జ్ఞాపకాలు – వ్యాపకాలు – 6

0
1

[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

‘రిచ్’రెడ్డి పాళెంలో (1955-60):

నా హైస్కూలు విద్య బుచ్చిరెడ్డిపాళెంలో జరిగింది. సంపన్నులున్న ప్రదేశం కాబట్టి అది ‘rich’రెడ్డిపాళెంగా ప్రసిద్ధి. ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన డా. బెజవాడ గోపాలరెడ్డి, అవిభక్త మదరసు రాష్ట్ర కౌన్సిల్ చైర్మన్ బెజవాడ రామచంద్రారెడ్డి వంటి ప్రముఖులు జన్మించిన వూరు. 1955 జూన్‌లో నేను, మా కజిన్ హరనాథ్ ఆ స్కూలులో ఏడో తరగతి (సెవెన్త్ ఫారమ్)లో చేరాం.  అప్పుడు మా హెడ్‌మాస్టరు సి. రామస్వామి రావు. ఆయన కుమారుడు విశ్వేశ్వరరావు మా సహాధ్యాయి. ‘విశ్వం’ అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఆంగ్లాచార్యులుగా చాలా కాలం పనిచేసి, నెల్లూరు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం తొలి వైస్ ఛాన్స్‌లర్ అయ్యాడు.

ఆ హైస్కూలు స్వర్ణోత్సవాలను ప్రిన్సిపాల్ బి. సుబ్బారావు 1996లో ఘనంగా బుచ్చిలో జరిపి పూర్వ విద్యార్థులమైన మాలో కొంతమందిని సన్మానించారు. అందులో రాష్ట్ర పోలీసు డైరక్టర్ జనరల్‌గా పని చేసిన సి.ఆంజనేయరెడ్డి, నేనూ తదితరులం ఉన్నాం. అదే స్కూల్లో ప్రస్తుత ఉపరాష్ట్రపతి యం. వెంకయ్యనాయుడు, జిల్లా పరిషత్ చైర్మన్ నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త బొల్లినేని కృష్ణయ్య సోదరులు విద్యాభ్యాసం చేశారు. ఇప్పుడది జూనియర్ కళాశాలగా మారింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆ ఊర్లో లేకపోవడం విచారకరం.

క్రమశిక్షణ:

మేం ముగ్గురు అన్నదమ్ములం (పెదనాన్నల కుమారులు ఇద్దరూ, నేను) అక్కడ ఐదేళ్ళు చదివి 1960లో అప్పట్లో SSLC (11th Form) పరీక్షలు వ్రాశాం. పదేళ్ళ క్రిందట అదే స్కూల్లో మా బాబాయిలు ముగ్గురులు 1947లో SSLC పరీక్షలు వ్రాశారు. మాకు మా నాయనమ్మ రంగమ్మ తృప్తిగా భోజనం చేసి పెట్టేది. కోనేటికి సమీపంలోని ఒక సత్రంలో బస. మాకు సంరక్షకుడిగా మా బాబాయి వెంకటప్పయ్య. ఆయన క్రమశిక్షణలో మేం ఐదేళ్ళు చదువుకు గండి పడకుండా చదివాం. స్కూలు నుంచి రాగానే ఒకటిన్నర గంట మా చేత చదివించేవాడు. భోజనానంతరం రాత్రి ఎనిమిది గంటల వరకు చదువు తప్పనిసరి. మా చేత ప్రశ్నలకు సమాధానాలు అప్పగించి చెప్పమనేవాడు. ఆయనకు చెవులు వినిపించవు గాబట్టి వెనుక నుంచి మరో సోదరుడు ‘ప్రాంప్టింగ్’ చెప్పేవాడు. ఆరు నెలల పరీక్షలలో 60 శాతం మార్కులు వస్తే ఆయన కోపగించుకొనేవాడు. కనీసం 80 శాతం రావాలని మందలించేవాడు. సినిమాలకు వెళ్ళడానికి పర్మిషన్ లేదు. అప్పట్లో గిరిజా టాకీస్ ప్రసిద్ధి. సంవత్సరాంతంలో పరీక్షలైన తరువాత ఆ సినిమా హాల్ యాజమాన్యంవారు ఆయన సహాధ్యాయులు గాబట్టి మా ముగ్గురినీ ఉచితంగా పంపేవారు. ఆయనను చూస్తే మాకు భయం. అలా భయభక్తుల వల్ల మా చదువు నిరభ్యంతరంగా సాగింది.

జనరల్ మాథమెటిక్స్:

అప్పట్లో 9th formలో విద్యార్థులు Composite Maths లేదా జనరల్ మాథమాటిక్స్ ఎంపిక చేసుకోవాలి. మా బాబాయి మమ్మల్ని జనరల్‍లో కూచోబెట్టాడు. రామస్వామి గారి తర్వాత వరదరాజులు నాయుడు హెడ్మాస్టరుగా వచ్చారు. ఆయన చాలా స్ట్రిక్ట్. మూడేళ్ళకు ఆయన బదిలీ అయి మేము SSLC కొచ్చేసరికి మాకు చిదంబరం హెడ్మాస్టరు.  ఆయన తల ముందు భాగం గొరిగించుకునేవారు. అందుకని ‘అర్ధపింగళం’ అని పిలిచేవారు. మాకు SSLC సర్టిఫికెట్ ‘బుక్’ (book) రూపంలో ఇచ్చేవారు. అందులో 9. 10, 11 తరగతుల మార్కులు, మా ఆటపాటల వివరాలు నమోదు చేసేవారు.

మాకు అధ్యాపకులుగా ఉన్నతాదర్శాలు గల వ్యక్తులుండేవారు. సత్రం లోంచి మేం టెన్త్ క్లాస్‌లో రామాలయం వెనుక బాడుగ ఇంట్లోకి మారాం. అక్కడ వెలగచెట్టు వుండేది. ముందుభాగంలో నేలనూతల గోపాలకృష్ణయ్య మేస్టారు కుటుంబం వుండేది. అది ఇల్లు అనడం కంటే ఒక చిన్న పాఠశాల అనవచ్చు.

ఆదర్శ అధ్యాపకులు:

నేలనూతల గోపాలకృష్ణయ్య ఉన్నతాదర్శాలు గల వ్యక్తి. ఆయనకు ఇద్దరు కుమారులు. వారి పిల్లలే గాక, వారి బంధువుల పిల్లలు నలుగురు అదే ఇంట్లో వుండి చదువుకొనేవారు. 20 మంది దాక ట్యూషన్ విద్యార్థులు ఉదయం, సాయంత్రం వచ్చేవారు. ఎక్కువమంది ట్యూషన్ ఫీజు ఇవ్వనివారే. ముంగమూరు రామప్రసాదరెడ్డి అనే ఒక మిత్రుడుండేవాడు. వాళ్ళ నాన్నగారు సంవత్సరానికి ఒకటి రెండు సార్లు కార్లో వచ్చి గురువుగారికి గురుదక్షిణ సమర్పించేవారు. ఆయన 30 ఏళ్ళ అధ్యాపక జీవితంలో ఎందరో ఉన్నతోద్యోగులయ్యారు. ఆయన పేర ఒక హైస్కూల్ వాళ్ళ మనవడు ఏర్పాటు చేసి పదేళ్ళకు పైగా నడుపుతున్నాడు. ప్రతి సంవత్సరం ఆయన జొన్నవాడ కామాక్షిదేవి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలలో అన్నదానం చేసేవారు. మేమందరం వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొచ్చేవారం.

కోనేటివీధిలో గోపాలకృష్ణయ్య, అదే స్కూలులో పనిచేసే మరో అధ్యాపకుడు బొట్లగూడూరు నరసింహం వుండేవారు. కోనేటిలో నీళ్ళు అన్ని మాసాలలోనూ వుండేవి. రామాలయం తెప్పోత్సవాలలో కోనేటిలో స్వామి విహరించేవాడు. ఆ చుట్టుపక్కల రాఘవయ్య, రమణప్పనాయుడు, విశ్వనాథం, సుబ్బారావు తదితర అధ్యాపకులు నివసించేవారు. మా సహ విద్యార్థి కృష్ణమాచారి ఆలయ పురోహితును కుమారుడు. వాళ్ళు కోనేటికి ఎదురు వీధిలో వుండేవారు. వాళ్ళ అన్నయ్య టి.వి.రాఘవాచారి మదరాసు దూరదర్శన్‍లో డిప్యూటీ డైరక్టర్‍గా పనిచేసి చరమాంకంలో కంచికామకోఠి పీఠాధిపతికి సన్నిహితులుగా 20 ఏళ్ళు వ్యవహరించారు. ఆయన సిఫారసు మీద కంచి జయేంద్ర సరస్వతీ స్వాములవారు 2008 దసరా ఉత్సవాలలో ఆస్థాన విద్వాంసుడిగా నన్ను నియమించి సన్మానించారు. ఉత్తరాధికారి అయిన శ్రీ విజయేంద్ర సరస్వతీస్వాములవారు అందుకు ఎంతో సంతోషించారు. రామాలయానికి ఎదురు వీధిలో బుచ్చిలో దొడ్లా వారి సంస్థాన భవనం విశాలంగా ఉండేది.

కోదండరామస్వామి ఆలయం:

దాదాపు 240 ఏళ్ళ క్రితం బుచ్చిరెడ్డి పాళెంలో దొడ్లా కుటుంబానికి చెందిన రామిరెడ్డి 1765లో కోదండరామస్వామి ఆలయ నిర్మాణం ప్రారంభించి 1784లో పూర్తి చేశారు. బ్రహ్మోత్సవాలు చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమి నాడు ప్రారంభీంచిన్ 9 రోజులలో నిర్వహిస్తారు. సీతారామ లక్ష్మణుల విగ్రహాలు పెద్దవిగా ఆకర్షణీయంగా ఉంటాయి. రాజగోపురం సుదూర ప్రాంతాలకు కూడా కనిపిస్తుంది. రథోత్సవం విశేషం. కశ్యపుడు పౌండరీక యాగం ఈ ప్రాంతంలో చేశాడని ప్రశస్తి. రామాలయానికి ఎదురుగా ఆంజనేయస్వామి ఆలయం వుంది. దాని పక్కనే అప్పట్లో ఒక కాఫీ హోటల్ వుండేది. వార్షికోత్సవాలకు చుట్టుపక్కల గ్రామాలవారు విశేషంగా వస్తారు. పాఠశాల విద్యార్థిగా నేను తరచు ఆంజనేయస్వామికి ప్రదక్షిణాలు చేసేవాడిని. రామాలయం ప్రాంగణంలో కూచొనేవాళ్ళం.

కాలినడకన 10 మైళ్ళు:

ఆదివారం సెలవు కాబట్టి మేము ముగ్గురు సోదరులం విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణుల వలె మా బాబాయి ముందు నడవగా, కాలినడకన 10 మైళ్ళు నడిచి బుచ్చి నుండి మా స్వగ్రామం చెన్నూరు శనివారం వెళ్ళేవాళ్ళం. అక్కడ చాకలికి బట్టలు వేసి ఉతికించుకుని మళ్ళీ సోమవారం పొద్దుటే స్కూలు టైంకి బుచ్చి చేరేవారం. ఆ రోజుల్లో కొందరు రెడ్ల ఇళ్ళవాళ్ళు మజ్జిగ ఉచితంగా పోసేవారు. మా ముగ్గురిలో ఒకరు డ్యూటీలు వేసుకుని రెండు ఇళ్ళకు వెళ్ళి మజ్జిగ పోయించుకు వచ్చేవాళ్ళం. పాలు అమ్మే రోజులు కావవి. మా నాయనమ్మ మాకు రుచికరంగా వంటలు ఆమె ఓపికను బట్టి తయారుచేసేది. మడి, ఆచారం ఆమె కలవాటు. ఊరగాయ జాడీలు తీయాలంటే మడిగా తీసేది.

పురాణ పఠనం:

మా నాయనమ్మ చదువుకోలేదు. కానీ రామయణ భారత భాగవత కథలు వివరంగా ఆమె చెప్పగలదు. నాకప్పుడు 12 ఏళ్ళు. నా చేత భారతంలోని పద్యాలు చదివి వినిపించుకునేది. మా తెలుగు పాఠ్యాంశాలలోని పద్యభాగాలు వినిపిస్తే నన్ను ఎత్తుకొని ముద్దుపెట్టుకొనేది. ముగ్గురిలోకి నేనే చిన్నవాడిని. అందుకని ఏదైన పండు ఆమె కెవరైనా ఇస్తే అది నాకిచ్చేది. తీరిక వేళల్లో మా రంగమ్మవ్వ ఆ వీధిలోని రెడ్డమ్మల వద్దకు వెళ్ళి వాళ్ళకు పురాణకథలు ఆసక్తిగా చెప్పేది. వాళ్ళు ముత్తైదువ వచ్చిందని పండు, తాంబూలం ఇచ్చేవారు. ఆ పండు దాచిపెట్టి సాయంకాలం నాకిచ్చేది. ఆమె రంగనాథ్ ట్రావెల్స్, నెల్లూరు వారి రైలులో నలభై రోజులు ఉత్తరదేశ యాత్ర పూర్తి చేసుకొని వచ్చింది.

కాశీ సమారాధన పూర్తి కాగానే, 40 పేజీల నోట్సు తెమ్మంది. నెల్లూరులో బయలుదేరిన మొదటి రోజు మొదలు 40 రోజుల్లో ఆమె సందర్శించిన కాశీ, గయ, ప్రయగ క్షేత్రాలు, అక్కడి విశేషాలు పూస గుచ్చినట్టు చెప్పింది. మా తాత సుబ్బయ్య మా వూళ్ళో వ్యవసాయం పనులు చూసుకొంటూ యాత్రలకు వెళ్ళలేదు. ఆయనకు పదిమంది సంతానం. 8మంది మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. పూర్ణ జీవితాన్ని అనుభవించి 84వ ఏట 1964 డిసెంబరులో ఆయన శివైక్యం చెందారు మా చెన్నురులోనే. ఆయనకు నేను నశ్యం డబ్బా కొని తీసుకెళ్ళి ఇస్తే ఎంతో సంబరపడేవారు.

మేజర్ పంచాయతీ:

బుచ్చిరెడ్డిపాళెం 1960 లోపు మేజర్ పంచాయతీ. ఆ ఊళ్ళో రెండు రెడ్ల కుటుంబాల వారికి రాజకీయ వైరుధ్యం. ఒకటి దొడ్లా కుటుంబం. మరొకటి బెజవాడ వారి కుటుంబం. 1957లో సాధారణ ఎన్నికలు జరిగాయి. అంతకు ముందు పంచాయతీలో ఎన్నికలు జరిగాయి. పోటాపోటీగా జరిగిన ఎన్నికలలో గలాటాలు వుండేవి కావు. బెజవాడ రామచంద్రారెడ్డి ఒక పక్షం, బెజవాడ గోపాలరెడ్డి మరొక పక్షం. రామచంద్రారెడ్డి జస్టిస్ పార్టీ. గోపాలరెడ్డి కాంగ్రెసు పార్టీ. ఇద్దరికీ సన్నిహిత బంధుత్వం వుంది.

రామచంద్రారెడ్డి స్వతంత్ర పార్టీ స్థాపకులలో ఒకరు. మదరాసు లెజిస్లేటిక్ కౌన్సిల్ అధ్యక్షులుగా 1930-37 మధ్య వ్యవహరించారు. ఆయన జస్టిస్ పార్టీ తొలి అధ్యక్షులు. 1952-57 మధ్య ఆయన నెల్లూరు లోక్‌సభ సభ్యులు. బ్రిటీషు వారు ఆయనను ‘Commander of the Order’ బిరుదుతో సత్కరించారు. 1959లో స్వతంత్రపార్టీ ఆరంభించినప్పుదు రాజాజీ, రంగాలతో కలిసి ఆయన క్రియాశీలక పాత్ర  పోషించారు. రామచంద్రారెడ్డి కుమారులు బెజవాడ పాపిరెడ్ది నాలుగు చట్టసభలలో – శాసనసభ, శాసనమండలి, లోక్‌సభ, రాజ్యసభలలో సభ్యులు. తెలుగుదేశం పార్టీ 1982లో ఎన్.టి.రామారావు గారు ప్రారంభించినప్పుడు పాపిరెడ్డి ఆ పార్టీకి ఉపాధ్యక్షులు.

డా. బెజవాడ గోపాలరెడ్డితో పరిచయం:

బుచ్చి అనగానే యావదాంధ్రదేశంలో గోపాలరెడ్డి గారు గుర్తుకొస్తారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకెళ్ళి సంవత్సరాలు గడిపారు. చిన్నవయసులోనే మదరాసు రాష్ట్రంలో మంత్రి అయ్యారు. 1955లో కర్నూలు రాజధాని అయిన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో సమాచార ప్రసారశాఖ మంత్రి అయి, 1967 మే నుంచి 1972 జూలై వరకు ఉత్తరప్రదేశ్ గవర్నర్‍గా వ్యవహరించారు. వారి ఇల్లు బుచ్చిలో మొన్నటిదాక వుండేది.

నేను వేద సంస్కృత కళాశాలలో 1971లో అవధానం చేసినప్పుడు గోపాలరెడ్డి వచ్చి సభానంతరం నన్ను సన్మానించారు. అది మొదలు నేను కడప, విజయవాడ, హైదరాబాదు, ఢిల్లీ ఆకాశవాణి కేంద్రాలలో పని చేసినప్పుడు ఆయన పర్యటనల సందర్భంలో నేను వారిని ఎన్నోసార్లు కలిసి గంటల కొద్దీ సమయం గడిపాను. కవిత్రయ అవార్దును నెల్లూరులో నేను వారి చేతుల మీదుగా స్వీకరించాను. 2004లో బెజవాడ గోపాలరెడ్డి అవార్డు పేర నాకు స్వర్ణకంకణం నెల్లూరు టౌన్ హాలులో బహుకరించారు.

బుచ్చిరెడ్డిపాళెం అనగానే 60 ఏళ్ళ నాటి జ్ఞాపకాల దొంతరలు గుర్తుకొస్తాయి. అప్పతి స్కూలు అధ్యాపకులు, మస్తాన్ వంటి స్నేహితులు, గోపాలకృష్ణయ్య వంటి అధ్యాపకులు, ఊరి మధ్యలో పారే మలిదేవి మురికి కాలువ, ఊరి మధ్యలో శివాలయం, తోటలో వెంకటప్పయ్య విశాలప్రాంగణం మధుర స్మృతులు. ఆ రోజుల్లో లేబర్ బస్ అని ఒకటి ఊర్లోకి వచ్చేది. అది రాజుపాళెం నుండి నెల్లూరు మీదుగా బుచ్చికి రాత్రి 8 గంటలకు వచ్చేది. ఆ బస్సు రాగానే నాకు నిద్రపోవడానికి మా బాబాయి పర్మిషన్ ఇచ్చేవాడు. అదొక మధుర స్మృతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here