గోమాలక్ష్మికి కోటిదండాలు-4

0
2

[box type=’note’ fontsize=’16’] గోమాత గురించి మహాభారతంలో తెలియచేసిన వివరాలతో ఈ వ్యాసం అందిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి. [/box]

[dropcap]ధ[/dropcap]ర్మరాజుకి మహర్షి సుమిత్రుడు పోషిస్తున్న ఆవుల చరిత్ర చెప్పిన భీష్ముడు – ధర్మరాజా! త్రిఖరం అనే కొండ, దాని సమీపంలో రుద్రుడు సృష్టించిన ‘కూలహ’ అనే నది అందమైన పరిసరాలతో ఉండేది. అక్కడ భృగువంశ మహర్షులు పర్ణశాలలు వేసుకుని శ్రద్ధగా తపస్సు చేసుకునేవాళ్లు.

వాళ్లల్లో ‘సుమిత్రుడు’ అనే మహర్షికి ‘అంగీరసుడు’ అనే బ్రాహ్మణుడు స్నేహంతో ‘గోశర్కర’ అనే ఒక తీగని ఇచ్చాడు. ఆయన ఆ తీగతో ఆవుని మేపాడు.

అది బలమూ, మంచి స్వరమూ, రూపమూ పొంది ఏపుగా పెరిగింది. అది ఒక ఎద్దుతో కలిసి కోడెదూడని కంది. ఆ జంట క్రమక్రమంగా పెరిగి, అనేక వేల ఆవులు ఆ మహర్షికి ధనంగా ఏర్పడ్డాయి. అతడు వాటిని ప్రేమతో పరామర్శిస్తూ ఉండేవాడు.

వాటి వెంట తిరుగుతూ మంచి పచ్చికా, నీరూ ఉన్న చోట్లలో తిప్పుతూ దూడలు తల్లుల పాలు తాగుతుంటే చూస్తూ పరమానంద పడేవాడు. తను మాత్రం అవి పాలు తాగేటప్పుడు వచ్చే నురుగుని తాగుతూ ఉండేవాడు. గౌతముడనే గొప్ప మహర్షి సుమిత్రుడు నురుగు తాగడం చూసి అతడికి ‘ఫేనవుడు’ అనే పేరు పెట్టాడు.

అలా ఉండగా కోరిన రూపం ధరించగల కొన్ని ఆవులు చక్కటి రూపాల్ని ధరించి అందమైన అమ్మాయిలుగా మారి కొలనులో స్నానాలు చేస్తున్నాయి. వాటిని చూసి ఆవులు ‘మీరెవరు?’ అని మనిషి భాషలో అడిగాయి.

అవి ‘మేము కూడా ఆవులం’ అన్నాయి. అది విని ఆవులు ‘మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. మీరు కూడా మాలాంటి ఆవులే అయినా ఈ గొప్పతనం మీకు ఎలా కలిగింది?’ అని అడిగాయి.

అమ్మయిల రూపంలో ఉన్న ఆవులు వాటితో ‘మేము వివరంగా చెప్తాము వినండి. హవ్యకవ్యాలకి, అతిథిపూజలకి, ఆహారానికి చక్కగా తృప్తిగా వినియోగించుకోడానికి వీలుగా సమృద్ధిగా పాలు ఉత్తమ బ్రాహ్మణులకి ఇస్తాము. మా సంతానాన్ని వ్యవసాయం మొదలైన పనులు చెయ్యడానికి పంపుతాము. ఆ పుణ్యం వల్ల మాకీ విశేషాలు కలిగాయి. మాకు కూడా గోలోకం తేలికగా సిద్ధిస్తుంది.

మా పుణ్యకార్యాలు చూసి మీరు అసూయపడతారు. మీ దూడలు మీతో రావడం వల్ల అవి కూడా చెడుదశని పొందుతారు. మాకున్న జ్ఞానం వల్ల ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకుని మీ మీద దయతో మీకు తెలియచేస్తున్నాము’ అన్నాయి.

అది విని ఆవులు ‘ఆవులకి ఆవులే దిక్కు కనుక మీరు మాకు మంచి గతి కలిగే మార్గం చెప్పండి’ అని అడిగాయి.

అమ్మాయిల రూపంలో ఉన్న ఆవులు ‘రంతిదేవుడనే రాజు యజ్ఞం చేస్తున్నాడు. చేస్తున్న యజ్ఞంలో పశువులుగా మీరు వెళ్లండి. ఆ రాజు మిమ్మల్ని యజ్ఞంలో బలిస్తే మీకు గోలోకంలో ఉండే ఫలితాన్ని పొందగలుగుతారు’ అని చెప్పాయి.

ఆవులన్నీ రంతిదేవుడి యాగానికి వెళ్లడానికి సిద్ధపడ్డాయి. అందులో ఒక ఆవు ‘మనం సుమిత్రుడి ధనం కదా! అతడి అంగీకారం లేకుండా వెళ్లడం ఎలా కుదురుతుంది? అంది.

‘అయితే అతడిని చంపుదాం. అతడు కూడా గోలోకానికి వస్తాడు’ అని నిర్ణయించుకుని సుమిత్రుడి దగ్గరికి బయలుదేరాయి.

సుమిత్రుణ్ని చంపిన గోవుల్ని గురించి చెప్తున్న భీష్ముడు – సుమిత్రుడి దగ్గరికి వెళ్లిన గోవులు అతణ్ని సూటిగా చూడలేక దూరం నుంచే వెళ్లిపోయాయి. కొన్ని పుల్లావులు (కపిలగోవులు) హృదయంలో క్రూరత్వం నింపుకుని ‘మేము అతణ్ని చంపుతాం. మాకు మీరేం మేలు చేస్తారో చెప్పండి’ అన్నాయి.

ఆవులన్నీ కూడబలుక్కుని ఒకమాట మీద నిలబడి ‘ఆవులన్నింటిలో కపిలవర్ణం కలవి మిక్కిలి గొప్పవయ్యేలా ఒక కపిల గోవుని దానం చేస్తే, అది వందగోవుల దానంతో సమానం అయ్యేలా మీకు వరమిస్తాం’ అన్నాయి.

ఆవులు అలా చెప్పగానే పుల్లావు విని ఎంతో ప్రీతితో కోరిన రూపాలు ధరించగలిగినవి కనుక వేరు రూపాలు ధరించి సుమిత్రుడి దగ్గరికి వెళ్లి ‘అయ్యా! మేము గోమాతలం. నువ్వు చేసే ఈ గోపూజకు సంతోషం కలిగి నీకు వరమివ్వడానికి వచ్చాం. నీ కేది ఇష్టమో దాన్ని కోరుకో’ అన్నాయి.

సుమిత్రుడు ‘ఇప్పట్లాగే నాకు ఆవులమీద భక్తి స్నేహలు ఎప్పటికీ ఉండేలా వరం ఇవ్వండి’ అన్నాడు.

దానికి అవి ‘అలాగే అవుతుంది, కాని, కులశ్రేష్ఠా! ఈ లోకంలో పని ఏమిటి? మన గోలోకానికి రా!’ అన్నాయి. అది విని ‘నేనీ గోరత్నాల్ని వదిలి అక్కడికి రాగలనా?’ అన్నాడు.

ఆ మాట విని అవులు అతడి దేహాన్ని ఆకాశానికి ఎత్తి తమ యోగబలంతో అతడి ప్రాణాలు పొగొట్టి, దేహాన్ని కింద పడేసి, వేగంగా కొమ్ములతో కాళ్లతో ఆ దేహాన్ని పిండి పిండి అయ్యేలా పొడిచాయి.

తిరిగి వెళ్లి అంతకు ముందు తమని పంపించిన ఆవులకి సుమిత్రుడి విషయం పూస గుచ్చినట్లు చెప్పి ఆనందం కలిగించాయి. గోలోకంలో ప్రథానస్థితి గల గోమాతలు ఆ విషయమంతా తెలుసుకుని తమ దగ్గరికి వచ్చిన సుమిత్రుడిని ప్రేమతో అదరించాయి.

స్త్రీల రూపంలో  తిరిగి, ఆవుల్ని కలుసుకున్నది మొదలుకొని తక్కిన అన్ని విషయాలు అతడికి తెలియచేశాయి.  ‘నీకిది మేలే అవుతుంది’ అని అతడికి సంతోషాన్ని కలిగించాయి.

తరువాత బ్రహ్మణుడిని హత్య చేసిన ఆవులన్నింటికీ ‘మీ ముఖం నల్లగా అవుతుంది!’ అని శాపం పెట్టాయి. మిగిలిన గోవులు ఏమయ్యాయో తెలుసుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here