గొప్పోళ్ళు

0
2

[‘అభినందన’ సంస్థ (విజయనగరం) జూలై 2022లో నిర్వహించిన మినీ కథల పోటీలో బహుమతి పొందిన కథ]

[dropcap]జీ[/dropcap]వితంలో గొప్ప పాఠం నేర్చుకోవాలంటే చేయితిరిగిన వ్యక్తిత్వ నిపుణులు ఇచ్చే ఉపన్యాసాలే కాదు సామాన్య, కింది స్థాయి మనుషులు కూడా ఒక్కోసారి గుణపాఠాలు నేర్పుతారు.

“ఏందయ్యా.. మన పిల్ల లగ్గం పది దినాలే ఉంది కదా.. మరి మీ దొరని ఓ వారం సెలవు ఇవ్వమని అడిగావా?”

“అదేనే.. ఈ పెళ్లి శుభలేఖ తీసుకెళ్ళి ఇద్దరం కల్సి ఇచ్చి ఇషయం అడుగుదాం.. పద”

“దండాలు దొరా”

“ఏందిరా.. ఇద్దరు కూడి వచ్చిండ్రు.. పొద్దున్న పనికి వచ్చినావు కదా..”

“అయ్యా.. మా పిల్ల లగ్గం పత్రిక ఇద్దరం కల్సి ఇచ్చి పోదామని వచ్చినం దొరా..”

“గట్లనే.. ఆయనకు ఏడు దినాలు సెలవియ్యాలి దొరా..”

“ఏందే.. వారం దినాలే.. జీతం కట్ చేయాల్నా ఏందీ?”

“నీ బాంచెన్ దొరా.. పనులుంటాయి గదా.. పెళ్లికే బోలెడు అప్పు జేసినం.. మీ దగ్గర కూడా తీసుకున్నాం కదా దొరా.. వాటికి వడ్డే శానా అయితాంది. జీతం కట్ జేస్తే ఎట్లా దొరా”

“గదేందే.. జీతం కట్ చేయద్దు.. వారం పని చెయ్యరు.. గట్లెట్ల అయితది.. సరే పో..”

“ధర్మ ప్రెబువులు.. దొరసాని లేనట్లుంది.. ఇద్దరు కల్సి ఆరోజు తప్పక వచ్చి దీవెనార్తి ఇయ్యలె దొరా”

“లగ్గానికి అందరు మంచి మంచి పట్టుచీరలు గడతారు.. నీకు నాకు మంచి బట్టలే లేవాయే.. ఈ లగ్గానికైనా తీసుకుందామంటే వద్దంట వెంది” భర్త మల్లయ్యను అడిగింది లక్ష్మి.

“అసలే లగ్గానికి దాశిన డబ్బులు పోను అప్పు దెచ్చినయి కూడా కర్సు జేత్తిమి.. మనం ఏది కట్టుకున్నా ఎల్తది.. కాని మా దొర, దొర్సాని మొదటి సారి మనింటికి వత్తాండ్రు.. మనింటి భోజనం తినరాయే.. మంచి బట్టలు తీసుకోవాలె.. దొర అప్పిచ్చిన దాంట్ల నుండే వాళ్లకు బట్టలు కొందాం.”

“ఈ పైసల్లో వాళ్లకు కొని తక్కువ ధరలో నైనా కొత్తయి తీసుకుందామయ్యా..”

“హా.. పిచ్చి మొగనూ.. ఆళ్ళు దొరలే.. మనలాగా సవక రకం బట్టలు కట్టుకుంటారా? హా.. ఆళ్ళ బట్టలకు ఈ పైసలే సరిపోవు.. నీకిట్టాంటి పెద్దోళ్ళ బట్టల ధరలు తెల్వది గని.. నే తెత్తలే..”

***

మల్లయ్య గుడిసె ముందు వేసిన పచ్చని ఆకుల పందిరి కింద లగ్గం మంచిగా అయ్యింది. కొత్త పెళ్లి కూతురు, కొడుకులను ఆశీర్వదించడానికి దొర దొర్సాని వచ్చిండ్రు అనగానే, పెళ్లి దగ్గర పనులు వదిలేసి మల్లయ్య లక్ష్మి ఇద్దరూ మండపం బయటి వరకు పరుగు పరుగున వెళ్లి, మొహం వెలిగిపోతుంటే బయట కారు నుండి దిగుతున్న దంపతులకు దండం పెట్టి లోనకు తీసుకొచ్చారు.

మండపానికి తీసుకొచ్చి చేతులు కట్టుకున్న వియ్యంకుడిని, వియ్యపురాలిని పరిచయం చేసాడు.

మండపంలో ఉన్న వధూవరులకు అక్షింతలు వేయగానే వాళ్ళు కాళ్ళు మొక్కారు. వారితో పాటు మల్లయ్య లక్ష్మిలు వారిని కుర్చీల్లో కూర్చోబెట్టి తాము తెచ్చిన బట్టలు పెట్టి కాళ్ళు మొక్కారు.

బట్టలను సూడగానే దొరకు, కిందటి నెలల వాళ్ళింట జరిగిన కొడుకు పెళ్లి గుర్తొచ్చింది. కొడుకు పెళ్ళికి సుట్టాలందరికి బట్టలు కొనడానికెల్లినప్పుడు, పాలేరయిన మల్లయ్యకు కూడా బట్టలు తీసుకుందామని బట్టలు తీస్తుంటే, భార్య అన్న మాటలు గుర్తొచ్చాయి. “ఏందీ.. సుట్టాలు, పనోడు ఒకటేనా.. గంత ధర బట్టలు వాడేప్పుడైనా కట్టుకున్నడా? ఆ నాసిరకంవి సాలు..” అంటూ తక్కువ ధర బట్టలు తీసుకుని పెట్టారు. కనీసం ఏదైనా బహుమతి తెద్దామని తానంటే భార్య అన్న మాటలు గుర్తొచ్చాయి, “ఆ.. పెళ్ళికి కార్ల వెళ్ళడమే గొప్ప వాడికి.. వారం రానంటే జీతం కట్ చేస్తలెం కదా అదే పెద్ద బహుమతి.. ఇంకా ఎందుకు? పెద్ద పెద్ద నాయకులు కూడా పెళ్ళికెళ్ళి ఆశీర్వదిస్తారు.. అంతే గని ఏమన్నా ఇస్తారా?” అన్నది.. వాళ్ళంటే పెద్ద పెద్ద వాళ్ళు కాని వీళ్ళు.. పైగా కొడుకు పెళ్ళికి పెద్ద తువ్వాల, జాకెట్ ముక్కలు పెట్టిండు.. “అరె.. నువ్వెందుకురా పెట్టడం?” అంటే, “వట్టి చేతులతో రావద్దు కదయ్యా.. ఎదో నా చేతుల గల్లది పెడుతాన” అన్నడు.. దొర ఆలోచనల్లో ఉండంగానే, “దొరా.. మీ కోసం కమ్మగా ఇడిగా (ప్రత్యేకంగా) వండించిన.. మీ కోసం హాట్ ప్యాకుల్ల (హాట్ పాక్) పెట్టించిన.. జర చెయ్యి కడుగుండ్రి దొరా.. పెళ్ళంటేనే పప్పన్నం అంటరు.. మా పేదోల్లింట్ల మీ గొప్పోళ్ళు ఎంగిలి పడితే అది మా భాగ్యం దొరా..” కడిగి తెచ్చిన విస్తారాకులను ప్లేట్లలో పెట్టి, విడిగా ప్రత్యేకంగా బాక్స్ లలో పెట్టిన పదార్థాలను చూపుతూ అంటున్నాడు మల్లయ్య. దొరకు కొడుకు పెళ్ళిలో తామందరూ తిన్నాక మల్లయ్య తినడం గుర్తొచ్చింది. “ఇంకెంత సేపు తింటావురా.. అవతల పనులున్నాయి.. దొరసాని పిలుస్తోంది సూడు” అన్నాడు అప్పుడు తను. నిజానికి పెళ్ళికి మల్లయ్య కూడా అతిథే.. తక్కువ కులం వాడు, డబ్బులు లేని పేదవాడు అయినా మల్లయ్య చూపించిన సంస్కారంలో తను కొంచెం కూడా చూపించలేక పోయాడు. ఇప్పుడు అతని అంతరాత్మ ‘ఎవరు గొప్పోళ్ళు?.. ఎవరు పేదోళ్ళు?’ అని అడుగుతుంటే ఆ మాటలు ఇంతింతై వటుడింతై అన్నట్లు నలుదిక్కులా దిక్కులు పిక్కటిల్లేలా వినబడుతుంటే చెవులు మూసుకుంటూ కూలబడి పోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here