెంబర్ వన్ డెమోక్రసీ

ఇతంతా ఒక హిపోక్రసీ” – అంటూ సాగిపోయింది.

జిల్లా రచయితల సంఘం:

డా. మల్లెమాల వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షులుగా, జానమద్ది హనుమచ్ఛాస్త్రి కార్యదర్శిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిమ్చారు. రజతోత్సవ సభలకు డా. బెజవాడ గోపాలరెడ్డి (ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షులు), దేవులపల్లి రామానుజరావు (కార్యదర్శి) కడప వచ్చారు. జిల్లాలోని పలువురు రచయితలను ఒక వేదిక మీదకి తెచ్చే ప్రయత్నం ఈ సంఘం చేసింది. అప్పుడప్పుడే చిత్తూరు, కృష్ణా, ఒంగోలు, విశాఖ జిల్లాలలో రచయితల సంఘాలు పోటాపోటీలుగా సమావేశాలు నిర్వహించేవారు. బ్రౌన్ గ్రంథాలయాన్ని పి.యల్. సంజీవరెడ్డి కలెక్టర్‌గా ఉన్న సమయంలోనే హనుమచ్ఛాస్త్రి పునరుద్ధరించి జవజీవాలు పోశారు. ఇప్పుడది ఒక పరిశోధనా గ్రంథాలయం. వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడుస్తోంది.

జిల్లా కవులకు, పండితులకు ఆకాశవాణి ప్రసంగాలు/కవితలు/కథల ద్వారా నేను ప్రోత్సాహం కలిపించానని పలువురు చెబుతూంటారు. ఎం.ఎల్.ఏ. గా ఒక టెరమ్ పని చెసిన పాల వెంకట సుబ్బయ్య దళిత కవి. కేతు విశ్వనాథరెడ్డి, రామప్పనాయుడు వంటి రచయితలు కడప కళాశాలలో పని చేసేవారు. భూతపురి సుబ్రహ్మణ్యశర్మ జిల్లా పరిషత్ పాఠశాల, ముద్దనూరులో పని చేస్తూ శతావధానిగా, జ్యోతిష్కులుగా ప్రసిద్ధులు. పెద్దన సారస్వత సమితి ఏర్పాటు చేసి ప్రారంభోత్సవానికి బెజవాడ గోపాలరెడ్డిని ఆహ్వానించారు. అప్పుడు గోపాలరెడ్డి మా ఇంటికి రావడం విశేషం. కడపలో భువన విజయాలు వేశాం. పుల్లారెడ్డి అనే ఇంజనీరు, మునిసిపల్ కమీషనర్లు వై. వి. రమణారెడ్డి, వేమరాజు నరసింహారావు, ఆంజనేయులు సాహితీప్రియులు. ప్రొద్దుటూరులో కూడా భువన విజయం వేశాం. వైశ్య ప్రబోధిని పత్రికాధిపతి పాలాది లక్ష్మీకాంతశెట్టితో నాకు సన్నిహిత పరిచయం ఏర్పడింది. 2003లో మా నాన్నగారి పేర ఏర్పాటు చేసిన అవార్దు ఆయనకు ఢిల్లీలో అందించాను.

ప్రొద్దుటూరు పండిత మండలి:

పుట్టపర్తి తొలి రోజుల్లో ప్రొద్దుటురులో వుండి తర్వాత ఉద్యోగ రీత్యా (రామకృష్ణ జూనియర్ కళాశాల) కడప మారారు. ప్రముఖ కవి, శివభారతకర్త గడియారం వెంకటశేషశాస్త్రి నివసించే ప్రొద్దుటూరు వెళ్ళి ‘నా జీవితంలో మధుర క్షణాలు’ అనే ప్రసంగాన్ని రికార్డు చేశాను. అనారోగ్య రీత్యా ఆయన కదలలేకపోయారు.

ప్రొద్దుటూరు అనగానే అవధానుల పుట్టినిల్లుగా గుర్తుకొస్తుంది. సి.వి. సుబ్బన్న శతావధాని వారిలో ప్రముఖులు. నరాల రామారెడ్డి మరో శతావధాని. అవధానం చంద్రశేఖర శర్మ, బండ్ల సుబ్రమణ్య కవి, షడ్దర్శనం సుదర్శన శర్మ ప్రభృతులు, ఓరియంటల్ కళాశాలలో పనిచేసే పలువురు అధ్యాపకులు, కుప్పిరెడ్ది పద్మనాభరెడ్డి, యల్లంరాజు శ్రీనివాసరావు ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు. జూటూరు రమణయ్య సాహిత్య పోషకులు. సుబ్బన్న సతీమణి లక్ష్మీకాంతమ్మ వాస్తు శాస్త్ర నిపుణురాలు.

రెవెన్యూ శాఖలో పనిచేసే యస్. రాజన్న కవి వసుచరిత్ర ఉపన్యాసాల ద్వారా సంగీత సాహిత్యనిధిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన పుట్టపర్తి ప్రియశిష్యులు. ప్రొద్దుటూరు అగస్తేశ్వర దేవాలయంలో సాయంకాలాలు కూచొని పుట్టపర్తి కవితలు వ్రాశారు. వారి మరణాంతరం పుట్టపర్తి విగ్రహాన్ని నెలకొల్పారు.

ఆకాశవాణి పురోగతి:

1963లో రిలే కేంద్రంగా ప్రారంభమైన కడప, విశాఖపట్టణం కేంద్రాలు 1975 జూన్‌లో స్వతంత్ర కేంద్రాలయ్యాయి. నేను కడపలో, విజయభూషణ శర్మ విశాఖలో ప్రొడ్యూసర్‌లుగా అదే సంవత్సరం చేరాం. ఉషశ్రీ విజయవాడలో, రావూరి భరద్వాజ హైదరాబాదులో పనిచేస్తున్నారు. 10 కిలోవాట్ల శక్తితో పనిచేసే కడప కేంద్రానికి రేడియో సిలోన్ ప్రసారాలు అంతరాయం కలిగించేవి. 1983 సెప్టెంబరులో 100 కిలోవాట్ల శక్తికి కేంద్ర సాంకేతిక స్థాయిని పెంచారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి పెండేకంటి వెంకట సుబ్బయ్య ప్రారంభోత్సవం చేశారు. నేను, హైదరాబాద్ కేంద్ర డైరక్టరు కేశవ పాండే, చీఫ్ ఇంజనీర్ యం. ఐ. సూర్యనారాయణ ఆ కార్యక్రమంలో పాల్గొన్నాం.

1988 ప్రాంతంలో కడప ఆకాశవాణికి నూతన భవనాలు కట్టారు. పి.ఆర్. రెడ్డి, జి.కె. మరార్ వంటి డైరక్టర్లు అక్కడ పనిచేశారు. 1993-95 మధ్య నేను డైరక్టరు. ప్రొడ్యూసర్‌గా పని చేసిన చోట డైరక్టరుగా పని చేయడం అదృష్టం.

ప్రభుత్వోద్యోగుల క్రీడా సాంస్కృతిక సంస్థ (గోస్కా):

Government Offices Services Sports and Cultural Association (GOSSCA – గోస్కా) అనే పేర 7-7-77న ఒక సంస్థను స్థాపించాము. కడపలో పని చేసే 14 శాఖల ప్రభుత్వోద్యోగులు అందులో సభ్యులు. ఎలక్ట్రిసిటీ బోర్డు సూపరిండెంట్ ఇంజనీరు కె.వి. జోగారావు అధ్యక్షులు. ఆకాశవాణి ఆర్. విశ్వనాధం కార్యదర్శి. బి.పి.స్వామి కోశాధికారి.

మొదటి నెలలో ప్రముఖ సినీ గాయకులు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం షో ఏర్పాటు చేశం. కొంత డబ్బు సంస్థకు మిగిలింది. మరో దఫా ప్రముఖ సినీ నటులు ‘హరనాథ్’ను ఆహ్వానించాం. ఆయన మా యింట్లో ఆతిథ్యం తీసుకోవడం విశేషం.

1980లో ఆ సంస్థకు కార్యదర్శిగా నేను ఎన్నుకోబడి 1982 అక్టోబరులో నేను హైదరాబాద్‌కు ప్రమోషన్ మీద వెళ్ళేంతవరకూ అనేక కార్యకలాపాలు చేశాం. అందులో ప్రముఖంగా చెప్పదగింది భువన విజయం. జోగారావు కృష్ణదేవరాయల వేషం వేశారు. నేను తెనాలి రామకృష్ణుడు. మరో దఫా మల్లెమాల వేణుగోపాలరెడ్డి రాయలు, నేను తిమ్మరసు. ప్రొద్దుటూరు భువనవిజయం ఘనంగా జరిగింది.

ముగ్గురు కలెక్టర్లు:

నేను పని చేసిన మూడు దఫాలలో ముగ్గురు కలెక్టర్లు కడపలో పనిచేశారు. 1976లో పి.యల్. సంజీవరెడ్డి చాలా ఉత్సాహంగా పనిచేశారు. 1977లో నా పరిశోధనా గ్రంథం ‘కందుకూరి రుద్రకవి’ అప్పటి గ్రంథాలయ శాఖామాత్యులు డా. సి.హెచ్. దేవానందరావు ఆవిష్కరించారు. తర్వాత కలెక్టరుగా పి. సుబ్రమణ్యం వచ్చారు. ముఖ్యమంత్రిగా కార్యదర్శిగా పనిచేస్తూ. వై.ఎస్. రాజశేఖర రెడ్డి విమాన ప్రమాదంలో మరణించారు.

1993-95 మధ్య నేను స్టేషన్ డైరక్టర్‌గా కడపలో ఉన్నప్పుడు సాంస్కృతిక రథసారథి డా. కె.వి. రమణాచారి కలెక్టర్‌గా వచ్చారు. దాదాపు రెండేళ్ళు అదొక అద్వితీయ సంగమం. మేమిద్దరం అనేక సాంస్కృతిక సభల్లో పాల్గొన్నాం. ఆయన నాపై ఎంతో ఆదరం చూపేవారు. కుటుంబ మైత్రి ఏర్పడింది. కడప స్మృతులు తలచుకున్నప్పుడు అక్కడి అనుకూల శత్రువులు కొందరు నాపై చేసిన ప్రచ్ఛన్న దాడి మరువలేనిది. డైరక్టర్‌గా నాకు వై. గంగిరెడ్డి, ఆదిత్య ప్రసాద్ వంటి అధికారుల సహకారం మరువలేనిది. ఉద్యోగులం ఇళ్ళ స్థలాలు కూడా కొన్నాం. ఒక టీమ్ వర్క్‌గా పని చేశాం. గొల్లపూడి మారుతీరావు స్టేషన్ ఇంఛార్జిగా 1981లో పనిచేశారు. అప్పుడు ‘ఆడది’ నాటకంలో మేమిద్దరం నటించాం. ‘ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య’ సినిమా తొలి షో కడపలో ఇద్దరం కలిసి చూశాం. అదొక మధుర స్మృతి.

Exit mobile version