[box type=’note’ fontsize=’16’] ఒక స్త్రీ సంపూర్ణ జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది. [/box]
Infatuation
[dropcap]I[/dropcap]nfatuation అనే ఆంగ్ల పదానికి సరైన అర్ధం వాంఛ. ఎందుకో వాంఛ అనే పదం సౌండింగే నచ్చదు నాకు. నేను చాలాసార్లు ప్రేమ అనే భ్రమలో ఇన్ఫాచుయేషన్‌లో పడ్డాను. ఒక్కోసారి ఈ ఇన్ఫాచుయేషన్ ఏ స్టేజీకి తీసుకెడుతుందంటే దానిని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఎంత విలువైన సమయం వృథా చేసుకుంటామో లెక్కుండదు.
మనిషి మొహం మనసుకి ప్రతిబింబమైతే, ఆ మొహంలో కళ్ళు మనసును అద్దంలో చూపించే ముఖ్య కేంద్రాలు. Eyes are reflection of heart అంటారు. కళ్ళతో అనంత భావాలను వ్యక్తీకరించవచ్చు. కళ్ళతో భాషించనూవచ్చు… శాసించనూ వచ్చు.
నాకు ఊహ తెలిసాక eyes are doorway to heart అనుకొని ఒకరి ‘కళ్ళ’కు ఫిదా అయి తొలిసారిగా నేను ఇన్ఫాచుయేషన్ లో పడింది నా తొమ్మిదేళ్ళ వయసులో.
అవి మేము కింగ్ కోటీలో రెండు గదుల ఇంట్లో అద్దెకు వుండే రోజులు. నేను ఆడపిల్లనని అమ్మెప్పుడూ నన్ను బయటి ప్రపంచానికి బహిర్గత పరచకుండా జన సందోహానికి దూరంగా పెట్టే ఆలోచనతో నేను ఎక్కడ చదువుకుంటే అక్కడే ఇల్లు అద్దెకు తీసుకునేది.
ప్రైమరీ స్కూలప్పుడు ఆ స్కూలు పక్కన, హై స్కూలప్పుడు దాని దగ్గరలో, ఇంటర్ చేసేప్పుడు కాలేజికి అందుబాటులో, డిగ్రీ చదివేప్పుడు ఆ దరిదాపుల్లో, ఆఖరికి మగపిల్లలతో కలిసి చదివిన పీజీ అయినా సరే… పిల్లి పిల్లలను పెట్టి పది ఇళ్ళు తిప్పినట్టు, అమ్మ ఆడపిల్లను కన్న పాపానికి నేను చదువుకున్నంత కాలమూ ఇళ్ళు మారుతూనే వుండేది.
పాపం పీజీకి ఆడపిల్లలకు ప్రత్యేకంగా కాలేజీ లేదని అప్పట్లో అమ్మ ఎంతగా చింతించిందో నాకింకా గుర్తుంది. అయినప్పటికీ పిచ్చిమాలోకం ఆ పీజీ కాలేజీ ప్రాంతంలోకే మకాం మార్చింది.
అమ్మలు అందునా ఒంటరి అమ్మలు ఆడపిల్లలను డేగ కళ్ళతో ఎంత జాగ్రత్తగా కాపలా కాస్తారో కదూ.. అయినా మనిషిని కాపలా కాసి కట్టడి చేయగలం కాని మనిషి ఆలోచనలను మాత్రం నియంత్రించ లేము కదా…
ఒక రోజున ఉదయాన్నే ఐదింటికి నాకెప్పుడూ అలవాటు లేని మెలకువ వచ్చింది. పక్కకు తిరిగి చూస్తే అమ్మ గాఢ నిద్రలో వుంది. ఎంత ప్రయత్నించినా తిరిగి నాకు నిద్ర పట్టలేదు.
మెయిన్ రోడ్డు కాకుండా మా ఇల్లు సందులోకి వుండేది. ఆ ఇంటిలోకి తెరుచుకునే అసలు పెద్ద గుమ్మం లోపల మూడు గుమ్మాలతో మూడు కుటుంబాలు వుండేవి. అందులో మాదో కుటుంబం. మా గది కిటికీ సందులోకి తెరుచుకునేది. ఐదింటికి లేచిన నేను వెళ్ళి ఆ కిటికీ రెక్కలు తెరిచి సందులోకి చూస్తూ కూర్చున్నాను. నిద్రపోతున్న రెండు మూడు కుక్కలు తప్ప సందంతా నిర్మానుష్యంగా వుంది.
ఇంకా సూర్యుడు ఉదయించక రాత్రంతా కురిసిన మంచుతో అలికేసిన మబ్బుల్లా వుంది వీధంతా. ఆ తెలిమబ్బుల తెలతెలవారు ఝామున మబ్బులను ఛేదించుకుంటూ మేఘాల్లో తేలి వస్తున్నట్టుగా ఒక బలిష్ఠమైన యువకుడు సందు చివరగా నడచి వస్తున్నాడు. చేతులు లేని బనియనుతో మోకాళ్ల పైకి బాక్సర్ షార్ట్స్ లో స్పోర్ట్స్ షూ వేసుకున్న ఆరడుగుల అతను అలా మా ఇంటి మీదుగా కిటికీ ముందుగా దాటి వెళ్ళిపోయాడు.
మగసిరితో కూడిన మొహము, కండ పుష్టితో వున్న భుజాలు, బలిష్ఠమైన తొడలు, ఆ నడక తీరు చూడగానే నాకెందుకో నేను అప్పుడే చదవటం మొదలెట్టిన సాహిత్యం, స్కూలులో చదువుతున్న సాంఘీకం కలగలిసి అతనో క్షత్రియ వంశీకుడిలా, రాకుమారుడిలా, యుద్దవీరుడిలా, మహానాయకుడిలా కనిపించాడు.
తీసి వున్న కిటికీ రెక్కల్లోకి అతనూ చూసాడు. నాకయితే అతని చూపులు మూసి వున్న నా మనసు తలుపులు తట్టినట్టిగా అనిపించాయి.
తేనె రంగు కళ్ళు. నేనలా విభ్రమంగా కళ్ళల్లోకి చూస్తూండిపోయాను. అతను మా ఇంటి వరకూ ఒక వేగంతో కూడిన స్పీడుతో వచ్చి మా ఇల్లు దాటేవరకూ మరో తగ్గించిన స్పీడుతో నన్ను చూస్తూ ముందుకు సాగిపోయాడు.
ఓ పట్టాన ఆ తేనె కళ్ళ అందాల తాకిడి నుండి తేరుకోలేక ఆ కిటికీలోనే చాలా సేపు కూర్చుండి పోయాను. ఏడవుతూండగా ‘కిటికీకి పాతుకు పోయావు స్కూలుకి వెళ్ళేది లేదా’ అన్న అమ్మ హెచ్చరింపుతో ఈ లోకంలోకి వచ్చాను. కిటికీ నుండి కదలబోతుండగా ఆశ్చర్యంగా ఆ కళ్ళు మళ్ళీ కనిపించాయి. తెల్లగా తెల్లారిపోయిందేమో అంతే స్వచ్ఛమైన తెల్లని మేని ఛాయతో మెరుస్తున్న లేత తేనె చూపులతో అతను కిటికీ మీదుగా సందులోకి వెళ్ళిపోయాడు. నా చూపులకు అందినంత వరకూ మెడను సాగదీసి మరీ కిటికీ చువ్వల గుండా వెనుక నుండి చూసాను. తెల్లటి చేతుల పైన పిక్కల పైన మగసిరికి చిహ్నoగా మెలికలు తిరిగిన నల్లటి గుబురు వెంట్రుకల మధ్య నా చూపు చిక్కడిపోయింది.
బహూశా నేను మగాడు అనే దృష్టితో చూసిన తొలి పురుషుడు అతడేనేమో. ఐదో క్లాసులో నా తొమ్మిదో ఏట ఇన్ఫాచుయేషన్‌లో నా మనసు పారేసుకున్న మొదటి మగాడు. ఇప్పుడు అదేదో ‘ఫస్ట్ క్రష్’ అంటారే అదన్నమాట.
అద్భుతమనిపించిన ఆ తేనె కళ్ళ మన్మధుడికి ‘కళ్ళు’ అని ముద్దుగా పేరు పెట్టుకున్నాను.
ఆ రోజు మొదలు నేను నిద్ర లేచే సమయంలో మార్పు వచ్చేసింది. ఐదు కన్నా ముందే లేచి కళ్ళ కోసం ఎదురు చూసేదాన్ని. తరువాత మరో రెండు గంటలపాటు కళ్ళను తలుచుకుంటూ కిటికీలో కూర్చునేదాన్ని. ఏడు కల్లా ‘కళ్ళు’ తిరిగి వెళ్ళిపోతూ కనిపించేవాడు. అప్పుడపుడూ కళ్ళ టీ షర్టు వీపు మీద తొమ్మిది అంకె కనిపించేది. కళ్ళను సందులో నుండి రోడ్డు పైకి వెళుతూ మళ్ళీ సందులోకి తిరిగి వస్తూ చూడటం నా క్రమం తప్పని దినచర్య అయిపోయింది. ఏనాడూ కిటికీ కాకుండా అసలు తలుపులు తెరిచి కళ్ళను చూసే ప్రయత్నం మాత్రం చేయలేదు.
అది నా గొంగళిపురుగు దశ. తదనంతర కాలంలో సీతాకోకచిలుకగా పరివర్తన చెందాను. కొందరు పిల్లలు పసితనం నుండీ అందంగా ఎదిగితే నేను ఎదిగే కొద్దీ అందాన్ని సంతరించుకున్నాను. నా కళ్ళు మాత్రమే ప్రస్ఫుటంగా కనిపించే ఆ వికారమైన దశలో అందవిహీనత కారణంగా న్యూనతా భావన, నాన్న లేని కారణంగా అభద్రతా భావనతో కుంచించుకు పోతుండే దానిని. అలాంటి నా వంక ఒక నవ మన్మథుని లాంటి యువకుడు చూడటమే గొప్ప అనుభూతి కలిగించేది.
క్రమంగా కళ్ళు పలకరింపుగా చిరునవ్వు నవ్వేవాడు. నా పెదవులూ బదులుగా అప్రయత్నంగా అరవిచ్చుకునేవి.
అలా ఆరేళ్ళు గడిచిపోయాయి. నా పదో క్లాసు పరీక్షలు అయిపోయాయి. నేను ఇంటరు అడ్మిషనుకి ఏ కాలేజిలో ఫీజు కట్టానో అమ్మ అక్కడికి మకాము మార్చేసింది. కళ్ళ మీద ప్రేమతో (Infatuation) అక్కడి నుండి వెళ్ళిపోవటం ఇష్టం లేక ఆ ఇంటి నుండే కాలేజికి వెళ్ళగలనని అమ్మతో నమ్మబలికాను. అమ్మ ఇల్లు మారకుండా శత విధాల ప్రయత్నించాను. అసలే వయసుకు వచ్చిన పిల్లవంటూ అమ్మ నా గోడు వినిపించుకోలేదు.
ఇల్లు మారే రోజు ఉదయం కళ్ళకి అక్కడి నుండి వెళ్ళిపోతున్నామని ఇక ముందు అతనిని చూడలేనని చెప్పాలని చాలా బలంగా అనిపించింది. ఏనాడూ పెదవి విప్పని, పూర్తిగా నవ్వటానికి కూడా సంకోచించే నేను అంతేసి మాటలు చెప్పటమా… అది కలలో కూడా జరగని పని. అంతటితో నా జీవిత పుస్తకంలో తొలి ప్రేమ అధ్యాయం ముగిసిపోయింది. ఎక్కడైనా తేనె వర్ణంలో కళ్ళు కనిపించినా, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సినిమా చూసినా, ఆటగాళ్ళ టీ షర్టు వీపుల పైన తొమ్మిది అంకె కనిపించినా ‘కళ్ళు’ నా తలపుల్లోకి వచ్చేస్తాడు.
ప్చ్.. కనీసం అతడు ఏ ఆటగాడో కూడా తెలుసుకోలేకపోయాను. నా తొలి క్రష్ అసలు పేరు తెలియకపోవటం నాకిప్పటికీ వెలితిగానే వుంది. అతను ‘కళ్ళు’ గానే నా జీవిత పుటల్లో మిగిలిపోయాడు.
తొలి ఆకర్షణ కెమిస్ట్రీకి అవతలి వ్యక్తి పూర్వాపరాలతో పనుండదు. ఈ రిలేషన్షిప్ కి మూలం కేవలం ఇన్ఫాచుయేషన్. అంతకు మించి ఏ అనుబంధ బాంధవ్యమూ వుండదు. No shared vision or values of the life pathways… అయితే కొన్ని ఇన్ఫాచుయేషన్స్‌కి భారీ మూల్యం చెల్లించాల్సి వుంటుంది…