గొంతు విప్పిన గువ్వ – 8

23
2

[box type=’note’ fontsize=’16’] ఒక స్త్రీ సంపూర్ణ జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది. [/box]

విడిన మబ్బులు

[dropcap]అ[/dropcap]ప్పట్లో అమ్మ నాకు పెళ్ళి సంబంధాలు చూస్తున్న సమయంలో బంధువులు ఒకరు యోగ్యుడైన ఒక వరుని ప్రస్తావన తెచ్చారు. అమ్మ ఆ అబ్బాయి గురించి వాకబు చేయగా అతనితో మాకు బీరకాయ పీచు చుట్టరికం కలవటమూ అతను నాకు అన్నయ్య వరుస అవ్వటమూ జరిగింది.

అమ్మ ఆ అబ్బాయి నాకు సోదరుని వరస అయినందుకు తెగ దిగులు పడిపోయింది. ఎన్నడూ చూడని, ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేని, ఆరు తరాల విస్తారణలో అన్నయ్యగా తేలిన అతనిని అల్లుడిగా కోల్పోయినందుకు అమ్మ బెంగ పెట్టుకుంది.

ఆ తరువాత నాకు వేరే సంబంధం ఖాయమయ్యాక ఆ అన్నయ్య వరుస అబ్బాయి మరో వైపు కుటుంబ బంధుత్వంలో నాకు బావ వరుస కూడా అవుతాడని తేలింది.

చేజారిపోయిన అతనిని తలుచుకుని అమ్మ పడిన ఆవేదన అంతా ఇంతా కాదు.

అంతలోనే చిత్రంగా మారిపోయిన వావివరసలు…

అమ్మ ఆరాటం నాకు విచిత్రమనిపించింది.

ఎక్కడో ఏడు తరాలు ముందు వెనుకలకు, కుడి ఎడమలకు తిరగేసి కలబోసి వడబోసి వరుసలను నిర్ణయించి తదనుగుణంగా బంధుత్వాలను కలుపుకునే ఆ తరం కొంత అతిశయంగా అనిపించినా ‘అన్నయ్య’ అనే పదానికే కళంకం తెచ్చే ఈ తరంతో పోల్చితే వారి చాదస్తమే నయమేమోననిపిస్తుంది నాకు.

తోడబుట్టిన అన్నదమ్ములను, పెద్దమ్మ పిన్నమ్మల పుత్రులను కాకుండా ఇతర పురుషులను ‘అన్నయ్య’ అని నోరారా పిలవలేని నా తత్త్వం చాలా సందర్భాల్లో కొందరికి నా వ్యక్తిత్వం పైన అనుమానాలను రేకెత్తించింది.

ఇరుగుపొరుగులను, స్నేహితుల భర్తలను గబుక్కున ‘అన్నయ్యా’ అని సంబోధించటం నాకు చాలా ఇబ్బందిగా వుంటుంది.

నేను ‘అన్నా’ అని పిలవలేదని కొందరు వ్యక్తులు ‘మేరే దిల్ మే కుచ్ కాలా హై’ అని అపోహ పడ్డ సందర్భాలూ వున్నాయి.

నా శ్రేయస్సును కోరే మా అమ్మ, మా ఇంట్లో అద్దెకు వుండే బ్యాచిలర్లను ‘అన్నయ్య’ అని పిలవమని వత్తిడి చేసేది. అలా పరాయివారిని అన్నయ్య అని పిలవటం నా వల్ల కాని పని. పైగా నేను అలా పిలిచినంత మాత్రాన అవతలి వారికి నా మీద నిజంగా వేరే ఉద్దేశo వుంటే పోతుందా అనే నా ప్రశ్నకు అమ్మకు చిర్రెత్తుకు వచ్చేది.

ఒకసారి మా ఇంట్లో అద్దెకున్న ఒక బ్యాచిలరుని అతను చెల్లెలని పరిచయం చేసిన అమ్మాయితో నేను నగ్నంగా చూడటం జరిగింది. అప్పటి నుండీ అవసరాలకు వాడుకునే ఈ అన్నాచెల్లెళ్ళ సంబంధాల పైన అసహ్యం మరీ పెరిగిపోయింది.

నేను ఆర్మీలో ఉద్యోగం చేసే రోజుల్లో ఒక బెంగాలీ హవల్దారు నన్ను ‘చెల్లె…చెల్లె…’ అంటూ నా పైన అతిగా ప్రేమను ఒలక బోస్తుండే వాడు. ఆ అతిని భరించటం నాకు కష్టంగా వుండేది. మావారితో చెబితే సిస్టర్ అనే పిలిచేటప్పుడు ఇబ్బంది ఏమిటని నా మాటలు తేలిగ్గా తీసి పడేసారు.

ఆఫీసులో ఒక్కోసారి పదిమంది దృష్టిని ఆకర్షించేట్టు ప్రవర్తించే ఆ బలవంతపు అన్నయ్యను చాలా కష్టంగా భరిస్తూండే దానిని. ఒకరోజున నా పిల్లల వయసు అడిగి మరీ తెలుసుకుని ‘మీ వదిన నా మేనకోడళ్ళ కోసం అల్లింది’ అని రెండు స్వెట్టర్లు తెచ్చి ఇచ్చాడు. భాభికి ధన్యవాదాలు చెప్పమని వాటిని స్వీకరించాను.

అప్పుడప్పుడూ స్వీట్లు, నా పిల్లలకు బొమ్మలు, హ్యాండ్‌బ్యాగులు భాభి ఇచ్చిందంటూ ఇస్తూ వచ్చాడు. అలా బహుమతులు స్వీకరించటం ఇబ్బందిగానే వుండేది. మావారితో ఆ మాటే అంటే, వాళ్ళ జంటను భోజనానికి ఆహ్వానించి ఖరీదయిన కానుక ఆవిడకు ఇచ్చేయమని సలహా ఇచ్చారు. నేను ఋణ విముక్తురాలినవటానికి సరైన సలహా ఇచ్చినందుకు ఆనందపడ్డాను.

నేను వాళ్ళను ఆహ్వానించే ప్రయత్నంలో వుండగానే రాఖీ పండుగకి వదినమ్మ ఇంటికి రమ్మoదని హవల్దారు పిలిచాడు. ఆ రోజు ఆదివారం కాకుండా వుండి వుంటే అతను ముచ్చటపడే ఆ రాఖీ ఏదో ఆఫీసులోనే కట్టేసేదానిని. నా దురదృష్టం కొద్దీ ఆ పండుగరోజు ఆదివారం అయ్యింది. మా వారికి సోమవారాలు సెలవు. పిల్లలిద్దరినీ తీసుకుని ఆటోలో వెళ్ళమని అన్నారాయన.

ఏడాది వయసున్న చిన్నదాన్ని చంకనేసుకుని ఐదేళ్ళ పెద్ద పాపను తీసుకుని వెతుక్కుంటూ వాళ్ళిoటికి వెళ్ళాను. గుమ్మంలోనే ఎదురుపడి కౌగిలించుకున్నంత పని చేసాడు.

ఆర్నెల్లుగా అయిష్టంగా అన్నయ్యను భరిస్తున్న నేను మరీ అంత దగ్గరితనాన్ని జీర్ణించుకోలేకపోయాను. వంటగదిలోనున్న వదినగారిని పిలిచాడు. ఇల్లంతా చేపల కూర వాసనతో నిండి వుంది.

ఆవిడ తెచ్చి పెట్టుకున్న నవ్వుతో చేతిని కొంగుకు తుడుచుకుంటూ వచ్చింది.

ఆవిడ భూమికి జానెడే వుంది. ఛామనఛాయగా బక్క పలచగా నాలుగడుగుల ఒక మోస్తరు విగ్రహం ఆమెది.. చెప్పొద్దూ హవల్దారు మంచి కనుముక్కు తీరు గల ఆరడుగుల ఆజానుబాహుడు. అస్సలు పొంతన లేని జంట వారిది.

ఆవిడ మనిషి నిర్జీవంగా నవ్వు పేలవంగా అనిపించాయి. మా చంటిదాన్ని చేతుల్లోకి తీసుకుంది. భోజనానికి కూర్చోమని నేల పైన చాపలాంటిది వేసింది.

అంతలో హవల్దారు (అన్నయ్య) భోజనాలకన్నా ముందు నా సిస్టర్ నాకు రాఖీ కట్టాలన్నాడు. నేను బ్యాగులోనుండి రాఖీ, స్వీటు డబ్బా, కుంకుమ భరిణె తీసాను. వదినమ్మ ఎదురుగానే వుంది.

రాఖీ కట్టాక “మా బెంగాలీలలో చెల్లెళ్ళు రాఖీ కట్టి అన్నలకు ముద్దు పెడతారు” అంటూ ముందుకు వంగి ముద్దిమన్నాడు.

నేను దిమ్మెరపోయి అపనమ్మకంగా ఆవిడ వంక చూసాను.

అన్నయ్య “మన పద్ధతి చెల్లికి చెప్పకుండా బొమ్మలా నిలుచున్నావేమిటి..” అని అరిచినట్టే కసిరాడు భార్యను.

ఆవిడ తేరుకుని “హా సుజీ, భయ్యాకో పప్పీ దేదో….భయ్యా హీ తో హైనా” అంది తెప్పరిల్లి పాలిపోయిన మొహంతో.

ఇలాంటి సంకట స్థితి వస్తుందని ముందే తెలిసి వుంటే అసలు వాళ్ళింటికి పోకనే పోదును. అన్నయ్యేనని ఎంత సర్దిచెప్పుకున్నా నా మనసు ఎదురు తిరిగింది.

మా ఇళ్ళల్లో ఎదిగిన ఆడపిల్లలు స్వంత తండ్రికి అన్నయ్యలకు కూడా ముద్దులు పెట్టరన్నాను.

నా సమాధానం అన్నయ్యకు నచ్చలేదు. కాని రెట్టించలేదు.

ఖరీదైన చీర, దానికి మ్యాచింగ్ గాజుల సెట్ చేతికిచ్చాడు. ఆ దంపతుల బలవంతం మీద అయిష్టంగా తీసుకున్నాను.

అన్నయ్య నా ముందున్న భోజనం కంచం తన చేతుల్లోకి తీసుకున్నాడు. చేపల పులుసుతో అన్నం కలిపి నా నోట్లో ముద్ద పెట్టబోయాడు.

నేను దూరం జరిగి ‘నేనే తింటాను’ అన్నాను.

భార్య వంక చూసాడు. ఆవిడ వెంటనే “రాఖీ రోజున అన్నలు తమ చేతితో వాళ్ళ చెల్లెళ్ళకు తినిపిస్తారు సుజీ. భాయీతో హై ఆప్కా…. ఖాలో..” అంది.

నాకేమీ అర్థం కావటంలేదు బెంగాలీ ఆచారాలు.

నిజమా అబద్ధమా అనే సందిగ్ధంలో పడ్డాను.

అన్నయ్య మాత్రమే చెప్పి వుంటే ససేమిరా నమ్మక పోయేదానిని.

కాని చెబుతోంది పాపం వదినమ్మ.

మొహమాటానికి పోయి కడుపు తెచ్చుకోవటమంటే ఇదేనేమో…

అయినా నాకు ఇంత మెతకతనం పనికిరాదు. తెగించి గట్టిగా ‘నో’ అనలేను.

అమ్మ ఏ ముహూర్తాన సౌజన్య అని పేరు పెట్టిందో నాకు…

గొంతు నుండి వెనక్కు తన్నుతున్న అన్నo రెండు ముద్దలు మింగి అయ్యిందనిపించాను.

ఎప్పుడెప్పుడు అక్కడినుండి బయటపడదామా అని ఆరాటంగా వుంది.

వదినమ్మ టీ పెట్టటానికి మళ్ళీ వంట గదిలోకి వెళ్ళింది.

అన్నయ్య నా పిల్లలిద్దరి పైన ముద్దుల వర్షం కురిపించేస్తునాడు. నాకు నచ్చటంలేదు. ఎందుకో పెలపరంగా వుంది.

టీ అలవాటు లేదని ఆమెకు చెప్పి వెళ్ళిపోయి వుండాల్సిందని బాధపడుతూ కూర్చున్నాను. టీ తాగేసి వీలయినంత త్వరగా అక్కడి నుండి బయట పడిపోవాలి అనుకున్నాను.

టీ తాగుతుండగా అన్నయ్య అన్నాడు “ఎక్సర్సైజు చేస్తుండగా అచానక్ నడుం పట్టేసింది. బరువు లేని మీ వదినమ్మ వీపు పైకి ఎక్కి నిలబడి ఎంత తొక్కినా నడుం సెట్ కాలేదు. ఒక్కసారి నా వీపు పైకి ఎక్కి తొక్కు సిస్టర్” అంటూనే అమాంతం చొక్కా తీసేసి చాప పైన బోర్లా పడుకున్నాడు.

నేను హతాశురాలినై పోయాను.

అన్నయ్యకున్నది మామూలు పైత్యం కాదని అర్థం అయ్యింది. ఇక లాభం లేదని వెళతానని ఆలస్యమయ్యిందని లేచాను.

“ఒక్క నిముషం వీపు తొక్కు… నా నడుం నొప్పి తగ్గిపోతే అది నీ భయ్యాకు నువ్విచ్చిన గిఫ్ట్ అనుకో…” అంటూ బతిమిలాడటం మొదలెట్టాడు.

నాకు అసహ్యమేసింది. నాకు పసుపుకుంకుమలుగా పెట్టిన చీర, గాజులు విసిరికొట్టి బయటకు పారిపోవాలనిపించింది. కాని ఏమి మాటాడాలో కూడా తెలియని అయోమయం.

“ఒక్క నిముషం తొక్కమ్మా… లేకపోతే నువ్వు నచ్చచెప్పలేదని నన్ను కాల్చుకు తింటాడు నువ్వెళ్ళిపోయాక…” అంటూ దీనంగా మొహం పెట్టి వదినమ్మ బతిమాలింది.

నాకు అన్నయ్య సైకాలజీ, వదినమ్మ పరిస్థితి అర్థం అయ్యాయి.

ఆమెను అన్నయ్య ఎంతగా కంట్రోలు చేస్తున్నాడో, ఆమె అసహాయతను ఎంత అవకాశంగా తీసుకుంటున్నాడో, ఆమె ఎంతగా తన ఆత్మాభిమానాన్ని చంపుకుని అతనితో సహచర్యం చేస్తుందో అర్ధమయ్యింది.

ఇక పైన సదరు అన్నయ్యకు వీలయినంత దూరంగా వుండాలి. వీలయితే నా సెక్షన్ మార్పించుకోవాలి అని మనసులో గట్టిగా నిర్ధారించుకున్నాను.

“మీ భార్యాభర్తలు ఏమి చెప్పినా సరే నేను వీపు తొక్కను. ఇట్ ఈజ్ నన్ ఆఫ్ మై బిజినెస్” అని అరిచి పిల్లలతో బయటికి వెళ్ళిపోదామనుకున్నాను.

కాని ఆమె దయనీయమైన మొహం చూసి అలా అనలేకపోయాను.

కేవలం వదినమ్మ మీద జాలితో అరక్షణం గోడ పట్టుకుని నిలబడి అతని వీపు పైన పాదాలు కదిలించాను. ఆ తరువాత బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుండి బయటపడ్డాను.

మరుసటిరోజు వినాయకచవితి నేను ఆప్షనల్ సెలవులో వున్నాను.

మంగళవారం ఆఫీసుకి వెళ్ళేసరికి మేరీ చెప్పిన వార్త విని ఆశ్చర్యపోయాను.

వదినమ్మ మా సీఓతో పర్సనల్ అప్పాయింట్‌మెంట్ తీసుకుందట.

ఆమె భర్తను సికింద్రాబాద్ నుండి ఫోర్త్విత్ పోస్టింగ్ చేయమని అర్ధించిందట.

సోమవారం రాత్రికి రాత్రి ఆ జంట సికింద్రాబాద్ వదిలి కొత్త యూనిట్లో రిపోర్టింగ్‌కి వెళ్ళిపోయారు.

మేరీని “ఆవిడ అంత అకస్మాత్తు పోస్టింగు అడగటానికి కారణమేమయినా చెప్పిందా” అని అడిగాను.

“ఎవరికీ తెలియదు…మోస్ట్ కాన్ఫిడెన్షియల్….” అన్నది మేరీ.

వదినమ్మను తలుచుకున్న నా మనసు ఆర్ద్రమై కళ్ళు చెమర్చాయి.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here