గుడ్ బై నేస్తమా… గుడ్ బై

2
2

[box type=’note’ fontsize=’16’] “ఎడబాటు తప్పదని తెలిసిన కొద్దీ ఏడుపే వస్తోంది, మాటను మౌనంలోకి తోసేసి వీడ్కోలు ఎలా చెప్పను?” అని ‘గుడ్ బై నేస్తమా… గుడ్ బై’ కవితలో అడుగుతున్నారు శ్రీధర్ చౌడారపు. [/box]

[dropcap]సం[/dropcap]ఘపు చావిడిలో
అనుకోని, ఆశించని పరిస్థితుల్లో
బాధ్యతల స్తంభాలకు
బంధాల బంధాలతో దూరదూరంగా
నువ్వూ నేనూ కట్టివేయబడ్డాము

అక్కడ నువ్వు ఇక్కడ నేను
ఒకరికొకరం కనిపించకున్నా
ఒకరిమాటలు మరొకరికి
వినిపింనంత దూరంలో ఉన్నా
వీచే గాలిలో నీ వొంటి పరిమళం
వినపడే చప్పుళ్ళలో నీ శ్వాస గుసగుసలు
నడిచే నేలపై నీ అడుగుల చెమ్మదనం
నాకు అనుభవమైన అవకాశం
ఈ శాపగ్రస్తుడికి ఆ పైవాడిచ్చిన వరం

కాల ప్రవాహంలో బతుకుతెరువు నావ
నిన్ను ఈ రేవు నుంచి రవాణా చేస్తుంటే
మరో రేవులో దించేసి
శాశ్వతంగా ఉంచే ప్రయత్నం చేస్తుంటే
దూరమైపోతున్న నీవూ
దూరం చేసుకుంటున్న నేను
దుఃఖంతో దిగాలుగా చూడటం తప్ప
మౌనంగా వీడ్కోలు ఇచ్చుకోవడం తప్ప
మరేం చేయగలం

కనుమరుగవుతున్న నిన్ను
కనులారా … కళ్ళనిండుగా
కన్నులపండుగగా చూడాలనుకున్నా…
కనుదోయి లోయల్లో
కన్నీటి సుళ్ళు తిప్పేస్తూ
కారిపోయే.. బుగ్గల జారిపోయే
కన్నీటిధారల పరదాలు ఆరేస్తూ
కంటిచూపును మసకబారుస్తున్నాయి
కళ్ళు, ఎంత పాపం చేసుకున్నాయో?

మనసు ఎంత చిత్రమైన చెలిమయో
గుండెను పిండేస్తున్న
కత్తిలా దిగబడి మెలిపెడుతోన్న
బాధను తోడేస్తున్న కొద్దీ
ఊరడింపుల చేతులతో చిమ్మేస్తున్న కొద్దీ
అది మరింత ఊరుతూనే ఉంది
రోదన నేస్తాన్ని కూడి ఒడి చేరుతూనే ఉంది

ఎడబాటు తప్పదని తెలిసిన కొద్దీ
ఏడుపే వస్తోంది, మాటను మౌనంలోకి తోసేసి…
ఏమని చెప్పను వీడ్కోలు, ఏడుపు తప్ప
అర్థం చేసుకుంటావు కదా !
గుడ్ బై నేస్తమా … గుడ్ బై !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here