గ్రేటిండియన్ కాన్యన్ – గండికోట

10
2

[dropcap]ఒ[/dropcap]క హారర్ కథ వ్రాయటానికి తగినంత ముడిసరుకు ఉన్న జ్ఞాపకం ఇది. ఏ లాజిక్‍కి అందని ఈ ఆనుభవాలు మీకు కూడా భీతి గొలుపుతాయి. దాదాపు అయిదారేళ్ళ క్రితం జరిగిన ఈ సంఘటనలు ఇప్పుడే జరిగినట్టు ఉంది నా మదిలో. అది తలచుకున్నప్పుడల్లా వెన్నులో ఏదో జర జర పాకినట్టు అవుతుంది.

ఈ అనుభవం కడప జిల్లా జమ్మలమడుగు దగ్గర గ్రేటిండియన్ కాన్యన్‌గా పిలవబడే గండికోటలో జరిగింది

మనకు కలిగే ప్రతి అనుభూతి – భయం, భీతి, ఆనందం, దుఃఖం, సాంత్వన, సంతోషం, ఉద్వేగం, ఉద్రేకం ఇలా అన్ని అనుభూతులకి కారణం మన మనసు అని మీరు ఒప్పుకుంటారు అని నాకు తెలుసు. ఆ రకంగా తీసుకుంటే ఇది మా మనసులకి కలిగిన భీతి మాత్రమే అని చెప్పవచ్చు. లాజిక్‌కి అందని ఆ సంఘటనలు కేవలం మా మానసికం అనుకుంటే బహుశా హేతువాదులు కూడా తృప్తి పడతారు అనుకుంటా. ఏది ఏమయినా భయం తాలూకు అనుభూతి నిలువెల్లా పొందాము.

ఉపోద్ఘాతం సరేనయ్యా, ఇంతకూ ఏమి జరిగింది అంటారా, అదిగో అక్కడికే వస్తున్నా.

వరుసగా శెలవులు రావటంతో కారేసుకుని కుటుంబంతో కలిసి ఓ సరదా ట్రిప్ ప్లాన్ చేశాను. నేను మా ఆవిడ లలిత, మా అమ్మాయి సంయుక్త, మా అబ్బాయి చింటూ మొత్తం నల్గురం.

* వేయి నూతుల కోన

* గండి క్షేత్రం

* గండికోట

* బేలూం గుహలు

* యాగంటి

ఇవన్నీ చూసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకోవాలి. ఇది ప్రణాళిక.

మొదట నేరుగా హైదరాబాద్ నుండి కడపకి వెళ్ళి రాత్రి అక్కడే బస చేసి, మరుసటి రోజు ఉదయాన్నే వీలయినంత త్వరగా వేయినూతుల కోన చేరుకున్నాము.

ఈ వేయినూతుల కోన కడప నుంచి ఒక ముప్ఫై కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇక్కడ బస చేసే సౌకర్యం లేదు. అడవి మధ్యలో కేవలం గుడి మాత్రమే ఉంది. అడవి లాంటి నిర్మానుష్యమైన ఈ ప్రదేశంలో పులులు వంటి క్రూరమృగాలు ఉంటాయని ప్రతీతి. సంవత్సరంలో ఒకసారి వైభవంగా జరిగే తిరుణాళ్ళలో తప్పిచ్చి మిగతా రోజులలో జనసమ్మర్ధం ఉండదు ఇక్కడ. పూజారి కూడా దగ్గర్లో ఉన్న పల్లెలో ఉంటారు. ప్రతి రోజు వచ్చి పూజాదికాలు చేసి తిరిగి పల్లెకి వెళ్ళి పోతారు. అందువల్ల అక్కడ బస చేసే ఆలోచన కూడా చేయకుండా కడపలో హోటల్లో దిగాము.

కరువుకి నిలయమైన కడప జిల్లాలో, మండుటెండల్లో సైతం చల్లగా ఉండే ప్రదేశం ఈ వేయినూతుల కోన.

అక్కడి ప్రకృతి ఒడిలోకి చేరుకుంటే అన్ని బాధలు మరచి పోవచ్చు. ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టు ఉండే బ్రహ్మాండమైన చల్లటి నీడనిచ్చే వృక్ష సంపద, తియ్యటి నీటి ధారలు వేయినూతుల కోన ప్రత్యేకత. వేయినూతుల కోన అనే పేరు ఊరికే రాలేదు. అక్కడ నిజంగానే పూర్వం వేయి బావులు ఉండేవట. ఇప్పుడు పుష్కరిణిలాంటి ఒకట్రెండు కోనేర్లు ఉన్నాయి. అక్కడ జలధారలు ఎంత ఎండకాలమైనా ఎండిపోవు. తియ్యగా చల్లగా ఉంటాయి అక్కడి నీరు.

అక్కడి అడవులలో వెదుక్కుంటూ వెడితే ఇప్పటికీ కొన్ని బావులు ఉంటాయని చెబుతారు అక్కడి పశువుల కాపర్లు. సరే ఏది ఏమైనా కొండల మధ్యలో చిట్టడవిలో ఉండే ఆ వేయినూతుల కోన నరసింహ స్వామి గుడి దర్శనం చేసుకుని మా ప్లాన్ లోని మొదటి మజిలీ విజయవంతంగా పూర్తి చేశాము.

ఆ మధ్యాహ్నం తిరిగి కారెక్కి అక్కడి నుండి ఓ ముఫై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గండి క్షేత్రం చేరుకున్నాము. అక్కడ శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయం ఉంది. ఇది మా రెండవ మజిలీ. ఇక్కడికి దగ్గరలోనే స్వర్గీయ వైఎస్సార్ గారి ఇడుపుల పాయ ఎస్టేట్ ఉంది.

ఆకాశాన్నంటే కొండలమధ్య నిశ్శబ్దంగా పారుతున్న ఇక్కడి పాపాఘ్ని నది, అద్భుతమైన ప్రకృతి రామణీయకత ఒకెత్తు, ఈ క్షేత్రం యొక్క పౌరాణిక ప్రాధాన్యత ఒకెత్తు. మూలవిరాట్టు గా ఉన్న ఇక్కడి వీరాంజనేయస్వామి విగ్రహం సాక్షాత్తు శ్రీరాములవారు తన బాణం కొసతో చెక్కారని స్థలపురాణం.

ఈ గండి క్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ టూరిజం డిపార్ట్మెంట్ వారి హరిత రిసార్ట్స్ చాలా బాగున్నాయి. మేము మరో ఆలోచన లేకుండా అందులో బస చేయటానికి నిర్ణయం తీస్కుని కాటేజి బుక్ చేసుకున్నాము. అక్కడి సౌకర్యాలు కూడా బాగున్నాయి. ఆ క్షేత్రంలో ఈ స్థాయి కాటేజి ఉండటం మాకు ఆశ్చర్యం కలిగించింది. చాలా ఏళ్ళ క్రితం ఈ క్షేత్రాన్నీ చూశాము. అప్పట్లో ఈ విధమైన ఆధునిక సౌకర్యాలు ఉండేవి కావు. ఈ మారు ఆహ్లాదకరమైన బస లభించింది.

ఆ విధంగా హరితా రిసార్ట్స్ వారి కాటేజి మీద సదభిప్రాయం ఏర్పడింది. ఇక్కడ ఒక రాత్రి బస చేసి, మరుసటి రోజు సాయంత్రం దాకా ఉండి మా మూడవ మజిలీ అయిన గండికోట వెళ్ళాలి.

ఆ గండికోటే మన కథకి కేంద్రబిందువు. అక్కడ మాకు ఎదురైన చిత్రమైన అనుభవాలు లేకుంటే కథ వ్రాసే పని ఉండేది కాదు.

దాదాపు నాలుగు నాలుగున్నర ప్రాంతాలలో ఈ క్షేత్రాన్ని విడిచి, ఇక గండికోట దారి పట్టాము. వాతావరణం కూడా ఆహ్లాదంగా ఉంది.

ఇక్కడి నుంచి గండికోట ఒక వంద కిలోమీటర్ల దూరం. వేంపల్లె – ఎర్రగుంట్ల మార్గంలో వెళ్తున్నాము. దారి మొత్తం చాలా బాగుంది. నల్లటి తారు రోడ్డుపై మెత్తగా సాగిపోతోంది కారు. వీరపునాయని పల్లి చేరేదాకా రహదారి యావత్తు ఎక్కే కొండలు, దిగే కొండలు అన్నట్టు ఉంది. కాకపోతే మరీ భయంకరమైన ఘాట్ రోడ్ అని చెప్పలేము కానీ త్రాచుపాము లాగా మెలికలు తిరుగుతూ చిన్న చిన్న గుట్టల్ని ఎక్కి దిగుతూ సాగిపోతోంది దారి.

నాకు ఎప్పుడు ఆశ్చర్యమేసే విషయం ఏమిటి అంటే కడప జిల్లాలో వెదకే కొద్ది కొండలు కోనలు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు కనిపిస్తాయి. ఓపిక చేసుకుని చూడాలే గానీ ఇక్కడ సినిమా షూటింగ్‌లు తీసుకోడానికి లొకేషన్లకి కొదవే లేదు.

ఇప్పుడు మనం వెళుతున్న గండికోట ఇలాంటి ప్రకృతి దృశ్యాలకు ఆలవాలం. ఇక్కడ పెన్నా నది రెండు ఎత్తైన కొండలను చీల్చుకుని ప్రవహిస్తుంది. ఈ దృశ్యాన్ని వర్ణించటానికి మాటలు చాలవు. దీన్ని ఇండియన్ గ్రాండ్ కెన్యన్ అంటారు. ఇటీవల ఇక్కడ మర్యాద రామన్న వంటి కొన్ని సినిమా షూటింగ్స్ జరిగాయట.

ఈ గండికోటలో పురాతనమైన కోట, మ్యూజియం, ఈ కొండలతో కూడిన ప్రకృతి దృశ్యాలు ఉంటాయి. తమాషా ఏమిటంటే, నేను ఈ విడతలో గండికోటను చూడనే లేదు. ఎప్పుడో నా చిన్నప్పుడు చూసిందే, పిల్లలకు, నా శ్రీమతికి చూపిద్దామన్న నా ఆలోచన నెరవేరలేదు.

మేము వెళ్ళడమైతే వెళ్తున్నామే కానీ ఆ రాత్రి అక్కడ బస చేయలేకపోయాము, ఆ గండికోటను చూడనూ లేదు. బస చేద్దామని మేము అక్కడకి చేరుకున్న తరువాత మాకు ఎదురైన భీతి గొలిపే అనుభవాల కారణంగా గండికోటను చూడకనే ఈ ట్రిప్ ముగిసింది.

భయంకరమైన అనుభవాల్ని మూటగట్టుకున్నాము ఈ విడత. ఏమిటి ఆ అనుభవాలు అంటారా, అక్కడికే వస్తున్నాను.

మా ప్రయాణం కొనసాగుతోంది. ఎర్రగుంట్ల చేరి, అక్కడ నుండి జమ్మలమడుగు దారి పట్టాము.

సాయంత్రం ఆహ్లాదంగా ఉంది.పెద్దగా ట్రాఫిక్ ఏమీ లేకపోవటాన, రోడ్డు కూడా బాగుండటం వల్ల వేగంగానే సాగుతోంది ప్రయాణం. ఇప్పుడు ఒక రోడ్ జంక్షన్ వచ్చింది.

ఇక్కడ ఎడమవైపు తిరిగితే గండికోటకి వెళ్ళే దారి, అలాగే నేరుగా వెళితే జమ్మలమడుగుకి వెళ్ళేదారి ఉన్నాయన్నమాట. మనం వెళ్ళవలసింది గండికోటకి కద, ఇకనేం, హాయిగా ఎడమ వైపుకి మలుపు తీసుకుని రోడ్డు వెంబడి కారు నడిపిస్తున్నాను. నాకు ఆ క్షణంలో ఏమాత్రం తెలియదు, ఇంకొన్ని గంటల్లో ప్రాణాలు అరచేత్తో పెట్టుకుని మేము జమ్మలమడుగుకి దారితీస్తామని.

ఇరుగ్గా ఉన్న ఆ సింగిల్ రోడ్ మీద కారు ముందుకు వెళుతోంది . ఆ దారి కేవలం గండికోటకి దారి తీస్తుంది. ఇంకెక్కడికీ వెళ్ళదు. అక్కడికెళ్ళి అవీ ఇవీ చూసుకుని తిరిగి అదే దారిలో వెనక్కు రావల్సిందే.

అప్పటికి సమయం దాదాపు ఆరున్నర అవుతూఉంది. చీకట్లు కమ్ముకోలేదు కానీ, సూర్యుడు పశ్చిమాద్రిన కుంగటం వల్ల వెలుతురు బాగా మందగించింది.

చుట్టూ ఎటు చూసినా రాళ్ళతో నిండిన కొండలు, గుట్టలు. ఎక్కడా చిన్న పచ్చటి చెట్టు అన్నది లేదు. మొత్తం బీడు పడిపోయిన భూములు, ఎడారి వంటి నేల.

నెమ్మదిగా వీస్తున్న గాలులు మాకు ఏదో సందేశం ఇస్తున్నట్టు తోస్తోంది.

మేము ఒక చిత్రమైన అంశం గమనించాము. మాకు ఎదురు వైపు నుండీ ఉండుండి కార్లు, టూరిస్టు వ్యాన్లు వరుసగా వస్తున్నాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా మాతో పాటు గండికోటకి వెళుతున్న వాహనాలు మాకు కనిపించలేదు.

మేము ముందుకు వెళ్ళే కొద్ది, అక్కడినుంచి వెనక్కు వచ్చేస్తున్న వాహనాలు జోరందుకున్నాయి. అది సింగిల్ రోడ్డు కూడానేమో, మా ప్రయాణవేగం బాగా మందగించింది. ఎదురు వైపు నుంచి వస్తున్న వాహనాలకు దారి ఇవ్వటానికి ఆ ఇరుకైన దారిలో బాగా ఇబ్బంది అవుతోంది.

మాకు ఆశ్చర్యం కలిగించిన విషయం అదే. అవి శెలవు రోజులే కద, ఎందుకు అక్కడ బస చేయకుండా అందరూ అలా మాట్లాడుకున్నట్టు ఒక్కుమ్మడిగా వెనుకకు వచ్చేస్తున్నారో మాకర్థం కాలేదు.

వాళ్ళలో కొందరు మా వంక ఆశ్చర్యంగా చూసినట్టు కూడా నాకనిపించింది. మా ఆవిడ పిల్లలకు చెప్పలేదు ఆ విషయం. సరే ఏమయితే అదయిందన్చెప్పిముందుకే వెళుతున్నాను.

క్రమంగా చీకట్లు ముసురుకున్నాయి.

అక్కడక్కడా జడలు విరబోసుకున్న దెయ్యాల్లా పెద్ద పెద్ద వృక్షాలు కూడా కనిపించాయి. అక్కడ నుంచి రావాల్సిన వాహనాలు అన్నీ వచ్చేశాయనుకుంటా ఇక వాహనాల రావడి తగ్గింది.

నెమ్మదిగా వీస్తున్న ఎదురు గాలులు కార్ వేగానికి విండ్ షీల్డ్ ని రాచుకుంటూ “గూ గూ గూ…” అని వింతగా చప్పుడు చేస్తున్నాయి.

ఎక్కడా జన సంచారం కనిపించడం లేదు.

దారంతా నిర్మానుష్యంగా ఉంది. కారు హెడ్ లైట్స్ ఎప్పుడు ఆన్ చేశానో నాకే తెలియదు. కార్ హెడ్ లైట్స్ పారినంత మేరకు రోడ్డు స్పష్టంగా కనిపిస్తోంది.

అమావాస్య దగ్గర పడ్డదనుకుంటా, ఎక్కడా చంద్రుడి జాడ లేదు.

“ఎందుకు నాన్నా ఎవ్వరూ కనిపించడం లేదు? ఇక్కడ మనకు క్షేమమేనా?” ఉన్నట్టుండి వెనుక సీట్ లో నుండి మా అమ్మాయి ప్రశ్నించింది. నేను ఒక క్షణం ఉలిక్కి పడ్డాను.

“ఏమి లేదమ్మా చిన్న ఊర్లు కద. ఇక్కడ ఇలాగే ఉంటుంది. డోంట్ వర్రీ. ఇంకెంత కొన్ని నిమిషాల్లో మనం గండికోటలో రిసార్ట్స్ చేరుకుంటాము” నాకు నేనే ధైర్యం చెప్పుకుంటున్నట్టు పీలగా మాట్లాడాను.

భార్యలకి సిక్త్స్ సెన్స్ ఇస్తాడు కద దేవుడు. నా గొంతులో తేడాని కనిపెట్టింది మా ఆవిడ. గేర్ రాడ్ పై ఉన్న నా చేతిని నెమ్మదిగా గిల్లింది. నేను తన వంక చూశాను,

“అంతా సవ్యంగానే ఉందా” అన్న అర్థం వచ్చేలా కను సైగ చేసింది.

నాకు తెలిసి ఏడిస్తే కద.

నేనేమి పలక్కుండా ఎక్కువ ఏకాగ్రతతో రోడ్డు వంక చూస్తూ కార్ నడపటంలో నిమగ్నమయ్యాను.

ఎదురుగా వాహనాలు రావడం పూర్తిగా ఆగిపోయింది, అంటే అక్కడ నుంచి చివరి యాత్రికుడు కూడా వచ్చేశాడన్నమాట.

కారు దీపాలు పడినంత మేరా మినహాయించి మొత్తం చీకటే. ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగ్గా అందటం లేదు.

ఈ లోగా ఎదురుగా ఏదో వాహనం వస్తున్న సూచనగా దీపం కాంతి కనపడింది. అది బాగా దగ్గరయ్యాక అర్థం అయింది ఒక ద్విచక్ర వాహనం అని, ఏదో కంపెనీ యూనిఫారం లాగా ఉన్న తెల్లటి దుస్తులు ధరించిన ఇద్దరు నడివయస్కులు ఒకే మోటార్ సైకిల్ పై కూర్చుని ఉన్నారు. వారు మా కార్ వంక కాస్త ప్రత్యేక శ్రద్ధతో చూస్తూ వెళ్ళినట్టు అనిపించింది నాకు.

మాకు ఎదురైన వాహనాలలో ఇక అదే చివరిది.

ఆ తరువాత ఒక పది నిమిషాల ప్రయాణం సాగింది. దారి కూడా గతుకుల మయంగా ఉంది. చుట్టూ చీకటి. ఒక విధమైన భీతిగొలిపేలాంటి వాతావరణం నెలకొని ఉంది. ఇది కారణం అని చెప్పటానికి ప్రత్యేకంగా ఏమీ లేనప్పటికీ, అందరి మనస్సులలో ఒక విధమైన భయం నెలకొని ఉంది అనిపిస్తొంది. అందరం మౌనంగానే ఉన్నాం.

చివరికి రిసార్ట్ రానే వచ్చింది. రోడ్డుకి ఎడమ వైపున ఉంది ఈ రిసార్ట్. ఇక్కడ ఆగకుండా అలాగే రోడ్డుపై ముందుకు వెళితే మ్యూజియం, కోట, గ్రాండ్ కెన్యాన్ లాంటి లోయల మద్యలో ప్రవహించే పెన్నా నది ఇవి వస్తాయని సూచించే బోర్డు ఒకటి సూచిస్తోంది.

స్పష్టంగా రిసార్ట్స్ అని వ్రాసి బోర్డ్ ఉండటం వల్ల ఆగాము కాని, అది ఒక రిసార్ట్ లాగా లేదు. ఏదో ఒక కోట లాగా ఉంది, దాని తాలుకు నిర్మాణం.

దాని తాలూకు ప్రహారి గోడ ఒక కోట గోడ లాగా నిర్మించారు. అంటే అది చరిత్రాత్మక ప్రదేశం కాబట్టి ఆ ఊరిపేరు గండికోట కావటం వల్ల అలా ఒక కోట గోడలాగా నిర్మించారనుకుంటా, వీరి కళాత్మకత తగలెయ్య అనుకున్నాను.

గేటు ముందు కారాపి హారన్ మ్రోగించాను. రెండో మోతకే గేట్లు తెరచుకున్నాయి.

హిందీలో తొలితరం హారర్ చిత్రం అయిన ‘వో కౌన్ థీ?’ సినిమాలో స్మశానం గేట్లు అవంతట అవే తెరచుకొని, హీరోయిన్ పాత్రధారి లోనికి వెళ్ళగానే, అవంతట అవే మూసుకుపోతాయి. ఎందుకో అసంకల్పితంగా ఆ దృశ్యం గుర్తు వచ్చింది.

గేటు దాటి లోనికి వెళ్ళింది లగాయతు ఒక గంట పాటు మాకుఎదురైన అనుభవాలు తలచుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. కారు గేటు దాటి లోనికి ప్రవేశించగానే, మా వెనుకే గేట్లు నెమ్మదిగా మూత పడ్డాయి. సెక్యూరిటీ గార్డ్ ఎవ్వరూ లేరు మరి.

కార్ నడుపుతూనే, అద్దంలో వెనుకకి చూస్తున్న నాకు వెన్నులో ఒకలాగా చలిపుట్టింది. గేట్ తలుపులు అవంతట అవే ఎలా మూసుకున్నాయో నాకు అర్థం కాలేదు.

లోపల అంత విశాలమైన పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అని నేను అసలు ఊహించలేదు. అది ఒక పెద్ద ఫుట్‌బాల్ గ్రౌండ్ లాగా ఉంది. కారును ఎక్కడ ఆపుకున్నా అడిగే వాడు లేడు. సునాయాసంగా ఓ యాభై అరవై కార్లు ఆపుకోవచ్చు.

పార్కింగ్ ప్లేసే కాక విశాలమైన పార్క్ లాంటి తోట, ఫౌంటెన్, ఊయలలు, పిల్లలు ఆడుకోవటానికి ఉపయోగపడే జారె బండ,సీసాలాంటి ఆట సామగ్రి అన్నీ అందంగా ఏర్పాటు చేయబడి ఉన్నాయి.

ఆ ఆవరణ అంతటా ఎక్కడికక్కడ చక్కగా విద్యుత్ దీపాలు అమర్చి ఉండటాన ప్రతి అంశం వివరంగా కనపడుతోంది. ఏర్పాట్లు బాగున్నాయి కద పిల్లలూ, అని అన్నాను వాతావరణాన్ని తేలిక పరుస్తూ.

అప్పటికే పదవతరగతి చదువుతున్న మా అమ్మాయి, కాస్తా తమాషా అయిన స్వరంతో “నాన్నా!” అంది కాస్తా గొంతు పెంచి, ‘జారే బండలు, సీసాలు ఆడే వయసా నాన్నా నాది’ అన్న అర్థంలో.

అందరం నవ్వేశాం.

ముందుగా పార్కింగ్ వైపుకు వెళ్ళకుండా రిసార్ట్స్ తాలూకు కార్యాలయం ముందు ఆపాను కార్. లగేజి అదీ దింపుకున్నాక కారుని నిలుపుకోవచ్చు ఒక వారగా అని.

లైట్లు పట్ట పగలల్లే వెలుగుతున్నాయి కానీ, నాకు ఒక్క మనిషి కూడా కనిపించలేదు.

కారులో కూర్చునే నేను నా ఎడమవైపునున్న వారి కార్యాలయం వంక చూస్తు ఉన్నాను. ఇంతలో నేను ఉలిక్కి పడేలా నా కుడి వైపున్న అద్దం మీద ఎవరో ‘టక్ టక్’ మని కొట్టిన ధ్వని వినిపించి తల తిప్పి చూశాను.

“గుడీవినింగ్ సర్. మధ్యాహ్నం వేంపల్లె గండి నుంచి ఫోన్ చేసింది మీరేనా? రండి రండి మీ పేరుతో కాటేజి రిజర్వ్ చేయబడి ఉంది” ఆయన మాటలు అస్పష్టం వినిపిస్తున్నాయి.

నేను అప్పుడు అద్దం దించాను.

ఆ వ్యక్తి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాడు నాకు. తెల్లటి రంగు పాంట్, షర్ట్, యూనీఫారం అనుకుంటా అది. మెడలో ఐడీ కార్డ్, చేతిలో సెల్ ఫోన్‌తో నవ్వుతూ ఉన్నాడు ఆ పొడవాటి వ్యక్తి.

“నేను గేట్ మూసి వచ్చేటప్పటికి కాస్త ఆలస్యం అయింది. రండి. రండి” అని ఆహ్వానించాడు.

నేను పార్కింగ్ ఎక్కడ చేయాలా అన్నట్టు అటూ ఇటూ చూస్తుంటే, “పర్లేదు రండి ఈ రాత్రికి ఇక్కడే ఉంచేయవచ్చు. ఎలాగూ ఎక్కువ రద్దీ లేదు కద” అన్నాడు

నేను డోర్ తీసుకుని కిందకి దిగి ఒక్క సారిగా ఒళ్ళు విరుచుకున్నాను. దాదాపు రెండున్నర గంటలుగా ఎక్కడా ఆపకుండా నడుపుకుంటూ వచ్చాను కద. కాస్తా హాయిగా అనిపించింది.

అంత రాత్రిలోనూ కడప జిల్లాకి సహజమైన వెచ్చటి గాలి ఒంటిని తాకింది. వెనుక బూట్ తెరిచి లగేజి దింపడం మొదలెట్టాము.

అనుకోని విధంగా అప్పుడు కరెంట్ పోయింది. ఒక్కసారిగా అంతటా నిశ్శబ్దం.

“ఛ! కుదురుగా ఓ రెండు గంటలు కరెంటు నిరంతరాయంగా ఉండదు కద” విసుక్కున్నాడు అతను.

“డోంట్ వర్రీ, సైలెంట్ జెనెరేటర్ ఉంది. ఇంకాసెపట్లో ఆన్ చేస్తాను” అతనే భరోసా ఇస్తున్నట్టు చెప్పాడు.

అంతా బాగుంది కానీ అక్కడ ఆయన, మేము తప్ప ఇతర మనుష్య సంచారమే కనిపించడం లేదు. చుట్టూ గాఢాంధకారం.

హైవే నుంచి దాదాపు పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఎక్కడో కొండల మధ్యన విసిరేసినట్టున్న ప్రదేశంలో, పెన్నా నదిపక్కన ఉన్న ఈ మారుమూల ప్రదేశంలో ఈ రాత్రి ఎలా గడవబోతోందో అని భయం వేసింది ఓ క్షణం.

రద్దీలేని రైళ్ళలో బస్సుల్లో రాత్రుళ్ళు ప్రయాణించేటప్పుడు ఇలాంటి అనుభూతి ఎవ్వరికైనా కలుగుతుంది. మన చుట్టూ ఉన్న వారు పరిచయం ఉన్నాలేకున్నా, భాష తెలిసినా తెలియకున్నా నలుగురి మధ్యలో ఉంటే మన మనసుకు అదో ధైర్యం.

ఉండబట్టలేక అదే అడిగేశాను అతన్ని, ‘ఎందుకిక్కడ అస్సలు ఎవ్వరూ లేర’ని.

“ఇక్కడికి వచ్చేది అంతా చుట్టు పక్కల ఊర్ల వాళ్ళే సర్. జమ్మలమడుగు, ప్రొద్దటూరు, యర్రగుంట్ల, ముద్దనూరు ఇంతే. మహా దూరం నుంచి అంటే ఎక్కువలో ఎక్కువ కడప, తాడిపత్రి, అనంతపురం నుంచి వస్తారు. అందరూ ప్లాన్ చెసుకుని వచ్చి రాత్రి లోపల వాళ్ళ వాళ్ళ ఊర్లకి వెళ్ళిపోతారు. మీలాగా దూరప్రాంతాలనుంచి వచ్చే వారే ఇక్కడ స్టే చేస్తారు”

నాకెందుకో అతని సమాధానం అంత రుచించలేదు.

“యాత్రికులు సరే, మీ మిగతా స్టాఫ్ సంగతి ఏమిటి?” అని అడిగాను.

క్షణంలో వెయ్యవ వంతు పాటు ఉలిక్కిపడ్డాడు అతను నా ప్రశ్నకి. అంతలోనే తమాయించుకుని,

“మీకు ఇందాక మోటార్ సైకిల్‌పై ఎదురు అయి ఉండాలే. వాళ్ళిద్దరూ ఇక్కడి అకౌంటెంట్, రెస్టారెంట్ సర్వర్. పెద్దగా రిజర్వేషన్స్ లేవు కద, వెళతాం అంటే నేనే పర్మిషన్ ఇచ్చి పంపించాను. ఇలా వర్క్ అడ్జస్ట్‌మెంట్ మామూలే మాకు ఇక్కడ, నా వర్క్ వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు ఒక్కోసారి” అంటూ నవ్వుతూ తత్వం బోధించాడు.

అంటే ఇక్కడీయన ఆల్ ఇన్ వన్ అన్న మాట ఈ రాత్రికి.

సెల్ ఫోన్‌లో టార్చి లైట్ ఆన్ చేసుకుని, నా సూట్ ఒకటి చొరవగా తీసుకుని మోసుకుంటూ వెళుతూ, ‘రండి రండి’ అంటు ముందుకు దారి తీశాడు.

అతను ముందు నడచుకుంటూ వెళ్తున్నాడు. మేము అతని వెనుకే నడచుకుంటు వెళుతున్నాము విశాలమైన ఆ కారిడార్ గుండా.

ఏ మాటకామాటే చెప్పుకోవాలి. చాలా పరిశుభ్రంగా ఉంది అక్కడి వాతావరణం. తోట కూడా చాలా శ్రద్ధగా నిర్వహింపబడుతోంది. ఎక్కడా ఏదీ తప్పు పట్టేటట్టు లేదు.

ఆయన ప్రవర్తన కూడా నాకు చాలా నచ్చింది. తాను మేనేజర్ అని ఆ రిసార్ట్స్ కి అతను హెడ్ అని అతని ఐడీ కార్డ్ ద్వారా అర్థమైంది. అయినా అతను ఏ భేషజం లేకుండా మా లగేజ్‍ని తాను తీస్కుని ముందు నడచుకుంటూ వెళుతున్నాడు. మేము తలా ఒక బ్యాగు అందుకుని ఆయన వెనుకే వెడుతున్నాం.

ఇంకో పదడుగులు వెళితే ఆఫీస్ రూం వస్తుందనగా అప్పుడు జరిగింది ఆ సంఘటన.

“ఓ మైగాడ్! నువ్వు కూడా చూశావా తమ్ముడు. అయాం రియల్లీ స్కేర్డ్. నాకు చాలా భయంగా ఉంది. ఇందాకా కార్ ఆగి ఉన్నప్పుడే నేను చూశాను. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను.”

వెనుకే వస్తున్న మా పిల్లలిద్దరూ గుస గుసగా మాట్లాడుకుంటున్నప్పటికీ నాకు స్పష్టంగా వినిపిస్తోంది వారి ఆ సంభాషణ. నేను ఆగి వారు చూస్తున్న దిశగా చూసి, నాకు కన్పించిన దృశ్యం చూసి అవాక్కాయ్యాను.

పార్క్ లో ఉన్న ఊయల ఎవరో అదృశ్య వ్యక్తి కూర్చుని ఊగుతున్నట్టు నెమ్మదిగా లయబద్దంగా ఊగుతోంది.

ఆ మేనేజర్ వెనుకకు తిరిగి చూడకుండానే , ముందుకు నడుస్తూనే చెప్పాడు. “నిన్ననే ఊయల తాలూకు బేరింగ్స్‌కి గ్రీజ్ వేసి, ఆయిల్ వేశాం సార్. అందుకే చిన్నపాటి గాలికే ఆ ఊయల ఊగుతూ ఉంటుంది”

నిజానికి అక్కడా ఆ క్షణంలో గాలి ఏమీ లేదు పెద్దగా, గాలి స్తంభించినట్టు అనిపించింది నాకు.

ఇక ఏమనటానికి తోచక అతని వెంబడి నడవసాగాము. నా పక్కనే నడుస్తున్న లలిత నా చేయి గట్టిగా పట్టుకుంది. ఆమె చేయి వణకడం నాకు స్పష్టంగా తెలుస్తోంది.

‘భయపడకు. ఏమీ అవదు’ సైగ చేశాను ఆమె వంక చూస్తూ. ఆ మసక చీకట్లో తన కళ్ళలో భయం నాకు స్పష్ణంగా గోచరించింది.

“రండి ఇదే ఆఫీస్ గది,” ఆయన ఓ గదిలోకి ప్రవేశిస్తూ చెప్పాడు

లోనికి వెళ్ళే ముందు తోటలోని ఊయల వంక చూశాను మరోసారి, తల తిప్పకుండానే, కను చివరల నుండి. ఇప్పుడు ఊయల ఊగడం లేదు. స్థిరంగా ఉంది. పిల్లలు కూడా నిశ్శబ్దంగా ఉన్నారు.

లగేజి ఒక వారగా పెట్టి, టేబుల్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాను. లలిత పిల్లలు అందరూ సోఫాలో కూర్చున్నారు.

అతను టార్చి లైట్ (అదే సెల్ ఫోన్) తాలూకు కాంతి సీలింగ్ మీద పడేలాగా ఏర్పాటు చేశాడు, ఎత్తైన షెల్ఫ్ మీద పెట్టి, టార్చ్ పెట్టి. ఎవ్వరి కళ్ళకూ నేరుగా కాంతి కిరణాలు గుచ్చుకోకుండా అలా ఏర్పాటు చేసిన అతని సెన్సిబిలిటీని అభినందించకుండా ఉండలేకపోయాను.

ఇప్పుడు విశాలమైన ఆ గది అంతటా కాంతి మంద్రంగా పరచుకుంటోంది.

అప్పుడు చూశాను తేరిపారా. అది ఒక పెద్ద రెస్టారెంట్. అనేక టేబుళ్ళు, కుర్చీలు చాలా క్రమ పద్దతిగా అమర్చబడి ఉన్నాయి. ప్రతి టేబుల్ పై చక్కటి క్లాత్, చిన్న ఫ్లవర్ వేజ్, ప్రతీ వేజ్‌లో తాజా పుష్పాలు. ఆ టేబుళ్ళు, కుర్చీలు కూడా చాలా ఖరీదైనవిగా తోచాయి.

మేము కూర్చున్న ఆఫీస్ రూం లాంటి గది ఏదైతే ఉందో, అది ఆ రెస్టారెంట్‌కి కౌంటర్ గానూ, కాటేజిలకి ఆఫీస్ రూంగానూ కూడా ఉపయోగపడుతోంది. చిత్రమైన ఏర్పాటు. నవ్వుకున్నాను చిన్నగా.

అ విశాలమైన డైనింగ్ హాల్‍కి ఆ చివర వంటగది అనుకుంటాను, అందులో గ్యాస్ స్టవ్ వెలుగుతూ కనిపించింది. ఆ వంటగది వైపు వీపు చేసి కూర్చున్న అతనికి వంటగది కనిపించే అవకాశం లేదు.

నాకు ఒక్క సారిగా నోట్లో తడారి పోయింది. ఆ వంటింట్లో తెల్ల చీర కట్టుకుని ఓ ఆడమనిషి అటు ఇటూ తిరుగుతూ నాకు ఛాయామాత్రంగా కనిపించింది. అమె వెంబడే ఓ ఆరేడేళ్ళ కుర్రాడు కూడా ఉన్నాడు.

“మీ ఫామిలీ ఇక్కడే ఉంటారా?” నేను వీలయినంత కాజువల్‌గా ప్రశ్నించాను అతన్ని.

“భలే వారు. నా ఫామిలీ ఇక్కడ ఉండటం ఏమిటి సార్. మా వాళ్ళందరూ జమ్మలమడుగులో ఉంటారు. ఇదిగో ఈ లెడ్జర్‌లో మీ వివరాలు వ్రాసి సంతకం పెట్టండి, మీ కాటేజి తాళం తెరిచి వస్తాను, వస్తూ వస్తూ జెనరేటర్ ఆన్ చేసి వస్తాను” అని నా ముందుకు లెడ్జర్ తోసి, అతను లేచి నిలబడ్డాడు.

నేను ఒక సారి ఇందాకటి వంటగది వంక చూశాను. అక్కడ చిమ్మచీకటి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్‌లో ఉన్నట్టేమీ కనిపించలేదు.

“అది…. అది… కిచెనా? ఆ…మూల?” ఒక్కో పదం కూడబలుక్కుంటూ పలికాను ఇందాకటి గదిని చూపిస్తూ.

“అవును సర్, భలే కనిపెట్టారే. ఇది వరకు వచ్చారా ఈ రిసార్ట్స్‌కి?” నేను అతని మాటల్ని పట్టించుకోకుండా, చప్పున లేచి నిలబడి, నా సెల్ ఫోన్ లో టార్చి లైట్ ఆన్ చేసుకుని వింటినుంచి విడిచిన శరంలాగా ఆ కిచెన్ దిశగా అడుగులు వేశాను.

“ఇక్కడ మీరు తప్ప ఇంకెవ్వరూ లేరా… ఆర్ యూ ష్యూర్?” అని ప్రశ్నిస్తూ, కిచెన్ వద్దకు చేరుకున్నాను.

అక్కడంతా చీకటిగా ఉంది. లోపల ఎవ్వరూ లేరు. నాకు ఇందాక కనపడ్డ గాస్ స్టవ్‌ని తాకి చూశాను. చల్లగా ఉంది. ఆ గది మొత్తం టార్చ్ వేసి చూశాను. అక్కడ ఎవ్వరూ లేరు. అక్కడి నుంచి బయటకి వెళ్ళటానికి వేరే ద్వారం కూడా ఏమీ లేదు.

“ఏమయ్యింది? ఎందుకలా కంగారు పడుతున్నారు” నా చెవి పక్కగా అతని ప్రశ్న వినిపించింది.

నేను తేరుకుని “ఇందాక ఇక్కడ ఎవరో స్త్రీ సంచరిస్తూ కనిపించింది” అనేశాను చప్పున.

“భలేవారు సర్. మీరు చాలా దూరం డ్రయివ్ చేస్తూ రావడం వల్ల అలసటతో ఏదో భ్రమకి గురయి ఉంటారు. మీ కాటేజి తాళం తీసి వస్తాను, డిన్నర్ కూడా సిద్ధంగా ఉంది, మీరు రిఫ్రెష్ అయి వస్తే డిన్నర్ చేసి విశ్రాంతిగా పడుకోవచ్చు.”

మేము తిరిగి కౌంటర్ వద్దకు వద్దామనుకుంటుండగా అప్పుడు వినిపించింది కేక. దిక్కులు పిక్కటిల్లేలా, చెవులు చిల్లులు పడేలా. అది మా అమ్మాయి సంయుక్త కంఠం. నాకు ఒక్క సారిగా ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది.

వేగంగా కిచెన్లోంచి బయటపడి, కౌంటర్ దాటి, వెయిటింగ్ రూంలో సోఫా దాటి, కేక వినిపించిన దిశగా ఆఫీస్ రూంలోంచి బయటపడి, ఒక్క అంగలో చేరుకున్నాను.

ఇందాకా మేము కారు దిగి నడుచుకుంటూ వచ్చిన కారిడార్‍లో నిలబడి వణికిపోతూ నిలుచుకుని ఉంది సంయుక్త. తన పక్కనే ఇంచుమించు అదే పరిస్థితిలో నిలబడి ఉన్నాడు మా చిన్న అబ్బాయి.

రూంలో షెల్ఫ్ పై అమర్చిన టార్చ్ తాలూకూ కాంతి రూఫ్‌పై పడి, ఏటవాలుగా పరావర్తనం చెంది పడుతోంది సంయుక్త మొహం మీద. ఆమె మొహంలో స్పష్టంగా భయవీచికలు కదలాడుతున్నాయి.

నాతోబాటే పరిగెత్తుకుంటు వచ్చిన లలిత పిల్లలిద్దర్నీ పొదివి పట్టుకుంది

 “ఏమయింది పిల్లలూ, అసలు మీరు బయటికి ఎప్పుడు వచ్చారు?, నేను కిచెన్ వైపుకెళ్ళిన మీ నాన్నాగారిని చూస్తు కూర్చున్నాను. ఇంతలో మీరు బయటికి ఎప్పుడు వచ్చారు, అసలు ఏమయింది మీ అందరికి, ఎందుకిలా చేస్తున్నారు?” కంగారులో ఏదేదో మాట్లాడేస్తోంది లలిత.

“అమ్మా! ఎవరో ఒక ఆంటీ తలుపు దగ్గర నిలబడి మమ్మల్ని చూసి చిరునవ్వు నవ్వుతూ పిలిచింది. చాలా చక్కగా ఉంది ఆ ఆంటీ, మేము దగ్గరకి వెళ్ళంగానే ఊయల వంక చూపుతు ‘రండి ఊయల ఊగుదాం’ అన్నట్టు సైగ చేసింది. సరే ఎలాగూ మీరు బిజీగా ఉన్నారు కద, కాసేపు వెళ్ళి ఊయల ఊగి వద్దాం అని మేము తన వెనుక వెళుతున్నాము. ఇంతలో మా ముందు వెళుతున్న ఆ ఆంటీ క్రమక్రమంగా ఒక పొగలాగా మారి పోయి గాల్లో కల్సి పోయింది. మాకు కాసేపు అసలు ఏమి అర్థం కాలేదు. ఏమి జరుగుతోందో. ఎందుకో సడన్‍గా భయం వేసింది. అంతే. అప్పుడు అరిచాను” భయంతో నిలువెల్లా వణికిపోతూ చెబుతోంది సంయుక్త.

‘అవున’న్నట్టు తలూపాడు చిన్నవాడు.

ఇంతకూ ఈ మేనేజర్ ఎక్కడ అని చూస్తే అతను ఎక్కడా కనిపించలేదు.

మేమిక క్షణం ఆలశ్యం చేయకుండా లగేజిని అందుకుని వింటినుంచి సంధించిన బాణాల్లా కారు దగ్గరకి పరిగెత్తుకుంటూ చేరుకున్నాము.

‘గూ…గూ…గూ…’ అని గాలి ఊళలు చేస్తూ వింత ధ్వనులు చేస్తోంది.

గార్డెన్ లో ఉన్న చెట్లన్నీ దెయ్యం పట్టినట్టు ఊగిపోతున్నాయి. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఆకాశం ఒక్క క్షణంలో మబ్బులు కమ్ముకుని, లేజర్ బీం తో ఏదో వింత శక్తి ఆకాశాన్ని నిలువెల్లా చీరేస్తున్నట్టు విపరీతంగా మెరుపులు మొదలయ్యాయి.

కార్‍ని ఎలా రివర్స్ చేసుకున్నానో ఎలా గేట్ దాకా వచ్చానో నాకే తెలియదు.

ఇంతలో జోరుగా వర్షం మొదలయ్యింది.

వర్షానికి తోడు, ఎవరో పిచ్చివాడు మన మీదకి రాళ్ళు విసిరినట్టు జోరుగా పెద్ద పెద్ద వడగళ్ళు కూడా కురవడం మొదలయ్యింది. గేట్ దాకా వచ్చి, కార్ దిగి వడగళ్ళు నా నెత్తిన పడకుండా తలపై ఒక సూట్ కేస్ పెట్టుకుని వెళ్ళీ గేట్ తీశాను. చిలుము పట్టి పోయినట్టు ఉన్న ఆ పెద్ద గేటు తెరవడం నాకు ఒక పట్టాన కుదరలేదు. అతి కష్టం మీద గేటు తీసుకుని , కారు బయటకి తెచ్చేశాను.

రోడ్డు మీదకు వచ్చాక ఓ ఎద్దుల బండి అడ్డొచ్చింది. అది సింగిల్ రోడ్ కావడంతో అతి తక్కువ వేగంతో దాని పక్కన వెళ్ళాల్సి వచ్చింది. బండిపై ఉన్నఎవరో ఇద్దరు వ్యక్తులు మా కార్ వంక ఆశ్చర్యంగా చూస్తూ “ఈ పాడు బడిన బంగళాలోకి ఎందుకెళ్ళారో వీళ్ళు?” అని గట్టిగా అనుకుంటున్న మాటలు నా చెవిన పడకపోలేదు.

కారు ఆపి అదేమిటి అలా అనేశారు అని నేనేమీ అడగదలచుకోలేదు.

కారుని శరవేగంతో ఉరికిస్తున్నాను. మామూలుగా నా పక్క సీట్లో కూర్చునే మా ఆవిడ ఇప్పుడు పిల్లలిద్దరికి భరోసా ఇవ్వటానికన్నట్టు వెనుక సీట్లో మధ్యలో కూర్చుని పిల్లలిద్దర్నీ పొదివి పట్టుకుంది. ఎవ్వరం ఏమీ మాట్లాడుకోవడం లేదు.

వర్షం భయంకరంగా కురుస్తూనే ఉంది. కుండపోతగా కురుస్తున్న వర్షం ధారలు భూమిని ఆకాశాన్నిఅనుసంధానిస్తున్నాయి. పెద్ద చప్పుళ్ళతో ఉరుములు మెరుపులు తెరిపి లేకుండా భయపెడుతున్నాయి.

ఆ చీకటి రాత్రి వర్షంలో, చెట్టూ చేమ ఏమీలేని ఎడారి లాంటి ఆ రాతి భూమి పై, తాచుపాములా మలుపులు తిరుగుతున్న రోడ్డు వెంబడి ఎలా కార్ నడుపుకుంటూ వచ్చానో, ఎలా జమ్మలమడుగు చేరుకున్నామో నాకే తెలియదు.

జమ్మలమడుగు చేరేటప్పటికి రాత్రి తొమ్మిదిన్నర అవుతూ ఉంటుంది. అసలే చిన్న ఊరు, అందులో పెద్ద వర్షం. రహదారులు అన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి.

లాడ్జ్ అన్న బోర్డ్ కనపడితే ఆపాను కార్.

అది చాలా చిన్న లాడ్జి.

***

“ఇంకో రెండు కిలోమీటర్లు వెళితే చక్కగా హరితా రిసార్ట్ వస్తుందిగా. ఆ పాడు బడిన బంగళాలోకి ఎందుకెళ్ళారు?” లాడ్జ్ ఓనర్ ఆశ్చర్యంగా అడిగాడు.

“రాత్రి మీరు వచ్చిన పరిస్థితిలో మిమ్మల్ని ప్రశ్నలతో ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక ఊరుకుని ఇప్పుడు అడుగుతున్నాను. అసలు మీకు కొన్ని సంగతులు చెప్పాలి”

మరుసటి రోజు ఉదయాన్నే లాడ్జి బాల్కనీలో నేను ఆయన టీ త్రాగుతూ మాట్లాడుకుంటున్నాము. లలిత, పిల్లలు గదిలో ఆదమరచి నిద్రపోతున్నారు ఇంకా.

నేను ఆయన టీపాయ్‍కి అటు ఇటూ ఎదురెదురుగా కూర్చుని ఉన్నాం. మా మధ్యలో పొగలు కక్కుతున్న టీ కెటిల్, కప్పులు. టీ సిప్ చేస్తూ ఆయన మాటలు వింటుండి పోయాను.

మా కార్యక్రమం ప్రకారం మా కుటుంబం ఇంకో రెండు గంటలలో బెలూం గుహలు చూట్టానికి బయలుదేరాలి. కానీ నేను వాళ్ళను హడావుడి పెట్టదలచుకోలేదు.

ఆయన కొనసాగించాడు.

“మీరు చెప్పిన ఆనవాళ్ళను బట్టి రాత్రి మీరు వెళ్ళిన ఆ పాడుబడిన భవనం ఒకప్పుడు పేరుమోసిన ఒక ప్రయివేట్ రిసార్ట్స్. రెండేళ్ళ క్రితం అనుకోకుండా జరిగిన ఓ పెద్ద అగ్ని ప్రమాదంలో చాలా మంది చనిపోయారు. ఆ రిసార్ట్స్‌ని తరువాత ఎవ్వరూ పునరుద్ధరించలేదు. అది క్రమంగా పాడుబడిపోయింది. మీకు క్రితం రాత్రి జరిగినలాంటి అనుభవాలు కొద్ది మంది యాత్రీకులకు జరిగాయి. చిత్రమేమిటంటే వాళ్ళెవరు బ్రతికి బయటపడలేదు. మరుసటి రోజు తెల్లవారాక ఆ కాంపౌండ్ లోకి కార్లు ఎందుకు వెళ్ళాయా అని చూడ్డానికి వెళ్ళీన వారికి అక్కడ ఆ యాత్రికులు విగతజీవులై కనపడ్డారు. వారు చనిపోయే ముందు వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన అనుభవాలు మీ అనుభవాలని పోలి ఉన్నాయి. మీరు అదృష్టవంతులు అని చెప్పవచ్చు.”

నేను మౌనంగా వింటుండి పోయాను. బహుశా మేము వేంపల్లె గండి క్షేత్రంలో ఆంజనేయస్వామిని దర్శించుకుని వెళ్ళటం వల్లనూ ఆ రక్ష దారం మా చేతికి ఉండటం వల్లనూ ఏమీ కాలేదు అనుకుంటా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here