ప్రముఖ ఉర్దూ కథలకు చక్కటి తెలుగు అనువాదం – గోరింటాకు

0
3

[dropcap]అ[/dropcap]మ్జద్ మాతృభాష ఉర్దూ అయినా తెలుగు సాహిత్యం పట్ల వారికి అమిత ఆసక్తి. వారు తెలుగులో కవితలు, కథలు, నవలలు, సాహిత్య-రాజకీయ-పర్యాటక వ్యాసాలు రాశారు, రాస్తున్నారు. ఉర్దూ సాహిత్యంలోని మేలిమి రచనలని తెలుగు పాఠకులకు పరిచయం చేయాలన్న అభిలాషతో కొందరు ప్రసిద్ధ రచయితల ఉర్దూ కథల్ని తెలుగులోకి అనువాదం చేశారు. అలా ఉర్దూ సాహిత్య ప్రపంచంలో దిగ్గజాలుగా పేరుపొందిన సాదత్ హసన్ మంటు, ఇస్మత్ చుగ్తాయ్, వాజిద తబస్సుం కథల తెలుగు అనువాదాన్ని ‘గోరింటాకు’  పేరుతో మన ముందుకు తీసుకువచ్చారు.

ఇందులో సాదత్ హసన్ మంటు రాసిన ఏడు కథలు వున్నాయి. వాటిలో తన మిత్రుడు గాఢంగా ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్న యువతి – వయసులో వున్న మంచి కుటుంబాలకు చెందిన కుర్రాళ్ళను తన బుట్టలో వేసుకుంటుందని తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు ఈ ‘జాహెద’ విషయం అతనికి ఎలా చెప్పాలో అర్థం కాని మిత్రుడు పరిస్థితి ఒక కథగా రూపొందింది.

“చక్రాలు లేని బండిలాంటిది అవివాహిత జీవితం. నాకు పెళ్ళయి ఏడాది కావస్తోంది. నా భర్త నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. భర్త లేకుండా ఆడదాని జీవితం వ్యర్థం. కాబట్టి త్వరగా పెళ్ళి చేసుకో” అని షాహెద తన మిత్రురాలు సల్మాకు నచ్చజెబుతుంది. అనుకోకుండా పరిచయమై సల్మా జీవితంలో ఎన్నో ఆశలు రేపిన ఆ యువకుడు షాహెద భర్యయనీ, అతడో రంగేళీ రాజా అనీ, ఆ విషయం భార్యకు తెలియకుండా చాలా ప్లాన్డ్‌గా వ్యవహరిస్తున్నాడని గ్రహించి సల్మా ఆశ్చర్యపోవడం ‘బస్‌స్టాండ్’లో కనిపిస్తుంది.

ప్రఖ్యాత రచయితలకు అభిమానుల నుండి రకరకాల ఉత్తరాలు వస్తుంటాయి. తమ అభిమానాన్ని ఆకర్షణను చూపడానికి ముఖ్యంగా మహిళా అభిమానులు ప్రయత్నిస్తుంటారు. ‘రోగి’ కథలో ఒకమ్మాయి రచయితకు తన వ్యాధి గురించి, జీవితం పట్ల నిరాశ గురించి రాస్తుంటే, రచయిత ఆమెకు ధైర్యం నూరిపోస్తుంటాడు. హఠాత్తుగా ఆ అమ్మాయి రచయిత ఇంటికి వస్తే అతను గాభరా పడిపోతాడు. రచయితకు రెండేళ్ళ క్రితమే పెళ్ళయిపోతుంది. ఆమెను పట్నం ఎలా తీసుకురావడమా అని ఆలోచిస్తూ రెండేళ్ళు గడిపేస్తాడు. భార్య వున్నా బ్రహ్మచర్యమే పాటిస్తుంటాడు. కుశల ప్రశ్నల తర్వాత “నేనెవరో తెలుసా?” అని ఆ అమ్మాయి ప్రశ్నిస్తుంది. తెలీదంటే, ముసుగు తీసి, “నేను మీ భార్యను. రెండేళ్ళ క్రితం పెళ్ళి చేసుకుని దూరమయ్యారు. నేను అస్వస్థతగా ఉన్నానని మీకు ఉత్తరాలు రాస్తుండేదాన్ని. మీరు నన్ను ఇలాగే నిరీక్షింపజేస్తుంటే, నేను నిజంగానే జబ్బు పడి చచ్చిపోతాను” అంటుంది. ఆశ్చర్యచకితుడైన రచయిత ఆమెను అన్ని గౌరవ మర్యాదలతో తన పడకగదిలోకి ఆహ్వానించడంతో కథ సుఖాంతమవుతుంది.

తన మూర్ఖత్వంతో, అమాయకత్వంతో విడాకులిమ్మని బ్లాక్‌మెయిల్ చేసే భార్య, ఆమెకు నచ్చజెప్పడానికి భర్త పడే పాట్లను చిత్రీకరించిన ‘గ్రీన్ సైండల్’ కథ మంచి హాస్య కథగా రూపుదాల్చింది. ‘మిస్టర్ అండ్ మిసెస్’ కథలో మోయినుద్దీన్ తన ఎంతగానో ప్రేమించిన జహరాను పెళ్లి చేసుకుని కరాచీలో స్థిరపడతాడు. జహరా క్లబ్‌లో పరిచయమైన కోటీశ్వరుడు అహసన్‌తో ప్రేమ మైకంలో పడిపోతుంది. ఇది గమనించిన మోయినుద్దీన్ తను విడాకులివ్వననీ, అది తన పరువు ప్రతిష్ఠలకు సంబంధించిన విషయమనీ, కావాలంటే ఆమె నిరభ్యంతరంగా అహసన్‌‌తో ఉండవచ్చని చెబుతాడు. ఆమె అసహన్‍తో వెళ్ళిపోతుంది. అసహన్ తన ఆస్తినంతా జహరా పేరు మీద రాసేసి, ఒక రోజు హఠాత్తుగా గుండెపోటుతో చనిపోతాడు. అసహన్ ఆస్తికి వారసురాలిగా పత్రాలను మోయినుద్దీన్‌కు చూపించడానికి జహరా రాగా, మోయిన్ తన వంతుగా విడాకుల పత్రం ఆమెకు అందజేస్తాడు. “అసహన్ ఆస్తి నీ పేరు మీద రాయడం, దాంతో నీవు నా దగ్గరకు రావడాన్ని లోకులు పలురీతులుగా వ్యాఖ్యానించే అవకాశముంది. అందుకని నా గౌరవ మర్యాదలు, పరువు ప్రతిష్ఠలను దృష్టిలో ఉంచుకుని నీకు విడాకులిస్తున్నాను” అని చెప్పడంతో, ఆమె కుప్పకూలిపోతుంది.

‘ఆకలి’ చాలా భయంకరమైనది. దాని ముందు ఎలాంటి బంధాలు – అనుబంధాలు నిలవవు, నిలబడవు. తల్లి నుండి కొడుకును, భార్య నుండి భర్తను కూడా విడదీస్తుంది. ఆకలికి తట్టుకోలేక మనిషి స్వార్థంగా, దుర్మార్గంగా, పైశాచికంగా మారిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. అందమైన సురయ్యాను పెళ్ళి చేసుకున్న మొహమూద్ ఆమె పట్ల తీవ్రమైన మోహంలో పడిపోతాడు. పెళ్ళయి ఆరేళ్ళయినా అతడి ప్రేమ పిచ్చి నుండి, వ్యామోహం లోంచి సురయ్యా బయటపడలేకపోతుంది. ఆమెతో ఎవరయినా మాట్లాడినా, ఆమె వైపు చూసినా పొడిచేయడానికి ఎప్పుడూ కత్తి బొడ్లో పెట్టుకుని తిరుగుతూంటాడు. కొన్ని నెలల నుండి ఉద్యోగం లేని మొహమూద్‌కు ఇల్లు గడవడం కష్టమైపోతుంది. ఇంట్లో సామాన్లు అమ్ముకున్నా తిండికి గడవని పరిస్థితి. ఒకరోజు అనుకోకుండా ఇంట్లోకి దూరివచ్చిన ఒక ధనిక యువకుడు బలవంతంగా ఆమెను అనుభవించి డబ్బు చేతిలో పెట్టి, “నువ్విలాగే చిరునవ్వుతో బాల్కనీలో దర్శనం ఇస్తుంటే, దేవుడి మీద ఒట్టు, నేను ప్రతిరోజు ప్రదక్షిణలు చేయగలను” అని చెప్పి వెళ్ళిపోతాడు. “నేను మిమ్మల్ని మోసం చేసాను. మీ దగ్గర వున్న కత్తితో నన్ను చంపెయ్యండి లేదా ఈ సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి” అని అడుగుతుంది. అంతా విన్న భర్త కొద్ది సేపటికి “నువ్వు అలాగే ప్రతీ రోజు చిరునవ్వులు  జల్లుతూ బాల్కనీలో నిలబడలేవా మై డార్లింగ్?” అనడంతో ఆమె బిత్తరపోతుంది. ఆకలి వారిని జయించిందా? లేక వారే ఆకలిని జయించారా అన్నది పాఠకులే తెలుసుకోవాలి.

దేశ విభజన జరిగిన రెండేళ్ళ తర్వాత పాకిస్థాన్, హిందూస్థాన్ ప్రభుత్వాలు – తమ తమ జైళ్ళలో వున్న మామూలు ఖైదీలను బదిలీ చేసుకున్నట్టే… ఉన్మాద ఖైదీలను కూడా బదిలీ చేసుకోవాలని నిర్ణయించుకుంటాయి. లాహోర్‌లో పిచ్చాసుపత్రిలో వున్న బిషన్‌సింగ్ అనే ఖైదీ ఎవరికీ అర్థం కాని పిచ్చి వాగుడుతో పాటు ఎప్పుడూ తను వచ్చిన ప్రాంతమైన ‘టోబ టెక్‌ సింగ్’ గురించి మాత్రమే ప్రస్తావించేవాడు. దాంతో అందరూ అతడ్ని ‘టోబ టెక్‌ సింగ్’గా పిలిచేవారు. టోబ టెక్‌ సింగ్ ఎక్కడుందని అడిగితే ఎవరూ చెప్పలేకపోతారు. ఖైదీలను అప్పగించే వాఘా సరిహద్దు దగ్గర ఆఫీసర్ టోబ టెక్‌ సింగ్ పాకిస్థాన్‌లో వుందని చెప్పడంతో, హిందుస్థాన్‌కు వెళ్ళడానికి నిరాకరించి సరిహద్దుల మీదనే పడి చనిపోతాడు. దేశ విభజన తర్వాత సామాన్యులు ఏది పాకిస్థాన్, ఏది హిందూస్థాన్ తెలియని అయోమయ పరిస్థితిని, వారు ఎదుర్కున్న ఇబ్బందులను ఈ కథలో నిక్షిప్తం చేశారు. పిచ్చాసుపత్రిలో వున్న రకరకాల ఖైదీల మనోభావాలను ఈ కథలో చిత్రించగలిగారు. వైవిధ్యభరితంగా వున్న సాదత్ హసన్ మంటు కథలు కొసమెరుపులతో కూడుకుని వుండడం విశేషం.

ఇందులో ఇస్మత్ చుగ్తాయ్ రాసిన రెండు కథలున్నాయి. అందులో ‘మూడవ నేత్రం’ కథలో ధానూ నిజాం సర్కార్‌తో ఢీకొన్న మొదటి విప్లవకారుడు. విప్లవ కార్యక్రమాల్లో పాల్గొని గాయపడి, పోలీసుల బారి నుండి తప్పించుకుని ఎప్పుడు ఆ ఊరికి వచ్చినా, వాళ్ళు అతడిని కంటికి రెప్పలా చూసుకునేవాళ్ళు. ఒకసారి అతని కోసం వెతుకుతూ పోలీసులు ఆ ఊరికి వచ్చి ప్రతి ఇల్లూ గాలిస్తారు. కొత్తగా పెళ్ళయిన రామయ్య దంపతుల శోభనం గదిలో దాక్కున ధానూను, రామయ్యను చంపి, కొత్త పెళ్ళికూతురు అచ్చమ్మను బలాత్కరిస్తారు. అవమానంతో గాయపడ్డ అచ్చమ్మ పోరుబాట పడుతుంది. అమరులు మరణించరని ఊరి వారికి చెప్పకపోయినా, ఊరి వాళ్ళకి అర్థమైపోతుంది.

‘మొండిపట్టు’లో ఆత్మన్యూనతతో బాధపడే పెళ్ళికొడుకు, శోభనం గదిలో పెళ్ళికూతురు మేలి ముసుగు ఎత్తవద్దని నిర్ణయించుకుంటాడు. సంప్రదాయ కుటుంబంలోంచి వచ్చిన పెళ్లికూతురు భర్తనే మేలిముసుగు తీయాలనుకుంటుంది. దాంతో ఆమెకి పొగరని భావించి పెండ్లికొడుకు పారిపోతాడు. ఏడేళ్ళ తర్వాత పట్టుకొచ్చిన పెండ్లికొడుకు, పెళ్ళికూతురు మేలిముసుగు తీయలేదని మళ్ళీ పారిపోతాడు. కన్యగా వుండిపోయిన గోరీబీ ముప్ఫై ఏళ్ళు ఎదురుచూస్తుంది. పెండ్లికొడుకు దుర్వ్యసనాలకు లోనై చివరి ఘడియల్లో సొంత ఊరికి చేరుకుంటాడు. ఇప్పుడు కూడా ‘మేలిముసుగు’ ఎత్తమని ఆజ్ఞాపిస్తాడు. ఆమె ఎత్తకముండే తుదిశ్వాస వదిలేస్తాడు. గోరీబీ ఇప్పుడు మేలిముసుగు బదులుగా తలపై తెల్లని విధవ ముసుగు వేసుకుందని చెబుతూ రచయిత్రి కథ ముగిస్తుంది. ఈ కథకు ‘మొండిపట్టు’కు బదులుగా ‘మేలిముసుగు’ అని పేరు పెడితే బాగుండేదేమో!

వాజిద తబస్సుం రాసిన మూడు కథలు కూడ ఇందులో వున్నాయి. ఇందులో బంగారం, నగలు ముఖ్యం కాదు, ఆడదానికి ఆత్మబలం, ఆత్మస్థైర్యం, విజ్ఞానం, తెలివితేటలు ఇవే అసలయిన ఆభరణాలు స్త్రీకి అని తల్లి తన కూతురుకి తెలియజెసిన విధానం ‘నగల పెట్టె’లో ఆకట్టుకుంటుంది.

‘గోరింటాకు’లో పిల్లలకు పెళ్ళిళ్ళు అయి, ముసలి వయసులో వున్న డిప్యూటీ – పార్టీలకు, బయట తిరగడానికి అందమైన భార్య కావాలనుకుంటాడు. ఆయన డాబూ, దర్పం చూసి ఎవరూ పిల్లనివ్వరు. అందుకని తన పోషణలో పెరిగిన మన్సూర్‌కు తనకు బాగా నచ్చిన హిన అనే అమ్మాయినిచ్చి పెళ్ళి చేస్తాడు. మన్సూర్ తన భార్యను ముట్టుకోకుండా, ఎప్పుడూ హింసిస్తూ, ఆమెకు విరక్తి పుట్టేలా చేసి విడాకులివ్వాలి. అప్పుడు డిప్యూటీ ఆమెను పెళ్ళి చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు. అయితే విచిత్రంగా హినను పెళ్ళి చేసుకున్న మన్సూర్ ఆమె ఆకర్షణలో చిక్కుకుని, ఆమె పట్ల కఠినంగా ఉండలేకపోతాడు. అతని సంకట పరిస్థితి తెలుసుకున్న హిన, డిప్యూటీ ఇచ్చిన డబ్బులు అతని మొహాన కొట్టి, బయటకు వెళ్ళి మన జీవితం మనం గడుపుదామని ధైర్యం చెబుతుంది. ‘సెకండ్ హ్యాండ్’ కథలో శహజాదీ పాషా ఇంట్లో పని చేసే చమ్కి ఆమె విడిచిన బట్ట్లు, వస్తువులు వాడుకోక తప్పని పరిస్థితి. జీవితాంతం ఆమె  విడిచిన వాటితో, ఆమె అవహేళలను భరిస్తూ బ్రతకడం చమ్కికి దుర్భరమైపోతుంది. ఆమెపై ఎప్పటికయినా పై చేయి సాధించాలనే తపన. ప్రతీకారం కొద్దీ శహజాదీ పాషా పెళ్లయింత తర్వాత విడిదింటికి అలంకరించుకుని వెళ్ళిన చమ్కి పెళ్ళికొడుకును లొంగదీసుకుంటుంది. తాను వాడి వదిలేసిన పెళ్ళికొడుకును ‘సెకండ్ హ్యాండ్’ను శహజాదీ పాషా జీవితాంతం అనుభవిస్తుందని సంతోషపడిపోతుంది.

ఈ కథలు, కథల అనువాదం బాగుంది. ఉర్దూలో వచ్చిన కథలను ఆంగ్లం నుండి, ఇతర భారతీయ భాషలలో నుండి అనువదించిన వాళ్ళున్నారు. వారందరికంటే భిన్నంగా అమ్జద్ ఉర్దూ నుండి నేరుగా అనువదించడం, ఆ అనువాదం మూలానికి విధేయంగా వుండడం అభినందించవలసిన విషయం.

***

గోరింటాకు (ఉర్దూ కథలకు తెలుగు అనువాదం)

అనువాదం: అమ్జద్‌

పేజీలు: 112; వెల: రూ.80/-

ముద్రణ, ప్రతులకు:

పాలపిట్ట బుక్స్, హైదరాబాద్. ఫోన్‌-040 27678430

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here