[2023 ఫిబ్రవరి నెలలో గుజరాత్, రాజస్థాన్ లలో పర్యటించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]
[dropcap]గ[/dropcap]త ఏడాది సెప్టెంబరులో దేవుని సొంత దేశం కేరళను సందర్శించి ఆ యాత్రానుభవాలు మీతో పంచుకున్నాను. ఈ మధ్య గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలలో తిరిగి, అక్కడి పుణ్యక్షేత్రాలను, చారిత్రిక కట్టడాలను చూసి రావాలనే తలంపు కలిగింది. వెంటనే నా మిత్రుడు యోగానంద్ కు ఫోన్ చేశాను. వాడెప్పుడూ సిద్ధమే.
గత నవంబరు మూడవ వారంలోనే, మాకు కేరళ టూర్ అరేంజ్ చేసిన ‘డొనాటో ట్రావెల్స్’ , కొచ్చి వారిని సంప్రదించాము. ఆ టూర్ వారు చక్కగా ఆర్గనైజ్ చేశారు. కంఫర్టబుల్‌గా కేరళ అంతా తిరిగాము. ఆ సమయంలోనే ఆ సంస్థ నిర్వాహకులు జోజో, సందీప్ లతో నాకు సాన్నిహిత్యం ఏర్పడింది. ‘సఖ్యం సాప్తపదీనం’ అన్నట్లు ఏడడుగులు కలిసి నడిస్తే వాళ్లు వీళ్లవుతారని నానుడి. ఇక్కడ వారం రోజులు కేరళ టూర్ కాబట్టి, ‘సఖ్యం సాప్తదినీనం’ అంటే బాగుంటుంది. సంస్కృతంలో తప్పు ఉంటే మన్నించండి.
టూర్ మేనేజర్‌లు, మా రెండో ట్రిప్‍కు కూడా తమ సంస్థనే ఎంపిక చేసుకున్నందుకు చాలా సంతోషించారు. ఫిబ్రవరి నెల రెండో సగంలో ఐతే ఆ రెండు రాష్టాలల్లో వాతావరణం చాలా బాగుంటుందని, చలి కాలం ముగింపు, ఎండాకాలం ప్రారంభం, ఈ రెంటి సంధికాలం కాబట్టి అప్పుడు ప్లాన్ చేద్దామని, అది టూరిజంకు పీక్ సీజన్ కాబట్టి, రెండు నెలలు మందుగానే అన్నీ బుక్ చేసుకోవాలని చెప్పాడు సందీప్. అన్నీ విచారించి రెండు రోజుల్లో ఫోన్ చేస్తానన్నాడు.
మాకు ప్రయాణోత్సాహం అప్పుడే మొదలైంది. వారి ఫోన్ కోసం ఎదురు చూడసాగాము. ప్రఖ్యాత బ్రిటిష్ వ్యాస రచయిత ఫ్రాన్సిస్ బేకన్ తన ‘Of Travel’ అన్న వ్యాసంలో ఇలా అంటారు.
“Travel, in the younger sort, is a part of education, in the elder a part of experience”
ఆయన వ్యాక్యాలు క్లుప్తంగా, సింపుల్‌గా ఉంటాయి. డాక్టర్ జాన్సన్ వాటిని “crispy and well – knit sentences” అని ప్రశంసించారు. విలియమ్ హాజ్లిత్ అనే విమర్శకుడు వాటిని “counsels wise and moral” అన్నాడు. బేకన్‍కు ‘Prince of Essayists’ అన్న బిరుదు వుందండోయ్!
ప్రయాణమనేది యవ్వనంలోని వారికి, ఎడ్యుకేషన్‌లో ఒక భాగమట. కాని పెద్ద వయసువారికి, అంటే మాలాంటి వారికి, అది అనుభవంలో ఒక భాగమట. ఎంత బాగా చెప్పాడో మహానుభావుడు! ఇంకా ఇలా అంటాడు.
“And let his travel appear rather in his discourse, than in his apparels or gesture”
ప్రయాణాన్ని అందులోని విశేషాలను ఒక సంభాషణలో పొందుపరచమంటాడు. ప్రయాణంలో ఎదురైన పరిచయమైన వ్యక్తులను బాగా పరిశీలించమంటాడు. కస్తూరి మురళీకృష్ణ గారు, సంచిక ప్రధాన సంపాదకులు – మా రెండో టూర్ గురించి కూడా ట్రావెలాగ్ రాయమని కోరినప్పుడు, బేకన్ నాకు గుర్తొచ్చారు. ట్రావెలాగ్‌ను established format లో కాకుండా, కొంత human elementను, ఫిక్షన్‌ను జోడించి రాయడం వల్ల మా కేరళ యాత్రానుభవాలు పాఠకుల ఆధరాభిమానాలను పొందాయి. ఈ విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన కస్తూరి వారికి కృతజ్ఞతలు. దానిని నా వాయిస్ ఓవర్‌తో, వీడియోలు, ఫోటోలతో తమ ‘స్వాధ్యాయ’ యూట్యూబ్ ఛానెల్‍లో ఆసక్తికరంగా ప్రసారం చేస్తున్న సోదరుడు శ్రీ కోవెల సంతోష్ కుమార్ గారికి కూడా కృతజ్ఞతలు. గుజరాత్ రాజస్థాన్ టూర్ కూడా మీ అందరి మెప్పును ‘సంచిక’లో ‘సాధ్యాయ’లో పొందుతుందని ఆశిస్తున్నాను.
రెండో రోజు జోజో ఫోన్ చేశాడు. వివరంగా అన్నీ చెప్పాడు.
“సార్! నమస్కారం. అంతా ప్లాన్ చేశాము. మొత్తం 17 రోజులు టూర్. ప్రయాణం అటు ఇటూ 3 రోజులు. వారం గుజరాత్, వారం రాజస్థాన్. రెండు చాలా పెద్ద రాష్ట్రాలు సార్, కేరళలాగా కాదు. కేరళ అంతా మిమ్మల్ని కారులోనే తిప్పాము. ఇప్పుడు అలా కుదరదు. రెండు రాష్ట్రాల్లో ఇంటర్నల్ గానే ఒక చోటికి ఇంకో చోటికి మధ్య మూడు వందల నుంచి ఐదు వందల కిలోమీటర్లు దూరాలు ఉంటాయి. కాబట్టి అన్నీ రైలు ప్రయాణాలు, రాత్రి పూట ఉండేలా, థర్డ్ ఏసి బుక్ చేస్తాము. మీకు ప్రయాణంలోనే రెస్టు దొరుకుతుంది. సైట్ సీయింగ్‍కు మాత్రం సెడాన్ (కారు), డ్రయివర్ కం గైడ్ ఉంటారు. కేరళలో మీకు ఒకే కారు, డ్రయివర్, సరిపోయారు. ఇక్కడ ప్రతి మేజర్ ప్లేస్‍లో మారతారు.”
“అయితే అలాగే చేద్దాం” అన్నాను.
“సికింద్రాబాద్ నుంచి బికనీర్‍కు రైలుంది. బికనీర్ ఎక్సప్రెస్. అందులో ముందు అహమ్మదాబాద్‍కు వెళతారు సార్. గుజరాత్ కవర్ చేసుకుని, వారం తర్వాత అక్కడ నుంచి జైపూర్‍కు వెళతారు. రాజస్థాన్ చూసుకొని జైపూర్ నుంచి డైరెక్ట్‌గా జైపూర్ – మైసూర్ ఎక్స్‌ప్రెస్‌లో ‘కాచిగూడా’ చేరుకుంటారు”
“బాగుంది గాని జోజో భాయి, మొత్తం ప్యాకేజి ఇద్దరికి ఎంతవుతుందో చెప్పు ముందు” అన్నాను.
“పెద్ద ఎక్కవేమీ కాదు సార్. ట్రయిన్ రిజర్వేషన్లు, కారు, డ్రైవర్ కమ్ గైడ్, త్రిస్టార్ హోటల్ అకామడేషన్, పార్కింగ్ ఛార్జెస్, టోల్ గేట్ ఛార్జెస్, కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్, రాజస్థాన్‍లో రెండు రోజులు డెజర్ట్ క్యాంప్ సహా ఇద్దరికీ 95 వేలు మాత్రమే సార్!”
‘బాబోయ్!’ అనుకున్నాను.
“చాలా ఎక్కువనిపిస్తుంది భయ్యా!” అన్నాను గాలిలో బాణం వేస్తూ.
“మాకు కేరళ 6 రోజులకు ముఫై వేలే కదా తీసుకున్నావు?” అని బేరం చేశాను.
జోజో నవ్వడం వినిపించింది.
“సార్, దానికీ దీనికీ సంబంధమే లేదు. మొత్తం నాలుగయిదు వేల కిలోమీటర్ల కవర్ చేయాలి ఈ ట్రిప్‌లో. మీరు మా రెగ్యులర్ కస్టమర్లు కాబట్టి పదివేలు తగ్గించాను సార్” అన్నాడు.
“సరే ఆలోచించి రేపు కన్‍ఫర్మ్ చేస్తాను. నాకు పూర్తి ప్రోగ్రామ్ రైలు వివరాలు, వేళలు, చూడవలసిన స్థలాలు. మొత్తం మెయిల్ పెట్టండి” అన్నాను.
ఐదారు గంటలో నాకు డొనాటో ట్రావెల్స్ వారి మెయిల్ వచ్చింది. ఈలోగా నేను గూగుల్ తల్లిని సంప్రదించి, ఆ రెండు రాష్ట్రాలలోని దర్శనీయ స్థలాలను, తర్వాత ఆ రాష్ట్రాల టూరిజం వెబ్ సైట్లలోకి వెళ్లి కూడా చూశాను. ఒక్కటి మాత్రం నిజమండోయ్! ఏ రాష్ట్రంలోనైనా, ఏ టూర్ మ్యానేజర్లయినా, మొత్తం అన్ని ప్లేసెస్ కవర్ చేయడం అసాధ్యం. అలా చేయాలంటే ఒక్కో రాష్ట్రానికి మినిమిం 15 రోజులు అయినా కావాలి.
మెయిల్ ఓపెన్ చేసి పరిశీలించాను. ‘ఇటనరరీ’లో ద్వారక, సోమనాథ్ లేనే లేవు! ఆశ్చర్యపోయి, అతనికి ఫోన్ చేశాను.
అతనిలా చెప్పాడు.
“సార్ అహమ్మదాబాద్ నుంచి ద్వారక 450 కి.మీ. అక్కడ నుంచి సోమనాథ్ మూడు వందలలోపు. అవి ఈ ప్యాకేజీలో ఇన్‌క్లూడ్ చేయలేం సార్.”
“ఏడ్చినట్లుంది. మీ ప్యాకేజి!” అన్నాను కోపంగా. “అంత దూరం వెళ్లి, ద్వారక లోని శ్రీకృష్ణుడిని, సోమనాథ్ లోని జ్యోతిర్లింగాన్ని దర్శించకుండా వస్తే, అందరూ నవ్వుతారయ్యా మగడా!”
“అయితే రీప్లాన్ చేయాలి. టూర్ రెండు రోజులు పెరుగుతుంది. ప్యాకేజి కాస్ట్ కూడా. మీరు సరేనంటే..”
“మేము టైం అండ్ మనీ విషయంలో కాంప్రమైజ్ కాము. టూర్ సాధ్యమైనంత వరకు సమగ్రంగా కవర్ కావాలి. తెలుసా?”
“సారీ సార్. ఒక రెండు గంటలు టైం ఇవ్వండి. ప్లాన్ మార్చి పంపుతాను.”
రీప్లాన్డ్ షెడ్యూల్‍లో ద్వారక, సోమనాథ్ కూడ కవర్ అయ్యాయి. ప్యాకేజి కాస్ట్ మరో పది వేలు పెంచారు. మొత్తం లక్షా నాలుగు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు. ఓ.కె చెప్పాను.
మర్నాడు సాయంత్రానికి రైళ్ల థర్డ్ ఎ.సి రిజర్వేషన్ టికెట్లు అన్నీ వచ్చేశాయి. అన్నీ లోయర్ బెర్తులే. మరుసటి రోజు బస చేయబోయే త్రీస్టార్ హోటర్/రిసార్ట్ వివరాలు, ఆ రోజు ఇటినరరీ, డ్రైవరు కం గైడ్ సెల్ నంబరు, కారు నంబరు, అన్నీ ముందు రోజు సాయంత్రమే మీకు వాట్సాప్‍లో పంపుతూంటామని మరో మేనేజర్ సందీప్ చెప్పాడు. రాను పోను, ఇంటర్నల్ రైల్వే రిజర్వేషన్లకు దాదాపు పదివేల రూపాయలకు పైగానే అయింది. కానీ వారు మమ్మల్ని ఒక్క రూపాయి కూడా అడ్వాన్స్ అడుగలేదు! అది వారి సంస్కారం! కాని, మనకూ సంస్కారం ఉంది కదా! ఒక ముఫై వేలు వారికి ఆన్‍లైన్ ట్రాన్స్‌ఫర్ చేశాను. అలా టూర్‌కు పూర్వరంగం పూర్తయింది. ఫిబ్రవరి 14న హైదరాబాదులో బయలుదేరి మార్చి రెండో తేదీ రాత్రి కాచిగూడ చేరుకుంటామన్న మాట.
***
రెండు నెలలు ఇట్టే గడిచిపోయాయి. మా మిత్రుడు యోగానంద్, ఆదోని నుంచి 13 సాయంత్రమే వచ్చేశాడు. వాడి కోడలు నేత్ర ఒక పెద్ద కవరు నిండా అటుకులు, పల్లీల మిక్చర్, మరో కవరులో వాము కారాలు(జంతికలు) చేసి పంపింది. మా కోడలు ప్రత్యూష, సతీమణి హిరణ్మయి పప్పు చెక్కలు, తపేలాంట్లు చేసి యిచ్చారు. చెరో రెండు బ్యాగులయ్యాయి. అన్నింటికీ చక్రాలున్నాయండోయ్!
పధ్నాలుగో తేదీ రాత్రి 11 గంటల 35 నిముషాలకు బికనీర్ ఎక్స్‌ప్రెస్. ఆ రోజు రాత్రి 8.30 నిమిషాలకి లైట్‌గా నాలుగిడ్లీలు తినేసి, క్యాబ్ బుక్ చేసుకుని సికింద్రాబాద్ స్టేషన్ చేరుకున్నాము గంట ముందుగానే. రైలు ఒకటో నెంబర్ ప్లాటుఫారం మీదకే వచ్చింది. మాకు బి2 బోగీలో లోయర్ బెర్తులు వచ్చాయి. ఎక్కి కూర్చుని, బెర్తుల క్రింద బ్యాగులు సర్దేసుకున్నాం.
ఆ రోజు ఉదయం, విశాఖ నుంచి వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్, ఘట్‌కేసర్ సమీపంలో పట్టాలు తప్పింది. దాని వల్ల కొన్ని రైళ్లు రద్దు, కొన్ని పాక్షికంగా రద్దు, కొన్ని రైళ్లు దారి మళ్లింపు చేశారట. మా రైలు, మాములుగా అయితే ఖాజీపేట, బలార్షా, నాగపూర్, భోపాల్‌ల మీదుగా వెళ్లాలట. గోదావరికి యాక్సిడెంట్ జరిగినందు వల్ల దానిని వికారాబాద్, పర్లీ వైద్యనాథ్, అకోలా జంక్షన్‌ల మీదుగా దారి మళ్లించారట. అలా, అని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లో ప్రకటిస్తున్నారు. నెట్‌లో కూడ ‘రైల్ యాత్రీ’ అనే యాప్‌లో చూపిస్తున్నారు.
సరే, ఎలాగోలా వెళుతున్నాంలే అని హాయిగా పడుకున్నాము. ఉదయం 7 గంటలకు నిద్ర లేచాము. రైలు నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తుంది. ముఖాలు కడుక్కొని తపేలాంట్లు బ్రేక్‌ఫాస్ట్ చేశాము. బియ్యపు పిండి తడిపి, అందులో పచ్చి మిర్చి, అల్లం, ఉల్లి, కొత్తిమీర, పోదీనా సన్నగా తరిగి పల్చగా చేతితో పెనం మీద తట్టి చేస్తారు వాటిని. అవి మా కర్నూలు, కడప జిల్లాల్లో ఫేమస్. రెండు మూడు రోజులు చెడిపోవు. చాలా రుచిగా ఉంటాయి. వాటికి కాంబినేషన్‍గా మనకు సమోసాలతో బాటు ఇస్తారే, వేయించి, ఉప్పు జల్లిన పచ్చి మిరపకాయలు, అవి కట్టించ్చింది ఒక కవర్లో మా ఆవిడ!
ఒంటిగంటకు IRCTC వారి లంచ్ వచ్చింది. బాగానే ఉంది. రెండు రోటీలు, పనీర్ కుర్మా, దాల్, కొద్దిగా రైస్, ఒక అచార్ (ఊరగాయ) ప్యాకట్ ఇచ్చాడు. పెరుగు యివ్వలేదు. కాని ఒకడు “లంచ్ మే దహీ!” అని అరుస్తూ వచ్చాడు. రెండు పెరుగు కప్పులు తీసుకున్నాము. కాసేపు మళ్లీ పడుకొని, నాలుగు గంటలకు లేచాము. “అద్రక్ చాయ్. స్పెషల్ మసాలా చాయ్” అంటూ ఒక స్టేషన్‍లో అమ్ముతున్నాడొక కుర్రాడు. రైల్వే వారి టీ కంటే బాగుంది. ఒక పెద్ద బాక్సులో ఐదారు ప్లాస్కుల్లో అమ్ముతున్నాడు. రెండు పప్పు చెక్కలు, రెండు పిడికిళ్ల అటుకుల మిశ్రమం తిన్నాము. చిన్న పేపరు ప్లేట్లు ప్లాస్టిక్ స్పూన్లు కూడా పెట్టిచ్చారు లెండి మా వాళ్లు. ప్రతి చోటా ఈ తిండిగోల ఏమిటని విసుకోకండే!
“తిండి కలిగితె కండగలడోయ్. కండగలవాడేను మనిషోయ్” అన్నారు కదా గురజాడ వారు. ఈ వయస్సులో కండలు రాకపోయినా, ఎనర్జీ వస్తుంది కదండీ. అదన్నమాట. రాత్రి తొమ్మిదికి IRCTC వారి ఉప్మా, పోహా, పాకెట్లు రెండు తీసుకొని షేర్ చేసుకున్నాము. వేడి వేడి టమోటో సూప్ వచ్చింది. కారంగా ఉంది. చాలా బాగుంది. అలా డిన్నర్ సుసంపన్నమైంది.
రాత్రి పదకొండుకు అహమ్మదాబాద్ చేరాల్సిన రైలు నాలుగు గంటల ఆలస్యం ఏ మాత్రం కవర్ కాకుండా, తెల్లవారు ఝామున 3.50కి చేరింది, సిగ్గులేకుండా! “నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు!” అంటూ స్టేషన్‍లో ఆగింది. పాపం దాని తప్పేముంది? డైవర్డెడ్ రూట్ కదా!
ఆ టైంలో మా కోసం డ్రయివర్ సిద్ధంగా ఉన్నాడు. ముందురోజు రాత్రి 8 గంటలకు మాకు ఫోన్ చేసి మాట్లాడాడు. సందీప్ మాకు అతని సెల్ నెంబర్, కారు నంబర్ వాట్సాప్ చేసి ఉన్నాడు. సామాన్లు లాక్కుంటూ స్టేషన్ బయటకి వచ్చాము. చాలా పెద్ద స్టేషన్ అహమ్మదాబాద్. పట్టపగల్లా ఉంది. లిఫ్టులు, ఎస్కలేటర్లు, సౌకర్యంగా ఉన్నాయి.
డ్రైవరు పేరు మహేంద్ర. కారు ఎర్టీజా. మాకు నమస్కరించి, లగేజి డిక్కీలో పెట్టాడు. మాకు బుక్ చేసిన హోటల్ పేరు ‘సిటీ ఇన్’. అది రిలీఫ్ రోడ్‌లో, లాల్ దర్వాజా జంక్షన్ సమీపంలో, ఎలెక్ట్రిక్ ఆఫీసు ఎదురుగ్గా ఉంది. దాన్ని ‘బిజిలీ ఘర్’ అంటారు. వెళ్లి చెకిన్ అయ్యేసరికి ఐదయింది. ఏడున్నర వరకు ఒక నిద్ర తీశాము. ఎనిమిదికల్లా స్నానాలు చేసి, డ్రస్ మార్చుకున్నాము. కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ (బ్రెడ్ టోస్ట్ విత్ బటర్, ఆలూ పరాఠా) రూమ్‌కే తెచ్చి ఇచ్చారు. కాఫీ వితవుట్ షుగర్ తెచ్చిచ్చాడు. చక్కెరను ‘చీనీ’ అంటున్నారు. “చీని బిల్‌కుల్ మత్ డాల్‌నా భయ్యా” అని చెప్పాను. హైద్రాబాద్‌లో లాగా “బగర్ శక్కర్” అంటే వాడికి ఎక్కలేదు. వారు మాట్లాడేది గుజరాతీ. హిందీ మాట్లాడుతున్నారు గాని అంత intelligible గా లేదు.
ఎనిమిదిన్నరకు డ్రైవరు మహేంద్ర ఫోన్ చేశాడు “సాబ్, నికలేంగే?” అంటూ.
క్రిందికి వెళ్లి కారులో కూర్చున్నాము. మా మొదటి ప్లేస్ సబర్మతీ ఆశ్రమం. హోటల్ నుంచి పది కి.మీ. దూరంలో ఉంది. దారి పొడుగునా సబర్మతీ నది కనువిందు చేస్తూ ఉంది. సిటీలో ఆ నది మీద అందమైన పెద్ద పెద్ద వంతెనలున్నాయి. తొమ్మిది గంటలకు సబర్మతీ ఆశ్రమం ముందు దిగాము.
(ఇంకా ఉంది)