[box type=’note’ fontsize=’16’] ఒక స్త్రీ సంపూర్ణ జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది. [/box]
కొత్త లోకం-4
[dropcap]స[/dropcap]ర్జరీ అయిన మూడో రోజున రయ్యిమంటూ ఆఘమేఘాల మీద వేవేల మైళ్ళ తీరాలు దాటి నా తొలిచూలు బిడ్డ, నా యింటి మహాలక్ష్మి, తన పేషంటులను రద్దు చేసుకుని వచ్చేసి మంచం మీద తల్లిలా నా పక్కన చేరి పసిపిల్లలా నన్ను తన అక్కున చేర్చుకుంది.
తను ఇద్దరు బిడ్డలకు తల్లయినా ఇప్పటికీ అవే చిన్ని చిన్ని మెత్తటి వేళ్ళు. నాకు స్నానం చేయిస్తూ, జడ వేస్తూ, బెడ్ పాన్ పెడుతూ, బట్టలు మారుస్తూ, ఆహారం తినిపిస్తూ, పళ్ళరసాలు తాగిస్తూ, వాకర్‌తో అడుగులు వేయటం నేర్పిస్తూ… నేను పాపనై తాను తల్లై… కన్నకూతురికి ఏ కట్టుకున్నవాడు సాటిరాడేమో అనిపించేంతగా. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మే కాదు ఆపదకాలంలో తల్లికి కొండంత అండ అని రుజువు చేసింది. ముఖ్యంగా అనారోగ్యంలోనూ, వృద్ధాప్యంలోనూ ఆడపిల్లలు లేని తల్లిదండ్రులు దురదృష్టవంతులనే చెప్పాలి.
నేను త్వరగా లేచి తిరగాలని మటన్ బోన్ సూప్, కొబ్బరి నీళ్ళు, బత్తాయి రసం, దానిమ్మ గింజలు, పాలు ఆరారగా ఇస్తూ కంటికి రెప్పలా కాచుకుంటూ అమ్మాయి నెల్లాళ్ళు వుండిపోయింది. ప్రమాదం పుణ్యమాని పిల్లలు నన్నెంతగా ప్రేమిస్తారో తెలిసింది.
డాక్టర్ రివ్యూలకు తీసుకెడుతూ, కట్టు మార్పిడి చేయిస్తూ, తిరిగి ఎక్స్‌రేలు తీయిస్తూ అన్నీ ఎంతో అంకితభావంతో బాధ్యతగా చేయించి నాకు వంద జాగ్రత్తలు చెప్పి వదలలేక వదలలేక తప్పనిసరై పిల్లలిద్దరినీ తీసుకుని వెళ్ళిపోయింది.
అమ్మాయి, మనవలు లేని ఇల్లంతా ఒక్కసారిగా బోసి పోయింది.
“పడుకోబోయే ముందు వేడి వేడి పాలు తాగితే బాగా నిద్రపడుతుంది… ఉదయం వంటావిడ వున్న సమయంలోనే కాలకృత్యాలు తీర్చుకుని బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం ముగించుకో…..” అని మరీ మరీ చెప్పి వెళ్ళింది.
అయినా అమ్మాయి పిచ్చి కాని పిచ్చెక్కించే ఈ ఒంటరితనంలో మాదకద్రవ్యాలు వేసుకున్నా నిద్ర పట్టేట్టు లేదు. వేడి పాలేమి చేస్తాయి..?
ఐదు పదులు దాటినా ఆయన వెళ్ళిపోయినా ఎప్పుడూ బిజీగా వుండే నాకు ఏనాడూ ఒంటరితనం తెలియలేదు. ‘ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ హౌస్’ అని ఊరికే అనలేదు. మొదటిసారిగా భూమండలం మీద నేను ఒక్కదానినే ఒంటరిగా వున్నట్టు అనిపించింది.
ఇల్లంతా ఆవరించుకున్న నిశ్శబ్దం.. మంచం దైన్యంగా, కాళ్ళు అచేతనంగా, చేతులు స్తబ్ధుగా, మనసు శూన్యంగా, మెదడు ఖాళీగా, జీవితం వెలితిగా… తెలవారుజామున ఎప్పుడో కునుకు పట్టింది.
ఆలస్యంగా లేచేసరికి వంటావిడ వండిన పదార్థాలన్నీ టేబిల్ పైన పెట్టేసి వెళ్ళిపోయింది.
వాకర్‌తో అడుగులు వేయటం కష్టంగా వుంది. పైగా సమయం ఎక్కువ పడుతోంది. జీవితంలో ఎప్పుడూ పరిగెత్తటానికి అలవాటు పడ్డ నాకు బెడ్రూం నుండి డైనింగ్ టేబుల్ చేరటానికి అంత సమయం కేటాయించటం నా ఓర్పు సహనాలకు పెద్ద పరీక్షలా వుంది.
అమ్మాయి దగ్గరుండి చేసినంత కాలం తెలియలేదు. అప్పుడు రోగం కూడా భోగమే అనిపించింది. ఇప్పుడు తెలిసొస్తోంది.
ఓపిక, సహనం తక్కువైన నేను రివాల్వింగ్ చేర్ పైన కూర్చుని గబా గబా తోసుకోవటం మొదలెట్టాను.
ఎంత ఫ్రస్ట్రేషన్‌తో గిరాగిరా తిరిగినా ఆ నాలుగు గోడల మధ్యనే.
నా ఫ్రస్ట్రేషన్‌లో తోపుడుకి ఒకసారి రివాల్వింగ్ చైర్ తిరగ పడపోయింది. అతి కష్టం మీద ఆపుకోగలిగాను. సాధారణంగా కాలి ఆపరేషను అయ్యాక రెండో సారి పడే అవకాశాలు ఎక్కువని, అలా జరిగితే జీవితమంతా చక్రాల కుర్చీలో వుండాల్సి వస్తుందని డాక్టరుగారి హెచ్చరిక గుర్తొచ్చింది. ఒళ్ళు గగుర్పొడిచింది. కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి.
మనిషికి ఏ అవయవం దెబ్బ తిన్నా దుర్భరమే…
ఆ దుర్భర సమయంలో మానసిక దౌర్భల్యంతో ఓ తోడు కోసం డెస్పిరేట్‌గా అలమటించాను. నేనంత అబలనని నాకెప్పుడూ అనిపించలేదు.
కదలలేని స్థితిలో మంచాన పడ్డాక కాళ్ళ విలువ తెలిసింది.
శివారెడ్డి కవిత వాల్యూమ్ మూడుకి ఆయన రాసుకున్న ముందు మాట గుర్తొచ్చింది. వారు అచ్చం నాలాగే గదిలో బందీ అయి రాసుకున్నట్టున్నారు…
“ఒక స్థితి చాలా విషయాలు చెబుతుంది.
అంతకు ముందు గమనించనివి గమనానికొస్తాయి.
మామూలుగా అయితే కాళ్ళకు మనం ఏ ప్రాధాన్యత ఇవ్వం.
ప్రమాదానికి లోనయినప్పుడు తెలుస్తుంది కాలి విలువ.
కదిలే ప్రపంచం విలువ.
ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే ప్రతివాడు ప్రొద్దున్నే లేవగానే వాడి కాళ్ళకు వాడు నమస్కరించి తిరగటానికి బయిల్దేరాలని…
గదిలో కూర్చున్నవాడి ప్రపంచమే వేరు. కళ్ళుంటాయి. పరిమితమయిన దృశ్యాలకే పరిమితం. మూసిన కిటికీల్ని గోడల్నీ దాటలేవు. సర్కస్ బోనులోని సింహాల్లా, అసహనంగా అన్నింటినీ మింగేసేటట్టు అక్కడక్కడే తిరుగుతుంటాయి.”
ప్రపంచంలో నేనొక్కర్తినే పడలేదు… నా కాలు మాత్రమే విరగలేదు…
ఇలాంటి మానసిక స్థితిని మహా మహా అతిరథ మహారథులు అనుభవించారు.
When there is physical illness, you can’t afford to have psychological illness as well… But at times the prolonged confinement of life within four walls seems so dreadful……. so exhausting… I started losing charm in living. I desperately wanted to walk out of the house… actually fly high into the sky…
ఇదివరకు తరచూ నాకో కల వస్తుండేది. నేను స్వేచ్ఛగా నా ఇచ్ఛానుసారం ఆకాశంలో ఎగురుతున్నట్టు.. ఎత్తయిన శిఖరాల మీదుగా, అందమైన ఉద్యానవనాల మీదుగా, మబ్బుల్లో విహరిస్తూ ఎవరూ చేరలేని భూమి ఆకాశం కలుసుకునే ఆ అపురూపమైన అద్భుత కొస దిశగా సాగిపోతున్నట్టు…
ఇప్పుడు నిజంగా రెక్కలు మొలిచి నేను గగన విహారం చేయగలిగితే ఎంత బావుండును. భుజాల దగ్గర నా చేతుల వెనుక భాగం తడుముకున్నాను.
వై నాట్ ఎ మిరాకిల్ హ్యాపెన్ అండ్ వింగ్స్ గ్రో…
నెలల తరబడి నాలుగు గోడల మధ్య బంధింపబడటంతో శారీరక అనారోగ్యానికి డిప్రెషన్ తోడయి మానసిక రుగ్మత ఏర్పడింది. జీవితం కుంటుపడి, గతి తప్పి, ఊపిరి సలపని ఆలోచనలు రెక్కలు తొడుక్కుని విహంగాలై గాలికన్నా వేగంగా బయటి ప్రపంచాన్ని చుట్టి వచ్చేవి. నా పిచ్చి ఆలోచనలనన్నింటినీ కాగితం పైన పెట్టేదాన్ని. అప్పుడు గాని మనసు తేలిక పడేది కాదు.
కాళ్ళు కుంటు పడినా శరవేగంతో పయనించే మనసొకటుంటుంది… మానస నేత్రమొకటుంటుంది…
బహూశా ఆ కంటి దర్శనాలే శివారెడ్డిగారి కవితాసుమాలై పుష్పించాయేమో…
ఆ పుష్పాల పరిమళాన్ని నేనూ ఆస్వాదించే ప్రయత్నం మొదలెట్టాను.
పేపరు పైన నాకేమనిపిస్తుందో యథాతథంగా రాయటం మొదలెట్టాను.
ప్రాస కుదిరేట్టుగా సరిదిద్దుకున్నాను…
I wanna walk
I was flying like an angel..
But a great fall broke my ankle..!
Till then I was fulfilling everyone’s wishes..
Had to wake up to my senses with all the stitches..!
Ankle broke three ways..
Added bonus dislocation sideways..!
Plates and screws were all used..
Doctors pinned and stapled bones fused..!
I had no knowledge of software..
But now I can boast of the hardware..!
My legs lost the balanced stride..
Now I drag myself with all my hopes died..!
With every step I can feel the electric shock..
My mother has put all my heels under the lock..!
Stuck to the bed is bringing out depression..
Not able to walk like others up the frustration..!
Doctors are giving hopes of 90% chances..
But I want back my fast legs and their stances..!
Friends and family are giving their love..
But I am not in a state to mind those now..!
అలా నా మానసిక స్థితిని యథాతథంగా నా తొలి ఆంగ్ల కవిత రూపంలో వివరించాను. అప్పుడే ముఖ పుస్తకమనే సోషల్ మీడియా పరిచయం అయ్యింది. రాసిందల్లా అక్కడ పెట్టటం మొదలెట్టాను.
“ఆహా, ఏమి కవిత్వం…” అంటూ స్నేహితులు పోగయ్యారు. ప్రశంసలు వెల్లువయ్యాయి. కొత్త ప్రపంచం పరిచయమయ్యింది. ఆంగ్లం తెలియని కొందరు తెలుగులో రాయమన్నారు. మాతృభాషలో రాయనందుకు సిగ్గుపడ్డాను.
మాతృభాష మీద మమకారంతో సత్వరమే నా కలం తెలుగులో పరుగందుకుంది.
(మళ్ళీ కలుద్దాం)