Site icon Sanchika

గోడ మీది బల్లి

[dropcap]ఆ[/dropcap]మె తన పేరు గట్టిగా భర్త పిలుస్తుంటే,”వస్తున్నా” అంటూ ఇంకో సారి చీర మీద పెట్టుకున్న మేచింగ్ నగలు అద్దంలో సరిచూసుకుని, వయ్యారంగా గది బయటకి వచ్చింది. తన గది ముందే భర్త చనువుగా ఒక వ్యక్తితో భుజం మీద చెయ్యి వేసి మాట్లాడ్తూ, ఆమెని చూడగానే ఆమెతో “చూడు ఎవరొచ్చారో..” అన్నాడు. ఆమె నవ్వుతూ చూసి ఆ వ్యక్తి ఇటు తిరిగి “బావున్నారా” అనేసరికీ షాక్ తింది.

“ఆశ్చర్యపోతున్నావా.. అవును వీడికి మన మీద గాలి మళ్లి రావడం ఆశ్చర్యమే.. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం, సింగపూర్ వెళ్లి, ఈ రోజు సడెన్‌గా దిగబడ్డాడు.. పోనీలే మన ఇంట్లో పార్టీ రోజున వచ్చాడు.. మీరు మాట్లాడ్తూ వుండండి” అని భర్త తన మందు గ్లాస్ ఖాళీ అవడంతో హాల్ లోని బార్ కౌంటర్ వైపు వెళ్లాడు.

“నిజంగానే బావున్నావు. మా తమ్ముడు నిన్ను బానే సుఖపెడ్తున్నాడన్న మాట..” అని ఆమె నగలనీ అలంకరణనీ కిందనుండి మీదకి చూస్తూ అన్నాడు ఆ వచ్చిన వ్యక్తి.. ఆమె దీనంగా చేతులు జోడిస్తూ “నా కాపురం పాడు చెయ్యకు.. ప్లీజ్.. తెలిసీ తెలీని వయసులో తొందరపడ్డాం.. అందుకు జీవితాంతం శిక్షించకు.. ఇప్పుడు నీ తమ్ముడి భార్యని..” అంది కన్నీళ్లతో.

“ఏక్టింగ్ చాలు.. జస్ట్ ఓ యాభైలక్షలు అవసరం అయి వచ్చాను.. ఈ నగలన్నీ కలిపితే అంత చేస్తాయా” అన్నాడు ఆమె నగలని పరీక్షగా చూస్తూ..

ఆమె ఏడుస్తూ “మా ఆయనకి ఏం చెప్పమంటావ్.. మన సంగతి తెలిస్తే చంపేస్తారు..” అంది.

“వాళ్ల నాన్న… అదే మా పెద్దనాన్న మీ పెళ్లయిన వారానికే మనిద్దరినీ చూడకూడని స్ధితిలో చూసాడు.. చంపేసాడా?” అని నవ్వాడు.

“ఆయనది ముసలి వయసు కాబట్టి, ఆ దృశ్యం చూడగానే స్ట్రోక్ వచ్చి మాట పడి పోయింది.. అలా కాకుండా ఇంకోలా జరిగుంటే నా బతుకు బండలయ్యేది” అని ఏడ్చింది.

“సరే.. అదృష్టం నీ వైపుంది కానీ.. త్వరగా నగలిచ్చి పంపించు నన్ను.. ఎక్కువ రోజులుంటే నీకే ప్రమాదం, వాడికి బాగా డబ్బులున్నాయనేగా నన్ను వదిలి వాడిని చేసుకున్నావు” అన్నాడు.

“ఛ.. అలా మాట్లాడకు. ఆయన నన్ను ప్రేమిస్తున్నా అని వెంటపడితే, మా పుట్టింటి అవసరాల కోసం త్యాగం చేసాను” అంది.

“పోనీ అదే అనుకుందాం.. మరి నా త్యాగం కుడా నాకు లాభించాలిగా.. త్వరగా చూడు డబ్బు సంగతి” అని తనూ హాల్ లోకి వెళ్లాడు.. ఆమె పెదవిని పంటితో బిగబట్టి బాధని అణుచుకుంది.

గదిలో కదల లేని స్ధితి లో వున్న మామగారు, వచ్చిన తమ్ముడి కొడుకు “ఎలా వున్నావు పెదనాన్నా?” అని పలకరిస్తుంటే.. కళ్లు తప్ప ఏమీ తిప్పలేక, బెడ్ మీద పడుకుని అసహాయంగా చూసాడు.. కోడలు పని వాళ్లతో “మావయ్యకి భోజనం పెట్టారా.. మందు ఇచ్చారా? ఆలస్యం చెయ్యకూడదు.. టైం కు ఇవ్వాలి” అనడం గది ముందు నిలబడి, ఆయనకి వినిపించింది. గోడ మీద బల్లి అరుస్తోంది.. ఆమె అటు చూసింది.

రెండు రోజుల తర్వాత ఆమె పాల గ్లాసుతో వచ్చి పాలు టేబుల్ మీద పెట్టి “బావగారూ.. మీరు అడిగిన డబ్బు రెడీ అయింది” అంది.

అతను ఆనందంగా చూసి “నాకు తెలుసు నీ కెపాసిటీ… కొత్త పిలుపు మత్తుగా వుంది” అని లేచి ఆమెని దగ్గరగా తీసుకున్నాడు.

“మా తమ్ముడు వూళ్లో వున్నట్లు లేడు పాపం..” అన్నాడు మైకంగా.

“వద్దు.. డబ్బు మత్రమే ఇవ్వగలను.. నన్ను వదిలి పెట్టు..” బతిమాలింది.

“ఏంటీ? కొత్తగా చేస్తున్నావు?” అన్నాడు.. గోడ వైపు చూసింది.

“వద్దు ప్లీజ్.. డబ్బు రేపు పది గంటలకి ఇస్తాను.. వెంటనే వెళ్లిపోవాలి.. నేను బ్యాంక్‌కి వెళ్తుంటే కారాపి దొంగలు ఎత్తుకు పోయారని హడావిడి చేసే లోపు..” అంది..

“సర్లే థాంక్స్” ఆమెని వదిలేస్తూ అన్నాడు.. “గుడ్ నైట్”

ఆమె వెళ్తుంటే గోడ మీద బల్లి అరిచింది.

మావగారికి మందు లిచ్చారో లేదో కనుక్కుందామని ఆమె ఆయన గదిలోకి వచ్చింది.. ఆయన కళ్లెత్తి కోడలి వైపు చూసాడు.. మెడ కుడా కదపలేడు..

పని వాళ్లతో “అయ్యగారు పోలీసులతో మాట్లాడడం అయిందేమో చూసి రండి” అంది. అర్థం అయి వాళ్లు బయటకి వెళ్లి పోయారు. ఆమె మావగారి మంచం పక్క నున్న కుర్చీలో కూర్చుని.. “పోలీసులు ఎన్‌క్వైరీ కొచ్చారు!.. తప్పలేదు మావయ్యా.. ఆ రోజు మీరు చూడకూడనిది చూడ్డమే కాకుండా మీ అబ్బాయితో చూసింది చెప్తానన్నారు.. ఇలా మంచాన పడి చూడడం తప్ప ఇంకోటి చేయలేని స్ధితిలో పడ్డారు. బీ.పీ టాబ్లెట్స్ కంగారులో ఎక్కువ వేసేసుకున్నారని డాక్టర్‌తో చెప్పించి మేనేజ్ చెయ్యాల్సొచ్చింది.. మీ తమ్ముడి కొడుకు కూడా నా గురించి.. తక్కువ అంచనా వేసాడు.. బంగారు గుడ్డు రోజుకోటి కాదు.. అన్నీ ఒకేసారి కావాలన్నాడు.. పోయాడు పాపం!! అయినా బల్లి గోడ మీదున్నప్పుడు పాల గ్లాసు మీద మూత పెట్టుకోరూ!.. దానికేం తెలుసు పాలలో పడకూడదని..” అని లేచి వెళ్లిపోతుంటే.. కళ్లు మూసుకున్నాడు ముసలాయన!

Exit mobile version