[రాజమండ్రి, భద్రాచలం లలో పర్యటించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]
[dropcap]త[/dropcap]ణుకు పట్టణానికి చెందిన సాహిత్యడాట్ కామ్ అనే సంస్థ, ‘ఆరంగేట్రం’ అన్న కథల పోటీ నిర్వహించింది. దాని అధిపతి శ్రీ బుషి గారు. ఆ పోటీలో నా కథ ‘తాటి తన్నేవాడుంటే’కు తృతీయ బహుమతి లభించిందని, బహుమతి ప్రదానం, సత్కారం, రచయితలకు శ్రీ భద్రాచల రామచంద్ర స్వామి దేవస్థానంలో జరుపుతామని, మీరు తప్పక రావాలని ఋషి గారు ఫోన్ చేశారు. తప్పకుండా వస్తానని చెప్పాను.
నాలో ఒక ఆలోచన మెదిలింది. కథకు బహుమతి రావడం అలా ఉంచితే, భద్రాద్రి రాముడిని దర్శించుకోవచ్చును కదా! స్వామి కార్యం, స్వకార్యం రెండూ సిద్ధిస్తాయి. వెంటనే నా మిత్రుడు డా. యల్లమందను సంప్రదించాను. ఆయన నాతో నరకానికైనా రావడానికి రెడీ! భద్రాచలానికి రానంటాడా?
ఆయనిలా అన్నాడు – “ఇంగ్లీషు మాస్టారు! (నేను ప్రిన్సిపాల్‍ను, రీడర్‍ను అయినా, ఆయన అలాగే పిలుస్తాడు. మేం లెక్చరర్లుగా ఎనభైలలో పనిచేసిన కాలం నాటి పిలుపది) ఒక దివ్యమైన అవకాశం ఇది! దీనిని భవ్యంగా మలుచుకుందాము. సవ్యంగా ప్లాన్ చేద్దాము. నవ్యంగా!”
“వృత్యనుప్రాసాలంకారాన్ని ఎంత బాగా పండించావు మిత్రమా! నీకు ‘మధురవచస్వి’ అన్న బిరుదును ఇచ్చిన పద్యకవితా సదస్సు వారు అభినందనీయులు!” అన్నాను.
“మీ ముందు నేనెంత వాడిని మాస్టారు! ఏదో హనుమంతుని ముందర కుప్పిగంతులు!” అన్నాడతడు. అది అతని సంస్కారం. ‘విద్యాద దాతి వినయం!’.
“మరి మన శ్రీశ్రీశ్రీ యోగానందుల వారు?”
“ఉండండి! అదే లైన్లో! వాడికి కూడా ఫోన్ చేస్తాను”
యోగాగాడు ఫోనెత్తాడు. విషయం చెప్పాను.
“ఒరేయ్ శర్మా! ఎంత పని జరిగిందిరా! ఇదే తేదీలతో మేమంతా, అంటే కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు, మనుమలు, మనుమరాళ్లు తిరుపతి యాత్రకు ప్లాన్ చేసుకొన్నాము. రైళ్లు, రూములు, దర్శనాలు అన్నీ బుక్ అయినాయి. ఎట్లరా?” అన్నాడు. వాడి గొంతులో డిసప్పాయింట్‌మెంట్.
కాల్ కాన్ఫరెన్స్‌లో ఉంది.
“అయితే తిరుపతికే వెళ్లు. కుటుంబ కార్యక్రమాన్ని మిస్ చేయకూడదు. ఏడు కొండలవాడి దర్శనం!” అన్నాను.
“యోగానంద గారు! శర్మగారు చెప్పింది సబబుగానే ఉంది” అన్నాడు యల్లమంద.
“అయితే, నేను లేకండా, మీ ఇద్దరూ ఎంజాయ్ చేస్తారా?” అన్నాడు వాడు.
“ఏం చేస్తాం? రాములవారికీ, తిరుమలేశునికీ క్లాష్ వచ్చింది మరి!” అన్నా నవ్వుతూ.
“క్లాష్ వాళ్లకు కాదు మిత్రమా, మనకే!” అన్నాడు యల్లమంద.
అలా మా యోగాగాడు రాలేకపోయాడు.
యల్లమంద అన్నాడు “మాస్టారూ! మీరు ఇదివరకెపుడైనా, గోదావరి నదిలో, పాపికొండల మీదుగా, లాంచీలో ప్రయాణించారా?”
“లేదు మిత్రమా! తుని, నర్సీపట్నంలతో ఏళ్ల తరబడి పనిచేసినా కుదరలేదు.”
“ఇప్పుడు కుదురుతుంది. నేను కూడ ఇంతవరకు వెళ్లలేదు. మీరు రాజమండ్రికి వచ్చెయండి. నేను వైజాగ్ నుంచి వస్తా. లాంచీ, రూములు అవన్నీ ఎలాగూ మీరు బుక్ చేస్తారు కదా!”
“అంతే కదా!”
“ఇంకా ఇరవై రోజులుంది.”
“సరే! ‘ఆపరేషన్ పాపికొండలు’ – ప్లాన్ చేస్తాను”
అక్కడికి మా సంభాషణ ముగిసింది.
ఇంటర్‌నెట్ చూస్తే, ఎ.పి. టూరిజమ్ వారి ప్యాకేజీ ఉంది. ప్రయివేట్ సంస్థలు కూడా అదే రీటు ఆఫర్ చేస్తున్నాయి. ‘పున్నమి ట్రావెల్స్’ అన్న సంస్థ వారి కార్యాలయం హైదరాబాద్‌లో కూడా ఉంది. దాని నంబరు ఇచ్చారు. వారికి ఫోన్ చేశాను. ఒక అమ్మాయి ఎత్తింది.
“అమ్మా! మేము జనవరి 25న గోదావరి నదిలో, పాపికొండల మీదుగా లాంచీలో వెళ్లాలనుకుంటున్నాము. ఆ రోజుకు ఖాళీ ఉందా!”
“ఉంది సార్ ! మీరెక్కడ ఉంటారు?”
“హైదరాబాదు లోనే తల్లీ! వనస్థలిపురం. నీ పేరు?”
“పూర్ణిమ అంకుల్!”
“ప్యాకేజీ వివరాలు?”
“ఇందులో మూడు రకాల ప్యాకేజీలున్నాయి సార్. మొదటిది ఉదయం రాజమండ్రి నుండి బయలుదేరి, పాపికొండలు చూపించి, సాయంత్రానికి తిరిగి రాజమండ్రికి వచ్చేయడం. రెండవది, పాపికొండలు దాటి, భద్రాచలంలో డ్రాప్ చేయడం, మూడవది, మధ్యలో, పాపికొండల వద్ద నైట్ స్టే, కాటేజ్, క్యాంప్ ఫైర్, కల్చరల్ యాక్టవిటీస్, ట్రెక్కింగ్ చేసుకొని, మర్నాడు భద్రాచలం వెళ్లడం.”
“మాకు రెండోది కావాలి తల్లీ. మేమిద్దరం సీనియర్ సిటిజన్స్‌ము వస్తాము. ఎంతవుతుంది?”
“రాజమండ్రి నుంచి భద్రాచలానికి మనిషికి 2,150/- రూపాయలు అవుతుందండీ! బ్రేక్ఇస్ట్, లంచ్, టీ, స్నాక్స్ అన్నీ అందులోనే ఇన్‌క్లూడెడ్. రాజమండ్రి పుష్కర ఘాట్ నుంచి గండి పోచమ్మ తల్లి ఆలయం దగ్గర లాంచీ బోర్డింగ్ పాయింట్ వరకు బస్ పికప్, దారిలో పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతం, పేరంటపల్లి శివాలయ దర్శనం. దేవీపట్నం అక్కడ నుంచి (పోచవరం) భద్రాచలానికి వేరే లాంచి. పోచవరం నుంచి కూనవరం మీదుగా భద్రాచలానికి (80 km) డ్రాపింగ్. అన్నీ అందులోనే!”
“ఇంత తక్కువా! పైగా ఎ.సి.బోట్ అని ఉంది బ్రోచర్‌లో!”
“కాంపిటీషన్ సార్! చాలా మంది ఆపరేటర్లున్నారు. తప్పదు మరి!” అంటూ నవ్వింది పూర్ణిమ.
“అయితే మాకు రెండు టికెట్లు రిజర్వు చేయి. డబ్బు ఎలా పంపాలి?”
“మీ వాట్సాప్‌కు స్కానర్ పంపుతాను. నాలుగు వందలు అడ్వాన్సు జి పే చేయండి. మిగతాది జర్నీ రోజు రాజమండ్రిలో ఇవ్వవచ్చు. మీరు డబ్బు పంపిన వెంటనే మీకు కన్ఫర్మేషన్ స్లిప్ పంపుతాను. మీరు ఒకవేళ కాన్సిల్ చేసుకుంటీ, అడ్యాన్స్ రిఫండ్ ఇవ్వరు.”
“అంతకదమ్మా.”
ఆ అమ్మాయి నాకంటే జాగ్రత్తపరురాలులా ఉంది. ఇలా చెప్పింది – “సార్, మీరు 24ననే రాజమండ్రి చేరుకోండి. ఎందుకంటే 25 ఉదయం 7 గంటలకే మీరు పుష్కరఘాట్‌లో ఉండాలి.”
నేను ఆలోచించాను. నిజమే!
“సార్, మీరు 23న గౌతమికి వచ్చేయండి. ఒక్కనిమిషం సార్, ఆ! గౌతమికి థర్డ్ ఏసితో ఉన్నాయి.”
“మాకు స్లీపర్ చాలు తల్లీ!”
“ఆ! స్లీపర్ క్లాసులో కూడ ఉన్నాయి సార్. గౌతమి 24 ఉదయం ఐదు నలభైకి రాజమండ్రికి వస్తుంది. ఆ రోజు రాజమండ్రిలో మంచి మంచి దేవాలయాలున్నాయి చూసేయండి.”
“ఆ రోజు రాజమండ్రిలో ఉండటానికి రూమ్ కావాలి.”
“అది మాకు సంబంధం లేదండి.”
“ఏదైనా హోటల్స్ నంబర్లివ్వు. అలాగే 25 సాయంత్రం నుండి 26 రాత్రి వరకు భద్రాచలంలో కూడా.”
‘లైన్లో ఉండండి సార్!” అంటూ రెండు నిమిషాలు ఆగింది.
“సార్, మీ వాట్సప్‌కు కొన్ని నంబర్లు పంపాను. పుష్కర ఘాట్‌కు దగ్గర్లోనే ‘బొమ్మన రెసిడెన్సీ’ అని ఉంది. బాగుంటుంది. అట్లే భద్రాచలం దేవస్థానం ఎదురుగ్గానే ‘సుదర్శన్ లాడ్జ్’ ఉంది. వాళ్లకు ఫోన్ చేసి రూములు బుక్ చేసుకోండి. లేకపోతే దొరకవు.”
“మరి, భద్రాచలం నుండి నేను హైదరాబాదుకు తిరిగి రావడం?”
“అది కూడా నేను చెప్పాలా అంకుల్?” అని నవ్విందా పిల్ల. “భద్రాచలం నుండి హైదరాబాదుకు బోలెడు బస్సులు!”
“అమ్మో! బస్ ప్రయాణమా! అంతసేపు కూర్చోలేను”
‘వీడెక్కడ దొరికాడురా బాబూ! నా ప్రాణానికి’ అనుకోకుండా ఆ బంగారు తల్లి చెప్పింది.
“ట్రెయిన్ ఉంది కదా సార్! మణుగూరు ఎక్స్‌ప్రెస్! అయితే మీరు కొత్తగూడానికి వచ్చి క్యాచ్ చేయాలి!”
“సూపర్!” అన్నాను. అడ్వాన్స్ పంపాను. కన్ఫర్మేషన్ స్లిప్ వచ్చేసింది.
రాజమండ్రి, భద్రాచలం లలో హోటల్ రూమ్స్ కూడ బుక్ అయ్యాయి. మా అమ్మాయి ప్రణవి, 23న గౌతమికి, 26న మణుగూరు ఎక్స్‌ప్రెస్‌కి నాకు స్లీపర్ క్లాసులో బెర్తులు రిజర్యు చేసేసింది!
‘అమ్మయ్య!’ అనుకున్నా. ఏదైనా, ముందుగా అన్నీ సెట్ చేసుకుంటే తప్ప, నా మనసు స్థిమితంగా ఉండదు. మీరు చాదస్తమనుకున్నా సరే.
యల్లమందకు ఫోన్ చేసి చెప్పాను. ఆశ్చర్యపోయాడాయన. “ఇంత తక్కువ వ్యవధిలో, అన్నీ చేసేశారా మాస్టారు! యు ఆర్ గ్రేట్!” అన్నాడు.
“సర్లేగాని, ఆ అమ్మాయి ఎవరో గాని చక్కగా గైడ్ చేసింది. ఎ.పి. టూరిజమ్ వాళ్లయితే అంతసేపు మాట్లాడేవారు కాదు. 24 ఉదయం 7 గంటల నుండి మనకు రాజమండ్రిలో రూం బుక్ అయి ఉంది. నీవు జన్మభూమిలో వచ్చేసేయి. ‘బొమ్మన రెసిడెన్సీ’, కోటగుమ్మం డౌన్, పుష్కర్ ఘాట్‌కు దగ్గరే.”
“చేయబడినది” అన్నాడు యల్లమంద! ‘డన్’ అన్నమాట.
23న గౌతమిలో బయలుదేరాను. అరగంట లేటుగా, ఆరుంబావుకు రాజమండ్రి చేరింది. రైల్లోనే దంతధావనం చేసి ఉన్నాను. స్టేషన్ బయట రాజరాజనరేంద్రుని విగ్రహాన్ని చూశాను. రాజసం ఉట్టిపడుతూంది. ఆయనను ఫోటో తీసుకున్నాను. అక్కడ చక్కని ఫిల్టర్ కాఫీ దొరికింది. శర్కర రహితమే సుమండీ!
షేర్ ఆటో ఎక్కి, పుష్కరఘాట్ చేరుకున్నాను. అక్కడ నించి కూతవేటు దూరంలోనే ఉంది ‘బొమ్మన రెసిడెన్సీ’. తొమ్మిదింబావుకు జన్మభూమి దిగాడు యల్లమంద. రూమ్‌కు వచ్చేశాడు. ఆనందం! ఇద్దరం హగ్ చేసుకోన్నాం.
కోటగుమ్మం వద్ద ఒక టిఫిన్ బండి కనబడింది. ఇడ్లీ 2, ఒక మినపట్టు తిన్నాం. కొబ్బరిచట్నీతో బాటు, పొగలు కక్కుతున్న బొంబాయి చట్నీ కూడా ఇచ్చారు. చాలా రుచిగా ఉంది.
“ష్టీ తాగమేటి?” అన్నాను శ్రీకాకుళం యాసలో. ఇద్దరం ఆ జిల్లాలో చాలా కాలం పని చేశాం కదా!
“మంచి పనే!” అని దీర్ఘం తీశాడు. అంటే “తాగకపోతే ఎట్లా! అది ప్రత్యేకంగా చెప్పాలా?” అని అర్థం!
పక్కన టీ కొట్టుంది. టీ తాగి రూముకు చేరాము.
కాసేపు విశ్రాంతి! కబుర్లు! పద్యాలు! పాటలు!
నా ఫోన్ మోగింది. నా అభిమాని ఇష్ట కామేశ్వరి! నా రచనలన్నీ రెగ్యులర్‍గా చదువుతుంది. మన సంచికకు వీరాభిమాని.
“గురువుగారు! బాగున్నారా! మీకు వేనవేల నమస్కారాలు!” అన్నదామె. “ద్వారకా తిరుమల యాత్ర చదివానండి. ఎంత బాగా రాశారండి!” అన్నదామె.
“థాంక్స్ తల్లీ!” అన్నాను. “ప్రస్తుతం మీ ఊర్లోనే ఉన్నా!”
“నిజంగానాండీ!” అని ఆశ్చర్యపోయింది. విషయం చెప్పాను.
“అయ్యో! లాడ్జెందుకు తీశారండీ! మా ఇంట్లోనే ఉండవచ్చా కదా!”
“‘లేదు లేమ్మా! ఇంకో మిత్రుడు కూడా ఉన్నాడు.”
“ఆయనను కూడా తీసుకోవచ్చేస్తే సరి” అన్నదామె.
“గురువు గారు, అయితే, మీరు మధ్యాహ్నం మా ఇంటికి భోజనానికి రావాలి. మా భాగ్యం అనుకుంటాము.” అంది.
“ఎందుకమ్మా ఇబ్బంది పడతావు?” అన్నాను.
“లేదండి! తప్పదు. మా అపార్ట్‌మెంట్ లోని వారంతా మీ ‘సాఫల్యం’ రెగ్యులర్‌గా చదివిన వారే. మా అత్తయ్యగారికి ప్రతివారం చదివి వినిపించేదాన్ని. నేను మా ఆయన పన్నెండు గంటలకు వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతాము.”
“ఎందుకమ్మా మీకు శ్రమ! మీ లొకేషన్ షేర్ చేయండి. ఉబర్ ఆటో బుక్ చేసుకుని వచ్చేస్తాము.”
“అలా వద్దు గురువుగారు! మేమే వస్తాము!” అంటూ ఫోన్ పెట్టేసింది.
అటువంటి అభిమానులను ఉభయ తెలుగు రాష్ట్రాలలో నాకు సంపాదించి పెట్టిన ‘సంచిక’కు, మా తమ్ముడు కస్తూరి మురళీ కృష్ణకు మనసు లోనే అభినందనలు తెలుపుకున్నాను.
సరిగ్గా 12 గంటలకు ఇష్టకామేశ్వరి, ఆమె భర్త ఫణి గారలు రూమ్‍కు వచ్చారు. ఆయన అడ్వొకేట్, నోటరీ అట. దానవాయిపేటలో ఉంటారు. ఒకడే కొడుకట సి.ఎ. చేస్తున్నాడట.
నన్ను చూసి ఆమె సంబరపడిపోతోంది. ఆమె సరే నా అభిమాని. ఆయన ఆమెకు విలువ ఇచ్చి, నన్ను తీసుకొని వెళ్లడానికి వచ్చారు. క్రింద వారి కారు పార్క్ చేసి ఉంది. వాళ్లింట్లో షడ్రసోపేతమయిన భోజనం పెట్టారు. పూర్ణంబూరెలు, పనసపొట్టు కూర, చుక్కకూర పచ్చడి, పులిహోర, మెంతి మజ్జిగ, రసం. అద్భుతంగా ఉంది భోజనం. ఆమె అత్తగారు ఎనభై మూడేళ్ల పెద్దావిడ. ఆమెకు పాదాభివందనం చేశాము.
“నాయనా! నిన్ను చూస్తూంటే ‘సాఫల్యం’ నవలలో పతంజలిని చూస్తున్నట్లే ఉంది” అందామె. కస్తూరి వారన్నట్లు నేను పతంజలిని కాదని ఎంత చెప్పినా నమ్మరు!
“నవలలో నీవు రాసిన గోరుచిక్కుడు కాయ సండిగ కూర నా మేము చేశాము. మా కోడలు చేసింది. అలా చేయచ్చునని మాకు తెలియదు. చాలా బాగుంది” అన్నది పెద్దామె. ఆమె పేరు పర్వతవర్థని.
“అది మా రాయలసీమ స్పెషల్ అమ్మా” అన్నాను.
మళ్లీ కారులో మమ్మల్ని లాడ్జి దగ్గర దిగబెట్టారు ఫణిగారు. ఆ దంపతుల ఆదరాభిమానాలతో మా హృదయం ఆర్ద్రమైంది.
“ఒక రచయితకు ఇంతకంటే ‘సాఫల్యం’ ఏముంటుంది మిత్రమా!” అన్నాడు మా యల్లమంద.
“ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ‘సంచిక’!” అన్నా మనస్ఫూర్తిగా.
కాసేపు పడుకోని, లేచాము. ఆరు గంటలకు పుష్కర ఘాట్ చేరుకున్నాం. అక్కడ ఒక మిక్చర్ బండి దగ్గర తలా రెండో అరటికాయ బజ్జీలు తిన్నాము. వాటికి మధ్యలో గాటు పెట్టి, ఉల్లితరుగు, కొత్తిమీర, ఇంకా ఏవో ఇన్‌గ్రీడియంట్స్ కలిపిన మిశ్రమాన్ని కూరి, లైట్‍గా నిమ్మరసం పిండి, పైన వేయించిన వేరుశనగగుళ్లు వేసి యిచ్చాడు. బజ్జీ మిక్చర్ అంటారు దాన్ని. గోదావరి జిల్లాల ఫేమస్ స్నాక్ అది. టీ తాగి పుష్కర ఘాట్‌కి వెళ్లాము. చీకటి పడింది. గోదావరి తల్లికి దీపహారతి 6.45 ప్రారంభిస్తారట. చాలామంది అప్పటికి మెట్ల మీద కూర్చుని ఉన్నారు. గోదావరి మాత విగ్రహాన్ని శివాలయాన్ని సందర్శించాము.
నది మీది పురాతన వంతెన హ్యావ్‌లాక్ బ్రిడ్జ్‌ని విద్యుద్దీపములతో అలంకరించారు. రంగురంగుల లైట్ల వరుసలతో కాంతులీనుతూందా వారధీరాజు. అది ప్రసుతం ఉపయోగంలో లేదు. దాన్ని ‘పాత గోదావరి వంతెన’ అని కూడా అంటారు. దానిని 1900 సం॥లో నిర్మించారు. తర్వాత కొత్తది ఆర్చ్ బ్రిడ్జ్‌ని నిర్మించారు. దాని పొడవు 2.7 కిలీమీటర్లు. దేశంలోని అతి పొడవైన రైలువంతెనలలో ఒకటి. 1897 నవంబరు 11న దీని నిర్మాణం ప్రారంభమై 30 ఆగస్టు 1900 న ముగిసింది. 1997లో, దాని వంద సంవత్సరాల కాల పరిమితి ముగియగానే, దానిపై రైళ్ల రాకపోకలను ఆపేశారు.
అప్పటి మద్రాసు రాష్ట్ర గవర్నర్ సర్ అర్థర్ ఎలిబాంక్ హావ్‌లాక్ గారి పేరు వంతెనకు పెట్టారు. ఫెడరిక్ థామస్ గ్రాన్ విల్లీ వాల్టన్ చీఫ్ ఇంజనీర్‌గా వ్యవహరించారు. పిల్లర్లన్నీ రాతితో, బ్రిడ్జిని ఉక్కు స్తంభాలతో నిర్మించారు. వాటిని డెర్బీషైర్ (ఇంగ్లండు) లోని బట్టర్‍ఫ్లై కంపెనీ సప్లయి చేసింది. ప్రస్తుతం ఈ వంతెనని సివిక్ వాటర్ పైప్ లైన్స్ కోసం ఉపయోగిస్తున్నారు.
విద్యుత్ కాంతుల శోభతో వెలిగిపోతుందా వంతెన. చూడడానికి రెండు కళ్లూ చాలడం లేదు. పక్కనే ఉన్న కొత్త వంతెన మీద రైళ్ల వస్తూ పోతూ ఉన్నాయి. హౌరా – చెన్నై రైలు మార్గం అత్యంత రద్దీ ఐనది. పాత వంతెనని ఒక చారిత్రిక కట్టడంగా గుర్తించాలని, లేదా ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, అప్పటి రాజమండ్రి ఎం.పి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కేంద్రానికి ఎంత విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయింది.
సరిగ్గా 6.45కు గోదావరి హారతి ప్రారంభమయింది. నేను కాశీలో గంగా హారతి చూశాను. అంత పెద్ద ఎత్తున లేదు గాని, నయన మనోహరంగా ఉంది ఆ నదీమతల్లికి ఇచ్చే సంధ్యాహారతి. తాళాలు, భేరీలు మ్రోగుతున్నాయి. కాషాయ దుస్తులు ధరించిన పూజారులు పంచవిధ హారతిని అమ్మవారికి నివేదిస్తున్నారు. నంది హారతి, త్రిశల హారతి, సింహాహారతి, ఇలా పెద్ద పెద్ద హారతి సెమ్మెలను పట్టుకొని హారతి ఇస్తున్నారు. ఆయా హరతులను దర్శించినందు వల్ల వచ్చే పుణ్యఫలితాలను ఒకాయన మంద్ర గంభీరస్వరంతో మైకులో వివరిస్తున్నాడు. బహుశా అది ప్రీరికార్డెడ్ అనుకొంటాను
ప్రకృతి ఆరాధనలో భాగమే ఈ గోదావరి నిత్యహారతి. ఎ.పి ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ, బుద్ధవరపు ఛారిటబుల్ ట్రస్టులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. పండితులకు కాశీ, హరిద్వార్ లలో హారతి ఇవ్వడంలో శిక్షణ ఇప్పించారు. 2003లో జరిగిన గోదావరి పుష్కరాలలో దీనికి నాంది జరిగింది. 2013లో కార్తీక పౌర్ణమికి పెద్ద ఎత్తున హారతి ఉత్సవాలు జరిగాయి. అన్నవరం సత్యదేవుని దేవస్థానం వారు కూడా దీనిలో భాగస్వామ్యం వహించారు.
హైదరాబాద్‌కు చెందిన 16 మంది కూచిపూడి కళాకారులు ‘ప్రణతోస్మి గౌతమీ’ అన్న నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. గోదావరి జలాలను కాలుష్యం నుండి కాపాడాలనే సందేశంతో ఆ ప్రదర్శన సాగింది.
గోదావరి పుష్కరాల సందర్భంగా సింగపూర్ ప్రతినిధులు, బాబా రాందేవ్, కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్ లాంటి ప్రముఖులు గోదావరి హారతిని సందర్శించారు.
లలితా విష్ణు సహస్రనామ పారాయణాలు జరుగుతాయి. గోదావరి తల్లికి మొత్తం 14 రకాల హారతులు ఇస్తారట. మేం చూసినప్పుడు ఐదు రకాలు మాత్రమే ఇచ్చారు.
మా మనస్సులు ఒక అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయాయి. హారతి వెలుగులు నది నీళ్లలో ప్రతిఫలిస్తున్నాయి. తల్లికి మళ్లీ నమస్కరించి, బయటకు వచ్చాము.
అక్కడ ఒక ఆటో మాట్లాడుకున్నాము. మాకు మహా కాలేశ్వర మందిరం, ఇస్కాన్ మందిరం, మార్కండేశ్వర దేవాలయం చూపించి, కోట గుమ్మం దగ్గర దింపాలి. అన్నీ గోదావరి ఒడ్డునే ఉన్నాయి. ఎనిమిది వందలు అడిగాడు ఆటో అతను. ఐదువందలకు ఒప్పుకొన్నాడు.
మొదట మహాకాలేశ్వర మందిరం దర్శించాము. అదొక అద్భుత నిర్మాణం. దీనిని టి.టి.డి అధ్యక్షులు శ్రీ వై.వి. సుబ్బారెడ్డి గారు ఏప్రిల్ 2022 లో ప్రారంభించారు. ఉజ్జయిని మహాకాలేశ్వరుని మందిరంలో వలె ఇక్కడ కూడా మహాదేవునికి భస్మాభిషేకం చేస్తారు. అందుకే రాజమహేంద్రవరాన్ని రెండవ ఉజ్జయిని అంటారు. దీనిని పట్టపగలు వెంకట్రావుగారు నిర్మించారు. అందులోని విగ్రహాలన్నీ జయపూర్, మహాబలిపురం నుంచి తెప్పించిన గ్రానైట్ శిలలతో చెక్కించారు.
ముఖ్యమందిరం కళాత్మకమైన స్తంభాలతో ఉన్నత గోపురంతో విరాజిల్లుతూన్నది. నల్లని శివలింగం, దాదాపు మూడున్నర అడుగుల ఎత్తున, అడుగున్నర వెడల్పున ఉంది. సర్వభూషణుడై ఉన్నాడు స్వామి.
కోటి దీపస్తంభం, సమున్నత ధ్వజస్తంభం ఉన్నాయి. ఒక చోట తెల్లని పాలరాతితో చేసిన పరమేశ్వరుని విగ్రహం త్రిశూలం, ఢమరుకం ధరించి ఉంది. వీరభద్రుని ఆలయం దర్శించాము. ఆలయం నలు వైపుల వివిధ శివమార్తులు, అమ్మవార్లు ఉపాలయాలలో కొలువు తీరి ఉన్నారు. ఆ వైభవాన్ని దర్శించడానికి రెండు కళ్లు చాలవు.
“మిత్రమా! పురాతన శిల్పసౌందర్యానికి మనం ఏమీ తీసిపోమని ఈ నిర్మాణ శిల్పులు నిరూపించారు” అన్నాడు యల్లమంద.
“మనం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని కారిడార్‌ను చూసిన అనుభూతినే మళ్లీ పొందాము” అన్నాను.
అక్కడ నుంచి ఇస్కాన్ మందిరానికి చేరుకున్నాము. సాధారణంగా పెద్ద పెద్ద నగరాల లోనే ‘ఇస్కాన్’ లను నెలకొల్పుతారు. కాని, రాజమహేంద్రవరము లాంటి ఒక మోస్తరు పట్టణంలో దీన్ని నిర్మించడం విశేషం.
మందిరం ఇరవై అడుగుల ఎత్తయిన ప్రదేశం మీద ఉంది. ప్రవేశమునకు, నిష్క్రమణకు వేరు వేరు మెట్ల దారులున్నాయి. చాలా మెజెస్టిక్‌గా, గ్రాండ్‌గా ఉంది మందిరం. గౌతమీ ఘాట్ రోడ్‌లో ఉంది. దానిని శ్రీ రాధాగోపీనాథ్ మందిరం అని కూడా అంటారు. హరేకృష్ణ భూమి!
“ఇస్కాన్, ఇస్కాన్, అంటారు కదా, అంటే ఏమిటి మిత్రమా?”
“ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షస్‍నెస్. అంటే అంతర్జాతీయ శ్రీ కృష్ణ చైతన్య సమాజం.”
మెట్లెక్కి పైకి వెళ్లాము. మందిరం చుట్టూ నాలుగడుగుల వెడల్పన ఇరువైపులా కళాత్మకమైన ప్యారాపెట్ వాల్స్ గల వాకింగ్ ట్రాక్ ఉంది. దాని వెంబడి నడవసాగాము. అక్కడక్కడ దశావతారాలను నెలకొల్పిన చిన్న చిన్న గుడులున్నాయి. ఇస్కాన్ విగ్రహలు ఉత్తరాది శైలిలో ఉంటాయి. అన్నీ చూసుకొని లోపలకి ప్రవేశించాము. మందిరం జేగీయమానంగా ఉంది. రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణులు, వేంకట రమణమూర్తుల పాలరాతి విగ్రహాలున్నాయి. సాలంకృతములై ఉన్నాయి. వాటిలో జీవ కళ ఉట్టిపడుతూన్నది.
“నాకెందుకో ఇస్కాన్ లలో దైవత్వం, భక్తిభావం కనబడదు, ఒక ఆర్ట్ పీస్‌ల లాగా ఉంటాయి” అన్నాను మా యల్లమందతో.
“అవును, మనం భోపాల్‌లో కూడా అనుకున్నాము” అన్నాడతడు. అక్కడ ఒకాయన టేబుల్ వేసుకొని కూర్చొని, “అన్నదానానికి, గో సేవకు చందా ఇవ్వండి” అని అందర్నీ అడుగుతున్నాడు! మందిరం రెండెకరాల విస్తీర్ణంలో నిర్మించ బడింది. శ్రీకృష్ణచైతన్య మహాప్రభు గొప్పయోగి. సాక్షాత్తు విష్ణువు అంశ అని ఇస్కాన్ భక్తుల నమ్మకం. ఐదు దశాబ్దాల క్రిందట ఆయన జన్మించారు. “హరేరామ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే” అన్న కీర్తన ఆయనే రచించి స్వరపరచారట. రాజమండ్రి ఇస్కాన్‌ను 2006లో ప్రారంభించారు. ప్రభు నిత్యానంద వారి విగ్రహం సజీవాకర్షణ.
అక్కడ నుంచి మార్కండేశ్వర స్వామి గుడి చేరుకున్నాము. అప్పుడు టైం ఎనిమిది. ఎనిమిదిన్నరకు గుడిని మూసేస్తారని చెప్పాడు ఆటో డ్రయివర్. దానిని స్థానికులు మార్కండేయ గుడి అంటారు. ముఖమంటపాన్ని కొత్తగా, ఆధునిక శిల్పరీతులతో నిర్మించారు. ముఫై మెట్లు దిగి గోతిలోకి వెళ్లాలి. గాలిగోపురం రోడ్ మీదికీ ఉంది.
‘శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి దేవస్థానం’ అని గ్లో సైన్స్ గోపురం మీద వెలుగుతున్నాయి. అది పుష్కర్ ఘాటు దగ్గరే. పక్కనే పెద్ద చెరువు ఉంది. శివలింగం బూడిదరంగులో ఒక అడుగు లోపు ఎత్తుంది. శతాబ్దాల క్రిందటి ప్రతిష్ఠ. శివలింగం రంగు మారుతూండడం వల్ల స్వామికి అభిషేకాలు నిలిపి వేశారని ఒక బోర్డులో రాసి ఉంది.
పక్కనే పార్వతీ దేవి మందిరం. మార్కండేయ మునీశ్వరుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని ఐతిహ్యం. దీనిని తూర్పు చాళుక్య ప్రభువు రాజరాజనరేంద్రుడు 10వ శతాబ్దంలో నిర్మించాడు. చోళులు, రెడ్డిరాజులు దీనిని పోషించారు. ముస్లిం రాజులు దీనిని కూలగొట్టినా, 1818లో దీనిని గుండు శోభనాద్రీశ్వరరావు గారు పునర్మిర్మించారు. రాజమండ్రిలో ‘గుండువారి వీధి’ ఉంది.
గోపురం మీద చక్కని దేవతా శిల్పాలున్నాయి. ఉన్నతమైన ధ్వజస్తంభం ఉంది.
దీనితో మా రాజమండ్రి దేవాలయ దర్శనం పూర్తయింది. భక్తి పారవశ్యం తగ్గి, ఆత్మారామ తృప్తి కోసం కడుపులో తపన మొదలైంది.
మమ్మల్ని కోట గుమ్మం సెంటర్‍లో దింపి వెళ్లిపోయాడు ఆటో అతను. అతనికి వంద రూపాయలు ఎక్కువ ఇచ్చాను.
“మిత్రమా! గమనిస్తున్నాను. ఎక్కడా గుళ్లల్లో కొబ్బరికాయలు, పూల మాలలు కొనవు. హుండీలలో అస్సలు డబ్బులు వేయరు. ఆటోవాళ్ళకు మాత్రం అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తారు..” అన్నాడు మిత్రుడు.
“కొబ్బరికాయలు ఎక్కడా గర్భగుడిలో కొట్టరు. మనం తీసుకుపోయిన మాలలు దేవునికి వెయ్యరు కదా! పాపం కష్టజీవులకు కొంచెం ఎక్కువిస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది” అన్నాను.
“యు ఆర్ గ్రేట్!” అన్నాడు
“అబ్బా, ఇక చాలు, ఆపు! ఇదీ గ్రేటేనా?” అన్నాను నవ్వుతూ.
అక్కడ ఒక బండి కనబడింది. దాని మీద ‘పాకంగారెలు, పెరుగు ఆవడ’ అని ఉంది. కొంచెం దూరంలో ఇంకో బండి ఉంది. దాని మీద ‘గోదావరి టిఫిన్స్’ అని ఉంది. వెళ్లాము. పొయ్యిలన్నీ ఆర్పేసి ఉన్నాయి. కాని రెండు పెద్ద హాట్ కేస్‍లున్నాయి.
“అమ్మాయి! టిఫిన్ ఏముంది?” అని అక్కడున్న చిన్నదానిని అడిగాను.
“ఇడ్లీ, సెట్ దోశ ఉంది అంకుల్!” అన్నదా పిల్ల.
“వేడిగా..” అని నేనంటుండగానీ, ఆమె మూతలు తీసి చూపింది. పొగలు కక్కుతున్నాయి.
“రెండు ఇడ్లీలు ముందుగా ఇవ్వమ్మా” అన్నాను.
పేపర్ ప్లేట్‍లో ఇడ్లీలు, కొబ్బరి చట్నీ, కారం పొడీ, బొంబాయి చట్నీ వేసి ఇచ్చింది. అద్భుతం!
తర్వాత సెట్ దోశ తిన్నాం. ప్లేట్‍కి రెండు.
“నేను ఇంకో ప్లేట్ తింటాను” అన్నాడు మిత్రుడు.
“ఆగు! తొందరపడకు! కడుపులో ఖాళీ ఉంచుకో!” అన్నా నవ్వుతూ.
ఇద్దరికీ కలిసి అరవై రూపాయలే అయింది. చీప్ అండ్ యమ్మీ! అక్కడ నుంచి ఆవడ బండి దగ్గరకు వెళ్లాం. వడలు (గారెలు) చాలా పెద్దవి.
“ఒక పాకంగారె ఇవ్వండి” అని అడిగాను.
ఒక ఆకు దొన్నెలో ఇచ్చాడు. ఇంకో స్పూన్ అడిగి, నేను రెండు ముక్కలు టేస్ట్ చేశాను. కాన్సంట్రేటెడ్ షుగర్! అంతకంటే తినకూడదు నేను. మిత్రుడికా బాధ లేదు. హాట్ బాయ్! తర్వాత రెండు సింగిల్ ఆవడ. పెరుగు కమ్మగా ఉంది. గారెలు పెరుగులో నాని, నోట్లో వేసుకొంటే కరిగిపోతున్నాయి. పైన కొత్తిమీర, క్యారెట్ తరుగు, కొద్దిగా కారం బూందీ వేసి ఇచ్చాడు. ఆవడ మమ్మల్ని పరవశింప చేసింది.
ఆహారాన్ని ఆస్వాదించడం కూడా ఒక కళే! అరవై ఐదోది!
“మీరు సెట్ దోశ ఇంకో ప్లేట్ ఎందుకో తిననివ్వలేదో అర్థమైంది!” అన్నాడు యల్లమంద నవ్వుతూ!
బండి మీద ‘యెహోవా నా కాపరి’ అన్న మాటలున్న స్టిక్కర్ అంటించి ఉంది. ‘ఆవడల నిపుణుడు క్రైస్తవుడన్నమాట!’ అనుకొన్నాను. ‘ఎవరైతేనేం? తిండికి మతం లేదు!’ అనుకున్నా కూడా!
లాడ్జి యాభై అడుగులే. వెళ్లి విశ్రమించాము.
(ఇంకా ఉంది)