Site icon Sanchika

గొంతు విప్పిన గువ్వ – 34

[box type=’note’ fontsize=’16’] ఒక స్త్రీ సంపూర్ణ జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది. [/box]

కొత్త లోకం-2             

ఉద్యోగం మారినా, మానేసినా సహోద్యోగులు ఎక్స్ అవుతారు…

విడిపోయినా, విడాకులు తీసుకున్నా భర్తలు ఎక్స్ అవుతారు…

దూరమయినా, టచ్‌లో లేకపోయినా ఎక్స్ కానిది మిత్రులు మాత్రమే…

సాధారణంగా స్త్రీ పురుషుల మధ్య వుండే వ్యతిరేక లింగాకర్షణ లేని నాకున్న ఒక్కగానొక్క మంచి మిత్రుడు విజయ్. వయసులో నాకన్నా పన్నెండేళ్ళు చిన్నవాడయినా పరిపక్వతలో పాతికేళ్ళు పెద్దవాడు.

నాకు జీవితం అగమ్యగోచరం అనిపించినప్పుడు అతనో దిక్సూచి…

జీవితంలో ఎదురయిన అనేకానేక విషమ పరీక్షలకు విరుగుడును సూచించే స్థితప్రజ్ఞుడు.

“హలో…” అంటూ ఫోను ఎత్తుకున్నాడు విజయ్.

“హలో…” మాటతో పోటీ పడుతూ నా కన్నీరు ఉబికి వచ్చి గెలుపొందింది.

“హలో… ఏమయ్యింది… వాట్ హేపెండ్..” నా గొంతులో జీరకి విజయ్ గొంతులో ఆదుర్దా వినిపించింది.

“నేను… నేను… పడిపోయాను. నా కాలు ఫ్రాక్చర్ అయ్యింది…” గద్గదంగా చెప్పాను.

అందరి దగ్గర ఏడుపు అంత సుళువుగా రాదు.

ఒక మనిషితో మాటాడుతూ ఏడ్చామంటే ఆ మనిషి హృదయానికి ఎంతో దగ్గరయి వుండాలి.

ఒక మనిషి అందునా స్త్రీ అంత బేలగా తేలాలంటే అవతలి మనిషి పైన పూర్తి నమ్మకము, భరోసా కుదిరుండాలి.

“వేర్ ఆర్ యు…” అరక్షణం నిశ్శబ్దం తరువాత స్థిరంగా అడిగాడు.

“మా వదిన ఇంట్లో…” అంటూ అడ్రెస్ చెప్పాను.

“పావు గంటలో అక్కడుంటాను..” ఫోను కట్ చేసేసాడు.

అలసటగా కళ్ళు మూసుకున్నాను.

అన్నట్టుగానే పెద్ద ముల్లు పదిహేను నిముషాలు దాటక మునుపే విజయ్ వచ్చేసాడు. అతనిని చూడగానే ఇంక నేను నా కాలు గురించిన బెంగ పడనవసరం లేదన్న నిశ్చింతతో కొంత రిలాక్స్ అయ్యాను.

ముందు వెంటనే మా ఇంటి నుండి నా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య స్కీముకి సంబంధించిన గుర్తింపు కార్డుని సికింద్రాబాద్ ప్యారడైస్ దగ్గర సన్‌షైన్ ఆసుపత్రికి తెప్పించే ఏర్పాటు చేసాడు. నన్ను సన్‌షైన్ ఆసుపత్రికి తీసుకెళ్ళాడు.

విజయ్ సమయపాలన, ప్లాన్ ఆఫ్ ఏక్షన్ పకడ్బందీగా వుంటాయి.

నేను అప్పటికే ఉద్యోగం నుండి స్వచ్ఛంద పదవీ విరమణ చేయటంతో ఆసుపత్రి సిబ్బంది విశ్రాంత ఉద్యోగులకు గుర్తింపు కార్డు మీద అడ్మిషన్ ఇవ్వమన్నారు. క్యాష్ పేమెంట్ మీదే అడ్మిషన్ ఇస్తామన్నారు.

ఎప్పుడూ లోగొంతులో సౌమ్యంగా మితంగా మాటాడే విజయ్ గొంతు ఆ రోజున మొదటిసారి ఉచ్చస్థాయిలో పలకటం, స్వరంలో ఆగ్రహం, అసహనం, చూసి నేను ఆశ్చర్యపోయాను.

ఎప్పుడూ నిశ్శబ్దంగా వుండే అతని స్వరంలో వడగళ్ళ శబ్దపు హోరుకి ఆసుపత్రి దద్దరిల్లిపోయింది.

నేను అతనిని శాంతపరుస్తూ “పోనీ వేరే మరో రెకగ్నైజ్డ్ ఆసుపత్రికి వెళ్దాం…” అన్నాను.

“నో, ఇక్కడ మంచి ఆర్తోపెడిక్ సర్జన్స్ వున్నారు, ఇక్కడే జరగాలి మీ సర్జరీ” అన్నాడు నిశ్చయంగా.

“అయితే ప్రస్తుతం డబ్బు కట్టేసి, తరువాత క్లెయిమ్ చేద్దాము…” అన్నాను సమస్యను ఏదోలా పరిష్కరించే ప్రయత్నంగా.

“నో, ఎలా అడ్మిషన్ ఇవ్వరో నేనూ చూస్తాను..” అన్నాడు మరింత పట్టుదలగా.

అడ్మిషన్ ఇవ్వమన్న ఆసుపత్రి సిబ్బందితో “ఓకే… నేను పేషెంట్‌ని వేరే ఆసుపత్రికి తీసుకుని వెళ్తాను. నాకు రైటింగులో ప్రభుత్వ ఆరోగ్య స్కీముకి సంబంధించిన గుర్తింపు కార్డు వున్న బెనిఫిషియరీని అడ్మిషన్‌కి నిరాకరిస్తున్నట్లు కాగితం పైన రాసి ఇవ్వండి. నేను వెళ్ళిపోతాను. మీరు ఇచ్చే కాగితపు స్టేట్మెంట్‌తో సన్‌షైన్ హాస్పిటల్‌ను CGHS గుర్తింపు పొందిన పేనల్ ఆఫ్ హాస్పిటల్స్ లిస్టు నుండి తీయించే వరకూ నేను నిద్రపోను” అన్నాడు. విజయ్ ఆవేశం చూస్తే నాకు భయం వేసింది.

నేనే కాదు హాస్పిటల్ సిబ్బంది కూడా భయపడ్డారు. అప్పటికే అక్కడ గుమిగూడిన జనాన్ని చూసి వారు మరింత కంగారు పడ్డారు.

అడ్మిషన్ ఇంచార్జీ ఒకతను విజయ్‌ని లోపలికి తీసుకుని వెళ్ళాడు. అడ్మిషన్‌కి సంబంధించిన ఫారాలు ఇచ్చి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయించి నేను పడుకుని వున్న స్ట్రెచర్‌ను రూములోకి తీసుకెళ్ళారు.

శాంతి కాముకుడు లేవదీసిన ప్రళయం…

నిశ్శబ్ద యోధుడు సాధించిన సమరం ఫలితం…

సన్‌షైన్ హాస్పిటల్‌లో నా అడ్మిషన్ అయ్యింది.

గివ్ అండ్ టేక్‌తో సంబంధం లేని అన్‌కండిషనల్ స్నేహితులు దొరకటం అదృష్టం. ప్రతీ జీవితానికి ఇలాంటి ఒక్క స్వచ్ఛమైన స్నేహం వుంటే చాలు. విరిగిన నా కాలు నాకు స్నేహం విలువను తెలియచెప్పింది.

(మళ్ళీ కలుద్దాం)      

Exit mobile version