[రాజమండ్రి, భద్రాచలం లలో పర్యటించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]
[dropcap]అ[/dropcap]రగంట టైం ఉంటుందనీ, ఈలోపు అడవిలో ఉన్న శివాలయాన్ని దర్శించుకుని రమ్మన్నారు. అది ఒక కి.మీ. లోపే ఉంది. కొండదారి. ఎగుడు దిగుడుగా ఉంది. గోదావరి గట్టు చాలా ఎత్తుంది కానీ మెట్లు, తర్వాత గచ్చు చేసి స్లోప్ ఉన్నాయి. దారిపొడుగునా వెదురుతో చేసిన అందమైన కళాకృతులు ఉన్నాయి. పెన్ స్టాండ్స్ దగ్గర నుండి ఫ్లవర్‌వేస్లు, మొక్కలు, ఇలా ఎన్నో. ఖరీదు మాత్రం ఎక్కువ అనిపించింది. పుచ్చకాయ ముక్కలు, రేగుపండ్లు, చెరుకు రసం, స్నాక్స్, కొండ ఉసిరికాయలు, ఐస్ క్రీమ్, టీ, కాఫీ, జామకాయలు ఇలా సమస్తం అమ్ముతున్నారు గిరిజనులు. టూరిజం ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందో కదా!
అడవిలో పదినిమిషాల పాటు నడిచాము. అక్కడ ‘శ్రీరామునివాటం’ అన్న క్షేత్రం ఉంది. చిన్నగుడి. అందులోని శివలింగం చాలా మహిమాన్వితం. 1800 లో రాజమండ్రి నుంచి ఒక మునీశ్వరుడు లాంచీలో భద్రాచలం వస్తూ పేరంటాలపల్లి వద్ద బస చేశాడట. ఆయనకు స్వప్నంలో శివుడు కనపడి ఇక్కడ తనకో ఒక ఆలయం నిర్మించమని కోరాడట. ఆలయమేగాక, ఆ ప్రాంత గిరిజనులకు ఆ మహనీయుడు విద్యాబుద్ధులు, వైద్యసౌకర్యాలు కల్పించాడు. ఆయనను వారు దైవంగా భావిస్తారు.
గుడి ముందు కొండల్లోంచి వచ్చే ఒక సెలయేరు పారుతుంది. దానిలో పాదప్రక్షాళణం చేసుకొని గుడిలో ప్రవేశించాము. నిశ్శబ్దం పాటించాలి. గుడిముందు ఒక గంట ఉంది. దానిని కేవలం ఒక్కసారే మోగించాలి. లోపల శివలింగం దర్శించాము. చుట్టూ ఎత్తైన పనస, పోకచెక్క వృక్షాలను దర్శించాము. పుచ్చకాయ ముక్కలు తిని, రేగుపండ్లు కొనుక్కున్నాం; లాంచీలో తినవచ్చని.
సరిగ్గా 3.45కు హిమవర్షిణి బయలుదేరింది. జనం తక్కువగా ఉన్నారు. లోయర్ డెక్‍లో సోఫాల లాగా ఉన్నాయి. భాగీరధి కంటే పోష్‍గా ఉంది. కాసేపు నడుం వాల్చాను. చిన్న కునుకు తీశాను. యల్లమంద పైకి కిందకి తిరుగుతూనే ఉన్నాడు. అతడి ఎనర్జీ అద్వితీయం!
మేం పోచవరం రేవు చేరడానికి గంటకు పైనే పట్టింది. అక్కడ కూడా గోదావరి గట్టు చాలా ఎత్తు. మమ్మల్ని భద్రాచలం తీసుకొని పోవడానికి ఒక మినీబస్ సిద్ధంగా ఉంది. అందులో ఎక్కి కూర్చున్నాము. అక్కడినుంచి భద్రాచలం 70 కి.మీ. ఘాట్ రోడ్డు. రోడ్ బాగుంది. క్రింద అంతా గోదావరి. ఎన్నో మలుపులు, మన జీవితంలాగే!
కూనవరంలో బస్ ఆపాడు. పక్కనే ఉన్న ఒక పెంకుటింట్లోకి తీసుకెళ్లారు. అక్కడ మంచాలు, కుర్చీలు ఉన్నాయి. బాత్ రూం ఉంది. ఆ యింటివారు మమ్మల్ని ఆదరించి కూర్చోబెట్టారు. మెత్తని ఉల్లిపాయ పకోడీ, చక్కని టీ సర్వ్ చేశారు. ఇదంతా పున్నమి ట్రావెల్స్ వారి ప్యాకేజ్‌లో భాగమేనట.
సాయంత్రం 6 గంటలకు భద్రాచలం చేరాము. ఒక చోట బస్ ఆపాడు. అక్కడనుంచి ఆటోలో మేం బుక్ చేసుకొన్న సుదర్శన్ రెసిడెన్సీకి వెళ్లాం. చెకిన్ అయ్యి, వేడి నీళ్లతో స్నానాలు చేశాము. క్రిందికి వెళ్లి మంచి కాఫీ తాగాము. భద్రాద్రి దేవస్థానం సరిగ్గా మేం దిగిన లాడ్జ్ ఎదుట ఉంది.
స్వామివారి దర్శనానికి వెళ్లాము. మాలాంటి వారి కోసం లిఫ్ట్ కూడా ఉందని తెలిసింది. లిఫ్ట్‌లో దేవాలయం ప్రాంగణంలోకి ప్రవేశించాము. క్రింద మా సెల్‍ఫోన్స్ డిపాజిట్ చేశాము. పక్కనే గోశాల ఉంది. గోమాతలకు ప్రణమిల్లాము.
దేవస్థానాన్ని బాగా అభివృద్ధి చేశారు. సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. లిఫ్ట్ బయటి గోడలపై ముఫై అడుగుల ఎత్తున గరుత్మంతుడు, ఆంజనేయస్వామి విగ్రహాలున్నాయి.
ముందుగా ఆంజనేయ మంటపంలో మారుతిని దర్శించాము. శీఘ్రదర్శనం టికెట్ మనిషికి వంద రూపాయలు. అంతరాలయ దర్శనం, అర్చన మూడు వందలు. కాని అది ఉదయం 7 నుంచి పదకొండు వరకేనని, సంప్రదాయ దుస్తులు ధరించి రావాలని కౌంటర్‍లో ఉన్నాయన చెప్పాడు. జనం అంతగా లేరు. ఉచిత దర్శనం వారి కంటే శీఘ్ర దర్శనం వారిని పదడుగులు ముందుకు వదిలారు. మా క్యూ వేరు!
శ్రీరామచంద్ర ప్రభువును కనులార దర్శించుకున్నాము. సీతమ్మవారు స్వామి వారి తొడ మీద కూర్చుని ఉన్నది. లక్ష్మణుల వారు నిలుచున్న భంగిమలో ఉన్నారు హనుమంతులవారు లేకపోవడం విశేషం.
“శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర, పరబ్రహ్మణే నమః” అని స్వామివారికి మొక్కుకున్నాము. ‘పుంసాం మోహన రూపాయ’ అన్న మాటలకు స్వామివారు ప్రతిరూపం! గుడి చుట్టూ ప్రదక్షిణ చేశాము. ఆవరణలో చక్కని శిల్పాలున్నాయి. ప్రశాంతంగా ఉంది. ఆలయగోపురం సమున్నతంగా, విద్యుత్ దీపకాంతిలో మెరిసిపోతున్నది.
ఒక చోట దీపారాధన శాల ఉంది. ఉచిత దర్శనం క్యూలు మెలికలు మెలికలు తిరిగి ఉన్నాయి. వీకెండ్, పైగా అయోధ్యలోని బాలరాముని పాణప్రతిష్ఠ ఎఫెక్ట్ ఏమో, ‘అంత దూరము పోనేల అబ్జనాభ!’ అన్నట్లు, అందరూ భద్రాద్రికి బారులు తీరుతున్నట్లున్నారు.
ఆవరణలో ఒక కళావేదిక ఉంది. దాని ముందున్న ఒక వితర్దిక పై కూర్చున్నాము.
“మిత్రమా! రామయ్యపై ఏదైనా శ్లోకం గానం చెయ్యి” అన్నాడు మిత్రుడు.
“స్వామి వారి మాలవిరాట్టును దర్శించిన తర్వాత, శ్రీ బుధ కౌశికముని విరచిత ‘శ్రీరామరక్షా స్తోత్రం’ లోని ధ్యాన శ్లోకం గుర్తొచ్చింది మిత్రమా! అది పాడతాను విను” అన్నాను
శ్లో:
ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థమ్
పీతం వాసో వసానం నవకమలదళస్పర్ధినేత్రం ప్రసన్నమ్
వామాంకారూఢ సీతాముఖకమలమిలల్లోచనం నీరదాభమ్
నానాలంకారదీప్తం దధతమురుజటామండలం రామచంద్రమ్
భూపాలరాగంలో నేనాలపిస్తున్న శ్లోకాన్ని వినడానికి కొందరు భక్తులు వచ్చారు. వారిలో కొందరు ప్రశంసిస్తూ తల ఊపారు. ఒకాయన, “ఏదైనా రామదాసు కీర్తన పాడండి సార్!” అని అడిగాడు. ఎదురుగా గోపన్నగారు తంబురా ధరించి ఉన్న విగ్రహం కనబడుతుంది. ఆ మహనీయుని తల్చుకొని, ఆయన రాసిన కీర్తన.
‘నరహరిదేవా జనార్ధనా! కేశవనారాయణ
కనకాంబర ధారి, రామరామ రామ శ్రీరఘురామ రామ రామ్’
అన్న దానిని రేవగుప్తి రాగంలో ఆలపించాను.
రామదాసులవారి కీర్తనలన్నింటిలో అతి కష్టమైన కీర్తనలలో అదొకటి. మిగతావన్నీ లైటర్ వీన్‍లో ఉంటాయి. ఇది సంస్కృతమయం! మొదట మా నరసింహస్వామితో ప్రారంభించినా, మొత్తం కీర్తన రామయ్య మీదే సాగుతుంది. ఎన్నో గమకాలు! ఈ మధ్యనే దానిని కష్టపడి సాధన చేశాను. అంతా రామకృప!
ఎనిమిదిన్నరకు ఆటోలో, కల్కి హోటల్ చేరుకున్నాం. భద్రాచలంలో వెజిటేరియన్ మీల్స్‌కు అది ప్రసిద్ధి అని చెప్పారు. ప్లేట్ మీల్స్‌కు ఫుల్ మీల్స్‌కు పది రూపాయలే తేడా! ఫుల్లే ఆర్డరిచ్చాం. ఎ.సి. సెక్షన్ కూడా ఉంది.
టమీటో దోసకాయ కూర, బీరకాయ పచ్చడి, పప్పు, సాంబారు, పెరుగు, కాలీఫ్లవర్ మంచూరియా, మజ్జిగ పులుసు! భోజనం బాగుంది. నూట పది రూపాయలు! రూంకు వచ్చి విశ్రాంతి తీసుకున్నాము.
***
బహుమతి ప్రదాన, సన్మాన సభ 11 గంటలకు. దగ్గర్లోనే అహోబిల మఠం ఉంది. ఉదయం లక్ష్మీనరసింహుల వారిని దర్శించుకున్నాము.
ఎవరో దంపతులతో, మఠం ఆవరణలో, పంతులుగార్లు ‘సుదర్శన నారసింహ హోమం’ చేయిస్తున్నారు. చాలా శక్తివంతమైన హోమం అది. స్వామివారు నల్ల రాతి విగ్రహం. ప్రసన్నవదనులు. తొడపై మంగతాయారు. మూల విరాట్టును ఫోటొ కూడ తీసుకోనిచ్చారు.
9 గంటలకు గుడి దగ్గరీ పెసరట్టు ఉప్మా కాంబినేషన్‌తో టిఫిన్ చేశాం. బాగుంది. ఖమ్మం జిల్లా ఐనా, అన్నింటిలో, భాషలో సైతం కృష్ణా జిల్లా ప్రభావం ఉంది. బార్డరు కదా!
పదిన్నరకు దేవాలయంలోకి వెళ్లాం లిఫ్ట్‌లో! దేవస్థానం ఇ.ఓ. శ్రీమతి ఎల్.రమాదేవి గారు ముఖ్య అతిథి. ఆమె ఐ.ఎ.ఎస్. క్యాడరట. ఆమె మామాలుగానే ఉంది గాని, బిళ్ల బంట్రోతు ఒకడు ఆమె వెనకాల ఉండి, హడావుడి చేస్తున్నాడు. ఆమె చేతుల మీదుగా మాకు క్యాష్ రివార్డ్, జ్ఞాపిక, ధృవపత్రం అందించారు. తర్వాత నిర్వాహకుల బంధువు ఇంట్లో చక్కని భోజనం ఏర్పాటు చేశారు.
రెండున్నరకు రూమ్‌కు వచ్చి పడుకున్నాం. ఐదుకు లేచాం. మా మిత్రుడు భద్రాచలం నుండి, సీలేరు, చింతపల్లి మీదుగా వెళ్ళే విశాఖపట్నం బస్‌లో రిజర్వేషన్ చేయించుకున్నాడు. అది ఆరున్నరకు. ఆరుకు క్రిందికి వచ్చి అతన్ని ఆటో ఎక్కించాను. అతడు వెళ్లిపోతుంటే కొంచెం దిగులనిపించింది.
నా ట్రెయిన్ రాత్రి 10.45కు. భద్రాచలం రోడ్‍లో. అది కొత్తగూడెం టవున్. స్టేషన్ పేరు భద్రాచలం రోడ్. 40 కి.మీ. ఉంటుంది. ఎనిమిదిన్నరకు రెండిడ్లీ, రవ్వదోశ తిని మజ్జిగ తాగాను. తొమ్మిదికి బస్టాండ్ చేరుకున్నాను. హైదరాబాద్ వెళ్లే బస్సులో సీటు దొరికింది. సరిగ్గా గంట ప్రయాణం. రోడ్ సూపర్. పది లోపే, స్టేషన్ ముందు దింపాడు.
మణుగూరు ఎక్స్‌ప్రెస్ కోసం జనాలు చాలా మందే వెయిటింగ్. కోచ్ నంబర్లు డిస్ప్లే చేశారు. పదిన్నరకు బండి వచ్చింది. ఎక్కి నా బెర్తులో హాయిగా పడుకున్నాను. ఉదయం 4.10కే సికింద్రాబాద్ వచ్చింది. బ్రష్ చేసుకుని బయట ఆల్ఫా హోటల్‌లో ఇరానీ చాయ్ తాగాను. ప్రొటోకాల్ కదండి! ఉబర్ ఆటోలో వనస్థలిపురంలోని మా యిల్లు చేరుకున్నాను ఐదు ముప్పావుకు!
అలా పాపికొండల మీదుగా గోదావరిలో లాంచీ ప్రయాణం, భద్రాద్రి రాముని దర్శనం హాయిగా జరిగాయి. స్వామివారి సన్నిధిలో సాహిత్య సభ జరగడం, బహమతి అందుకోవడం ఒక మరువలేని జ్ఞాపకం!
(అయిపోయింది)