Site icon Sanchika

గొంతు విప్పిన గువ్వ -1

[box type=’note’ fontsize=’16’] ఒక స్త్రీ సంపూర్ణ  జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న  సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది. [/box]

ఆత్మావలోకనం

[dropcap]M[/dropcap]en may come and men may go… but I stay on forever…

ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ ఉద్దేశం మానవులు వస్తూంటారు పోతూంటారు కాని ఈ ప్రకృతి మటుకు నిరంతరం, శాశ్వతం అని కావచ్చు.

నా పేరు సౌజన్య. ఎంతో ఉత్తమంగా ఎదగాలని నాకా పేరు పెట్టి వుంటారు. లార్డ్ టెన్నిసన్ ‘ది బ్రూక్’ లో రాసిన పై వాక్యాన్ని నా మొగ్గ విడుస్తున్న పదేళ్ళ ప్రాయంలో చదివినప్పుడు దానిని నేను నాకు నచ్చే, నన్ను సంతృప్తి పరిచే పద్దతిలో బ్రూక్‌కి నన్ను అన్వయించుకున్నాను. తదనుగుణంగానే బ్రూక్‌గా నన్నే ఊహించుకుంటూ ఆ పద్యాన్ని ఆస్వాదించాను. అప్పుడు నేనెలా అర్ధం చేసుకున్నానని ఇప్పుడు నన్ను అడిగి ఇబ్బంది పెట్టకండి. నేను చేసుకున్న అర్థాన్ని బట్టి నా శీలాన్ని నిర్ధారించకండి. కవిత్వంలో అప్పుడప్పుడే అఆలు దిద్డుతూ తెలియని లోకాన్ని అన్వేషించే నాలాంటి నా తరం అమ్మాయిలందరూ బహూశా అలాగే అర్థం చేసుకుంటారనుకుంటా.

నా తరం అనటంలో ఆంతర్యం అమ్మ తరానికి నా తరానికి మధ్య అంతరం. ఆడా మగా మధ్య ‘హాయ్ హలో’లు కూడా మా అమ్మ ఉద్దేశంలో నిషిద్ధం. ఆడది పరాయి మగాడితో మాట్లాడటం కూడా మహాపాపంగా పరిగణించే తత్త్వం మా అమ్మది. ఇప్పుడు నా ఆలోచనా స్రవంతిని ఆత్మావలోకనం చేసుకుంటే అమ్మ కడుపున అసలు నేనెలా పుట్టానా అని సిగ్గుగా వుంది.

అమ్మ తన ఇరవయ్యో ఏటే ఒంటరి అయినా ఏ ప్రేమ జాడ్యం సోకకుండా వెన్ను నిటారుగా నిలబెట్టి ఒక్కర్తి జీవితకాలమంతా ఎలా జీవించ గలిగింది అని ఇప్పటికీ నేను ఆశ్చర్యపోతుంటాను.  నేను నా నలభై ఏళ్ళ వయసులో కోల్పోయిన రెండు వర్ణాల (పసుపుకుంకుముల) లోటును భర్తీ చేసుకునేందుకు సప్త వర్ణాల (రంగుల ప్రపంచం) ఇంద్ర ధనుస్సును కాంక్షించటంలోనే నా మనో చాంచల్యం అర్థమవుతుంది.

ఈ మానసిక చపలత స్వాభావికమో, తరం అంతరంలో వచ్చిన తారతమ్యమో లేక నన్ను నమిలేస్తున్న ప్రేమరాహిత్య పరిణామమో నాకు ఎప్పటికీ అర్థం కాదు. నా ప్రేమ మజిలీల అనుభవాలు, నా ప్రేమరాహిత్యానికి కారణాలు  పునాదుల్లో నుండీ చెప్పాలి.

జీవితపు పుటలు ఒక్కొక్కటిగా ఆస్వాదిస్తూ దాటుకుంటూ దిగులుపడుతూ ఆనందపడుతూ కుంగుతూ పొంగుతూ అనేక అధ్యాయాలు ముగించుకుని తిరిగి ఒక్కో పుటా వెనుకకు చదువుకుంటూ జ్ఞాపకాలు నెమరేసుకుంటూ పురా స్మృతుల్లోకి జారుకుంటే ఎందుకో దిగులు వేస్తోంది.

నేనే ఈ లోకానికి అతిథిననుకుంటే నా జీవితంలోకి ఎందరు అతిథులో…

రక్త బంధాలు, ప్రేమ బంధాలు, స్నేహ బంధాలు, కన్న బంధాలు, పేగు బంధాలు… బంధం ఏ రూపమైతేనేమి… కొన్ని బంధాలు ప్రతిబంధకాలైతేనేమి… బంధాలన్నీ ఈ అనుభవాల చెట్టుకి ఒక్కో కొమ్మ తొడిగాయి.

కొన్ని కొమ్మలు చిగురించి పూలతో పుష్పించాయి. మరికొన్నయితే తియ్యని ఫలాలనూ పండించాయి. కొన్ని కొమ్మలయితే అక్కడికక్కడే వాడి ఎండి విరిగిపోయాయి. ఒకరు తొడిగిన కొమ్మను మరొకరు తురిమిన సందర్భాలూ వున్నాయి.

ఎన్నెన్ని అనుభవాలు.. కొన్ని అనుభవాలు సంభావనలయితే మరికొన్ని అభావంగా మిగిల్చాయి. పుష్కలమైన అనుబంధాల సంపదతో వెల్లివిరిసిన ఈ మానస పుస్తకం మరి ఇప్పుడెందుకు ఖాళీగా మిగిలిందని ఆవేదనగా వుంది.

ఐదు పదుల ఈ జీవితంలో వేళ్ళ సంఖ్యకు అందని అతిథులు ఎందరో… ఈ మానసిక పుటల్లో అధ్యాయాలు ఎన్నెన్నో…

కొందరు మొదట కోపంతో ఉరిమి కాల్చేస్తుందేమో అన్నంతగా నిప్పులు కురిసే మెరుపై మెరిసి మరుక్షణమే మంచు వర్షమై కురిసి చెలిమి చేస్తే మరికొందరు చాప కింద నీరులా అలికిడి లేకుండా చేరి నిండా ముంచేసారు.

కొందరు సున్నిత మనస్కులు చెట్టుకి పూచిన పూల పరిమళాలను ఆర్ధ్రంగా ఆఘ్రాణించి ఆర్తితో తడిమి ఆనందిస్తే మరికొందరు మొరటు మనుషులు పూలను తుంచి వాటి నడుం వంచి పూల మృదుత్వాన్ని శోభను నులిమేసారు.

కొందరు కలవరం లేని కోనేటిలా నిశ్చలంగా వుంటూనే నన్ను ఉరకలెత్తే జలపాతంలా పరవళ్ళు తొక్కిస్తే మరికొందరు పరవశంగా పారే సెలయేరై పారి నన్ను నిశ్చల నదీ తటాకంగా మార్చేసారు.

కొందరు నిశ్శబ్దoగా మట్టి రేణువులను వాటేసుకునే నీటి తేమలా పుక్కిటి వేళ్ళకు చమరింతను చేర్చి పుష్టిగా చెట్టు పెరుగుదలకు దోహద పడితే మరికొందరు సునామీలై చెట్టును నిలువునా ముంచేసి కూకటి వేళ్ళతో సహా కూల్చేసారు.

కొందరు మందగమన మలయమారుతంలా వీస్తూ ఆ చెట్టు శీతల ఛాయలో సేద తీరితే  మరికొందరు తుఫాను గాలులై ఆ చెట్టు కొమ్మలను విలయతాండవం చేయించి వికటాట్టహాసం చేసారు.

ఎన్ని రకాల వ్యక్తులు… ఎన్నెన్ని రకాల వ్యక్తిత్వాలు…

ఎన్ని రకాల బంధాలు… ఎన్నెన్ని అనుబంధాలు…

ఒక్కో అధ్యాయంలో ఒక్కో అనుభవంతో వారం వారం మీ ముందుoటాను. ఈ సౌజన్యను సౌజన్యంతో ఆస్వాదించాలని మనవి. సాహిత్యమన్నాక ఎంతో కొంత హితం కూర్చాలి సమాజానికి మేలు చేయాలి. నేను చేసిన పొరపాట్ల నుండి మీరు పాఠాలు నేర్చుకుంటే, నా జీవితానుభవాలు, ఆలోచనాతరంగాలు మీ జీవన పంథాను పునరాలోచింప చేస్తే,  మంచిచెడుల బేరీజుతో మీలో మలినాన్ని ప్రక్షాళన చేసుకుంటే నా ఈ అక్షరాలు ధన్యమైనట్టే…

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version