జ్ఞాపకాలు – వ్యాపకాలు – 8

1
2

[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

విజయవాడ జోన్‌లో విస్తృత పర్యటనలు:

[dropcap]న[/dropcap]వంబరు 78 నుండి జూన్ 1980 వరకు నా అధికార పరిధిలోని అన్ని జిల్లాలకు వెళ్ళి అనేక కార్యక్రమాలు రికార్డు చేశాను. కేవలం సాహిత్యానికే నా శాఖ పరిమితం కాదనీ, సామాజిక సంస్థల పరిచయాలు కూడా ప్రసంగశాఖ ప్రసారాలలో భాగమనీ చక్కగా నిరూపించాను. ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు భద్రాచలంలో కల్యాణోత్సవ సమయంలో శ్రీ రామనవమి నాడు వైభవంగా జరుగుతాయి. దాని వ్యాఖ్యానాన్ని ప్రత్యక్ష్యంగా ప్రసారాలు విజయవాడ కేంద్రం అనాదిగా ప్రసారం చేస్తూ వస్తోంది. 1980 సంవత్సరంలో ఒక రోజు ముందే మా సిబ్బంది డైరక్టర్‌తో సహా భద్రాచలం వెళ్ళి కల్యాణవేదికపై యంత్రాలను అమరుస్తున్నాం. అప్పటి దేవాదాయ శాఖ కమీషనరు యం. చంద్రమౌళిరెడ్డి ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ రాత్రి 9 గంటలకు వేదిక వద్దకు వచ్చారు. మా సిబ్బందిని వేదికపై చూచి – “మీరంతా వేదిక కింద ఏర్పాట్లు చేసుకోండి. స్టేజి మీద కాదు. ప్రేక్షకులకు అడ్డు వస్తారు” అని కఠినంగా చెప్పి వెళ్ళిపోయారు. వ్యాఖ్యాతలు ముఖాముఖీ చూస్తే తప్ప చెప్పలేరు. అప్పటికి ఛానెల్ ప్రసారాలు లేవు. మా డైరక్టర్ శివప్రకాశానికి కోపం వచ్చి “మనం వ్యాఖ్యానం క్యాన్సిల్ చేసి వెళ్ళిపోదాం” అన్నారు గంభీరంగా. “లక్షలాది మంది శ్రోతలు బాధపడతారు సార్!” అన్నాను. ఆ రాత్రికి భద్రాచల దేవాలయ కమిటీ అధ్యక్షులు ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్‌ను కలిసి అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని వివరించాము. ఆయన మంచి మనసుతో చంద్రమౌళిరెడ్డిని ఒప్పించారు. అలా వ్యాఖ్యాతలం వేదికపై నుండి ప్రసంగాలు చేశాం.

శ్రీహరికోట:

శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రం జగద్విఖ్యాతం. దాని మీద ఒక రూపకం చేయాలని డైరక్టర్‌ని సంప్రదించాం. సాధారణంగా వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. మొత్తం మీద అనుమతి ఇచ్చారు. నేను మా ఇంజనీరింగ్ సిబ్బందితో శ్రీహరికోట చేరుకొన్నాను. మంచి గెస్ట్ హౌస్ వారిది. హైదరాబాద్ నుండి సాటి ప్రొడ్యూసర్ రావూరి భరద్వాజ కూడా అదే రోజు వారి యూనిట్‍తో రికార్డింగ్‍కు వచ్చారు. మూడు రోజులు విస్తృతంగా రికార్డు చేశాం.

కాకినాడలో మైనర్ పోర్ట్‌ల డైరక్టర్ కెప్టెన్ సత్యానందంతో సంప్రదించి మైనర్ పోర్టులపై రూపకం ప్రసారం చేశాను. గ్రీకు ఓడ పైకెక్కి వివరాలు సేకరించాను. రాజమండ్రి వెళ్ళి ఆంధ్రా పేపర్ మిల్స్‌లో కాగితం తయారీపై రూపకం ప్రసారం చేశాను. నాగార్జునసాగర్ చీఫ్ ఇంజనీరు వి. శ్రీహరిని స్టూడియోకి పిలిచి సాగర్ ఆయకట్టు వివరాలు ఇంటర్వ్యు చేశాను. టెలికాం శాఖ హనుమాన్ చౌదరి, పోస్టల్ శాఖ భగవాన్ దాస్, గన్నవరం ఎయిర్‍పోర్టు డైరక్టరు రాజారావు, చీఫ్ ఇంజనీరు, వివిధ జిల్లాల కలెక్టర్లతో ఇంటర్వ్యూలు చేశాను.

జర్నలిజం విద్యాభ్యాసం:

నేను నిరంతర విద్యార్థిని. 1967లో ఎం.ఏ. పూర్తి చేశాను. 1973-76 మధ్య పి.హెచ్.డి. కోసం కందుకూరి రుద్రకవిపై పరిశోధన చేశాను. 1979-80 మధ్య విజయవాడలో భవన్స్ జర్నలిజం కోర్సులో చేరాను. శని, ఆదివారాలు క్లాసులు. పి.టి.ఐ. కృష్ణమూర్తి దాని నిర్వాహకుడు. పదిమంది దాకా విద్యార్థులం. పరీక్షలలో నెగ్గాను. 1983-84 మధ్య హైదరాబాదులో భవన్స్ జర్నలిజం కాలేజీలో పి.జి. డిప్లొమా – పబ్లిక్ రిలేషన్స్ క్లాసులకు అప్లికేషన్ వేశాను. ప్రిన్సిపాల్ వి.హెచ్.దేశాయి ఇంటర్వ్యూ చేస్తూ – “మీరు అసిస్టెంట్ డైరక్టర్‍గా పని ఒత్తిడిలో వుంటారు. క్లాసులకు రారు. మీరు క్లాసులో ఫస్ట్ వస్తానని హామీ యిస్తే సీటు ఇస్తాను” అన్నారు. పక్కనే వున్న సమాచార శాఖ జాయింట్ డైరక్టరు సి.వి. నరసింహారెడ్డి – “శ్రద్ధగా వస్తారు” అని హామీ ఇచ్చాడు. మాట ఇచ్చిన ప్రకారం నేను శ్రద్ధగా క్లాసుల కెళ్ళాను. ఆ సంవత్సరం పి.ఆర్. కోర్సులో దేశం మొత్తం మీద ఫస్ట్ వచ్చి గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ సంపాదించాను. ఎం.ఏ.లో వచ్చిన గోల్డ్ మెడల్‌తో కలిపితే మూడు మెడల్స్ వచ్చాయి.

మధ్యలో మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం వారి బ్యాచిలర్ ఇన్ జనరల్ లా – మూడేళ్ళ కోర్సు కరెస్పాండెన్స్ కోర్సులో చేరాను. మూడు సంవత్సరాల తర్వాత పరీక్ష వ్రాయడానికి మదరాసు వెళ్ళేందుకు సెలవు దొరకలేదు. ఢిల్లీలో వుండగా 2000 సంవత్సరంలో 53వ ఏట భారతీయ విద్యాభవన్‌లో జ్యోతిషం కోర్సులు శని, ఆదివారాలు క్లాసులకు హాజరై పరీక్షలు వ్రాసి ప్యాసయ్యాను. అలా చదువుతూనే వున్నాను.

మదరాసులో శిక్షణ:

హైదరాబాదులో ఆకాశవాణి ప్రాంతీయ శిక్షణా కేంద్రం డైరక్టరుగా పి. శ్రీనివాసన్ పనిచేశారు. ఆగస్టులో వారం రోజులు పాటు కార్యక్రమ నిర్వాహకులకు మదరాసు ఆకాశవాణిలో శిక్షణ ఏర్పాటు చెశారు. కడప నుండి నేను, విజయవాడ నుండి ఉషశ్రీ, రాళ్ళపల్లి అనంత విశ్వనాథం హాజరయ్యాం. విశ్వనాథం, నేను ఒకే హోటల్‌లో బస చేశాం. ఒకరోజు ఉదయం 8 గంటలకు ఆకాశవాణికి వెళ్ళడానికి మేమిద్దరం మదరాసు రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఒక రోడ్ క్రాస్ చేశాము. ట్రాఫిక్ పోలీసు వచ్చి “మీరిద్దరూ జీబ్రా క్రాసింగ్ దగ్గర దాటలేదు కాబట్టి ఇది నేరం” అని చెప్పి, మా ఇద్దరినీ ఒక రిక్షాలో కూర్చోపెట్టి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళాడు. వచ్చీ రాని తమిళంలో హెడ్ కానిస్టేబుల్ వద్ద ‘తెలియక తప్పు చేశామ’ని లెంపలు వాయించుకొన్నాం. ‘ఉద్యోగస్థులు, డ్యూటీ మీద వెళుతున్నారు, వదిలెయ్’ అని కానిస్టేబుల్ ఆజ్ఞాపించాడు. బ్రతుకు జీవుడా! అని బయటపడ్డాం. ఆ వారం రోజుల్లో మదరాసు దూరదర్శన్‌లో పని చెస్తున్న యం.యస్. శ్రీరాం ఉషశ్రీని, నన్ను కూర్చోబెట్టి ఒక ప్రోగ్రాం రికార్డు చేశాడు. మదరాసు నుండి పాండిచ్చేరి వెళ్ళి అరవిందాశ్రమం చూసి వచ్చాం. దేవులపల్లి కృష్ణశాస్త్రిని మదరాసులో కలిశాను. ‘పద్మనాభరావు అందమైన కందపద్యం’ అని కాగితం మీద వ్రాసి చూపారు.

తుఫాను బీభత్సం:

1979 మే నెలలో వేసవి సెలవలకు నా శ్రీమతి శోభ, ముగ్గురు పిల్లలు బిట్రగుంటకు మా అత్తగారి ఇంటి కెళ్ళారు. ఓ శనివారం వాళ్ళను చూసి వద్దామని నేను బిట్రగుంట వెళ్ళాను. సోమవారం డ్యూటీ కెళ్ళడానికి బయలుదేరాను. మే 12 రాత్రి ఉధృతమైన తుఫాను నెల్లూరు – ఒంగోలు – విజయవాడ మధ్య (T 5.5) విపరీతంగా వచ్చింది. హైవే పూర్తిగా దెబ్బతింది. రాకపోకలు ఆగిపోయాయి. 18 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 600 శవాలను తొలగించలేని స్థితి. పాలేరు, మూసీ నదుల ప్రవాహం అధికమై 20 రోజులు రైళ్ళు ఆపివేశారు. పొదిలిలో ఆ రాత్రి 355 మిల్లీమీటర్ల వర్షం పడింది. 50వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 650 కోట్ల రూపాయల ఆస్తి నష్టమైందని అంచనా!

నేను 13 సాయంకాలానికి రకరకాల ప్రయాణ సౌకర్యాలతో విజయవాడకు చేరాను. 15వ తేదీ వెంటనే తుఫాను ప్రాంతాలకు నన్ను రికార్డింగు యూనిట్‌తో మా డైరక్టరు నెల్లూరు జిల్లా పర్యటనకు పంపారు. 17న జిల్లా కలెక్టరు సి. అర్జునరావును ఇంటర్వ్యూ చేశాను. రాష్ట్ర ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, తదితర మంత్రులు, భాట్టం శ్రీరామమూర్తి, ఆనం సంజీవరెడ్డి, నేదురుమిల్లి జనార్దనరెడ్డి ఆ ప్రాంతాలు పర్యటిస్తుంటే రికార్డు చేశాను.

ప్రధాని మొరార్జీ పర్యటన:

1979 జూన్ 4న ప్రధానమంత్రి మొరార్జీ దేశాయి హెలికాప్టర్‌లో తుఫాను బాధిత ప్రాంతాలు చూశారు. కావలిలో బహిరంగ సభలో మాట్లాడారు. నేను వెళ్ళి వారి ప్రసంగం రికార్డు చేశాను. జనార్దనరెడ్డి చురుకుగా పాల్గొన్నారు. బి. రాందేవ్ అనే మంత్రి వచ్చారు. తుఫాను సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. ప్రధాని పర్యటనపై రేడియో నివేదిక ప్రసారం చేశాను.

రాష్ట్రపతి నీలం పర్యటన:

జూన్ 9న రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నెల్లూరు జిల్లాలో అధికంగా దెబ్బతిన్న చెన్నాయపాళెం సందర్శించారు. నేను మళ్ళీ నెల్లూరు వెళ్ళి రాష్ట్రపతి ప్రసంగం రికార్డు చేసి ప్రసారం చేశాను. ఒకే నెలలో ఇద్దరు ప్రముఖుల కార్యక్రమాలు రికార్డు చేశాను.

కేవలం సాహిత్య కార్యక్రమ ప్రసారాలే గాక సామాజిక కార్యక్రమాల బయటి రికార్డింగులు (OB రికార్డింగులు) చేసే అవకాశం విజయవాడలో లభించింది. ఆ సంవత్సరంలో గోదావరి పుష్కరాలు వచ్చాయి. వాటికి వ్యాఖ్యానాలు ఏర్పాటు చేశాం. మా డైరక్టరు శివప్రకాశం నా మీద ఆదరం చూపారు. మిగతా సహచరులు కూడా ప్రోత్సహించారు. డబ్బింగ్, ఎడిటింగ్ విషయంలో సి. రామమోహనరావు సహకరించారు. నాతో పనిచేసిన వీరభద్రరావు సినీనటుడై సుత్తి వీరభద్రరావుగా పేరు తెచ్చుకొన్నాడు.

నూతన భవనాలలోకి:

1948 నుంచి 1978 వరకు 40 సంవత్సరాలు ఆకాశవాణి స్టూడియోలు పున్నమ్మతోటలో కొనసాగాయి. బందరు రోడ్డు మీద నూతన భవనాలు నిర్మించారు. పెద్ద హడావిడి లేకుండా 1979 ఏప్రిల్ 29న లాంఛనంగా స్టేషన్ డైరక్టరు శివప్రకాశం ఆధ్వర్యంలో నూతన భవనాలలోకి ప్రవేశించాం. అంతకు ముందు పెద్ద హాలులో ఆరు మంది కార్యనిర్వాహకులం కూచుని పనులు నిర్వహించేవాళ్ళం. నాకు ఎడమ వైపు వోలేటి వెంకటేశ్వర్లు, మిగతా అధికారులు కూచునేవారు.

హోమియో క్లాసులు:

డా. ఎక్కిరాల కృష్ణమాచార్యులు World Teacher Trust పేర జగద్విఖ్యాతులు. ఆయన సాయంకాలలలో హోమియో క్లాసులు రెండు నెలల పాటు నిర్వహించారు. నేను చాలా క్లాసులు హాజరయ్యాను.  కానీ మధ్యలో మూడు వారాల పాటు జర్వం వచ్చింది. డా. సమరం రక్త పరీక్ష చేసి ‘కామెర్లు’గా నిర్ధారించారు. సెలవు పెట్టాను. తగ్గిపోయింది.

విస్తృతంగా సభలు – సమావేశాలు:

విజయవాడ పరిసర ప్రాంతాలలోని అన్ని జిల్లాలకు నేను సభలలో పాల్గొనడానికి వెళ్ళాను. సాహిత్య సమావేశాలు ప్రముఖం. తాడేపల్లిగూడెం సారస్వత సమితిలో, రేపల్లె చైతన్య లహరిలో ప్రసంగించాను. మాచెర్ల ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డా. వి. వి. యల్. నరసింహారావు వాళ్ళ కళాశాల వార్షికోత్సవానికి  నన్ను, తుర్లపాటి కుటుంబరావును ఆహ్వానించారు. సయ్యద్ అప్పలస్వామి కళాశాల, శాతవాహన కళాశాల సభలలో పాల్గొన్నాను. నోబెల్ బహుమతి గ్రహీత మదర్ తెరెసా మాంటిసోరీ కళాశాలకు వస్తే ఆమెను కలిశాను. మచిలీపట్టణం సారస్వత మిత్రులు ఆహ్వానించారు.

శాంతినికేతన్:

విశాఖపట్టణంలో 1979లో ఆంధ్రప్రదేశ్ ఓరియంటల్ కాన్ఫరెన్స్ జరిగింది. మూడు రోజుల సభలలో నేను అష్టకాలలో రసపోషణపై ప్రసంగించాను. ఆ దరిమిలా శాంతినికేతన్‌లో జరిగిన అఖిల భారత ఓరియంటల్ కాన్ఫరెన్స్‌లో UDAHARANA LITERATURE అనే అంశంపై ప్రసంగించాను. ఆ సభలకు నేను, బేతవోలు రామబ్రహ్మం, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ కలిసి వెళ్ళి కలకత్తా మీదుగా శాంతినికేతన్ వెళ్ళాము. ఆచార్య కోరాడ మహాదేవశాస్త్రి మా సెషన్ అధ్యక్షులు. అదే సంవత్సరం ఢిల్లీలో జరిగిన ఆకాశవాణి ప్రొడ్యుసర్స్ అసోసియేషన్ సభలకు ఏప్రిల్‍లో హాజరయ్యాను. సమాచార ప్రసార శాఖల మంత్రి యల్.కె. అద్వాని ప్రసంగించారు ఆ సభలో. నేను పార్లమెంటు సభ్యులు పి. పార్థసారథి క్వార్టర్స్‌లో బస చేశాను. ఢిల్లీలో ప్రముఖ సాహితీవేత్త డా. ఇలపావులూరి పాండురంగారావును కలిసి వారి ఆంగ్ల గ్రంథం Women in Valmiki అనువాదానికి అనుమతి కోరాను. నేను వారితో భోజనం చేస్తుంటే వారి కుమారులు ఐ.వి. సుబ్బారావు IASకు సెలెక్టు అయినట్టు అప్పుడే ఫోను వచ్చింది. సుబ్బారావు ప్రస్తుతం ఉపరాష్ట్రపతి కార్యదర్శి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here