[dropcap]చిం[/dropcap]త చెట్టు నీడలో
నవ్వారు మంచెం పై ఉసూరుమని కూసోని
నా నీడని నేనే చూస్తుంటే
చెట్టు కొమ్మలు, వాటిపై అప్పుడే పుట్టిన లేరేకులు
పూకిరీటంలా నా తలచుట్టూ కోలాటమాడబట్టే
నా గుడిసెకి నేనే రాజు
నా పొలానికి నేనే మంత్రి
కానీ అజమాయిషీ చెలాయించే రాణి మాత్రం వాన తల్లి
వానమ్మా అనాలి గాని వానయ్య (వరుణుడు) అంటారేంది!
అమ్మకే గదా ఆకలి తెలిసేది
అమ్మకే గదా గుండె జారేది
గుక్కెడు గింజలు పండాలంటే అమ్మే కదా కరుణించాలి
గడ్డు ఎండాకాలంలో వచ్చే వాన
మట్టి లోంచి వచ్చే వాసన
అప్పుడే చిలికిన మజ్జిగలోంచి వచ్చిన వెన్న లాంటి సువాసన
ఇసక రేణువు, వాన జల్లుల ప్రేమ వర్ణన
అపుడే మొలకెత్తిన పిలక చెట్టు గోల డూ డూ బసవన్న
రుతువులు ఆరు
కాలాలు మూడు
మనిషి ఒకడు
కాలానికి అనుగుణంగా మనిషి మారితే అది మనుగడ
అనుభవాలకు అనుగుణంగా మనిషి మారితే అది వింత పోకడ
సమాజం విపరీతం
గుండె సున్నితం
మెదడు విషం కన్నా విపరీతం
అన్ని తట్టుకుని బతికి బట్టకట్టినోడు నిలబడి ఊరేగుతడు
లేనోడు, పాడే మీద పండుకుని ఊరేగుతడు !