గ్రంథాలయాలు – ఒక జ్ఞాపకం

1
2

[box type=’note’ fontsize=’16’] వివిధ పట్టణాలలోని పలు గ్రంథాలయాలతో తనకున్న జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు డా. రాయపెద్ది వివేకానంద్ ఈ వ్యాసంలో. [/box]

రామకృష్ణా మఠం, లోయర్ టాంక్‌బండ్ రోడ్, హైదరాబాద్.

[dropcap]ఇ[/dropcap]టీవల ఇందిరా పార్క్ పక్కన ఉన్న శ్రీ రామకృష్ణ మఠం వారి సువిశాలమైన లైబ్రరీకెళ్ళినప్పుడు నా చిన్నప్పటి నుంచి లైబ్రరీలతో నాకు ఉన్న అనుభవాలు గుర్తు వచ్చాయి.

1977 ప్రాంతాలలో:

నా చిన్నప్పుడు అంటే ఇంచుమించు నా తొమ్మిదో ఏట కర్నూలు నరసింగరావుపేటలో ఉన్న ఒక విశాలమైన ప్రభుత్వ లైబ్రరీకి తీస్కువెళ్ళే వాళ్ళు మా అక్కయ్యలు. నేను చూసిన మొదటి లైబ్రరీ అది. ఆ లైబ్రరీని సంభ్రమాశ్చార్యాలతో చూసే వాడిని. విశాలమైన ముందు గదిలో అనేక వరుసలలో మేలురకం టేకుతో చేయబడ్డ చెక్క టేబుళ్ళు, కుర్చీలు వేసి ఉండేవి. ఆ టేబుళ్ళపై దినపత్రికలు, వార పత్రికలు, మాసపత్రికలు పరిచి ఉండేవి.

చాలా మంది వచ్చి హాయిగా చదువుకున్నంత సేపు చదువుకుని వెళ్ళేవారు. అంతా ఉచితమే అక్కడ. కాకపోతే ముఖద్వారం వద్ద ఒక కుర్చీలో ఒక లెడ్జర్ ఉండేది. దానిలో వారి పేరు, వచ్చిన సమయం వ్రాసి వెళ్ళాలి. బయటకి వెళ్ళేటప్పుడు, వెళ్ళే సమయం వ్రాసి సంతకం చేసి వెళ్ళాలి.

ఆ కుర్చీ పక్కనే ట్వయిన్ దారంతో ఒక బాల్ పెన్ను కట్టి ఉండేది. మన దగ్గర పెన్ను లేకుంటే ఆ పెన్ను వాడుకోవచ్చు. ఈ లైబ్రరీలో ఒక వారగా ఇసుకపోసి దానిపై కుదురుగా ఒక పెద్ద కుండ, దానిలో తాగటానికి మంచి నీరు ఉండేది. ఇప్పట్లో లాగా మినరల్ వాటర్ బాటిల్స్, ఇంత లావాటి ఆరోగ్య స్పృహ ఏమీ ఉండేవి కావు ఆ రోజుల్లో. అందరూ భక్తిగా ఆ నీరే త్రాగే వారు.

సరే ఆ లైబ్రరీలో ఆ టేబుళ్ళ ముందు కూర్చుని పేపర్ చదవటానికి వచ్చేవారు కాదు మా అక్కయ్యలు. మెంబర్ షిప్ ఏదో తీసుకున్నారు అనుకుంటా వారు అక్కడ. దాదాపు అయిదారు నవలలు పట్టుకువచ్చేవారు అక్కడి నుండి ఇంటికి. యద్దనపూడి సులోచనా రాణి, మాదిరెడ్డి సులోచన, సి.ఆనందరామం, పోల్కంపల్లి శాంతాదేవి, వాసిరెడ్డి సీతాదేవి, మాలతీ చందూర్, డి. కామేశ్వరి, కే.రామలక్ష్మి, తెన్నేటి హేమలత, ముప్పాళ్ళ రంగనాయకమ్మ తదితరుల నవలలు తీసుకువచ్చేవారు.

ఈ నవలల్ని చక్కగా బైండ్ చేసి ఉంచేవారు. లోపల ఒక కాగితం అంటించి ఉండేది. బహుశా లైబ్రరీ సైన్స్‌లో ఇది ఒక అంశమేమో, ఆ తరువాత ఎన్ని లైబ్రరీలు చూసినా ఈ కాగితం పద్ధతి కొనసాగుతూ కనిపించింది. ఈ కాగితం పైన మొదట ఆ లైబ్రరీ పేరు, చిరునామా తదితర అంశాలు ఉండేవి. కింద ఖాళీ కాగితంలో మూడు కాలమ్స్ ఉండేవి. ఆ ఖాళీ ప్రదేశంలో ఏదో కోడ్ వ్రాసి, మనం ఆ పుస్తకాన్ని తిరిగి ఎప్పుడు తెచ్చి ఇవ్వాలి అన్న తారీఖు వ్రాసి ఇచ్చేవారు. ఆ గడువు దాటిపోయాకా రోజుకు ఇంత అని ఫైన్ వసూలు చేస్తామని వివరాలు వ్రాసి ఉండేవి కింద భాగంలో.

ఆ బైండ్ పుస్తకంలో మూడవ అట్ట వద్ద ఒక దళసరి అట్టతో ఒక పాకెట్ లాగా ఉండేది. అది ఏమిటో ఎవ్వరూ నాకు ఇప్పటిదాకా సరిగా చెప్పిన నాథుడు లేడు. ఆ పుస్తకానికి ఒక ఐడీ కార్డ్ లాగా ఉంటుందని, మనకు పుస్తకం ఇచ్చేటప్పుడు ఆ కార్డును వారు ఉంచుకుని మనం తీస్కువెళ్ళాం అని గుర్తుంచుకోవటానికి వాడుకుంటారని ఒక మిత్రుడు చెప్పాడు. అది ఎంతవరకు కరెక్టో తెలియదు. మొత్తం మీద కంప్యూటర్లు లేని కారణాన ఆ రోజుల్లో ఇలాంటి తిప్పలు పడేవారు అనుకుంటాను.

నేను సహజంగానే గోల చేసేవాడిని నాకు కూడా ఏదయినా పుస్తకాలు కావాలని.

అందుకుగాను నాకోసం ప్రత్యేకంగా బాల సాహిత్యం నుంచి ఒక పుస్తకం తెచ్చి ఇచ్చేవారు. మాస్కో నుంచి వచ్చిన రంగు రంగు పుస్తకాలు, మహీధర రామమోహన రావు అనుకుంటా వారు వ్రాసిన పుస్తకాలు, బాలల బొమ్మల రామాయణం తదితర పుస్తకాలు నాకు వచ్చేవి చదువుకోవటానికి. ఇవన్నీ ఒకెత్తు అయితే ఆ లైబ్రరీలో ఇంకో అంశం నాకు బాగా గుర్తు ఉంది. పాత చందమామలు, బాలమిత్ర, బొమ్మరిల్లు తదితర పుస్తకాలు ఒక అయిదారు సంచికలు కలిపి బైండ్ చేయించి ఉంచేవారు. వాటిని కూడా మనం ఇంటికి తీస్కు వెళ్ళవచ్చు ఇందాకటి పుస్తకాల లాగా. వీటికి కూడా లోపల కాగితం, మూడవ అట్ట వద్ద దళసరి అట్టతో పాకెట్ లాంటి గౌరవాలన్నీ ఉండేవి.

అక్కడ మాసపత్రికలు, వారపత్రికలు ఇంటికి ఇచ్చేవారు కాదు. ఎంతసేపున్నా ఆ టేబుల్ వద్ద కూర్చుని చదువుకుని వచ్చేయాలి. మరి వాటిని ఇంటికి తీస్కువెళ్ళి చదవాలంటే ఎలా?

అందుకు గాను మా అమ్మగారు ఒక లెండింగ్ లైబ్రరీ వారితో ఒప్పందం చేసుకున్నారు. వీళ్ళు కర్నూలు గాంధీనగర్‌లో ఉండేవారు. ఒక మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబం వారు. ఒక నడివయస్కుడు, ఒక యువకుడు వీరు సైకిల్ పై ఈ మాసపత్రికలు, వారపత్రికలు తీస్కు వచ్చి ఇచ్చి, మరుసటి రోజుకు తీసుకువెళ్ళేవారు. వీరిద్దరూ బావా, బావమరిది అయ్యేవారు వరుసలో. రాజు గారు, రాజు గారి బామ్మర్ది అని ఆట పట్టించేవారు మా నాన్నగారు వాళ్ళిదర్నీ.  వీరు కృష్ణా జిల్లాకి చెందినవారు. వారి భాష మాకు చిత్రంగా తోచేది. మొదటి సారిగా ఇలా కోస్తా జిల్లాల యాస విని అర్థం చేసుకోవటంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. వారు తమ భాషని, యాసని మనకు అర్థం అయ్యేలాగా చెప్పే ప్రయత్నం ఏది చేసే వారు కాదు. తమ ధోరణిలోనే తాము ఉండేవారు. తాము అధికులమనే భావన కూడా వారికి తెలియకుండానే వారి హావభావాల ద్వారా వ్యక్తమయ్యేది.

మేము అప్పటిదాకా ఉండివచ్చిన ఊర్లు, కడప, కమలాపురం, కళ్యాణ దుర్గం, తాడిపత్రి వంటి పక్కా రాయలసీమ ప్రాంతాలకు చెందిన ఊర్లే కావటన మాకు ఎక్కడా తెలుగు భాష యాసతో పెద్ద ఇబ్బందులు ఎదురుకాలేదు. కానీ కర్నూలు జిల్లాకి ఆనుకుని గుంటూరు జిల్లా ఉండటం వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాలకి చెందిన అనేక కుటుంబాలు ఆ రోజుల్లోనే కర్నూల్లో స్థిరపడ్డాయి. అదీకాక కర్నూలు పట్టణం రాష్ట్రానికి మొదటి రాజధానిగా ఉండిన కారణంగా కూడా కావచ్చు, అక్కడ ఇలా కోస్తా జిల్లాల వారు ఎక్కువగా తారసపడేవారు.

మా ఇల్లు మేడం కాంపౌండ్ పక్కగా, అలంకార్ నవరంగ్ టాకీసుల ఎదురుగా ఉండేది. మా ఇంటి పేరు (అంటే మేము అద్దెకి ఉన్న భవనం పేరన్న మాట, కాస్తా చిత్రంగా ఉండేది. ’శ్రీ వాణీ భాగీరథీ సదన్’ అనే పేరు పెద్ద అక్షరాలతో వ్రాసి ఉండేది. అంటే ఏమిటో మాకు తెలియదు. కానీ పక్కా బ్రాహ్మణ పేరు. సరే ఈ ఇల్లు గాంధీ నగర్ కి నడిచి వెళ్ళేంత దగ్గర్లో ఉండేది.

సరే ఒక్కోసారి ఆ వారపత్రికలు, మాసపత్రికలు త్వరగా చదివేశాము అనుకోండి, అక్కడికి మనమే నడిచి వెళ్ళి గాంధీనగర్‌లో ఉన్న వాళ్ళ ఇల్లు మరియు లెండింగ్ లైబ్రరీలో ఇచ్చేసి వేరేవి తెచ్చుకోవచ్చు అన్నమాట. ఆంధ్రసచిత్ర వారపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, సితార తదితర వారపత్రికలు, జ్యోతి, స్వాతి, యువ, నీలిమ, విజయ, వనిత, మహిళా, విజయచిత్ర, అపరాధ పరిశోధన,చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు తదితర మాసపత్రికలు, పోనీలే అన్చెప్పి మా నాన్నగారి కోసం ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, ది వీక్, సండే అనే ఇంగ్లీష్ పత్రికలు కూడా వచ్చేవి మా ఇంటికి ఈ లెండింగ్ లైబ్రరీ ద్వారా.

ఆ రోజుల్లోనే ఆంధ్రభూమి వారపత్రిక కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. మొదటి సంచిక అట్టపై వినాయకుడు జీన్స్ పాంట్ వేసుకున్నట్టు సరదాగా ఉండే కార్టూన్ బొమ్మతో వచ్చింది అది. అతి త్వరలోనే అది పుంజుకుంది. ఆ రోజుల్లో అంధ్రప్రభ ఎక్కువ సర్కులేషన్ ఉన్న పత్రికగా ఉండేది.

1980 ప్రాంతాలలో:

నేను ఏడవతరగతి చదువుతున్న రోజులు అవి. ఈ తులసి దళం ఆంధ్రభూమిలో సీరియల్ గా వచ్చే సమయంలో మా నాన్నగారి ట్రాన్స్‌ఫర్ వల్ల మేము జమ్మలమడుగులో ఉండేవారం. నాకు లైబ్రరీలు, పుస్తకాలతో అనుబంధం ఏర్పడిన రెండు, మూడేళ్ళలో ఆంధ్రభూమిలో యండమూరి వీరేంద్రనాధ్ గారి తులసిదళం ప్రారంభం అయ్యింది అని చెప్పవచ్చు. ఎడిటర్ సికరాజు గారి అద్భుతమైన మార్కెటింగ్ నైపుణ్యాలు, ఇన్నోవేటివ్ ఐడియాల కారణంగా ఆంధ్రభూమి ఇక వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అతి త్వరలోనే ఆంధ్రభూమి లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు వీక్లీగా అవతరించింది.

జమ్మలమడుగులో కూడా చక్కటి శాఖా గ్రంథాలయం ఉండేది. జమ్మలమడుగులో ఊరి చివర మైలవరం డ్యాంకి వెళ్ళే దారిలో, ఉండేది ఈ శాఖా గ్రంథాలయం. ఇదే రోడ్డులో వెళితే తాడిపత్రి, బనగానపల్లి, బేలూం గుహలు వస్తాయి. ఇటీవల కూడా ప్రయాణించాను ఈ రోడ్లో. ఈ రోడ్డుపై ఎడమ వైపు ఉండేది ఈ శాఖా గ్రంథాలయం అప్పట్లో.

అప్పటికి నేను పన్నెండు పదమూడు సంవత్సరాల కుర్రాణ్ణి అవటం వల్ల నన్ను ఒక్కడ్నే పంపేవారు లైబ్రరీకి. అక్కయ్యలు వచ్చేవారు కాదు నాతోటి. తమకు ఏమేం పుస్తకాలు కావాలో వారు ఒక స్టాండర్డ్ లిస్ట్ ఒకటి చెప్పెవారు. ఇక్కడ కూడా అయిదారు పుస్తకాలు తీస్కుని శ్రద్ధగా వచ్చేవాడిని.

ఇక్కడ కూడా ముందు గదిలో దినపత్రికలు, వార, మాస పత్రికలు చదివే సౌకర్యం ఉండేది. నేను చందమామ తదితర పత్రికలతో బాటుగా వారపత్రికలు చదివే వాడిని. ఇక్కడా కూడా రష్యా వారి ‘రాదుగా’ ప్రచురణల సంస్థ వారి పుస్తకాలు లభించేవి. నండూరి వారు అనువాదం చేసిన టామ్ సాయర్, హకల్ బెరీఫిన్, కాంచన ద్వీపం, ఎనభై రోజుల్లో ప్రపంచ యాత్ర తదితర బాలల సాహిత్యం చదువుతూ ఉండే వాడిని.

ఇంటికి ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఆంధ్ర పత్రిక వచ్చేవి. కారణం తెలియదు కానీ మా ఇంట్లో ఎవ్వరికీ ఆంధ్రజ్యోతి, జ్యోతి చిత్ర, బాలజ్యోతి తదితర ఆం.జ్యో ప్రచురణలు ఏవీ నచ్చేవి కావు. అవి ఎక్కువగా ఇంట్లోకి వచ్చేవి కావు.

ఆంధ్రపత్రికలో అప్పట్లో శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ‘హాహాహూహూ’ అనే సీరియల్ వచ్చేది. దాన్ని తెగ ఆసక్తిగా చదివేవాడిని. అది ఒక రకంగా ఫాంటసీ. ఒక తుంబురుడు/లేదా గంధర్వుడు దారి తప్పి భూలోకంలో ఇరుక్కుపోతాడు. ఇక్కడ ఆయన పడే తిప్పలు చాలా సరదాగా ఉంటుంది చదవటానికి.

ఇక్కడ ఒక పరిణామం జరిగింది. ఇంట్లో తులసిదళం గూర్చి ఎక్కువగా చర్చలు జరుగుతుండటంతో ఒకసారి యధాలాపంగా తిరగేశాను తులసిదళం. అంతే. ఇంకేముంది. బాలల సాహిత్యం అటకెక్కింది. నెక్ట్స్ డే నే లైబ్రరీ కి వెళ్ళి చెంగల్వ పూదండ, పర్ణశాల, ఋషి, ఇంకోటి ఏదో కథల సంపుటి తదితర యండమూరి పుస్తకాలు పట్టుకొచ్చేశాను. అప్పటి నుంచి విపరీతంగా యండమూరి గారిని అధ్యయనం చేయటం మొదలెట్టాను.

ఎన్టీఆర్ గారితో బాటుగా, ఏఎన్నార్ గార్ని కూడా చూస్తాము కద. అలాగా మల్లాదిగారి పుస్తకాలు కూడా బాగా చదవటం మొదలెట్టాను.

ఇద్దరికీ పోటీ అని కాదు కానీ, నాకు వ్యక్తిగతంగా యండమూరి వారి పుస్తకాలు ఎక్కువ నచ్చేవి. కానీ మల్లాది వారి శైలి కూడా బాగా ఇష్టం. పట్టి చదివించే గుణం వల్ల నాకు ఇద్దరి బుక్స్ చాలా నచ్చేవి.

కారణాలు ఏవైతేనేం, లెఫ్టిస్ట్ సాహిత్యం, భావుకత్వం అని పేరు పెట్టుకుని వచ్చే నిరాశావాద సాహిత్యం కూడా బాగానే చదివేవాడిని. వ్యక్తిత్వం లేని హీరోలు, పిచ్చి త్యాగాలు చేసే పాత్రలు ఇలాంటి కథ కథనాలు అస్సలు నచ్చేవి కావు. అందుకే యండమూరి మల్లాది గార్ల పుస్తకాలు చదివినట్టు వేరె ఎవ్వరివి కుదురుగా కూర్చుని చదవలేకపోయేవాడిని.

1981-83 ప్రాంతాలలో:

మళ్ళీ మా నాన్నగారి ట్రాన్స్ఫర్ వల్ల కర్నూలుకి వచ్చాం. ఈ సారి బీ.క్యాంపులో ఒక చిన్న శాఖా గ్రంథాలయంలో పుస్తకాలు తెచ్చుకునే వాళ్ళం. ఇక్కడ కొంచెం ఆడవాళ్ళు కూడా హాయిగా రాదగ్గ వాతావరణం ఉండేది. కాలని మధ్యలో ఉండటం వల్లనో ఏమో కానీ ఎక్కువగా ఆడవాళ్ళే ఉండేవారు. అది మహిళా లైబ్రరీ ఏమో అని నా అనుమానం ఇప్పుడు. అక్కడ సుభద్ర గారు అని ఒకావిడ లైబ్రరియన్‌గా ఉండేవారు. ఆవిడ చాల దయగా ఉండేవారు. ఆవిడ మా అక్కయ్యలకి, మా అమ్మకి బాగా దగ్గరయ్యారు.

ఆవిడ సంభాషణలో సాహిత్యం, సంగీతం తాలూకు మాటలు ఎక్కువ దొర్లేవి. ఆవిడ శ్రీపాద పినాకపాణి గూర్చి చెబుతూ ఉండేవారు ఎక్కువగా. “అయ్యో, రెండు వీధుల అవతల అందుబాటులో ఉండటాన ఆ మహానుభావుడి విలువ మనకు తెలియటం లేదు, నేను వీలున్నప్పుడల్లా ఆయన దర్శనం చేసుకుని వస్తూ ఉంటాను” అని చెప్పేవారావిడ.

నేను చదువుతున్నది పదవ తరగతే అయినప్పటికీ నాకు మెడికల్ స్టూడెంట్ ఒకాయన విజయ్ కుమార్ అనే అతను బాగా పరిచయం ఆ రోజుల్లో. ఒక సారి ఆయన మాటల మధ్యలో “మా ప్రొఫెసర్ గారు శ్రీపాద పినాకపాణి అనే ఆయనింటికి వెళుతున్నాను కొన్ని డవుట్స్ తీర్చుకోవటానికి” అని నన్ను కూడా తీస్కువెళ్ళాడు తనతో. లైబ్రరీయన్ సుభద్ర గారి మాటల ప్రభావం వల్ల శ్రీపాద పినాకపాణిగారిని చూడాలని నాకు కూడా చాలా కుతూహలంగా ఉండేది.

ఆయన గొప్పతనం ఏమీ తెలియకున్నా, ఆయన్ని దర్శించుకుని, దగ్గరగా కూర్చుని చాలా ఆనందించాను. తెల్లటి మేని ఛాయ, మృదువైన మాటతీరు చాలా నచ్చేశారు ఆయన నాకు.

సరే మళ్ళీ లైబ్రరీకి వద్దాం. అక్కడ బాషా అని ఒక ఆఫీస్ బాయ్ ఉండేవాడు, అతనికి తెలుగు సరిగ్గా రాదు. ఇతను శ్రీపాద పినాకపాణి గారి పేరు నోరు తిరగక, పీనేకాపానీ సాబ్ అని సంబోధించేవారు.

‘తొక్కిసలాటలో నలుగురి మృతి’ అని ఫుట్‌బాల్ మాచ్‌కి సంబంధించిన వార్త చదివి ఈ భాషా ‘ఆటల్లో కూడా చనిపోతారా’ అని ఆశ్చర్యపడ్డారు.

“ఆ దేశాల్లో ఫుట్‌బాల్ ఆటకి వేలం వెర్రి ఉంటుంది, ఓటమిని తట్టుకోలేక అలా కొట్లాడతారు” అని నేను చెప్పాను.

“అబ్బ ఫుట్‌బాల్ ఆట కాదు సర్. ‘తొక్కిసలాట’ అనే ఆటలో చనిపోయారు” అంటు నన్ను ఒక అజ్ఞానిని చూసినట్టు చూశాడు ఈ భాషావేత్త.

ఈ బీ క్యాంపు లైబ్రరీలో ఎక్కువ పుస్తకాలు ఉండేవి కావు.

ఒక నవల తీసుకు వెళ్ళి సాయంత్రానికల్లా పూర్తి చేసి, ఇంకో నవల కావాలని వెడితే సుభద్ర గారు విసుక్కునేవారు. “ఒక టోకెన్ పై రోజుకు ఒక నవలే తీసుకు వెళ్ళాలి, ఇలా రెండు మూడు ఇవ్వము. పైగా క్లాస్ పుస్తకాలు చదువుకోవాల్సిన వయసులో ఈ అలవాటు ఏమిటి నీకు” అని మందలించే వారు. చాలా సిగ్గేసేది నాకు.

నేను ఆ రోజుల్లో ఇరవై నాలుగ్గంటలూ రోడ్లపై సైకిల్ పై తిరిగినట్టే కనపడే వాడిని కొందరికి. ఎప్పుడు చూసినా ఇంటి పట్టునే ఉంటావే అని అనే వారు కొందరూ, ఎప్పుడు బుక్స్ చదువుకుంటూ ఉంటావే అనేవారు కొందరు ఇలా రకరకాలుగా కనిపించేవారిని అందరికీ ఆ రోజుల్లో. స్కూల్లో శనివారాలు నాటకాలు, ఎలక్యూషన్, తదితర కార్యక్రమాలలో పాల్గొనే వాడిని, శ్రద్ధగా టెక్స్ట్ బుక్స్ చదువుకునే వాడి లాగా మాత్రం ఎవ్వరికీ కనిపించేవాడిని కాదు ఇంతకు. కానీ నేను టెన్త్ క్లాస్ 79% తో పాస్ కావటంతో అందరూ నివ్వెరపోయారు.

1983-87 ప్రాంతాలలో – కడప:

ఈ లోగా నాన్నగారు రిటైర్ అవ్వటంతో కడపలో గాడిచర్ల రామారావు వీధిలో ఉన్న స్వంత ఇంటికి వచ్చి చేరుకున్నాము. ఇక్కడ కూడా చెన్నూరు బస్టాండ్ పక్కనున్న రామకృష్ణ మిషన్ వారి గ్రంథాలయంకి శ్రద్ధగా వెళ్ళేవాడిని. ఇక్కడ కూడా టేబుల్, కుర్చీలు చదువుకోవటానికి పేపర్లు తదితర ఏర్పాట్లు ఉండేవి. అదంతా కింది అంతస్తులో. పై అంతస్తులో మెంబర్స్‌కి పుస్తకాలు ఇంటికి ఇచ్చేవారు. మనం యథా ప్రకారం మెంబర్స్‌మి కద. పుస్తకాలు తెచ్చుకునేవారం.

కడపలో ఉన్నంత అరాచకం నేను ఎక్కడా చూడలేదు లైబ్రరీలలో. పేపర్స్ చింపుకొని పోతారు. పెన్ను తీస్కుని ఏవేవో బూతులు వ్రాస్తారు. పేపర్స్ పై ఉన్న ఫోటోలకి పెన్ను తీస్కుని గడ్డం, మీసం పెట్టి వినోదిస్తారు. ఇంత చెత్త లైబ్రరీని నేను పుట్టి బుద్ధెరిగిన తర్వాత చూడలేదు. ఇక్కడ లైబ్రరీకి అనుకూలమైన పరిసరాలు కూడా ఉండేవి కావు. బయటే చెన్నూర్ బస్టాండ్. నిత్యం వచ్చేబస్సు, పోయే బస్సులతో గోలగోలగా ఉండేది. ఆటో వాళ్ళ గోల, పల్లెటూరి ప్రజల అరుపులు ఇలా ఇది ఒక సంతలాగా ఉండేది. బస్సుకోసం ఎదురు చూసే జనాలు విశ్రాంతి తీస్కోవటానికి ఉపయోగించుకునే వారు ఈ రీడింగ్ రూంని. వారు న్యూస్ పేపర్లని ఇష్టా రాజ్యంగా చింపి పోగులు పెట్టే వారు. సిగరెట్, బీడీల ధూమంతో, అరుపులు గోలతో ఒక గందరగోళం వాతావారణం ఉన్నప్పటికీ ఇది ఒకప్రముఖ సాహితీ కేంద్రంగా భాసిల్లేది.

సాయంత్రాలు అయ్యేటప్పటికి సాహితీ సభలు, సన్మానాలు, పుస్తకావిష్కరణలు, పుస్తక పరిచయ సభలు బాగా జరిగేవి ఇక్కడ. ఈ లైబ్రరీలో చాలా సాహితీ సమావేశాలు జరిగేవి. దగ్గర్లోనే ఒన్ టవున్ పోలీస్ స్టేషన్ వెనుక, ప్రెస్ క్లబ్ అని ఉండేది. అక్కడ కూడా సాహితీ సమావేశాలు బాగానే జరిగేవి. ఈ ప్రెస్ క్లబ్ వెనుక, కడప కళా క్షేత్రం అనే ప్రాంగణంలో శ్రీ మధురాంతకం రాజారాం గారికి సన్మానం జరిగింది.

ఆ తరువాత ఆయన ఒక కథ వ్రాశారు “అసలు సన్మానం” అని. సాహిత్యం గూర్చి పెద్ద పరిజ్ఞానం లేని వారు, స్థానిక రాజకీయ నాయకుల వద్ద తమ పలుకుబడి పెంచుకోవడానికి, స్పాన్సర్లను సంపాయించుకోవడానికి ఇలా వివిధ కారణాల వల్ల ఎవరో ఒక ప్రముఖుడికి సన్మానం చేస్తారు. ఆ సభలో కవికి రచయితకి తేడా తెలియని వారు ఆయనకి సన్మానం చేస్తారు. కడపలో ఆయనకి ఏర్పడిన అనుభవాల దృష్ట్యా అనుకుంటా ఆయన ఈ కథ వ్రాశారు చమత్కారంగా.

సత్యాగ్ని గారు, శశిశ్రీ అనే కవులు తరచుగా తారసపడేవారు ఇక్కడ. వారు ఏమి వ్రాశారో తెలియదు కానీ ఎప్పుడు సాహితీ సభలనీ, సన్మానాలనీ పెద్ద ఎత్తున హడావుడి చేసేవారు. ఈ శశిశ్రీ గారు సాహిత్య నేత్రం అని ఒక పత్రిక కూడా నడిపేవారు.

వీరిద్దరితో బాటుగా జానమద్ది హనుమఛ్చాస్త్రి గారి హడావుడి కూడా ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో కడపలో. ఈ శాస్త్రిగారు సీపీ బ్రౌన్ లైబ్రరీ అని ఒక సంస్థని స్థాపించి వేమన వ్రాసిన అరుదైన తాళపత్ర గ్రంధాలని భద్రపరచారని చెప్పుకొనేవారు.

దురదృష్టవశాత్తు నాకు ఆ వైపుగా ఆసక్తి కలగలేదు. నేను ఎంతసేపున్న నవలలు చదవటం, కథలు వ్రాయటం ఇలా సాగిపోయేది.

ఇవన్నీ ఒకెత్తు అయితే సరస్వతీపుత్ర శ్రీమాన్ పుట్టపర్తి నారాయణా చార్యులు గారు సాక్షాత్తు మా ఎదురింట్లో ఉండేవారు. వారు ప్రతీ రోజు మాఇంటికి వచ్చి మా అమ్మానాన్నలతో కబుర్లు చెప్పి వెళ్ళేవారు. మా అమ్మానాన్నలు కూడా వారి ఇంటికి వెళ్ళీ కూర్చుని వచ్చేవారు.

పుంభావ సరస్వతి శ్రీమాన్ పుట్టపర్తి నారాయణచార్యులవారి ఒడిలో నాకు ఊహతెలియని వయసు నుంచే ఆడుకోగలగడం నా అదృష్టం. వీరి ఇంటికి అనేక ప్రముఖులు వచ్చి వెళ్ళేవారు. ఆల్ ఇండియా రేడియో కడప స్టేషన్ కి వచ్చే ప్రముఖులు.

కడపలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం శ్రీ రామకృష్ణా జూనియర్ కాలేజిలో చదివాను. ఈ కాలేజి ఆవరణలోని హైస్కూల్లో టీచర్ గా కూడా పని చేశారు శ్రీ పుట్టపర్తి వారు. అఫ్‌కోర్స్ నేను అక్కడ చేరేటప్పటికి వారు రిటైర్ అయ్యి చాలా సంవత్సరాలు అయ్యింది.

ఇక్కడ కూడా చాలా పెద్ద లైబ్రరీ ఉండేది.

ఆ తరువాత నేను చూసిన చెప్పుకోదగ్గ లైబ్రరీ ఆదోని డిగ్రీ కాలేజిలో ఉండేది. ఇది చాలా పెద్దది. ఇక్కడ బుక్స్ చాలానే ఉండేవి. కాకపోతే ఇక్కడ కేవలం సబ్జెక్ట్ బుక్స్ మాత్రమే ఇచ్చేవారు. మా అన్నయ్య ద్వారా ఆర్కే నారాయణ్ బుక్స్ తెచ్చుకుని చదివేవాడిని. ఈ రోజుల్లేనే కే ఏ అబ్బాస్ వ్రాసిన బుక్స్ చదివి భావుకత్వంతో నిండిన ఆ శైలిని, ఆ వేదనని చూసి అబ్బురపడేవాడిని.

1990-92 ప్రాంతాలు – కడప:

కథని మళ్ళీ కడపకు తీసుకు వస్తే ఈ విడతలో కడప వాసవి కన్యకాపరమేశ్వరీ ఆలయం వద్ద, ఆర్య వైశ్య సమాజం ద్వారా నడపబడుతున్న ఒక లైబ్రరీని కనిపెట్టగలిగాను.

ఇది చాలా చిన్నది అయినప్పటికీ, చాలా పద్దతిగా నడపబడేది. ఇక్కడ కూడా రీడింగ్ రూమ్, బుక్ షెల్ప్ లతో కూడిన గది ఉండేవి. బయట చిన్న హాల్లో, ఓ పద్దతి ప్రకారం తక్కువ స్థలం లో ఎక్కువ కుర్చీలు పట్టేలా అమర్చి రీడింగ్ రూం ఏర్పాటు చేశారు.

పాలు పోసి పాలు ఎత్తవచ్చు అన్నట్టుగా ఉండేది అక్కడి నీట్‌నెస్. ఈ రీడింగ్ రూంలోకి ఎంటర్ అయ్యే ముందు బయట చెప్పులు వదిలి లోపలికి రావాలి. లోపలికి రాగానే ఒక లెడ్జర్‌లో మన వివరాలు వ్రాసి ఇక కావాల్సినంత సేపు కూర్చుని చదువుకోవచ్చు. అక్కడ అన్ని దినపత్రికలు ఇంగ్లీష్, తెలుగులో లభించేవి. వాటిని చక్కగా స్టేపిల్ చేసి, ఏ పేపర్ నయినా ఒక సెట్ లాగా చదువుకొని పక్కన పెట్టేలాగా ఉండేది. ఏ పేజికి ఆ పేజి పీకి చదవటానికి లేదు. కడప రామకృష్ణ మిషన్ వారి ఆధ్వర్యంలోని లైబ్రరీ రీడింగ్ రూంకి దీనికి హస్తి మశకాంతరం అనేలా ఉండేది వాతావరణం. ఇక్కడ చక్కగా నిశ్శబ్దంగా, నీట్‌గా హాయిగా చదువుకుని రాగలం. ఎప్పుడైనా మనకు రెఫరెన్స్ కావాలంటే తారీఖు చెప్తే పాత పేపర్ తీసి ఇచ్చేవారు కూడా. అది కూడా చక్కగా మడత నలగకుండా ఉంటుంది. ఆర్య వైశ్యుల మేనేజిమెంట్ స్కిల్స్ పట్ల నాకు చాలా గౌరవం కలిగేది ఈ లైబ్రరీ చూశాక.

ఈ లైబ్రరీ రీడింగ్ రూంలో ఎక్కువ డిమాండ్ గల పత్రిక సితార. ముందుగా వెళ్ళంగానే సితార ఎవరి చేతిలో ఉందో చూసి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చదవంగానే నాకు ఇవ్వండి అని ఒక విన్నపం చేసుకోవాలి సైగల ద్వారా. అప్పుడు వారు అంతే నిశ్శబ్దంగా, సైగల ద్వారా దూరంగా కూర్చున్న ఇంకో వ్యక్తిని చూపేవారు. ఆయన అప్పటికే మనవంక అనుమానంగా చూస్తుంటాడు, మనం ఎక్కడ సితారని హస్తగతం చేసుకుంటామో అని. ఆయన వంక మనం చూడంగానే, ఆయన నవ్వి, ఇంకో మూల ఉన్న ఇంకో వ్యక్తిని చూపేవాడు. ఇలా ఒక వర్చువల్ క్యూ ఉండేది సితార కొరకు. ఆ చివరి వ్యక్తికి వీలయినంత దగ్గరగా కూర్చుని అతన్ని చూసి అప్పుడప్పుడు చిరునవ్వు చిందిస్తూ కూర్చుని, మనం ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ది వీక్, ఇండియాటుడే తెలుగు, ఇంగ్లీష్ తదితర మేగజైన్స్ చదివుకుంటూ కూర్చునే వాడిని.

అన్నట్టు ఈ లైబ్రరీలో సితార కన్న ఎక్కువ డిమాండ్ ఉన్న మరో పత్రిక ఉండేది. అది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వారి ప్రచురణ “స్క్రీన్” అనే పత్రిక. సినిమారీలు తాలూకు ముక్కలతో అక్షరాలు వ్రాస్తే ఎలాగుంటుందో అలాగుండేది ఆ టైటిల్ ఫాంట్. ఇది కూడా సినిమా పత్రికే, ఇంగ్లీష్‌లో వచ్చేది. ఇది వారపత్రికే కానీ, న్యూస్ పేపర్ సైజులో వచ్చేది. దీని నిండా ఫుల్ పేజిలో రాబోయే హిందీ సినిమాల తాలూకు అడ్వర్టైజ్‌మెంట్లు ఉండేవి. మనం కనీ విని ఎరగని సినిమా షూటింగ్ ముచ్చట్లు, ఆడియో రిలీజ్ ముచ్చట్లు, ముహూర్తం షాట్ తాలూకు ముచ్చట్లు ఇలా నానా కంగాళీగా ఉండేది. నాకెందుకో అంత నచ్చేది కాదు ఈ స్క్రీన్ పత్రిక.

ఆ తరువాత ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ విడిపోవడం గోయెంకా గ్రూప్, దినమణి గ్రూప్ ఇలా రెండు ముక్కలు అయ్యాక ఈ స్క్రీన్ పత్రిక క్రమంగా ప్రాభవం కోల్పోయింది అనుకుంటా.

ఆ తరువాత నేను ఉద్యోగ జీవితంలోకి ఎంటర్ అయ్యాక క్రమంగా ఈ లైబ్రరీలకి వెళ్ళటం తగ్గిపోయింది. ఆ తరువాత నేను టూర్లకి వెళ్ళినప్పుడు ఇండియా టుడే, అవుట్ లుక్, ది వీక్, ఫిల్మ్‌పేర్ తదితర మాగజైన్లు కొని చదవటం అలవాటు అయింది.

ఇక చివరగా కొసమెరుపు ఏమిటి అంటే, అప్పట్లో ఈ సెల్ ఫోన్లు లేకపోవడం వల్ల హాయిగా బోలెడు బుక్స్ చదవటానికి వీలయ్యేది. అన్ని బుక్స్ చదివానా నేను అని ఆలోచిస్తే, ఇదొక్కటే కారణం అని తెలుస్తుంది సెల్ ఫోన్, ఇంటర్ నెట్, ఓటీటీ వేదికలు లేకపోవడం వల్ల మాకు ఆ రోజుల్లో బోలెడు టైం దొరికేది. అది పుస్తకాలు చదవటానికి, పుస్తకాలు వ్రాసుకోవడానికి ఉపయోగపడేది.

స్వస్తి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here