Site icon Sanchika

గొంతు విప్పిన గువ్వ – 17

[box type=’note’ fontsize=’16’] ఒక స్త్రీ సంపూర్ణ జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది. [/box]

పరితపించే పాశం

Mother is Goddess on earth…

దేముడు ఇంటింటా తానుండలేక తనకు మారుగా అమ్మను సృష్టించాడుట…

అమ్మoటేనే కమ్మని పదం. అమ్మకు ప్రత్యామ్నాయమే లేదు.

సర్వ జీవకోటిలో అమ్మ ప్రేమ అపూర్వం.

అయితే అమ్మ ఎంతటి ప్రేమమూర్తి అయినా మానవ సహజ రాగద్వేషాలకు అతీతం కాదు.

ఈ రాగద్వేషాల తీవ్రత పరిసరాల, వ్యక్తిగత, ఆర్థిక, మానసిక స్థితిగతుల పైన ఆధారపడి వుంటుంది.

ఐదు వేళ్ళూ ఒక్కలా వుండనట్లే అమ్మలందరూ ఒక్కలా వుండరు.

తను ప్రేమగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకు తన భార్యతో ప్రేమగా వుంటే సహించలేని అమ్మలు వున్నారు. వాళ్ళ అతి స్వాధీనత (పొసెసివ్‌నెస్) కొడుకుల చేత కోడళ్ళకు విడాకులు ఇప్పించే వరకూ వెళుతుంది.

తన గారాల పుత్రిక భర్తతో ఆనందకర దాంపత్య జీవితం గడిపితే భరించలేని భర్త రహిత అమ్మలు వున్నారు. అకారణంగా అల్లుడితో కూతురికి వైరం కల్పించి వాళ్ళ కాపురంలో చిచ్చు పెడతారు.

కూతురు సినిమాలకు షికార్లకు సరదాగా తిరిగితే చూసి సహించలేని వృద్ధమాతలు వున్నారు. వృద్ధాప్యం కారణంగా కదలలేని స్థితిలో హౌస్ అరెస్ట్ అయి కూతురి ఆనందాన్ని చూడలేక శాడిజంతో నరకం చూపిస్తారు.

మనవల ఆలనాపాలనా చూస్తూ తన సంతతికి సాయంగా వుండకుండా తమ వ్యక్తిగత జీవితాలకు ప్రాముఖ్యతనిచ్చే అమ్మలు వున్నారు. ఈ సెల్ఫ్ సెంటర్డ్ అమ్మలు అమ్మతనానికే కళంకం.

వృద్ధాప్యపు ఇన్ సెక్యురిటిలో ఏవేవో ఊహాగానాలతో సైకోసిస్‌తో బాధపడుతూ బిడ్డలను మానసికంగా క్షోభ పెట్టే అమ్మలు వున్నారు. వీళ్ళు భూలోక నరకం చూపిస్తారు.

ఇలా అమ్మల్లో ఎన్ని వైవిధ్యాలున్నప్పటికీ అమ్మ అమ్మే.. ఇలలో వెలిసిన దైవమే.

అమ్మ సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని అప్పుడే అందిన ఆదివారం సొపతిలో నేను రాసిన ‘అమ్మ’ కవిత చదువుతోంది.

ఒక్కో పేరా పూర్తి అయ్యే కొద్దీ గర్వంతో కూడిన ఆనందంతో అమ్మ మొహం విప్పారుతోంది.

అమ్మకు అమ్మను కాలేనా అంటూ సాగిన నా కవిత చదవటం పూర్తయ్యే సరికి అమ్మ మొహంలో సంతృప్తి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

కాఫీ కప్పు పట్టుకొచ్చిన నేను ‘నా కవిత ఎలా ఉందమ్మా’ నవ్వుతూ అడిగాను.

అమ్మ వెంటనే తన మొహంలోని హావభావాలు మార్చేసి ‘కథలల్లటం, కవిత్వీకరించటం బాగా నేర్చినదానివి. రాయటానికేం బ్రహ్మాండంగా రాస్తావు. అవి ఎంతవరకూ అమలు పరుస్తున్నావన్నది నిన్ను నువ్వు ప్రశ్నించుకో’ అంది ఫిర్యాదుగా.

భావరహితంగా ఒక పొడి నవ్వు నవ్వి ఊరుకున్నాను.

అమ్మకు ఈ మధ్య చాదస్తం మరీ ఎక్కువయ్యింది. ఏమి మాట్లాడినా, సందర్భం ఏదయినా, ఆఖరికి నేను ఆవిడను సరిగ్గా చూసుకోవటం లేదు అనే భావంతో తేల్చేస్తుంది.

ఏ హేలుసినేషన్స్ ప్రభావంతో అలా మాట్లాడుతుందో అర్థం కాదు. నా శాయశక్తులా ఆమెను ఆనందంగా వుంచే ప్రయత్నం చేస్తూనే వున్నాను.

‘సరేలే, కవిత విషయం వదిలేయి. ఈ పూట కూర ఏమి చేయమంటావో చెప్పు’ మాట మారుస్తూ అన్నాను.

అమ్మకి కొలెస్టరాల్ ఎక్కువగా వుందని, రక్తనాళాల్లో కొవ్వు పెరిగి బ్లాక్ అయి వున్నాయని డాక్టర్ మాంసాహారం నిషేధించాడు.

అమ్మ చేత ఆహార నియమాలు పాటింప చేయటానికి నాకు తాతలు దిగి వచ్చారు. అమ్మతో గొడవ పడకుండా ఆమెతో పాటు నేను కూడా వెజిటేరియన్ అయిపోయాను.

మొన్న చెల్లెలు శాంతి వచ్చినప్పుడు నేను మాంసాహారం మానేసానని తెలిసి నొచ్చుకుని ‘అమ్మ తినకూడదని నువ్వు మానేయటం ఏమిటక్కా. నీకు తినాలనిపించినప్పుడు నువ్వు తిను. ఎనభై ఏళ్ళ వయసులో ఆవిడ ఇంకా నోరు కట్టుకోకపోతే ఎలా. ఈ వయసులో నువ్వు నోరు కట్టుకోవటమేమిటి.’ అంటూ నన్ను మందలించింది.

అమ్మ వెంటనే అందుకుని ‘అబ్బో… అంత లేదులే. నా కోసమేమీ మానలేదమ్మా నీ అక్క. అదేదో యోగాలో మాంసం మంచిది కాదన్నారట. పైగా కూరగాయలు తింటే నాజూకుగా ఉంటారట’ అంది సాగదీస్తూ.

‘చూసావా, నీ త్యాగంలో కూడా కొత్త అర్థాలు వెతికే ఆమె కోసం నువ్వు నీ కోరికలు చంపుకోవటం నాకు నచ్చలేదు’ నిర్మొహమాటంగా అంది శాంతి.

శాంతి పేరుకే శాంతి. తన పరిసర వాతావరణంలో ఏ కొద్ది అశాంతి సూచనలు స్పురించినా ఆమె పెనుతుఫానే.

జీవితంలో ఎదురుదెబ్బలు తిని ఒంటరిగా మిగిలిపోయిన నా విషయంలో శాంతికి సానుభూతి ఎక్కువ.

‘తల్లీ కూతుళ్ళ మధ్య త్యాగాలేమిటే నీ మొహం. ముసలాళ్ళు పసిపిల్లలతో సమానం. వాళ్ళ పెంకి మాటలు, మంకు పట్లు మనం పట్టించుకోకూడదు. పైగా ఈ వయసులో వాళ్ళకు జిహ్వ చాపల్యం ఎక్కువ. అలాంటప్పుడు అమ్మ తినకూడనిది ఆవిడ ఎదురుగా నేను తిని ఆమెను బాధపెట్టటం అవసరమా.’

నా మాటలకు శాంతి “అమ్మకి జిహ్వ చాపల్యమే కాదు జిహ్వ తీపడమూ ఎక్కువే” అంది చటుక్కున.

“నోర్ముయ్. పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిటా మాటలు” కోపంగా మందలించాను. శాంతి బదులివ్వలేదు.

భర్తను కోల్పోయిన నేను అమ్మకు పూర్తి ఆసరా అయ్యాను. చల్లని చెట్టంటి అమ్మ నీడలో నేను, కొండలాంటి నా అండలో అమ్మ, ఒకరికి ఒకరం పరస్పర బలం అయ్యాం.

పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డా ఎప్పుడూ ఏదో కారణంగా వాళ్ళకు నా అవసరం రావటం, నేను వెళ్ళాల్సి రావటం మామూలు అయిపోయింది. పిల్లి పిల్లలను చంకన వేసుకుని తిరిగినట్టే అమ్మను నిత్యం వెంటేసుకునే తిరిగాను ఇంతకాలం.

క్రితం సారి ఆస్ట్రేలియాలో అమ్మ నన్ను ముప్పుతిప్పలు పెట్టింది. వెళ్ళిన ఇరవై రోజులనుండే ఇండియా వెళ్ళిపోదామని లేదా తనను పంపించేయమని గొడవ. అక్కడికీ అమ్మ కారణంగా సంవత్సరానికి మూడు ట్రిప్పులు కొడుతూ ఎయిర్ లైన్స్ వారికి భారీగా ముడుపులు చెల్లిస్తూ పోషిస్తూనే వున్నాను.

అంత త్వరగా తిరుగు ప్రయాణం కుదరదని ప్రతి రాత్రీ అమ్మకు సముదాయించి నచ్చచెప్పి నిద్ర పుచ్చాక సూర్యోదయానికి ముందే లేచి కూర్చుని ఇండియా ఎప్పుడు వెళుతున్నాము అంటూ మళ్ళీ మొదటికి వచ్చేది.

అమ్మ పేచీ రోజు రోజుకీ ఎక్కువయి భరింపశక్యం కాక మూడు నెలలు తిరగకుండానే ఇద్దరం ఇండియాకి తిరుగు టపా కట్టేసాము.

అమ్మమ్మను వంటరిగా వదిలి నేను ఆస్ట్రేలియా తిరిగి రాబోవటం లేదని మా అమ్మాయికి ఖచ్చితంగా చెప్పి వచ్చేసాను. అమ్మ వున్నంత కాలమూ ఏ లోటూ లేకుండా అన్ని సదుపాయాలు సమకూర్చాలని నా తపన.

టీవీలో ఏదో సంజయ్ దత్ బయోపిక్ చూస్తున్నాను. సంజయ్ దత్ జైలులో కటిక నేల మీద పడుకుంటే తండ్రి తనూ తన బెడ్ రూములో ఫ్యాను కూడా వేసుకోకుండా నేల పైన పడుకున్నాడు. ఎంత అపురూపమైన తండ్రి ప్రేమ అది.

చటుక్కున నాకు నాలుగు రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. అమ్మ గదిలో ఏసీ పాడయిపోయింది. ఆమె ఫ్యాను వేసుకుని పడుకుంది. ఎందుకో నాకు నా రూములో ఏసీ వేసుకోవాలనిపించలేదు. అమ్మ గదిలో ఏసీ రిపేరు అయ్యేవరకూ నేను ఏసీ వేసుకోవటం మానేసాను.

అనుకోకుండా అప్పుడే వచ్చిన చెల్లెలు శాంతి ‘వేడిగా వున్నా ఏసీ వేసుకోలేదే’ అన్న ప్రశ్నకి ఇబ్బందిగా ‘ఊరికేనే… అమ్మ గదిలో ఏసీ పాడయ్యింది’ అన్నాను నంజుతూ.

‘అయితే….నీ గదిలో వేసుకోవటానికి ఏమయ్యింది’ అంటూ పిచ్చిదాని వైపు చూసినట్టు చూసింది.

అంతలో అమ్మ ‘దానికి చలిగా వుందేమో. లేదా కరంటు బిల్లు ఎక్కువవుతుందని మానేసిందేమో. అంతేకానీ నా గురించి అదెందుకు మానేస్తుంది’ అంది.

శాంతి నా వైపు జాలిగా చూసింది.

నేను ‘అవునమ్మా, బిల్లు గురించే ఏసీ వాడటంలేదు’ అన్నాను పొడిగా.

‘నా గదిలో మటుకు ఏసీ రిపేరు చేయించు తల్లీ, మందులు ఎక్కువయి వేడి చేసి ఒళ్ళు చిటపటలాడుతున్నట్లుంది’ అంది అమ్మ.

అమ్మకి తెలుసు, నేను ఏసీ మెకానిక్ కోసం ఎంత ప్రయత్నించిందీ, ఎన్ని ఫోనులు చేసిందీ. అయినా అమ్మ అలా మాట్లాడటం చూసి మౌనంగా వుండి పోయాను.

అనుకోకుండా మా ఇంటికి నా ఎక్స్ కొలీగ్ ఆనంద్ వచ్చాడు. ఆఫీసు కబుర్లు, యోగక్షేమాలు అయ్యాక వాళ్ళ అమ్మగారిని వృద్ధాశ్రమంలో చేర్చానని చెప్పాడు. నేను ఆశ్చర్యపోయాను.

ఆనంద్ వ్యక్తిత్వం నాకు బాగా తెలుసు. అతను తల్లిని వృద్ధాశ్రమంలో పెట్టే మనిషి కాదు. ఆ మాటే అడిగాను.

‘వయసుతో పాటు అమ్మకు చాదస్తం ఎక్కువయ్యింది. కోడలు తనను సరిగ్గా చూసుకోవటం లేదు అని ఆమె బుర్రలో పాతుకు పోయింది. కోడలు ఏమి మాట్లాడినా, ఏమి చేసినా నెగటివ్ గానే ఆలోచించేది. ఇంట్లో రోజూ గొడవలతో ప్రశాంతత లేకుండా పోయింది. మేమిద్దరం ఆఫీసులో వున్నప్పుడు తను ఒంటరిగా బాధపడటం, మేము ఇంట్లో ఉన్నంత సేపు మాతో గొడవ పడటం పరిపాటి అయిపోయింది.

నేను ఎటు మాటాడినా పొరపాటే. మారిన అమ్మ ఆలోచనా దృక్పథంతో సర్దుకుపోవటం చాలా కష్టమయ్యింది. ఇంట్లో పరిస్థితి మహా సంకటంగా మారింది. ఆ సమయంలో మంచి కుటుంబ వాతావరణంతో, అన్నిసౌకర్యాలతో ఏ లోటూ లేకుండా ఆత్మీయంగా చూసుకునే వృద్ధాశ్రమం వివరాలు తెలిసాయి. కాకపోతే అక్కడ వుంచటం నా శక్తికి మించిన వ్యవహారమే అయ్యింది. నా నెల జీతం మొత్తం ప్రతీ నెలా కట్టేస్తున్నాను. మా ఆవిడకి వచ్చే చాలీ చాలని జీతంతో మేమిద్దరం సర్దుకుంటున్నాము. షేరింగ్ రూము తీసుకోవటం వలన అమ్మకి ఆవిడ ప్రాయపు మంచి నేస్తం దొరికింది. అన్ని స్టార్ సౌకర్యాలు, రుచికరమైన భోజనం, క్రమం తప్పకుండా మందులు ఇవ్వటం, అమ్మ చాలా ఆనందంగా వుంది అక్కడ. అసలు ఫోను చేసినా ఎంతో బిజీగా వున్నట్టు మాటాడుతుంది. వారం వారం వెళ్ళి చూసి వస్తున్నాను. అమ్మకి అదో పిక్నిక్‌లా వుంది. ఎక్కడ మళ్ళీ వెనక్కి ఇంటికి తీసుకు వెళతానోనని భయపడుతూంటుంది. మా ఇంటి అద్దె, మొత్తం నెలసరి ఖర్చు కన్నా అక్కడ అమ్మ ఒక్కదాని ఖర్చు ఎక్కువగా వుంది. అయినా కడుతున్నాను. ఈ వయసులో తను ఆనందంగా వుండటమే నాకు కావలిసింది. ఆర్థికంగా సర్దుబాటు కష్టమయినా అమ్మ సంతోషంగా వుంది మేము మనశ్శాంతిగా ఉన్నాము’ అన్నాడు.

నాకు ఆశ్చర్యం వేసింది. ఆనంద్ ఏదయినా బాగా ఆలోచించే సరయిన నిర్ణయం తీసుకుంటాడు.

వాళ్ళ అమ్మ కోడలితో గొడవ పడుతుంది కాని మా అమ్మ నాతో గొడవ పడుతుంటుంది. ఆడాళ్ళు కోడళ్ళతో గొడవపడటం సహజమే కూతుళ్ళతో కీచులాటలే విశేషం. ఏమయినా సరే నేను మటుకు అమ్మ బాగోగులు స్వయంగానే చూసుకుంటాను.

అయితే ఆనంద్ వలన కొన్ని కొత్త విషయాలు తెలిసాయి నాకు. ఇన్నేళ్ళుగా వృద్ధాశ్రమాలపై నాకున్న అభిప్రాయం ఇప్పుడు మారిపోయింది.

నిన్న పిన్ని కొడుకు రవి వచ్చాడు నన్ను కలవటానికి.

రవి భోంచేస్తూండగా అమ్మ ‘రవీ, చూసావుట్రా, నీ చెల్లెలు నన్ను వృద్ధాశ్రమంలో చేర్చాలని ఏదో గూడుపుఠాణి చేస్తోంది. నన్ను ఎలా వదిలించుకోవాలా అని ప్లాను వేస్తోంది. మొన్న వాళ్ళ ఆఫీసతనితో నన్ను వృద్ధాశ్రమం పంపేయాలనుకుంటున్నానని చెబుతూండగా విన్నాను’ అంటూ ముక్కు చీదుకుంటూ శోకండాలు మొదలు పెట్టింది.

అమ్మ మాటలకు, ఆ హఠాత్పరిణామానికి నేను నిశ్చేష్టురాలినయ్యాను.

ఆ వయసులో చిత్తవైకల్యంలో కలిగే భ్రమలనుకుంటాను. విన్న విషయాన్ని విన్నట్టుగా కాకుండా తనకు అనువుగా ఊహించుకోవటం… బాధ పడటం… బాధ పెట్టటం.

నోటమాట లేకుండా వుండిపోయిన నా వంక రవి సానుభూతిగా చూసాడు.

రవికి అమ్మ తత్త్వము, నా మనస్తత్వము తెలుసు. అక్కడ ఇంకా వుండటం ఇష్టం లేక ‘అర్జంటు పని వుంది పెద్దమ్మా, మళ్ళీ వస్తాను’ అని మెల్లగా జారుకున్నాడు.

శాంతి నాతో ‘ఒకసారి అమ్మని ఒక్కర్తినీ వదిలి ఆస్ట్రేలియా వెళ్ళు. అప్పుడు గాని అమ్మకు నీ విలువ, నీవు లేని లోటు అర్థం కాదు’ అని సలహా ఇచ్చింది.

నేను శాంతి మాటలకు నవ్వి ‘అమ్మ ఏదో మూర్ఖత్వంతో మాట్లాడుతోందని నేను హృద్రోగంతో బాధ పడే ఆవిడను ఒక్కర్తినీ వదిలి వెళ్ళటం ఎంత అవివేకం’ అని శాంతిని మందలించాను.

శాంతి ‘ఈవిడ ఉన్నంతవరకూ నీకు సుఖం సంగతి అటుంచు మనశ్శాంతి ఉంచదు…’ అని అమ్మ విషయంలో నాకు ఏమి చెప్పినా, చెవిటివాడి ముందు శంఖం ఊదటమేనని గొణుక్కుంటూ వెళ్ళిపోయింది.

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేవరకూ అమ్మ వీలైనన్ని విధాలుగా నన్ను ఏదో నెపంతో వేధిస్తూనే వుంది.

ఆ వయసులో వున్న అమ్మకు కూతురి సాయం, అవసరం అర్థం కాని అమాయకత్వానికి బాధ వేసింది.

ఏది ఏమయినా అమ్మ ఆఖరి శ్వాస వరకూ నేను సపర్యలు చేస్తూ అమ్మను అంటి పెట్టుకునే వుండాలని గట్టిగా నిర్ణయించుకున్నాను.

ఈ ఆలోచనల్లో పరధ్యానంగా నేను అమ్మకు వారం సరిపడా మందులు వీక్లీ మెడిసిన్ బాక్సులో సమయం వారీగా వేస్తున్నాను.

పరధ్యానంగా వున్న నా వైపు చూసి అమ్మ ‘మందులు తప్పుగా వేసి నన్ను చంపేసి పీడ వదిలించుకుందామనుకుంటున్నావా ఏమిటి. కథలు కాకరకాయల గురించి ఆలోచించకుండా బుర్ర అక్కడ పెట్టి సరిగ్గా వేయి మందులు’ అంది.

అమ్మ మాటల తూటాలకు అలవాటు పడిపోయినా ఎప్పటికప్పుడు మనసు ఛిద్రం కాక తప్పదు.

ఇది అమ్మ స్వభావ లక్షణమా లేక వయసు పరిణామ దశల్లో కలిగిన సాంఘికపరమైన మానసిక మార్పా…

నేను అమ్మను చంపాలని ఆలోచిస్తున్నాననుకునే వరకూ అమ్మ ఆలోచిస్తోందంటే ఇక నా తాపత్రయానికి అర్థం లేదు.

ఆమె మాటలు హాస్యంగా తేలికగా తీసుకుందామనుకున్నా మనసులో తెలియని బాధ మెలిపెడుతోంది.

అలవి కాని దిగులుతో గుండె బరువుగా అనిపించింది. అమ్మ సూటిపోటి మాటల నైరాశ్యంలో పడి ఈ మధ్య నేను నా ఆరోగ్యం అశ్రద్ధ చేస్తున్నాను.

దుఃఖంతో నా గుండె మోయలేనంత బరువుగా అనిపించింది.

నా కొలీగ్ ఆనంద్ మాటల్లో వాస్తవం అర్ధమవసాగింది. ఇంట్లో మనశ్శాంతి కరువైతే ఎంత మనస్తాపమో..

అలాగని ససేమిరా అమ్మని ఆశ్రమంలో పెట్టలేను.

ఆ సాయంత్రం నాకు భోజనం చేయాలనిపించలేదు.

అభోజనంగానే మంచం పైన మేను వాల్చాను.

రెండు కనుకొలకుల్లోంచి కన్నీరు ధారాపాతంగా స్రవించి దిండుని తడిపేసాయి.

ఏడుస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో తెలియదు.

“గుండెల్లో సన్నటి నొప్పి, ఏదో అలజడి, అసౌకర్యంగా అనిపించింది. క్రమేపీ నొప్పి ఎక్కువవసాగింది. నొప్పిని పళ్ళ బిగువున అదిమి పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. నములుతున్నట్టుగా వున్న నొప్పి కాస్తా గుండెపోటుగా ఉధృతమయ్యింది.

నా కళ్ళ వెంబడి ఆగని కన్నీరు ప్రవహిస్తూనే వుంది. ఒళ్ళంతా ముచ్చెమటలు పోశాయి. గుండెలపై పెద్ద బండరాయి పెట్టినట్టుగా అనిపించసాగింది.

నొప్పి వెనుకగా భుజాల మధ్య నుండి మెడకి ప్రాకింది. కడుపులోనూ గాభరా ఎక్కువై తిప్పుతున్నట్టుగా వాంతిలా అనిపించసాగింది.

నాకేదో జరుగబోతోందని అర్ధమయ్యింది.

‘హార్ట్ ఎటాక్’… అవును ఖచ్చితంగా ఇది అదే.

అమ్మ గదిలో ఆస్ప్రిన్ మాత్రలున్నాయి. నేను కదిలే స్థితిలో లేను. గొంతు పెగలటం లేదు. మంచంపై ఫోను కోసం చేతితో తడిమాను.

లేదు. ప్రాణం ఎవరో తోడేస్తున్నట్లుగా వుంది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి.

అమ్మ కళ్ళ ముందు మెదిలింది. నేను లేకుండా అమ్మ ఏమయిపోతుందనే ఆలోచన ఇంకొంచం నొప్పిని పెంచినట్లయ్యింది.

నా బలంతోనే మిడిసిపడుతూ కావాలనే నన్ను నానా మాటలనే అమ్మ అమాయకపు పెంకి మొహం కళ్ళముందు దీనంగా కదిలింది.

లేదు నేను చావకూడదు, అమ్మ బ్రతికున్నంత వరకూ ఆమెను కంటికి రెప్పలా చూసుకుని, పోయినప్పుడు కొడుకునై తల కొరివి పెట్టి, కర్మకార్యాదులన్నీ సక్రమంగా చేయాలి. అస్థికలు కాశిలో నిమగ్నం చేసి, అమ్మకు స్వర్గ ప్రాప్తి కలిగించి, ఆమెకు కొడుకు పోయిన లోటు తీర్చాలి. నన్ను కని పెంచిన ప్రతిఫలము తీర్చుకోవాలి.

శరీరం లోంచి ప్రాణాన్ని ఎవరో తోడేస్తున్నట్టుగా వుంది.

తనెంత దురదృష్టవంతురాలు… అమ్మను వదిలి అర్ధాంతరంగా వెళ్ళిపోతోంది.

చెవుల వెనుక జుట్టంతా కన్నీటితో తడిచి ముద్దయిoది.

నా గుండె బలహీనంగా ‘అమ్మా… అమ్మా’ అంటూ మూలుగుతోంది.”

‘అమ్మా’ అనే ఆక్రందనతో అమాంతం లేచి కూర్చున్నాను.

ఓహ్… ఇదంతా కలా.

భగవంతుడా… ఎంత నిజంలా అనిపించింది.

అమ్మను ఒంటరిని చేసి చచ్చిపోయాననే అనుకున్నాను.

అమాంతం ఉద్విగ్నంగా లేచి కూర్చుని గుండెల మీద అరచేయి పెట్టుకున్నాను.

ఇంతలో హాలు లోంచి అమ్మ ‘బారెడు పొద్దెక్కింది. గొంతులో కాసిని కాఫీ చుక్కలు పోస్తావా, కాసేపు మాడిస్తే ఏకంగా తులసి తీర్థం పోయచ్చనుకుంటున్నావా’ అంది.

అప్పటివరకూ కలలో వచ్చిన గుండె నొప్పి అమ్మ మాటలకు ఇప్పుడు నిజంగానే మొదలయ్యింది.

శాంతి చెప్పినట్టు అమ్మకు కొంత కాలం దూరంగా వుండాలి.

మనిషి విలువ దూరంగా వున్నప్పుడే అర్థమవుతుంది.

మనసు రాయి చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చేసాను. అమ్మ ఎటూ విదేశానికి రావటానికి ఇష్టపడటం లేదు.

అమ్మ దేనికీ తడుముకోకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసాను. వెంటనే తెలిసిన పాత వంటమనిషిని కుదిర్చాను. అమ్మను అనుక్షణం పర్యవేక్షించాలన్న తపనతో సీసీ టీవీ కెమెరాల గురించి వాకబు చేసి రెండు రోజుల్లో ఇంట్లో కెమెరాలు ఫిక్స్ చేయించాను. అమ్మకు తోడుగా రాత్రుళ్ళు పడుకోవటానికి మేనకోడలిని ఏర్పాటు చేసాను. మంచి చెడు చూసుకోవటానికి ఒక కేర్ టేకర్‌ను కుదిర్చాను.

గుండె దిటవు చేసుకుని నా టికెట్ బుక్ చేసుకున్నాను. అమ్మకు మెడికల్స్ చేయించి వీసా తీసుకుని అమ్మ చేతిలో పెట్టాను. ఎప్పుడు తను రావాలనుకుంటే అప్పుడు టికెట్ కొంటానని చెప్పి అమ్మను మొదటిసారి ఒంటరిగా ఇండియాలో వదిలి పెట్టి వచ్చేసాను.

భగవంతుడు తానుగా ఇంటింట కొలువుండలేక సృష్టించిన దేవతే అమ్మ. అలాంటి దేవతకు నిత్య పూజలు లేకుండా ఒంటరిగా ఇంట్లో వదిలి ఆమె బొమ్మను నా గుండె గుడిలో పదిల పరుచుకుని వచ్చేసాను.

అమ్మoటే దేవతని నిర్వచించేవారికి ఆ దేవీ పూజలకు దూరమైన ఈ పూజారిణి మనసు అర్థం కాదు.

అమ్మ ప్రేమకు కళంకం తెస్తే పంచ భూతాలూ విజృంభిస్తాయంటే అనౌచిత్యం కాదు.

నిజానికి ‘ఏది ఏమైనా అమ్మ అమ్మే’ అంటూ అమ్మ కోసం తపిస్తూ బయటకు చెప్పుకోలేక ఆక్రోశిస్తున్న ఎందరో కూతుళ్ళ కోరస్ వ్యథ ఇది.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version