[box type=’note’ fontsize=’16’] ఒక స్త్రీ సంపూర్ణ జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది. [/box]
పెట్టని ముద్దు
[dropcap]అ[/dropcap]వి నా ఉద్యోగపు తొలి రోజులు. నేను ఎటువంటి వర్క్ ఎక్స్‌పీరియన్స్ లేని ఫ్రెష్ ఉద్యోగినిని. పీజీ కాలేజీ క్యాంపస్ నుండి నేరుగా ఉద్యోగ పర్వంలోకి పయనించిన విద్యార్థినిని. అదేమీ క్యాంపస్ సెలక్షన్ కాదు.. ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజి నుండి ఏకబిగిన వచ్చిన మూడు ఉద్యోగావకాశాలు. మూడింటిలో నేను ఎంచుకున్న ఆర్మీ ఉద్యోగం అది. దేశభక్తని పొరపాటు పడేరు… కేవలం కుటుంబభక్తి మాత్రమే. ఎంచేతంటే ఆరు గంటల డ్యూటీ. మిగిలిన సమయమంతా కుటుంబానికి కేటాయించవచ్చన్న స్వార్థం.
అసలు అప్పటికి పీజీ ఫలితాలు వచ్చేసి ఆ ఉద్యోగం రాకుండా వుండి వుంటే జీవితమే మరోలా వుండి వుండేది. ఎవరూ మార్చలేని లలాట లిఖితo. పీజీతో సంబంధం లేని క్లర్కు ఉద్యోగం అది. కేవలం పదో క్లాసు పాసు, టైపింగులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్న ఉద్యోగం. షార్ట్ హ్యాండ్ నా అదనపు అర్హత.
నేను ఉద్యోగానికి మాత్రమే కొత్త కాదు. లోకానుభవం లేని నాకు ఆ ప్రపంచమే కొత్త. అప్పటివరకూ నా లోకంలో నేను పెరిగాను. పుస్తక జ్ఞానమే తప్ప ప్రపంచ జ్ఞానం శూన్యం. నలుగురి మధ్య ఎప్పుడూ మసలని ఎటువంటి ఎక్స్పోజర్ లేని ముడి సరుకుని నేను.
తోటి ఉద్యోగులను ఎలా విష్ చేయాలన్న కనీస మానరిజమ్స్ కూడా తెలియని అజ్ఞానిని. అమ్మ చాటు బిడ్డను. నా చుట్టూ ఎనభై శాతం ఆర్మీ యూనీఫారాల ఫెళ ఫెళల మధ్య ఆర్మీ బూట్ల టకటకల మధ్య ఇరవై శాతం సివిలియన్లు. ఆ ఇరవై శాతంలో ఐదు శాతం ఉద్యోగినులు. మొత్తం మీద అక్కడ ప్రతీ వందకి ఐదుగురు ఆడవాళ్ళు.
బెరుకు చూపులు చూస్తూ బితుకు బితుకుమంటూ నన్ను పోస్ట్ చేసిన సెక్షనులో తొలి రోజున అడుగుపెట్టాను. రివటలా ఐదున్నర అడుగుల పొడవున్నా చుట్టూ కాకుల మధ్య చిన్న పిచ్చుకలా అభద్రతగా ఫీల్ అయ్యేదాన్ని. కాకులే కాదు, అక్కడ కొన్ని గద్దలు కూడా పొంచి వుండేవి. వాటి వాడి చూపుల వేడిని తట్టుకోవటం మొదట్లో కష్టంగా వుండేది.
నాకు ఆర్మీవాళ్ళ ర్యాంకులేమిటో ఏ ర్యాంకు పెద్దదో ఏది చిన్నదో గ్రహింపు లేదు. వాళ్ళ చొక్కా స్లీవ్ మీద పట్టీలను బట్టి, భుజాలపై నక్షత్రాలను బట్టి వాళ్ళ స్థాయినెలా గుర్తించాలో అస్సలు తెలియదు. అంతా బెరుకు.. ఏదో తెలియని భయం. ఖాకీ బట్టల్లో జాతీయ సమైఖ్యతను చాటిచెబుతూ భారత దేశ వివిధ రాష్ట్రాల వాళ్ళoతా ఒకే కప్పు కింద వుండేవారు.
“పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కళ బంగ వింధ్య హిమాచల యమునా గంగా…” అంటూ సాగే జాతీయ గీతంలో లాగా అటు పశ్చిమ తీర ప్రాంతం నుండి ద్రావిడ ప్రాంతం వరకూ ఇటు తూర్పు నుండి ఈశాన్యం వరకూ సమస్త భారతీయులు మా సెక్షనులోనే వుండేవారు. జాతీయ భాష హిందీ అంటూనే ఎవరికి వారు వారి వారి మాతృభాషల్లో మాటాడుకునేవారు. తెలుగు తప్ప అన్ని భాషలు మాటాడేవారు. నాకంతా గందరగోళంగా వుండేది. నాకు ఎవరితో మాటాడాలో ఏ భాషలో మాటాడాలో కూడా తెలియని అయోమయం.
పేడ రంగు, ముదురాకు దుస్తుల్లో ఆర్మీవాళ్ళతో నిండిన మా సెక్షను ఒక పచ్చని తోటలా అనిపించేది. ఆ తోటకంతటికీ నాలుగే పువ్వుల్లా నాలుగు మూలలా మేము మొత్తం నలుగురమే స్త్రీలం ఆ సెక్షనులో. సుగునాంబళ్ అనే తమిళ యువతి, మేరీ అని ఒక క్రైస్తవ వితంతువు, ద్వారక అని మరో మరాఠీ స్త్రీ. వీరు ముగ్గురూ అటు ఇటుగా నలభై ఏళ్ళ వయసు వారే. అప్పటి నా వయసు ఇరవై రెండు.
సుగునాంబళ్‌కు పదిహేను సంవత్సరాల అనుభవం వున్నప్పటికీ ఏ పనీ స్వతంత్రంగా చేయలేక పై అధికారుల నిరాదరణకు గురై ఎప్పుడూ దిగాలుగా ప్రపంచం మొత్తం తన భుజస్కంధాల పైనే వున్నంత దుఃఖంలో కృంగిపోయి ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌తో బాధ పడుతుండేది.
మేరీ ఐదేళ్ళ క్రితం ఆర్మీలో భర్తను కోల్పోయి కాంపేషనేట్ గ్రౌండ్స్‌లో భర్తీ అయిన ఉద్యోగిని. ఆమె మొహం మంచికి మారుపేరులా కనిపించేది. పేరుకు తగ్గట్టుగా మేరీమాతలా ప్రశాంతంగా ప్రసన్నంగా వుండేది. ఎప్పుడూ నిశ్శబ్దంగా తన పనిలో తాను లీనమై వుండేది. అనవసరపు విషయాల్లో జోక్యం చేసుకునేది కాదు.
ద్వారక మిలిటరీ ఆసుపత్రిలో సఫాయి కర్మచారిగా పనిచేసి అక్కడ స్టాఫ్ సర్ప్లస్ అయి లోకల్ అడ్జస్ట్మెంటులో మెస్సెంజెర్‌గా మా ఆఫీసుకి వచ్చింది. పేరుకే అటెండరు కాని మాతో సమంగా ఒక కుర్చీలో కూర్చుని వచ్చే పోయే డాక్‌ను రిజిస్టరులో ఎంట్రీ చేసేది. ఆమె కళ్ళెప్పుడూ చుట్టు పక్కలవారి పైనే వుండేవి.
ద్వారక నోటికి ఎంత మీసాలున్న మగాడయినా భయపడాల్సిందే. ద్వారక మనిషి వేషధారణ వెగటుగా, మాటలు కరుకుగా, జోకులు వెకిలిగా, మొత్తం మీద చూపరులకు చులకనభావం కలిగేట్టుగా మనిషి సంస్కార హీనంగా కనిపించేది.
నాది చిన్న వయసు కావటము, పోస్ట్ గ్రాడుయేట్ అవ్వటము, పైగా అణకువతో వినయంగా బెరుకుగా వుండటంతో నన్ను అందరూ ఇష్టపడేవారు. అది ద్వారకకు కంటగింపుగా వుండేది. నాపైన అకారణ పగ పెంచుకుంది.
సుబేదార్ సంధు అనే సర్దార్ మాకు ఇంచార్జీగా వుండేవాడు. అతను మితభాషి, సహృదయుడు, స్టాఫ్ మంచి చెడులు అర్థం చేసుకుంటూ అందరికీ అండగా సహాయకారిగా వుండేవాడు.
బురదలో రాయి వేసి మురికి కావటం ఇష్టం లేని వారంతా ద్వారకతో మంచిగా వుంటూ దూరంగా వుండేవారు. సుబేదార్ సంధు మటుకు ద్వారకతో స్ట్రిక్టుగా వుంటూ ఆమెను దూరం పెట్టేవాడు. ముఖ్యంగా ద్వారక అటెండెన్స్ విషయంలో మరీ ఖచ్చితంగా వుండేవాడు.
అతనికి మునుపు ఇంచార్జీగా వుండే సుబేదార్ త్రిపాటీ ద్వారక నోటికి భయపడి ఆమెకు అనువుగా మసిలేవాడట. ఆమె ఆఫీసుకి రాకుండా రిజిస్టరులో సంతకాలు చేసినా, ఆలస్యంగా వచ్చినా, ముందుగా వెళ్ళిపోయినా నోరేత్తేవాడు కాడట.
సుబేదార్ సంధు ద్వారక ఆటలు సాగనిచ్చేవాడు కాడు.
కొత్తగా చేరిన నాకు ఇండిపెండెంట్ టేబుల్ ఇవ్వకుండా సుబేదార్ సంధు నెల్లాళ్ళ పాటు అతని పక్కన కూర్చోబెట్టి పని నేర్పాడు. సుబేదార్ సంధు చాలా బాధ్యతాయుతంగా క్రమశిక్షణతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూనే ఆఫీసు పద్దతులూ, ఆర్మీ ప్రోటోకాల్, ప్రణాళికలు, ఉద్దేశ్యాలు, టార్గెట్లు సవివరంగా చెబుతూ నాకు తర్ఫీదు ఇచ్చేవాడు.
ద్వారక దృష్టంతా మా ఇద్దరి మీదే వుండేది. నాకు అర్థం కాని తనదైన పద్ధతిలో కుళ్ళు జోకులు వేస్తుండేది. ద్వారకకు సన్నిహితుడు, ఆమెతో పాటు మిలిటరీ ఆసుపత్రి నుండి పోస్టయిన మరో అటెండరు పెంటయ్య మటుకు ఆమె వంకర జోకులకు గారపళ్ళన్నీ బయట పడేట్టుగా నవ్వేవాడు. నాకు పెంటయ్యను చూస్తే పెద్దలు కొన్ని పేర్లు ఎంత సబబుగా పెడతారాని ఆశ్చర్యంగా వుండేది. సుబేదార్ సంధు మాత్రం చాలా సీరియస్‌గా వుండేవాడు. అతని సీరియస్‌నెస్ నన్ను భయపెట్టేది. ద్వారక కుతకుత ఉడికిపోయేది. నా వంక కసిగా చూసేది. నాకు అయోమయంగా వుండేది.
ఒక రోజున నేను ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళేప్పుడు బస్స్టాపులో నాతో పాటు భర్తీ అయిన దుర్గ అనే మరో ఎంప్లాయీ ఎంతో ఆసక్తిగా నన్నడిగింది “సౌజన్యా, మీ సెక్షనులో ఏమో జరిగిందట… ఏం జరిగింది”
నేను ఆశ్చర్యంగా ఎదురు ప్రశ్న వేశాను “ఏం జరిగింది దుర్గా…”
“ఏమో, ఆఫీసు మొత్తం చెప్పుకుంటున్నారు. మీ సెక్షనులో ఎవరో ఎవరినో ముద్దు పెట్టుకున్నారట… నీకు తెలియదా…” ప్రశ్నార్థకంగా చూసింది.
“ఊహూ నాకు తెలియదు. ఎప్పుడు, ఎవరు ఎవరిని…” పెద్దగా నచ్చని విషయమైనా అంతగా ఆఫీసు మొత్తం తెలిసిన విషయం నాకు తెలియకపోవటం చిన్నతనంగా భావించి విషయజ్ఞానం కోసం అడిగాను.
“సరిగ్గా తెలియదు. ఎవరో ఆర్మీవాడు ఎవరో లేడీని ముద్దు పెట్టుకున్నాడట…” అంది దుర్గ.
“అవునా, బహిరంగంగానా చాటుగానా…” నాలోనూ కొంచం ఉత్సాహం పెంచింది ఆ వార్త.
“బహిరంగంగానేనట. ముగ్గురు చూశారట. మీ అటెండరు పెంటయ్య మా అటెండరు సత్తెయ్యకి చెబితే వాడు మరొకరికి చెబుతుండగా విన్నాను” అంది.
ఆ రాత్రంతా ఎంత బుర్ర బద్దలు కొట్టుకుని ఆలోచించినా నా మట్టి బుర్రకు ఎవరు ఎవరిని ముద్దు పెట్టుకుని వుండొచ్చన్నది గ్రహించటం నా శక్తికి మించిన పనే అయ్యింది.
నా సెక్షనులో వున్నది ముగ్గురే స్త్రీలు.. సుగునాంబళ్, మేరీ, ద్వారక. ఆలోచించ లేకపోయాను. నా నునుపైన చిట్టి బుర్రను ఎక్కువ శ్రమ పెట్టటం ఇష్టం లేక ఆ విషయం ఆ రాత్రే అంతటితో మరిచిపోయాను.
సంవత్సరం తరువాత సుబేదార్ సంధు ఢిల్లీ పోస్టింగ్ వెళ్ళిపోతూ నాతో “ద్వారక విషయంలో జాగ్రత్తగా మెలకువతో వుండండి.. అనవసర దుష్ప్రచారం చేస్తుంది” అన్నాడు.
“పాపం తనేమీ చేయదు. మీరే ఆమె వ్యక్తిత్వ దుష్ప్రచారం చేస్తున్నారు” అన్నాను నవ్వుతూ అతనికి వీడ్కోలు చెబుతూ.
“అసలు అంత పెద్ద నింద వేసిన మనిషిని మీరెలా క్షమించ గలిగారు” ఆశ్చర్యంగా అడిగాడతను.
“నింద ఏమిటి… నేను తనను క్షమించటమేమిటి” రెట్టింపు ఆశ్చర్యంతో అడిగాను నేను.
అతను అపనమ్మకంగా నా మొహంలోకి చూస్తూ “గత సంవత్సరం మన సెక్షనులో మన మధ్య ఏదో జరిగిందని రూమరు స్ప్రెడ్ చేసింది తనే” అన్నాడు కొంచం తటపటాయిస్తూ.
ఒక రోజున దుర్గ బస్టాపులో నన్నడిగిన విషయం గుర్తొచ్చి నా మొహమంతా కోపావేశాలతో ఎర్రగా కందిపోయి కళ్ళల్లో గిర్రున నీరూరింది.
నిప్పు లేనిదే పొగ రాదన్న సామెత ఎంత అబద్ధమో ఆలోచిస్తూ సిగ్గుతో చితికిపోయాను.
తోటి స్త్రీ పైన అంత పెద్ద అభాండం వేసి ఆమె పొందిన పైశాచికానందం ఏమిటో అర్థం కాలేదు కాని ఆడదానికి ఆడదే శత్రువు అని ఎందుకంటారో అర్థమయ్యింది.
(మళ్ళీ కలుద్దాం)