‘గోరంత అనుభవం’ – కొండంత సమాచారం..!!

4
3

[dropcap]నా[/dropcap] దృష్టిలో ఉద్యోగులు రెండు రకాలుగా వుంటారు. అది కూడా ప్రభుత్వ ఉద్యోగుల సంగతి. అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయినా కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయినా కావచ్చు. కష్టపడి పని చేయాలనే అకుంఠిత దీక్ష, అప్పగించిన పని సకాలంలో చేయాలనే తపన, సమయపాలన పాటించాలనే క్రమశిక్షణ, కొత్త విషయాలు నేర్చుకోవాలనే అభిలాష గలవారు మొదటి కేటగిరి ఉద్యోగులు. మొదటి తారీఖున తప్ప ఇటువంటి ఉద్యోగ మిత్రులకు జీతం గుర్తుకు రాదు. సమయపాలన పాటించనివాళ్ళు, ఇచ్చిన పని సకాలంలో చేయకుండా ప్రతీది వాయిదా వేసేవాళ్ళూ ఎప్పుడూ జీతాల గురించి, డి.ఏ.ల గురించి, కష్టపడకుండా సంపాదించడం ఎలా? అని నిత్యమూ ఆలోచించేవాళ్ళు, పని చేస్తున్నవాళ్ళ పక్కన కూర్చుని ముచ్చట్లు చెబుతూ, వాళ్ళ పని చెడగొట్టే వాళ్ళూ రెండో కోవకు చెందిన వాళ్ళు. ఈ రెండో కోవకు చెందిన ఉద్యోగుల, లేదా అధికారుల అనుభవాలు గానీ, జీవిత చరిత్రలు గానీ సమాజానికి అవసరం లేదు.

కానీ మొదటి కేటగిరీకి చెందిన ఉద్యోగుల లేదా అధికారుల అనుభవాలు లేదా జీవిత చరిత్రలు ముందు తరాలకు అవసరం అవుతాయి. అదిగో.. ఆ ఆలోచనతో, రాసినా రాయకపోయిన ‘గోరంత అనుభవం’ అనే ఈ పుస్తకం సమాజానికి అందింది. అది రాసింది మామూలు వ్యక్తి కూడా కాదు, దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన ఎన్. వి. హనుమంత రావు గారు.

హనుమంత రావు గారు పుట్టి పెరిగింది నరసారావుపేట అయినా వారు స్థిరపడింది హైదరాబాద్‌లో. బహుశః హైదరాబాద్‌లో ఎక్కువ కాలం పనిచేయడం వల్ల స్నేహ గణం అక్కడే ఎక్కువ వుండడం వల్ల భాగ్యనగర సొగసులకు మక్కువ పెంచుకుని హైదరాబాద్‌లో స్థిరపడి ఉంటారని నా నమ్మకం.

రావు గారు, ఈ పుస్తకం ‘నా జీవిత చరిత్ర కాదు’ అన్నారు. అనుభవాలు జీవితంలోనించే పుడతాయి కదా! అందుకే నేనంటాను, ఇది ఆయన జీవిత చరిత్రలోని ‘ఉద్యోగ పర్వం’ అని. దూరదర్శన్‌లో చేరకముందు, వీరు చేసిన ఉద్యోగాలు చాలా వున్నాయి. వచ్చిన దానితో తృప్తిపడిపోయి దాన్నే పట్టుకుని వ్రేలాడలేదు. శ్రమించి ఉద్యోగం చేస్తూనే ఎన్నో పోటీపరీక్షలు రాసి విజయం సాధించిన వ్యక్తి. నేటి యువతకు ఈ పుస్తకంలోని ‘ఉద్యోగ పర్వం’  చదివితే, ఉద్యోగం రావడానికి ఎన్నిశ్రమలు పడలో, ఎంత కష్టపడితే ఫలితం సాధించవచ్చో తెలుస్తుంది.

ఎందుకంటే చదువు అయిపోగానే ఉద్యోగం వచ్చేయాలనుకునే యువతీ యువకులకు ఇది మార్గం చూపుతుందని నా నమ్మకం. ఒకరి అనుభవం మరొకరికి మార్గదర్శనం చేస్తుందనడానికి ‘ఉద్యోగ పర్వం’ మంచి ఉదాహరణ.

భవిష్యత్తును వూహించకుండానే నాటకరంగం వంటి అంశాలలో శిక్షణ పొందడం దూరదర్శన్ ఉద్యోగానికి ఉపయోగపడినా, దూరదర్శన్‌లో పనిచేసినంత కాలంలో డ్రామా సెక్షన్ ఆయనకు దక్కకపోవడం విచారకరమే! పైగా  ‘అది నా తీరని కోరిక’ అని పుస్తకం చివరలో అయన చెప్పుకున్నారు కూడా!

దూరదర్శన్‌లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా హనుమంత రావు గారు సెలెక్ట్ అయినా అక్కడి సహోద్యోగులలోని రాజకీయాలు ఆయనను కలవరపరిచాయి. ఆయనను ఒకచోట పని చేయనీయకుండా, ఢిల్లీ, హైదరాబాదు, విజయవాడ, మద్రాసు, ఒరిస్సా, అండమాన్ వంటి ప్రదేశాలకు ఇష్టం వచ్చినట్టు ఫుట్‍బాల్ ఆడుకున్న విధానం, అప్పుడు ఆయన దైర్యం, ఆత్మస్థయిర్యం ఎలాంటిదో పుస్తకంలోని ఆయా చాఫ్టర్లు చదివితేనేగాని అర్థం కాదు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆయన పనితనమే ఆయనకు ధైర్యాన్ని, పేరుప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది.

తనకు అండగా వుండి, తనలోని పనిమంతుడిని మేల్కొల్పి, ప్రోత్సహించిన అధికారులను సహోద్యోగులను కూడా మరచిపోలేదు. అలాంటి వారిలో ఆర్. వెంకటేశ్వర్లు గారు (పూర్వ డైరెక్టర్ జనరల్ – ప్రసార భారతి -న్యూ ఢిల్లీ), డా. పాలకుర్తి మధుసూదన్ రావు గారు (పూర్వ డైరెక్టర్ హైదరాబాద్ దూరదర్శన్) ముఖ్యులు. ఈ ఇద్దరూ ఈ వ్యాస రచయితకు మిత్రులు కావడం విశేషం!

హనుమంత రావు గారు రూపొందించిన కార్యక్రమాల గొప్పతనం తెలియాలంటే ఈ పుస్తకంలోని ‘గమనం -గమ్యం’, ‘సి.నా.రె. వైభవం’, ‘అక్కినేని అంతరంగం’, ‘చలన చిత్ర వైతాళికుడు’, ‘వేదిక’, ‘విజేత’, ‘ఒరిస్సా జీవితం’ వంటి వ్యాసాలు చదివితీరాల్సిందే. టి.వి.లో కార్యక్రమాలు చూసి బహుగా ఆనందిస్తాం, కానీ దాని వెనుక ఎంతటి శ్రమ, టెన్షన్ వుంటాయో, మధ్యలో అడ్డుపుల్లలు పెట్టేవాళ్ళ గురించి ఈ పుస్తకం చదివితే అర్థమవుతాయి. ఎం.ఏ-జర్నలిజం చేసిన హనుమంత రావు గారు అనేక నంది పురస్కారాలు పొందిన అధికారి. పుస్తకం చదవడం మొదలుపెడితే, పూర్తి చేసేవరకూ మనసు నిలువనీయదు.

సందర్భోచితంగా ఫోటోలు కొన్ని పెట్టినప్పటికీ, పాఠకుడిని అవి కొంత నిరుత్సాహ పరచడం ఖాయం, కానీ అందులోని అంశాలు ఈ కొరతను కనిపించకుండా ముందుకు తీసుకుపోతాయి.

శ్రీ హనుమంత రావు 2019లో, హైదరాబాద్ దూరదర్శన్‌లో, అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసి, హైదరాబాద్ (మెహిదీపట్నం)లోనే ప్రశాంతంగా విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఆయన కలానికి మాత్రం విశ్రాంతి ఉండబోదని, ఆయన ఇప్పుడు రచనలే చెబుతున్నాయి.

ఈ పుస్తకం, ఉద్యోగాలు ఆశించేవాళ్ళు, కొత్తగా ఉద్యోగంలో చేరేవాళ్ళు, దూరదర్శన్, ఆకాశవాణిలో ఉద్యోగాల కోసం తపన పడుతున్న నిరుద్యోగులు తప్పక చదవడం అవసరం అని,ప్రత్యేకంగా చదివిన నాకు అనిపించింది.

***

గోరంత అనుభవం (దూరదర్శన్‍లో నా ప్రస్థానం)
రచన: ఎన్. వి. హనుమంత రావు
పుటలు: 176
వెల: ₹ 150/-
కాపీల కోసం
ఎన్.వి. హనుమంత రావు గారు – 9440890540.
అచ్చంగా తెలుగు ప్రచురణలు – 8558899478
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేందుకు:
https://books.acchamgatelugu.com/product/goranta-anubhavam/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here