గొంతు విప్పిన గువ్వ – 25

26
2

[box type=’note’ fontsize=’16’] ఒక స్త్రీ సంపూర్ణ జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది. [/box]

అడవి కాచిన వెన్నెల

సీత, సావిత్రి, సక్కుబాయి లాంటి పతివ్రతలు పురాణాల్లోనే వుంటారని అలాంటి స్త్రీలు ఈ కలియుగంలో ఇప్పటి అసంతృప్త వైవాహిక జీవితాల్లోనూ, మానసిక వ్యభిచారాల బ్రతుకుల్లోనూ వుండరని నా ప్రగాఢ విశ్వాసం.

నా విశ్వాసాన్ని నిలువునా నిర్వీర్యం చేసి అబద్ధమని నిరూపించింది సీత.

విద్య లేని వాడు వింత పశువని సుమతీ శతకం. కాని ఇల్లాలు విద్యావతి అయితే ఇంటిల్లపాదీ విద్యావంతులవుతారన్న తన బావ నమ్మకాన్ని నిజం చేసిన నిప్పు లాంటి సీత కథ నాకు ఎందుకో రామాయణాన్ని మించి ఉదాత్తంగా అనిపిస్తుంది.

పాతిక సంవత్సరాల క్రితం మొదటి రోజున యుక్త వయసులో వున్న సీత నా కమాండెంట్ సెక్రటేరియట్లోకి అడుగు పెట్టింది. భయవిహ్వల అయిన మొహంతో చేతిలో పోస్టింగ్ ఆర్డర్‌తో బిడియంగా సీత నా ఆఫీసులో అడుగు పెట్టిన రోజును నేనెప్పటికీ మరువలేను.

అప్పటికే నాకు మా హెడ్ క్లర్క్ ఇంటర్ కాంలో ఫోను చేసి చెప్పాడు.

“మేడం, ఎక్ నయీ లడ్కి అప్పాయింట్ హుయీ. బిల్కుల్ అనాడీ లంబాడ లడ్కి హై.. బహుత్ భోలీ అవుర్ డర్పోక్ హై. కహీకే లాయక్ నహీ హై.. ఆప్ అపనే పాస్ బిఠాకే ధీరేసే కాం సీఖాయియే” అన్నాడు.

తడబడే అడుగులతో లోపలికి వచ్చిన సీత చేతి వేళ్ళు సన్నగా వణుకుతూండగా నా చేతికి పోస్టింగ్ ఆర్డర్ అందించింది. ఆ రోజున పల్చటి తెల్లటి ఆమె లేత మొహం మరింత తెల్లగా పాలిపోయి వుంది.

పోస్టింగ్ ఆర్డర్ పైన పేరు చదివి దిగ్భ్రాంతిలో వుండి పోయాను.

సీత, విడో ఆఫ్ లేట్ నాయక్ సుమంత్.

ఆ పద్దెనిమిదేళ్ళ పసి పిల్ల వితంతువని తెలిసి నా మనసు కలుక్కుమంది.

నా క్యాబిన్‌లో నాతో పాటు వున్న మరో ఆర్మీ పియేను యూనిఫారంలో చూసి ఆమె మొహం వివర్ణమయ్యింది. యూనిఫారంలో ఆర్మీ ఉద్యోగిని చూడగానే ఆమెకు తన బావ స్మృతిలో దుఃఖం  కట్టలు తెగిన వాగులా ప్రవహించింది. ఆఫీసు మ్యానర్స్ తెలియక శోకండాలతో ఏడుపు అందుకుంది. నేను కంగారుగా లేచి వెంటనే డోర్స్ మూసేసాను.

నేను ఆమెను పక్కనున్న కుర్చీలో కూర్చోబెట్టి మంచి నీళ్ళిచ్చి ఊరడించాను. అంత దుఃఖంలోనూ ఆమె భుజం చుట్టూ బిగించి దోపుకున్న చీర కొంగు జరగలేదు. అలా వచ్చి ఆఫీసు అటెండరుగా చేరి ఆఫీసు పని అఆలతో నేర్చుకోవటం మొదలుపెట్టి నా తర్ఫీదులో చక్కటి ఇంగ్లీష్ డ్రాఫ్టింగ్ చేయటం వరకూ దీక్షతో నేర్చుకుంది.

నా దగ్గర అటెండర్‌గా ఎనిమిది సంవత్సరాలు పని చేసింది. మా ఆఫీసులో ఎల్డిసీ ఖాళీలు పడ్డప్పుడు నేను సీతను బలవంత పెట్టి ఎల్డిసీకి దరఖాస్తు పెట్టించాను. నా పలుకుబడిని, కమాండెంట్ పియేగా నా హోదాను ఉపయోగించి బోర్డు మెంబర్లకు సీత కమాండెంట్ అటెండరని చెప్పి రెకమండ్ చేసి పాసు చేయించాను.

ఎల్డిసీగా ప్రమోటు అయిన రోజున సీత నన్ను వదిలి వెళ్ళటానికి చాలా ఏడ్చింది. నా సంరక్షణలో సుఖంగా వున్న తనను జనారణ్యంలోకి పంపుతున్నానని బాధ పడింది.

“మేడం, నాకు ఈ అటెండరు పోస్టు చాలు. ఈ జీతమే చాలు. మీ దగ్గరే వుంటాను..” అంటూ మొర పెట్టుకుంది సీత.

“సీతా, నువ్వు పది మంది మధ్యలో పని చేయాలి. లోకం తెలుసుకోవాలి. నీ కొడుకు ‘మా అమ్మ అటెండరు’ అని చెప్పుకోవటం కన్నా ‘మా అమ్మ క్లర్కు’ అని చెప్పుకోవటంలో గర్వపడతాడు. మీ బావ కోరిక మీద పాసయిన పదో క్లాసు ఫలితాన్ని నువ్వు పూర్తిగా పొందాలి. ఏ లోకాన వున్నా మీ బావ సంతోషిస్తాడు..” అని నచ్చచెప్పాను.

బావ సంతోషిస్తాడన్న ఒక్క మాటకు మారు మాటాడకుండా ఒప్పుకుంది.

“మేడం, నేను పది పాసయినట్టు కూడా తెలియకుండానే మా బావ వెళ్ళిపోయాడు తెలుసా” అంటూ తన కథ చెప్పింది.

మట్టిలో మాణిక్యం లాంటి సీత కథ ఇక్కడ ఆమె మాటల్లోనే….

* * *

పేదరికపు అట్టడుగు లోతుల్లోనున్న కుటుంబ ముఖచిత్రాన్ని మార్చలేని దశలో మా సుమంత్ బావ ఉన్నట్టుండి ఒక రోజున మాయమైపోయాడు. మా మేనత్త బావ కోసం చాలా దిగులుపడింది. తెలిసిన చోటల్లా వెతికించింది. అసలే బక్కచిక్కిన బావ తిండి కోసం ఎక్కడ అలమటిస్తున్నాడోనన్న బెంగతో అత్త ఎన్ని పూటలు తిండి మానేసిందో లెక్క చెప్పలేను. బావ ఆచూకీ తెలియక అత్త బావ మీద మనోవ్యథతో మంచం పట్టేసింది.

చిన్నప్పటినుండీ అందరూ నన్ను మా సుమంత్ బావ పెళ్ళామనటంతో బావ అదృశ్యం అత్తతో పాటు నన్నూ కలిచి వేసింది. నిజం చెప్పొద్దూ నేనూ బావ మీద చాలా బెంగపడ్డాను. బావ మీద బెంగతో అత్త ఆరోగ్యం బాగా క్షీణించింది. సరిగ్గా అత్త అటూ ఇటుగా వున్న పరిస్థితిలో అనుకోని విధంగా బావ నుండి కబురు వచ్చింది. తన ఆర్మీ ట్రైనింగు పూర్తయ్యిందని త్వరలో వస్తానని. ఆ వార్తతో అత్త లేచి కూర్చుంది. కొడుకు క్షేమ సమాచారం అత్తకు టానిక్కులా పని చేసింది. ఎక్కడ లేని బలం వచ్చేసింది. క్రమంగా అత్త ఆరోగ్యం పుంజుకుంది.

నేనూ నా మిలిటరీ బావ కోసం కళ్ళు కాయలు కాచేట్టు ఎదురు చూసాను.

ఆర్నెల్లకు బలిష్టంగా ధృడమైన శరీర సౌష్టవంతో వచ్చిన బావను చూసి నేను గుర్తు పట్టలేక పోయాను. పీలగా బక్కపలచగా గట్టిగా గాలి వీస్తే ఎగిరిపోయేట్టు వుండే నా సుమంత్ బావేనా అని ఆశ్చర్యం వేసింది.

మిలిటరీ ట్రైనింగ్ వలన శరీరం రాటు తేలి కండ పుష్టితో గట్టి పడి మగసిరితో వెలిగిపోతూ బావ నన్ను మైమరిపించాడు.

బావ ఆర్మీలో భర్తీ అవటానికి ఎన్ని రిక్రూట్మెంట్ ర్యాలీలకు హాజరయ్యాడో, మొదట్లో ఎదురైన అపజయాలతో తనలో వున్న లోపాలనెలా సరిదిద్దుకున్నాడో అన్నీ వివరంగా చెప్పాడు. మొదటి ర్యాలీలో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లోనే నిరాకరించబడ్డ తను రాత్రింబవళ్ళు పరుగులు, పుల్అప్స్, బాలెన్సింగ్ ఎంత పట్టుదలతో కృషి చేసాడో, బరువు ఎక్కువగా పెరగటం కోసం ఎన్నేసి అరటిపళ్ళు తిన్నాడో, మెడికల్ పరీక్షల్లో ఛాతి కొలతలు పెరగటానికి ఎన్ని శ్వాసకు సంబంధించిన ఆసనాలు ఆచరించాడో బావ ఒక్కొక్కటీ చెబుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

ఆఖరున వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత పొంది ట్రైనింగులో చేరాక కూడా కఠోరమైన ట్రైనింగు పూర్తి చేయగలనో లేదోననే అపనమ్మకంతో బావ మాకు కబురు పెట్టలేదని చెప్పాడు. ట్రైనింగులో నిలదొక్కుకుని అది పూర్తి చేసాక మొదటి పోస్టింగ్ అందుకుని కొత్త యూనిట్లో రిపోర్ట్ చేసే ముందు పది రోజుల సెలవు మీద వచ్చాడు.

బావ వున్న పది రోజులు ఏడో క్లాసుతో చదువు ఆపేసిన నాకు చదువు విలువ గురించి చెప్పుకొచ్చాడు. చదువనేది మానవ వికాసానికి తోడ్పడి మంచి నడవడికను కలిగిస్తుందని, మనిషిలోని మంచిని వెలికి తీసే ప్రయత్నమే విద్యని ఏవేవో చెప్పుకొచ్చాడు.

ముఖ్యంగా ఆర్మీవాడి ఇల్లాలు విద్యావంతురాలయి వుండాలన్నాడు. ఆర్మీ ఉద్యోగి భార్యా పిల్లలను తమ వెంట పెట్టుకోలేని పరిస్థితుల్లో భార్య చదువుకున్నదయితే పిల్లల చదువు బాధ్యత తీసుకోగలదని నన్ను ప్రైవేటుగా పదో క్లాసు పరీక్షలు రాయమన్నాడు. మళ్ళీ సెలవులకు వచ్చినప్పుడు పెళ్ళి చేసుకుంటానని ఈలోపు సమయం వృథా చేయకుండా చదువుకోమన్నాడు.

బావ పోరు మీద చదువుదామన్నా అసలు అక్షరం తలకెక్కేది కాదు. ఫోను చేసినప్పుడల్ల్లా బావ ఒకటే పాట పాడేవాడు. ఇంటికి ఇల్లాలు దీపమైతే చదువుకున్న ఇల్లాలు తేజోవంతమైన లక్షల వోల్టుల కాంతని తన సంతానాన్ని అనేక వేల వోల్టుల చిరు దివ్వెలుగా మలచగలదని నన్ను చదువుకొమ్మని ఒకటే నస.

బావంటే ఎంతిష్టమో బావ చదువు గురించిన సుత్తి అంటే అంత విసుగ్గా వుండేది. అత్త ఒత్తిడి మీద మరో ఆర్నెల్లకు బావ ఇరవై రోజుల సెలవు మీద వచ్చి హడావుడిగా నన్ను పెళ్ళి చేసేసుకుని మా మేనత్తను నాకు అత్తను చేసేసాడు.

బావ తన పొందులో సుఖాన్ని రుచి చూపించి అతనిపై ఇష్టాన్ని రెట్టింపు చేసి వెళ్ళిపోయాడు. అతని యూనిట్ ఫీల్డ్ ఏరియాలో వుంది కాబట్టి ఫ్యామిలీని తీసుకెళ్ళలేనని, తదుపరి పోస్టింగ్‌లో నన్ను అత్తను తీసుకెడతానన్నాడు.

బావ పైన మరులుగొని మరిగిపోతూనే అతని మురిపెం తీర్చటం కోసం పదో క్లాసు పరీక్షకు ఫీజు కట్టి చదవటం మొదలెట్టాను. ఎందుకో బావకు చెప్పాలనిపించలేదు. ఒకేసారి పాసు అయ్యాక చెప్పి ఆ శుభవార్త ఇచ్చే సంబరం బావ మొహంలో చూడాలని నా కోరిక.

బావ మళ్ళీ వచ్చాడు. ఈసారి నెల రోజులు వున్నాడు. అప్పటికే నేను పది పరీక్ష రాసి లెక్కలు, సైన్సు సబ్జెక్టులు రెండు తప్పాను. బావకేమీ చెప్పలేదు. అన్నీ పాసయ్యాకే చెప్పాలని నిర్ణయించుకున్నాను.

బావ వెళ్ళిపోతూ నన్ను దగ్గరకు తీసుకుని “చదువుకోరా, కొంచం ఎదగరా, లోకజ్ఞానం పెంచుకోరా.. స్వంత నిర్ణయాలు తీసుకునే పరిణితి పొందరా…” అని గోముగా జుట్టు సవరిస్తూ చెప్పి ముద్దాడి వెళ్ళిపోయాడు. ఈసారి బావ కౌగిట్లోకి తీసుకుని చేసిన హితబోధకు ఆనందమేసింది. రెండే సబ్జెక్టులు కాబట్టి చాలా శ్రద్దగా చదవటం మొదలెట్టాను.

ఇంతలో నెల తప్పాను. బావకు ఫోను చేసి ‘శుభవార్త’ అన్నాను. బావ ఏమిటని ఆదుర్దాగా అడిగాడు. తను తండ్రి కాబోతున్న విషయం చెబితే ‘అంతేనా ఇంకా నువ్వు టెన్త్ పరీక్షలు రాస్తున్నావనుకున్నాను. ఇంక ఇప్పుడిక రాస్తావన్న ఆశ కూడా లేదు’ అన్నాడు నిరుత్సాహంగా.

నా చదువు పట్ల బావ ఆసక్తిని చూసి “నీకు బిడ్డ కన్నా ముందు నా పదో క్లాసు సర్టిఫికెట్ బహూకరిస్తానులే బావా, అప్పుడు నీ మొహంలో ఆనందం చూడాలని వుంది” అనుకుని మనసులోనే మురిసిపోయాను.

నాకు పండంటి బుల్లి జవాను పుట్టాడు. వాడి రాక కన్నా ముందే పదో క్లాసు పాసు సర్టిఫికేట్ సాధించాను. బావ కొత్త చోటికి మారానని ఫ్యామిలీ క్వార్టర్స్ కూడా ఇచ్చారని త్వరలో వచ్చి తీసుకెళతానన్నాడు.

చంటిబిడ్డతో, నా పదో క్లాసు పాసు సర్టిఫికేటుతో బావ కోసం ఎదురు చూపులు మొదలయ్యాయి.

ఎప్పుడెప్పుడు బావ వస్తాడా బావకు నేను టెన్త్ పాసయ్యానని చెప్పాలా అని ఉవ్విళ్ళూరాను.

బావ మరో వారంలో ఇంటికి రావలసి వుండగా అకస్మాత్తుగా ఎమర్జన్సీ మీద బావను ఆపరేషన్ విజయ్‌లో కార్గిల్ పంపేశారు. బావ ఆర్మీలో చేరినందుకు తనకు దేశసేవ చేసే అవకాశం వచ్చిందని బహూశా ఒకటి రెండు నెలలపాటు మాతో కాంటాక్ట్‌లో వుండలేక పోవచ్చునని కంగారు పడవద్దని చెప్పాడు.

నా ఉత్సాహమంతా నీరుగారిపోయింది. బావకు టెన్త్ పాసయ్యానని చెప్పేద్దామా అనిపించింది. కాని చెప్పినప్పుడు బావ పరిష్వంగంలో అపురూపమైన ముద్దులు కోల్పోవటం ఇష్టం లేక మౌనమై పోయాను. ఆ మౌనం శాశ్వత నిశబ్దమై పోతుందనుకోలేదు.

బావ కోరిక మేరకు చదువుకున్నానని చెప్పే అవకాశమే నాకు తరువాత ఎప్పటికీ రాలేదు.

కార్గిల్‌లో నా పులి బావ టైగర్ హిల్‌ను సాధించాడుట. ఆపరేషన్ విజయ్‌లో విజయాన్ని సాధించి అమరుడయ్యాడు. అక్కడే ఎల్.ఓ.సీలో మంచు కొండల్లో శిధిలమైపోయాడు.

నా నుదుటి కుంకుమ రాలిపోయింది, బావ కోసం ఎదురుచూస్తూ నేను కట్టిన పూల తోరణాలు వాడిపోయాయి. మా పెరట్లో మల్లెపాదులు ఎండిపోయాయి. మా ఇంటి గడప పసుపు పెడారిపోయింది. నా బిడ్డ తండ్రిని చూడకుండానే తండ్రి లేని అనాథ అయిపోయాడు. నా సర్టిఫికేట్ నన్ను చూసి వెక్కిరింతగా నవ్వింది. నేను నిలువునా కృంగిపోయాను.

మా ఇంటికి పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చారు. నా చెదిరిన కలలను చక్కబరచలేని చెక్కులు నాకు ఇచ్చారు. నా వయసు ఉద్యోగానికి సరిపోదని పద్దెనిమిది నిండగానే కబురు చేస్తామని చెప్పి వెళ్ళిపోయారు. సరిగ్గా పద్దెనిమిది నిండిన ఆరు నెలల్లో భర్తీ అయ్యాను.

 * * *

సీత కథ విన్న నేను కదిలిపోయాను. పేరుకు తగ్గ గుణంతో పాటు అవే సీత కష్టాల జీవితం. పట్టుమని రెండు నెలలు కూడా భర్తతో కలిసి కాపురం చేయకపోయినా సీత భర్త తలపులో ఎంత ఆనందాన్ని అనుభవిస్తుందో. అసలు మొదటి రోజున సీత వితంతువు అంటే నమ్మలేక పోయాను.

ఎల్డిసీగా ఎదిగి సెక్షన్ మారినా సీత అలాగే ఒదిగి వుండే మేలిమి బంగారం.

ఎవ్వరికీ ప్రవేశం లేని అవుట్ ఆఫ్ బౌండ్స్ అనే బోర్డుండే నా ఆఫీసులోకి తను మాత్రం ఎంతో ప్రేమగా అప్పుడప్పుడూ వచ్చేది.

నేను అమ్మ మనసుతో తనను మళ్ళీ పెళ్ళి చేసుకోమని సలహా ఇస్తే నా మాటలకు పామును చూసి బెదిరినట్టు బెదిరేది.

“మేడం, పొరపాటున కూడా మరోసారి ఆ ప్రస్తావన తేవొద్దు. నేను మా బావ సీతను. ఎప్పటికీ బావ సీతగానే వుండిపోతాను..” అని భోరుమనేది. ఆమె చలించని వయసుకు, మనసుకు నేను చలించిపోయేదాన్ని.

పాతిక సంవత్సరాలుగా చూస్తున్నా పొరపాటున కూడా ఒక్కసారయినా భుజం చుట్టూ కొంగు తీయలేదు. నెమ్మది, కుదురు, అణకువ పుణికి పుచ్చుకుంది.

కులంతో నిమిత్తం లేని గుణం. గొప్ప వాళ్ళ, పెద్ద చదువుల, అగ్ర కులాల, గుణగణాలన్నింటికీ ఛాలెంజీలా కనబడే సీత తన బిడ్డకు వెలుగు అవటమే కాదు ఇల్లు తప్ప మరో ప్రపంచం తెలియని ఆమె తన బావ తలపులే తోడుగా కొత్త వెలుగులతో తెలియని ప్రపంచంలోకి దృఢంగా అడుగులు వేస్తూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతోంది.

ఎప్పుడైనా ఎవరి నోటయినా ఒంటరితనం వేధిస్తోందన్న మాట వినిపిస్తే చటుక్కున సీత గుర్తుకు వస్తుంది నాకు. తన పదహారో ఏటి నుండే ఒంటరి అయ్యీ, బావ తలపులే తోడుగా ఎంతో నిక్కచ్చిగా వుండే సీత తలపు ఎవరినైనా తల వంచుకునేలా చేస్తుంది.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here