[రాజమండ్రి, భద్రాచలం లలో పర్యటించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]
[dropcap]మ[/dropcap]ర్నాడు ఉదయం ఏడున్నరకు తయారై, బ్యాగులు ఈడ్చుకుంటూ పుష్కర్ ఘాట్ చేరుకున్నాం. నడిచేంత దూరమే. అక్కడ ‘పుష్కర్ కేఫ్’ అన్న హోటలుంది.
“వాళ్లు లాంచిలో టిఫిన్ ఎప్పుడు పెడతారో ఏమో. లైట్‍గా టిఫిన్ చేద్దాం” అన్నాను.
“సూపర్!” అన్నాడు మిత్రుడు. ఏకీభవించడంలో మొనగాడు మా వాడు! పైగా మా ఇద్దరి అభిరుచులూ, అవిభక్త కవలలు! ప్లెయిన్ మినపట్టు చెరొకటి తిని, ఫిల్టర్ కాఫీ తాగాము. నా ఫోన్ మోగింది. ఎత్తాను.
“సార్, నమస్కారం, నా పేరు బాబీ. పున్నమి టావెల్స్! ఎక్కడున్నారు?”
“పుష్కర్ కేఫ్‍లో తమ్ముడూ!” అన్నాను.
“అక్కడే ఉండండి. పావుగంటలో మిమ్మల్ని పికప్ చేసుకొంటాము.”
“ఓకే!”
అక్కడ నుంచి హావ్‌లాక్ బ్రిడ్జి, కొత్త ఆర్చ్ బ్రిడ్జి నయనానందకరంగా కనబడుతున్నాయి. సూర్యకాంతిలో గోదావరి నీరు తళ తళతళ మెరుస్తూంది. ఘాట్‍లో 30 అడుగుల యన్.టి.ఆర్ విగ్రహం, శ్రీకృష్ణుని గెటప్‌లో నెలకొల్పారు.
మేమిద్దరం అన్నగారికి వీరాభిమానులం! విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న. సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఆయన. ఆయన విగ్రహం దగ్గర నిలబడి, ఒక కుర్రాడిని పిలిచి, ఫోటో తీయించుకున్నాము. అంతటి అందగాడు మా అన్న!
మళ్లీ ఫోన్! బాబీ! “సార్ వచ్చేయండి! పుష్కర్ కేఫ్ ఎదురుగా ‘ఐ లవ్ రాజమండ్రి’ అన్న బోర్డు ఉంది, చూడండి.”
వెళ్లాము. బాబీ చాకులాంటి కుర్రాడు. పాతికేళ్ళు కూడా ఉండవు. అతని దగ్గర ప్రయాణీకుల లిస్ట్ ఉన్న ప్రింట్ అవుట్ ఉంది. మా పేర్ల దగ్గర టక్కులు పెట్టుకొన్నాడు.
“బాబీ! నీ పేరు వినగానే నాకు రిషికపూర్ గుర్తొచ్చాడురా నాన్నా!” అని “హమ్ తుమ్ ఏక్ కమరే మే బంద్ హై” అని పాడాను పైగా.
“థాంక్యూ సార్” అన్నాడతడు, ముఖం వెలిగిపోతుండగా.
అక్కడ ఒక మినీ బస్ ఆగి ఉంది. చాలామంది ఎక్కుతున్నారు.
“మమ్మల్నీ ఎక్కమంటావా అందులో?” అనడిగాము.
“వద్దు సార్. మనం వేరే వెహికల్ వెళదాం. అదిగో ఆ నీలం బండి” అని ఒక సెవెన్ సీటర్ కారును చూపాడు.
ఎక్కి కూర్చున్నాం. ఇంకా ఇద్దరు రావాలట. వాళ్లెంతకీ రారు. రిషికపూర్‌కు చిరాకు!
“ఏడున్నరకల్లా ఉండాలని చెప్పాము. ఎనిమిది దాటుతుంది..” ఇంతలో ఒక ఆటో లోంచి ఇద్దరు దంపతులు దిగారు. ఇద్దరూ ఫోన్లలో మాట్లాడుతున్నారు! బాబీ వెళ్లి వారిని తీసుకొచ్చాడు.
“కొందరికి టైం సెన్స్ ఉండదు! దె టేక్ అదర్స్ టైమ్ ఫర్ గ్రాంటెడే” అన్నా మిత్రునితో!
“వాళ్లకు వినబడుతుంది” అన్నాడు యల్లమంద! ‘మధుర వచస్వి’ బిరుదాంకితుడు మరి! ఎవ్వరినీ నొప్పించడు!
“విననీ! నాకేం భయమా!” అన్నాను.
“ఇదీ ఎ.పి. టూరిజం వాళ్లయితే వదిలేసి పోతారు సార్” అన్నాడు బాబీ!
వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు! దేన్ని? సెల్‌ఫోన్‌ని! మా మాటలు వినిపించుకునే స్థితిలో లేరు. వీరు గోదావరి, పాపికొండల అందాలను చూస్తారా, లేక ఇలాగే ఫోన్లో మునిగి తేలుతుంటారా అని నాకో డౌటనుమానం వచ్చింది!
వాహనాలు బయలు దేరాయి. అక్కడినుంచి బోర్డింగ్ పాయింట్ 40 కి. మీ.
రోడ్డు పరమ ఘోరంగా ఉంది. బోర్డింగ్ పాయింట్, గండి పోచమ్మ రేవుని చేరటానికి గంటన్నర పట్టింది.
ఒడ్డుకు లంగరు చేసి ఉన్న లాంచీలు వరుసగా ఉన్నాయి. బాబీ ఒక తెల్లని లాంచీని చూపించాడు.
“సార్, అదిగోండి – భాగీరథి ఎ.సి.! అది మనది” అన్నాడు.
వెళ్లి ఎక్కాము. పెద్ద లాంచీ! లోయర్ డెక్ అంతా ఎ.సి. అప్పర్ డెక్ పైన కప్పు ఉంది. పైన ప్లాస్టిక్ కుర్చీలున్నాయి. కదలకుండా వాటి కాళ్లను వెల్డింగ్ చేశారు. టూరిస్టులు ఎక్కడైనా కూర్చోవచ్చు. పైకి కిందికి తిరగవచ్చు.
ఇంకా జనరేటర్ వేయలేదు. బ్యాగులు సీట్ల దగ్గర పెట్టి పైకి వెళ్లాము. చక్కని స్టెయిర్ కేస్ విత్ రెయిలింగ్ ఉంది. స్టెయిర్ కేస్ క్రింద వాష్ రూమ్స్, ‘హి’, ‘షి’ లకు వేర్వేరుగా ఉన్నాయి. నేను ‘హి’కి వెళ్ళివచ్చాను. శుభ్రంగా ఉంది!
క్రిందికి వచ్చాము. జనరేటర్ ఆన్ చేశారు. దడదడ శబ్దంచేస్తూ పని చేయసాగింది. ఎ.సి.లు నాలుగున్నాయి. ఫాన్లు కూడా. లోయర్ డెక్ చల్లగా మారింది.
“భాగీరధి ఎసి లాంచీకి స్వాగతం! అందరూ ఒకసారి గోదావరి మాతకూ జై! అనండి” అని ఒక కుర్రాడు మైకులో చెప్పాడు. అందరం నదీమతల్లికి జయధ్వానం చేశాము.
లాంచీని రివర్సు చేసి నదిలోకి తిప్పాడు.
“అదిగో! గండి పోచమ్మతల్లి గుడి! దండం పెట్టుకోండి!” అన్నాడు. వంద మీటర్ల దూరంతో నీటిలోనే ఒక గుడి కనబడింది.
“గొప్ప మగిమ గల తల్లి! కోరుకున్న కోర్కెలు నెరవేర్చే అమ్మ!” అన్నాడు
డెక్ చుట్టూ మూడడుగుల వెడల్పున కారిడార్ ఉంది. దానికి నాలుగడుగుల ఎత్తున రెయిలింగ్. కాసేపు వెళ్లి, కారిడార్‌లో నిలబడ్డాం.
“బ్రేక్‌ఫాస్ట్ రెడీ! అందరూ లోయర్ డెక్‍కి రావాలి!”
టైం పది నలభైఐదు! పేపర్ ప్లేట్లలో రెండిడ్లీ, రెండు వడ, ఒక గరిటె టమోటో బాత్, కొబ్బరి చట్నీ, బొంబాయి చట్నీ వేసి ఇస్తున్నారు. బఫె. వెళ్లి తెచ్చుకోవాలి. వాటర్ బాటిల్స్ 500 ml వి తలా ఒకటి. మేం వెళ్లి “ఇడ్లీ వద్దు! రెండు వడ, టమోట్ బాత్ ఇవ్వండి చాలు” అని చెప్పి తెచ్చుకొన్నాం. టిఫిన్ చాలా రుచిగా ఉంది. హాట్‍కేస్ లతో తెచ్చారేమో వేడిగా కూడ ఉంది. తర్వాత పేపర్ కప్పులలో టీ ఇచ్చారు. బాగుంది. అయితే షుగర్ లెస్ లేదు!
“దయచేసి ప్లేట్లు కప్పులను నదిలో వేయకండి! వెనక డస్ట్ బిన్ ఉంది!” అని ప్రకటించారు.
అలాంటి ఘనులూ ఉంటారు మరి!
లాంచీ కెపాసిటీ 92 మంది. ‘క్రూ’ అంటీ సిబ్బంది ఎనిమిది మంది. మాకు ఎదురుగానీ కెప్టెన్ క్యాబిన్ ఉంది. కెప్టెన్ పేరు మణికంఠ సతీష్ అని రాసి ఉంది. వెసెల్ నం. రిజిస్ట్రేషన్ నం. ఓనరు పేరు, అన్నీ రాసి ఉన్నాయి. ఓనర్ పేరు అప్పారావు.
కనుచూపు మేర గోదావరి పరచుకొని ఉంది. ఇరువైపులా పచ్చని కొండలు. లాంచి వేగం గంటకు పదిహేను కిలోమీటర్లని చెప్పారు. కారిడార్ దగ్గర నిల్చుంటేనే వేగం తెలుస్తోంది. లోపలుంటే కదులుతున్నట్లే లేదు.
క్యాబిన్‌లో ఒక చక్రం తప్ప ఏమి లేదు. కెప్టెన్ కూర్చోడానికి ఒక స్టూలు మాత్రమే ఉంది. నేను వెళ్లి క్యాబిన్ తలుపు దగ్గర నిలబడ్డాను. కెప్టెన్ వెనక్కితిరిగి చూశాడు. నేను చిరునవ్వు నవ్వాను.
అతడూ నవ్వి, “రండి సార్” అని పిలిచాడు. నేను మిత్రుడిని కూడా రమ్మని పిలిచాను.
మణికంఠ సతీష్ నల్లనివాడు. నిక్కరు టీ షర్టు ధరించాడు. అతి సామాన్యంగా ఉన్నాడు.
“కాసేపు నడుపుతారేటి?” అనదిగాడు నన్ను. నేనాశ్చర్యపోయి, “అలా వీలవుతుందా?” అన్నాను.
అతడు లేచి నన్ను స్టూలు మీద కూర్చోమన్నాడు. స్టీరింగ్ వీలు పట్టుకొని కూర్చున్నాను. మిత్రుడు నాకొక ఫోటో తీశాడు. అదొక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్.
నలభై నిమిషాల తర్వాత కొంచెం దూరంలో పోలవరం ప్రాజెక్ట్ కనబడింది. దాన్ని గురించి అనౌన్సర్ చెప్పారు. డయఫ్రం వాల్‌ను చూపించాడు. పూర్తి దగ్గరగా లాంచీలు వెళ్లడానికి అనుమతి లేదు.
“మరో సంవత్సరం తర్వాత, మొత్తం పాపికొండలతో సహా, రెండు వందల గ్రామాలు, కూనవరం వరకు మునిగిపోతాయి. ఇక ఈ ట్రిప్‍లు ఉండవు” అన్నాడు మైకులో! “మా జీవనోపాధి పోతుంది!” అతని గొంతుతో ఆవేదన!
“ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం ఏం చేస్తుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏం చేస్తాం? చాలామంది అభివృద్ధి కావాలంటే కొందరు బలి కావలసిందే!”
ఎంత నిజం!
కొంత ప్రయాణం తర్వాత దూరంగా ఒక ఊరును చూపించాడు. “అదే దేవీపట్నం. అల్లూరి సీతారామరాజుగారు ఆ ఊరి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి, ఆయుధాలు పట్టుకు పోయాడు” అని చెప్పాడు.
ఆ స్వాతంత్య్ర సమరవీరుడు గుర్తొచ్చి మా గుండెలు ఉప్పొంగాయి. గొప్ప సాహసి! యోగి!
అందరినీ పైకి రమ్మని పిలుస్తున్నాడు. మేమూ వెళ్లాము. పైన ఇద్దరు కురాళ్లు సినిమా పాటకి డాన్స్ చేస్తున్నారు. చిన్న, రెండడుగుల ఎత్తు వేదిక. లోయర్ డెక్‍లో తెలియలేదు కాని, అప్పర్ డెక్ అటూ ఇటూ ఊగుతోంది. అయినా బ్యాలెన్స్ తప్పకుండా నృత్యం చేస్తున్నారు పిల్లలు.
తర్వాత “ఈరోజు బర్త్ డే కాని, మ్యారేజ్ డే గాని జరుపుకుంటున్నవారు ఎవరైనా ఉన్నారా?” అని అడిగారు.
ఇద్దరు దంపతులు చేయి ఎత్తారు. వారిని వేదిక మీదికి ఆహ్వానించారు. పేర్లు అడిగారు.
“నా పేరు సృజన్. నా భార్య తన్మయి. మేం చెన్నైలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాం. మా పెళ్లయి పదేళ్లయింది. ఇద్దరు పిల్లలు. శశాంక్, మయూఖ” అని చెప్పారు వారు.
వారిద్దరి మీద జోకులు తీసి నవ్వించాడు ప్రయోక్త.
“శ్రీరస్తూ! శుభమస్తూ! శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం” అన్న పాటను ప్లే చేస్తూ, వారితో డాన్స్ చేయించారు. “పెద్దవారెవరయినా వచ్చి, ఈ జంటను ఆశీర్వదించండి” అని అన్నాడు. నేను లేచి వేదిక మీదికి వెళ్లి, నన్ను నేను పరిచయం చేసుకున్నాను.
“ఈ పిల్లల దశమ వివాహ వార్షికోత్సవ సందర్భంగా వీరికి నా ఆశీస్సులు. ఈ సందర్భంగా పోతనగారి రుక్మిణీ కల్యాణం లోని ఒక పద్యం మీకు పాడి వినిపిస్తాను” అన్నాను.
సభికులు చప్పట్లతో తమ ఆమోదాన్ని తెలిపారు.
“ఉండండి! ముందే కొట్టకండి! పద్యం బాగులేకపోతే తిట్టకండి!” అన్నా నవ్వుతూ.
“అమ్మవారు రుక్మిణీ దేవి, శ్రీకృష్ణపరమాత్మను వరించింది. ఆమెను తీసుకుపోవడానికి స్వామివారు రథంలో విచ్చేశారు. వస్తాడో రాడో అని ఆమెకు అంతవరకు టెన్షన్! స్వామి ఆమెని రథంలో ఎక్కించుకుని వెళ్లిపోతున్నాడు. ఇద్దరూ లేచిపోతున్నారు! ఎలోప్‍మెంట్!” అన్నాను మైకులో.
కుర్రాళ్ళు రెచ్చిపోయి కేకలు వేశారు. కొందరు విజిల్స్! అప్పుడు ఆదిదంపతులైన వారిని చూసి, ప్రాగ్జోతిషపురము ప్రజలు ఇలా అనుకున్నారట!”
అందరూ శ్రద్ధగా వింటున్నారు. కల్యాణి రాగంలో ఆ పద్యాన్ని, ఆలపించాను. చివర్లో రాగప్రస్తారం కూడ చేశాను. మన సంస్కృతి, పద్యవైభవం అందరికీ తెలియాలి కదా!
మ॥
తగు నీ చక్రి విదర్భరాజసుతకుం; దథ్యంబు వైదర్భియుం
దగు నీ చక్రికి; నింత మంచి దగునే? దాంపత్య మీ యిద్దఱం
దగులం గట్టిన బ్రహ్మ నేర్పరిగదా; దర్పాహతారాతి యై
మగఁడౌఁ గావుతఁ జక్రి యీ రమణికిన్ మా పుణ్య మూలంబునన్!
కరతాళధ్వనులు మారుమ్రోగాయి! అదీ పద్యాని కున్న స్థానం!
తరువాత క్లుప్తంగా అర్థాన్ని వివరించాను. ‘వీరిర్వురన్ తగులం గట్టిన బ్రహ్మ నేర్వరిగదా!’ అన్న ప్రయోగం లోని చమత్కారాన్ని వివరించాను.
“మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటామే, దానిలా అన్న మాట!” అని చెప్పాను.
సృజన్, తన్మయి, నాకు పాదాభివందనం చేశారు. వారి శిరస్సులపై చేయి ఉంచి ఇలా ఆశీర్వదించాను.
“శతమానం భవతు శతాయుః
పురుషః శతీంద్రియ, ఆయుః
శేవీంద్రియః ప్రతితిష్ఠతు!”
డాన్సు చేసిన కుర్రాళ్ళు, యాంకర్ కూడా నా పాదాలకు నమస్కరించారు.
“మీరు సూపర్ బాబాయ్!” అన్నారు. నాకింత గౌరవాభిమానాలు కల్పించిన పోతనామాత్యుల వారికి మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
వేదిక దిగగానే యల్లమంద నన్ను కౌగిలించుకున్నాడు. “అద్భుతం మిత్రమా! నీ పద్యగానం!” అన్నాడు. ‘విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం’ అని కదా ఆర్యోక్తి! మా మిత్రుడు గొప్ప పండితుడు!
చాలామంది నా దగ్గరకు వచ్చి అభినందించారు. “చాలా కాలం తర్వాత చక్కని తెలుగు పద్యాన్ని రాగయుక్తంగా వినిపించారండి! మీ గాత్రం బాగుంది! మీరు తెలుగు పండిట్‍గా పని చేస్తున్నారా?” అనడిగింది ఒకామె.
“మా మిత్రుడు ఇంగ్లీష్ లెక్చరర్‌గా చేసి, కాలేజి ప్రిన్సిపాల్‌గా రిటైరైనాడమ్మా!” అన్నాడు యల్లమంద. “నేను డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చరరుగా రిటైరైనాను.”
“ఈయన కూడా పద్యాలు చక్కగా పాడతాడమ్మా” అన్నాను.
“మిమ్మల్ని చూస్తే అంత వయసున్నట్లనిపించదే”
“నేను సిక్స్టీ సెవెన్ నాట్ ఔట్. నా మిత్రుడు సెవెంటీ నాట్ ఔట్!” అన్నాను.
ఆమె ఆశ్చర్యపోయింది.
క్రూ మెంబర్‌ను ఒకతన్ని అడిగాను క్రింద – “సినిమాలలో చూపిస్తుంటారు. ఒక దీవి, కొండ, శివాలయం, అదెప్పుడొస్తుంది?”
“అదెప్పుడో ములిగిందండి. అక్కడికి పోలేము” అన్నాడు
కారిడార్‍లో నిల్చుని గోదావరిని కొండలను వీడియో తీశాను. ఎంత చూసినా తనివి తీరదు. భద్రాచలం నుండి వస్తున్న లాంచీలు ఎదురుగా వస్తున్నాయి. టైం పన్నెండున్నర!
“ఒంటి గంటకు భోజనాలు పెడతాము. ముందుగా భద్రాచలం వెళ్ళేవారు భోంచేయండి. రాజమండ్రికి వెనక్కు వచ్చేవారు, పాపికొండలలో నైట్ స్టే చేసేవారు తర్వాత తినండి. మరో అరగంటలో పాపికొండలు ప్రారంభం అవుతాయి. అక్కడ గోదావరమ్మ వెడల్పు తక్కువగా ఉండి, దాదాపు నాలుగు వందల అడుగుల లోతు ఉంటుంది. రెండు డెక్కుల్లో బ్యాలెన్స్ మెయిన్‌టెయిన్ చేయాలి. అందరూ ఒకేవైపు చేరకండి. కెప్టెన్ క్యాబిన్ ఎదుట ఆయనకు కనబడకుండా, నిలబడకండి. పాపికొండలు దాటి, పేరంట పల్లి చేరుకోడానికి మరో గంట, గంటన్నర పట్టవచ్చు. పాపికొండల మధ్యలోంచి వేగం గంటకు పది కి.మీ లోపే ఉంటుంది” అంటూ వివరించాడు .
భోజనాలు క్రింది డెక్ లోనే. పై కప్పు ఉన్నా, అప్పర్ డెక్‍లో వేడిగా ఉంది. ఎండ బాగా చిరచిరలాడిస్తూంది. చల్లని వాటర్ బాటిల్స్ అడిగినన్ని యిస్తున్నారు. సిబ్బంది ముఖాలలో ఏ మాత్రం ప్రొఫెషనల్ మొనాటనీ లేదు. ఆదరంగా పలకరిస్తున్నారు. మాలాంటి పెద్దవారిని ఏం కావాలో కనుక్కుంటున్నారు.
భోజనాల కోసం జనం బారులు తీరారు. “మాస్టారూ! మనం పావుగంట తర్వాత వెళదాం. రష్ తగ్గుతుంది” అన్నాను.
“ఈ లోపు పాపికొండలు వస్తాయేమో!” అన్నాడు మిత్రుడు.
“ఇంకా అరగంట పడుతుందన్నాడు గదా! పాపికొండల మధ్యే గంటకు పైగా ప్రయాణం ఉందట” అన్నాను
ఇరవై నిమిషాలు వెయిట్ చేశాము. జనం తగ్గారు. ఒక అబ్బాయి జనాలను ఇరువైపులా సమానంగా సర్దుతున్నాడు. కొందరు మీల్స్ ప్లేట్ తీసుకొని పైకివెళ్లారు.
టమోటా కొత్తిమీర పచ్చడి, కొంచెం కేసరి హల్వా, వంకాయ – పల్లీల ముద్ద కూర, గోంగూర నిల్వపచ్చడి, పాలకూర పప్పు, సాంబారు, చిక్కని మజ్జిగ. వెజిటబుల్ బిర్యానీ కూడా ఉంది. అది మేం తినలేదు. అన్నిటిలో ‘డిష్ ఆఫ్ ది డే’ టమేటా కొత్తిమీర రోటి పచ్చడి. రైస్ కూడా బాగుంది. తృప్తిగా భోంచేశాము.
ఎదురుగ్గా బోర్డు మీద ఇలా రాసి ఉంది.
“If you like our service, tell others, if not, please tell us” అని ఉంది. మా సేవలు మీకు నచ్చితే ఇతరులకు చెప్పండి. నచ్చకపోతే, మాకు చెప్పండి” ఎవరికి చెప్పాలో వారి నంబరు కూడ ఉంది.
“వీళ్ల సర్వీస్ కేం, దివ్యంగా ఉంటే?” అన్నాను మిత్రునితో.
అరగంట ముందే ఇన్సులిన్ తీసుకొని ఉన్నాను.
“పాపికొండలు అదిగో!” అని ప్రకటించాడు. లాంచీ పాపికొండల నడుమకు ప్రవేశించింది. వెడల్పు తక్కువగా ఉంది నది. నీటి ఒత్తిడి ఎక్కువగా ఉంది. నాలుగు వందల అడుగుల లోతంటే సామాన్యమా? లాంచీని గోదావరి ఊపేస్తోంది.
అప్పర్ డెక్‌కు వెళ్లి కారిడార్‌లో, రెయిలింగ్‍ని ఆనుకొని నిలబడ్డాము.
‘బ్రెత్ టేకింగ్ ఎక్స్‌పీరియన్స్’ అంటామే, అది మాకు అనుభవగోచరమైంది. ఉప్పొంగుతున్ననది. దగ్గరలో పాపికొండలు. “అంబరచుంబి శిరసరిజ్ఘరీ” అని పెద్దన గారన్నట్లు ఆకాశాన్ని చుంబిస్తున్నాయా పర్వత రాజాలు. వాటి నిండా దట్టమైన చెట్లు, ఎండ ప్రభావం ఏ మాత్రం లేదు. ప్రకృతి తన ఎ.సి. ఆన్ చేసింది. సెంట్రలైజ్డ్ ఎ.సి. అది. అందరికీ సమానంగా అందిస్తుంది. తరతమ భేదాలు లేకుండా అందరికీ తన ఫలాలనివ్వడమే ప్రకృతి లక్షణం. దాన్ని మానవుడు అలవరచుకుంటే, అతని జన్మ ధన్యం. అందుకే విలియం వర్డ్స్‌వర్త్ మహాకవి – “Let Nature be your Teacher” అన్నాడు.
లాంచీలో, అంతవరకు గొడవ గొడవగా మాట్లాడుకుటున్నవారు ఒక్కసారిగా నిశ్శబ్దం అయ్యారు. స్మార్ట్ ఫోన్లు పాపికొండల అందాలను, గోదావరి పరవళ్లను చిత్రీకరిస్తూ, తీసే వాళ్లతోపాటు తాము కూడా పరవశిస్తున్నాయి. నేను కూడా వీడియో లలో ఆ అపురూప ప్రకృతిని బంధించాను.
“Sometimes words fail to express our feelings” అని రాబర్ట్ బ్రౌనింగ్ అన్నట్లుగా అందరూ మౌనంగా ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధిస్తున్నారు. పాపికొండల అసలు పేరు పాపిడికొండలు అంటారు. పైనుంచి చూస్తే (aerial view) గోదావరి నదీమ తల్లి శిరస్సు పాపిడి తీసినట్లు, ఈ కొండలు అటు ఇటు పాయలైనట్లు కనిపిస్తాయట. వ్యాఖ్యాత చెప్పసాగాడు.
“తూర్పుకనుమలలోని దట్టమైన ఒక సమున్నత పర్వత శ్రేణి ఇది. ఇవి మన ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల నడుమ ఉన్నాయి. ఈ ప్రాంతం సుమారు ఒక వెయ్యి, పన్నెండు వందల చ.కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించి ఉంది.
దీనిని నేషనల్ హెరిటేజ్ ఫారెస్ట్‌గా గుర్తించారు. రాజమండ్రి, భద్రాచలం పట్టణాల మధ్య పాపికొండలు వస్తాయి. ఇవి సతతహరితారణ్యాలు. చెట్లు సాధారణంగా ఆకు రాల్చవు. ఇది దక్షిణ భారతం లోని, అత్యంత రమణీయ, ఆహ్లాదకర ప్రదేశాలలో ఒకటి. కొండలు, జలపాతాలు కోకొల్లలు. అందుకే దీనికి ‘ఆంధ్రా కాశ్మీరం’ అని పేరు!
ఈ అడవులలో పెద్దపులులు, చిరుతపులులు, నల్లపులులు, అడవిదున్నలు, జింకలు, నక్కలు, తోడేల్లు, కొండ చిలువలు, ఎన్నోరకాల కోతులు, ఎలుగు బంట్లు, ముళ్ళ పందులు, అడవిపందులు, వివిధరకాల పకక్షలు, విష కీటకాలు ఉంటాయి. ఎన్నో రకాల ఔషధ మొక్కలకు నిలయాలు ఈ పాపికొండలు.”
“ఒక్క జంతువైనా కనబడదేం?” అన్నాడు ఒక కుర్రాడు.
“నీవొస్తున్నావని బయటికొచ్చి నిలబడతాయి లేరా!” అన్నాడు వాడి ఫ్రండ్. అందరూ నవ్వారు.
“సీతారామయ్యగారి మనవరాలు, అంజి, గోదావరి, గోపి గోపిక గోదావరి వంటి సినిమాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. అప్పట్లో ‘బాపు’ గారి అందాలరాముడు, మూగమనసులు కూడా.
మధ్యలో కొన్ని ఊర్లు చూశాం కదా! పూడిపల్లి, సిరివాక, కొల్లూరు లాంటివి. రంగస్థలం సినిమా కూడా కొంత అక్కడే తీశారు. చాలా గ్రామాలకు ఇప్పటికీ కరెంటు లేదు. ఇప్పడిప్పుడే సోలార్ పవర్ ఇస్తున్నారు.
పేరంటాల పల్లి, లేదా పేరంటపల్లి శివాలయం వరకూ ఈ పాపికొండలు విస్తరించి ఉన్నాయి.
పాపికొండల వెనుక భాగంలో పశ్చిమగోదావరి జిల్లాలోని కొయ్యల గూడెం, కన్నాపురం, పోలవరం, శింగన్నపల్లి, వాడపల్లి, చీడూరు మీదుగా కొరుటూరుకు ఘాట్ రోడ్ ఉంది. కానీ పోలవరం ప్రాజెక్ట్ వల్ల అది కూడా మునిగిపోతుంది.
పూడిపల్లిలో త్రిశూలం, బంగారు బుల్లోడు లాంటి సినిమాలు కొంత భాగం చిత్రీకరించారు.”
సినిమాల ప్రసక్తి వచ్చినపుడు కుర్రాళ్లు, కుర్రమ్మలు శ్రద్ధగా వింటున్నట్లు గమనించాను. వారికి ఏదైనా సినిమాలతో ముడిపడితే గాని ఆసక్తి కలిగించదు.
“దేవీపట్నం తర్వాత మొబైల్స్ పని చేయవు. నెట్‌వర్క్స్ రావు. నైట్ స్టే కొల్లూరులో ఏర్పాటు చేస్తాము. అక్కడ వెదురు గడిసెల్లో రాత్రి గడపాలి. ఆదొక అద్భుత అనుభవం! వెదురు బొంగులో ఉడికించిన చికెన్ ఇక్కడి ప్రత్యేకత!”
మేమంతా పాపికొండల పారవశ్యంలో ఉండగానే లాంచీ హీరంటాల పల్లి రేవు చేరుకుంది.
“2019 సెప్టెంబరులో దుర్ఘటన జరిగి, లాంచీ ప్రమాదానికి గురైంది. అప్పటినుంచి దాదాపు రెండేళ్ళు ఈ యాత్రలను ప్రభుత్వం నిషేధించింది. తర్వాత 2021 జూలై నుండి అనుమతించింది. ప్రమాదాలు జరుగుతాయని ప్రజలు ప్రయాణాలు మానుకోరు కదా!”
ఎంత బాగా చెప్పాడు!
3 గంటలకు లాంచీ పేరంటాల పల్లి రేవు చేరింది. అక్కటి నుంచి భద్రాచలం వెళ్ళేవారు లాంచీ మారాలి. అది పక్కనే ఉంది. దాని పేరు హిమవర్షిణి ఎ.సి.
సిబ్బంది మా బ్యాగులను దాంట్లో పెట్టారు.
ఒడ్డుకు దిగడానికి ఏటవాలుగా ఉన్న ఒక బల్ల వేశారు. కాళ్లకు హోల్డ్ కోసం మధ్యలో అడ్డంగా పట్టీలు బిగించారు. నేను తడబడుతూంటే ఒక కుర్రాడు నా చేయి పట్టుకోని దించాడు, జాగ్రత్తగా. వాడికి థ్యాంక్స్ చెప్పాను.
మా యల్లమంద మాత్రం అవలీలగా బల్ల దిగిపోయి, ఇంకా రెండు పట్టీలు ఉండగానీ, చెంగున ఒడ్డుకు గెంతాడు! ఔరా! అని ముక్కున వేలేసుకున్నాను.
“మీ మిత్రుడు మీకంటే ఉషారుగున్నడండి” అన్నాడొకాయన.
“నాకంటె మూడేళ్ల పెద్దోడండి! చూడండి, అయినా ఎలా దూకాడో?” అన్నాను మిత్రుడి గర్వంగా చూస్తూ. దటీజ్ మై ఫ్రెండ్, డా॥ జెట్టి యల్లమంద. డెభై ఏళ్ల యువ కిశోరం!
(ఇంకా ఉంది)