గోవిందరావు – వాలుజాడ

0
2

[dropcap]”ఏ[/dropcap]మండీ… పెద్ద తిరుపతి ఎపుడూ వెళదాం?” అడిగింది నాగమణి భర్త గోవిందరావుని.

“పెళ్లయి మూడు నెలలు అయింది. వచ్చినప్పటినుంచి వ్రతాలే చేస్తున్నావో… నోములే నోస్తున్నావో… ఎపుడూ జీవనదిలా ఆ ముక్కు కారుతూనే ఉంది. తగ్గాకా వెళదాం లే…” అన్నాడు గోవిందరావు వ్యాపారానికి బయల్దేరుతూ…

“పెళ్లి అయిన నెల లోపలే జంటగా వస్తామని మొక్కుకున్నాను. అపుడే మొక్కు గడువు తీరి రెండో నెల గడుస్తోంది… ఈ వేసవికాలం ఎలాగూ మీ వ్యాపారం మందకోడిగానే సాగుతుంది కదా. ఒక్క రెండు రోజులేనండి. తిరుపతి దేవుడితో వ్యవహారం. మళ్లీ వ్యాపారం సరిగా జరగలేదు. నువ్వొచ్చిన వేళా విశేషం.. గాడిద… గుడ్డు… ఆమ్లెట్… అంటూ విసిగిస్తే మాత్రం నేను మా పుట్టింటికి పోతా…” ముక్కు చీదింది నాగమణి.

ఒక్కసారి ఇంటి గోడలన్నీ కలియచూశాడు గోవిందరావు. గోడలన్నీ చీమిడి మరకలే…

మొన్న ఒక స్నేహితుడు వచ్చి “కొత్త డిజైన్ బాగుందిరా… ఎక్కడ సెలెక్ట్ చేశావ్…లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు లేదే..” అని అడిగాడు

వాడినలాగే బయటకు తీసుకువెళ్లి మాటతో పాటు మనిషిని గేటు దాటించేశాడు.

“అబ్బా… అస్తమాను పుట్టిల్లు అనకు. నాకు చిర్రెత్తుకొస్తుంది. మహాలక్ష్మిలా తలనిండా రెండు రకాల పూలెత్తుకుని సాయంత్రం ఇంటికొచ్చేసరికి… నవ్వుతూ ఎదురొస్తావ్… నా అలసట పోగొడతావ్…ఆకలి తీరుస్తావ్. నిన్నొదిలి నేను ఉండలేను నాగూ” గారంగా అన్నాడు గోవిందరావు.

“అదిగో ఆ వెధవ పిలుపే నాకు నచ్చనిది. నాగూ ఏమిటి పాముని పిలిచినట్టు… ముద్దుగా మణీ అనలేరూ. ఇంకోసారి అలా పిలిస్తే మా పుట్టింటికి పోతా…” మళ్లీ ముక్కుచీదింది నాగమణి.

ఈసారి అదెక్కడ పడిందో చూసి… గాప్ కొంచం కవరైంది… అనుకుని “సరే.. వెళ్లి ఆ మొక్కేదో తీర్చుకొచ్చేద్దాం… రెండు రోజులే సుమా.. మళ్లీ యాపారం దెబ్బ తింటాది. టిక్కెట్లు రిజర్వేషన్ చేయించి తెస్తాను. ఇంకోసారి పుట్టింటికి పోతా అంటే నాకు కోపం వస్తుంది” గోముగా అన్నాడు గోవిందరావు.

“మీ కోపం ఎలా పోగొట్టాలో నాకు తెలుసుగా…”అని కన్ను కొట్టి నవ్వి, ముక్కు ఒకసారి పక్కకి తుడుచుకుని,

అతని బుగ్గమీద గాఢంగా ముద్దు పెట్టి బుగ్గ చిన్నగా కొరికి లోపలికి పారిపోయింది నాగమణి.

“ఊ… యూ నాటీ…” బుగ్గ తుడుచుకున్న చెయ్యి పాంటు వెనుక పాముకుని నవ్వుతూ స్కూటరెక్కాడు గోవిందరావు.

***

“హాయ్..” ఫేస్‌బుక్ పోస్ట్స్ పరిశీలిస్తున్న  గోవిందరావు తలెత్తి చూసాడు. ఎవరో కొత్తశాల్తీ…

“ఏం కావాలండి…” అడిగాడు.

“మీరే…” అంది ఆ శాల్తీ చిలిపిగా…

“పరాయి మగాడితో ఏమిటి మేడం మీ పరాచకాలు? ఇంతకీ ఏం కావాలి మీకు?” కోపంగా అన్నాడు గోవిందరావు.

“మీరే.. మీరే.. మీరే…” అంది ఆ శాల్తీ నవ్వుతూ ఇంకా గట్టిగా.

అక్కడున్న అందరూ చూసారు.

చుట్టూ అందరూ తమనే చూస్తున్నారని గమనించి లేని ఓపిక తెచ్చుకుని సహనంతో అన్నాడు గోవిందరావు.

“చూడండమ్మా. మా ఆవిడ లోపలికి వెళ్ళి అరగంట అయింది. వచ్చేవేళ అయింది. ఆవిడ వస్తే అనవసరంగా నా సంసారంలో గోడవలొస్తాయ్.. మీకు ఏమైనా వివరం కావాలంటే అడగండి. తెలిస్తే చెబుతాను. లేదా మీ దారిన మీరు వెళ్ళండి.”

“నాకు మా ఆయన కావాలి. ఇందాక ఇక్కడే కూర్చోబెట్టి వెళ్ళాను. మీరేమైనా చూసారేమోనని” అంతే కూల్‌గా అడిగింది ఆ శాల్తీ.

“అమ్మయ్య. బతికించారు. నేను గంటనుంచీ ఇక్కడే ఉన్నాను. వేరే మగపురుగు ఇక్కడెవరూ లేరు.. రాలేదు. ఇంతకీ ఆయన ఎలా ఉంటారు? ఏ ఊరు నుంచి వచ్చారు?” అడిగాడు గోవిందరావు.

ఆ శాల్తీ గుర్తులు చెప్పింది నడుము మీద ఒక చెయ్యి వేసి నిలబడి.

అన్నీ తన పోలికలే… ఊరు కూడా తమ ఊరే… తమ ఊళ్ళో తనకు తెలియని వాడెవడబ్బా… తన వ్యాపారానికి ఒక్కసారైనా వచ్చి ఉండాలే… తనను మిస్సయ్యే అవకాశం లేదే.. అని ఆలోచనలో పడ్డాడు గోవిందరావు.

ఒక్కనిముషం కూడా కాలేదు.

ఆ శాల్తీ గోవిందరావు కాలర్ పుచ్చుకుంది.

“ఏంటి… పది నిముషాల్నించి చూస్తున్నాను… అయ్యో.. పెళ్ళాం ఇంత రద్దీలో  ఏ తోడు లేకుండా కళ్యాణకట్టలోకి వెళ్లి తలనీలాలు ఇచ్చి వచ్చిందే… అన్న జాలైనా ఉందా మీకు… పైగా   ప్రభుత్వ ఉద్యోగం   ఇంటర్వ్యూలో పనికిమాలిన ప్రశ్నలు వేసినట్టు నన్ను ఏడిపిస్తారా… ఫేస్‌బుక్‌లో ఎవరితోనో కనెక్షన్ పెట్టుకునే ఉంటారు. పెళ్లయి మూడు నెలలు కాలేదు. అపుడే ఈ నాగూ అంటే మొహం మొత్తేసింది మీకు” అంటూ ఒక్కసారి ఘాట్టిగా ముక్కు చీది విసిరేసరికి అపుడు ఈ లోకంలోకి వచ్చాడు గోవిందరావు.

“నాగూ… నువ్వేనా… నువ్వేనా నా నాగూ… నేను అమ్మతోడుగా గుర్తుపట్టలేకపోయాను. నీ ముక్కు కేసి కూడా చూసానే… ఎప్పుడూ జీవనదిలా కారుతూనే ఉండేది… హైద్రాబాద్ మూసీ నదిలా అలా ఎప్పుడు ఎండిపోయిందే… నిన్నపొద్దున్నకూడా ప్రవహిస్తూనే ఉందిగా.. అరే నల్ల తారురోడ్డులా వంపులు తిరిగిన నీ వాలు జడ ఏమైంది?” అన్నాడు సంతోషం పట్టలేక.

“అదిగో మళ్లీ… నాగూ… అనే పిలుస్తున్నారు… హు హు హు.. నిన్న మధ్యాహ్నం భోజనానికి వచ్చినపుడు మందుబిళ్ళలు తెచ్చి ఇచ్చి మందులు వేసుకో.. లేకపోతే మీ అమ్మా నాన్నలు ‘రొంపకి మందుబిళ్ళ కూడా ఇప్పించలేని    వాడికిచ్చి పెళ్లి చేసాం’ అని బాధ పడతారేమో’ అని తెచ్చి ఇచ్చారుగా… ముక్కు కారిపోతోందని రెండేసి చప్పున వేసేసుకున్నా. దెబ్బతో హుస్సేన్ సాగర్ లాంటి ముక్కు ఎడారిలో దిగుడుబావి అయిపోయింది… ఇక మీతో నా పెళ్లి అయితే మొదటిసారి తిరుపతి వస్తే తలనీలాలు ఇచ్చేస్తానని మొక్కుకోమంది బామ్మ” అంది గుండు నిమురుకుంటూ… నాగమణి.

చెక్కు తీసేసిన నిండు తర్బూజా పండులా ఏ పక్కనుంచి చూసినా గుండ్రంగా పచ్చని పసిమితో మెరిసిపోతున్న భార్యను చూసి అతికష్టం మీద తమకం ఆపుకున్నాడు గోవిందరావు.

అయినా అతని చూపు ఆమె గుండు మీదపడి జారిపోతున్నప్పుడల్లా “అయ్యో… బంగారంలాంటి జడ.. మళ్లీ ఎన్నాళ్లకు ఎదుగుతుందో… మళ్లీ అంత పొడుగు ముంగురులలో తన ముఖం దాచుకునేదెప్పుడో..” అని వాపోయాడు గోవిందరావు.

***

మందు పవర్ అయిపోవడంతో రైల్లో మళ్లీ నాగమణి బ్రాండ్ ముక్కు కారడం మొదలైంది. లోయర్ బెర్త్ దొరకడంతో గోవిందరావు అదృష్టం పుచ్చింది. నిద్రలోకి జారకముందు వరకు ముక్కు చీది బయటకు విసరబోతే అది గాలికెగిరి ఎవడిమీదో పడితే… వాడు డోర్‌లో నిలబడి ఎవరు విసిరారో తెలియక పచ్చి బూతులు తిడుతుంటే కుక్కిన పేనులా నోరు మూసుకుని కూర్చున్నాడు గోవిందరావు.

రాత్రి పది గంటల దాటడంతో అవయవాలన్నీ గాలికి, సమాజానికి సగం వదిలేసి ఫ్రీగా వెల్లకిలా పడుకుని గుర్రు పెట్టసాగింది నాగమణి.

ఆ వేగానికి ఆమె ముక్కుకు వరదలు రావడంతో చేసేది లేక రెండు తువ్వాళ్ళు తీసుకుని భార్య పక్కన ఇరుక్కుని కూర్చుండి పోయాడు గోవిందరావు.

వరదొచ్చినప్పుడల్లా తుండుతో తుడవడం… కునికిపాట్లు పడటంతో రాత్రంతా కోడి బతుకైపోయింది గోవిందరావుకి.

***

ఇంటికి ఉదయం చేరాక అద్దంలో ముఖం చూసుకుని కెవ్వుమంది నాగమణి.

ఆ దెబ్బతో… పూర్తిగా మెలకువ వచ్చి “ఏమైంది..నా..(గూ…అనబోయి) మణీ…” అని ఒక్క అంగలో ఆమె దగ్గరకు వచ్చాడు గోవిందరావు.

రాత్రంతా తువ్వాలతో గోవిందరావు తుడిచిన తుడుపుకి అప్పుడే కాచి చల్లారిన ఇటుకబట్టీలోంచి తీసిన పండు ఇటుక ముక్కలా ఎర్రగా వాచిపోయింది ముక్కు.

“ఇదంతా మీ వల్లనే… రోజూ గంపెడు పూలు తెస్తారు. తల్లో పెట్టుకోమంటారు.. మీ ముచ్చట్లన్నీ తీర్చుకున్నాకా… నేను పడుకున్నా పువ్వులు తెల్లవారెంతవరకు వాడకూడదని నీళ్లు చల్లుతూ ఉంటారు. దాంతో నా తల నానిపోయి శోభనం నాటి మూడవ రాత్రి నుంచి రొంప ప్రారంభమై ముక్కు జీవనదిలా తయారైంది.

మా బామ్మకు చెబితే ‘నిత్యం అలా నీళ్ళల్లో నానితే ఏడాది నిండకుండానే నూరేళ్లూ నిండుతాయే తల్లి. ముందు ఆ తల పట్టుకెళ్లి ఆ ఏడుకొండలవాడికి తలనీలాలు ఇచ్చేసి రండి. నేను నీ తరపున మొక్కేసుకుంటున్నాను’ అని కళ్ల నీళ్లు కుక్కుకుంది.

మీ పూల వ్యాపారం చల్లగుండా… రాత్రి అమ్మగా మిగిలిన పూలన్నీ నాకు తెచ్చిపెట్టి చివరకి నన్ను ఇలా తయారు చేశారు” అంది ముక్కుకు విక్స్ రాసుకుంటూ.

“అయాం వెరీ సారీ మణీ… ఇంకెప్పుడూ అలా చెయ్యను…కానీ నా కిష్టమైన జడ మాత్రం నువ్వెంత తొందరగా పెంచి ఇస్తే నీకు అంత మంచి గిఫ్ట్ ఇస్తాను. ప్లీజ్ మణీ. నా బంగారు మణీ కదూ… నిన్ను ఇంకెప్పుడూ ఇబ్బంది పెట్టను. ఒట్టు” ఆమె చేతిలో చెయ్యి వేసి ఒట్టు వేసాడు గోవిందరావు.

“నేను ఏదడిగినా ఇస్తారా…?” అనుమానంగా అడిగింది నాగమణి.

“నీ గుండు మీద… ఉహు.. కాదు.. నువ్వు నాకివ్వబోయే నల్లత్రాచు జడమీద ఒట్టు. ఏదడిగినా సంతోషంగా ఇస్తాను. వెంటనే ఇవ్వలేకపోతే జీవితాంతం కష్టపడి నీ కోరిక తీరుస్తాను. సరేనా?” అన్నాడు గోవిందరావు ఆమె ఎం ఎదుగుతుందో అనే ఆత్రుతతో…

“ఏ ఆడదైనా కోరుకునేది మాతృత్వం. ముందు పండంటి బిడ్డనివ్వండి. తర్వాత మీకిష్టమైన నా పొడుగాటి జడ మీకు బహుమతి ఇచ్చేలోగా నాకు మంచి వడ్డాణం చేయించండి చాలు. సరేనా?” మత్తు కళ్ళతో అడిగింది నాగమణి.

తమకం ఆపుకోలేని గోవిందరావు “ఊ..” అంటూ ఆమెను కౌగిట్లోకి తీసుకున్నాడు.

ఇపుడు నాగమణి తొందరగా జడ పెంచడం లోను… గోవిందరావు పగలు వడ్డాణానికి అవసరమైన డబ్బు సంపాదించడంలోను, రాత్రి వేళ పండంటి బిడ్డని కనడానికి శ్రమపడుతున్నారు…!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here