హాస్యంతో అక్షర సత్యాలు – ‘గోరంత అనుభవం’

0
2

[dropcap]ఎ[/dropcap]న్నో సంవత్సరాల క్రితం హనుమంత రావు గారు ఆయన కారులో నన్ను మా క్రొత్త ఇంట్లో దిగబెట్టటానికి వచ్చారు. అప్పుడు మా ఇల్లు ఒక్కటే ఆ పొలాల మధ్యలో ఉండేది. ఇక్కడ రైటు, ఇక్కడ లెఫ్ట్ అంటూ ఉంటే ఆయన అలా విసుగు, విరామం లేకుండా నడుపుతూ వచ్చారు. చీకటి కూడా పడింది. చివరికి “ఇక్కడ ఆపేయ్యండి” అన్నాను. ఆయన కారు ఆపి, “మీరు వద్దన్నా ఇక్కడే ఆపాలి, ముందరకి వెళ్ళేందుకు రోడ్డు ఉందని నేననుకోవడం లేదు” అన్నారు.

హనుమంత రావు గారు వ్యంగ్యం వాడినప్పుడు కుండ బద్దలు కొట్టటం కాకుండా బాంబు పేలినట్లే ఉంటుంది.

‘గోరంత అనుభవం’ పుస్తకం వాస్తవానికి ‘కొండంతలు!’ ఇది ఆయన ప్రక్కన కూర్చుని టీ త్రాగిస్తూ చెబుతున్నట్లుంది కానీ ఏదో చదువుతున్నట్లుండదు. ఈ శైలి సాధారణమైనది కాదు! అదలా ఉంచండి. ఒక్కొక్క అంశం నుండి మరో అంశం వైపు ప్రయాణం ఒక వెస్టిబ్యూల్ – (బోగీకీ, బోగీకి మధ్య ఉండేదిలా) ద్వారా వంతెన కట్టటం దాదాపు స్క్రీన్ రైటింగ్‍లా ఉంటుంది.

హనుమంత రావు గారు నాతో కూడా కొన్ని కార్యక్రమాలు చెయ్యటం నా అదృష్టం! వారి కంఠం, మాట్లాడే తీరు రెండూ విలక్షణంగా ఉంటాయి. విజయవాడ రైల్వే స్టేషన్‍లో నన్నూ, కస్తూరి మురళీకృష్ణను రైలు ఎక్కించటానికి వచ్చి మాతో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఆయనను గుర్తుపట్టి వచ్చి నిలబడి అలా చూడటం మొదలుపెట్టారు! ఈ పుస్తకం చదువుతుంటే కూడా అలాంటి అనుభవమే కలిగింది. పుస్తకంలో వ్యవస్థలోనూ, సంస్థలోనూ ఉండే అవస్థలను సున్నితమైన హాస్యంతో చెబుతూ కూడా అక్షర సత్యాలను తేటతెల్లం చేసారు. కీరవాణి గారితో కార్యక్రమం తర్వాత ఆ కెమెరామాన్ ఆయనకు ఇచ్చిన సలహా – ‘దూరదర్శన్‍లో ఎవరి సలహాలు తీసుకోకు, నీ క్రియేటివిటీని నమ్ముకో!’.

..ఈ సత్యాన్ని చివరి దాకా అనుసరించాను – ఇలా ముగించి తదుపరి అంశం ‘చలనచిత్ర వైతాళికుడు’ అని ప్రారంభించారు. ఒక ఉదాత్తమైన కథకుని కలం ద్వారానే అటువంటి కలంకారీ ముందుకు వస్తుంది!

‘ఆ రోజుల్లో (అప్పటి) ముఖ్యమంత్రి ప్రతి సోమవారం దూరదర్శన్‌కు రావటం వలన ఉప్పల్ రోడ్లు బాగా అభివృద్ధి చెందాయి’ అంటారు! దీనికి నేనూ దూరదర్శన్‍కి కృతజ్ఞుడిని (మా ఇల్లు బోడుప్పల్‍లో ఉంది).

‘జీవితంలో జరిగిన నష్టం మీద నుండి దృష్టి మరల్చాలి. నా వయసు, శక్తి, కాలము అన్నీ ఉపయోగించి వ్యక్తిగత నష్టాన్ని వృత్తి జీవితంతో అయినా పూడ్చుకోవాలనుకున్నాను. అప్పుడు వచ్చింది నాకో అద్భుత అవకాశం’ – ఇది గొప్ప మాట. కాకపోతే ఆంగ్లంలోని ‘Professional life’ను ‘వృత్తి జీవితం’ అని కాకుండా ‘వృత్తితో’ అనటం సమంజసం.

‘అక్కినేని అంతరంగం’ నిజంగానే దూరదర్శన్‍లో గొప్ప కార్యక్రమం. అక్కినేని గారి ‘అ ఆలు’- ‘అక్కినేని ఆలోచనలు’ చదివిన వారికి ఈ కార్యక్రమం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ అంశం గురించి చెబుతూ రచయిత “దాదాపు ఆరు నెలలు ఆయనతో తిరిగి అక్కినేని అనుమానపు దృక్కుల నుండి అభిమానం పొందిన మా టీంలో ఎవరికీ అక్కినేనితో ఒక్క పొటో కూడా లేదు. ఇది నిజం” అంటారు. ఒక సత్యాన్ని నొక్కి చెప్పేటప్పుడు అందులోని ప్రముఖ వ్యక్తి ఒరవడిని వాడుకుని పదాలను సమకూర్చటం చాలా మంచి కళ!

సి.నా.రె., మల్లాది వారు, చక్రపాణి గారు.. ఇలా ఎందరో ప్రముఖుల అనుభవాలలోకి ఎలా తొంగి చూడాలో అలా తొంగి చూసి ఆసక్తికరమైన విషయాలను ముందుకు తీసుకుని రాగల నేపథ్యాన్ని రచయిత ఇందులో ఆవిష్కరించటం జరిగింది. సమకాలీనమైన సమాజంలోని వైవిధ్యాన్ని, రకరకాల జీవితాలనీ అన్వేషిస్తూ చేసిన కార్యక్రమం ‘గమనం – గమ్యం’. ఈ పుస్తకం చేతిలోకి వచ్చినప్పుడు నేను ఈ వ్యాసం కోసమే వెతికాను.  అందులకు ఒక కారణం ఉంది. నాకొక మిత్రుడున్నాడు. ఆయన ఆకాశవాణిలో ఒక ప్రయోక్తగా ఉంటూ ఎందరో కవులు, రచయితలు పాల్గొనే కార్యక్రమాలు చేసేవాడు. నేను ఆయన అనుభవాల గురించి వారి పదవీ విరమణ తరువాత అడిగినప్పుడు ఒక అద్భుతమైన విషయం ముందరికి వచ్చింది – “వీరందరూ వ్రాసిన పుస్తకాలు చదవకపోయినా వీరందరినీ నేను చదివాను” అన్నారాయన! అది ఎలా సాధ్యం అన్నది పలు చోట్ల అంతర్లీనంగా ఈ పుస్తకంలో దర్శనమిస్తుంది. హనుమంత రావు గారి జీవితం ఒకటి కాదు, అనేక మలుపులతో కూడినది.

కొన్ని పాత ఇళ్ళల్లో గుండ్రంగా మలుపులు తిప్పిన మెట్లుంటాయి. ఐశ్వర్యరాయ్ నడుములా సన్నగా ఉంటాయి. ఆ మెట్లు ఎక్కేవాడి నడుముకు, మడమలకు పరీక్ష చేసేందుకు అలా కట్టినట్టుంటాయి. ఇన్ని మలుపులూ తిరిగి తిరిగి ‘నడిమిపల్లి’ వారు కేవలం సృజన కోసం నడుము కట్టినట్లుంటారు! ఉద్యోగం నిర్వహిస్తూనే, వ్యక్తిగత జీవితం, వృత్తి, ప్రవృత్తి, చేపట్టిన కార్యక్రమం – అన్నింటినీ కలబోసుకుని ఒక కామెంటరీ ఆయన చెబుతున్నారు.

‘గమనం – గమ్యం’ శీర్షిక క్రింద వచ్చిన చర్చలు ఇవి చూసిన వారిని ఎంతగానో ప్రభావితం చేసాయి. కేవలం జాతీయ చానెళ్ళలో ఆంగ్లంలో చేసేవే మేధస్సుకు పదుకు పెడతాయనుకోవటం పొరపాటు (నేను జాతీయ చానెళ్ళను చీదరించుకుంటాను, అది వేరే సంగతి!). విషయం పట్ల అవగాహన, దానిని సూక్ష్మంగా ఒకసారి, స్థూలంగా ఒకసారి ఎలా ముందుకు తీసుకొని రావాలి అన్నది ఒక కళ. రచయిత అంటారు, ‘గమనం – గమ్యం’ కార్యక్రమం ద్వారా ఈ చెంచుల మీద తీసిన డాక్యుమెంటరీ కూడా నాకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించింది. క్రొత్త అనుభవాన్ని మిగిల్చింది – అని.

ఈ పుస్తకంలోని సరళి, ఒరవడి విశేషమైనవి. ఒక కోణంలో చూస్తే నాకు ఒక విధమైన కళాత్మకత కనిపించింది. నేను సామాన్యంగా పావుగంటలో పూర్తిగా ఒక పుస్తకం చదవటం, మూడు నిముషాలలో ఆ పుస్తకం గురించి వ్రాయటం జరగదు. ఇందుకేనేమో అది జరిగింది!

దూరదర్శన్ లోవి దృశ్యాత్మకములు. వాటి గురించి దృశ్యం చూపినట్లే వాటి వెనుక గల అంతరంగాన్ని చెప్పటంలో విజయాన్ని సాధించారు రచయిత. ఆయన బాధలని, అనుభవాలని అక్కడ కనుల ముందు అందరికీ చూపించిన కార్యక్రమాలతో మేళవించి ఒక ఊహించని రియలిసమ్‍ను ముందర పెట్టటం జరిగింది. ఏది డాక్యుమెంటరీ? ఇందులో చెప్పినవా? లేక ఈ పుస్తకమా?

చివరగా ఆయన చెప్పిన మాట – “నేను నాటకంలో పుట్టి పెరిగాను. నాటకం చదువుకున్న్నాను.. ఎక్కడా నాటకంతో పని లేకుండానే ఉద్యోగం ముగిసింది. కోరిక తీరలేదు. అందుకే దీనికి గోరంత అనుభవం అని నామకరణం చేయటం జరిగింది”. నిస్సిమ్ ఎజెకియల్ ఒక మాటంటాడు – Rare is the man whose fruit is in his season!. కాకపోతే సృజన, ప్రతిభ అనేవి సహజంగా ఉన్న చోట అది ఏ స్వరూపంలో రాణించింది అనేది కాలం నిర్ణయిస్తుంది. హనుమంత రావు గారి నాటక కళ దూరదర్శన్ ద్వారా జీవిత సత్యాలను, కళాప్రపూర్ణుల హృదయాలను దర్శింపజేసింది.

వీరు ఒక రచయితగా ఎన్నో గొప్ప నవలలు, వృత్తాంతాలు రచించగలరనే నమ్మకం నాకున్నది. వారి ఈ తొలి పుస్తకాన్ని నేను మనసారా అభినందిస్తున్నాను.

పుస్తకంలోని ఫొటోలు ప్రారంభ దశలో సరిగ్గా కనిపించలేదు. ‘ఇందులో ఉన్న వారిని గుర్తుపట్టండి’ అన్న శీర్షికకు పనికి వచ్చేవిగా ఉన్నాయి.

భవిష్యత్తులో హనుమంత రావు గారి కలం నుండి అద్భుతాలు రాగలవనే గట్టి నమ్మకం నాకున్నది.

***

గోరంత అనుభవం (దూరదర్శన్‍లో నా ప్రస్థానం)
రచన: ఎన్. వి. హనుమంత రావు
పుటలు: 176
వెల: ₹ 150/-
కాపీల కోసం
ఎన్.వి. హనుమంత రావు గారు – 9440890540.
అచ్చంగా తెలుగు ప్రచురణలు – 8558899478
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేందుకు:
https://books.acchamgatelugu.com/product/goranta-anubhavam/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here