Site icon Sanchika

గొంతు విప్పిన గువ్వ – 38

[box type=’note’ fontsize=’16’] ఒక స్త్రీ సంపూర్ణ జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది. [/box]

[dropcap]హే[/dropcap] కృష్ణా….

వంశ వృద్దుల్, బంధు మిత్రుల్, ఇరుగుపొరుగుల్ కనంగ
బంగరు పుత్రికాపౌత్రికల కాంచనంబు వేలంబు వేయ
బ్యాంకు అధికారుల దుష్కర్మంబు ఆపంగ నీ అర్ధబ
లంబు దక్క నాకు అన్యము శరణంబు నీయదే..!

హే కల్ప వృక్షా… కరుణామయా… కనికరించుమా
ఈ ఉపద్రవంబు నుండి నీ ద్రవ్యంబుతో కటాక్షించి కడతేర్చుమా..
నాడు కృష్ణుడు ద్రౌపదికి వలువలిచ్చి మానంబు కాపాడిన చందంబున
నగదు నిచ్చి నా నగలు పరుల పాలు కాకుండ నా అభిమానంబు కాయుమా..!

***

ఆ రోజు ఉదయం SBI నుండి కాల్ వచ్చినప్పటి నుండీ నా మనసు మనసులో లేదు.

స్థిరాస్తి, అమ్మ కష్టార్జితం పరుల పాలు కాకుండా కాపాడే ప్రయత్నంలో మా అమ్మాయిలు వాళ్ళ బంగారమంతా బ్యాంకులో కుదువ పెట్టి పదిహేను లక్షలు ఋణం తీసుకున్నారు. ఆస్ట్రేలియా వెళ్ళిపోయే హడావిడిలో ఫారాల్లో ఏమి రాసి వుందో నేను గమనించలేదు. నెలకు యాభై వేలు చొప్పున జమ చేస్తానని ఒప్పందం చేసుకున్నాను. మూడు సంవత్సరాల్లో బంగారం బాకీ తీరిపోవాలన్నది నా ఉద్దేశం. పదిహేను నెలలు గడిచాయి. ఏడున్నర లక్షల బాకీ తీరింది.

అనుకోని విధంగా ఆ రోజున బ్యాంకు నుండి నా బంగారం వేలం వేస్తున్నట్టుగా ఆఖరి వార్నింగ్ కాల్.

గుండె ఆగినంత పనయ్యింది. వేలం ఏమిటి.. ఏ కారణంగా వేలం… నెలనెలా యాభై వేలు కడుతూనే వున్నానే.. మిగిలి వున్న తొమ్మిది లక్షల బాకీకి ముప్పయి లక్షలు ఖరీదు చేసే బంగారం వేలం వేయటమేమిటసలు.

ఇంతవరకూ హోం లోను, కార్ లోను తీసుకున్నానే తప్ప ఇలా నగలు కుదువ పెట్టడం తొలి అనుభవం. నేను సంవత్సర కాలంలో విడిపించుకుంటానని ఫారాల్లో సంతకం చేసానట. పై నుండి ఒత్తిడి వలన బ్యాంకు వారు నెల వ్యవధిలో రెండు నోటీసులు జారీ చేసి, ఆడిటింగ్ ముందు, మూడో (ఆఖరి) నోటీసు ఇవ్వబోతూ పిలుపుకి అందనంత దూరాన వున్న నాకు వాట్సప్ కాల్ ప్రయత్నించారు.

నోటీసులు ఎవరందుకున్నారో తెలియదు. బార్డర్ల మూసివేతతో నేను ఆస్ట్రేలియా నుండి ఇండియా రాలేని పరిస్థితి. ఏమి చేయాలి… పరిష్కారం ఏమిటి..?

“మీరు వచ్చి లోను రెన్యు చేయటమో లేదా తొమ్మిది లక్షల బాకీ కట్టే ఏర్పాటు చేసి బంగారం మా కస్టడీలో వుంచటమో… రెండే మార్గాలు. మాకు మరో రెండు రోజుల్లో ఆడిటింగ్ జరగనుంది. ఈ లోపు ఏదోటి చేయండి..” అదీ కాల్ సారాంశం.

ఇండియాకి ఛార్టర్డ్ ఫ్లైట్స్ భారీ వెల టికెట్లతో నెలకు ఒకటో రెండో వెళ్తున్నాయి.. రెండు రోజుల్లో నేను వెళ్లగలిగే సమస్య లేదు. మరి తొమ్మిది లక్షలు కట్టి వేలం ఆపే నాధుడెవరు…?

బ్యాంకు మేనేజరు మరో వెసులుబాటు చెప్పాడు.

“ముందు ఎవరి చేతనయినా డబ్బు కట్టించండి. పాత లోను క్లియర్ చేసి, బంగారం తిరిగి కుదువ పెట్టుకుని మళ్ళీ తొమ్మిది లక్షలు సాంక్షను చేసి మీ అకౌంటులో వేస్తాము. డబ్బు కట్టినవారికి మీరు ఆన్లైన్ లో ఆ తొమ్మిది లక్షలు పంపించేయండి”

ఉచిత సలహా వీనులవిందుగా, వేడెక్కిపోయిన తలకు చందనలేపనంలా బాగానే వుంది కాని నేను ఇండియాలో లేకుండా నన్ను నమ్మి ఈ కరోనా కాలంలో తొమ్మిది లక్షలు నా అకౌంటులో వేసే అంత ఆత్మీయ ధనికుడెవరు…?

ఇంకెవ్వరు….వన్ అండ్ ది ఓన్లీ వన్.. మళ్ళీ మా కృష్ణ పరమాత్ముడే..!

***

అనగనగా ఓ మనిషి.

మామూలు మనిషిలా కనిపించే గొప్ప మనీషి.

కలప వ్యాపారంలో బాగా కష్టబడి పైకి రావటంతో డబ్బు విలువ బాగా తెలిసిన మనిషి.

ఏ తరం మనిషని గట్టిగా అడిగితే ఖచ్చితంగా చెప్పలేను.

మా వంశంలో నాలుగో తరానికి కూడా అతి ప్రియమైన మనిషని మాత్రం చెప్పగలను.

పేరుకు కృష్ణ పరమాత్ముడు.. నాకు మటుకు ఆపద్బాంధవుడు.

చామన చాయగా బక్కపలుచగా రివటలా వుండే నేను భూతద్దాల్లాంటి కళ్ళజోడుతో రెండు జడలు వేసుకుని స్కూలుకి వెళ్ళే రోజుల్లో అతనిని మొదటిసారి చూసాను.

తొలి తరం, మా అమ్మ, తొలుతగా ఇల్లు కట్టిస్తున్న వేళ ద్వారబంధాలతో అతనితో మాకు వ్యాపార బంధం ఏర్పడింది.

ఒంటరిగా జీవితంతో పోరాటం చేస్తున్న అమ్మ ఆరాటం చూసి చలించి సప్లయ్ చేసిన కర్ర ఖరీదును వాయిదాల పద్దతిలో ఇచ్చే వెసులుబాటు కలిగించి అమ్మకు దేవుడయ్యాడు.

వ్యాపార దక్షత బాగా వంట పట్టిన అమ్మ అతని మెత్తని మనసును గమనించి, ఏదో ఒక ఆర్థిక కష్టాన్ని కారణంగా చూపించి అతని దగ్గర డబ్బు అప్పుగా తీసుకుని వడ్డీకి తిప్పి తిరిగి ఇచ్చేస్తుండేది.

తరువాత అసలు విషయం తెలిసిన కృష్ణుడు కోపం తెచ్చుకోకుండా పైగా తన దగ్గర గల్లా పెట్టెలో గుడ్లు పెట్టని డబ్బు, అమ్మకు పిల్లలను పెడుతున్నప్పుడు, అమ్మ నిక్కచ్చిగా బదులు తీర్చేస్తున్నప్పుడు, ఆమె పురోగతిని ఆపటం దేనికని తనకు తెలిసిన నిజాన్ని నర్మగర్భంగా దాచి, ఉదార స్వభావంతో అప్పు ఇస్తూనే వుండేవాడు.

అప్పు ఇవ్వటంలో తన చేయి పైన వుందనుకోవటంలో ఆ మహానీయునికి ఆనందం.

అలా అప్పులు ఇవ్వటం, బాకీలు వసూలు చేసుకోవటం నిర్విరామంగా కొనసాగుతూ మాకు క్రమంగా అతను ఆప్త మిత్రుడయ్యాడు.

తన వడ్డీ వ్యాపారం విషయం అతనికి తెలియదనుకున్న అమ్మ “మీ తెలంగాణ వాళ్ళు వట్టి అమాయకులండీ..” అంటూ ఎదురు వేళాకోళమాడేది. దానికి బదులుగా అతను “మీ ఆంధ్రావాళ్ళు మస్తు హుషారు..” అనేవాడు. అమ్మ చిలకలా కిలకిలా నవ్వేది.

అమ్మ నా వివాహ సమయంలో చాలా పెద్ద మొత్తం అప్పు తీసుకోవటం జరిగింది. అమ్మ నిజాయితీ, తెలివితేటల పైన నమ్మకమున్న అతనికి, అంత మొత్తం బాకీ ఒంటరి స్త్రీ ఎప్పటికి తీరుస్తుందన్న దిగులు వీసమంతయినా లేదు.

ఆడమనిషి ఇంటికి వెళ్ళటానికి ఇబ్బంది పడే అతనికి మావారి ఇల్లరికపు రాకతో ఆనందం వెల్లివిరిసింది. మా వారితో మంచి స్నేహబంధం ఏర్పడింది.

నా పెళ్ళి బాకీ తీర్చేసాక అమ్మకు మళ్ళీ ఎప్పుడూ జీవితంలో అప్పు అవసరం కలగలేదు.

ఎదుగుతున్న పిల్లలు, వాళ్ళ ప్రొఫెషనల్ చదువులు, ఇల్లు కట్టుకోవటం, ఆడపిల్లల పెళ్ళిళ్ళతో ఆ అప్పు అవసరం మాకు తరుచూ ఏదో రూపంలో కలుగుతూ వుండేది.

పైగా వడ్డీ లేని అప్పు అన్నాక అవసరాలు తన్నుకు వచ్చేవి. నాది టంచనుగా జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగం కావటంతో ఎంత పెద్ద రొక్కమయినా కాదనకుండా ఇవ్వటం అతనికి అలవాటయి పోయింది. మా వారు అవసరాల్లో ఆదుకునే ఆ ఆపద్బాంధవునికి కల్ప వృక్షమని పేరు పెట్టారు.

రాను రాను ఏ కొనుగోలుకైనా, శుభకార్యాలకైనా అతని దగ్గర అప్పు శుభ శకునంగా ఆనవాయితీగా మారింది. మా వారు అకాల మరణం చెందినప్పుడు, నేను అచేతనావస్థలో వుండగా మొదటిసారి అతను తన డబ్బుతో (అడగని అప్పు) చావు కార్యక్రమం చేసారు. బాగా దగ్గరగా మసిలిన ఆత్మీయ మిత్రుని అంతర్ధానానికి ఖిన్నుడైన అతను ఆ డబ్బు తిరిగి ససేమిరా తీసుకోలేదు.

పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డాక నాకు అప్పుల అవసరం కలగలేదు. పిల్లలు విదేశాల నుండి వచ్చినప్పుడల్లా వాళ్ళు అతనికి విదేశీ మద్యం తేవటం, అతను వాళ్ళను వైస్రాయ్, తాజ్ కృష్ణ, బార్బేక్యూ నేషన్ లాంటి విభిన్నమయిన రెస్టారెంట్లకు తీసుకు వెళ్ళటం పరిపాటి అయ్యింది.

ఒకానొక సందర్భంలో వక్రదృష్టి గల ఓ స్నేహితుడు నన్ను కృష్ణుడు మా అమ్మకు స్నేహితుడా లేక నాకు స్నేహితుడా అని విషం చిమ్ముతూ వ్యంగ్యంగా వంకరగా అడిగాడు. నేను అతను తను తిరిగి మళ్ళీ నోరు విప్పకుండా ‘ప్రస్తుతం మా అమ్మాయిలకు స్నేహితుడు’ అని బదులిచ్చాను.

పెద్దగా సాహిత్య పరిచయం లేని, పుస్తకాలు చదవని కృష్ణుడు నా తొలి నవల ఆవిష్కరణ సభలో రెండు వేలు పెట్టి నా నవల ఇరవై కాపీలు కొని, నవలపై ఆసక్తి ఉన్నవారికి అక్కడికక్కడే పంచేసారని నాకు తరువాత తెలిసింది. కేవలం పుస్తకావిష్కరణ రోజునే నా నవలలు బోలెడు అమ్ముడు పోయాయనే నా ఆనందం కోసమే అతను ఆ పని చేసాడు. అలా కూడా ఒకరి పట్ల అభిమానాన్ని ప్రకటించుకోవచ్చని తెలియని నాకు ఆ క్షణం అతని పట్ల మాటల కందని భావమేదో ముసురుకుంది.

గత ఏడాది అమ్మ కోరిక మేరకు అమ్మాయిలు కొన్న కోటి రూపాయల ఆస్తి కొనుగోలుకి, అన్ని ప్రయత్నాల అనంతరం మూడు లక్షలు తక్కువయ్యాయి. నేను పిల్లలకు ఆ మూడు లక్షల సర్దుబాటు చేయాలనుకున్నాను. చాలా కాలం తరువాత మళ్ళీ నాకు అతని దగ్గర అప్పు అవసరం కలిగింది. నెల నెలా నాకు వచ్చే పెన్షను పాతిక వేలకు పన్నెండు పోస్ట్ డేటు చెక్కులు సంతకం చేసి ఇచ్చి అతని దగ్గర మూడు లక్షలు అప్పుగా తీసుకుని రిజిస్ట్రేషన్ ముగించుకుని ఫ్లైట్ ఎక్కేసాను.

అలా వచ్చేసిన నేను కరోనా కారణంగా సంవత్సరం పైగా ఆస్ట్రేలియాలో వుండిపోయాను. ఇప్పుడు బ్యాంకు నుండి ఈ కాల్. మా అమ్మాయి వెంటనే కృష్ణుడు తప్ప తొమ్మిది లక్షలు సర్దటం ఎవరి వల్లా కాదని అతనికి కాల్ చేయమన్నది.

ప్రపంచంలో సమస్యలన్నీ డబ్బు లేమితో వచ్చేవే. డబ్బుంటేనే మనిషికి సుఖప్రదమైన ఆనంద జీవనం. నేను ప్రపంచపు ఏ మూలలో వున్నా నా సమస్యలను తక్షణమే తీర్చే ఇతనే పరోక్షంగా నా ఆరోగ్యానికి కారణమని చెప్పవచ్చునేమో.

కాల్ అందుకున్న వెంటనే అతను రెండో ఆలోచన లేకుండా, ఆడపిల్లల బంగారం ఆగమైపోతుందనే ఆలోచనతో ఇరవై నాలుగు గంటల్లో బ్యాంకుకి వెళ్ళి తొమ్మిది లక్షలు జమ చేసేసాడు. అందుకే అతను ప్రస్తుతం పిల్లల స్నేహితుడని నేను అనేది.

బీసీ నాటి ఇతను మా ఇంటి నాలుగో తరానికీ మిత్రుడే… కృష్ణుడు అందరి వాడేలే అన్నట్టుగా.

ఎంచేతనంటే నా మనవలకు అతను కొనిచ్చే ఐస్క్రీంలంత ఇష్టం అతనంటే.

ఇలాంటి నాలుగు తరాల మిత్రుని గురించి రాయకుండా ఈ గువ్వ గొంతుకను ఆపేయటం అన్యాయం కదూ…

ఇప్పుడు నా కృతజ్ఞతా భారం కొంత తేలికయ్యింది. ఇంతటితో ఈ గువ్వ గొంతు ఆపేస్తూ ఇంక సెలవు.

(అయిపోయింది)

Exit mobile version