[dropcap]ఇ[/dropcap]ది మనిషికి మనిషిని విషంచేసే వైరస్
మనమంతా స్వీయపంజరాల్లో బందీలం
వన్యప్రాణులు పక్షులు స్వేచ్ఛగా ….
ఇన్నాళ్లూ అవి మనకు ఎంతో చేశాయి
మనం వాటిని నంజుకుని తినటమేనా?
ప్రకృతిని చెరబట్టిన రాక్షసరూపులమై
ప్రతి ప్రాణిని జీర్ణించుకోగలమనీ ..
ఇదే అభివృద్ధి అహంకారులంతా
కనిపించని కరోనాకి తలదించుకుంటున్నారు
ప్రగతి డొల్లతనమంటే ఇదే…
ఆషామాషీ విపత్తుకాదు మిత్రమా
యావత్ మానవాళిని మట్టుపెట్టగల
మహమ్మారితో గుడ్డియుద్ధం!
ఇప్పుడు మన కర్తవ్యం భౌతికదూరం
సామాజికంగా భూగోళమంతా ఒక్కటై
ఒంటరి పంజరాల్లో ఒప్పుకోలు బందీలమై
మానసిక ఐక్యతతో పోరుచేయటం
ఎన్నో అణుబాంబులున్నాయని
విర్రవీగిన అగ్రరాజ్యాలుకూడా
తలపట్టుకుని తల్లడిల్లిపోతుంటే
ఇకనైనా ప్రకృతిని గౌరవించకపోతే ఎలా
ఇళ్లలోంచి కదలకుండా కట్టుబడి
కరోనాను నిర్వీర్యం చేయకపోతే ఎలా
ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ
తనకు తాను సైనికుడే
పాలకుల మార్గదర్శకత్వంలో
పయనించే సూర్యుడే