Site icon Sanchika

గుజరాత్ రాజస్థాన్ పర్యటనానుభూతులు-2

[2023 ఫిబ్రవరి నెలలో గుజరాత్, రాజస్థాన్ లలో పర్యటించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]న[/dropcap]దిని ఆనుకునే ఉంది ఆశ్రమం. నిరాడంబరతకు మారు పేరయిన గాంధీజీ నివసించిన చోటు ఎలా ఉండాలో, అలాగే ఉంది. ఆవరణంతా పెద్ద పెద్ద వృక్షాలు. కాంపౌండ్ వాల్ కేవలం 3 అడుగుల ఎత్తే ఉంది. దాని మీద రెండు వరసల రెయిలింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ వెళ్లినిలబడ్డాం. తొమ్మిదిన్నర కావస్తున్నా చిరు చలిగానే ఉంది. నదిలో బాగా నీళ్లు పారుతున్నాయి. అవి నీరెండలో తళతళ మెరుస్తున్నాయి. నీటి మీద పడిన సూర్యకాంతి, పరావర్తనం చెంది, ఒడ్డునానుకొని ఉన్న చెట్ల ఆకులపై లేత నారింజరంగులో మెరుస్తూంది. నీటి పైభాగాన పొగమంచు ఇంకా వ్యాపించే ఉంది. దూరంగా, నది మీద కట్టిన వంతెన, పొగమంచులో స్పష్టాస్పష్టంగా కనబడుతుంది. దాని మీద అటూ ఇటూ కదులుతూ పడవలు బొమ్మల్లా కనబడుతున్నాయి. మొత్తం నదినంతా వీడియో తీశాము.

తర్వాత ఆశ్రమంతా తిరిగి చూడసాగాము. సందర్శకులు అంత ఎక్కువమంది లేరు. కొందరు విదేశీయులు ఆసక్తిగా తిరుగుతున్నారు. అన్ని భవనాలూ, పాత పెంకులతో వేసిన పైకప్పు కలిగి ఉన్నాయి. ముందు టేకు రీపర్లు, వాటి మీద వరండా దించి ఉంది. ఫ్లోరింగ్ అంతా నల్ల రాతి బండలు పరిచి ఉన్నాయి. సందర్శకులు బస చేయడానికి కూడ అక్కడ వసతి ఉంది. ఆవరణంతా అతి పరిశుభ్రంగా ఉంది. ‘Cleanliness is next to godliness’, ‘పరమాత్మతత్వం తర్వాత పరిశుభ్రతే!’ అన్న అద్భుత సూక్తికి ప్రతి రూపంలా ఉంది సబర్మతీ ఆశ్రమం.

అందరూ లోగుంతుకలతో మాట్లాడుకుంటున్నారు. నిశ్శబ్దంలోని సౌందర్యం మాకక్కడ అవగతమైంది. నిశ్శబ్దం అంటే శబ్దం లేకపోవడం కాదు. ప్రశాంతత. Serenity! ‘నిశ్శబ్ధం బ్రహ్మముచ్చతే’ అన్న సూక్తిలోని పరమార్థం ఇదే!

అక్కడ ఒక మ్యూజియం ఉంది. గాంధీజీ జీవితంలోని ముఖ్య సంఘటనలు, ఆయన సూక్తులు, నిలువెత్తు చిత్రపటాలు, అందులో కనువిందు చేస్తున్నాయి. అవన్నీ అపురూపమైనవి గాంధీజీ, కస్తూర్బా పెళ్లయిన తొలి రోజుల్లో, యవ్వనంలో ఉన్న చిత్రపటం మనోహరంగా ఉంది.

అక్కడ నుండి వరుసగా మూడు కుటీరాలను దర్శించుకున్నాము. మొదటిది వినోబా కుటీర్. వినోబాభావే గారు కొంత కాలం అందులో నివసించారు. గాంధీజీకి ఆత్యంత సన్నిహితుడాయన. తర్వాత కస్తూర్బా కుటీర్‌కు వెళ్లాము. అందులో ఆమె ఉపయోగించిన చర్ఖా, కొన్ని పాత్రలు, ఒక షెల్ఫ్‌లో పుస్తకాలు ఉన్నాయి. తర్వాత మీరా కుటీర్ లోకి వెళ్లి చూశాము. అక్కడ భజనలు, కీర్తనలు జరిగేవట.

అక్కడ నుంచి ప్రధాన భవనం కనబడుతుంది. లోపలికి వెళితే, ఒక అనిర్వచనీయమైన అనుభూతి మనసులను ఆవరించింది. గాంధీ మహాత్ముడు నిత్యమూ కుర్చుని తన కార్యకలాపాలు సాగించిన చోటు చూశాము. అక్కడ కుర్చీలు, సోఫాలు లేవు. క్రిందనే తెల్లని కవర్లు వేసిన పరుపులు, వెనక ఆనుకోడానికి మెత్తలు ఏర్పాటు చేసి ఉన్నాయి. పక్కనే ఉన్న ఒక గదిలో ఉప్పు సత్యాగ్రహంలో మహాత్ముడు పాల్గొన్న దృశ్యాన్ని చిత్రించిన లైఫ్ సైజ్ తైలవర్ణ చిత్రం ఉంది. దాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాము. అంత జీవకళ తొణికిసలాడుతూ ఉంది. ఆ చిత్ర రాజ్యంలో అందులో నెహ్రూ, పటేల్ లాంటి నాయకులు, గాందీజీ వంగి ఉప్పను సేకరిస్తుండగా చూస్తున్నారు.

ఆశ్రమంలో కొంత కాలం నివసించి, మహాత్ముని బోధనలు విని ధన్యాత్ములైన వారి చిత్రపటాలు ఆ హాలులో వేలాడదీశారు. గాంధీజీ కూర్చున్న చోటులోకి వెళ్లి అక్కడ ఉన్న వస్తువులను, పరుపులను, దిళ్లను స్పృశించటానికి అనుమతించారు. ఆ చోటులో ఏదో మహత్తు ఉంది. మనసంతా ఎంతో ఉద్వేగం ఆవరించింది. కొన్నికోట్ల మంది భారతీయులను, లక్షలమంది విదేశీయులను తన భావజాలంతో ప్రభావితం చేసిన మహాత్ముని ఆత్మను మా మనో నేత్రంతో దర్శించగలిగాము. మా జన్మ ధన్యమైంది!

బయటకి వచ్చాము. ఒక చోట ఆకుపచ్చని గడ్డి పరుచుకున్న ఒక Pasteur లో తెల్లని మూడు కోతుల బొమ్మలు కనబడ్డాయి. చెడు వినవద్దు, కనవద్దు, మాట్లాడవద్దు అని తమ భంగిమల ద్వారా క్యారికేచర్ తెల్ల రంగుతో పెయింట్ చేశారు. కర్రను ఉతగా ధరించి, కోల్లాయి కట్టుకుని, కళ్లద్దాలతో, నిజంగా గాంధీజీయే అని భ్రమించేలా ఉందా క్యారికేచర్.

అక్కడ ఒక హాలు కనబడింది. వెళ్లి చూస్తే ఆశ్చర్యం! గాంధీగారు అందుకున్న ఉత్తరాలు, వాటి మీద పోస్టల్ ముద్రలు, అడ్రస్లతో సహా షోకేసులలో పెట్టి ఉన్నాయి. రవీంద్రనాథ్ టాగోర్ గారు రాసిన ఉత్తరం, పండిట్ మదన్ మోహన్ మాలవ్యా, మహమ్మదాలీజిన్నా లాంటి ప్రముఖులు ఆయనకు రాసిన ఉత్తరాల పోస్టల్ కవర్లు చూసి ఆనందించాం.

మాకంతా ఏదో కలలా ఉంది. ఏదో లోకంలో తిరుగుతున్నట్లుంది. ఇద్దరం అసలు మాట్లాడుకోవడం లేదు.

అక్కడి నుంచి ‘హృదయకుంజ్’ అన్న మందిరానికి వెళ్లాము. అదొక ప్రేయర్ హాలు. పూజామందిరం. అక్కడ విచిత్రంగా ఏ దేవతల విగ్రహాలు గాని, పటాలు గాని లేవు. భగవంతుడు నిరాకారుడని, నిరంజనుడని ఆ చోటు చూపిస్తోంది. ‘వైష్ణవజనతో..’ అన్న కీర్తన, ‘రఘుపతి రాఘవ రాజారాం’ అన్న కీర్తన, గాంధీజీ అక్కడ పాడించుకునేవారట. లతా మంగేష్కర్, ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మీ, బాలమురళీ కృష్ణ, పండిట్ భీమ్‌సేన్ ఆ హృదయకుంజ్‌లో తమ హృదయాన్ని విప్పి, తప్పక గానాలాపన చేసే ఉంటారు.

ఒక బుక్ గ్యాలరీ ఉంది. అందులో చాలా పుస్తకాలు షెల్ఫుల్లో కొలువుతీరాయి. తర్వాత ‘ఖాదీ షాప్’ చూశాము. రకరకాల ఖద్దరు టోపీలు, శాలువాలు, చక్కని పనితనం గల చేతి కర్రలు, మూడు కోతుల బొమ్మల సెట్‌లు, జపమాలలు, కండువాలు, పంచెలు అక్కడ అమ్ముతున్నారు. ధరలు చాలా తక్కువగా ఉన్నాయి అనిపించింది మాకు.

నదికి దగ్గర్లోనే, కాంపోడు వాల్‌కు కొన్ని మీటర్ల దూరంలో ఒక బావిని చూశాము. గిలక బావి అది. దానికి రెండు వైపులా నీళ్లు తాడుతో చేదుకోవడానికి గిలకలు (కప్పీలు) ఉన్నాయి. గాంధీజీ చిన్న బొక్కెనతో ఆ బావిలోంచి నీరు తోడుకొని, అక్కడే స్నానం చేసే వారట. బావిలోకి తొంగి చూశాము. అది చాలా లోతుగా ఉంది. కాని అందులో అడుగున నీళ్లున్నాయి. సూర్యకాంతి పడి నీటి ఉపరితలం మెరుస్తూంది. అది ఇంకా వాడకంలోనే ఉన్నట్లు మాకు అర్దమైంది.

ఎవరూ ఏమీ అనకపోయినా, ఎందుకో బిగ్గరగా మాట్లాడుకోలేకపోతున్నాం. అక్కడున్న అందరి పరిస్థితీ అదే. దాన్నే self-discipline అంటారు. అలాంటి ప్రదేశాల్లో అదంతట అదే మనకు సంక్రమిస్తుందేమో మరి!

మా యోగా మెల్లగా నాతో ఉన్నాడు. “శర్మా, మళ్లీ ఒకసారి మెయిన్ హాలులోకి వెళ్లి గాంధీ గారు కూర్చున్నచోటు చూద్దాం.”

“సరే పద!” అన్నాను. ఆయన కూర్చునే చోటుకు పైన గోడ మీద సర్వమత చిహ్నాలు ఉన్నాయి. మొదటిసారి వచ్చినప్పుడు మేం వాటిన అంతగా గమనించలేదు. యాత్రాస్థలాల్లో విశేషాలను ఎంత కీన్‌గా గమనిస్తూ వెళ్లినా, కొన్ని మిస్ అవుతాయి! ఒక వైపు గోడంతా, ఒక పెద్ద శ్వేత వృక్షాన్ని చెక్కి ఉన్నారు. దాని ఆకులు జేగురురంగులో ఉన్నాయి. వాటి మీద గాంధీజీ సిద్ధాంతాలు చెక్కారు. కొన్ని గుజరాతీ భాషలో ఉన్నాయి.

అదే హాల్లో, ఆశ్రమం ఆధ్వర్యాన నడుస్తూన్న పాఠశాలల్లో అనుసరిస్తున్న ‘value based educational system’ (విలువల అధారిత విద్యా విధానం)ను వివరిస్తూ, చిత్రాలు, డయాగ్రామ్స్, గ్రాఫ్స్, ఉన్న పటాలున్నాయి, షోకేసుల్లో. విద్యాబోధనలో వారు అనుసరించే నైతిక విలువలు, శీలం, సంస్కారం, దేశభక్తి, అహింస, మొదలైన వాటిని గురించి క్లప్తంగా వివరించారు. “ఆ స్కూళ్లలో చదివే పిల్లలు ఎంత అదృష్టవంతులో కదరా యోగా?” అన్నాను మా వాడితో. వాడు నాతో ఏకీభవించాడు.

మొదట్లో సబర్మతీ ఆశ్రమం ‘కొచ్రాబ్’ అన్న చోట చిన్న కుటీరంగా ఉండేదట. దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చాక గాంధీజీ దాన్ని ప్రారంభించారు. దాన్ని తర్వాత సబర్మతీ తీరానికి తరలించి అభివృద్ధి చేశారు. కోచ్రాబ్ లోని కుటీరం 25 మే 1915 న నెలకొల్పారు. దాన్ని 17 జూన్1917లో నదీ తీరంలోని ఒక బయలు ప్రదేశంలోకి మార్చారు. ఆ చోట దధీచి మహర్షి నివసించేవాడట. దేవేంద్రుని వజ్రాయుధాన్ని తయారు చేయడానికి తన వెన్నెముకనిచ్చిన దాత ఆయన. ఆ చోటు ఒక జైలుకు శ్మశానానికి మధ్యలో ఉంది. ‘సత్యాగ్రహి’ అనే వాడికి ఆ రెండూ ఒక్కటే అనే వారట గాంధీజీ. ఆశ్రమాన్ని హరిజన్ ఆశ్రమ్ కూడ అనేవారు. 1917 నుంచి 1930 వరకు, భారతీయ స్వాతంత్య్ర పోరాటంలోని ఎన్నో కీలక నిర్ణయాలు గాంధీజీ అక్కడి నుంచే తీసుకున్నారు. దాన్ని సత్యాగ్రహ ఆశ్రమం అనేవారట మహాత్ముడు.

ప్రతి రోజూ ఆశ్రమంలో భగవద్గీత పారాయణ జరిగేది. కిచరబ్ బంగ్లా గాంధీ స్నేహితుడైన, బారిస్టర్ జీవన్ లాల్ దేశాయ్‌ది. దాన్ని ఆయన గాంధీకి స్వచ్ఛందంగా ధారాదత్తం చేశారు. ఆశ్రమం గురించి మహాత్ముడు ఇలా అన్నారు.

సత్యం కోసం అన్వేషణ సాగించడానకి, మరియు నిర్ణయతను పెంపొందించడానికి, మన కార్యకలాపాలకు ఇది సరైన ప్రదేశం. ఎందుకంటే, ఒక వైపు విదేశీయుల ఇనుప చువ్వలు. మరో వైపు ప్రకృతి మాత పిడుగులు!

ఇదే గాక అక్కడ పశుపోషణ, వ్యవసాయం కూడ చేయాలని ఆయన అనుకున్నారు. ఆశ్రమం నుంచే, 241 మైళ్ల దూరంలో ఉన్న ‘దండి’కి 78 మంది సహచరులతో కలిసి ‘కవాతు’ చేశారు. శాసనోల్లంఘనం అన్న నేరం మీద బ్రిటిష్ రాజ్, ఉప్పుసత్యాగ్రహానికి మద్దతు తెలిపిన 60,000 మందిని దేశవ్యాప్తంగా అరెస్టు చేశారు. తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఆశ్రమాన్ని స్వాధీనం చేసుకుంది. గాంధీజీ దానిని తిరిగి ఇవ్వాలని కోరినా లాభం లేకపోయింది.

ఆశ్రమంలోని భవనాల పేర్లు కొన్ని భావస్ఫోరకంగా ఉన్నాయి. వాటిలో ఒకటి ‘నందిని’. ఇది పాత, సందర్శకుల అతిథి గృహం. హృదయకుంజ్‌కు కుడి వైపున ఉంది.

మీరా కుటీర్ – ఇది ఆయన శిష్యురాలు మీరా బెన్ పిరిట ఏర్పడింది. ఆమె బ్రిటిష్ రియర్ అడ్మరల్ కూతురు.

ఉపాసనా మందిర్ – ఇది బహిరంగ ప్రార్థనా స్థలం. ప్రార్థన తర్వాత మహాత్ముడు వ్యక్తిగత ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇస్తారు.

గ్యాలరీ పేరు ‘మై లైఫ్ ఈజ్ మై మెసేజ్’ (నా జీవితమే నా సందేశం). భోధించమే కాదు, దాన్ని ఆచరించి చూపిన మహానీయడాయన.

ఆయన నూలు వడికిన చరఖా, ఆయన రైటింగ్ టేబుల్, ప్రత్యేక ఆకర్షణలు.

మొత్తం ఆశ్రమమంతా చూడడానికి మాకు రెండు గంటలు పట్టింది. పదకొండున్నరకు బరువెక్కిన హృదయాలతో ఆశ్రమం బయటికి వచ్చి, కారు ఎక్కాము. విశేషం ఏమిటంటే ఆశ్రమంలో క్యాంటిన్ లాంటిది ఏదీ కనబడలేదు. కాఫీ, టీ కూల్ డ్రింక్, స్నాక్ ఏమీ అక్కడ లభించవు!

ఇటినరరీ చూశాను. మా తర్వాతి ప్లేస్ ‘కంకారియా లేక్ ఫ్రంట్’. అక్కడి నుంచి నాలుగు కి.మీ. దూరం ఉంటుందని మా డ్రైవర్ చెప్పాడు. మధ్యలో రోడ్డు మీద టీ కొట్టులో అద్రక్ చాయ్ తాగాము. మేం లేక్ చేరేసరికి మధ్యానం 12 గంటలు.

***

కాంకారియా లేక్ చాలా పెద్ద సరస్సు. లేక్ మధ్యలో అందమైన వంతెన ఉంది. అక్కడ పిల్లల కోసం రకరకాల ఆకర్షణలున్నాయి. ‘కిడ్స్ సిటీ’ అని ఒక పెద్ద భవనం ఉంది. అందులోకి వెళ్లి చూశాము. చాలా మంది స్కూలు పిల్లలు ఒక బస్‌లో వచ్చి, ఎంతో క్రమశిక్షణగా వరుసగా లేక్ ఫ్రంట్‌లో ప్రవేశించడం చూశాం. వారి టీచర్లు వారిని పర్యవేక్షిస్తున్నారు. లేక్ నానుకొని పచ్చిక బయళ్లు, వాటిలో అందమైన రకరకాల పువ్వుల తమ రంగులతో హంగామా చేస్తున్నాయి. స్కూలు పిల్లలు ఆ పువ్వుల లాగా కళకళలాడుతున్నారు.

కిడ్స్ సిటీలో మాకు పనికి వచ్చేవి ఏమీ లేవు. అక్కడ రిసెప్షన్‌లో ఒక అందమయిన అమ్మాయి ఉంది. మమ్మల్ని చూసి నవ్వింది! ‘ముసలాళ్లకు మీకిక్కడ ఏం పని?’ అని బహుశా దానర్థం! లేక్ చుట్టూ టాయ్ ట్రాయిన్ కోసం పట్టాలు వేసి ఉన్నాయి. అక్కడ ‘లేక్ వ్యూ’కు అనుగుణంగా బెంచీలు వేసి ఉన్నాయి. సరస్సును బ్రిడ్జిని ఫోటోలు తీశాము. ఇంతలో గునగునమంటూ టాయ్ ట్రెయిన్ వచ్చింది. దాన్నిండా పిల్లలే! కేరింతలు కొడుతూ వెళుతున్నారు. బాల్యం ఎంత మధురమైంది!

సరస్సు ముఖద్వారం ఒక కళాత్మకమైన కట్టడం. దానినానుకొని, ఒక పెద్ద చెక్క తలుపు. గోడకు ఫిక్స్ చేసి ఉంది. చాలా బలంగా ఉంది. చెక్క నల్లగా చేయబడి ఉంది. అతి పూరాతనమైనదిగా తెలుస్తోంది. (Antique) దాన్నిండా నగిషీలు చెక్కి వున్నాయి. పెద్ద పెద్ద ఇత్తడి రింగులు మధ్యలో ఉన్నాయి. వాడిగా ఉన్న ఇత్తడి బుడిపెలు అంచుల వెంట ఫిక్స్ చేసి ఉన్నాయి. అది కేవలం ప్రదర్శన కోసమే అక్కడ ఉంచారు. దాన్ని తెరుచుకొని అటు వైపు వెళ్లడానికి అవకాశం లేదు.

అక్కడ బోటింగ్ సౌకర్యం కూడ ఉంది. టికెట్టు తలకు 290 రూపాయలు. మా స్నేహితుడు బోటింగ్ వద్దు అన్నాడు. అక్కడ సరస్సు గురించిన సమాచారం ఒక నోటీసు బోర్డులో ఉంది. దాన్ని బట్టి, కంకారియా సరస్సు అహమ్మదాబాదులోని సరస్సులో రెండో పెద్దదని తెలిసింది. అది నగరంలో ఉన్న ప్రాంతం పేరు మణినగర్. సుల్తాన్ కుతుబ్-ఉద్-దీన్ అహమ్మద్ షా కాలంలో దాన్ని నిర్మించారు. 1451లో దాని నిర్మాణం పూర్తయింది. చాళుక్యుల కాలంలో కట్టారు అని కూడా అంటారు. దీని అప్పటి పేరు హౌజ్-ఎ-కు-కుతుబ్. సరస్సు వృత్తాకారంలో ఉంది. 2008లో దీన్ని రెన్నోవేట్ చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అక్కడ పక్కనే కంకారియా ‘జూ’ కూడ ఉంది. వంతెన మీదుగా సరస్సు మధ్యకు వెళ్లాము. నీళ్లు ముదురు నీలం రుంగులో స్వచ్ఛంగానే ఉన్నాయి. రంగు రంగుల చేపలు నీటిలో ఈదుతూ, నీటి మీదకు ఎగిరి దూకుతున్నాయి. అక్కడ బెలూన్ రైడ్ కూడ ఉంది.

కంకారియా లేక్ మానవనిర్మితమైన కృత్రిమ సరస్సు. దీని వైశాల్యం 560 మీ x 560. దీని లోతు ఆరు మీటర్లు. తీరం పొడవు 2.25 కి.మీ అని తెలుసుకున్నాము.

అక్కడి నుంచి బయటకి వచ్చాము. మెయిన్ రోడ్ మీద ఏనుగులు వెళుతున్నాయి. ట్రాఫిక్‌ను చూసి బెదరడం లేదు ఏ మాత్రం. పైన ఉన్న వ్యక్తులు వాటిని పెద్దగా అదుపు చేస్తున్నట్లగా మాకనిపించడం లేదు. రోడ్డుకు ఎడమ వైపుగా క్రమశిక్షణగా నడుస్తున్నాయి. వాటిని ఫోటోలు తీసుకున్నాము.

మా నెక్స్ గమ్యం రివర్ ఫ్రంట్. సబర్మతి నది వెంట దాన్ని అభివృద్ధి చేశారు. మన హైదరాబాద్ లోని టాంక్‌బండ్ కంటే పెద్దది. లాన్స్, చెట్లలో రివర్ ఫ్రంట్‌ను బ్యూటిఫై చేశారు.

అక్కడే నది మీద ‘అటల్ బ్రిడ్జి’ నిర్మించారు. దేశంలోని ఐకానిక్ వంతెనలలో ఇది మొదటిది. సబర్మతీ రివర్ ఫ్రంట్ యొక్క పశ్చిమ, తూర్పు భాగాలను కలుపుతూ దీన్ని నిర్మించారు. దీని మీద కేవలం పాదచారులకు మాత్రమే అనుమతి ఉంది. బ్రిడ్జి అంచున అందమైన బెంచీలు వేశారు. వాటి మీద కూర్చుని నది అందాలను తిలకించవచ్చు.

దాని క్రింద ‘అటల్ ఘాట్’ ఉంది. అక్కడ మతపరమైన వేడుకలు జరుపుకుంటారు. అది జనంతో కిటకిటలాడుతూంది. ‘అటల్ వారధి’ మీద నడుచుకుంటూ వెళ్లి, కాసేపు బెంచీ మీద కూర్చుని, నదిని చూస్తూనే సేద తీరాము.

రివర్ ఫ్రంట్ వెంబడి సైకిలింగ్ ట్రాక్ ఉంది. ఔత్యాహికులకు అక్కడ సైకిళ్లు ఇస్తారు. అవి విచిత్రంగా ఉన్నాయి.

ఇక్కడ విశేషం ఏమిటంటే రెండు లెవెల్స్‌లో ప్రోమెనేడ్‌లు నిర్మించారు. క్రింది లెవల్ ప్రోమెనేడ్ నీటి లెవెల్‌కు పైన కట్టారు. దాని మీద పాదచారులు సైకిలిస్టులు వేరు వేరుగా వెళ్లవచ్చు. దాని పై లెవెల్లో సిటీ అంతా కనబడుతుంది. దాని మీద ఆకర్షణీయమైన పబ్లిక్ ఫీచర్స్, అంటే ఫౌంటెన్లు, పార్కులు, పుడ్ కోర్టులు ఉన్నాయి. నగరం నడి బొడ్డున అత్యంత అహ్లాదకరమైన, దాదాపు 11.5 కి.మీ పొడువున్న పెడెస్ట్రిన్ వాక్ లే ఉంది. అదే ప్రొమనేడ్ అంటే.

“పదకొండున్నర కిలోమీటర్లు ఎవరయినా నడవగలరేమిట్రా, యోగా?” అనడిగాను వాడిని.

“మళ్లీ పెద్ద రచయితనంటావు. ఇంత అమాయకంగా మాట్లాడతావేమిటి శర్మా, మొత్తం నడిచి తీరాలని ఏముంది? ఎవరికి చేతనైనంత వారు నడుస్తారు!” అన్నాడు వాడు నవ్వుతూ.

నేను కూడ నవ్వాను.

ఈ రివర్ ఫ్రంట్‌ను, సబర్మతీ నది ఒడ్డున ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన 1960లోనే వచ్చిందట. కాని దాని నిర్మాణం 2005లో మొదలు పెట్టారు. 2012 నుండి ప్రజలకు దీనిలో ప్రవేశం కల్పించారు. దీని ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్. దీనికి 1400 కోట్ల రూపాయలు ఖర్చుయింది. ఇది SRFDCL ఆధ్వర్యంలో ఉంది. (సబర్మతీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లిమిటిడ్)

రకరకాల పక్షిజాతులకు అలవాలమై అలరారుతుంది రివర్ ఫ్రంట్. వాటి రంగులు అద్భుతంగా ఉన్నాయి. ఇక చెప్పుకోతగ్గది రివర్ ఫ్రంట్ ప్లవర్ షో. అన్ని రకాల పువ్వులు, పొదలు, లాన్స్ చూసి మా కళ్లు చెదిరాయి. 2023లో 10 రోజుల పాటు అంతర్జాతీయ పుష్ప ప్రదర్శన జనవరిలో జరిగిందట. అక్కడ కుసుమ సౌరభాలు గుప్పున వెదజల్లుతున్నాయి. రంగు, సువాసన, పచ్చదనాల మేలు కలయిక ఆ చోటు. దాన్ని ఒక Floral wonderland అని అనవచ్చు. పూలతో రకరకాల జంతువుల ఆకృతులు రూపుదిద్దారు, నయనానందకరంగా.

ఫ్లవర్ గార్డెన్ దాదాపు 45000 చ. అడుగుల విస్తీర్ణంలో ఉంది. అందులో 330 రకాల స్థానిక మరియు హైబ్రీడ్ రకాల పువ్వుల దర్శనమిస్తాయి. వివిధ కుసుమ దర్శన సౌభాగ్యంతో మా జన్మ ధన్యమైంది. మన ట్యాంక్‌బండ్‌తో రివర్ ఫ్రంట్‌కు పోలికే లేదు.

తర్వాత మూడు కి.మీ దూరం ఉన్న ఇస్కాన్ టెంపుల్ చేరుకున్నాము. అన్ని ఇస్కాన్ టెంపుల్స్ లాగే ఇదీ రిచ్‌గా ఉంది. గోడల మీద కృష్ణ లీలలు పెయింట్ చేసి ఉన్నాయి. కాళీయమర్ధనం విగ్రహం ఉంది బయట. చుట్టూ మడుగు కోసం ఫౌంటేన్ ఉంది కాని అది పని చేయడం లేదు. మందిరం లోపలి డోమ్ అత్యద్భుతమైన కళాకృతులతో సుసంపన్నం అయి ఉంది.

రాధాకృష్ణ, పాండురంగ విఠల్, రుక్మిణీదేవి, సీతారాములు ఇలా పాల రాతి విగ్రహాలు కొలువు దీరి ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి. వాటిలో దైవత్వం కంటే కళాత్మకతే కనబడింది ఎక్కువగా నాకు.

అహమ్మద్ షా పరిపాలించిన రాజ్యం కాబట్టి ఆ ఊరికి అహమ్మదాబాద్ అని పేరు వచ్చింది. దాన్ని నిర్మించి 600 సంవత్సరాలు ఐందని చెబుతారు. ఇస్కాన్ టెంపుల్ నిర్మాణ శైలి గుజరాతీ, రాజస్థానీ, సోంపుర నిర్మాణ శైలుల సమాహారం. చైతన్య మహాప్రభు మహారాజ్ వారి బోధనలు ఇస్కాన్‌కు మూల సిద్ధాంతాలు. అహమ్మదాబాద్ ఇస్కాన్ టెంపుల్‌ను 1997లో శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు నిర్మించారు. మందిరంలో ఒక చోట మా లక్ష్మీనరసింహ స్వామి వారిని చూసి పులకాంకితుడిని అయినాను. ‘లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్రమ్’ చదువుకున్నాను. ఇస్కాన్ మందిరాన్ని ‘రాధాగోవింద్ ధామ్’ అని కూడ అంటారు. 12000 చదరపు అడుగుల వైశాల్యం గల మందిరమది.

సందర్శకులు బస చేయడం కోసం నలభై గదుల ఇస్కాన్ గెస్ట్ హౌస్ కూడ ఉంది.

ఇస్కాన్ నుంచి బయటకు వచ్చేసరికి రెండున్నర. ఆకలితో కడుపు నకనకలాడుతూంది. ఒక పంజాబీ రెస్టారెంటుకు తీసుకు వెళ్లాడు డ్రయివర్. బట్టర్ రోటీ, మట్టర్ మసాల, ఆలూపనీర్, ప్లెయిన్ రైస్‌తో భోజనం చేశాము. పెరుగు ఇవ్వలేదు గాని, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం కలిపిన చిక్కని మజ్జిగ ఇచ్చారు. చాలా బాగుంది.

భోజనం తర్వాత జైన్ మందిర్‌కు వెళ్లాము. అది మూసి ఉంది. దాని ఆవరణ లోనే అద్భత నిర్మాణ శైలిలో, ఎర్ర ఇసుక రాతితో కట్టిన హనుమాన్ మందిర్ ఉంది. అది తెరిచే ఉంది. గర్భగుడి ముందున్న హాలంతా నగీషీలు, లతలు, విగ్రహాలు చెక్కిన స్తంభాలు ఉన్నాయి. మందిరం ఇన్నర్ డోమ్ ఒక అద్భుతం. ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నాము.

సిటీ ఇన్ ఒక్క రోజుకే బుస్ చేశారు ఎందుకో మరి. మూడున్నరకు ‘ఫ్యూరాట్ ఇన్’ అన్న పెద్ద హోటల్‌కు మారాము. అక్కడికి మూడు కిలోమీటర్లు దూరంలోనే అహమ్మదాబాద్ 99M ఉందట. రూమ్ చాలా బాగుంది.

“ఆరుగంటల వరకు రెస్ట్ తీసుకోండి సార్! సాయంత్రం ‘అక్షరధామ్’ వెళదాము” అని చెప్పి వెళ్లిపోయాడు మహేంద్ర.

బినా చీనీ (చక్కెర లేని) టీ తెప్పించుకున్నాము. అద్భుతంగా ఉంది. కాసేపు రిలాక్స్ అయి, ఐదున్నరకు స్నానాలు చేసి, రడీ అయ్యాము. పావుతక్కువ ఆరుకు డ్రైవరు ఫోన్ చేశాడు క్రిందకి రమ్మని.

అక్షర ధామ్ అక్కడి నుంచి ముఫై కిలోమీటర్లు అని చెప్పాడు. ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి గంట సేపు పడుతుందట. తొమ్మిదిన్నర వరకు తెరిచే ఉంటుందట. సరిగ్గా 7 గంటలకు అక్షరధామ్ ముందు దిగాము.

(ఇంకా ఉంది)

Exit mobile version