గొంతు విప్పిన గువ్వ – 21

33
3

[box type=’note’ fontsize=’16’] ఒక స్త్రీ సంపూర్ణ జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది. [/box]

మనసున కాచిన వెన్నెల

[dropcap]ప్ర[/dropcap]తీ కథకు ఓ ప్రారంభం వుంటుంది…

ఆ ఆరంభం గతంలోనో.. గత జన్మలోనో…

ఈ కథకు ఇది ప్రారంభం కాదు.

కేవలం ఓ అస్థిమిత రోజుకి మాత్రమే ఇది సాక్ష్యం.

అస్థిమత్వం ఏమీ శాశ్వతం కాదు…

అది డెమెన్షియా కావచ్చు లేదా రిట్రోగ్రేడ్ అమ్నేషియా కావచ్చు…

ప్రేమ మాత్రం అమరం.

ఎన్నో ఒడుదుడుకుల పయనం ఈ సుదీర్ఘ జీవితం.

ప్రేమంటే ఏకాకి ఎడారి బతుకులో చల్లటి ఒయాసిస్సంటి సేద.

ఎన్నో కథల కలనేత ఈ రాధమ్మ కథ.

చివరి మజిలీ చేరువలో ఇది మరో ప్రేమ కథ.

రాధమ్మ వయసు ఎనభై ఐదేళ్ళు వుంటాయి.

ఎనభై ఐదేళ్ళకు కూడా తరగని రాజసం ఆమెది.

వెన్ను వంగినా మెత్తబడని అభిమానం ఆమెది.

జవసత్వాలు పట్టు తప్పినా పట్టు తప్పని పెత్తనం ఆమెది.

ఆ రోజు రాధమ్మకు మనుమరాలు శ్వేత ఎన్నిసార్లు ఫోను చేసినా ఆమె పలకటం లేదు.

శ్వేతకు కంగారు పుట్టి సీసీ కెమెరాల్లో చూసింది.

శ్వేత మనసు కుదుట పడింది.

జూమ్ చేసి మరీ చూసింది.

రాధమ్మ కొత్త పెళ్ళికూతురిలా కులుకుతూ, సిగ్గులొలుకుతూ ముసిముసి నవ్వులు రువ్వుతూ డైనింగ్ చైర్ పైన ఒక్కర్తీ కూర్చుని వుంది.

రాధమ్మ ఎదురుగానే డైనింగ్టేబుల్ పైన మొబైల్ వుంది. అయినా ఆమె మొబైల్ తీయటం లేదు. మొబైల్ ఏమయినా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయిందా. శ్వేతలో లక్ష అనుమానాలు.

అమ్మమ్మను పరీక్షగా చూసింది. చేతులు అటూ ఇటూ కదుపుతూ ఒక్కర్తి తనలో తాను మాటాడుకుంటోంది. శ్వేత ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. లివింగ్ రూం మొత్తం పరికించి చూసింది ఎవరైనా ఏ మూలైనా ఉన్నారేమోనని. ఎవ్వరూ కనిపించలేదు. వీధి తలుపులు మూసి వున్నాయి.

శ్వేత పసితనంలోనే తల్లితండ్రులు ఆక్సిడెంటులో మరణిస్తే రాధమ్మ శ్వేతను కంటికి రెప్పలా పెంచింది. కష్టబడి పెద్ద చదువులు చదివించింది. మంచి సంబంధం చూసి పెళ్ళి చేసి విదేశాలకు పంపింది.

శ్వేతకు అమ్మమ్మను ఒంటరిగా వదిలి వెళ్ళటం ఇష్టం లేదు. అమ్మమ్మను తనతో తీసుకువెళ్లటానికి భర్తను ఒప్పించింది. కాని రాధమ్మ మనమరాలి ఇంట్లో అదీ పరాయి దేశంలో వుండటం ఇష్టం లేక శ్వేతతో వెళ్ళటానికి నిరాకరించింది.

శ్వేత రాధమ్మకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి సీసీ టీవీ కెమెరాలు పెట్టించి ఆరోగ్య జాగ్రత్తలు చెప్పి అయిష్టంగా వదిలి వెళ్ళిపోయింది.

అప్పటి నుండీ రాధమ్మతో రోజూ ఫోనులో మాటాడుతూ, ఇరవై నాలుగు గంటలూ ఆమెను కెమెరాల్లో కనిపెడుతూ వుంటోంది.

శ్వేత కెమేరాల్లోకి చూస్తూ మళ్ళీ ఫోను కలిపింది.

లాభం లేదు. రాధమ్మ ఫోను ఎత్తటం లేదు.

ఈ మధ్యే రాధమ్మకు తోడుగా వుంటుందని శ్వేత పెట్టిన ఆమె కజిన్‌ను తనకు అవసరం లేదని పంపించేసింది రాధమ్మ.

శ్వేత మరో ఆఖరి ప్రయత్నం చేసింది. రాధమ్మ ఫోను తీయలేదు.

వెంటనే సర్వంట్ క్వార్టర్‌లో వుంటున్న, రాధమ్మ బాగోగులు చూసుకునే వాచ్‌మ్యాన్ కాశికి కాల్ చేసింది శ్వేత.

“కాశీ, అమ్మమ్మ ఫోను సైలెంట్ లోకి వెళ్ళిపోయినట్టుంది. ఒక్కసారి వెళ్ళి చూడు…”

“లేదమ్మా, అమ్మగారు తన స్నేహితుడు ఎవరో భోజనానికి వస్తున్నారని, ఆమె పిలిచే వరకూ నన్ను పైకి రావద్దన్నారు… నేను ఇప్పుడు పైకి వెళ్ళలేను..” కాశి కాస్త నంజుతూ ఇబ్బందిగా నీళ్ళు నమిలాడు.

శ్వేత మరింత ఆశ్చర్యపోయింది.

“ఎవరా స్నేహితుడు.. పైన ఇంట్లో ఎవరూ లేరే…” ఆరాగా అడిగింది.

“తెలియదమ్మా… తన చిన్ననాటి స్నేహితులట.. బాగా కావాల్సిన వారట.. సాయంకాలం మీ బంధువులు ఎవరో వస్తే, వారికి ఓ ఐదొందలు, ఆటోకి ఓ వంద ఇచ్చేసి త్వరత్వరగా కంగారు పెట్టి మరీ వాళ్ళను పంపించేసారు. ఐదు నిముషాలైనా కూర్చోనివ్వలేదు.. ప్రయాణ బడలిక కూడా తీరకుండానే వాళ్ళను తరిమేశారు..” చెప్పనా వద్దా అని సంశయిస్తూనే చెప్పాడు కాశి.

“ఎవరు వచ్చినా కింద గేటు తీసి నీ ముందు నుండేగా వెళ్ళాలి… కాస్త గమనించు” హెచ్చరించింది శ్వేత.

“అసలు ఎవరైనా మనిషంటూ వస్తే కదమ్మా గమనించటానికి. ఊరికే అలా భ్రమ పడుతుంటారు ఒక్కోసారి..” జవాబిచ్చాడు కాశీ.

మరింత దిగ్భ్రమకు లోనయ్యింది శ్వేత.

పనిమనిషి యాదమ్మ ప్రతిరోజూ రాధమ్మ ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతుంది. వెంటనే శ్వేత యాదమ్మకి కాల్ చేసింది.

“ఏందే యాదీ… ఎట్టున్నవు.. ఏమిటి విషయాలు… మా అమ్మమ్మెట్టా వుంది”

పెద్దగా నవ్వింది యాదమ్మ.

“ఏందే గట్ల నవ్వబడ్తివి… ఏమయ్యింది..”

“అమ్మా, మీ అమ్మమ్మ నాకు అమ్మ అసూంటిది. గిట్ల మాటాడుతున్ననని ఏమనుకోకు. గిప్పుడు ముసలామెకు పడుసు కోర్కెలు పుడ్తున్నయి…”

శ్వేత మధ్యలో అడ్డుపడుతూ “ఏందే నీ పిచ్చి వాగుడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాటాడు” అరిచింది యాదమ్మ పైన.

“నువ్వు గట్ల అరిస్తే ఇగ నేనేమి సెప్ప… నీ ఇష్టం సెప్పమంటే సెప్తా.. లేకుంటే లే…”

శ్వేత పని ఒత్తిడిలో ఇరవై నాలుగ్గంటలూ కెమెరాలు చూడలేక పోతోంది. ఏమి జరుగుతోందో తెలుసుకోవటం అవసరం.

“మరి గా మాటలేందే… అమ్మమ్మ వయస్సేంది… నీ మాటలేంది”

“ముందు నేను సెప్పేది ఇన్నంక నువ్వు మాటాడమ్మ. పొద్దుగాల పాలాయన ఒచ్చేపాటికి పోడర్ గిట్ల కొట్టుకొని తయారయి కూసుంటది. గయ్నను లోపట్కి పిలుస్తది… ఏమేమో కథల్ పడ్తది.. ఎట్ల ఎట్లనో చేస్తుందమ్మా. నాకైతే సమఝ్ అయితలే.”

ఒక్క క్షణం మైండ్ బ్లాంక్ అయ్యింది శ్వేతకి.

“అమ్మ ఒడ్డీ యాపారం చేస్తదంట.. పాలాయన సాయం చేస్తాడని సెప్తుంది. పాలాయన గిరాకి తెచ్చిండు… ఇరవై వేలు ఇయ్యాలె అని పైసలన్నీ కట్ట కట్టి పెట్టింది. గాయింత పాలాయనకి ఇచ్చేయగలదు మొత్తం పైసలన్నీ… నువ్వేమి చేస్తవో ఏమో… పొద్దుగాలప్పుడు ఒకసారి కెమెరాలు సూడు…” సలహా ఇచ్చింది యాదమ్మ.

యాదమ్మ చెప్పేది నిజమా…

అసలు ఏం జరుగుతోంది అక్కడ..

కళ్ళతో ఏమీ చూడకుండా అమ్మమ్మను ప్రశ్నించకూడదు.

అసలు అలాంటిది ఏమన్నా చూసినా కూడా శ్వేత అమ్మమ్మను ప్రశ్నించలేదు.

ఆ రాత్రంతా శ్వేతకు నిద్ర పట్టలేదు.

అన్ని కార్యకలాపాలు వదిలేసి అమెరికా టైముని ఇండియా టైములోకి తర్జుమా చేసుకుంటూ తెల్లవార్లూ మొబైల్లో కెమెరాలు చూస్తూ కూర్చుంది.

రాధమ్మ పసిపిల్లలా ముడుచుకుని ఆద మరిచి పడుకుంది.

శ్వేత రాత్రంతా నిద్ర పోతున్న అమ్మమ్మను ఆర్తిగా చూస్తూనే కూర్చుంది.

పసితనంలో తన శరీరం నున్నగా వుండాలని బలంగా నలుగు పెట్టి రుద్దిన ఆ చేతులు నిద్దట్లో కూడా వణుకుతున్నాయిప్పుడు…

ఎన్ని వందల బత్తాయిల రసం తీసి తనతో తాగించిందో ఆ కంపిస్తున్న వేళ్ళతో అప్పుడు…

శ్వేత కళ్ళు కన్నీటితో మసకబారాయి.

ఐదు కాకుండానే అమ్మమ్మ నిద్ర లేచింది.

శ్వేత గుండె దడదడలాడింది.

రాధమ్మ బ్రష్ చేసుకుని అంత చలిలో ఉదయాన్నే స్నానం చేసేసి నైటీ తీసేసి చక్కగా చీర కట్టుకుంది. ఏదో లోషన్ ఒంటికి రాసుకుని బాబడ్ జుత్తును దువ్వుకుని నిండుగా వూలు శాలువా కప్పుకుంది.

శ్వేత బీపీ పెరిగిపోయింది.

రాధమ్మ మెడకు నెక్ బెల్ట్ పెట్టుకుని, కాళ్ళకు చెప్పులు తొడుక్కుని చేతికర్ర సాయంతో బాల్కనీలోకి వచ్చి కూర్చుంది.

ఐదున్నర కాకుండా అంత చలిలో అమ్మమ్మ బాల్కనీలో కూర్చోవటం అవసరమా…

యాదమ్మ బీజం వేసిన అనుమానం శ్వేతలో ఉత్కంఠ రేపగా ఉద్విగ్నంగా రెప్ప వేయకుండా నాలుగు కెమెరాలు నిశితంగా చూస్తోంది.

శ్వేతలో తెలియని అలజడి.

లేత నీలం రంగు పాత బజాజ్ చేతక్ బండి గేటు ముందు ఆగింది. సీటు ఎదురుగా పెద్ద సంచీ లోనుండి రెండు పాల ప్యాకెట్లు చేతిలోకి తీసుకుని తెల్లటి బట్టల్లో పాలవాడు గేటు తీసుకుని లోపలికి వచ్చాడు.

పైన బాల్కనీలో నుండి చూసిన రాధమ్మ ఆనందంగా లేచి నిలబడింది.

అతను పైకి వచ్చి బాల్కనీలో చెప్పుల స్టాండు పక్కనున్న బల్ల పైన పాల ప్యాకెట్లు పెట్టి వెళ్ళబోయాడు. రాధమ్మ ఏదో చెప్పింది. అతను ఆ రెండు ప్యాకెట్లు మళ్ళీ చేతిలోకి తీసుకుని లోపలికి లివింగ్ రూము దాటి డైనింగ్ ఏరియాలోకి వెళ్ళాడు.

వెనుకే రాధమ్మ లోపలికి నడిచింది.

అతను పాల ప్యాకెట్లు డైనింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళబోయాడు. రాధమ్మ అతని చేయి పట్టుకుని చైర్ పైన కూర్చోపెట్టింది. తను దీవాన్ పైన కూర్చుంది.

రాధమ్మ పెదవులు ఏదో పలవరిస్తున్నాయి…

చూస్తున్న శ్వేతకు తనను తాను నిభాయించుకోవటం కష్టమైంది.

వాళ్ళ మధ్య జరిగిన పది నిముషాల మాటలు శ్వేత ఊహకు అందటం లేదు.

పది నిముషాలు ఆమెకు పది యుగాల్లా గడిచాయి.

అతను లేచి వెళ్ళబోతుండగా రాధమ్మ అతని గుండెల మీద వాలి ఏడవనారంభించింది.

చూస్తున్న శ్వేత వశం తప్పిపోయింది.

అతనికి ముప్పై ఏళ్ళు వుండొచ్చు. తన ఈడు వాడే. అమ్మమ్మకు ఎనభై ఐదు. అతను రాధమ్మను జాగ్రత్తగా పొదివి పట్టుకుని దీవాన్ మీద కూర్చోబెట్టి వీధి గుమ్మం తలుపు దగ్గరకు లాగి వెళ్ళిపోయాడు.

రాధమ్మ ఇంకా సన్నగా ఏడుస్తూ దీవాన్ మీద పడుకుండి పోయింది.

శ్వేత తల గిర్రున తిరుగుతోంది.

లేత నీలం బజాజ్ వెస్పా బండి, తెల్లటి ప్యాంటు షర్టులో పాలవాడు…

ఎంత ఆలోచించినా పాలవాడితో రాధమ్మ దగ్గరి తనానికి లాజిక్కు అందటం లేదు శ్వేతకు.

* * *

రాధమ్మ పడక్కుర్చీలో కూర్చుని పలవరిస్తోంది…

“నిత్యా, నీ ప్రతీ పలుకు నా హృదయ వీణను శృతి చేసి తియ్యని మధుర గానంతో నన్ను ఆపాద మస్తకం పరవశింప చేసేది. నేను సమస్తం మరిచి నా మనో వీధిలో నర్తించానే కాని ఏనాడూ నీ పిలుపుకి బదులిచ్చి రాగం కలప లేదని నాపైన కినుకా…” రాధమ్మ బోసి నోటితో బుంగ మూతి పెట్టింది.

“రా నిత్యా, ఇప్పుడు ప్రేమ గీతం పాడుకుందాం. ఇప్పుడు నా చుట్టూ నువ్వే కనిపిస్తున్నావు. నన్ను నేను మరుద్దామనుకునే ప్రయత్నంలో వున్న నాకు నీ సమక్షం తిరిగి నన్ను నాకు ప్రసాదిస్తోంది. నన్ను నేను కోల్పోలేను. నీ సాన్నిధ్యాన్ని ఇంక వదులుకోలేను.. రా ప్రియా…” రాధమ్మ పరవశంగా చేతులు ముందుకు చాచింది. జగన్మోహన ఆనందం కెంపులై ఆమె చప్పిడి బుగ్గల్లో ఎర్ర మందారమై తణుకులీనుతోంది.

“జీవితం నుండి నేను కోరుకున్నదీ, జీవితం నాకు ఇచ్చినదీ ఒక్కటి కాకపోయినా, నా మనసుకి గాయమైతే అప్పుడు నీ మనసు గాయపడేది చూడూ… నా గాయాలను మోసేందుకు నాకు మరో అదనపు హృదయం ఇచ్చినందుకే నిత్యా ఈ జీవితమంటే నాకు అంత ఇష్టం..” ఏదో రహస్యం చెబుతున్నట్టుగా గాలిలో ముందుకు వంగి గుసగుసగా కలవరించింది.

రాధమ్మ మెదడు ఐదు దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోయింది.

ఎందుచేతనో ఆ పాలవాడి తెల్ల బట్టలు, చిరునవ్వు, ఆ లేత నీలం వెస్పా రాధమ్మను గతంలోకి తీసుకెళ్ళిపోయాయి.

అప్పట్లో తనను అమితంగా ప్రేమించిన, తాను రహస్యంగా మాత్రమే ఆరాధించిన ఒక సన్నిహిత సఖుని స్మృతుల్లో రాధమ్మ విస్మృతమై పోయింది.

రిట్రోగ్రేడ్ అమ్నేషియా…

ఆ నేస్తమెప్పుడూ తెల్లటి బట్టల్లో మల్లెపువ్వంటి చల్లని నవ్వుతో పలకరించి రాధమ్మను పరవశింప చేసేవాడు.

అప్పుడు అంగీకరించి స్వీకరించలేని అతని ప్రేమను రాధమ్మ ఇప్పుడు తన ఒంటరితనంలో కోరుకుంటోంది. నిజానికి కోరుకోవటం మాత్రమే కాదు మానసికంగా లేనిది వున్నట్టుగా భ్రమిస్తోంది.

అతను తన పక్కనే వున్నట్టు, తనతో మాటాడుతున్నట్టు, భోంచేస్తున్నట్టు అతని ఉనికిని అనుభవిస్తోంది. రాధమ్మకు తనేమి చేస్తుందో తనకే తెలియటం లేదు. తనేమి మాటాడుతుందో స్పృహ వుండటం లేదు. ఆ ఊహలతో భ్రమలతో ఆమె మనసున వెన్నెల విరిసి అపరిమితానందంగా ఆహ్లాదంగా మాత్రం వుంటోంది ఆమె అంతరంగం.

తన ఆనందానికి అడ్డుపడుతున్నారని రాధమ్మ ఇప్పుడు అందరినీ అనుమానిస్తుంది. ఇంట్లో మరెవరయినా వుంటే తన మిత్రుడు రావటానికి మొహమాటపడుతున్నాడని ఆపోహ పడుతుంది. అందుకే శ్వేత రాధమ్మ సేవ కోసం ఆమె చేతి కింద పెట్టిన అమ్మాయిని పంపించేసింది.

రాధమ్మ, ఆమె మనసు, ఆమె ఇల్లు అన్నీ ఇప్పుడు నిరంతరం ఆ నేస్తం రాక కోసం ఎదురు చూస్తున్నాయి. వయసులో వుండగా సంకోచించిన రాధమ్మ ఇప్పుడు అనునిత్యం ఆమె సఖుని ఊహా పరిష్వంగాన్ని మనసారా ఆస్వాదిస్తోంది. తన ప్రణయ వాసన పసిగడతారని అందరినీ బహిష్కరిస్తోంది.

అందరూ అంటారు ప్రేమకు వయసుండదని…

వయసేమో గాని ప్రేమకు మరుపుండదు.

డెమెన్షియాలో కూడా ఆరని తడి ప్రేమొక్కటే…

మరుపులోనూ ప్రేమ మైమరిపిస్తుంది.

* * *

రిట్రోగ్రేడ్ అమ్నేషియా….

దగ్గరి గతాన్ని మరిచి బాగా రిమోట్ గతంలోకి మెదడు జారిపోవటం…

ఉన్నట్టుండి తరుచూ రాధమ్మ ఐదు దశాబ్దాల గత స్మృతుల్లోకి వెళ్ళిపోతుంది.

రాధమ్మ తను వయసులో వుండగా చేసిన వడ్డీ వ్యాపారం ఇప్పుడు చేయాలనుకుంటోంది.

అప్పుడు శ్వేతకి అసలు తెలియని ఓ తెల్ల బట్టల నీలం వెస్పా మనిషితో అనుబంధాన్ని ఇప్పుడు కోరుకుంటోంది రాధమ్మ.

పాలవాడిని అతనిగా భ్రమిస్తోంది.

సమ్ థింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వే ఇన్ హర్ మైండ్…

శ్వేతకు తెలియని గతంలో రాధమ్మ జీవిస్తోంది.

శ్వేతకి ఏమి చేయాలో అంతు పట్టటంలేదు. కాలు నిలవటం లేదు.

కోవిడ్ కారణంగా అమెరికా బోర్డర్లు మూసేశారు. విమానాలు లేవు.

అగమ్యగోచరంగా వుంది.

ఆంగ్లంలో ‘డెస్పిరేషన్’ అనే పదానికి ఇప్పుడు అసలు అర్ధం తెలిసింది శ్వేతకు.

కాశీకి ఫోను చేసి పాలవాడి నంబరు తీసుకుని తనకు ఇమ్మంది.

కాశీ నంబరు తెచ్చి ఇచ్చాడు.

పాలవాడితో అసలు ఏమి ప్రస్తావించాలో ఎలా మొదలెట్టాలో శ్వేతకి అంతుపట్టలేదు. పదాలు పేర్చుకుని కష్టబడి మాటలు కూడబలుక్కుంది.

నిజానికి పాలవాడు చాలా మంచివాడు, నిజాయితీపరుడు.

కాని డబ్బు చెడ్డది. ఈ కరోనా కష్ట కాలంలో డబ్బు అవసరాలు మరీ చెడ్డవి.

ఫోనులో పాలవాడు శ్వేత గొంతును గుర్తించాడు. అతని గొంతులో తొణుకు బెణుకు లేదు.

శ్వేతకు ఎలా మొదలెట్టాలో అర్ధం కాలేదు.

‘మా ఇంటి చుట్టూ కెమెరాలు వున్నాయి, ఆ ఇంట్లో ప్రతి కదలికను నేను గమనిస్తుంటాను’ అని హెచ్చరించటమే శ్వేత ఉద్దేశ్యం.

“బావున్నావా…” శ్వేత పలకరింపు తనకే పేలవంగా వినిపించింది.

వెంటనే గొంతులోకి గాంభీర్యం తెచ్చుకుని “ఏందయ్యా పొద్దుగాల లోపట మా డైనింగ్ రూముల కనిపించినవ్. నేను సీసీ టీవీ కెమెరాల్ల చూసిన. అసలు నీకు ఇంటి లోపటి దాంక రావలసిన పని ఏంది…” గదమాయింపుగా అడిగింది.

“అమ్మా, పెద్దమ్మనే నన్ను లోపటికి పిలస్తదమ్మా. నేను పాలు ఎయ్యాలె, నాకు పని వుంది అన్నా ఊకోదమ్మా. నా తల్లి అసుంటిది అని కాదనలేక లోనికి పోతానమ్మా.” అతని మాటల్లో నిజాయితీ వుంది.

“పొద్దున్న నిన్ను కావలించుకుని ఏడుస్తున్నట్టు వుంది. ఎందుకు, అసలు ఏమంటుంది నీతో…”

అతను ఒక క్షణం మౌనంగా వుండి పోయాడు.

జవాబు చెప్పటానికి తటపటాయిస్తున్నాడని అర్ధమయ్యింది.

“మాటాడవే…” రెట్టించింది శ్వేత.

అసలు అతనిని అమ్మమ్మ ఎవరనుకుంటుందో తనకు తెలియాలి.

“నేను ఒంటరిదాన్నయిపోయాను. అందరూ నాకు దూరమై పోయారు. నా చేతుల్లో పెరిగిన నా మనవరాలు కూడా నన్ను వదిలేసింది. నువ్వూ నన్ను వదిలేస్తావా… నాకు నువ్వయినా తోడు ఉండవా… అని ఏడ్చుకుంటూ ఏమేమో మాటాడుతుందమ్మా. ఆమెకు జర దిమాగ్ ఖరాబయినట్టుంది. వయసై పోయింది కదా…” శ్వేత అనుమానం రూఢీ అయ్యింది.

అర్జంటుగా ఇండియా వెళ్ళి అమ్మమ్మను మంచి డాక్టరుకి చూపించాలి.

“సరే… నీ మంచితనం మీద నాకు నమ్మకముంది. నువ్వన్నట్టుగా ఆమె బుర్ర సరిగా పని చేయటం లేదు. నువ్వు ఇక పాలు వేయటం మానేసేయి. ఖాతా పోయిందని బాధపడకు. పెద్దమ్మ ఆరోగ్యం కుదురు పడ్డాక మళ్ళీ వేద్దువుగాని.. ఇంతవరకూ వేసిన పాలకు ఏమయినా బాకీ వుంటే కాశీ వచ్చి ఇచ్చేస్తాడు. నువ్వు డబ్బుల కోసం కూడా ఇంక మా ఇంటి దిక్కుకి పోకు…” బాధ పడుతూ చెప్పింది శ్వేత.

“తప్పుడు భావనతో నిన్ను మాన్పించటం లేదు. కరోనా సమయంలో కేవలం అమ్మమ్మ వయసు దృష్ట్యా నీ రాకను అరికడుతున్నాను. నన్ను అపార్థం చేసుకోకు”

“ఫరవాలేదమ్మా. నువ్వు చెప్పేది కరెక్టే. నేను రోజు పెద్దమ్మతో పరేషాన్ అవుతున్న… ఇగ పోను…” అన్నాడు.

అక్కడితో రాధమ్మ ప్రేమ కథ ముగిసి పోతుందనుకుంది శ్వేత.

కాని ఈ కథ మరో కథకు దారి తీస్తుందనుకోలేదు…

Life stories never end till the last breath….

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here