గుబాళించిన మల్లెలూ – మొల్లలూ

0
2

[box type=’note’ fontsize=’16’] ఒడియా భాషలో గాయత్రీ షరాఫ్ గారు రచించిన కథని ‘గుబాళించిన మల్లెలూ – మొల్లలూ’ అనే పేరుతో తెలుగులో అందిస్తున్నారు డా. తుర్లపాటి రాజేశ్వరి. [/box]

తళతళలాడుతున్న ఉదయపు ఎండ!

తిని పారేసిన ఎంగిలి విస్తరాకులు, దొన్నెలు, తాగి విసిరేసిన సారాగ్లాసులు, పాకెట్లు, చెల్లా చెదరుగా పడి ఉన్న మాతా శిశు సంరక్షణా కేంద్రం – అదే అంగన్‌వాడీ కేంద్ర పోస్టర్. కొందరు ఈ జాగా అడ్డాగా చేసుకుని వాళ్ళ కార్యకలాపాలు దర్జాగా కొనసాగిస్తున్నారు. ఈ జాగా వాళ్ళ తాత ముత్తాతల సొత్తన్నట్టుగా ఉంటుంది వారి వ్యవహారం. ఎవరు వారిని అడ్డకుంటారు? వద్దని ఎవరైనా వారిస్తే వాళ్ళు మాటని లెక్క జేస్తారా? చేతిలో సారా గ్లాస్ ఉంటే వాళ్ళకి వంటి మీద తెలివే ఉండదు – వాళ్ళు ఈ గ్రామానికి రాజులమన్నట్లు ప్రవర్తిస్తారు.

ఇంతకీ అది ఊరికే సిమెంట్‌తో నిర్మించిన వరండా కాదు. దానికొక ప్రత్యేకత ఉంది. ఊళ్ళో దేవాలయం, మఠంలాగా! ఇక్కడ కూడా పూజ, అర్చన రెండూ జరుగుతాయి. మానవ పూజ – సేవ! ఆ మానవ పూజా సేవా ఓంకారనాదం ఇక్కడ వినవస్తుంది. ఆరోగ్యకరమైన, మంచి జీవనం కోసం దీపం వెలిగిస్తారు. తేజస్సు కోసం మంత్రాలు చదువుతారు. చిన్న పిల్లల చిరునవ్వుల్లో అమృతధారలు వర్షిస్తాయి. రెండు గదులూ, ఒక వరండా – ఆ చిన్న ఇల్లే – అంగన్‌వాడీ కేంద్రం. గ్రామంలో స్త్రీల శిశువుల ఆరోగ్యాన్ని సంరక్షించే ఆశాదీపం.

తాగుబోతులకి కేంద్రం గోడల మీద రాసిన దేమిటో బాగానే తెలుసు – అయితే వారు ప్రభుత్వ భవనం, అందులో ఉన్న సామాగ్రి తమ అమ్మ బాబుల ఆస్తిలాగా భావిస్తున్నారు. వరండా గోడల మీద అంటించిన పోస్టర్లు కూడా పకోడీలు, గారెలు ఇత్యాది తిండి పదార్థాలు తినటానికి చించి ముక్కలు చేస్తారు. అక్కడే పొగ తాగటం, సారా తాగి, నానా గోలా చేస్తూ తాము మగవాళ్ళమని ఎవరూ ఏం చేయలేరని – విర్రవీగుతున్నారు.

ఊరి జనాలు అంతా చూస్తూ ఉంటారు. ఎవ్వరూ నోరు విప్పరు. తాగుబోతులు గోల చేసేది ప్రభుత్వ భవనంలో కదా! ఏదైనా ఉంటే కేంద్రం ఉద్యోగులు చూసుకోవాలి. బహుశః ఇదే గ్రామస్థుల ఆలోచన కావచ్చు. లేకపోతే చూస్తూ ఎలా ఊరుకుంటున్నారు? కల్పించుకుంటే గొడవ ఎక్కువై పొగ రాజుకుంటుంది.

ప్రతిరోజూ సరిగ్గా తొమ్మిది గంటలకు ఆ అమ్మాయి వొస్తుంది. ఆ రోజు కూడా అలాగే వచ్చింది. సైకిల్ దిగుతూనే వాళ్ళు అక్కడ ఉంటడం గమనించింది. వారి వంక క్రీగంట చూస్తూ సైకిల్‌ని రెండు మెట్లు ఎక్కించి వరండా మీదకి తెచ్చింది. ఎక్కడ ఉంచాలా అని అటూ – యిటూ చూసింది. వరండా అంతా ఆక్రమించుకున్నారు. “కొంచెం జరగండి – సైకిల్ ఉంచుతా” అనటం బాగుండదు. వాళ్ళు నోరు తెరిస్తే బూతులే! వినే వాళ్ళు చెవులు మూసుకోవాలి. అయ్యో – ఎందుకు చెప్పానూ… అని బాధపడాలి. మెల్లిగా జాగా చేసి సైకిల్‌ని పెట్టింది. పరిస్థితి ఇలాంటిది… కాస్త సిగ్గు పడుతూ చున్నీ సవరించుకుని, వరండా దాటి ఇవతలికి వచ్చింది. ఆఫీస్ తాళం తీస్తుంటే స్వాగతం చెబుతున్నట్లు చెట్టు మీద నుంచి రెండు ఆకాశమల్లి పూలు రాలి పలకరించాయి.

భవన ప్రాంగణంలో ఉన్న చెట్టు పెద్దది. ఆకులు తక్కువ,  పూలు ఎక్కువ. చెట్టు నవ్వుతున్నట్టే ఉంటుంది. ఆ పూల సువాసన సారావాసన కంటే ఘాటుగా, మత్తుగొలిపేటట్టు ఉంటుంది. అమ్మాయికి ఆ పూలంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయి కోసమే చెట్టు తన పూలని రోజూ పంపుతుంది. పువ్వు చేత్తో పట్టుకుని వాసన చూసింది. తాళం చేత్తో పట్టుకుని, తలుపు తెరిచి లోపలికి వెళ్ళింది. వెళ్ళే ముందు ఓసారి వరండా వైపు చూసింది. వాళ్ళు ఇంకా ఉన్నారా? వెళ్ళారా? – లేదు, రాజుల్లాగా కూచున్నారు. టేబుల్ కొద్దిగా సర్ది పూలని ఉంచింది. అసిస్టెంటు (సహాయకురాలు) పోస్టు కొన్ని నెలలుగా ఖాళీ ఉంది. అమ్మాయే చీపురు చేత్తో పట్టుకొని రెండు గదులూ ఊడ్చింది. టేబుల్ మీద రిజిస్టర్, ఫైల్, కాగితాలు సరిగ్గా అన్నీ అమర్చింది. వెయిట్ చూసే మెషీన్ గుడ్డతో తుడిచింది. ఫాన్ స్విచ్ వేసి కుర్చీలో కూర్చుంది. అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం చేసింది. దినచర్య మొదలెట్టింది. వరండాలో వాళ్ళు మాట్లాడుకునే మాటలేవో విన్పిస్తూనే ఉన్నాయి. తాగి వళ్ళు తెలీని స్థితిలో – ఏవో వాగుతున్నారు! కళ్ళ నెత్తికెక్కి ఉంటాయెప్పుడూ. ఎందుకంత గర్వం? ఆడవాళ్ళు వచ్చే తోవ వంక చూసింది. వాళ్ళు వస్తే ఏదో ఒకటి చెయ్యెచ్చు. వారే తన శక్తి! ఆమె తన శక్తినీ, తాగుబోతుల శక్తినీ బేరీజు వేసుకుంటోంది.

ఏ అమ్మాయి గురించి చెబుతున్నామో ఆ అమ్మాయి పేరు రశ్మి. ప్రభుత్వ కాగితాల్లో అమ్మాయి పేరు రశ్మి ప్రభానియాల్. వయసు ఇరవై రెండు! పొడుగ్గా, సన్నగా, చామనచాయ రంగులో ఉంటుంది.

పెద్ద సంఖ్యలో ఇంటర్వ్యూకి హాజరయ్యారు అమ్మాయిలు. సరైన జవాబులతో వారిని మెప్పించి ఈ ఉద్యోగం సాధించింది రశ్మి. ముక్కు సూటిగా మాట్లాడే తత్వం. సరళస్వభావం! ఈ గ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంకో గ్రామం నుంచి సైకిల్ మీద వస్తుంది. ఠంచనుగా టైమ్‌కి రావటం – వెళ్ళటం – క్రమశిక్షణ పాటిస్తుంది. పద్ధతిగా పని చేస్తుంది. ఊరి విశేషాలన్నీ తెలుసుకుంటుంది. ఊళ్ళో ఉన్న మహిళల, గర్భిణీ స్త్రీల, శిశువుల, రోగాల – బాగోగులు విచారిస్తూ చేతనైన సాయం అందిస్తుంది. నిజానికి అన్నీ ఆమె సేవా కార్యక్రమాలలోకి రావు. అయినా – అలా ప్రవర్తించటం ఆమె నైజం. పెద్దలని గౌరవించి – వారిని చూడగానే చేతులు జోడిస్తుంది.

తను వచ్చాక ఈ కేంద్రానికి ఆక్సిజన్ సమకూరినట్లుయింది. సరిగ్గా పని చేయటం జరుగుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న మహిళలు – అందరూ కేంద్రానికి రావటం మొదలెట్టారు. కేంద్రానికి రాకపోకలు చేస్తూ – మెల్లిగా తమని గూర్చి తాము తెలుసుకోవటం ప్రారంభించారు. జీవితాన్ని గూర్చి ఆలోచించటం – కలలు కనటం ఆ గ్రామీణ స్త్రీల అనుభవంలోకి వచ్చాయి.

ఇచ్ఛాపురం గ్రామంలో మహిళామండలి తన సూచనలతో – ముందుకు నడవటానికి ప్రయత్నిస్తోంది. గ్రామంలో స్త్రీలందరూ ఒకరిని గూర్చి ఒకరు తెలుసుకున్నారు. సుఖదుఃఖాలు పంచుకున్నారు. ఆత్మీయులయ్యారు. తమ శక్తి యుక్తుల గూర్చి, హక్కుల గురించి మాట్లాడుకుంటున్నారు. స్త్రీల జీవితాలలో చీకట్లను పారద్రోలటానికి చైతన్యదీపం ఒకటి వెలిగించారు.

మగవారిలో ఏ మార్పూ లేదు. వారి ఆలోచనాసరళి అలాగే ఉంది. మరి ఈ తాగుబోతులు సరేసరి. తాగుబోతుల నడతని సరిదిద్దేదెవరు? వారి యిష్టాయిష్టాలని ప్రశ్నించేదెవరు? మగవాళ్ళెవరూ వారిని మార్చటానికి, ఆ బాధ్యత నెత్తికెత్తుకోవటానికి సిద్ధంగా లేరు. తాగుబోతుల ఆగడాలు రకరకాలు! ఊళ్ళో మహిళలని, శిశువులని అవమానిస్తారు. ఎవరైనా అమ్మాయిలు పసుపు చీర కట్టుకుని వెళుతుంటే ఆమె వెనగ్గా నడుస్తూ “ఇదుగో పసుపు కొమ్మురోయ్!…” అని అరుస్తారు. ఎవరైనా అమ్మాయిలు క్లిప్ పెట్టుకుంటే “ఇదిగిదుగో క్లిప్ అమ్మాయి” అంటూ ఏడిపిస్తారు. ఒక్కొక్కరోజు బాగా తాగేసి ఒళ్ళు తెలీని స్థితిలో చెరువు దగ్గరికి చేరతారు. కన్నెపిల్లలూ, పెళ్ళయిన అమ్మాయిలు – వస్తారని – వారి రాకకోసం అక్కడ బీట్ వేస్తారు. ఎవరెలా స్నానం చేస్తున్నారు – ఎలా బట్టలు కట్టుకుంటారు – ఇవన్నీ చాటుమాటుగా గమనిస్తూ ఏవో కామెంట్సు చేయటం వాళ్ళ పని! తడి బట్టలతో ఎవరి శరీరం ఎలా కన్పించింది – ఎలా ఉంది – ఇలాంటి మాటలు ఎన్నో….

ఊరి జనాలు అన్నీ చూస్తూ ఉంటారు. అసలు సంగతి ఏమంటే – ఈ తాగుబోతులు వయసులో పెద్దవాళ్ళు. చిన్నాన్న, మామ వయసు వాళ్ళు. వారి నడత మార్చుకోమని ఎవరు చెప్పగలరు?వాళ్ళే అందరికీ మంచితోవ చూపాల్సిన వాళ్ళు. వయసులో ఉన్న ఆడపిల్లలని ఎవరైనా ఏమైనా అంటే మందలించాల్సిన వారు. అలాంటిది వారే ఇలా ప్రవర్తిస్తే? తాగిన మత్తులో తల్లో పెళ్ళామో కూడా తెలియదంటారు!

తాగుబోతులు మొత్తం అయిదుగురు. అయిదుగురు, పంచపాండవులలాగ ఏదైనా మంచి పని కోసం ఉద్యమిస్తే – మహా శక్తిగా రూపొందగలరు. కానీ వీళ్ళా…. అథములు – నీచులు. వీరెప్పుడూ సారా మత్తులో ఉంటారు. అంగన్‌వాడీ కేంద్రం దగ్గరే వాళ్ళ ప్రగల్భాలూ – వీరత్వమూ. ఆడవాళ్ళు స్నానమాడే రేవుల దగ్గర – అశ్లీలపదాలతో దూషించటం, వెటకారం చేయటం ఇదే పని. నిజంగా ఏదైనా శక్తిసామర్థ్యాలుంటే ఊళ్ళో పీడిత జనాలని ఉద్ధరించటానికి ఏమైనా మంచి పన్లు చేయ్యెచ్చుకదా! అలాంటి పనులేమీ చెయ్యరు.

రశ్మి అంగన్‌వాడీ కేంద్రంలో నిజాయితీతో పని చేస్తున్న ఉద్యోగిని. ఎవరైనా గర్భవతులు, లేదా పిల్లల తల్లులు వస్తున్నారేమోనని బయటకు చూసింది. ఎవరూ రాకపోతే కేంద్రంలో సందడే ఉండదు. బయట నుంచి తాగుబోతులు గోలగోలగా మాట్లాడుకుంటున్న మాటలు రశ్మి చెవుల పడ్డాయి. “ఎవరు వస్తారో చూద్దాం. కేంద్రం ఇక్కడ నుంచీ ఎత్తెయ్యాలి. ఈ దీదీ కూడా బదిలీ అయి వెళ్ళిపోవాలి. ఈమె ఆడవాళ్ళందరికీ పొగ తాగటం, సారా తాగటం తప్పని, మగాళ్ళని ఎదిరించాలని నూరిపోస్తోంది. అసలు మనం ఎందుకు మానాలి ఇవన్నీ? తానే ఈ ఆఫీసు, ఊరు విడిచిపోతే సరిపోతుంది…”

ఈ మాటలు ఆమె, ఆ రెండు గదుల భవన, ఆకాశమల్లి, ముద్ద మందారం, వీచే గాలి విన్నాయి. గుండెల్లో శూలాలు గుచ్చినంత బాధ కలిగింది. అరే ఇవ్వాళ ఆడవాళ్ళెవరూ కేంద్రానికి రాలేదే. బహుశ భయపడ్డారో ఏమో…. రశ్మి డిపార్టమెంట్ సి.డి.పి.ఓ.కు, సూపర్‌వైజర్‌కి తెలియజేసింది. అయితే సి.డి.పి.ఓ మేడమ్ “అక్కడ పని సరిగ్గా కాకపోతే నువ్వే బాధ్యత వహించాలి, ప్రోగ్రామ్ ఆఫీసర్లు వస్తారు. రికార్డ్ పేపర్లు అన్నీ సరి చూస్తారు. ఊళ్ళో ఉన్న తల్లుల్ని, చంటి పిల్లలని, గర్భవతులని కేంద్రానికి తీసుకురావల్సిన బాధ్యత నీదే” అన్నది.

అవును ఏ పనిలోనైనా ఏదో ఒక కష్టం ఉంటుంది. పట్టనట్టుగా కూర్చుంటే పని చెయ్యలేం. సి.డి.పి.ఓ. మేడమ్‌, బి.డి.ఓ. సార్ కూడా వారి పనుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు. వారు మాట్లాడుకుండా కూర్చుంటే పనులు కావు. ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ విఫలమౌతాయి. ఎక్కడో చదివిన ‘ధైర్యే సాహసే లక్ష్మీ’ అన్న పదం గుర్తుకు తెచ్చు కుంది. కుర్చీలోనుంచి లేచి కిటికీ తెర తొలగించి బయటకి చూసింది. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ చీరల్లో మాతృమూర్తులు సప్తవర్ణాలలో మాతృశక్తి – ఆహాఁ… ఆమె మనసులో ఇంద్రధనస్సు మెరుపులు – రంగులు.

ఒక్కసారిగా ధైర్యం వచ్చింది. బయట తాగుబోతులు కూర్చున్నారన్న భయం తగ్గంది. ఆడవాళ్లు తాగుబోతులకి భయపడి ఇండ్లలో కాళ్ళు మూడుచుకుని కూర్చోలేదు. వారు ధైర్యంగా వారికి తగిన బుద్ధి చెప్పటానికే వచ్చారు.

“ఏయ్ – ఏయ్ ఎక్కడికి – ఈ కేంద్రం మూతబడింది – మూసేస్తారు. ఇంటికెళ్ళండి ఊఁ…”

తాగుబోతులందరూ ఆడవాళ్ళ చుట్టూ నిలబడ్డారు. ఆడవారెవరూ పెద్దగా భయపడలేదు – వాళ్ళు కూడా గుంపుగా ఉన్నారు కదా! తాగుబోతుల మాటల్ని లెక్కజేయకుండా గదిలోకి వచ్చారు. రశ్మిని కావిలించుకుని ఒకావిడ అన్నది.

“మేం వచ్చాం, నీకు భయం లేదు. నువ్వు చెప్పిన మాటలే గుర్తుకొచ్చాయి – గడ్డిపోచ అల్పమైందే – ఆ గడ్డిపోచల్ని కట్టగా కట్టి పేనితే దృఢంగా తాడు తయారవుతుందని నువ్వు చెప్పిన మాటలు సత్యం! అందరం ఒక దగ్గర కూడి, రావటానికి ఆలస్యమైంది…”

రశ్మి అందరినీ అభినందించింది. ఆవిడ కౌగిలినుంచి విడివడి “మీకు తోవ చూపించా. పదండి ఒక పని చేద్దాం.”

“ఏం చేద్దాం.”

ఆకాశంలో పక్షులు గుంపులుగా రెక్కలు అల్లార్చి ఎగురుతున్నాయి. ఉదయపు కాంతి అంతటా పరుచుకుంటోంది. ఆకాశమల్లి వళ్ళంతా కళ్లు చేసుకుని కేంద్రం వంక చూసింది.

గర్భవతులు, తల్లులు వారి ఆరోగ్యస్థితి, ఇంటిస్థితి అన్నీ వివరిస్తున్నారు. అన్నీ విన్నది రశ్మి.

ప్రాంగణంలో ముద్ద మందారాలు, మాలతులూ పూలహారాన్ని సిద్ధం చేస్తున్నాయి.

“వంటరిగా ఒక్కళ్ళమూ ఏ పరిస్థితినీ ఎదుర్కోలేము. అందరం కలిస్తే ఏదైనా సాధించగలం! ఇప్పుడు మీరంతా కలిసి వచ్చారు. నేనైతే వంటరిగా ఉండి వాళ్ళని వెళ్ళగొట్టలేను. పదండి వరండాలోకి వెళ్దాం…”

ఒకావిడ అంది.

“నేను రాను. మా బావగారు ఉన్నారు వాళ్ళల్లో…”

ఇంకోక స్త్రీ అన్నది.

“మా చిన్నాన్న ఉన్నాడు. ఇంట్లో చాలా అల్లరి చేస్తాడు.”

“వాళ్ళు ఎప్పుడైనా ఈ మర్యాదల్ని పాటించారా? మిమ్మల్ని చూసి సిగ్గుపడ్డారా? మీరు వస్తుంటే ఇతరులతో కలిసి ఆ బావగారు, చిన్నాన్న మిమ్మల్ని ఏదేదో అన్నారా లేదా? ఆడవాళ్ళే చుట్టరికాలు, బాంధవ్యాలు కాపాడుకోవాలా? ఎప్పుడూ ఎందుకిలా జరుగుతోంది? వళ్ళు తెలీని స్థితిలో ఉన్నవాళ్ళు చుట్టాలమ్మాయిల్ని ఏం గుర్తు పట్టగలరు?”

“అవునవును దీదీ సరిగ్గా చెబుతోంది. నిజం నిజం.”

ఇద్దరు ఆడవాళ్ళ ముఖాల్లో రంగులు మారాయి. జారిన ముసుగుల్ని మళ్ళీ తల మీదకి లాక్కోలేదు. అందరూ వచ్చి వరండాలో నిలబడ్డారు. సారాసీసాలు పట్టుకున్న చేతులు మత్తెక్కిన వాళ్ళు ఎవరినీ ఎదురుగా ఉన్నది తల్లా – పెళ్ళామా – కోడలా – గుర్తించే స్థితిలో లేరు.

“ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఆఫీసు పని మొదలవుతుంది.”

“ఎందుకు లేవాలి? బయటకెళ్ళాలా? మీ ఆడాళ్ళందరూ మమ్మల్ని ఏం చేయగలరు? తమషా చేస్తున్నారా ఏం?”

బీడీ పొగ ఆడాళ్ళ మొహాల మీద వదిలారు. సీసాలు విసిరారు. ఇరుపక్షాల మధ్యా వాదోపవాదాలు జోరందుకున్నాయి.

“దూరంగా వెళ్ళండి.” అంటూ ఆడవాలు పెద్దగా కేకలు పెట్టారు.

ఊళ్ళోకి ఆ కేకలు విన్పించాయి. ఏమనుకున్నారో ఏమో తాగుబోతులు వరండా వదిలి బయటకి నడిచారు, ఇలా ఇప్పుడైనా వాళ్ళకి కనువిప్పు కలిగితే బాగుండు! ఆడవాళ్ళు కాస్తంత ధైర్యసాహసాలు ప్రదిర్శిస్తే ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవచ్చు. వరండాలో ఉన్న చెత్త – తాగి విసిరేసిన బీడీముక్కలు, ఎంగిలి విస్తరాకులు, ముక్కలైన సారాసీసాలు అన్నీ ఊడ్చి అవతల పారేస్తున్న రశ్మి మదిలో అనేక ఆలోచనలు మెదిలాయి. ఈ తాగుబోతుల మనసులు ఎపుడు శుభ్రపడతాయి? వారికి మంచి ఆలోచనలు వచ్చేదెప్పుడు? ఇంత వయసు వచ్చినా వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. మత్తులో మునిగి తేలుతున్నారు. దేవుడా! వీళ్ళకి సద్బుద్ధి ప్రసాదించు. వీళ్ళు వల్ల ఊళ్ళో గొడవలు ఎక్కువవుతున్నాయి. అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది.

చేతులు కుడుక్కుని వచ్చి కుర్చీలో కూర్చుంది. అందరి ముఖాల్లో సంతృప్తి గోచరిస్తోంది. ఈ మాదిరి సంఘటనలు ఎదుర్కోగలమనే ఆత్మవిశ్వాసం కలిగింది. రశ్మి విటమన్ టాబ్లెట్లు పాకెట్లుగా కట్టింది. నాన్నమ్మలు మాట్లాడినట్లు గర్భిణీ స్త్రీలతో మాట్లాడుతూ టాబ్లెట్ పాకెట్లు వారి చేతుల్లో పెట్టింది. బరువు తూచే మిషన్ మీద వారిని నుంచో బెట్టి ఒక్కొక్కరి బరువు నోట్ చేసింది. ఈ పనులన్నీ చకచక చేస్తూ రశ్మి ఆ స్త్రీలతో అవసరమైన మాటలు మాట్లాడుతూనే ఉంది. కిటెకీ తెరల నుంచి సన్నగా లోపలికి పడుతున్న ఎండ కూడా ఈ మాటలని వినాలనుకుంటోంది. తనూ ఏదో చెప్పాలని ఆరాటపడుతున్నట్టుంది. రశ్ని ప్రేమార్ద్ర దృక్కులతో కిటికీ బయటికి చూసింది! కిటికీకి అటువైపు ఎవరో ఉన్నారు… ఆ విషయం చెప్పటానికే సూర్యకిరణం గదిలోకి ప్రవేశించిందా?

“ఏయ్… ఎవరు… ఎవరక్కడ?”

రశ్మి కుర్చీలో నుంచి లేచింది… ఎవరై ఉంటారు?

తాగుబోతులు ఛీ… ఎంతకైనా తెగిస్తారు! కోపం వచ్చింది. గ్లాసెడు మంచి నీళ్ళు తాగింది. ఫాన్ గాలి వేగం పెంచింది. ఆ మనిషి… ఎదురుగా నిలబడి తన వంక చూస్తూ మూత్రం పోస్తున్నాడు. తండ్రి వయసుంటుంది అతనికి! మత్తులో ఉన్నాడు.

ఆ మరునాడు.

గర్భవతులను పరీక్షించే రోజు! అందరి కార్డులను ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసింది రశ్మి. ఐరన్ టాబ్లెట్లు అందరికీ ఇచ్చింది. ఆ మహిళలందరిలో కొత్త జీవి తమలో రూపుదిద్దుకుంటోందని ఆనందం! రశ్మి వారిలో కొత్త విశ్వాసాన్ని, నమ్మకాన్ని నింపింది తన మాటలతో, చేతలతో! వారి ముఖాలు అపూర్వ కాంతితో వెలిగిపోతున్నాయి. గర్భవతులు పిచ్చి ఆనందంతో – ఏవో స్వప్నలోకాలలో విహరిస్తుంటూంటారు. రశ్మికి హఠాత్తుగా తన సంగతి – ఆలోచనలోకి వచ్చింది. ఆమెకి అలాంటి స్వప్నాలు నిజమయ్యే అవకాశం లేదు. తనకంటూ ఉన్నది అమ్మ ఒక్కతే! అమ్మని ఒదిలేసి తను ఎక్కడికి వెళ్ళగలదు? కాని మనసు ఉంటే కలలొస్తాయి! కలలని ఎవరూ ఆపలేరు! పెళ్ళి, తల్లి కావటం – ఇలాంటి అదృష్టం అందరికీ వస్తుందా? తను అలాంటిది మరి! ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచింది రశ్మి. ఈ ఆలోచనలలో నుంచి బయటపడేసరికి టేబుల్ ముందు, ఎదురుగా ఎవరో నుంచున్నారు. ఆ మనిషే! నిన్న అసభ్యంగా… అలా! రశ్మి కళ్ళు ఎర్రబడ్డాయి కోపంతో!

అతడి రాకని గమనించి ఆడవాళ్ళందరూ కూడా టేబుల్ దగ్గరగా వచ్చారు.

తాగుబోతు నుంచి వచ్చే దుర్వాసన భరించలేక పమిట చెంగులు ముక్కుకి అడ్డంగా పెట్టుకున్నారు. తాగుబోతు ఆడవాళ్ళ ముఖాలు, వళ్ళు, పొట్టా – పరీక్షగా చూస్తున్నాడు. సరిగ్గా నిలబడలేని స్థితి – తూలి పడిపోతున్నాడు. ఎర్రటి కళ్ళు.

“ఎవరు నువ్వు? లోపలికి కెందుకొచ్చావ్? చాలా ధైర్యంగా వచ్చావే! ముందు వెళ్ళు బయటకి…” రశ్మి ధైర్యంగా ప్రశ్నించింది.

“మా బాబు వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ వచ్చా… తను ఉందా?”

“నీ బాబు తల్లి ఎందుకొస్తుంది ఇక్కడికి…? తను కడుపుతో ఉందా?”

అందరి పెదాల వెనక నవ్వు.

 “వెళ్ళు…. ఇక్కడ నుంచి వెళ్లు”

“ఈ దీదీ మీ మంచి చెడ్డలే చూస్తోంది. మా విషయాలెప్పుడూ పట్టించుకోదు! మాకు కూడా వంటికీ, బుర్రకీ మందులు కావాలి”.

అవమానంతో రశ్మి ముఖం ఎర్రబడింది.

అతడి మాటలు తడబడుతున్నాయి. తూలిపోతున్నాడు.

ఆడాళ్ళల్లో అతడి బంధువు ఒక అమ్మాయి అన్నది “చిన్నాన్నా… వెళ్ళు… ఇక్కడ నుంచి వెళ్ళిపో”

తక్కిన మహిళలందరూ అతడి ప్రవర్తనని చీదరించుకున్నారు. ఛీ… ఛీ… అన్నారు.

తాగుబోతు వెనక్కి తిరిగి వెళ్ళపోతూ – గడప దగ్గర తూలి కింద పడ్డాడు. ఆ పడటంతో కట్టుకున్న ధోవతి ముడి ఊడింది. ఎలాగో కష్టం మీద ధోవతి సర్దుకోగలిగాడు.

రశ్మికి చాలా ఇబ్బందిగా తోచింది. ఇలాంటి వాతావరణంలో ఈ అంగన్‌వాడీ కేంద్ర కార్యక్రమాలు ఎలా జరుగుతాయి? భత్రత లేని చోట – ఎలా… ఇలా ఆలోచిస్తుంటే తల నొప్పి మొదలవుతోంది. ఈ మధ్య తల నొప్పి ఎక్కువగా వస్తోంది. రాత్రిళ్ళు కూడా ఇదే ఆలోచన – గాఢ నిద్ర అసలేలేదు. అసలు లోకంలో ఎక్కడైనా ఇలాంటి మనుషులుంటారా? ఇతరులకి ఇంత తల నొప్పి కలిగిస్తారా?

ఒక రోజు సాయంత్రం! గోధూళి వేళ! ఆవులు దూడలు అన్నీ తిరిగివస్తున్నాయి – దుమ్ము రేగుతోంది. పశ్చిమాకాశంలో కొంగలు బారులు… రశ్మి వాళ్ళ ఊరికి వెళుతోంది. వంతెన దగ్గర ఆ అయిదు మంది నిలబడి ఉన్నారు. చుట్టు పక్కల ఎవరూ కన్పించలేదు. ఇలాంటి స్థితిలో భయపడకుండా ఎవరు ఉంటారు? వారు సైకిల్‌కి అడ్డంగా వస్తూ “ఆగు” అన్నారు. తర్వాత “ఒక మాట విను” అనేదీ విన్పించింది. రశ్మి సైకిల్ ఆపింది. వాళ్ళేం చెబుతారు ఎవరూ లేని ఇటువంటి చోట. ‘భగవంతుడా!’ తను ఒక్కత్తి వాళ్ళు అయిదుగురు.

“మా మాట విను – వినకపోతే ఈ ఊళ్ళో అడుగుపెట్టలేవు.”

రశ్మిలో ధైర్యం చచ్చిపోయింది. ఏం చెబుతారు వీళ్ళు?

“చూడు దీదీ… మీ కేద్రంలో రెండు గదులున్నాయి… అవునా?”

“ఆ… ఆ…” కష్టం మీద పలికింది.

“ఒక గది తాళం చేతులు మాకివ్వు. రాత్రిళ్ళు మేం పడుకుంటాం. సర్కార్ గాలి మేం కాస్త అనుభవిస్తాం. ఉదయం వెళ్ళిపోతాం. మళ్ళీ రాత్రికి వస్తాం. మేం ఇలా మజా చేయ్యటానకి ఊళ్ళో జాగా ఎక్కడుంది?”

“కుదరదు” అంటూ రశ్మి ధైర్యంగా వెళ్ళిపోయింది. ఆఫీస్ తాళం వారికి ఇస్తుందా, ఇలాంటి నిర్ణయాలు తను తీసుకుంటుందా? మరునాడు ఆఫీసుకి వచ్చింది. అంగన్‌వాడీ కేంద్రం ఒక గది కిటికీకి కన్నం చేసి, పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బహుశః వీరే! అలమారలో ఉన్న మందులు గదంతా చెల్లా చెదరుగా పడి ఉన్నాయి. కొన్ని పాలపొడి పాకెట్లు మాయమయ్యాయి.

రశ్మి చాలా కంగారు పడింది. ఈ ఘాతుకానికి ఒడిగట్టిందెవరో తెలుస్తూనే ఉంది. తను ఇప్పుడు ఏం చెయ్యాలి? పోలీసులకి ఫోన్ చెయ్యాలా? చీకట్లు కాంతి రేఖలా వాళ్ళే కనిపిస్తున్నారు. ఫోన్ చూసింది. నెట్‌వర్క్ లేదు – ఎప్పుడు అవసరమైనా నెట్‌వర్క్ ఉండదు. ఫోన్ వెళ్ళదు. ఏం చెయ్యాటం? మనసు కొంచెం స్థిరం చేసుకుని కాస్త ఆఫీసు పనులు చేసుకుంది. మళ్ళీ ఫోన్ చెయ్యటానికి ప్రయత్నం ప్రారంభించింది. ఈసారి ఫోన్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళింది. సుమారు అరగంట తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి యస్.ఐ కానిస్టేబుల్ వచ్చారు. యస్.ఐ కేంద్రం అంతా కలయ తిరిగి పరిశీలించాడు. రోజూ ఎలా తాగుబోతులు హైరానా చేస్తున్నారో రశ్మి యస్.ఐ.తో చెప్పింది. అయితే పోలీస్ అధికారి ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుటున్నట్టు అన్పించింది.

అధికారి అన్నాడు…. “ఎంత మంది మహిళలు తాగుబోతులని గుర్తు పడతారు? ధైర్యంగా ముందు కొచ్చి వీళ్ళేనని చెప్పగలరా? పేర్లు చెబితే ఏదో ఒకటి చెయ్యగలను.”

“సార్ తప్పకుండా చెబుతారు. శాంతి, కున్నీ, చెమల, మాలతీ… చెబుతారు” వెంటనే అన్నది రశ్మి.

గ్రామసభ ఏర్పాటైంది. పోలీసులు ఊళ్ళోకి వచ్చారని తెలియగానే ఆడవాళ్ళు భయపడిపోయారు. వారి ధైర్యమంతా నీరుకారిపోయింది. రశ్మి మాటలకు బలం చేకూర్చే మాటలేమీ చెప్పలేదు. తాగుబోతుల పేర్లు అసలే చెప్పలేదు. ఊరి వారెవరూ కేంద్రం గొడవను గూర్చి చెప్పటానికి ముందుకి రాలేదు. పోలీసు అధికారి పెద్దగా విచారణ అంటూ ఏమీ చేయకండానే వెళ్ళిపోయాడు. జరిగిందేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా అధికారి వెళ్ళిపోవటం రశ్మికి బాధని కలిగించింది.

రశ్మి పోలీసు వాళ్ళు ఈ సమస్యను పరిష్కరిస్తారని భావించింది. కానీ ఏం జరిగింది? ఈ ఆడవాళ్ళు శాంతి, కుంతి – ఎవ్వరూ నోరు విప్పలేదు. తనకి తోడుగా ఈ ఆడవాళ్ళందరూ నిలబడతారని ఆమె భావించింది. కానీ అలా జరగలేదు. సున్నితమైన రశ్మి హృదయం గాయపడింది. ఈ ఆడవాళ్ళు ఎందుకిలా చేశారు? బాధతో పాటు ఆశ్చర్యమూ కలిగింది. మెల్లగా గ్రామసభ నుంచి అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చింది. ఇన్నాళ్ళకి ఆమెకి చెప్పలేనంత దుఃఖం వచ్చింది. తండ్రి బతికి ఉంటే తనిలా ఊళ్ళు తిరగాల్సిన కర్మ పట్టేది కాదేమో! అన్న ఉన్నా చెల్లిలికి ఏదైనా ఆపద వస్తే కాపాడేవాడు. ఏం చేస్తుంది! ఆమెకి తల్లి తప్ప ఎవ్వరూ లేరు. ఎలాగైనా జీవించాలి కదా, హఠాత్తుగా ఆకాశమల్లి వంక చూసింది. దృఢంగా ఉన్న ఆ చెట్టు ధైర్యం చెబుతున్నట్లు తోచింది. మనసులో చెట్టుతో మాట్లాడింది.

‘నువ్విలా చెట్టు రూపంలో ఉన్నావు. ఏం చెయ్యగలవు? రెండు పూలు నా మీద రాల్చి మౌనంగా ఉంటావు. ఎలా ఇక్కడ పని చేస్తాను? ఆలోచించావా, ఎవరు నా గురించి ఆలోచిస్తారు? చెప్పు. వంటరి దాన్ని. మందార పువ్వా… నువ్వైనా చెప్పు.’

ఏడుపొస్తోంది… అసహయాత…. ఏం చెయ్యాలో తెలీని స్థితి. పైకి మేకపోతు గాంభీర్యం నటించినా – కొన్ని పరిస్థితుల్లో డీలా పడక తప్పటం లేదు. కేంద్రం పనులేవీ చెయ్యకుండానే ఆ రోజు ఇంటికి వెళ్ళింది. పోలీసులు తమని ప్రశ్నించకుండా వెళ్ళడంతో తాగుబోతులకి ధైర్యం వచ్చింది. రెండు రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు. ఈసారి కొత్త ప్రతిపాదనని రశ్మి ముందుకు తెచ్చారు. వాళ్ళకి ప్రతి నెలా అయిదొందలు చందా ఇవ్వాలట! ప్రభుత్వం సరఫరా చేసే మందుల్లో వాళ్ళకి కొంత వాటా ఇమ్మంటున్నారు. రశ్మి వారికి జవాబిచ్చింది. “నేను మీకు డబ్బులు ఇవ్వను. ఇంకేమీ ఇచ్చేదీ లేదు” సమాధానమైతే గట్టిగా చెప్పింది కానీ రశ్మి మనసంతా ఆందోళనతో నిండింది. రశ్మి సంఘసేవా పరాయుణుడు మిశ్రాబాబుకి, మహిళామండలి అధ్యక్షురాలుకి ఫోన్ చేసింది. రశ్మి మాటలు విని వాళ్ళు చాలా బాధపడ్డారు. మహిళామండలి అధ్యక్షురాలు చాలా బాధతో అన్నది “పోలీసులు వచ్చిన రోజున రాలేకపోయాం. మిశ్రాబాబు అనారోగ్యంతో బుర్లా మెడికల్ కాలేజి హాస్పటల్‌లో ఉన్నారు….” అంటూ ఆవిడ చెప్పిన మాటలు రశ్మి మనసుని కాస్త తేలిక చేశాయి. ఊళ్ళో విషయాలు కూడా ఒకటీ ఒకటీ బయటకి వచ్చాయి. “శాంతి, కుంతీ, మాలతీ మిగతావారు పోలీసులకి భయపడి నోరు మెదపలేకపోయారట! తాగుబోతులు వారి చిన్నాన్నలు, బావగార్లు కావటంతో వారిని చూపలేకపోయారు. తర్వాత వాళ్ళు పశ్చాత్తాపంతో క్రుంగిపోయారు. రశ్మికి సాయం చేయలేకపోయామని బాధతో – ఇండ్లలో కోపాలు ప్రదర్శించారు. ఆరోజు ఇంట్లో వంట చేయలేదు. అత్తా మామలు వేళకి భోజనం చెయ్యలేకపోయారు. భర్తతో తగువు పెట్టుకున్నారు. ఒకామె గోడకి తల కొట్టుకుని ఏడ్చిందట!”

ప్రతి ఇంట్లో ఈ సంఘటనని ఖండిస్తూ వాదోపవాదాలు జరిగాయి. తర్వాత రోజు గ్రామ సభలో ఈ విషయాలు చర్చకొచ్చాయి. మహిళలందరూ గ్రామసభలో అంగన్‌వాడీ కేంద్రం – సజావుగా నడిచేందుకు సహకరించుకోవాలని నిర్ణయించుకుని, ఈసారి వెనక్కి తగ్గమని ఒట్టు పెట్టుకుని – శపథాలు చేశారు. హుళాహుళి శబ్దాలు చేశారు.

ఆ మరునాడు ఉదయం – ఎప్పటిలా లేదు – వేరుగా కన్పిసోంది. మహిళామండలి సభ్యులందరూ గుంపుగా ఒక దగ్గర కూడారు. నెమ్మదిగా స్త్రీలందరూ మహిళాశక్తిగా పరిణామం చెందటం విశేషం – అందరూ సారాబట్టీ వైపుకి వెళ్ళారు. ఈ జరుగుతున్న పరిణామాలకి మూలం – ఈ సారాబట్టీయే. విషవృక్షానికి వేరు ఇదే. సారా వండే కుండని పగులకొట్టారు. మత్తు కలిగించే రంగురంగుల సారా సీసాలు ధ్వంసం చేసి నేల మీద పడేశారు. ఆ జాగా అంతా సారా ఏరుగా పారింది. గాజు ముక్కల మీద స్త్రీల పాదాలు – రక్తరంజితాలై పారాణియై కాళ్ళకి శోభిస్తోంది.

సూర్యకాంతి నల్దిక్కులా వ్యాపించింది.

గ్రామంలో తొలిసారి మహిళలు సారా బట్టీ మీద దాడి చేసి – ధ్వంసం చేశారు.

గ్రామంలో పురుషులు తమ ఆధిపత్యానికి భంగం వాటిల్లిందని భావించారు. ఇళ్ళల్లో పడి ఉండాల్సిన ఆడవాళ్ళు సారా బట్టీలలో – దుకాణాల్లోనా? ఇంట్లోకి రాగానే ఆడవారిని వారి భర్తలు కొట్టారు. మామ కోడలిని తిట్టాడు. కుంటుంబాలలో పెద్దవారు కోడళ్ళను పలువిధాల నిందించారు. ఒక ఇంట్లో అయితే ఒక మహిళని ఇంట్లోనుంచి గెంటేశారు. ఆమె అదే ఊళ్ళోని తన పుట్టింటికి చేరింది. ఊళ్ళో అంతా ఇదే చర్చ.

ఇచ్ఛాపూర్ గ్రామం పైన ఆకాశంలో నల్లటి మేఘాలు ముసురుకున్నాయి. దట్టంగా నల్లటి పొగ క్రమ్ముకుంది.

సారా బట్టీ పగలకొట్టారు – సారా సీసాలు నేల మీద విసిరి ధ్వంసం చేశారు. బాగుంది… “మహిళా మండలి సభ్యులు – చీరలు కట్టుకున్నవాళ్ళూ, కుర్తా పైజామాల్లో దీదీలు – అందరూ రండి… ఎన్ని పగలకొడతారో – ఏం చేస్తారో – మేమూ చూస్తాం. ఇంకా సారా సీసాలు తెప్పించుకుంటాం. తాగుతాం. ఏం చేస్తారు?” మగవాళ్ళ మాటలు ఊరంతా ప్రచారమయ్యాయి.

ఏ వసతులూ లేని ఈ గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రమే గర్భవతి స్త్రీలకి, పసిబిడ్డలకు ఆసరగా, ఓదార్పుగా నిలిచింది. ఇప్పుడు తాగుబోతులు ఈ మంచి పనులకి అడ్డుగా నిలుస్తున్నారు. మహిళలు కిటికీలు, తలుపులు తెరిచి బయటకి వచ్చారు. కోపంతో వారి తనువు ఊగిపోయింది. ఆ రోజు నుంచీ మహిళలు మగవాళ్ళ దెబ్బలని, తిట్లలని లెక్కజేయటం మానేశారు. వారి ఇండ్లలోకి, మనసులోకి సూర్యకాంతి ప్రసరించసాగింది. మహిళలను ఎవరూ అడ్డగించలేకపోయారు. అంగన్‌వాడీ కేంద్రం వాళ్ళకి ప్రియమైనది, దాన్ని అపవిత్రం చేస్తారా ఈ తాగుబోతులు! స్త్రీలని అవమానిస్తారా, ఎందుకు భరించాలి ఇవన్నీ! వీటికి జవాబు చెప్పాల్సిందే. స్త్రీలు బలహీనులు కారు – వారిలో గొప్ప శక్తి ఉన్నదని అందరూ గుర్తించాలి!

గ్రామం ఆకాశం రంగు మారింది. సూర్యకిరణాలు తీక్షణతను సంతరించుకున్నాయి. శాంతి, కుంతి, మాలతి మున్నగు వారి హృదయాలలో ఉత్సాహం, ఉద్రేకం పరవళ్లు తొక్కాయి. అందరూ అంగన్‌వాడీ కేంద్రం దగ్గరకి వచ్చారు. రశ్మి తను చూస్తున్నది నిజమా కాదాననే సందేహంతో కళ్లు నులుముకుని మరీ చూసింది. మామగారి ముందు ధైర్యంగా నిలబడింది కోడలు! బావగారి ముందు నిలబడ్డ తమ్ముడి భార్య! చిన్న మామగారి ముందు అన్నగారి కోడలు!

ఇవాళ వాళ్ళు ఈ చుట్టరికాలు పట్టించుకోలేదు. కోపంతో వరండా మెట్టెక్కి – వరండాలో ఉన్న చెత్తా చెదారమూ తీసి అవతల పడేశారు. ఒకొక్క వ్యక్తిని ఇద్దరేసి మహిళలు పట్టుకుని లాగి కిందకి దించి రోడ్డుమీద కూర్చోబెట్టారు. మగవాళ్ళు ప్రతిఘటించినా, లేవనీయకుండా మళ్ళీ కూలేశారు. కొందరు ఆడవాళ్ళు కుండలతో నీళ్ళు మోసుకొచ్చారు. కొందరు మహిళలు అవి అందుకుని తాగుబోతుల నెత్తిన దిమ్మరించసాగారు.

తాగుబోతులు ఎక్కడికి పోతారు?

ఎలా వెడతారు!

లేచి వెళ్దామన్నా మహిళలందరూ చుట్టూ నిలబడి ఉన్నారు. ఎరుపు, పసుపు చీరలలో మహిళలు – కుర్తీ పైజామాల్లో దీదీలు – ఆ స్త్రీలలో వాళ్ళప్పుడు కార్యదక్షతను చూశారు. నీళ్ళు తెచ్చేవారు తెస్తూనే ఉన్నారు.

ధారగా తాగుబోతులు నెత్తిన పోస్తూనే ఉన్నారు. ఎవ్వరూ అలసిపోవటం లేదు. నిలుచున్న గుంపులో శిశువులనేకమంది! వారంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు ఈ దృశ్యాన్ని.

ఊళ్ళో ఈ విషయం దావానలంలా వ్యాపించింది. జనాలందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. సంఘసేవికకు కూడా ఈ వార్త చేరింది. ఆమె కొందరితో వచ్చింది. మహిళల్లో వచ్చిన ఈ గొప్ప చైతన్యం వారు వీక్షించారు. అన్యాయాన్ని ప్రతిఘటించటానికి వారెన్నుకున్న మార్గాన్ని అందరూ చూసి ఫోటో కూడా తీశారు. ఈ వార్త పేపర్లకెక్కింది. మగవాళ్ళు – ఆ తాగుబోతులు ఏమైనా బాధపడ్డారో ఏమో – నోరు మూసుకుని లేచి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళెక్కడ ఉన్నదీ తెలియలేదు. ఇచ్ఛాపురం మత్తు నుంచి విముక్తి పొందింది.

చీకట్లను పారద్రోలుతూ సూర్యబింబం ఆకాశంలో కనుపట్టింది. వసుధపై వికసించిన మందారాలు, మాలతులు, మొగలిపూలు జీవన గీతాన్ని ఆలపించాయి. పక్షుల కలకలారావాలతో ఆ ఊరి మహిళలందరిలో స్వాతంత్ర్య సూర్యోదయమైంది.

సేవాభావంతో, నవ్వులు చిందిస్తూ పూల సుగంధాలు అంగన్‌వాడీ కేంద్ర పరిసరాలలో వ్యాపించాయి.

***

ఒడియా మూలం – గాయత్రీ షరాఫ్

తెలుగు అనువాదం – డా. తుర్లపాటి రాజేశ్వరి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here