[box type=’note’ fontsize=’16’] ఒక స్త్రీ సంపూర్ణ జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది. [/box]
సారే జహాన్ సె అచ్చా హిందూస్థాన్ హమారా….
ఆ రోజు మా ఆఫీసులో అంతా ఒకటే చర్చ.
ఆర్ద్ర హృదయాల కన్నీటి నివాళులతో ఆఫీసు వాతావరణమంతా తేమతో చమరిస్తోంది.
దానికి తోడు బయటి వాతావరణం కూడా నల్లటి మబ్బులు పట్టి భోరున వర్షం కురుస్తోంది.
నాలుగేళ్ళ క్రితం మా మధ్య పని చేసిన హవల్దార్ విక్రం సింగ్ Locలో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడన్నది ఆనాటి పేపరు హెడ్లైన్స్ వార్త.
విక్రం సింగ్ మంచితనం, మృదుభాషణం, ఆత్మీయ పలకరింపు, సౌశీల్యం, దేశాభిమానం తెలిసిన ప్రతి హృదయం ఆ వార్తకి రోదిస్తోంది. అతనితో మరీ దగ్గరగా మసిలిన నా మానసిక స్థితి వర్ణనాతీతం.
విక్రం సింగ్ నెల్లాళ్ళ క్రితం హై ఆల్టిట్యూడ్ ఏరియా నుండి తన హార్డ్ ఫీల్డ్ సర్వీస్ రెండేళ్ళు పూర్తి కావస్తుందని హోం స్టేషన్‌కి పోస్టింగ్ చేయించమని ఫోనులో నన్ను అర్థించాడు. వెంటనే పోస్టింగ్ సెక్షన్ నుండి అతని పోస్టింగ్ ప్రొఫైల్ తీయించాను. అతనికి కావలసిన చోట పోస్టింగ్ చేయించటం పెద్ద కష్టమేమీ కాలేదు. పై ఆఫీసర్లను ఎవరినీ అప్రోచ్ కాకుండానే, మా బాస్ దృష్టికి రాకుండానే అతనిని అతని ఫ్యామిలీ వున్న చోట హోం పోస్టింగ్ చేయించగలిగాను. అతని మూవ్ తారీఖుకి రెండు నెలల వ్యవధితో పోస్టింగ్ ఆర్డర్ డిస్పాచ్ అయ్యింది.
తన యూనిట్లో పోస్టింగ్ ఆర్డర్ అందుకున్న వెంటనే విక్రం సింగ్ ఎంతో ఆనందంగా కృతజ్ఞతాపూర్వకంగా నాకు మళ్ళీ కాల్ చేసాడు. నిజానికి అతని పోస్టింగ్ ప్రొఫైల్ ప్రకారం అతను ఆ కమాండ్‌కే వెళ్ళాల్సి వుంది. కాకపోతే నేను చేసిందల్లా ఆ కమాండ్‌లో అతని ఇంటికి దగ్గరగా వున్న యూనిట్లో మార్క్ చేయించటమే. అతని భార్య నాకు మరీ మరీ ధన్యవాదాలు చెప్పమన్నదని సంతోషంగా చెప్పాడు. చాలా ఆనందోద్వేగంతో మాటాడాడు ఆ రోజున.
బహూశా అతని పోస్టింగ్ ఫోర్త్విత్ అయ్యుంటే ఈ ప్రమాదం జరగకపోను. అతను పోస్ట్ అవుట్ అవటానికి రెండు నెలల గడువు ఇచ్చారు. ఇంతలో ఈ దుర్వార్త.
నా ఆఫీసు టేబుల్ పైనున్న డెక్కన్ క్రానికల్ పేపరులో అచ్చయిన అతని పార్థివ దేహం నా వంకే చూస్తున్నట్టుంది.
పేపరులో వేసిన పార్థివ దేహపు చిత్రం నుండి చిత్రంగా నాకు ఏవో మాటలు వినిపించాయి…
“ఆప్కో బహుత్ బహుత్ షుక్రియా మేడం… మేరా హోం పోస్టింగ్ కరాయా…
లేకిన్ భగవాన్ కా లాఖో షుకర్… మేరా జనమ్ సఫల్ కియా….”
పదే పదే ప్రతిధ్వనిస్తున్న ఆ మాటలకు చెవులు రెండూ గట్టిగా మూసుకుని గుండె చిక్కబట్టుకుని సగం పూట సెలవు చీటీ రాసిచ్చి ఇంటికి వచ్చేసాను.
ఇంట్లో మాకు వేసిన హిందూ పేపరులో యుద్ధభూమిలో నేలకొరిగిన విక్రం సింగ్ చిత్రం మరింత పెద్దదిగా వేసారు.
ఆ పేపరు రాసిన వార్తా వివరాలు చదివాను. ‘మరో నెలరోజుల్లో అక్కడి నుండి పోస్ట్ అవుట్ అవ్వాల్సిన హవల్దార్ విక్రం సింగ్ అక్కడే సమాధి అయిన వైనం’ అంటూ హృదయాన్ని కరిగించే కథనం.
నా ధ్యాసను విక్రం సింగ్ నుండి మళ్ళించే ప్రయత్నంగా ‘Ode to a Nightingale’ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నాను.
సైనికుల రక్తపాతంతో భీతావహంగా వున్న యుద్ధభూమిలో సంచరిస్తున్న నా మెదడుకి ఏ భావగీతాలు తలకెక్కటం లేదు.
నిద్ర మాత్ర వేసుకుని విక్రం సింగ్ ఆలోచనలను నిదుర పుచ్చే ప్రయత్నంలో కళ్ళు మూసుకున్నాను.
రాత్రన్న విషయం మరిచిన నా నిద్ర నన్నొదిలి చీకట్లో విహారానికి వెళ్ళింది.
ఇంటి కప్పు నుండి వేలాడుతూ బేరింగ్స్ అరిగిపోయి కిర్రుమన్న చప్పుడుతో తిరుగుతున్న సీలింగ్ ఫ్యాను దెబ్బతిన్న సైనికుడి దైన్యపు మూలుగులా వినిపిస్తోంది.
అమావాస్య కబళించి మసిబారిన రూములో నాలుగు తెల్ల గోడలు నలుపు పులుముకుని నన్ను బెదరగొట్టాయి.
వీధిలో అగ్ని గోళాల్లా మెరుస్తున్న కుక్క కళ్ళు కిటికీ అద్దాల్లో నుండి కొరివి దెయ్యం నిప్పు చూపులా భయపెట్టాయి.
వీధిలో మొరుగుతున్న ఊరకుక్క అరుపు నక్క ఊలలా నా చెవులను ఊదరగొడుతోంది.
గోడ మీద వేలాడుతున్న చిత్రపటాలు యుద్దంలో శిరస్సులు తెగి మొండాల్లా కనిపిస్తున్నాయి.
టేబిలుపై న్యూస్ పేపర్లో అచ్చయిన విక్రం పార్థివ కాయం పేపరులో నుండి అమాంతం నిటారుగా పైకి లేచింది.
భయభ్రాంతులతో ఘనీభవించిన నా దేహం దిగ్గున లేచి మంచంపై కూర్చుంది.
విక్రం సింగ్ దేహంలోని అంతరాత్మ నా వక్షస్థలంపై నుండి పడిన ‘Ode to a Nightingale’ వంక నిరసనగా చూసింది.
అతని ఆత్మ ఘోషిస్తోంది.
వెర్రిగా కేకలేస్తోంది.
కోడై కూస్తోంది.
కుక్కై అరుస్తోంది.
కోకిలై పాడుతోంది.
దేశం కోసం అది ప్రతీ జీవిలోకి పరకాయప్రవేశం చేసి సర్వ ప్రాణి భాషల్లోనూ ఏదో చెప్పే ప్రయత్నం చేస్తోంది.
నా వెన్ను జలదరించింది.
దిండు పక్కనున్న నా ఫోనును అందుకోబోయాను. వణుకుతున్న చేతుల్లో నుండి ఫోను జారి కింద పడింది.
నా స్క్రీన్ సేవరుగా వున్న కన్నుకొడుతున్న ప్రియా వారియర్ బొమ్మ వైపు ఆ అంతరాత్మ తీక్షణంగా చూసింది.
నా ఒళ్ళు మంచులా చల్లబడిపోయి బిగుసుకుపోయింది.
భయవిహ్వలమైన నా గుండె నా ఛాతీలో నుండి దూకి ఆ అంతరాత్మకు మోకరిల్లింది.
గొంతు పిడచకట్టుకుపోయి నా కళ్ళు బైర్లు కమ్మాయి.
అంతే.
నేను దూదిపింజనై ఓ ఝుంఝూమారుతంలా కొట్టుకుపోయి ఎక్కడో LoC లో పడ్డాను.
తుపాకీ పేలుళ్ళ శబ్దాలు నా చుట్టూ సుళ్ళు తిరుగుతున్నాయి.
మృత్యువు కరాళనృత్యం చేస్తోందక్కడ.
విక్రం సింగ్ ఆత్మ మృత్యువు భుజాల మీద చేయి వేసి సంచరిస్తోంది.
రెండు కాళ్ళూ బందూకుల్లా నిలబెట్టి శత్రువును ఎదిరించి నేలకొరిగిన తన మాంసపు ఖండాల వంక గర్వంగా చూసింది.
వాడి ఒంటినిండా దిగబడిన తూటాలు, ఫిరంగులు, తుపాకులు, డైనమైట్లు, శతఘ్నులను చూసి చిద్విలాసంగా నవ్వింది.
ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసి నేలకొరిగినా మూతపడని వాడి కళ్ళ నిండా రెపరెపలాడుతున్న దేశభక్తి జెండాలే.
బిగిసిపోయిన వాడి పిడికిళ్ళ నిండా పుడమి తల్లిపై తీరని మమకారపు మట్టే.
వాడి రక్త బిందువుల్ని తాగిన నేలతల్లి గొంతు పొలమారిందేమో.. వెక్కుతోంది.
భూమాత తన లోకి ఇంకిన వాడి ఒక్కో రక్త బిందువును గర్భాన మోస్తూ వీర వంశ మొలకలను కనాలని పురిటి నొప్పులు పడుతోంది.
తన క్షేమం కోసం ఏనాడూ ఏ దేవునీ ప్రార్థించని ప్రాణతృష్ణ లేని వాడి ఆత్మ బైరాగిలా తాదాత్మ్యంలో అక్కడ సంతృప్తిగా తిరుగుతోంది.
“విజయమో..వీరమరణమో” అనే నినాదంతో వెన్నుచూపని ఆ వీరుని వక్షస్సు నేలకొరిగీ మరో సైనిక జన్మకై తపస్సు చేస్తోంది.
నన్ను తెలియని ఉద్వేగంభరిత దుఃఖం ఆవహించేసింది.
లేదు….
దేశం కోసం ప్రాణాలొడ్డిన వాడలా కాలం తిప్పేసిన పేజీలా మిగిలిపోకూడదు.
వాడి గుండె కార్చిన వెచ్చటి నెత్తుటి చుక్కలను నా కలంలో సిరాగా పోసుకున్నాను.
చిరుదరహాసంతో వరించిన వాడి వీర మరణాన్ని నేను కావ్యంగా చెక్కుతాను.
వాడి ఆత్మార్పణకు సెలవు ప్రకటించని ప్రభుత్వంపై ధ్వజమెత్తుతాను.
వాడి మృత దేహానికి అంజలి ఘటిస్తూ నింగి నుండి నేల రాలని నక్షత్రాలను శపిస్తాను.
దేశం కోసం అసువులు బాసిన వాడి కోసం వసి వాడని విరులను త్యజిస్తాను.
వాడు అంతర్ధానమైనా ఏమీ పట్టనట్టు యథావిధిగా ప్రకాశిస్తున్న సూర్యుని చిమ్మ చీకట్లోకి పారద్రోలతాను.
అర క్షణం మౌనమే వాడి ఆత్మార్పణకు బహుమానమెలా అవుతుందో ఈ దేశాన్ని నిలదీసి ప్రశ్నిస్తాను.
ఆర్మీ ఆఫీసర్ల మెస్సుల్లో కాక్టెయిల్స్ నిలిపి వేసి శాసిస్తాను.
వాడిపై కప్పే రీతుల్లో అక్షరాశ్రువులు చిలకరిస్తాను.
యుద్ధ స్మారక చిహ్నంపై చెక్కే వాడి పేరుకి నేను ఉలినౌతాను.
దేశద్రోహ నిర్మూలనా యుద్దానికి వాడు పూరించే శంఖంలో నినాదాన్నౌతాను.
దేశానికి చందాగా యిచ్చేసిన వాడి ప్రాణానికి మకుటం తొడుగుతాను.
ఈ దేశపు కాగితంపై వాడినో ప్రామాణిక వేలిముద్రను చేస్తాను.
వాడి దేశభక్తి గీతాన్ని యావద్దేశంతో ఆలాపిస్తాను.
“సారే జహాన్ సె అచ్చా హిందూస్థాన్ హమారా….హమ్ బుల్బులే హై ఇస్కీ యే గుల్సితాన్ హమారా…”
అంతలోనే వేల లక్షల గొంతులు కోరస్ గా పాడుతున్న దేశభక్తి గీతం నా చెవులను హోరెత్తించేయసాగింది.
పడుకుని వున్న నేను అమాంతం రెండు చెవులూ గట్టిగా మూసుకుని మంచం పైన లేచి కూర్చున్నాను. నా ఒళ్ళంతా ముచ్చెమటలతో తడిసి ముద్దయ్యింది.
భయంభయంగా పక్కనే వున్న న్యూస్ పేపరులోని అమర సైనికుని పార్థివ దేహపు చిత్రం వంక చూసాను.
(మళ్ళీ కలుద్దాం)